These TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 3rd Lesson Important Questions వలసకూలీ
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పాలమూరు జిల్లా ప్రజలు అధికంగా వలస కూలీలుగా ఎందుకు జీవిస్తున్నారు ?
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయి జీవిస్తున్నారు.
ప్రశ్న 2.
వలస జీవితంలో ఉన్న అవస్థలేవి?
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసలు పోతారు. అక్కడైనా సరైన సదుపాయాలు ఉంటాయా అంటే ! అనుమానమే. ముఖ్యంగా స్థానికంగా ఉండేవారి వల్ల ఇబ్బందులు.
ఇక తినటానికి, ఉండటానికి తిండి, జాగా దొరకక ‘ నానా ఇబ్బందులు పడాలి. తమ పిల్లల చదువులు గాని, వైద్యపరంగా సదుపాయాలు గాని ఉండవు. రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి కూడా ఉండవు. అటు ఉన్న ఊరును కాదనుకొని వచ్చినందుకు ఈ ఊరులోనివారు వీరిని కాదంటారు. మొత్తం మీద వీరి అవస్థ “రెండిటికి చెడ్డ రేవడి పరిస్థితి”.
ప్రశ్న 3.
పల్లె జీవనం కష్టతరంగా మారింది. కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నావు ?
జవాబు:
పల్లెలు వ్యవసాయ క్షేత్రాలు. రైతులే ప్రత్యక్ష దేవుళ్ళు. చెమటోడ్చి తన రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి పంట పండించి, లోకానికి అన్నం పెడుతున్న రైతు ‘అన్నదాత’. ఆ అన్నదాతకు నేడు కష్టకాలం వచ్చింది. మన విపరీత ధోరణుల వల్ల ప్రకృతి వికృతిగా మారింది. రైతును కుంగదీస్తోంది. ఒకసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో ప్రకృతి విలయతాండవం చేసి, రైతును అతలాకుతలం చేస్తుంది. రాబడి లేకపోగా అప్పులు, వడ్డీలు పెరిగి బ్రతుకు భారంగా మారి, చివరకు మరణమే మేలు అని భావిస్తున్నాడు రైతు.
ఇలాగే కొద్ది తేడాలతో అన్ని వృత్తులవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకునే స్థితి నుండి ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్న స్థితికి చేరింది. ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సాయం అందకపోవడం ప్రధాన కారణం. చెట్టుకున్న పళ్ళను గమనిస్తామేగాని.
చెట్టును గమనించనట్లు పల్లెలలోనివారి బ్రతుకులూ ఉన్నాయి. కనుకనే పల్లెజీవనం కష్టతరంగా మారింది. విద్యా, వైద్య సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, యువకులకు సరైన ఉపాధి మొదలైనవి లేకపోవడం మరో కారణం.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పల్లెవాసులు వలసపోవడానికి కారణాలేమిటో వివరించండి.
జవాబు:
నీటి వసతికి నోచుకోలేక, పంటలు పండక, నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నవారు, బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి పల్లెవాసులు వలస పోవడం జరుగుతుంది.
మానవజన్మ ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే అందంగా ఉండాల్సిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకొనేందుకు మనుషులు లేక, బాధను పంచుకొనేందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థ జీవితాలు గడుపుతున్న పల్లెవాసుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.
పల్లెవాసులు వలసపోవడానికి కారణాలు : పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఆశే వలసలకు ప్రధాన కారణం. వానలు లేక పంటలు ఎండిపోయి, పశువులకు మేతలు కరువవటం పల్లెవాసుల వలసలకు మరొక కారణం. సరైన ఉపాధి లేకపోవడం, ప్రభుత్వం నుండి సరైన ఆదరణలేక కూలీలు, యువకులు వలసల బాట పడుతున్నారు. సరైన విద్య, వైద్య సదుపాయాలు పల్లెలలో లేకపోవడం వలసలకు దారితీస్తున్నది.
ప్రశ్న 2.
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?” అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు:
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?’ ఈ వాక్యం డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది. తెలంగాణ రాష్ట్రంలో నీటివసతిలేక పంటలు పండక, ఎప్పుడూ కరవు రాక్షసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం ‘పాలమూరు’. బ్రతుకు భారాన్ని మోస్తూ, కాలాన్ని వెళ్ళదీసే మార్గం లేక, బ్రతుకు తెరువు కోసం వలస పోవడం పాలమూరు (మహబూబ్నగర్) జిల్లాలోని కూలీలకు పరిపాటి.
ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పుతీర ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్ళి, తుపానులో చిక్కుకొని తిరిగిరాలేదు. ఆ సందర్భంలో కవి హృదయంలో కలిగిన ఆవేదనలోంచి వచ్చిన మాటల్లో ఇదొకటి.
కోస్తాబెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు, కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా ! అని కవి విచారిస్తున్నాడు. కృష్ణానదిపై ఎగువ ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పొలాలకు అందుతాయి.
ఆ నీళ్ళు లభ్యమైతే, అక్కడి ప్రజలు వర్షాధారంగా జీవించాల్సిన పనిలేదు. కృష్ణా జలాలతో తమ పంటలు పండించుకోవచ్చు.. ప్రస్తుతం ఆ ఆనకట్ట కట్టకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల పాలమూరు జనులకు ఈ పరిస్థితి వచ్చిందని కవి ఆవేదన చెందారు.
PAPER – 1 : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు :
అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. మస్తుగ : ఒకటి కొంటే ఒకటి ఉచితం అని అమ్ముతున్న దుకాణం ముందు జనం మస్తుగ జమైనారు.
2. గడువు : మీరు గడువు దాటిన మందులు కొనకండి.
3. పైరు : వెన్ను వేసి, నిలిచిన మొక్కజొన్న పైరు కన్నుల పండుగగా ఉంది.
4. వలస : కరవు తాండవించడంలో వ్యవసాయదారులు కూలీలుగా నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు.
II. అర్థాలు :
ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
ప్రశ్న 1.
వరుగులు – అంటే అర్థం
A) ఎండిన కాయ గింజలు
B) బక్కచిక్కిన
C) ఒరిగిన
D) తరిగిన
జవాబు:
A) ఎండిన కాయ గింజలు
ప్రశ్న 2.
“జలపిడుగు” అనే పదం కవి ఈ అర్థంలో వాడాడు.
A) ఒకరకం చేప
B) వరద
C) ఉరుము
D) నిప్పు
జవాబు:
B) వరద
ప్రశ్న 3.
తిరగడం మరిగితే చదవడం తగ్గుతుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కోపం
B) అలవాటుపడు
C) చల్లార్చు
D) మొదలుపెట్టు
జవాబు:
B) అలవాటుపడు
ప్రశ్న 4.
“క్రమ్ముకొను” అనే అర్థం గల పదం
A) కొమ్ములు మొలుచు
B) చుట్టుప్రక్కల అంటే సరియైన అర్థం
C) ముసురుకొను
D) మొక్క మొలుచు
జవాబు:
C) ముసురుకొను
ప్రశ్న 5.
జాలరి – అంటే సరియైన అర్ధం
A) పొడగరి
B) కూలి
C) చేపలు పట్టువాడు
D) కోస్తావాడు
జవాబు:
C) చేపలు పట్టువాడు
ప్రశ్న 6.
ముద్దతు – అంటే అర్థం
A) గడువు సమయం
B) మద్దతు
C) ముదిరిన
D) సౌకర్యం
జవాబు:
A) గడువు సమయం
ప్రశ్న 7.
నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆకలి
B) మనిషి
C) రాక్షసి
D) బాధ
జవాబు:
C) రాక్షసి
ప్రశ్న 8.
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్త జీవితాలు ఎన్నో – గీత గీసిన పదానికి అర్థం
A) నిజం
B) బాధ
C) లేమి
D) కలిమి
జవాబు:
B) బాధ
ప్రశ్న 9.
జాలరిని గూర్చి భార్యాపిల్లలు యాది జేసుకోవడం ఎంత ఆర్ధ్ర్రంగా ఉంటుందో – గీత గీసిన పదానికి అర్థం
A) తడిసినది
B) తడిపి
C) గుర్తు
D) సంతోషం
జవాబు:
B) తడిపి
III. పర్యాయపదాలు:
ప్రశ్న 1.
బర్లు, గొడ్లు, పసులు – అనే పర్యాయపదాలు గల పదం
A) సొమ్ములు
B) గేదెలు
C) గోర్లు
D) పాడి
జవాబు:
B) గేదెలు
ప్రశ్న 2.
“పల్లె” అనే పదానికి పర్యాయపదాలు
A) పల్లె, ఇల్లు
B) జనపదం, గ్రామం
C) ఊరు, పేట
D) పేట, నగరం
జవాబు:
B) జనపదం, గ్రామం
ప్రశ్న 3.
కొలనులోని చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మెరిగెలు, చందమామలు
B) మీనములు, మత్స్యములు
C) కొర్రలు, జలపుష్పాలు
D) బాడిస, రొయ్యలు
జవాబు:
B) మీనములు, మత్స్యములు
ప్రశ్న 4.
మబ్బు – అనే పదానికి పర్యాయపదాలు కానిది.
A) మేఘము, మొయిలు
B) జీమూతం, చీకటి
C) అంబుదము, జలదము
D) వారిదము, జీమూతం
జవాబు:
B) జీమూతం, చీకటి
ప్రశ్న 5.
కూలి మస్తుగ దొరుకుతాదని, కోస్త దేశం పోతివా ?
A) వేతనం, పెత్తనం
B) మూల్యం, అమూల్యం
C) భరణం, భారం
D) భృతి, భృత్యం
జవాబు:
D) భృతి, భృత్యం
IV. ప్రకృతి, వికృతులు:
గీత గీసిన పదానికి పర్యాయపదాలు
ప్రశ్న 1.
దేశనాయకులు దేశసేవ చేయాలని “ఆశ” – గీత గీసిన పదానికి వికృతి
A) దిక్కు
B) ఆస
C) ఆశలు
D) అసు
జవాబు:
B) ఆస
ప్రశ్న 2.
పూర్ణిమ, పౌర్ణమి – అనే పదాలకు సరియైన వికృతి
A) పూర్ణము
B) పురాణము
C) పున్నమి
D) పూస
జవాబు:
C) పున్నమి
ప్రశ్న 3.
“సింగం” వికృతిగా గల పదం
A) సింహం
B) సింగిడి
C) సిగ
D) సికరం
జవాబు:
A) సింహం
ప్రశ్న 4.
కవి హృదయంలో ఆవేదన – గీత గీసిన పదానికి వికృతి
A) ఎద
B) గుండె
C) మనసు
D) చిత్తం
జవాబు:
A) ఎద
V. నానార్థాలు
ప్రశ్న 1.
ముకురాల ప్రజల కోసం కలం పట్టిన కవి – గీత గీసిన పదానికి
A) కావ్యకర్త, పండితుడు
B) నీటికాకి, కవిలె
C) శుక్రుడు, కుజుడు
D) గణపతి, పవి
జవాబు:
A) కావ్యకర్త, పండితుడు
ప్రశ్న 2.
వైపు, దిశ, ఆధారము – అనే నానార్థాలు గల పదం
A) నిశి
B) దిక్కు
C) తాళము
D) మూల
జవాబు:
B) దిక్కు
ప్రశ్న 3.
“కాలము” అను పదమునకు నానార్థాలు
A) సమయము, వానాకాలము
B) సమయము, నలుపు
C) నలుపు, ఋతువు
D) పత్రికలో భాగం, వెల
జవాబు:
B) సమయము, నలుపు
ప్రశ్న 4.
చాలు వానే పడదు సరళా సాగరం నిండేది కాదని – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మదం, మందం
B) సంద్రం, సంఖ్య
C) మృగం, మెకం
D) నేతిసిద్దె, గిన్నె
జవాబు:
B) సంద్రం, సంఖ్య
VI. వ్యుత్పత్యర్థములు
ప్రశ్న1.
జాలరి – అనే పదానికి వ్యుత్పత్తి అర్థం
A) చేపలు పట్టువాడు
B) జాలము (వల) కలిగినవాడు
C) చాలాకాలము నీటిలో ఉండువాడు.
D) జాలమునకు శత్రువు
జవాబు:
B) జాలము (వల) కలిగినవాడు
ప్రశ్న2.
కృత్తికా నక్షత్రం పౌర్ణిమనాడు గల మాసం – దీనికి వ్యుత్పత్తి పదం
A) మార్గశిరం
B) కార్తీకం
C) మాఘం
D) చైత్రం
జవాబు:
B) కార్తీకం
ప్రశ్న3.
అక్షమునకు అభిముఖమైనది – దీనికి వ్యుత్పత్తి పదం
A) పరోక్షం
B) అక్షయ
C) ప్రత్యక్షం
D) అక్షాంశం.
జవాబు:
C) ప్రత్యక్షం
PAPER – II : PART – A
అపరిచిత పద్యాలు
1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది ?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.
ప్రశ్న 2.
గుణము ఏలా కొరతపడుతుంది ?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.
ప్రశ్న 3.
కోపము వలన బ్రతుకు ఏమౌతుంది ?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.
ప్రశ్న 4.
పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము
ప్రశ్న 5.
పై పద్యానికి ఒక ప్రశ్న తయారు చేయండి.’
జవాబు:
పై పద్యం ఏ శతకంలోనిది ?
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పరగ రాతి గుండు పగులఁ గొట్టఁగవచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపఁగా రాదు
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
వేటిని పగుల గొట్టవచ్చును ?
జవాబు:
రాతి గుండులను పగుల గొట్టవచ్చును.
ప్రశ్న 2.
వేటిని పిండి కొట్టవచ్చును ?
జవాబు:
కొండలను పిండి కొట్టవచ్చును.
ప్రశ్న 3.
ఎవరి మనస్సుని కరిగించలేము ?
జవాబు:
కఠిన చిత్తుని మనస్సుని కరిగించటము కష్టము.
ప్రశ్న 4.
పై పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
పై పద్యము వేమన శతకము లోనిది.
ప్రశ్న 5.
పై పద్యాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
పై పద్యాన్ని వేమన రచించారు.
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎటువంటి చుట్టమును విడిచిపెట్టాలి ?
జవాబు:
సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.
ప్రశ్న 2.
ఎటువంటి దైవమును విడిచిపెట్టాలి ?
జవాబు:
నమస్కరించిననూ వరమీయని దేవుణ్ణి విడిచి పెట్టవలెను.
ప్రశ్న 3.
యుద్ధములో ఎవరిని విడిచిపెట్టాలి ?
జవాబు:
యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టాలి.
ప్రశ్న 4.
పై పద్యములోని నీతి ఏమిటి ?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచిపెట్టాలి.
ప్రశ్న 5.
పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
పై పద్యం సుమతీ శతకంలోనిది.
4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ !
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
దానములన్నింటి కన్నా ఏ దానము గొప్పది ?
జవాబు:
దానములన్నింటి కన్నా అన్నదానమే గొప్పది.
ప్రశ్న 2.
ఎవరి కంటే మించినది లేదు ?
జవాబు:
కన్నతల్లి కంటే మించినది లేదు.
ప్రశ్న 3.
ఎవరికన్న మించిన వ్యక్తి లేడు ?
జవాబు:
గురువు కంటే మించిన వ్యక్తి లేడు.
ప్రశ్న 4.
ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.
ప్రశ్న 5.
పై పద్యంలో ఏ దానం గురించి చెప్పారు ?
జవాబు:
పై పద్యంలో అన్నదానము గురించి చెప్పారు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
సంభాషణ
బతుకు భారాన్ని నడిపేందుకు కూలీలు వలసలకు వెళుతున్నారు. దీనికి గల కారణాలను తెలుపుతూ ‘సంభాషణను’ రాయండి.
జవాబు:
సోములు : ఓరేయ్ చంద్రయ్యా ! రాములుగాడు, ఆడిపెళ్ళాం పిల్లలు రెండు రోజులు నుండి కనిపించడం లేదు ఏడకు ఎల్లిండ్రు ?
చంద్రయ్య : నీకు ఏంది మావా, తినటానికి తిండిలేక, పస్తులుండలేక టౌనుకు పోయినడు గందా.
సోములు : ఒర్రేయ్ అల్లుడూ ! ఎంత కస్టమొచ్చినాది. నిజంగా నాకు తెల్దు. ఔను గానీ, ఇక్కడే ఏదో పని చేసుకోవాలి గాని ఊరు ఒదిలి యెత్తే కొత్త ఊళ్ళో ఎవరు పని ఇత్తాడ్రా ?
చంద్ర : నిజమే మామ. కాని ఊళ్ళో ఏం పనుందే. వానలు లేక పొలం పన్లు లేవు. పసులకే గడ్డి లేదు. వాడికి పనిచ్చేదెవరు.
సోములు : అవున్రా. వానల్లేక అందరికి ఇబ్బందిగానే కాలం గడస్తొంది. మరి ఓబులేసు, సుబ్బారావు వాళ్ళంతా ఏం చేస్తుండ్రు.
చంద్ర : వాళ్ళా, ఓ పూట గంజినీళ్ళు, ఓ పూట పస్తులు.
సోములు : ఉన్న చెరువును పూడ్చి మిద్దెలు కట్టాలని ఆ కాంట్రాక్టరు సెప్పినాడని ఊ గొట్టినామ్. ఆ పని మన నోళ్ళలో మట్టి కొట్టినాది.
చంద్ర : అవును మామ. డబ్బులు సూసేసరికి రాబోయే కష్టకాలం యాదికి రానేదు. ఇప్పుడదే నోటి కూడు తీసినాది.
సోములు : ప్రభుత్వమైనా సాయం సేయదా ?
చంద్ర : ఎందుకు సేయదు. కాని వెంబడినే జరక్కపోవచ్చు.
సోములు : అక్కడ వాడు ఎలా బతుకుతుండో ఎంటో, బాధగా ఉందిరా.
చంద్ర : మనం చేసుకున్న పనులే మనకు కాని కాలాన్ని తెచ్చాయి మావ, చెట్లు నరుకున్నాం. చెరువు పాడు చేసుకున్నాం.
సోములు : మన పెద్దలు మనకిచ్చింది. మళ్ళీ మనం మన బిడ్డలకు ఈనేక పోతున్నాం. ఏది ఏమైన ఉన్న ఊరుని కాదని పొరుగూరు వెళ్తే ఎట్టా ఉంటదో తెలిసి కూడా ఎట్టా వెళ్ళాలిరా ?
చంద్ర : తప్పదు సోములు మావ. తిండిలేదు, వైద్దిగం కూడా నేదు. పిల్లల సదువులకు పట్నం పోవల్సిందే. ఇక్కడే ఉంటే జరుగుబాటు కావద్దా ?
సోములు : నిజమే లేరా. కలికాలం అంటేనే కాని కాలం. సీకటి పడినాది పోదాం పదా.
ప్రశ్న 2.
గేయం
“ఆకలి మంటలు ఆరని మంటలు. బడుగుల బతుకులు, అతుకుల బొంతలు, నలిగిన బతుకులు. తీరని వెతలు – పట్టెడు మెతుకులే పరమాన్నాలు” ఇటువంటి ప్రాస పదాలను వాడుతూ వలస జీవుల బ్రతుకులపై గేయాన్ని రాయండి.
జవాబు:
వలస జీవుల బతుకులు
పొట్ట చేత బట్టి, పెళ్ళాం బిడ్డలను విడిచిపెట్టి
నోరు కట్టి, వలసకు వెళ్ళావా ? వనాల కెళ్ళావా ?
గంపెడు ఆశతో గుండెలవిశేలా కష్టం చేసి
కూలీ కోసం రక్తాన్ని చెమటగా మార్చేసి
గుండెను బండగ చేసావా ఎందయ్యా ?
చాలీ చాలక ఆకలి తీరక
గుండె మంటలు ఆర్పలేక పోతున్నావా ?
ఇంటి ఆడది మాది కొస్తోందా ?
పిల్లల కోసం మనసు లాగేస్తోందా ?
గుండెను బండను చేసాయా ఏందయ్యా ?
నిన్ను నిన్నుగానే చూడాలనుకొనే కళ్ళు
వేయికళ్ళతో వెదుకుతున్న ఆనవాళ్ళు
నీకు తెలియవచ్చే నాటికి గడిచేను ఎన్నో యేళ్ళు
నీ వాళ్ళు గుర్తు రావటం లేదా ఇన్నాళ్ళు
గుండెలవిసేలా రోదిస్తున్నావా ఏందయ్యా ?
ప్రశ్న 3.
వ్యాసం
వలస కూలీల కష్టసుఖాలను వ్యాసరూపంలో రాయండి.
జవాబు:
పూర్వం గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు. పెద్ద వ్యవసాయం ఉండేది. దానితో గ్రామాల్లో కూలీలందరికి పని దొరికేది. ఇప్పుడు ఆ భూస్వాములు లేరు. ఉపాధి లేదు. పైగా యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్యా, వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.
గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల స్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.
గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడంలేదు. రవాణా సౌకర్యాలు లేవు. త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు లేవు.
తినడానికి తిండి, తాగటానికి నీరు, బతకటానికి కావల్సిన విద్యా, వైద్య సదుపాయాలు లేనప్పుడు ప్రజలు అక్కడే ఎందుకు ఉంటారు ? అందుకే వలసల బాట పట్టారు. జీవనాధారం లేకపోతే గంపెడు సంసారం మోయటం ఎవరికైనా కష్టమే. తోటివారే కాదు, నారు పోసినవాడు (దేవుడు) కూడా కన్నెర్ర చేస్తే పొట్ట చేతపట్టినవాడి పని ఏమిటి ? అందుకే వలస పోతున్నారు.
గ్రామాల్లోని వృత్తిపనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది. అందుకే గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలస వెళుతున్నారు.
ఈ వలస కూలీలకు వలస ప్రాంతంలో కూడా చెల్లేట్లుగా వారికి రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలు కల్పించాలి. వారి పిల్లలకు, వారికి విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. వారికై ఇళ్ళు నిర్మించాలి. వారి కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వసతులు ఏర్పాటు చేయాలి.
పనికి ఆహార పథకం ద్వారా వారికి పనులు చూపాలి. ప్రభుత్వం అందించేవి వీరికి అందుతున్నాయా, లేదా పర్యవేక్షించాలి. అప్పుడే వీరు సుఖంగా జీవించడానికి వీలవును.
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
1. సంధులు:
ప్రశ్న 1.
“ఉత్వ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ఎట్లు + అని
B) కాలము + అంటూ
C) వరుగులు + అయ్యే
D) సముద్రము + నీరు
జవాబు:
D) సముద్రము + నీరు
ప్రశ్న 2.
“ఎప్పుడు + ఒస్తవు” – ఉత్వ సంధి చేయగా.
A) ఎప్పుడొస్తవు
B) ఎప్పుడునొస్తవు
C) ఎప్పడువచ్చెదవు
D) ఎప్పుడొచ్చినావు
జవాబు:
A) ఎప్పుడొస్తవు
ప్రశ్న 3.
గోకులాష్టమినే కృష్ణాష్టమి అంటారు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
A) గో + కులాష్టమి
B) గోకులా + ష్టమి
C) గోకుల + అష్టమి
D) గోకులము యొక్క అష్టమి
జవాబు:
C) గోకుల + అష్టమి
ప్రశ్న 4.
“ఎక్కడ + ఉంటివి → ఎక్కడుంటివి” – సంధి జరిగిన తీరు
A) ఉత్వ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) అత్వ సంధి
II. సమాసములు :
ప్రశ్న 1.
“భద్రాచలం” – అను పదం యొక్క సమాసం నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయము
ప్రశ్న 2.
“సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది.
A) కోయిల సాగరము
B) సరళా సాగరము
C) కోస్త దేశం
D) ఎగువ కృష్ణా
జవాబు:
D) ఎగువ కృష్ణా
ప్రశ్న 3.
ఈ కింది వానిలో “రూపక సమాసము” కానిది.
A) విద్యా అనెడు ధనము
B) కృప అనెడు రసము
C) దయ అనెడు ఆభరణం
D) భద్రాచలం అనే పట్టణం
జవాబు:
D) భద్రాచలం అనే పట్టణం
ప్రశ్న 4.
జీవితంలో వెలుగుల కోసం జ్ఞానజ్యోతిని వెలిగించాలి – గీత గీసిన పదానికి సరియైన విగ్రహవాక్యం
A) జ్ఞానము కొరకు జ్యోతి
B) జ్ఞానము అనెడి జ్యోతి
C) జ్ఞానము తోడి జ్యోతి
D) జ్ఞానమును, జ్యోతియును
జవాబు:
B) జ్ఞానము అనెడి జ్యోతి
ప్రశ్న 5.
“గొడ్లడొక్కలు” – సమాసము పేరు
A) రూపక సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) షష్ఠీ తత్పురుష సమాసము
III. ఛందస్సు:
ప్రశ్న 1.
పద్యపాదములో రెండవ అక్షరమును ఇలా అంటారు.
A) యతి.
B) ప్రాస యతి
C) ప్రాస
D) గణము
జవాబు:
C) ప్రాస
ప్రశ్న 2.
య గణం – గురులఘువులలో
A) UUI
B) UII
C) IUU
D) IIU
జవాబు:
C) IUU
ప్రశ్న 3.
“ఉత్పలమాల” పద్యానికి యతి
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
A) 10
IV. అలంకారములు:
ప్రశ్న 1.
……….. రాకనే పోతివా,
……. మరిచే పోతివా;
పై వాక్యాలలో ఉన్న అలంకారము
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) అంత్యానుప్రాస
ప్రశ్న 2.
ఒక వస్తువునకు మరొక వస్తువునకు పోలిక ఉపమాలంకారంలో ఒకటిగా ఉండేది
A) సమాన ధర్మం
B) ఉపమానము
C) ఉపమేయము
D) క్రియ
జవాబు:
A) సమాన ధర్మం
V. వాక్యాలు:
ప్రశ్న 1.
“రామయ్య ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.” – సామాన్య వాక్యాలుగా మారిస్తే
A) రామయ్య ఊరికి, పొలానికి వెళ్ళాడు.
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.
C) రామయ్య పొలం పనులు చూడటానికి ఊరు వెళ్ళాడు.
D) ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.
జవాబు:
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.
ప్రశ్న 2.
“తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు మరియు సాధించారు.
B) తెలంగాణ సాధించారు కాని ఎన్నో ఉద్యమాలు చేశారు.
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.
D) తెలంగాణ సాధించే వరకు ఎందరో ఉద్యమాలు చేశారు.
జవాబు:
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.
ప్రశ్న 3.
“వర్షాలు బాగా పడ్డాయి. పంటలు పండలేదు.” – సరియైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) వర్షాలు బాగా పడే పంటలు పండలేదు.
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.
C) పంటలు పండలేదు కాబట్టి వర్షాలు బాగా పడ్డాయి.
D) వర్షాలు బాగా పడలేదు కాబట్టి పంటలు పండలేదు.
జవాబు:
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.
ప్రశ్న 4.
“అమ్మ వంట చేసి, దేవుని పూజ చేసింది.” – ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలలోకి మార్చండి.
A) అమ్మ వంట చేయాలి. అమ్మ దేవుని పూజ చేయాలి.
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.
C) అమ్మ వంట చేస్తూ అమ్మ దేవుని పూజ చేసింది.
D) అమ్మ వంట చేస్తే దేవుని పూజ చేస్తుంది.
జవాబు:
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.