Telangana SCERT 9th Class Telugu Guide Telangana 8th Lesson ఉద్యమ స్ఫూర్తి Textbook Questions and Answers.
TS 9th Class Telugu 8th Lesson Questions and Answers Telangana ఉద్యమ స్ఫూర్తి
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 81)
గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉన్నది. కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారతజాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవటం, చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కాని గాంధీ అహింసామార్గంలో ముందుకు సాగుతున్నారు.
సబర్మతి ఆశ్రమం నుండి దండియాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులున్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కాని, మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండియాత్ర 24 రోజులు సాగింది. దారి పొడువున నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగతసుమాలను వేదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్రతీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరిని ఏకం చేసి, స్వాతంత్ర్యోద్యమాన్ని వాహినిలా నడిపి, బ్రిటిష్ వారిని ఎదిరించారు.
ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు ?
జవాబు:
గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకూ ఏకైక మార్గదర్శకుడు అయ్యాడు. అందువల్లనే, ప్రజలు గాంధీజీని ఆరాధించారు.
ప్రశ్న 2.
నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు ?
జవాబు:
గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి, ఉప్పు సత్యాగ్రహానికి దండియాత్ర ప్రారంభించారు. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసామార్గంలో ప్రజలందరినీ ఏకంచేసి, సైన్యంలా నడిపించారు. అందువల్ల నాయకులు, గాంధీజీని అనుసరించారు.
ప్రశ్న 3.
గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించాడు ?
జవాబు:
బ్రిటిష్వారి వద్ద అంతులేని సైన్యం ఉంది. వారివద్ద తుపాకులూ, ఫిరంగులూ ఉన్నాయి. హింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కష్టం. హింసా పద్ధతిలో వెడితే, ఎందరో దేశభక్తులు, ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. శాంతియుతంగా ఉద్యమాన్ని ఎక్కువకాలము నడుపవచ్చు. బ్రిటిష్ వారిని లొంగదీయవచ్చు. వారి సానుభూతి సంపాదించవచ్చు. అందుకే, గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించారు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 84)
ప్రశ్న 1.
“తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం” అంటే ఏమిటి?
జవాబు:
ఈ రోజుల్లో మనుష్యులు, దేశంలో, రాష్ట్రంలో లేక తమ గ్రామంలో ఏమి జరిగినా, పట్టించుకోడం మానివేశారు. ఏ సంఘటన జరిగినా, అది తమకూ తమ వారికీ సంబంధించినవి కాకపోతే, వాటిని వారు పట్టించుకోడం మానివేశారు. ఆ సంఘటన ప్రభావం, తమపై పడినప్పుడే, మనుష్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ తమచుట్టూ గిరిగీసుకొని, తనకూ తమవారికీ వారు పరిమితమవుతున్నారని అర్థం.
ప్రశ్న 2.
విప్లవసంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తోచినాయి ?
జవాబు:
ఆనాడు విప్లవకారులు, చిత్రవిచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. అందులో ఇంద్రపాల్ అనే అతడు, మిత్రుల ప్రోద్బలంతో సన్యాసి వేషంలో వెళ్ళి, వైస్రాయి మీద బాంబు పేల్చాడు. ఈ విధమైన వారి చర్యలు, అహింసావాదులయిన దేశభక్తులకు, అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ తోచాయి.
ప్రశ్న 3.
సుఖదేవ్, భగత్సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు?
జవాబు:
సుఖదేవ్, భగత్సింగ్లు విప్లవ సంఘంలోని సభ్యులు. విప్లవసంఘం వారు కూడా దేశభక్తులే. వారి ఉద్యమం కూడా స్వాతంత్ర్య సిద్ధి కోసమే. కాని అహింసావాదుల విధానాలు, విప్లవసంఘంవారి విధానాలు వేరు వేరుగా ఉండేవి. విధానాలు వేరైనా సుఖదేవ్, భగత్సింగులు, దేశభక్తులైనందువల్ల, వారికి ఉరిశిక్ష పడుతుందని తెలిసి, దేశంలో ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 85)
ప్రశ్న 1.
బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం జరిగిన పరిస్థితులను మీరు ఎట్లా అర్థం చేసుకొన్నారు ?
జవాబు:
ప్రజల్లో ముఖ్యంగా సత్యాగ్రహులు, విదేశ వస్త్రాలను ఎలాగైనా బహిష్కరించాలనే పట్టుదలతో ఉండేవారు. అందుకే వారు విదేశ వస్త్రాలు అమ్ముతానన్న వ్యాపారిని అమ్మవద్దని బ్రతిమాలారు. మరో యువకుడు విదేశ వస్త్రాలను తీసుకువెళ్ళే వ్యాపారి కారుకు అడ్డంగా పడుకొని, తన ప్రాణాలు విడిచాడు. దీనిని బట్టి సత్యాగ్రహులు ఈ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించారు.
ప్రభుత్వం అండదండలు ఉన్న కొంతమంది వ్యాపారులు మాత్రం, సత్యాగ్రహుల ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి విదేశ వస్త్రాలు అమ్మేవారు.
ప్రశ్న 2.
బ్రిటిషువారి హృదయాలు కర్కశమైనవని సంగెం లక్ష్మీబాయి ఎందుకన్నది?
జవాబు:
- మూర్షాబాద్ జైలులో మణిలాల్సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు, 60 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
- జైలులో రాజకీయ ఖైదీలకు కల్తీ సరకులు ఇచ్చినంత కాలం, తాను తిండి తిననని మణిలాల్సేన్ నిరసన వ్రతం చేశాడు. ఈ విధంగా 60 రోజులు ఆ బాలుడు నిరసన వత్రం చేసినా, ఏ బ్రిటిష్ పాలకుడూ, అతడిని పట్టించుకోలేదు.
- అలాగే స్వాతంత్ర్యం కోసం, ఎందరో వీరులు ఆనాడు మరణించారు. అయినా బ్రిటిష్ పాలకుల మనస్సులు కరుగలేదు. అందుకే సంగెం లక్ష్మీబాయి, బ్రిటిష్వారి హృదయాలు కర్కశమైనవని అన్నది.
ప్రశ్న 3.
సమాజం వ్యాధిగ్రస్తమై పోయిందంటే, అర్థమేమిటి ?
జవాబు:
సమాజం వ్యాధిగ్రస్తమైందంటే, సమాజంలో స్వార్థము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, దేశద్రోహం, దేశభక్తి లేకపోడం, పదవీలాలస, ధన సంపాదనపై కోరిక వంటి దుర్గుణాలు పెరిగాయని అర్థము. ఆ దుర్గుణాలనే రోగాలు, సమాజంలో వ్యాపించాయని అర్థం.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 86)
ప్రశ్న 1.
ప్రకృతికీ, ప్రాణికీ నడుమ గల అనుబంధం ఏమిటి?
జవాబు:
ప్రకృతికీ, ప్రాణీకీ గొప్ప అనుబంధం ఉంది. మన భారతీయులు పాములనూ, వృక్షాలనూ పూజించేవారు.
నేడు కూడా పూజిస్తున్నారు. పాము, కాలగమ్యాలకు సంకేతము. రావిచెట్టు, సృష్టిస్థితిలయములకు సూచకము. ఆటలాడేటప్పుడు పిల్లలకు బట్టలు తక్కువగా తొడిగితే వారిపై సూర్యకాంతి పడుతుంది. పిల్లలు మట్టి తినకుండా, మట్టిలో ఆడుతుంటే, వారికి నరాల పుష్టి కలుగుతుంది. ఈ విధంగా ప్రాణికీ, ప్రకృతికీ సంబంధం ఉంది.
ప్రశ్న 2.
మన పెద్దల చాకచక్యం ఏమిటి?
జవాబు:
మన పెద్దలు ప్రకృతికీ, ప్రాణికీ గల అనుబంధాన్ని విప్పి చెప్పారు. ఆరోగ్య సూత్రాలనూ, ఆధ్యాత్మిక భావనలనూ, మానవుడి నిత్యజీవితంలో గుప్పించి, వదిలేశారు. మన `పెద్దలు, ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ లేకుండా, ఆరోగ్య సూత్రాలను ఎంతో చాకచక్యంతో వారు మనకు తెలియచెప్పారు.
ప్రశ్న 3.
“బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్య పాలనకూ కూడా మనకు స్వతంత్రం లభించింది” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
స్వాతంత్ర్యం మనకు కొన్ని హక్కులను తెచ్చిపెట్టింది. ఆ హక్కులతోపాటు, మనము బాధ్యతతో ప్రవర్తించాలి. అలాగే మన కర్తవ్యాన్ని మనం చక్కగా నెరవేర్చాలి. స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు తిరగడం,కాదు. మనం హక్కులను పొందినట్లే, మనపై బాధ్యత, కర్తవ్యం కూడా ఉంటాయని నా అభిప్రాయం.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
ఆనాటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటివారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, సమాజ సేవకు అంకితమైనారు కదా! ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటి ? ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం ఉందా? ఎందుకు ? మాట్లాడండి.
జవాబు:
సుమారు రెండు వందల సంవత్సరాలపాటు మనదేశం బ్రిటిష్వారి పాలన కింద బానిస దేశంగా ఉండిపోయింది. ఆ రోజుల్లో గాంధీజీ, నెహ్రూ, తిలక్ వంటి నాయకుల నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం ప్రజలు పోరాటం చేశారు. అప్పుడు సంగెం లక్ష్మీబాయి వంటి స్త్రీలు సహితం గాంధీజీ పిలుపును అందుకుని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ‘ వారు సత్యాగ్రహాలు, ధర్నాలు, పికెటింగులు చేశారు. వారు సమాజసేవకు నడుం కట్టారు. ఆ త్యాగమూర్తుల కృషివల్లనే నేడు మనం హాయిగా స్వాతంత్య్ర వాయువులను పీలుస్తున్నాము. నేడు మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాము.
నేడు కూడా లక్ష్మీబాయి, దుర్గాబాయమ్మ వంటి త్యాగమూర్తుల సేవలు మన దేశానికి అవసరము. స్వాతంత్ర్యం సిద్ధించాక మనదేశంలోని ప్రజలలో నిర్లిప్తత పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. సంఘంలో ఎటువంటి పరిణామాలు వచ్చినా, ప్రజలు తమకు ఎందుకని స్పందించడం లేదు. ప్రజలు కర్తవ్యాన్ని మరచి, బాధ్యత లేకుండా ఉంటున్నారు.
ఆ నిర్లిప్తత పోవాలి.. దేశాభ్యున్నతి కోసం, సంఘం కోసం దేశ పౌరులంతా ముందుకు రావాలి. అందుకే లక్ష్మీబాయి వంటి త్యాగమూర్తుల సేవలు నేడు కూడా అవసరము.
ప్రశ్న 2.
పాఠం చదివి కింది పేరాలకు శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని కీలక పదాలు రాయండి.
జవాబు:
ప్రశ్న 3.
మాసుమా బేగం గురించిన కింది పేరా చదువండి. సందర్భాన్ని బట్టి, ఖాళీలను సరైన పదాలతో పూరించండి.
“మాసుమాబేగం హైదరాబాదులో 1 ఆమె ప్రముఖ సంఘ 2 నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ. అంజుమన్ – ఎ – ఖవాతీన్ ను స్థాపించి, బీద పిల్లల కోసం హైదరాబాదు నగరంలో ఏడు పాఠశాలలు 3 హైదరాబాదు నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ మాసుమాబేగం. ఈమె చేసే పనుల్లో, సేవా కార్యక్రమాలలో ఆమె భర్త ప్రొఫెసర్ హాసిమాన్ అలీఖాన్ కూడా ఎంతో 4 ఈమె చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ బిరుదుతో 5 .
జవాబు:
1) జన్మించింది
2) సేవకురాలు
3) నెలకొల్పింది
4) తోడ్పడ్డాడు
5) సత్కరించింది
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి, ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) స్వాతంత్ర్యం లభించినప్పటికీ, అది సంతోషం కలిగించటం లేదని సంగెం లక్ష్మీబాయి ఎందుకు భావించింది?
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమాజం వ్యాధిగ్రస్తమైపోయింది. అందుకు కారణం, సమాజంలోని వ్యక్తులు. అంతేకాని స్వాతంత్ర్య సిద్ధి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాజకీయ నాయకులలో స్వార్ధము, పదవీ లాలస, అక్రమ ధన సంపాదన, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి.
ప్రజలలో సాంఘిక నిర్లిప్తత పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, మనకెందుకులే అనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజలు తామూ, తమ బ్రతుకూ వరకు పరిధుల్ని పరిమితం చేసుకుంటున్నారు. దేశం కోసం, తోటిప్రజల కోసం సేవచేయడం, త్యాగం చెయ్యడం అనే గుణాలు తగ్గిపోయాయి.
అందువల్లనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అది తనకు సంతోషం కల్గించటం లేదని సంగెం లక్ష్మీబాయి భావించింది.
ఆ) గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
స్వాతంత్ర్య సాధనకు గాంధీజీ సత్యము, అహింస, సహాయ నిరాకరణము అనే వాటినే అస్త్రాలుగా స్వీకరించి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించాడు. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, స్వాతంత్య్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది.
బ్రిటిష్వారి వద్ద గొప్ప సైన్య సంపద ఉండేది. వారికి తుపాకీలు, విమానాలు, ఫిరంగులు ఉన్నాయి. గాంధీజీ హింసా మార్గాన్ని ఎన్నుకుంటే, బ్రిటిష్ వారు ఆ ఉద్యమాన్ని మిలటరీ సాయంతో అణచివేసి యుండేవారు. గాంధీ హింసా పద్ధతిలో పోరాడితే పెక్కుమంది ఉద్యమకారులు తమ ప్రాణాలు పోగొట్టుకొని యుండేవారు. ఎక్కువ మంది సత్యాగ్రహులు మరణిస్తే, ఉద్యమంలోకి ప్రజలు ఎక్కువగా వచ్చియుండేవారు కారు. ఆ విధంగా స్వాతంత్ర్య పోరాటం నీరసించి యుండేది.
అలాకాక, అహింసా పద్ధతిలో ఉద్యమం సాగడం వల్ల, ఉద్యమంపట్ల ప్రజలకూ, ప్రభుత్వానికీ, పాలకులకూ, సానుభూతి కలిగింది. కనుక అహింసామార్గం స్వాతంత్ర్య సాధనలో కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు.
ఇ) బ్రిటిష్ వారి చేతుల్లోకి మనదేశ పాలన పోవుటకు గల కారణాలు వివరించండి.
జవాబు:
బ్రిటిష్వారు మొదట మనదేశానికి వర్తకం చేసుకోడానికి వచ్చారు. వర్తకం చేసుకోడానికి స్వదేశరాజుల అనుమతులు సంపాదించారు. స్వదేశరాజుల మధ్య తగవులు పెంచి, వారిలో తాము ఒకరి పక్షాన్ని వహించి, రెండవ వారిని దెబ్బతీసారు. తరువాత తాము సమర్థించిన రాజునూ దెబ్బతీశారు. స్వదేశరాజులకు మిలటరీ సాయం చేస్తామని చెప్పి, వారి నుండి కొన్ని రాజ్య భాగాలు సంపాదించారు.
క్రమంగా స్వదేశరాజులు దత్తత చేసుకోరాదని వారి రాజ్యాన్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని కుట్రలతో స్వాధీన పరచుకున్నారు. ఈ విధంగా వర్తక నెపంతో మనదేశానికి వచ్చి బ్రిటిష్వారు క్రమంగా మనదేశాన్నీ, మనదేశ సంపదనూ, కబళించి వేశారు.
ఈ) సంగెం లక్ష్మీబాయి రచనా విధానం ఎట్లా ఉన్నది?
జవాబు:
సంగెం లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. సుప్రసిద్ధ దేశభక్తురాలు. ఈమె రచనా శైలి సంస్కృతాంధ్రపద సమ్మేళనంతో అనుప్రాసలతో అద్భుతంగా ఉంది. ఆమె రచనలో దేశభక్తి, బ్రిటిష్ వారిపై ద్వేషం అడుగడుగునా తొంగిచూస్తున్నాయి.
ఆనాడు దేశప్రజలు సంతోషంగా ఉరికంబాలెక్కారని ప్రజల దేశభక్తిని ఈమె ప్రశంసించింది. రచనలో మంచి పదబంధాలు ప్రయోగించింది. “ఉడుకు నెత్తురు ప్రవహించేలా”, “వీరావేశంతో జేజేలు కొట్టు” – “బాలుడి మరణం తల్లికీ, స్వదేశీయులకూ రంపపు కోత” – “వంటి మాటలు రాసింది. బ్రిటిష్ వారివి, కర్కశ హృదయాలన్నది. వారు పచ్చి నెత్తురు త్రాగే కిరాతకులన్నది. మన స్వదేశరాజులు దేశాన్ని బ్రిటిష్ వార్కి ధారాదత్తం చేశారని బాధపడింది.
ప్రపంచం. మారినా, మన భారతీయులు ఇంకా అజ్ఞానంలో మ్రగ్గుతున్నారనీ, కరవు కాటకాలు మారెమ్మలా ఊళ్ళమీద పడి ఊడ్చేశాయనీ, మంచి అనుప్రాసలతో ఈమె రచన సాగింది.
మన ప్రాచ్యదేశం అంతా అప్రాచ్యమని, పాశ్చాత్యులు నాగరికత కలవారని భారతీయులను తక్కువ చూపు చూసిన బ్రిటిష్ వారిని, ఈమె పరాన్న భుక్కులని ఎగతాళి చేసింది.
మనకు స్వాతంత్ర్యం, మన హక్కుల సంరక్షణకేకాక, బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్యపాలనకూ లభించిందని మనకు ఈమె గుర్తు చేసింది. లక్ష్మీబాయి రచనాశైలి ప్రభావవంతమైనది. చురుకైనది. పదబంధాలతో, తెలుగు నుడికారంతో సుందరంగా ఉంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) స్వాతంత్ర్య సమరయోధులు కన్నకలలు నిజం కావాలంటే మనకు లభించిన స్వాతంత్య్రాన్ని ఎట్లా సద్వినియో గించుకోవాలో విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
మన భారతదేశ ప్రజలు కేవలం తమ హక్కులను రక్షించుకోడమే కాదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. భారతదేశ ప్రజలు పాటించవలసిన విధులనూ, కర్తవ్యాన్నీ, నిర్దుష్టంగా నెరవేర్చాలి. భారత ప్రజలలో సమాజంపట్ల నిర్లిప్తత పనికి రాదు.
మనది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మంచి శీలవంతమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి. అవినీతిపరులైన లంచగొండులైన వారిని దూరంగా తరిమికొట్టాలి. ప్రతివ్యక్తి సంఘంలో జరిగే చెడ్డను ఎదిరించి పోరాడాలి. లంచగొండితనాన్ని రూపుమాపాలి.
“మన దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమించి పనిచేయాలి. సోమరితనం కూడదు. దేశాభివృద్ధికి ప్రతివ్యక్తి తన వంతుగా కష్టించి పనిచేయాలి. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొని, దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. యువత శ్రద్ధగా చదువుకోవాలి. వృద్ధులను గౌరవించాలి. దేశభక్తి కలిగియుండాలి. దేశసంపదను కొల్లగొట్టే నీచులను తరిమికొట్టాలి.
ప్రతి భారతీయుడు పై విధంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, స్వాతంత్య్ర సమరయోధుల కలలు ఫలిస్తాయి.
3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.
అ) నేటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటి వారు ఎందుకు అవసరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సంగెం లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర్య సమరయోధుల అవసరం
సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయి, వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాండ్రు ఆనాడు గాంధీ మహాత్ముని అడుగుజాడలలో నడచి, అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. కారాగారాలలో నిర్బంధింపబడ్డారు. లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలు. సాంఘిక సేవా పరాయణురాలు.
దుర్గాబాయి ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసింది. వరలక్ష్మమ్మగారు, లక్ష్మీబాయిగారు ఎందరినో కార్యకర్తలను తయారుచేశారు. వినోబాభావే భూదానోద్యమ యాత్రలో లక్ష్మీబాయి పాల్గొంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేయడంలో వీరు ప్రముఖపాత్ర వహించారు.
ఇటువంటి మహిళామణుల ఆవశ్యకత స్వతంత్ర భారతంలో ఎంతగానో ఉంది. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు, స్త్రీలపై జరిగే అత్యాచారాల నిరోధానికి, పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు జరగాలి.
స్వచ్ఛభారత్, బాలకార్మికుల నిరోధం, అవినీతి నిర్మూలనం, స్త్రీ విద్యాభివృద్ధి, స్త్రీలకు పురుషులతో సమానహక్కుల సాధన వంటి రంగాల్లో లక్ష్మీబాయి వంటి త్యాగధనులయిన మహిళామణుల సేవలు ఎంతో అవసరం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మహనీయులయిన దేశభక్తురాండ్ర అడుగుజాడల్లో నడిస్తే, మన భారతదేశం సస్యశ్యామలమై, రామరాజ్యమై వర్ధిల్లుతుంది.
III. భాషాంశాలు
పదజాలం
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) మనం మంచి చేస్తే, మనకూ మంచి జరుగుతుందని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను.
జవాబు:
స్వానుభవము = తన అనుభవము
వాక్యప్రయోగం : స్వానుభవమును మించిన గుణపాఠము, వేరే ఉండదని నా నమ్మకము.
ఆ) తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు.
జవాబు:
పరితపిస్తూ = బాధపడుతూ
వాక్యప్రయోగం : జీవితమంతా బాధలతో పరితపిస్తూ బ్రతికే పేదవారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి.
ఇ) బ్రిటిష్ వారు మనదేశ సంపదను కొల్లగొట్టి తీసుకొని పోయారు. ‘
జవాబు:
కొల్లగొట్టి = దోచుకొని
వాక్యప్రయోగం : దొంగలు ప్రజల సొమ్ములను కొల్లగొట్టి తీసుకుపోతారు.
2. కింది వికృతి పదాలకు ప్రకృతులను పాఠంలో వెతికి రాయండి.
ప్రకృతి – వికృతి
అ) గారవం – గౌరవం
ఆ) కత – కథ
ఇ) జీతం – జీవితము
ఈ) కఱకు – కర్కశము
వ్యాకరణాంశాలు
1. కింది పదాలను పరిశీలించి, అవి ఏ ఏ సంధులో గుర్తించి, పదాలను విడదీసి, సంధి సూత్రం రాయండి.
అ) మనకెందుకు = ………………………..
జవాబు:
మనకున్ + ఎందుకు – ఉకారవికల్ప సంధి
సూత్రము : ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణములందున్న ఉకారానికి సంధి వైకల్పికముగానగు.
ఆ) విషాదాంతము = …………………………..
జవాబు:
విషాద + అంతము – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘము ఏకాదేశంబగు.
ఇ) మేమెంత = …………………………..
జవాబు:
మేము + ఎంత – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఈ) ఎవరికున్నాయి = …………………………………
జవాబు:
ఎవరికిన్ + ఉన్నాయి – ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల ఇకారమునకు సంధి వైకల్పికముగానగు.
ఉ) విచిత్రమైన = …………………………………
జవాబు:
విచిత్రము + ఐన – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
2. కింది సమాస పదాలను పరిశీలించి, వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
అ) మాతృదేశం = ……………………………..
జవాబు:
తల్లి యొక్క దేశం – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) కర్కశహృదయం = …………………………….
జవాబు:
కర్కశమైన హృదయము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) సహాయనిరాకరణ = ……………………….
జవాబు:
సహాయమును నిరాకరించడం – ద్వితీయా తత్పురుష సమసం
ఈ) విప్లవసంఘం = ……………………………
జవాబు:
విప్లవకారుల యొక్క సంఘం – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) అశ్వత్థవృక్షం = …………………………..
జవాబు:
‘అశ్వత్థము’ అనే పేరుగల వృక్షము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఊ) శాస్త్రదృష్టి = ……………………………..
జవాబు:
శాస్త్రము యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
యణాదేశ సంధి
* కింది పదాలను విడదీయండి. విడదీసిన పదాలను కలిపి, కలిగిన మార్పులను గమనించండి.
ఉదా :
గమనిక : పై మూడు రకాల ఉదాహరణల ద్వారా కింది అంశాలను గమనింపవచ్చు. ఇ, ఉ, ఋ లకు అసవర్ణములు కలిస్తే ఇ, ఉ, ఋ లకు ఆదేశంగా య్, వ్, ర్ లు అంటే, య, వ, ర, లు వస్తాయి. య, వ, ర, ల, లను ‘యణులు’ అని పిలుస్తారు. ‘యణులు’ ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇలా ఏర్పడిన సంధిని “యణాదేశ సంధి” అంటారు.
ఇ, ఉ, ఋ లకు, అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు, ‘యణులు’ ఆదేశంగా వస్తాయి.
అసవర్ణములు : అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు.
ఉదా : ‘ఇ’ కి, ఇ, ఈ లు కాకుండా, మిగిలిన (అ, ఆ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ; ఒ, ఓ, ఔ) అచ్చులు అసవర్ణాచ్చులు.
అభ్యాసము : కింద ఇచ్చిన పదాలను విడదీసి, యణాదేశ సంధి అవునో కాదో పరిశీలించండి.
అ) అభ్యుదయం = …………………………
జవాబు:
అభి + ఉదయం = యణాదేశ సంధి
వివరణ : ‘అభి’ అనే పదంలో చివర ‘ఇ’ ఉంది. దానికి ‘ఉ’ అనే అసవర్ణాచ్చు పరమైంది కాన యణాదేశం వచ్చి, అభ్యుదయం అయ్యింది.
ఆ) గుర్వాజ్ఞ = ………………………
జవాబు:
గురు + ఆజ్ఞ = యణాదేశ సంధి
వివరణ : ‘గురు’ అనే పదంలో చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమై యణాదేశ సంధిలో ‘వ్’ వచ్చింది.
ఇ) మాత్రంశ = ………………………
జవాబు:
మాతృ + అంశ = యణాదేశ సంధి
వివరణ : ‘మాతృ’ అనే పదంలో చివర ‘ఋ’ ఉంది. దానికి ‘అ’ అనే అసవర్ణాచ్చు పరమయ్యింది. యణాదేశంగా ‘ర్’ వచ్చింది.
ఈ) మధ్వరి = ………………………………
జవాబు:
మధు + అరి = యణాదేశ సంధి
వివరణ : ‘మధు’ అనే పదంలో చివర ‘ఉ’ ఉంది. దానికి అసవర్ణమైన అచ్చు ‘అ’ పరమై యణాదేశంగా ‘వ్’ వచ్చింది.
ఉ) స్వాగతం = …………………………….
జవాబు:
సు + ఆగతం = యణాదేశ సంధి
వివరణ : ‘సు’ అనే పదంలో, చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమైంది. యణాదేశంగా ‘ప్’ వచ్చింది.
ఊ) మీ పాఠ్యపుస్తకంలో యణాదేశ సంధికి సంబంధించిన పది పదాలు వెతికి రాయండి.
జవాబు:
యణాదేశ సంధులు:
- ప్రత్యర్థులు = (ప్రతి + అర్థులు) – (నేనెరిగిన బూర్గుల – 2వ పాఠం)
- అధ్యయనం = (అధి + అయనం) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
- ప్రత్యేకమైన = (ప్రతి + ఏకమైన) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
- ప్రత్యేక తెలంగాణ = (ప్రతి + ఏక) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
- ప్రత్యేకమైన శిక్షణ = (ప్రతి + ఏకమైన) – (దీక్షకు సిద్ధంకండి – 6వ పాఠం)
- అత్యాచారము = (అతి + ఆచారము) – (ఉద్యమ స్ఫూర్తి – 8వ పాఠం)
- అభ్యుదయం = (అభి + ఉదయం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
- అధ్యయనం = (అధి + అయనం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
- స్మృత్యర్థం = (స్మృతి + అర్థం) – (తీయని పలకరింపు – 12వ పాఠం)
ప్రాజెక్టు పని
స్వాతంత్ర్య పోరాటంలో (లేదా) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు, ముగ్గురు మహిళల వివరాలు సేకరించి, నివేదిక రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
కఠిన పదములకు – అర్థములు
I.
(83వ పేజి)
అర్థాలు :
నిర్లిప్తత = దేనినీ పట్టించుకోకపోడం
కాఠిన్యము = కఠినత్వము(కర్కశత్వము)
పరిధుల్ని = చుట్టుగోడలను (కంచెలను)
పరిమితంచేసికోవటం = కొలతపెట్టుకోడం ;
గడ్డ = నేల;
విభ్రాంతి = భ్రాంతి లేక భ్రమ
గాథలు = కథలు
సమర సంరంభం = యుద్ధ ఉత్సాహము
జీవితాహుతులకు (జీవిత + ఆహుతులకు) = ప్రాణాలను సమర్పించి నందులకు;
కడలినై = సముద్రమునై
ఘోషించాను = మ్రోతపెట్టాను (అఱచాను)
మాతృదేశ శృంఖలాలను = తల్లిదేశపు సంకెళ్ళను
వీరవాహిని = వీర సైన్యము
అలగా = కెరటంగా
స్వానుభవం (స్వ + అనుభవం) = స్వంత అనుభవం
నిర్లిప్తత = పట్టించుకోకపోడం
నిర్వీర్యత = పౌరుషం లేకపోవడం
సహాయనిరాకరణం = సహాయం చేయడానికి అంగీకరించకపోడం
పోరాటానికి = యుద్ధానికి ;
ప్రతీకారవాంఛ = ఎదురు దెబ్బతీయాలనే కోరిక ;
అహింసావాదులము = హింస పనికిరాదని చెప్పేవారము
తల్లడిల్లిపోవు = భయపడి కంపించిపోవు
అప్రూవరు (Approver) = ప్రభుత్వం తరఫున సాక్షి
ప్రోద్బలం = పెద్దబలము ; (ప్రేరణ)
శతవిధాల = వంద విధాలుగా (అనేక విధాలుగా)
విఫలులైనారు = ప్రయత్నం ఫలించని వారు అయ్యారు.
నిర్జన ప్రదేశానికి = మనుష్యులు లేని చోటుకు ;
నమోదు అవడం = చేరడం
84వ పేజీ
ఉప్పెనలా = తుపానులా ;
II.
చర్యలు = చేసే పనులు
విషాదాంతం (విషాద + అంతం) = చివరకు దుఃఖాన్ని తెచ్చేవి;
ఘోరమైన = భయంకరమైన
దారుణాలు = క్రూరకృత్యాలు
ప్రతినిత్యం = ప్రతిరోజు
బహిష్కరణోద్యమం (బహిష్కరణ + ఉద్యమం) = వెలివేయాలనే పోరాటం ;
సవాలుచేస్తూ = ఇది ఏమిటని నిలదీసి అడుగుతూ;
సత్యాగ్రహులు = సత్యాగ్రహ ఉద్యమకారులు
విరమించుకోమని = మానుకొమ్మని
ప్రాధేయపడ్డారు = బ్రతిమాలారు
హాస్పిటల్ (Hospital) = వైద్యశాల
స్తంభించిపోయారు = మొద్దుబారిపోయారు (స్తంభంలా బిగిసిపోయారు)
పరితపించిపోవు = మిక్కిలి బాధపడిపోవు
అండదండలు = సహాయములు;
విచ్చలవిడిగా (విడిగా + విడిగా) = ఇష్టం వచ్చినట్లుగా
దారుణానికి = క్రూరకృత్యానికి
గంధపుష్పాక్షతలు = గంధము, పుష్పములు, అక్షతలు ;
వీరావేశం (వీర + ఆవేశం) = పరాక్రమపు పొంగు
దుర్మరణానికి = అకాలమరణానికి
సానుభూతి = దుఃఖాన్ని వెల్లడించడం.
చెల్లాచెదరు = అటుఇటుపోవు
పికెటింగు (Piqueting) = పోలీసులను రానీకుండా అడ్డుకోడం
శ్రేణి = గుంపు
నిరసనవ్రతం = నిరాహారదీక్ష
అసువులు కోల్పోవు = ప్రాణాలు పోగొట్టుకొను;
పాలకుడు = పాలనాధికారి
గడగడలాడించింది = వణికించింది
కర్కశహృదయాల్ని = కఠినమైన మనసులను
రంపపు కోత = అంపముతో కోసినట్లు నొప్పి కలగడం ;
85వ పేజి
అత్యాచారాలు = అనుచిత ప్రవర్తనలు
ప్రబలిపోవు = ఎక్కువగు
అట్టుడికినట్లు ఉడకడం = ఒక విషయమై పెద్ద గగ్గోలు ఏర్పడం
కిరాతకులు = మ్లేచ్ఛ జాతీయులు
తోచేవారు = కనబడేవారు
అధోగతిపాలగు = కిందికి పతనమగు
నిట్టూర్చడం = నిట్టూర్పులు వదలడం
ధారాదత్తం చేయు = దానంగా ఇవ్వడం (వట్టినే ఇవ్వడం)
కొల్లగొట్టి = దోచుకొని
అనాగరికులు = నాగరికత లేనివారు
పరిగణిస్తూ = లెక్కిస్తూ
అడపాదడపా = అప్పుడప్పుడు
వసతులు = ఆనుకూల్యములు (సుఖములు)
అజ్ఞానంలో మ్రగ్గు = తెలివితక్కువలో అణిగి యుండు
కాటకములు = కరవులు,
మారెమ = అమ్మవారు ;
ఊడ్చేస్తూ ఉండడం = తుడిచిపెట్టేయడం
ఛాందసాచారాలు (ఛాందస + ఆచారాలు) = లోకజ్ఞానంలేని ఆచారాలు
ప్రవచిస్తూ ఉంటే = చెపుతూ ఉంటే
వ్యాధిగ్రస్తము = రోగంతో ఆక్రమింపబడినది
III.
186 వపేజీ
సుభిక్షం = మంచివర్షం పడి, పంట బాగా పండి ఆహారం, ఆరోగ్యం సమృద్ధిగా ఉండడం
అగ్ని రగులు = అగ్ని ప్రజ్వరిల్లు
గలకపోతే = ప్రజ్వరిల్లకపోతే
హారిబుల్ (Horrible) = భయంకరమైన, దారుణమైన
నిరు పేదలు = మిక్కిలి బీదవారు
పరిహసిస్తూ ఉంటే = వేళాకోళం చేస్తూ ఉంటే
లజ్జాకరంగా = సిగ్గుపుట్టేటట్లుగా
కాలగమ్యాలకు = కాలగమనమునకు (కాలం నడకకు)
సంకేతము = చిహ్నము, గుర్తు
అశ్వత్థ వృక్షం = రావి చెట్టు
ఉష్ణదేశం = వేడిదేశం
నరాలపుష్టి = నరాల బలము
నిపుణులు = నైపుణ్యం గల నేర్పరులు
అనుబంధం = సంబంధం
ఆధ్యాత్మిక భావనలు = పరమాత్మ సంబంధమైన ఆలోచనలు
దైనందిన జీవితం = నిత్యజీవితం
కుప్పించి = గుప్పించి ;
కాలహరణ = కాలం ఖర్చుకాకుండా
ప్రాచ్యము = తూర్పుదేశాల ప్రాంతం
అప్రాచ్యము = పాశ్చాత్యదేశాల ప్రాంతం
ప్రాచ్యులు = తూర్పుదేశస్థులు
పరాన్నభుక్కులు (పర + అన్నభుక్కులు) = ఇతరుల అన్నాన్ని తినేవారు
ఛాందసాచారాలు = లోకజ్ఞానం లేని ఆచారాలు
దిక్కుకానక = దిక్కు కనబడక
సంతోషాస్పదం (సంతోష + ఆస్పదం) = సంతోషం కల్గించేది
సంరక్షణార్థము = సంరక్షించుకోడం కోసం
బాధ్యతాయుత ప్రవర్తన = బాధ్యతతో కూడిన నడవడి
కర్తవ్యపాలన = చేయవలసిన పనిని చేయడం
స్ఫురణ = స్ఫూర్తి (ప్రేరణ)
కొరవడటమే = లోపించటమే
హేతువు = కారణము
స్వార్ధపరులు = తమ బాగును మాత్రమే కోరుకొనేవారు
సాంఘిక బాధ్యత = సంఘం ఎడల బాధ్యత
శోచనీయంగా = విచారింపవలసినదిగా
పాఠం ఉద్దేశం
నేనొక్కడిని బాగుంటే చాలు ఎవరు ఏమైతే నాకెందుకు ? అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్య్రానికి సార్థకత లభిస్తుందని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ‘ఆత్మకథ’ అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను, ఒక గ్రంథంగా రాస్తే, అది ”ఆత్మకథ’ అవుతుంది. దీనినే స్వీయచరిత్ర అని కూడా పిలుస్తారు. ఇందులో రచయిత అనుభవాలే కాక, సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు కూడా ప్రతిబింబిస్తాయి. ఇవి చదివిన వారికి, మంచి ప్రేరణను కలిగిస్తాయి. ఆత్మకథలు, ఉత్తమ పురుష కథనంలో సాగుతాయి.
ప్రస్తుత పాఠ్యభాగం, సంగెం లక్ష్మీబాయి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథలోనిది.
రచయిత్రి పరిచయం
పాఠం : ‘ఉద్యమ స్ఫూర్తి’
రచయిత్రి : సంగెం లక్ష్మీబాయి
దేని నుండి గ్రహించబడినది : రచయిత్రి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథ నుండి గ్రహించబడినది.
జన్మస్థలము : ఈమె మేడ్చల్ జిల్లాలోని ‘ఘటకేశ్వరం’ అనే గ్రామంలో జన్మించింది.
జననమరణాలు : జననము 27-07-1911. మరణము 1979 వ సంవత్సరం
ఉద్యోగం : హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా ఈమె పనిచేసింది.
పదవులు : ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు.
పాల్గొన్న ఉద్యమాలు :
- గాంధీజీ పిలుపుతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె.
- 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె.
ప్రవేశిక
చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంత కాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశ పడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషిచేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి.
తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్ర్యోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.