Telangana SCERT 9th Class Telugu Grammar Telangana వ్యాసాలు Questions and Answers.
TS 9th Class Telugu Grammar వ్యాసాలు
1. వాతావరణ కాలుష్యం
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.
వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. ‘మోటారు వాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.
వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.
వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తనఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేశాయి. వాటిని మనం విధిగా పాటించాలి.
2. బాలకార్మికులు
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.
భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.
మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.
బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3. కరవు నివారణోపాయాలు
అనావృష్టి వల్ల కరవు వస్తుంది. వరుసగా కొన్నేండ్లు కరువు వస్తే క్షామం ఏర్పడుతంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.
ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు ౬తిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.
వారణోపాయాలు :
- కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
- క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
- ఆయా ప్రాంతాల అవి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలిచ్చాలి.
- పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
- తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
- వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.
కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.
4. పర్యావరణ సంరక్షణ
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.
ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి.: జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.
జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.
ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.
యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.
5. విద్యార్థులు – క్రమశిక్షణ
విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగిఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.
అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది ? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని
కారణాలు :
- కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
- రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
- విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
- ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడం.
- తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.
ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టీ.వీ ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థులపై “స్లోపాయిజన్” లా పనిచేస్తున్నాయి.
విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా –
- విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంభించాలి.
- విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
- ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
- రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
- విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
- విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.
క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
6. దూరదర్శన్
విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజన్ ను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బైర్డ్ 1928లో కనిపెట్టాడు.
టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. టీ.వీ.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టీ.వీ.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్యసంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్, విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టీ.వీ. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.
విదేశీ ఛానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యామోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పిల్లలపై టీ.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది.
కాబట్టి టెలివిజన్ని మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానల్స్ను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగిఉండాలి. అప్పుడే టీ.వీ. వల్ల సత్ప్రయోజనాలుంటాయి.
7. గ్రంథాలయాలు
“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి ఉన్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.
అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు; నాళం కృష్ణారావు మొదలైనవాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.
ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’,’ ‘’బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.
గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.
గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :
- గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
- మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
- దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
- గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
- గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.
గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.
8. కంప్యూటర్
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.
కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.
కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు.
పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్ నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.
అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.
9. జాతీయ సమైక్యత
ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారతజాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్కటైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.
మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశౌన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే త్రాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.
కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.
మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యతవల్ల దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారతజాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.
10. మతసామరస్యం
భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి.
ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.
- హిందూమతం,
- ముస్లింమతం,
- క్రైస్తవమతం,
- బౌద్ధమతం,
- జైనమతం,
- సిక్కుమతం,
- పార్సీ, .
యూదుమతం. భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి :
- ప్రజలలో స్వార్థబుద్ధి,
- మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన,
- ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.
మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీమసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది.
భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధనకోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.
ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగిఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.
11. జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ)
జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.
“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”
అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం
- సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం.
- ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు.
- చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం.
- నిరక్షరాస్యత.
- మత విశ్వాసాలు.
ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్ఠమైన ప్రణాళికా విధానం రూపొందించింది.
జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :
- ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
- జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
- స్త్రీల కంటె పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక అని చెప్పాలి.
- కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
- ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
- కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.
అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి
- జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
- విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
- దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది.
- “అందరికీ ఆరోగ్యం” అనేది సాధ్యం కానేరదు.
- సంతానం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
- జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.
అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.
12. విజ్ఞానయాత్రలు
విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేకస్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞాసమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.
పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది.
ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.
విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు –
- లోకజ్ఞానం అలవడుతుంది.
- మానసిక విశ్రాంతి లభిస్తుంది.
- విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు.
- పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది.
- స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది.
- జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి.
- కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి –
- ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి.
- చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్మినార్ మొదలగునవి.
- శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి.
- మత సంబంధమైనవి-కాశీ, మక్కా, వాటికన్, తిరుపతి మొదలగునవి.
ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్ధవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.
విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులతో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థ మండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.
13. విద్యార్థులు – సంఘసేవ
విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనటంలో సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళూ సంఘజీవులే. సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండానే సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.
“చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష” అని స్వార్థంగా జీవించటం సంఘజీవి లక్షణం కాదు. గురజాడ అన్నట్టు
“సొంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్”
అన్న భావనైనా కనీసం ఉండాలి. ఇతరులకి మనం తోడ్పడితే ఇతరులు మనకి తోడ్పడతారు. అదే సంఘీభావం అంటే. సంఘసేవ ఎలా చెయ్యాలి ? ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది ? విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి ? అంటే-
- ప్రమాదాల బారినుండి కాపాడటం,
- వృద్ధులకి, అంగవికలురకి చేయూతనివ్వటం,
- ఆపదలో ఉన్నవారికి సహకారమందించటం,
- విద్యాదానం చేయటం,
- మురికివాడల్ని పరిశుభ్రం చెయ్యటం మొదలగునవి.
ఇవి ఏ విద్యార్థి అయినా చేయదగిన కనీస కార్యక్రమాలు. సంఘసేవకి పదవులు అక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. సేవాతత్పరత ఉంటే చాలు. మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తికోసం, ప్రచారం కోసం సేవచేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది.
విద్యార్థులు అటువంటివారు కారు. నిజంగా తలచుకుంటే విద్యార్థులు చేయలేనిది ఏమీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం (National Service Scheme – NSS) విద్యాలయాలలో ప్రవేశపెట్టారు.
ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘసేవ చేస్తున్నారు. హైస్కూల్సులో ఎన్సిసి, స్కౌట్స్లో కూడా చేరి సంఘసేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశసేవకులనిపించుకొనే నాయకులు చేయని, చేయలేని పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం.
విద్యార్థులు ఈ విధంగా సంఘసేవ చెయ్యటంలో వారికొక ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకొనే సువర్ణావకాశం సంఘసేవ. కార్యదీక్షా దక్షతలు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘసేవా కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.
14. నిరుద్యోగ సమస్య
ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ఉద్యోగాలు చేయగలవారందరికీ ఉద్యోగాలు చూపించలేకపోవడాన్నే నిరుద్యోగ సమస్య అంటారు. పూర్వకాలంలో అందరూ కులవృత్తులకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ నేడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాకుట వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది.
మనకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. వాటిలో చదివి ఉత్తీర్ణులైన అందరికీ ఉద్యోగాలు చూపించడం ఒక చిక్కు సమస్యగా తయారైంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు చదువులపై నిరాశానిస్పృహలు కలుగుతున్నాయి. అటు కులవృత్తి చేయలేక, ఇటు ఉద్యోగం లభింపక ఉభయభ్రష్టులవుతున్నారు.
నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. వృత్తి విద్యల కెక్కువ ప్రోత్సాహమివ్వాలి. ఇంటికొక ఉద్యోగమిచ్చే పథకం ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు విరివిగా స్థాపించాలి. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించాలి.
యువతీయువకులు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా, ధైర్యంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించడం అలవరచుకోవాలి.