Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 3rd Lesson కాళోజి Questions and Answers.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడున్నా స్వాగతించాడు.
అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు
తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు.
తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు.
ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోనుండి ఎదిగిన ఆ మహనీయుడే – కాళోజి
PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.
కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.
కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.
ప్రశ్న 2.
కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
జవాబు:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.
కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.
ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.
రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.
రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.
ప్రశ్న 3.
కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.
ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపూటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమైకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించాడు.
రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.
“మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండాలధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”
కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.
ప్రశ్న 4.
కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
జవాబు:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.
కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.
వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.
తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.
ప్రశ్న 5.
కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.
కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచి కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.
ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్య వాధిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాల్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.
PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)
1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.
సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. ‘నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
జవాబు:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ‘కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.
ప్రశ్న 2.
కాళోజి ఎటువంటి కవి ?
జవాబు:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.
ప్రశ్న 3.
కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.
ప్రశ్న 4.
కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
జవాబు:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.
ప్రశ్న 5.
‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
జవాబు:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.
2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరి మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రశ్న 2.
తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
జవాబు:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.
ప్రశ్న 3.
‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
జవాబు:
`ఫేస్ పౌడర్ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.
ప్రశ్న 4.
కాళోజి ఎట్లా రాణించాడు ?
జవాబు:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.
ప్రశ్న 5.
కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
జవాబు:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.