These TS 9th Class Telugu Important Questions 7th Lesson చెలిమి will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 7th Lesson Important Questions చెలిమి
PAPER – I : PART – A
    
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన). –
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
    
ప్రశ్న 1.
 ‘చెలిమి’ పాఠ్యభాగ కవి విశేషాలు తెలుపండి. (రచయిత)
 జవాబు:
 పాఠం పేరు : ‘చెలిమి’
కవి పేరు : ‘పొన్నికంటి తెలగన’
కవి కాలం : 16వ శతాబ్దం
పొన్నికంటి తెలగన ప్రసిద్ధి : పొన్నికంటి తెలగన, అచ్చతెనుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న “అచ్చ తెనుగు ఆదికవిగా” ప్రసిద్ధుడు.
నివాస స్థలము : గోలకొండ పరిసరాలలోని ‘పొట్లచెరువు’ (సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు)
తండ్రి : తెలగన తండ్రి పేరు, “భావనామాత్యుడు”.
మార్గదర్శకుడు : అచ్చతెనుగు కావ్యరచనకు, తెలగనయే నియమాలను ఏర్పరచి, అచ్చతెనుగు కావ్యరచనకు “మార్గదర్శకుడు”గా నిలిచాడు.
యయాతి చరిత్ర : ‘యయాతి చరిత్ర’ కావ్యం, తెలుగు సాహిత్యంలో అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది మరియు అత్యుత్తమమైనది.
కావ్య విశిష్టత అంకితము : ఈ యయాతి చరిత్రను తెలగన, “అమీన్ ఖాన్” అనే మహ్మదీయ సర్దారుకు, అంకితం చేశాడు.
 సూచన : ‘పొన్నికంటి తెలగన’ గూర్చి రాయండి. అని కూడా అడిగినా పై జవాబే.

ప్రశ్న 2.
 అసూయను ఎందుకు కలిగి ఉండరాదు?
 జవాబు:
 అహంకారానికి పుట్టిన అజ్ఞానపు శిశువు అసూయ. ఇది కాలుతున్న కట్టెవంటిది. నిప్పు మండటానికి ఆధారమైన కట్టెను ముందు దహించి, తర్వాత ఎదుటున్న వాటిని దహిస్తుంది. అలాగే అసూయ ఎవరిని ఆవహించి ఉందో ముందు వారినే నాశనం చేస్తుంది.
అసూయను గూర్చి భమిడిపాటి కామేశ్వరరావుగారు చెబుతూ “నన్ను మెచ్చుకోలేదని కాదురా నా ఏడుపు. వాణ్ణి మెచ్చుకుంటున్నారనే నా ఏడుపు” అన్నారు. నేను ఎలా ఉన్నా సరే, ఎదుటివాడు బాగుండకూడదనే భావనే అసూయ. పురుగు దుస్తుల్ని పిప్పి చేసినట్లు, అసూయ మనిషిని నాశనం చేస్తుంది. కనుక అసూయను ఎప్పటికి దగ్గరకు రానీయకూడదు.
ప్రశ్న 3.
 మీ స్నేహితులతో వివాదం రాకుండా ఉండడానికి నీవు ఏం చేస్తావు?
 జవాబు:
 జీవితంలో ఒక మధురస్మృతి స్నేహం. ద్వేషం వల్ల అందరూ దూరమైతే, స్నేహం వల్ల అందరూ దగ్గరవుతారు. బడిలో చదువుకొనేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనకు ఎందరో మిత్రులు పరిచయమవుతారు. వారితో మంచిగా ప్రవర్తించడం వలన మేలే జరుగుతుంది. ఆడుకొనేటప్పుడు క్రీడా స్ఫూర్తితో ఉంటాను. దీనివల్ల వివాదం వచ్చినా వెంటనే తొలిగిపోతుంది.

పుస్తకాలు, పెన్నులు, చిరుతిండి విషయాల్లో నేనే ముందుగా కానుకల రూపంలో వారికి ఇవ్వడం వల్ల మా మధ్య వివాదం వచ్చే అవకాశాలుండవు. నీవు గొప్పా ! నేను గొప్పా ! వంటి చర్చలు రానీయకుండా చూసుకుంటాను. మంచి . స్నేహం త్యాగాన్ని కోరుతుంది. మా స్నేహం కలకాలం నిలవడానికై వారితో ఎటువంటి వాదాలకు దిగను. అవసరమైతే వారికి ఆర్థిక సాయం చేయడానికి మా తల్లిదండ్రుల సహకారం తీసుకుంటాను.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 ‘చెలిమి’ పాఠ్యాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
 జవాబు:
 సృష్టిలో తీయనిది స్నేహం. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులవుతారు. వారలా మారటానికి దానిలో గల మంచిని, చెడునూ విశ్లేషించి చూసుకోవడానికి ఈ కథ ఎంతో తోడ్పడుతుంది.
యయాతి ప్రతిష్ఠానపురానికి రాజు. ఈయన ఒకసారి వేటకు వెళ్ళినపుడు దాహంతో దగ్గరలోని నూతివద్దకు వెళ్ళాడు. ఆ నూతిలో ఒక కన్య ఉంది. ఆమె తనను రక్షించమని ఏడ్చింది. ఆమెను యయాతి కాపాడగా, అదే సమయానికి అక్కడికి చేరిన ఆమె చెలికత్తె ఘార్ణికకు, యయాతి మహారాజుకు మధ్య జరిగిన సంభాషణే ‘చెలిమి’ పాఠ్యాంశం.
“ఓ మహారాజా ! ఈమె దానవ గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఈమెను ఒక తప్పుకొరకు వృషపర్వుని కూతురు, ఈ బావిలో తోసింద”ని చెప్పగా యయాతి ఆ వివరాలు వివరంగా చెప్పమని అడుగుతాడు. వృషపర్వుడు ఒక అసురరాజు. అతని కుమార్తె శర్మిష్ఠ. ఈమె, దేవయాని మిక్కిలి స్నేహంతో ఉండేవారు. ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయంలో సుడిగాలికి వారి చీరలు చెల్లాచెదరయ్యాయి.
ఆ కంగారులో ఒకరి చీర మరొకరు ధరించారు. శర్మిష్ఠ దీన్ని గమనించి కోపంతో “నీ చీరను నేను కట్టుకుంటానా ? నీకింతా పొగరా ?” అని దేవయానిని అడిగింది. మనం ప్రాణం ఒకటియై శరీరాలు రెండుగా బ్రతుకుతున్నాం”. వస్త్రాలు మారినంత మాత్రానా కసురుకుంటావా ? ఇది న్యాయమేనా ? ‘అని దేవయాని అనినా, శర్మిష్ఠ నిష్ఠూరాలాడింది.
చివరకు విసిగిపోయిన దేవయాని “నేను రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తెను. నేను నీవు కట్టిన వస్త్రాన్ని కట్టవచ్చునా ?” అన్నది. శర్మిష్ఠ ఆ మాటలు వినక గయ్యాళితనంతో దేవయానిని బావిలో తోసి, వెళ్ళిందని చెలికత్తె చెప్పగా విని జాలిపడి, రాజు తన పట్టణానికి వెళ్ళిపోయాడు.

ప్రశ్న 2.
 ‘చెలిమి’ పాఠంలో శర్మిష్ఠ, దేవయానిలో మీకు ఎవరి స్వభావం నచ్చింది ? ఎందుకు ?
 జవాబు:
 పొన్నికంటి తెలగన అచ్చు తెనుగులో రచించిన యయాతి చరిత్ర కావ్యం నుండి గ్రహించబడినది ‘చెలిమి’ పాఠం. దీనిలో శర్మిష్ఠ అసుర రాజు వృషపర్వుని కుమార్తె. దేవయాని రాక్షస కులగురువు శుక్రాచార్యుని కుమార్తె. వీరిరువురు మంచి స్నేహితులు. ముఖ్యంగా దేవయాని శర్మిష్ఠ పట్ల గొప్ప స్నేహాన్ని ప్రదర్శించింది. దేవయాని స్వభావం నాకు బాగా నచ్చింది.
దేవయానిలా నిజమైన స్నేహాన్ని నేను ఇష్టపడతాను. ఈ కథలో శర్మిష్ఠకు తాను రాజు కుమార్తెననే అహంకారం ఉంది. కాని మనసులో ఎక్కడో శుక్రాచార్యుల పట్ల భయం ఉంది. అందువల్లనే దేవయానితో స్నేహాన్ని నటించింది. దొరకనంతసేపు అందరూ దొరలే. దొరికినపుడే దొంగలు. ఈ చందాననే శర్మిష్ఠ బయటపడింది.
శర్మిష్ఠ, దేవయాని ఒక సమయంలో జలక్రీడ ఆడుతుండగా, సుడిగాలికి బట్టలు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఒకరి బట్టలు మరొకరు కట్టుకుంటారు. తన బట్టలు చూసుకొన్న శర్మిష్ఠ తాను రాజు కుమార్తెను, నా బట్టలు నీవు కట్టుకుంటావా ? నీవు విడిచిన బట్టలు నేను కట్టుకుంటానా ? అని అంటుంది. నిజమైన స్నేహితురాలైతే ఇలా మాట్లాడుతుందా ? మనసులో స్నేహం లేదు కాబట్టే ఇలా అనగల్గింది. కాని దేవయాని వెంటనే రోషంతో మాట్లాడలేదు.
“అదేంటి చెలి ! శరీరాలు రెండయినా ప్రాణం ఒకటిగా ఉన్నామే ఈ మాత్రం దానికే ఇంతగా కసరటం న్యాయమేనా ?” అని దేవయాని అడిగిన విధం నాకు బాగా నచ్చింది. శర్మిష్ఠలోని దుర్గుణాలు – ఓర్వలేనితనం, ఆవేశం. ఆవేశం ఉన్నవారు ఎదుటివారి మాటలు వినరు. తాపట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అనే రకం. శర్మిష్ఠ గయ్యాళితనంతో దేవయానిని నూతిలో తోయడం మూర్ఖత్వం. ఇలా అన్నిరకాలుగా ఉత్తమగుణాలున్న దేవయాని స్వభావం నాకు నచ్చింది.

ప్రశ్న 3.
 ప్రయాణాల్లో, విహారాల్లో, నీటి పరిసరాల్లో తిరిగేటప్పుడు, నీటిలోనికి దిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేవి ?
 జవాబు:
 ప్రయాణాలు చేసేటప్పుడు మన వస్తువులను మనం జాగ్రత్తగా ఒకచోట పెట్టుకోవాలి. పెట్టెలకు తాళాలు వేయాలి. ప్రమాద హెచ్చరికలను తెలిసికొని, జాగ్రత్తపడాలి. అక్కడ ఉన్న విద్యుచ్ఛక్తి సాధనాలను ఉపయోగించే ముందు, షాక్ కొడతాయేమో పరీక్షించాలి.
నీళ్ళల్లోకి కొత్తచోట్ల దిగేటప్పుడు అక్కడ ఎంత లోతు ఉందో తెలిసికొని దిగాలి. ఈత రానివారు నీళ్ళల్లోకి ఒంటరిగా దిగరాదు. ప్రక్కనున్న మిత్రులను సంప్రదించి, నిర్ణయాలు తీసుకోవాలి.
నీటి పరిసరాల్లో తిరిగేటప్పుడు అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందేమో గమనించుకోవాలి. రిజర్వాయర్ల నుండి నీరు వదలుతున్నారేమో గమనించాలి. తెలియని ప్రదేశాల్లో గైడ్ లేకుండా, వారి సలహా లేకుండా, నీటిపరిసరాల్లో స్వేచ్ఛగా తిరగరాదు.
నీరు ఉన్నచోట్ల నీటిలో దిగేవారు ఈత తప్పక నేర్చుకోవాలి. పడవలు, లాంచీలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. పడవలలో, లాంచీలలో ప్రయాణించేటప్పుడు, మనుష్యులు నడిచే ఫుట్ బోర్డుపై జాగ్రత్తగా నడవాలి.
ప్రక్కవారిని సంప్రదిస్తూ, అతి జాగ్రత్తగా గైడ్ల సూచనలనూ, మనవెంట వచ్చే పెద్దల సూచనలనూ, సలహాలనూ తప్పక పాటించాలి.

PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు :
అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. అనగిపెనగి : (చుట్టి పెనవేసుకొను) అనగిపైనగిన తీగె పందిరిలాగ, సంస్కృతి సభ్యతలు పెనవేసుకోవాలి.
 2. చెలువలు : (అందమైన స్త్రీలు) పేరంటమునకు వచ్చిన చెలువలు పాడిన పాటలు అందరిని సంతోషపెట్టాయి.
 3. వేవురు : (వేయిమంది) పతంగి పండుగనాడు మైదానంలోకి వేవురు వచ్చి పతంగులు ఎగురవేశారు.
 4. నెగులు : (విచారము) మంచి మార్కులు పొందిన తరువాత దానికై పడిన నెగులు మరచిపోయాను.
 5. అరమరికలు : (అనుమానము) అరమరికలు లేకుండా’ రాసిన సమాధానం మంచి మార్కులు తెచ్చిపెడుతుంది.
 6. తడబడిపోవు : (తొట్రుపాటుపడు) ఒకప్పుడు స్త్రీలు, పురుషుల ముందుకు రావాలంటేనే తడబడిపోయేవారు, నేడు రాజ్యాలనేలగలుగుతున్నారు.
 7. కేరడములాడు : (ఎగతాళిచేయు) దుర్యోధనుని కేరడములాడు మాటలు భీముని మరింత రెచ్చగొట్టాయి.
 8. తెగువ : (సాహసం) అన్ని సమయాల్లో తెగువ పనికి రాదు.
 9. కూరిమి : (స్నేహం) కూరిమి ఉంటే నేరములు కనిపించవు.
II. అర్థాలు :
ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
ప్రశ్న 1.
 “కలసిమెలసి” అనే అర్థం వచ్చే పదం .
 A) కలయిక
 B) అనగి పెనగి
 C) తామరతంపర
 D) చుట్టుకొను
 జవాబు:
 B) అనగి పెనగి

ప్రశ్న 2.
 చెలువలు వారైనా చెలరేగి ఆడారు – గీత గీసిన పదానికి అర్థం
 A) స్నేహితులు
 B) చెఱువులు
 C) స్త్రీలు
 D) కలువలు
 జవాబు:
 C) స్త్రీలు
ప్రశ్న 3.
 “నెగులు” అనే పదానికి అర్థం
 A) పొగలు
 B) విచారము
 C) కన్నము
 D) పెద్ద
 జవాబు:
 B) విచారము
ప్రశ్న 4.
 కరువలి పీల్చి మనం బతుకుతున్నాం – గీత గీసిన పదానికి అర్థం
 A) గాలి
 B) కొడవలి
 C) కాలుష్యము
 D) సువాసన
 జవాబు:
 A) గాలి

ప్రశ్న 5.
 “తొందరగా, వెంటనే” – అనే అర్థం గల పదము
 A) వైతాళికుడు
 B) వైళము
 C) తడబడు
 D) తత్తరపడు
 జవాబు:
 B) వైళము
ప్రశ్న 6.
 “కొట్నములు” అనే పదానికి అర్థం
 A) కట్నములు
 B) కొట్లాట
 C) సేవలు
 D) ఊహలు
 జవాబు:
 C) సేవలు
ప్రశ్న 7.
 అర్మిలి, కూర్మి – అనే పదాలకు అర్థం
 A) ఊర్మిళ
 B) స్నేహము
 C) దాస్యము
 D) ప్రేమ
 జవాబు:
 D) ప్రేమ

ప్రశ్న 8.
 బొందిలో ప్రాణమున్నంతవరకు ధనము, విద్యలు సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థం
 A) శరీరము
 B) సందు
 C) గుండెకాయ
 D) ముక్కు
 జవాబు:
 A) శరీరము
ప్రశ్న 9.
 విధము, క్రమము – అను అర్థం వచ్చు పదము
 A) వితాకు
 B) తెఱగు
 C) వరుస
 D) ఆనతి
 జవాబు:
 B) తెఱగు
ప్రశ్న 10.
 జనకుని పట్టి రాముని పెండ్లాడినది – గీత గీసిన పదానికి అర్థం
 A) పట్టుపట్టి
 B) చేతివస్త్రం
 C) భూమి
 D) కూతురు (లేక కొడుకు)
 జవాబు:
 D) కూతురు (లేక కొడుకు)

ప్రశ్న 11.
 మనతో చెలిమి చేయ నొక్క మిత్రుండైన యుండవలెను – గీత గీసిన పదానికి అర్థం
 A) బంధం
 B) స్నేహం
 C) శత్రుత్వం
 D) ద్వేషం
 జవాబు:
 B) స్నేహం
ప్రశ్న 12.
 పొన్నికంటి తెలగన అచ్చ తెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడు – గీత గీసిన పదానికి అర్థం
 A) చివరి
 B) మధ్య
 C) తొలి
 D) ప్రధాన
 జవాబు:
 C) తొలి
ప్రశ్న 13.
 రాక్షసులకు ఒజ్జయైన శుక్రాచార్యుని కూతురు దేవయాని – గీత గీసిన పదానికి అర్థం
 A) తండ్రి
 B) గురువు
 C) అన్న
 D) శత్రువు
 జవాబు:
 B) గురువు

ప్రశ్న 14.
 గయ్యాళితనంతో దేవయానిని నూతిలో తోసింది – గీత గీసిన పదానికి అర్థం
 A) గొయ్య
 B) బావి
 C) గుంట
 D) చెరువు
 జవాబు:
 B) బావి
సూచన :-
 11. నెలంత, నెలత, అలరుబోడి, వాలుగంటి, కొమ్మ, ఎలనాగ, పడుచు, కలికి, అతివ – ఈ పదములన్నిటికి “స్త్రీ” అని అర్థము
III. ప్రకృతి, వికృతులు :
ప్రశ్న 1.
 “రక్కసి” అనే పదానికి ప్రకృతి
 A) యక్షుడు
 B) రాక్షసి, రాక్షసుడు
 C) తాటకి
 D) ముళ్ళు
 జవాబు:
 B) రాక్షసి, రాక్షసుడు
ప్రశ్న 2.
 “అద్భుతము” అనే పదానికి వికృతి
 A) అదుభుతము
 B) అప్పనము
 C) అబ్బురము
 D) అచ్చెరువు
 జవాబు:
 C) అబ్బురము

ప్రశ్న 3.
 “వంగడము – ఓలి” అను పదాలకు ప్రకృతి
 A) వంశము – ఆళి
 B) వంగపండు – వల్లె
 C) వంకర – ఓసి
 D) బంగాళము – వలయు
 జవాబు:
 A) వంశము – ఆళి
ప్రశ్న 4.
 “శ్రీ – రాత్రి” అను పదములకు వికృతి
 A) లచ్చి – రాయి
 B) సిరి రాయి
 C) సిరి – రేయి, రాతిరి
 D) రాతిరి – రేయి
 జవాబు:
 C) సిరి – రేయి, రాతిరి
ప్రశ్న 5.
 పాలసముద్రపు కన్య మహాలక్ష్మి – గీత గీసిన పదానికి వికృతి
 A) కనకము
 B) కన్నె, కన్నియ
 C) కందు
 D) తనయ
 జవాబు:
 B) కన్నె, కన్నియ

ప్రశ్న 6.
 ఆ పురములో ధనవంతులకు కొదవలేదు – గీత గీసిన పదానికి వికృతి
 A) ప్రోలు
 B) పురం
 C) వూరు
 D) నగరము
 జవాబు:
 A) ప్రోలు
ప్రశ్న 7.
 చీరె అనే అర్థంలో “పటము”నకు వికృతి
 A) పట్టణము
 B) పుట్టము
 C) పఠాణి
 D) పతనము
 జవాబు:
 B) పుట్టము
ప్రశ్న 8.
 “గర్వము” అనే పదానికి వికృతి
 A) గరువము
 B) గరణము
 C) గరుకు
 D) గౌరవం
 జవాబు:
 A) గరువము

ప్రశ్న 9.
 చురుకైన మతి గలవాడు – గీత గీసిన పదానికి వికృతి
 A) మమత
 B) మనసు
 C) అనుమతి
 D) మది
 జవాబు:
 D) మది
ప్రశ్న 10.
 వృషపర్వుని పట్టి శర్మిష్ఠ – గీత గీసిన పదానికి వికృతి
 A) కూతురు
 B) కొమరిత
 C) పుత్రి
 D) కుమార్తె
 జవాబు:
 C) పుత్రి
ప్రశ్న 11.
 కూర్మి సకియలు వేగురు గొల్పనెపుడు – గీత గీసిన పదానికి వికృతి
 A) సఖి
 B) చెలి
 C) సకి
 D) చెలికత్తె
 జవాబు:
 B) చెలి

IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
 సముద్రుని కూతురు లక్ష్మి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
 A) సుతుడు, పుత్రుడు, కుమారుడు
 B) సుత, పట్టి, దుహిత
 C) కూతు, దౌహిత్రుడు, జాత
 D) కొమరిత, సంభవము, జన్మించినది
 జవాబు:
 B) సుత, పట్టి, దుహిత
ప్రశ్న 2.
 స్త్రీ – అనే పదానికి ఇవి పర్యాయపదాలు కావు.
 A) ఎలనాగ, నెలత, వాలుగంటి
 B) పడుచు, కలికి, నెలంత
 C) లక్ష్మి, సరస్వతి, పార్వతి
 D) కొమ్మ, అలరుబోడి, వనిత
 జవాబు:
 C) లక్ష్మి, సరస్వతి, పార్వతి
ప్రశ్న 3.
 బొంది, మేను, మై – అనే పర్యాయపదాలున్న పదం
 A) శరీరము
 B) ధనువు
 C) నేను
 D) కారణం
 జవాబు:
 A) శరీరము

ప్రశ్న 4.
 దనుజులు, రక్కసులు, దానవులు – పర్యాయపదాలుగా ఉన్న పదం
 A) అనుజులు
 B) దుష్టులు
 C) కిరాతులు
 D) రాక్షసులు
 జవాబు:
 D) రాక్షసులు
ప్రశ్న 5.
 “చీర” అను పదానికి పర్యాయపదాలు
 A) వలువ, కోక, పుట్టము
 B) చీర, ధోవతి, పంచ
 C) అంగి, వస్త్రము
 D) ఉతికినవి, ఉతకనివి
 జవాబు:
 A) వలువ, కోక, పుట్టము
ప్రశ్న 6.
 గోత్రము, వంగడము, కులము – అను పర్యాయపదాలు గల పదము
 A) వంశము
 B) కొండ
 C) పొలము
 D) అనువంశము
 జవాబు:
 A) వంశము

ప్రశ్న 7.
 సింహము నోరు పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
 A) పైపెదవి, నోరు
 B) నాలుక, ముఖము
 C) ఆస్యము, వాయి, వక్త్రము
 D) అంగిలి, కంఠము
 జవాబు:
 C) ఆస్యము, వాయి, వక్త్రము
ప్రశ్న 8.
 గాలి అనే పదానికి సరియైన పర్యాయపదాలు
 A) జలము, వాయసము
 B) ఖగము, గగనము
 C) అనిలము, అనలము
 D) కరువలి, అనిలము, వాయువు
 జవాబు:
 D) కరువలి, అనిలము, వాయువు
ప్రశ్న 9.
 వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
 A) పుత్రిక, పుత్ర
 B) కూతురు, కుమరా
 C) పుత్రిక, కూతురు
 D) స్తుత, సునీత
 జవాబు:
 C) పుత్రిక, కూతురు

ప్రశ్న 10.
 దేవతలు ఎల్లప్పుడు ఊడిగం చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
 A) ఖేచరులు, నిశాచరులు
 B) రాక్షసులు, ప్రజలు
 C) దైత్యులు, కింపురుషులు
 D) అమరులు, సురులు
 జవాబు:
 D) అమరులు, సురులు
ప్రశ్న 11.
 శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా ఉన్నాము · గీత గీసిన పదానికి పర్యాయపదాలు
 A) మై, మే
 B) మేను, కాయం
 C) దేహం, కాయ
 D) తోలుతిత్తి, చర్మం
 జవాబు:
 B) మేను, కాయం
V. నానార్థాలు :
ప్రశ్న 1.
 కొమ్మ – అను పదమునకు నానార్థాలు
 A) తీసుకో, పసుపుకొమ్ము
 B) స్త్రీ, చెట్టుకొమ్మ
 C) సంతానము, కుమార్తె
 D) చెట్టు, చెట్టుకొమ్మ
 జవాబు:
 B) స్త్రీ, చెట్టుకొమ్మ

ప్రశ్న 2.
 శుక్రుడు – అను పదమునకు నానార్థములు
 A) భార్గవుడు, చక్రము
 B) దేవతల గురువు, వెలుగు
 C) దేవతల గురువు, ఒక గ్రహము, అగ్ని
 D) భార్గవుడు, పురోహితుడు
 జవాబు:
 C) దేవతల గురువు, ఒక గ్రహము, అగ్ని
ప్రశ్న 3.
 శుక్రాచార్యుడు రాక్షసుల గురువు – గీత గీసిన పదానికి నానార్థాలు
 A) తండ్రి, తాత
 B) ఒజ్జ, ఉపాధ్యాయుడు
 C) ఆచార్యుడు, బృహస్పతి
 D) దేవగురువు, బృహస్పతి
 జవాబు:
 C) ఆచార్యుడు, బృహస్పతి
ప్రశ్న 4.
 వృషపర్వుడు రాక్షస రాజు – గీత గీసిన పదానికి నానార్థాలు
 A) ప్రభువు, రేడు
 B) నృపతి, చంద్రుడు
 C) ఇంద్రుడు, శచీ
 D) భూపతి, నృపుడు
 జవాబు:
 B) నృపతి, చంద్రుడు

ప్రశ్న 5.
 దేవతలంతా రేయింబవళ్ళు సేవలు చేస్తున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
 A) స్తోత్రం, స్తవం
 B) గౌరవం, మర్యాద
 C) శుశ్రూష, కొలుపు
 D) పూజ, అర్చన
 జవాబు:
 C) శుశ్రూష, కొలుపు
ప్రశ్న 6.
 నీవు చీర తారుమారైనందుకే ఇంతగా కసురుతున్నావు – గీత గీసిన పదానికి నానార్థాలు
 A) నారచీర, జుట్టు
 B) గోచి, నక్షత్రం
 C) రేఖ, గీత
 D) వస్త్రం, అస్త్రం
 జవాబు:
 A) నారచీర, జుట్టు
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
 “అలరు (పువ్వు) వంటి మేను కలది స్త్రీ” అను వ్యుత్పత్తి గల పదము
 A) అలరులు
 B) అలరుబోడి
 C) అరుతల్లి
 D) అలిగినవారు
 జవాబు:
 B) అలరుబోడి

ప్రశ్న 2.
 వాలుగంటి (స్త్రీ) – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
 A) క్రిందకు వాలిన కన్నులుగలది.
 B) విశాలమైన (దీర్ఘమైన) కన్నులు కలది.
 C) గరిటె వంటి కన్నులు కలది.
 D) రెండు కన్నులు కలది.
 జవాబు:
 B) విశాలమైన (దీర్ఘమైన) కన్నులు కలది.
PAPER – II : PART – A
అపరిచిత పద్యాలు
ప్రశ్న 1.
 క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ద్యుమణి పద్మాకరము వికచముగఁ జేయుఁ
 గుముద హర్షంబు గావించు నమృతసూతి,
 యర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు;
 సజ్జనులు దారె పరహితాచరణమతులు
ప్రశ్నలు – సమాధానాలు
 1. పద్మాకరమును వికసింపజేసేది ఎవరు?
 జవాబు:
 సూర్యుడు (ద్యుమణి) పద్మాకరమును వికసింపజేస్తాడు.
2. చంద్రుడు వేటిని వికసింపజేస్తాడు?
 జవాబు:
 చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు.
3. కోరకుండానే నీటిని ఇచ్చేది ఎవరు?
 జవాబు:
 కోరకుండానే నీటిని ఇచ్చేది మేఘుడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘పరోపకారుల స్వభావం’.
5. అమృతసూతి అంటే ఎవరు ?
 జవాబు:
 అమృతసూతి అంటే చంద్రుడు.

ప్రశ్న 2.
 క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధరణి ధేనువుఁ బిదుకంగఁ దలఁచితేని
 జనులు బోషింపు మధిప! వత్సముల మాడ్కి
 జనులు పోషింపబడుచుండ జగతి కల్ప.
 లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు.
ప్రశ్నలు – సమాధానాలు
1. అధిపులు ఎవరిని పోషించాలి ?
 జవాబు:
 అధిపులు జనులను పోషించాలి.
2. జగతి ఏమి యొసంగును ?
 జవాబు:
 జగతి సకల ఫలము లొసగును.
3. ధరణి దేనితో పోల్చబడినది ?
 జవాబు:
 ధరణి ధేనువుతో పోల్చబడినది.
4. పై పద్యమునకు శీర్షిక నిర్ణయింపుము.
 జవాబు:
 ఈ పద్యమునకు శీర్షిక ‘రాజ్యపాలన’.
5. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
 జవాబు:
 ఈ పద్యం అధిపుని (రాజుని) సంబోధిస్తూ చెప్పబడింది.

ప్రశ్న 3.
 క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
 యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
 దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
 ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు – సమాధానాలు
 1. కుజనుల మైత్రి ఎటువంటిది ?
 జవాబు:
 కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.
2. సజ్జనుల మైత్రి ఎటువంటిది ?
 జవాబు:
 సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.
3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు ?
 జవాబు:
 కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.
4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది ?
 జవాబు:
 ఈ పద్యం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.
5. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘మైత్రి’.

ప్రశ్న 4.
 క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
 జేయుఁ గోప్యంబు దాచుఁ, బోషించుగుణము,
 విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
 మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు
ప్రశ్నలు – సమాధానాలు
 1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
 జవాబు:
 మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.
2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు ?
 జవాబు:
 మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచిపెట్టడు.
3. మిత్రుడు పోషించేది ఏది?
 జవాబు:
 మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.
5. గోప్యము అంటే ఏమిటి ?
 జవాబు:
 గోప్యము అంటే రహస్యం.

ప్రశ్న 5.
 క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
 దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
 దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
 జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు – సమాధానాలు
 1. ఎవరి మనసు రంజింపచేయలేము ?
 జవాబు:
 మూర్ఖుని మనసు రంజింపచేయలేము.
2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును ?
 జవాబు:
 ఇసుక నుండి తైలము తీయవచ్చు.
3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు ?
 జవాబు:
 మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.

5. మృగతృష్ణ అంటే అర్థం ఏమిటి ?
 జవాబు:
 మృగతృష్ణ అంటే ఎండమావి.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
 స్నేహం విలువను తెలిపేలా కథను రాయండి.
 జవాబు:
 ‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.
చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.
పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
 “నెఱ + మది” – కలిపి రాయగా
 A) నెఱమది
 B) నెమ్మది
 C) నెనరుమది
 D) నింమది
 జవాబు:
 B) నెమ్మది
ప్రశ్న 2.
 “గసడదవాదేశ సంధి”కి ఉదాహరణ
 A) నెగులుగ్రము
 B) అనుగుఁగూతు
 C) నెమ్మది
 D) వేలుపుంగన్నియ
 జవాబు:
 A) నెగులుగ్రము
ప్రశ్న 3.
 “అయ్యెలనాగ” ఎవతె అని ప్రశ్నించాడు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
 A) ఆ + యెలనాగ
 B) అయ్యెల + నాగ
 C) అయ్యె + లనాగ
 D) ఆ, ఈ + ఎలనాగ
 జవాబు:
 A) ఆ + యెలనాగ

ప్రశ్న 4.
 “ఆ + కలికి → అక్కలికి” – ఇది ఏ సంధి ?
 A) ఆ, ఈ, ఏ సంధి
 B) త్రిక సంధి
 C) అత్వ సంధి
 D) సరళాదేశ సంధి
 జవాబు:
 B) త్రిక సంధి
ప్రశ్న 5.
 బాలురు నీరాటలో మైమరచిపోయారు – గీత గీసిన పదం ఏ సంధి. ?
 A) గసడదవాదేశ సంధి
 B) త్రిక సంధి
 C) అత్వ సంధి
 D) ఉత్వ సంధి
 జవాబు:
II. సమాసములు :
ప్రశ్న 1.
 రక్కసుల యొక్క యొజ్జ – సమాస నామము
 A) షష్ఠీ తత్పురుష
 B) ప్రథమా తత్పురుష
 C) విశేషణ పూర్వపద
 D) సంభావనా పూర్వపద
 జవాబు:
 A) షష్ఠీ తత్పురుష

ప్రశ్న 2.
 “విశేషణ పూర్వపద కర్మధారయము”నకు ఉదాహరణ
 A) రక్కసుల యొజ్జ
 B) రక్కసుల రేడు
 C) వృషపర్వు కూతురు
 D) అనుగు కూతురు
 జవాబు:
 D) అనుగు కూతురు
ప్రశ్న 3.
 నేలవేలుపు బిడ్డ దేవయానిని యయాతి ఉద్ధరించెను – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
 A) నేలకు వేలుపు బిడ్డ
 B) నేలవేలుపు యొక్క బిడ్డ
 C) నేలవేలుపు వంటి బిడ్డ
 D) బిడ్డ వంటి నేలవేలుపు
 జవాబు:
 B) నేలవేలుపు యొక్క బిడ్డ
ప్రశ్న 4.
 శర్మిష్ఠకు కూరిసకియలు పెక్కుమంది కలరు – గీత గీసిన పదం ఏ సమాసం?
 A) షష్ఠీ తత్పురుష సమాసం
 B) బహువ్రీహి సమాసం
 C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 D) సప్తమీ తత్పురుష సమాసం
 జవాబు:
 C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 5.
 “నీటి యందలి ఆట” సమాస రూపము
 A) నీరాట
 B) నీటిఆట
 C) నీటియాటలు
 D) నీటితో ఆట
 జవాబు:
 A) నీరాట
III. ఛందస్సు:
ప్రశ్న 1.
 
 పై పద్యము ఏ పద్యము యొక్క పాదము. ?
 A) చంపకమాల.
 B) తేటగీతి
 C) ఆటవెలది
 D) కందం
 జవాబు:
 B) తేటగీతి
ప్రశ్న 2.
 న, హ గలములను ఏమని పిలుస్తారు ?
 A) ఇంద్రగణములు
 B) వృత్తగణములు
 C) సూర్యగణములు
 D) చంద్రగణములు
 జవాబు:
 C) సూర్యగణములు

ప్రశ్న 3.
 “శార్దూల పద్యము”లో వచ్చు గణములు
 A) న, జ, భ, జ, జ, జ, ర
 B) భ, ర, న, భ, భ, ర, వ
 C) మ, స, జ, స, త, త, గ
 D) స, భ, ర, న, మ, య, వ
 జవాబు:
 C) మ, స, జ, స, త, త, గ
IV. వాక్యాలు:
ప్రశ్న 1.
 రాము పూలను కోసాడు. రాము పూలను పూజారికి ఇచ్చాడు.
 పై వాక్యములను సంక్లిష్ట వాక్యములుగా మార్చగా
 A) రాము పూలు కోసాడు కాబట్టి పూజారికిచ్చాడు.
 B) రాము పూలు కోసి, కోసిన పూలను పూజారికిచ్చాడు.
 C) రాము పూలు కోసి, పూజారికిచ్చాడు.
 D) కోసిన పూవులన్నీ రాము పూజారికి ఇచ్చాడు.
 జవాబు:
 C) రాము పూలు కోసి, పూజారికిచ్చాడు.
ప్రశ్న 2.
 రాము బడికి వెళ్ళాడు, పరీక్ష రాశాడు – ఏ వాక్యము ?
 A) సంక్లిష్ట వాక్యము
 B) సంయుక్త వాక్యము
 C) ప్రశ్నార్థకము
 D) క్రియారహిత వాక్యం
 జవాబు:
 B) సంయుక్త వాక్యము

ప్రశ్న 3.
 సీత పాటలు పాడుతుంది, నాట్యం కూడా చేస్తుంది – ఏ వాక్యము ?
 A) సంయుక్త వాక్యం
 B) ప్రత్యక్ష కథనం
 C) సంక్లిష్ట వాక్యం
 D) సామాన్య వాక్యం.
 జవాబు:
 A) సంయుక్త వాక్యం
ప్రశ్న 4.
 సామాన్య వాక్యాన్ని గుర్తించండి.
 A) సీత వంట చేసి, వడ్డించింది.
 B) రాము డిగ్రీ పాసయ్యాడు, ఉద్యోగంలో చేరాడు.
 C) రాము చదరంగం మరియు వాలీబాల్ ఆడతాడు.
 D) మీరు నిన్న వచ్చారు.
 జవాబు:
 D) మీరు నిన్న వచ్చారు.

ప్రశ్న 5.
 ఈ కింది వాటిలో కర్మణి వాక్యం.
 A) ఈ నాయకుని ప్రజలు ఎన్నుకున్నారు.
 B) ఆ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.
 C) ఏ నాయకుని మంచివాడని ఎన్నుకున్నారు ?
 D) ఆ నాయకుడు డబ్బున్నవాడే కాని ఓడిపోయాడు.
 జవాబు:
 B) ఆ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.