Telangana SCERT 9th Class Telugu Guide Telangana 1st Lesson ధర్మార్జునులు Textbook Questions and Answers.
TS 9th Class Telugu 1st Lesson Questions and Answers Telangana ధర్మార్జునులు
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 2)
కుజనుల్ గొందరు రేగి యీ వసుమతిన్ క్రూరస్వభావంబుతో
సుజనాళిన్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే
నిజ దౌర్బల్యము జూపిరేని చెడద నిక్కంబుగా రాజ్యమో
త్రిజగత్కారణ ! భక్తపాలన ! హరా! శ్రీ గుంటు మల్లేశ్వరా
– యర్రం విశ్వనాథం గుప్త
ప్రశ్నలు
ప్రశ్న 1.
సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవ్వరు ?
జవాబు:
సజ్జనుల బాధలను నివారించే వారు రాజులు.
ప్రశ్న 2.
దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి ?
జవాబు:
దుర్మార్గులు విజృంభించి క్రూర స్వభావముతో సత్పురుషులను బాధించేటప్పుడు, రాజులు దుర్మార్గులను దండించాలి.
ప్రశ్న 3.
ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు ?
జవాబు:
చెడ్డవారు క్రూర స్వభావముతో విజృంభించి మంచివారిని బాధిస్తున్నప్పుడు, రాజులు చెడ్డవారిని దండించాలి. అంతేకాని తమ బలహీనతను వెల్లడించరాదు. అలా చేస్తే ఆ రాజుల రాజ్యం చెడిపోతుంది.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 4)
ప్రశ్న 1.
‘ఆజ్ఞా పరిపాలనా వ్రతం’ అంటే ఏమిటి ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా .. నడచుకొనడాన్ని “ఆజ్ఞా పరిపాలనా వ్రతం” అంటారు. సామాన్యంగా ప్రజలను పాలిస్తూ రాజులు కొన్ని నియమాలను పాటించుమని ప్రజలను ఆజ్ఞాపిస్తారు. తాము మాత్రం, ఆ ఆజ్ఞల ప్రకారం నడచుకోరు. అలా కాకుండా ధర్మరాజు తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా నడచుకొనేవాడు. అందువల్లనే ధర్మరాజు ‘ఆజ్ఞాపరిపాలనా వ్రతుడు’ అయ్యాడు.
ప్రశ్న 2.
‘మొకమిచ్చకపు మెచ్చు !’ అంటే మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
ఎదుటి వ్యక్తిని అతని ఎదుట, అతని ముఖప్రీతి కోసం మెచ్చుకోడాన్ని ‘మొకమిచ్చకపు మెచ్చు’ అంటారు. ఆ వ్యక్తిని అతని ముఖం ముందు మెచ్చుకొని, అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడిని కొందరు నిందిస్తారు. అది సరయిన పద్ధతి కాదు. మెచ్చుకుంటే ఆ వ్యక్తిని అతని ముందూ, అతడు వెళ్ళిన తర్వాత కూడా మెచ్చుకోవాలి.
ప్రశ్న 3.
మంచివారిని ఎందుకు అనుసరించాలి ?
జవాబు:
మంచివారు మంచి గుణాలను కలిగియుంటారు. వారు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. అటువంటి మంచి వారిని అనుసరిస్తే, వారిలాగే తాను కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ధర్మరాజువంటి సజ్జనులను అనుసరిస్తే తాము కూడా ధర్మమూర్తులు కావచ్చు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 5)
ప్రశ్న 1.
స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి ? జ. స్నేహభావం సత్పురుషులతో పెంపొందించుకోవాలి.
ధర్మరాజు వంటి సత్పురుషులు
- ప్రజల సంపదలకు సంతోషిస్తారు. అసూయపడరు.
- ప్రజలందరూ తనను సేవించాలని అనుకుంటారు. వీరు ఎవరినీ వెగటుగా చూడరు.
- అడిగిన వారికి ఇద్దామని అనుకుంటారు. పూర్వమే అతడికి ఎంతో ఇచ్చామని అనరు.
- రాత్రింబగళ్ళు ధర్మార్జన దృష్టితో ఉంటారు. అన్యాయవర్తన ఉండదు.
కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతో స్నేహభావం పెంపొందించుకోవాలి.
ప్రశ్న 2.
‘కొంగు బంగారం’ అనే మాట ఎప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి.
జవాబు:
‘కొంగు బంగారం’ అనేది తెలుగు జాతీయము. ‘సులభ సాధ్యము’ అని దీనికి అర్థము. పూర్వులు తమకు కావలసిన ధనాన్ని చెంగున ముడివేసుకొనేవారు. ఆ రోజుల్లో మనీ పర్సులు లేవు. వారికి ఏదయినా డబ్బు అవసరం అయితే వెంటనే చెంగున లేక కొంగున ముడి వేసిన ముడి విప్పి, అందులో కావలసిన మొత్తాన్ని వారు సులభంగా వాడుకొనేవారు. వారి డబ్బు ఏ పెట్టెలోనో ఉండి ఉంటే అంత సులభంగా అది వారి అవసరానికి ఉపయోగించదు. ఆ విధంగా ‘కొంగు బంగారం’ అంటే, సులభంగా అయ్యే పని అని అర్థంలో, ఆ జాతీయం వాడుకలోకి వచ్చింది.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
అసూయాపరులంటే ఎవరు ? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.
జవాబు:
అసూయాపరులంటే ఈర్ష్యగుణం కలవారు.’ ఎదుటి వారికి ఉన్నది, తనకు లేదని బాధపడేవారు ‘అసూయా పరులు’. అసూయ వల్ల అసూయాపరులకే నష్టము. అసూయాపరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం ఉంటుంది.
ప్రశ్న 2.
‘దానగుణం మనిషికి అవసరం’ ఎందుకో మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
‘దానగుణం’ అంటే ఎదుటి వారికి ఇవ్వడం. మన పెద్దలు దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెప్పారు. మనం ఒకరికి ఇస్తే దేవుడు తిరిగి మనకు మరింతగా ఇస్తాడు. దానగుణం వల్ల, పేదలు సంతోషిస్తారు. ఈ జన్మలో దానం చేసుకుంటే మరుసటి జన్మలో భగవంతుడు దానం ఇచ్చిన వారికి మరింతగా ఇస్తాడు. దానగుణం లోకంలో ఉంటే పేదవారికి లోటు ఉండదు.
ప్రశ్న 3.
యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు. ఎందుకో చెప్పండి.
జవాబు:
పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఉత్సాహం చూపేవారు. పాండవుల వద్ద ఎంతో సంపద ఉంది. అదీగాక వారి దేశప్రజలు సకల సంపదలతో తులతూగాలని పాండవులు కోరుకొనేవారు. వారు దానం చేయడంలో గొప్పవారు. అందుకే వారు యాచకుల కోరికలను పూర్తిగా తీర్చి, వారి దీనత్వాన్ని పోగొట్టేవారు. పాండవులు మంచి సౌజన్యం గలవారు. అందుకే వారు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడంలో అంటే దానం చేయడం అనే ప్రక్రియలో శూరత్వం చూపేవారు.
ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 6)
ప్రశ్న 1.
‘ప్రాణసఖుడు’ అని ఎవరినంటారు ? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ?
జవాబు:
‘ప్రాణసఖుడు’ అంటే తన ప్రాణంతో సమానంగా ఎదుటి వారిని చూసుకొనే మిత్రుడు. అవసరమైతే స్నేహితుడి కోసం, తన ప్రాణాలను ఇచ్చే మిత్రుడిని “ప్రాణసఖుడు” అంటారు.
ప్రాణసఖుడి లక్షణాలు :
- మిత్రుడిని పాపకార్యముల నుండి మరలిస్తాడు.
- స్నేహితునిచే హితమైన కార్యాలు చేయిస్తాడు.
- స్నేహితుడి రహస్యాన్ని దాస్తాడు.
- మిత్రుడి సద్గుణాలను పోషిస్తాడు.
- మిత్రునికి లేని సమయంలో అతడిని విడిచిపెట్టడు.
- మిత్రుడికి కావలసినది తాను ఇస్తాడు.
ప్రశ్న 2.
‘ధర్మప్రవర్తన కలిగి వుండటం’ అంటే ఏమిటి ?
జవాబు:
వేదధర్మ శాస్త్రాలలో చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడచుకోడాన్ని ధర్మప్రవర్తన కలిగియుండడం అంటారు. అన్నదమ్ముల యందు సమభావన, తోడి రాజులలో మంచి ప్రసిద్ధి, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా నడచుకోడం అన్నది ధర్మప్రవర్తన.
ప్రశ్న 3.
స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి.
జవాబు:
ఇతరులందరితోనూ స్నేహభావం పెంపొందించుకోడం వల్ల మనకు మిత్రులు పెరుగుతారు. మనకు శత్రువులన్న వారే ఉండరు. అందరూ మనల్ని ప్రేమభావంతో చూస్తారు. అవసరం వచ్చినపుడు ఆ మిత్రులు మనల్ని ఆదుకుంటారు. మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే, శత్రువులు మనవైపుకు కన్నెత్తి చూడడానికి సైతం జంకుతారు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
1. కింది అంశాల గురించి చర్చించండి.
అ) ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా ! వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలను గురించి చర్చించండి.
జవాబు:
నేటి పాలకులకు ఉండవలసిన లక్షణములు :
- ప్రభుత్వ శాసనం ప్రకారము, తానూ, తనవారూ నడచుకోవాలి. ప్రజలకు కూడు, గుడ్డ, ఇల్లు సమకూర్చాలి. బీదలపట్ల, హరిజన గిరిజనులపట్ల సానుభూతి ఉండాలి.
- శాంతి, దయ అనే సుగుణములు కలిగి ఉండాలి..
- సదా సత్యమునే మాట్లాడాలి.
- సత్పురుషులైన ప్రజలను ఎల్లవేళలా ఆదరంగా చూడాలి.
- విపన్నులకు దానధర్మాలు చేసేవాడై ఉండాలి.
- ముందు ఒకమాట, వెనుక ఒకమాట చెప్పకూడదు.
- ప్రజలు చేసిన విన్నపాలను, ఆదరంగా ఆలకించి పరిష్కారం చూపించాలి..
- మంచిపనులు చేసిన వారిని, మెచ్చుకొని వారిని ఘనంగా సన్మానించాలి.
- ప్రజల సంపదపై అసూయకూడదు. ప్రభుత్వ సంపదకు తాను కాపలాదారుగా ఉండాలి.
- రాత్రింబగళ్ళు ధర్మమార్గంలో నడవాలి.
- ప్రభుత్వ పాలన, పారదర్శకంగా ఉండాలి.
- స్వపక్ష, పరపక్ష తారతమ్యం పనికిరాదు.
- కోపం, ఈర్ష్య ఉండరాదు.
- పండితులను గౌరవించాలి.
- అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉండరాదు.
- రాత్రింబగళ్ళు ప్రజల కష్టనష్ట నివారణపైనే దృష్టి ఉండాలి.
- దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవాలి.
- ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్గించాలి.
ఆ) “మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి” ఎందుకో చర్చించండి.
జవాబు:
ఏ పని చేయాలని అనుకున్నా, ఆ పని చేయడంలో వచ్చే మంచి చెడులనూ దానివల్ల కలిగే లాభనష్టాలనూ ముందుగా బాగా ఆలోచించాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి మంచి చెడులను ఆలోచించకుండా నిర్ణయం తీసుకొంటే, తరువాత కష్టనష్టాలు వస్తాయి. అప్పుడు విచారింపవలసి వస్తుంది. బుద్ధిమంతుడైనవాడు, తొందరతో నిర్ణయాలు తీసుకోరాదు. అవసరమైతే తనకు కావలసిన వారికి సమస్యను చెప్పి, వారందరితో బాగా ఆలోచించి, రాబోయే మంచిచెడులను లోతుగా చర్చించి నిర్ణయించాలి.
అలా ఆలోచించి నిర్ణయిస్తే ఆ నిర్ణయం వల్ల ఎటువంటి కష్టనష్టాలు రావు. ఒకవేళ కష్టనష్టాలు వచ్చినా, పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉండదు.
ప్రశ్న 2.
పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదువండి.
జవాబు:
ఈ పాఠంలో 1, 4, 7, 9 పద్యాలు పువ్వు గుర్తు గల పద్యాలు. వీటిని చక్కగా మీ గురువుగారి సాయంతో అర్థవంతంగా, భావం తెలిసేలా చదవడం అలవాటు చేసుకొండి.
ప్రశ్న 3.
కింద నాలుగో పద్యానికి ప్రతిపదార్థం ఉన్నది. ఇదే విధంగా 1, 9 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
కోపము = కోపము
ఒక + ఇంత = కొంచెం కూడా
లేదు = లేద
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుపసిండి = కొంగున మూటగట్టిన బంగారం (అవసరానికి ఉపయోగ పడుతుంది)
సత్యము = సత్యం (చెప్పడం సంగతంటారా !)
ఆరూపము = దాని స్వరూపమే అతడు
తారతమ్యములు = వ్యత్యాసాలు (మనుష్యులలో)
ఎఱుంగు = తెలియును
స్వతంత్రుడు = స్వేచ్ఛగలవాడు (నిర్ణయాధి కారంలో)
నూతన ప్రియ + ఆటోపము = కొత్త విషయాలపట్ల ఆడంబరం
లేని = లేనటువంటి
నిశ్చలుడు = స్థిర స్వభావం గలవాడు
ఇటుల్ = ఈ విధంగా
కృతలక్షణుండు + ఐ = కృతయుగ (మంచి) లక్షణాలు కలిగి
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా/ప్రకాశిస్తుండగా
అల ధర్మనందనున్ = ఆ యమధర్మరాజు వరపుత్రు డైన ధర్మరాజును
ద్వాపర లక్షణుండు = (సందిగ్ధమైన) (ద్వాపరయుగ లక్షణాలు కలవాడనీ
అనగ వచ్చునొకో = అనవచ్చునా ? (అనకూడదు)
(అనగవచ్చును + ఒకొ) కృతలక్షణుడనాలి.
జవాబు:
1, 9 పద్యాలు, వాటి ప్రతిపదార్థాలు, భావములు ముందుగానే వేరుగా ఇచ్చాము. వాటిని చదువండి. వాటిని చదివి ప్రతిపదార్థాలు రాయడం నేర్చుకోండి.
4. కింది భావాలు గల పద్యపాదాలు ఏయే పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి.
అ) ధర్మరాజే సాటిలేని చక్రవర్తి.
జవాబు:
పై భావం గల పద్యపాదము, రెండవ పద్యంలో ఉంది. “నితడెఁపో సార్వభౌముఁడ ప్రతిముఁ డనఁగఁ బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు”.
ఆ) గరుడధ్వజుని స్నేహితుడు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, తొమ్మిదవ పద్యంలో ఉంది. “బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు” – అని.
ఇ) ఎల్లప్పుడు ధర్మాన్ని సంపాదించే దృష్టేగాని న్యాయం తప్పలేదు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, మూడవ పద్యములో ఉంది. “రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని, న్యాయంబు దప్పిన నడకలేదు.”
ఈ) అర్జునుడు సాత్త్వికులతో కూడా ప్రశంసల నందుకునే ధర్మవర్తన గలవాడు.
జవాబు:
పై భావం గల పద్యపాదము, ఎనిమిదవ పద్యంలో ఉంది. “సాత్వికుల్ దన్నుఁనుతింపఁగాఁ దనరు ధార్మికుఁడర్జునుఁ డొప్పునెంతయున్.”
ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
* కుసుమ కోమల భావముల్ కూర్చువేళ
సరసకవులకు కలములన్ నెరసు లేక
జాఱు మకరంద ధారల తీరు రసము
తేలికన జిల్కు మా ముద్దు తెలుగుపలుకు
– శిరశినహళ్ కృష్ణమాచార్య
ప్రశ్నలు
అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
పై పద్యాన్ని ‘శిరశినహళ్ కృష్ణమాచార్య’ రచించారు.
ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు ?
జవాబు:
కవులు కుసుమములవలె కోమలములయిన భావాలను కూర్చగలరు.
ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి ?
జవాబు:
కలం నుండి తెలుగు పలుకులు, మకరంద ధారలవలె జాలువారుతాయి.
ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
తెలుగు పలుకులను, కవి మకరంద ధారలతో పోల్చాడు.
ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “తెలుగు పలుకు” అన్నది సరిపడుతుంది.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు ? ఎందుకు ?
జవాబు:
ధర్మరాజు నలుగురు తమ్ములూ, ఓటమిని ఎరుగని వారు. శత్రువులను ఓడించడానికీ, యాచకుల దీనత్వం పోగొట్టడానికీ, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగియుంటారు. వీరు మంచి పరాక్రమం గలవారు.
పాండవులు ఐదుగురూ. కోరిన కోరికలు తీర్చడంలో అయిదు దేవతా వృక్షాలవంటివారని. శత్రువులను జయించడంలో విష్ణుమూర్తి అయిదు ఆయుధాల వంటి వారనీ, పవిత్ర ప్రవర్తనలో ఈశ్వరుడి ఐదు ముఖాల వంటివారనీ, లోకం పొగిడేటట్లు గుణవంతులుగా ఉండేవారు.
పాండవులు స్నేహభావం, భక్తి, ప్రేమ, ఓర్పు కనబడేటట్లు, పెద్ద, చిన్న అనే తేడాలు తెలుసుకొని, ఒకరిమాట మరొకరు దాటకుండా చేసే పనులలో తేడా లేకుండా, ఒకరి మనస్సుననుసరించి మరొకరు నడచుకుంటూ ఉండేవారు. అన్నదమ్ముల సరాగము అంటే పాండవులదే అని లోకము ప్రశంసించే విధంగా వారు ప్రవర్తించేవారు.
ఆ) ఈ పాఠానికి “ధర్మార్జునులు” అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా ? ఎందుకు ?
జవాబు:
ఈ పాఠంలో మొత్తం 10 పద్యాలు ఉన్నాయి. అందులో మొదటి నాలుగు పద్యాలలో ధర్మరాజు సుగుణాలనూ, ప్రజలను అతడు పాలించిన విధానమునూ వర్ణించారు. అలాగే చివరి 8, 9, 10 పద్యాలలో అర్జునుని సుగుణాలనూ, అతడి సౌందర్యాన్నీ, దయాగుణాన్నీ, అతడి యుద్ధ విజయాలనూ గూర్చి వర్ణించారు.
ఇందులో ఐదు, ఆరు, ఏడు పద్యాలలో మాత్రము మొత్తం పాండవులు ఐదుగురి గుణగణాలనూ కవి వర్ణించాడు. మొత్తంపై ధర్మరాజు గురించి, అర్జునుడి గురించి ఈ పద్యాలలో విశేషంగా వర్ణింపబడింది. కాబట్టి మొత్తం ఈ పాఠానికి ధర్మరాజు పేరు, అర్జునుడి పేరు కలిసివచ్చేలా, ‘ధర్మార్జునులు’ అని పేరు పెట్టడం తగిన విధంగానే ఉన్నదని భావిస్తున్నాను.
ఇ) ‘పాండవులు ఉదారస్వభావులు’ సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఉదార స్వభావము అన్నదానికి దాతృత్వము, దయ, గొప్పతనము, సరళస్వభావము, గాంభీర్యము, నేర్పరిదనము అని అనేక విశేషార్థాలు ఉన్నాయి. పాండవులు ఐదుగురూ పైన చెప్పిన గుణగణాలు కలవారు.
ధర్మరాజు శాంతి దయలు, ఆభరణంగా కలవాడు. సాధు జనులను ఆదరించేవి డు. దానవిద్య యందు ఆసక్తి కలవాడు. యాచకులకు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవాడు.
ధర్మరాజు ప్రజల సంపదకు అసూయపడేవాడు కాడు. రాత్రింబగళ్ళు ధర్మాన్ని ఆచరించేవాడు. అన్యాయ ప్రవర్తన అతడి వద్ద లేదు. పండితులకు ధర్మరాజు కొంగు బంగారం వంటివాడు.
పాండవులందరూ యాచకుల దీనత్వాన్ని పోగొట్టే సుగుణం కలవారు. పాండవులు దేవతా వృక్షములయిన కల్పవృక్షాల మాదిరిగా యాచకుల కోర్కెలు తీర్చేవారు. వారంతా పరస్పర ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు.
ఇక అర్జునుడు ధార్మికుడు. అర్జునుడు దయారసంలో శ్రీకృష్ణునికి ప్రాణసఖుడట. ఈ పై గుణాలు పాండవుల యందు ఉండడం చేత, వారిని ఉదార స్వభావులని చెప్పడం సమర్థనీయమే.
ఈ) మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి.
జవాబు:
మంచివారు అంటే సత్పురుషులు అనగా మంచి గుణాలు కలవారు. ప్రభువులు మంచివారిని ఆదరించి, వారికి ఉద్యోగమిచ్చి వారిని పెంచి పోషించాలి. మంచి వారిని ఆదరించి పోషిస్తే, వారు సహృదయులు కాబట్టి, యజమానుల క్షేమానికీ, వారి అభివృద్ధికీ కృషి చేస్తారు.
యోగ్యుడైన రాజు తన విచక్షణ జ్ఞానంతో ప్రజల మంచి చెడులను ముందుగా గుర్తించాలి. మంచివారిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి.
మంచివారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మమార్గంలో సంసారాన్ని పోషించుకుంటారు. లోకోపకారానికి ప్రయత్నిస్తారు. మంచివారినే మనం ఆదరిస్తే లోకంలో దుర్జనులకు ఆశ్రయం లభించదు. ఆ విధంగా లోకంలో దుష్టత్వం దూరం అవుతుంది. మంచిగా ఉందాం. మంచినే చేద్దాం. మంచివారినే ఆదరిద్దాం అనే భావం లోకంలో వ్యాపిస్తుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ధర్మరాజు వ్యక్తిత్వము : ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలించేవాడు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు గలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ఆయన గొప్ప పరాక్రమంతో ప్రజలు మెచ్చుకొనేటట్లు రాజ్యపాలన చేసేవాడు.
ధర్మరాజు ఇతరుల గురించి రహస్యంగా చెడు చెప్పేవాడు కాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. ఎవరికీ చనువు ఇచ్చి, వారిని లోకువ చేసేవాడు కాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. మొగమాటానికి ఎవరినీ మెచ్చుకొనేవాడు . కాడు. ప్రజల సంపదలకు సంతోషపడేవాడు కాని, అసూయపడేవాడు కాడు. వెగటుగా ఎవరినీ చూసేవాడు కాడు. అడిగినంత ఇచ్చేవాడు. రాత్రింబగళ్ళు ధర్మార్జన చేసేవాడు. అన్యాయ ప్రవర్తన లేనివాడు.
ధర్మరాజునకు కోపం లేదు. పండితులకు ఆయన కొంగు బంగారం వంటివాడు. సత్యస్వరూపుడు. ఆయన మనుష్యుల తారతమ్యాలు తెలిసిన స్వతంత్రుడు. కొత్త వారిపై మోజులేనివాడు. అతడు కృతయుగ లక్ష్మణుడు.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ) మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి ‘అభినందన వ్యాసం’ రాయండి.
జవాబు:
మా వరంగల్లు నగరంలో ‘కామేశ మహర్షి’ అనే ఒక సత్పురుషుడూ, దైవభక్తుడూ ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఆయన తల్లిగారి జన్మస్థలము “వరంగల్లు”. కామేశ మహర్షికి తల్లిదండ్రులు ‘బెహరా’ అని పేరు పెట్టారు. బెహరా పదవ తరగతిలో ఉండగా, కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి ఒకసారి వరంగల్లు కళాశాలకు వచ్చారు. ‘బెహరా’ స్నేహితులతో కలసి, స్వామిని దర్శించారు. కంచి స్వామి, చిన్న కామాక్షీదేవి విగ్రహాన్ని బెహరా గార్కి ఇచ్చారు. అంతే, బెహరా కామాక్షీ భక్తుడుగా మారారు.
మహర్షి నగరంలో కామాక్షీ ప్రేమ మందిరాన్ని స్థాపించి, అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దిక్కులేని అనాథపిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని, వారందరికీ తండ్రిగా తల్లిగా తానే ఉంటూ, వారిని పెంచి పోషిస్తున్నారు.
కంచి పీఠాధిపతులు ఒకసారి బెహరా గారి ప్రేమమందిరాన్ని దర్శించి, బెహరా గారిని కామేశ మహర్షి అని పిలిచారు. బెహరాగారికి ఎందరో సజ్జనులు చందాలు ఇస్తూ ఉంటారు. కామేశ మహర్షిగారు ఒక ట్రస్టు ఏర్పరచారు. ఆ ధనంతో సుమారు ప్రేమమందిరంలోని నూరు మంది బాలబాలికలకు భోజన వసతి, విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రేమమందిరంలోని బాలబాలికలను మహర్షిగారు ఆదరిస్తున్న పద్ధతి చూస్తే సామాన్యులకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కారణజన్ముడు. కరుణామూర్తి.
మహర్షిగారు అనాథ బాలబాలికలు పెద్దవారయ్యాక, వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వారికి పురుళ్ళు పోస్తున్నారు. వారి పిల్లలకు బారసాలలు జరిపిస్తారు. పేరంటాలు ఫెట్టిస్తారు. కన్న తల్లిదండ్రులు సైతం ఇంత ప్రేమతో, ఆదరణతో తమ పిల్లలను చూడలేరు.
చందాల రూపంగా వచ్చిన మొత్తంతో మందిరానికి మంచి భవనం కట్టించారు. పిల్లలకు వసతి సౌకర్యాలు, బట్టలు, పుస్తకాలు ఏర్పాటు చేస్తున్నారు.
కామేశ మహర్షి దయాగుణం మూర్తీభవించిన సత్యస్వరూపులు. ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆర్ద్రత గూడు కట్టుకున్న మహనీయ త్యాగమూర్తి. మహర్షిగారికి పెళ్ళి కాలేదు. పిల్లలు లేరు. అనాథ బాలబాలికలే వారి సంతానము. ఆయన దైవస్వరూపుడు.
ఆ) పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
చేమకూర వేంకటకవి తంజావూరు రాజ్యాన్ని పాలించిన రఘునాథనాయకుని ఆస్థానకవి. ఈ వేంకటకవి, ‘విజయవిలాసము’ అనే గొప్ప చమత్కార ప్రబంధాన్ని రచించి, రఘునాథరాయలకు అంకితం ఇచ్చాడు.
ఈ విజయవిలాస ప్రబంధము తెలుగులో పంచకావ్యాలని పిలువబడే వాటిలో చివరిది. ఉత్తమమైనది. వేంకటకవిని రఘునాథరాయలు మెచ్చుకొని “ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగ చెప్పనేర్తువు”, “క్షితిలో నీ మార్గము ఎవరికింరాదు సుమీ” అని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి వేంకటకవి ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉండేటట్లు రాస్తాడనీ, వేంకటకవిలా ఇతరులు వ్రాయలేరనీ తెలుస్తుంది.
మన పాఠంలో చమత్కారాలు చూద్దాం. ఈ పద్యాలన్నింటిలో అర్జునుడిని వర్ణిస్తూ చెప్పిన “అతని నుతింపశక్యమె …………… మహీతలమ్మునన్” అనే 9వ పద్యము మేలిరత్నం వంటిది. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడట అంటే సమానం అన్నమాట. దయారసంలో కృష్ణుడికి ప్రాణసఖుడట అంటే కృష్ణునితో సమానం. యుద్ధ విజయంలో ఈశ్వరుడికి ‘ప్రతిజోదు’ అట అంటే సమానమన్న మాట. ఇలా అందంలో జయంతునితో, దయలో కృష్ణుడితో, యుద్ధంలో ఈశ్వరుడితో సమానమని చెప్పి, చివరి పంక్తిలో భూమండలంలో ‘అతనికతండె సాటి’ అని చెప్పాడు.
మొదటలో అర్జునుడిని ముగ్గురితో సమంగా చెప్పి చివరన అర్జునుడికి అర్జునుడే భూమండలంలో సాటి అనడంలో చమత్కారం ఉంది. జయంతుడు, విష్ణుడు, ఈశ్వరుడు అనేవారు భూమండలంలోనివారు కారు. భూమండలంలో అర్జునుడిని మించిన వారులేరని దానిలో చమత్కారం. అదేగాక పురాణాల ప్రకారం జయంతుడు అర్జునుడికి తమ్ముడే, కృష్ణుడు ప్రాణసఖుడే, ఈశ్వరుడు ప్రతిజోదే ఇది మరో చమత్కారం. ఈ పద్యాలు మంచి సమాస గాంభీర్యంతో శబ్దాలంకారాలతో అద్భుతంగా నడుస్తాయి. ‘ఆ పురమేలు, మేలు’ అన్న పద్యం శబ్దాలంకార సుందరము.
‘కోప మొకింత లేదు. బుధకోటికి కొంగు బసిండి’ అన్న పద్యంలో మంచి తెలుగు నుడికారమూ, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.
‘కీర్తి విసరుండు, పాండవాగ్రేసరుండు’, ‘ఏలవలెశాశ్వతము గాగ, నీ ఘనుండె, యేలవలె నన్యులు” అన్నచోట మంచి శబ్దాలంకారాలు ఉన్నాయి.
“పాఱఁ జూచిన బరసేన పాఅఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు” అనే పాదాల్లో అద్భుతమైన యమకాలంకారం ఉంది. మొత్తంపై చేమకూర పాకాన పడిందన్నమాట నిజము. మా పాఠంలో పద్యాలు చేమకూర కవి కవిత్వానికి నిజమైన మచ్చుతునకలు.
III. భాషాంశాలు
పదజాలం
ప్రశ్న 1.
కింది పదాలకు అర్థాలు రాస్తూ సొరతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) సోయగం = ……………………..
జవాబు:
చక్కదనము
వాక్యప్రయోగం : బాలకృష్ణుని సోయగం అపూర్వమైనది.
ఆ) ఏవురు = ………………….
జవాబు:
ఐదు మంది
వాక్యప్రయోగం : మా అన్నదమ్ములు ఏవురూ కలసి, పొరుగూరు వెళ్ళాము.
ఇ) వెగటు = …………………….
జవాబు:
వైరస్యము
వాక్యప్రయోగం : ఈ మందు త్రాగడం నాకు వెగటుగా ఉంటుంది.
ఈ) బుధుడు = …………………………
జవాబు:
పండితుడు
వాక్యప్రయోగం : బుధుడు దేశవిదేశాల్లో గౌరవాన్ని పొందుతాడు.
2. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి.
అ) తనూజుడు : …………………..
జవాబు:
తన దేహము నుండి పుట్టినవాడు (కుమారుడు)
ఆ) నృపాలుడు : ………………………..
జవాబు:
నరులను పాలించువాడు (రాజు)
ఇ) నందనుడు : …………………………..
జవాబు:
సంతోషపెట్టువాడు (కొడుకు)
3. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) క్షితి = ……………………..
జవాబు:
- భూమి
- ధరణి
- వసుధ
ఆ) కుమారుడు = ……………………..
జవాబు:
- తనూజుడు
- పుత్రుడు
- కొడుకు
ఇ) మొగము = ……………………
జవాబు:
- ముఖము
- వదనము
- ఆననము
- వక్త్రము
ఈ) పురము = ………………………
జవాబు:
- నగరం
- ప్రోలు
- పట్టణం
4. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.
అ) బుద్ధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మమార్గంలో నడిపింది.
జవాబు:
ధర్మము – దమ్మము
ఆ) ఉపాధ్యాయుని గౌరవించాలి. ఒజ్జ చూపిన మార్గంలో నడవాలి.
జవాబు:
ఉపాధ్యాయుడు – ఒజ్జ
ఇ) ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను. ఇదే నా యొక్క ఆన.
జవాబు:
ఆజ్ఞ – ఆన
ఈ) తెలుగు భాషను కాపాడుతానని బాస చేస్తున్నాడు.
జవాబు:
భాష – బాస
5. కింది వాటిలో నానార్థాలు గుర్తించండి, పట్టిక రాయండి.
అ) రాజు = ……………………
అ) తరువు, చెరువు
ఆ) ప్రభువు, ఇంద్రుడు
ఇ) చిలుక, పలక
ఈ) రాముడు, భీముడు
జవాబు:
ఆ) ప్రభువు, ఇంద్రుడు
ఆ) ప్రియం = ……………………..
అ) హెచ్చు, ఇష్టం
ఆ) పేరు, ఊర
ఇ) చౌక, తేలిక
ఈ) బాధ, సంతోషం
జవాబు:
అ) హెచ్చు, ఇష్టం
ఇ) దిక్కు = ………………………
అ) దిశ, ఆశ్రయం
ఆ) కన్ను, ఆకాశం
ఇ) మార్గం, ఆశ్రయం
ఈ) తూర్పు, నేర్పు
జవాబు:
అ) దిశ, ఆశ్రయం
ఈ) చిత్తము = ……………………..
అ) బొమ్మ, కాగితం
ఆ) ఉత్తరం, నది
ఇ) ఇష్టం, కష్టం
ఈ) మనసు, ఇష్టం
జవాబు:
ఈ) మనసు, ఇష్టం
వ్యాకరణాంశాలు
కర్మధారయ సమాసం
కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ) ఉదగ్రతేజం – ఉదగ్రమైన తేజం
ఆ) తొల్లిటిరాజులు – తొలివారలైన రాజులు
గమనిక : పై సమాసాలను పరిశీలిస్తే, సమాస పదాలలోని పూర్వపదాలు వరుసగా ‘ఉదగ్ర’, తొల్లిటి”, “ప్రియ” అని ఉన్నాయి. ఇవి విశేషణము. అనగా గుణాలను తెలిపేవి.
- ఉత్తర పదాలు పరిశీలిస్తే, వరుసగా ‘తేజం’, ‘రాజులు’, అని ఉన్నాయి. ఇవి నామవాచకాలు. అనగా విశేష్యాలు.
- అంటే ఈ సమాసపదాలు విశేషణ విశేష్యాలతో ఏర్పడినవి. ఇట్లాంటి వాటిని కర్మధారయ సమాసాలు అంటారు. ఇందులో
- విశేషణం పూర్వపదంగా ఉండి, ఉత్తరపదం నామవాచకంగా ఉంటే, అది ‘విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అని గుర్తించాలి.
అభ్యాసము : కింది సమాస పదాలకు విగ్రహవాక్యములు రాసి, పై వివరణ సూత్రంతో సరిచూసుకోండి.
ప్రశ్న 1.
సకలజనములు – …………………………..
జవాబు:
సకలజనములు – సకలమైన జనములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రశ్న 2.
ధార్మికుడర్జునుడు ……………………………
జవాబు:
ధార్మికుడర్జునుడు – ధార్మికుడైన అర్జునుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రశ్న 3.
పరసేన – ………………………………
జవాబు:
పరసేన – పరమైన సేన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ) తమ్ముకుర్రలు – కుర్రలైన తమ్ములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) కార్మికవృద్ధులు – వృద్ధులైన కార్మికులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం సమాసాలలో ఉత్తరపదాలుగా ఉన్నాయి. తమ్ములు, వివరణ : విశేషణ పదాలైన ‘కుర్రలు, వృద్ధులు’ అనే పదాలు, పై కార్మికులు, అనే నామవాచకాలు, సమాసంలో పూర్వపదాలుగా ఉన్నాయి.
అంటే ……………… విశేషణము ఉత్తర పదంగా ఉండి, నామవాచకము పూర్వపదంగా ఉంటే, అది ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము’ అని గుర్తించాలి.
అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి.
అ) పాదపద్మం – …………………..
జవాబు:
పాదపద్మం – పద్మము వంటి పాదం – ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
ఆ) చారుసంసారం – ………………………..
జవాబు:
చారుసంసారం – చారువు అయిన సంసారం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
ఉత్తమ పాలనను ‘రామరాజ్యం’తో పోలుస్తారు కదా ! శ్రీరాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:
- శ్రీరాముడు రాజ్యమును పాలించేటప్పుడు స్త్రీలకు వైధవ్యము ఉండేది కాదు.
- ప్రజలకు క్రూరమృగముల బాధ లేదు.
- ప్రజలకు రోగ భయము లేదు.
- జనాలకు దొంగల భయము లేదు. ప్రజలకు ఎటువంటి కీడు సంభవింపలేదు. పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృతి పొందలేదు.
రామరాజ్యంలో ప్రజలంతా ధర్మనిరతులై ఉండేవారు. వారు సంతోషంతో జీవించేవారు. వారంతా శ్రీరాముడినే ధ్యానిస్తూ, ఒకరితో ఒకరు విరోధములు లేకుండా ఉండేవారు.
రాముని పాలనలో ప్రజలు దీర్ఘాయుర్దాయములతో ఉండేవారు. వారికి ఎక్కువగా సంతానం ఉండేది. వారికి విచారము లేదు. ఆరోగ్య భాగ్యముతో వారు వర్ధిల్లారు. ఆ రామరాజ్యంలో ఎవరినోట విన్నా రాముడి పేరే వినబడేది.
వృక్షములు అన్నీ పుష్పఫల భరితంగా ఉండేవి. సకాలంలో వర్షాలు కురిసేవి. చల్లటిగాలి వచ్చేది. ప్రజలు దురాశాపరులు కారు. ప్రజలు ఎవరిపని వారు చేసుకొనేవారు. ప్రజలు ధర్మవర్తనులు. సత్యమునే పలికేవారు. స్వధర్మాన్నే ఆచరించేవారు.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
I.
1వ పద్యం : (కంఠస్థ పద్యం)
*ఉ. ఆ పురమేలు ‘మేలు బళి !, యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు, సత్య భా
షా పరతత్త్యకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై.
ప్రతిపదార్థం :
ఆజ్ఞా పరిపాలన వ్రతుడు;
ఆజ్ఞా = తాను చేసిన ఆజ్ఞా ప్రకారము
పరిపాలన = తాను కూడా పరిపాలించాలన్న
వ్రతుడు = దీక్షా వ్రతము కలవాడునూ
శాంతి దయాభరణుండు;
శాంతి = శాంతము
దయా = ‘దయ’ అన్న మహాగుణాలు
ఆభరణుండు = భూషణాలుగా కలవాడునూ
సత్యభాషా పరతత్త్వ కోవిదుడు;
సత్యభాషా = నిజాన్ని చెప్పడంలోని
పరతత్త్వ = ఉత్కృష్టమైన స్వరూపాన్ని (స్వారస్యాన్ని)
కోవిదుడు = బాగా తెలుసుకున్నవాడునూ;
సాధుజనాదరణుండు;
సాధుజన = మంచివారలను
ఆదరణుండు = ఆదరించి పోషించేవాడునూ;
దానవిద్యాపరతంత్ర మానసుడు;
దానవిద్యా = దానము చేయడమనే విద్యయందు
పరతంత్ర = ఆసక్తి కల
మానసుడు = మనస్సు కలవాడునూ అయిన
ధర్మతనూజుడు = యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు
ఉదగ్రతేజుడై;
ఉదగ్ర = మిక్కిలి తీక్షణమైన (నిశితమైన)
తేజుడై (తేజుడు + ఐ) = పరాక్రమము గలవాడై;
ప్రజల్ = ప్రజలు
మేలు, బళి, అంచున్ = మేలు, బళి అని అతడిని ప్రశంసిస్తూ
జయవెట్టుచుండన్;
జయ = జయజయ ధ్వనులు
పెట్టుచుండ = పెడుతుండగా; (చేసేలాగున)
ఆ పురము = ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని
ఏలున్ = పాలిస్తూ ఉండేవాడు
భావం :
యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు, తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము తాను కూడా ప్రవర్తించాలన్న దీక్షావ్రతం గలవాడు. శాంతము, దయ అనే మహాగుణాలనే ఆభరణములుగా ధరించినవాడు. సత్యభాషణములోని రహస్యాన్ని బాగా తెలుసుకున్నవాడు. మంచివారలను ఆదరించి పోషించేవాడు.
దానం చేయడం అనే విద్యయందు ఆసక్తి కల మనస్సు కలవాడు. అతడు మిక్కిలి తీక్షణమైన పరాక్రమం కలవాడై; ప్రజా రంజకుడుగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజు, ప్రజలు ‘మేలు, బళి’ అని జయ జయ ధ్వనులు చేసేటట్లుగా, ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలిస్తున్నాడు.
2వ పద్యం
సీ. అవలఁ బోయిన వెన్కనాడు టెన్నఁడు లేదు,
మొగము ముందఱ నంట మొదలెలేదు,
మనవి చెప్పినఁ జేయకునికి యెన్నఁడు లేదు,
కొదవగా నడుపుట మొదలెలేదు,
చనవిచ్చి చౌక చేసినది యెన్నఁడులేదు,
పదరిహెచ్చించుట మొదలెలేదు,
మెచ్చినచోఁ గొంచె మిచ్చుటెన్నడుఁ లేదు,
మొకమిచ్చకపు మెచ్చు మొదలెలేదు.
తే. మఱియుఁ దొల్లిటి రాజుల మహిమలెన్న
నితడెఁపో సార్వభౌముఁడ ప్రతిముఁ డనఁగఁ
బ్రజలఁ బాలించె సకల దిగ్భ్ర్భాసమాన
కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు.
ప్రతిపదార్థం :
అవలబోయిన వెన్కన్;
అవలన్ + పోయిన వెన్కన్ = బయటకు వెళ్ళిపోయిన తరువాత (అతడిని గురించి)
ఆడుటెన్నడు లేదు; (ఆడుట + ఎన్నడు లేదు) = చెడ్డగా మాట్లాడడం ఎప్పుడూ లేదు
మొగము ముందఱన్ + అంట = ముఖప్రీతి కోసం (నిజం కాని) మంచిమాటలు (ప్రశంసలు) ముఖం ముందే చెప్పడం;
మొదలెలేదు = ముందే లేదు
మనవి చెప్పినన్ = ఏదైన సాయం కోసం మనవి చేసుకుంటే;
చేయకునికి (చేయక + ఉనికి) = ఆ సహాయం చేయకుండా ఉండడం;
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు
కొదవగా నడుపుట = కొఱతగా (లోపముగా) ఆచరించడం (ఆ సాయం చేసి నప్పుడు అరకొరగా ఏదో చేశాం అనిపించుకోడానికి ఇవ్వడం)
మొదలె లేదు. = ముందే లేదు (సంపూర్ణంగా సాయంచేసే వాడని భావం)
చనవిచ్చి(చనవు + ఇచ్చి) = ప్రేమతో కూడిన స్వేచ్ఛ ఇచ్చి;
చౌక చేసినది = చులకన చేసినది .
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు. (కొత్తవారు పరిచయం అయినపుడు మొదటలో ఎక్కువగా మర్యాద చేసి, తరువాత వారి వైపు చూడకుండా అనాదరం చూపించడం అన్న గుణం లేదు.)
పదరి హెచ్చించుట = కోపించి, విజృంభించడం
మొదలె లేదు = ముందే లేదు
మెచ్చినచోన్ = మెచ్చుకుంటే
కొంచెమిచ్చుట (కొంచెము + ఇచ్చుట) = కొద్దిగా ఇవ్వడం
ఎన్నడు లేదు = ఎప్పుడూ లేదు
మొకమిచ్చకపు మెచ్చు (మొకమిచ్చకము + మెచ్చు) = ముఖప్రీతి కోసం మెచ్చుకోడం;
మొదలెలేదు = ముందే లేదు
మఱియున్ = మరియూ
తొల్లిటి రాజుల = పూర్వపు రాజుల
మహిమలు = గొప్ప గుణాలను
ఎన్ని = పరిశీలించి (ఇప్పటి ప్రభువులలో లోపించిపోయిన మంచి గుణాలు ధర్మరాజులో ఉండడం గుర్తించి)
ఇత పో ఈ ధర్మరాజే సుమా !
అప్రతిముడు = సాటిలేని వాడైన
సార్వభౌముడు = చక్రవర్తి
అనగన్ = అనడానికి తగినట్లుగా
సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు;
సకల దిక్ = అన్ని దిక్కులందు
భాసమాన = ప్రకాశిస్తున్న
కీర్తివిసరుండు = కీర్తి సమూహము గలవాడు; (అతడి కీర్తిని గురించి నాలుగు దిక్కులలో ఉన్న లోకులూ వింటూ ఉంటారని భావము.)
పాండవాగ్రేసరుండు;
(పాండవ + అగ్రేసరుండు) = పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు
ప్రజల = ప్రజలను
పాలించెన్ = పాలించాడు
భావం :
ఇతరుల గురించి వారు వెళ్ళిపోయిన తరువాత, చెడుగా మాట్లాడటం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం, మంచి మాటలు చెప్పడం ముందే లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే, ఆ సాయాన్ని చేయకుండా ఉండటం ఎప్పుడూ లేదు. అరకొరగా సాయం చేయడం ముందే లేదు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాదనిచ్చి, తరువాత అమర్యాదగా కోపించడం ముందే లేదు. మెచ్చుకున్నప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవరినీ మెచ్చడం అసలే లేదు.
పూర్వ రాజులు గొప్పగుణాలను ఎన్నో పరిశీలించి, ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా, అన్ని దిక్కులకూ తన కీర్తికాంతులను ప్రసరింపచేస్తూ, పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు, ప్రజలను పాలించేవాడు.
II.
3వ పద్యం
సీ. ఎంత లెస్సగ నున్న నంత వేడుకే కాని
ప్రజల కల్మికసూయపడుట లేదు.
తనుఁ గొల్వవలెనందఱను ప్రియంబేకాని
మానిసి వెగ టించుకైన లేదు
నిచ్చ వేఁడిన నర్థికిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుటలేదు;
రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని
న్యాయంబు దప్పిన నడకలేదు;
తే. కలఁడె యిటువంటి రాజులోకమున నెందు ?
జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల
నేలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె;
యేలవలె నన్యు ? లన నా నృపాలుఁడలరు.
ప్రతిపదార్థం :
ఎంత = ఎంతగా
లెస్సగన్ = బాగుగా (మేలుగా, సుఖంగా)
ఉన్నన్ = ఉన్నప్పటికినీ;
అంత = అంతగా
వేడుకె కాని = ముచ్చటయే కాని; (సంతోషమే కాని)
ప్రజల కల్మికిన్ = ప్రజల సంపదకు
అసూయపడుట = ఈర్ష్యపడడం అన్నది
లేదు = లేదు
తనున్ = తనను
అందఱు = ప్రజలందరూ
కొల్వవలెన్ = సేవించాలనే
ప్రియంబేకాని = ఇష్టమేకాని; (అందరూ తనతో కలసి ఆ పని, ఈ పని చేసుకుంటూ ఉండాలని కోరేవాడే కాని)
మానిసి, వెగటు = సరిపడని మనిషి;
ఇంచుకైన (ఇంచుక + ఐన) = కొద్దిగానైన
లేదు = లేదు (వాడు వద్దు; వీడు నాకు కిట్టడు, అనే వాడు లేడు)
నిచ్చ = ఎల్లప్పుడూ (అంటే మాటిమాటికీ వచ్చి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని కోరుతూ వచ్చినా)
వేడినన్ = కోరినా
అర్థికిన్ = యాచకునికి
ఇచ్చు = ఇచ్చేటటువంటి
చిత్తమెకాని = మనస్సేకాని
మునుపు = పూర్వము
ఇంత = ఇంతగా
ఇచ్చితిన్ = ఇచ్చాను
అనుటలేదు = అనడంలేదు (నిన్న, మొన్న అంతగా ఇచ్చాను కదా అని యాచకులను సాగనంపే వాడు కాడు)
రేపగల్ (రేయి + పగల్) = రాత్రింబగళ్ళు
ధర్మము + ఆర్జించు = ధర్మకార్యాలు చేస్తూ, పుణ్యం సంపాదించాలనే
దృష్టియెకాని = దృష్టియే కాని;
న్యాయంబు దప్పిన (న్యాయంబు + తప్పిన) = అన్యాయంగా ప్రవర్తించిన
నడకలేదు = వర్తనము లేదు
ఇటువంటి రాజు = ఇన్ని సుగుణాలు కల ధర్మరాజు వంటి రాజు;
లోకమునన్ = లోకంలో
ఎందున్ = ఎక్కడైనా
కలడె (కలడు + ఎ) = ఉన్నాడా ?
జలధి వలయిత వసుమతీ చక్రము;
జలధి వలయిత = సముద్రము చేత, చుట్టబడిన
వసుమతీ చక్రము = భూమండలము
ఎల్లన్ = అతటినీ
ఈ ఘనుండె = ఈ గొప్పవాడైన ధర్మరాజే
శాశ్వతముగాగన్ = శాశ్వతంగా
ఏలవలెన్ = పాలించాలి
అన్యులు = ఇతరులు
ఏల = ఎందుకు
వలెన్ = కావలెను
అనన్ (ప్రజలు) = అనేటట్లుగా
ఆ నృపాలుడు = ఆ ధర్మరాజు
అలరెన్ = శోభిల్లెను (ఉండేవాడు)
భావం:
ప్రజలు ఎంత గొప్పగా ఉంటే, అంతగా సంతోషపడే వాడే కానీ, ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలసిమెలసి ఉండడం ఇష్టమే కాని, ఎవరిపైనా అసూయతో ఉండేవాడు కాదు. తన్ను వేడిన యాచకులకు, దానం చేసేవాడే కాని, పూర్వం ఇంత ఇచ్చానని చెప్పి వారిని సాగనంపేవాడు కాడు.
రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ, పుణ్యం సంపాదించాలనే దృష్టేకాని, అన్యాయంగా ప్రవర్తించేవాడు. కాదు. ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ? (లేడు). సముద్రంచే చుట్టుకొనబడిన ఈ భూమండలాన్ని అంతటినీ, ఈ గొప్ప గుణాల ధర్మరాజే, శాశ్వతంగా పాలించాలి. ఇతర రాజులు ఎందుకు ? అని ప్రజలు అనుకొనేటట్లు, ఆ ధర్మరాజు ప్రకాశించాడు.
4వ పద్యం : (కంఠస్థ పద్యం)
*ఉ. కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నతవ ప్రియా
టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁ గా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందమన్?)
ప్రతిపదార్థం:
కోపము = కోపము
ఒకింత = కొంచెమైనా
లేదు = లేదు
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుఁబసిండి (కొంగు + పసిండి) = కొంగున మూటకట్టుకొని ఉన్న బంగారము వంటివాడు; (ఎప్పుడు కావలసివస్తే అప్పుడు ఉపయోగించుకోదగినది)
సత్యమా = సత్యమును చెప్పడం అంటే
రూపము = దాని స్వరూపమే అతడు (అతడు మూర్తీభవించిన సత్యగుణము అన్నమాట)
తారతమ్యములు = మనుష్యులలో ఉన్న హెచ్చు తక్కువలు (వ్యత్యాసములు)
ఎఱుంగన్ = తెలిసికోడంలో
స్వతంత్రుడు = స్వతంత్రంగా నిర్ణయించ -గలవాడు (వారూ, వీరూ చెప్పినట్లు కాకుండా, తానే స్వయంగా మంచిచెడ్డలను ఆలోచించి నిర్ణయము, కార్యమూ చేయడంలో స్వతంత్రుడు.).
నూతన ప్రియాటోపము;
నూతన ప్రియ = కొత్తవారి యందు ప్రేమను చూపించే
ఆటోపము = గర్వము, తొందరపాటు
లేని = ఏమీ లేనటువంటి
నిశ్చలుడు = స్థిర స్వభావము కలవాడు; (అనగా కొత్త వ్యక్తినీ, కొత్త విషయాన్నీ, వింతగానూ, పాతను రోతగానూ చూడకుండా ప్రవర్తించేవాడు.)
ఇట్లు = ఈ విధంగా
కృతలక్షణుడై = ప్రసిద్ధమైన లక్షణములు గలవాడై (కృతయుగంలో ఉండదగిన లక్షణములు కలవాడై అని కూడా అర్థము చెప్పుకోవచ్చు.)
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా
అల ధర్మనందనున్ = యమధర్మరాజు కుమారుడైన ఆ ధర్మరాజును (ధర్మమును ఆచరించుటయందే సంతోషం పొందేవాడిని)
ద్వాపర లక్షణుండు = సందిగ్ధమైన లక్షణాలు కలవాడు (ద్వాపరయుగంలో ఉండదగ్గ లక్షణాలు కలవాడని కూడా చెప్పవచ్చు)
అనగన్ వచ్చునొకో = అని చెప్పవచ్చునా ? (అనకూడదని భావం)
భావం :
కోపము కొంచెము కూడా లేదు. పండితులకు, కొంగున మూట కట్టిన బంగారం వంటివాడు. సత్య స్వరూపుడు. మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు. మంచిచెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసికోగల స్వతంత్రుడు. కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును, ద్వాపరలక్షణుడు అంటే ‘సందిగ్ధమైన లక్షణాలు గలవాడని (ద్వాపరయుగ లక్షణాలు కలవాడు) అనవచ్చునా ? (అనకూడదు) – కృతలక్షణుడు అనగా కృతయుగ లక్షణాలు కలవాడనాలి.
III.
5వ పద్యం
క. దుర్జయ విమతాహంకృతి.
మార్జన యాచనకదైన్యమర్దనచణ దో:
ఖర్జులు గలరతనికి భీ
మార్జున నకుల సహదేవులను ననుజన్ముల్.
ప్రతిపదార్థం :
దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనకదైన్యమర్దనచణ దోఃఖర్జులు;
దుర్జయ = (వీరిని) జయించ శక్యము కాదని ప్రసిద్ధిపొందిన
విమత = శత్రురాజుల
అహంకృతి = గర్వాన్ని
మార్జన = తుడిచివేయడానికిన్నీ
యాచనక = యాచకుల యొక్క
దైన్య = దీనత్వాన్ని
మర్దన = నిర్మూలించడానికిన్నీ;
చణ = నేర్పు కలిగిన (సమర్థులైన) బాహువుల (భుజముల) దురద
దోఃఖర్జులు = నేర్పు కలిగిన (సమర్థులైన) బాహువుల (భుజముల) దురద (తిమురు) గలవారు (భుజబలం గలవారు)
భీమార్జున నకుల సహదేవులు; = భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
అను = అనే
అనుజన్ముల్ = తమ్ముళ్ళు
అతనికిన్ = ఆ ధర్మరాజునకు
కలరు = ఉన్నారు
భావం :
ఆ ధర్మరాజుకు, భీమార్జున నకుల సహదేవులు అనే తమ్ముళ్ళు ఉన్నారు. వారు, ఓటమిని ఎరుగని వారిగా పేరు పొందిన శత్రువులను అయినా ఓడించడానికీ, యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికీ, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి యుండేవారు. వీరు నలుగురు సోదరులూ ప్రసిద్ధమైన భుజబలం కలవారు.
6వ పద్యం
క. పంచామర తరులో ! హరి
పంచాయుధములొ ! గిరీశు పంచాస్యములో
యంచువ్ సకల జనంబులు
నెంచన్ బాండవులు వెలసిరేవురు ఘనులై.
ప్రతిపదార్థం :
పాండవులు = పాండవులు
ఏవురు = ఐదుగురూ
పంచామరతరులో (పంచ + అమర, తరులు + ఓ) = అయిదు దేవతా వృక్షాలో; (దేవతావృక్షాలు :
- మందారము
- పారిజాతము
- సంతానము
- కల్పవృక్షము
- హరిచందనము)
హరి = విష్ణుమూర్తి యొక్క
పంచాయుధములో (పంచ + ఆయుధములు + ఒ) = అయిదు ఆయుధాలో; (విష్ణుమూర్తి ఆయుధాలు :
- పాంచజన్యము (శంఖం)
- సుదర్శనం (చక్రం)
- కౌమోదకి (గద)
- నందకము (ఖడ్గం)
- శార్ధము (విల్లు)
గిరీశు = శివుని యొక్క
పంచాస్యములో (పంచ + ఆస్యములు + ఓ) = అయిదు ముఖాలో
(ఈశ్వరుడి ఐదు ముఖాలు :
- సద్యోజాతము
- వామదేవము
- అఘోరము
- తత్పురుషము
- ఈశానము అనేవి)
అంచున్ = అంటూ
సకల జనంబులు = లోకులందరూ; (శత్రువులు కూడా)
ఎంచన్ = పొగిడేలాగున
ఘనులై = గుణాలచేత గొప్పవారై
వెలసిరి = వర్దిల్లారు.
భావం :
పాండవుల దానబుద్ధిని చూచి దేవతా వృక్షములా అని, వారి యుద్ధ విజయాలు చూచి, విష్ణుమూర్తి ఆయుధాలా అని, వారి పవిత్ర ప్రవర్తన చూసి ఈశ్వరుడి ముఖాలా ? అని ప్రజలందరూ సందేహించేవారు. కోరిన కోర్కెలు ఇవ్వడంలోనూ, శత్రువులను జయించడంలోనూ, పవిత్ర ప్రవర్తనలోనూ పాండవులందరూ గొప్పవారని భావం.
7వ పద్యం.
చ ఒరిమయు, భక్తియున్, నెవరు నోర్పుఁ, గనంబడఁ, బెద్దపిన్నయం
తరువులెఱింగి, మాటజవదాఁటకె, చెయ్యుల వేఱులేక, యొం
డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి, “పాండు కుమారులెంత నే
ర్పరు ? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ !” యవన్.
ప్రతిపదార్థం :
ఒరిమయున్ = స్నేహ భావమునూ (పొత్తునూ)
భక్తియున్ = భక్తియునూ
నెనరున్ = ప్రేమయునూ
ఓర్పున్ = సహనమునూ
కవంబడన్ = కనబడే విధంగా
పెద్ద పిన్న అంతరువులు = పెద్ద, చిన్న అనే వ్యత్యాసాలు
ఎఱింగి = తెలుసుకొని
మాట జవదాటక = ఒకరిమాట మరొకరు మీరకుండా
చెయ్వులన్ = చేసే పనులయందు
వేఱులేక = భేదభావం లేకుండా
ఒండొరుల మనంబులోన్ = ఒకరి మనస్సులో ఒకరు; (ఒకరిని అనుసరించి ఒకరు నడుచుకుంటూ)
పాండు కుమారులు = పాండురాజు పుత్రులయిన పాండవులు
ఎంత నేర్పరులు = ఎంత నేర్పరితనం కలవారు
ఇలన్ = లోకంలో
అన్నదమ్ముల సరాగము = అన్నదమ్ముల పరస్పర ప్రేమ
వారలదే సుమీ = వారిదే సుమా
అనన్ = అని ప్రశంసింపబడే విధంగా
గుచుండిరి = ప్రవర్తించేవారు;
భావం :
స్నేహము, భక్తి, సహనము కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరి మాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో పాండు కుమారులు ప్రవర్తించేవారు. వారిని చూసి ప్రజలు అన్నదమ్ముల ఒద్దిక (పరస్పర ప్రేమ) అంటే, వారిదే అని పొగిడేవారు.
చమత్కార విశేషము :
ఒకరి మనస్సులో మరొకరు మెలగడంలో చమత్కారం ఉంది. ధర్మరాజు మనస్సులో భీముడు ఉండకపోతే, భీముడి మనస్సులో ధర్మరాజు ఉండడానికి వీలులేదు. అయినా పాండవులు ఐదుగురూ, అలా ఉండగలిగారు. కాబట్టే “పాండు కుమారులెంత నేర్పరులు” అని కవి ప్రశంస.
IV.
8వ పద్యం
ఉ. అన్నలపట్లఁ దమ్ముల యెడాటమునన్ సముఁడంచు నెన్నఁగా
వెన్నిక గన్నమేటి, యెదురెక్కడలేక వృపాల కోటిలో
వన్నెయు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి, సాత్వికుల్
దన్నుఁమతింపఁగాఁ దవరు ధార్మికుఁడర్జునుఁ డొప్పు (వెంతయున్
ప్రతిపదార్థం :
అన్నలపట్ల = అన్నల యెడలనూ
తమ్ముల, ఎడాటమునన్ = తమ్ముల విషయముననూ;
సముడు = సమానమైన భావాలు కలవాడు
అంచున్ = అంటూ
ఎన్నగాన్ = ప్రజలు అనుకొనే విధంగా
ఎన్నిక + కన్న, మేటి = పేరు పొందిన ఘనుడు; (అన్నలయందు చూపిన గౌరవ స్నేహ భావాలనే తమ్ముళ్ళయందు కూడా చూపుతూ, ప్రవర్తిస్తాడని భావము.)
నృపాలకోటిలోన్ = రాజుల సమూహములో (కోటి మంది రాజుల్లోనయినా అని చమత్కారం).
ఎదురు = ఎదిరించి నిల్వగలవాడు
ఎక్కడలేక = ఎక్కడనూ లేక
వన్నెయున్ = ప్రసిద్ధినీ
వాసియున్ = గొప్పతనమునూ
కలిగి = కలిగియుండి
వర్తిలు = ప్రవర్తించే
పౌరుషశాలి = పరాక్రమవంతుడు
సాత్త్వికుల్ = సత్త్వ గుణం కలవారు (శాంత స్వభావులు)
తన్నున్ = తనను (అనగా అర్జునుడిని)
సుతింపగాన్ = ప్రశంసించే విధంగా
తనరు = ఉండే
ధార్మికుడు = ధర్మప్రవర్తన గలవాడునూ అయిన
అర్జునుడు = అర్జునుడు
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ = చాలా ఘనతతో ఉన్నాడు.
భావం :
అన్నలపట్ల, తమ్ములపట్ల సమబుద్ధితో మెలుగుతూ ఉంటాడని పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎదురులేని వాడిగా ప్రసిద్ధినీ, గొప్పతనమునూ కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు. సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మప్రవర్తన కలిగి యుండేవాడు.
9వ పద్యం : (కంఠస్థ పద్యం)
* చ. అతని నుతింప శక్యమె ? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మువన్
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం,
దత్తని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్.
ప్రతిపదార్థం :
అతనిన్ = ఆ అర్జునుని
నుతింపన్ = పొగడడానికి
శక్యమై = ఎవరికైనా శక్యమవుతుందా ? (శక్యము కాదని భావము) (ఎందుచేతనంటే ! అతడు).
సోయగమ్మునన్ = అందుమలో
జయంతుని తమ్ముడు = సౌందర్యానికి ప్రసిద్ధిపొందిన ఇంద్రపుత్రుడు జయంతుని వంటి వాడు.
కృపారసమ్మునన్ = దయారసములో
పతగ కులాధిపధ్వజుని;
పతగ = పక్షుల యొక్క
కుల = జాతికి
అధిప = ప్రభువయిన గరుత్మంతుని యొక్క
ధ్వజుని = జెండాగల (గరుడధ్వజుడైన విష్ణుమూర్తికి (కృష్ణునికి) పోలినవాడు)
ప్రాణసఖుండు = ప్రాణ స్నేహితుడు;
సమిజ్జయమ్మునన్;
సమిత్ = యుద్ధములందలి
జయమ్మునన్ = విజయాలలో
క్షితిధర కన్యకాధిపతికిన్;
క్షితిధర = పర్వతము యొక్క
కన్యకా = కూతురైన పార్వతి యొక్క
అధిపతికిన్ = భర్త అయిన ఈశ్వరుడికి
ప్రతిజోదు = పోటీ (ఎదిరి వీరుడు, అనగా పోలినవాడు)
చతురబ్ధి మహీతలమ్మునన్;
చతురబ్ధి (చతుః + అబ్ధి) = నాలుగు సముద్రములచేత
పరీత = చుట్టుకొనబడిన
మహీతలమ్మునన్ = భూమండలమందు
అతనికిన్ = అతనికి (ఆ అర్జునుడికి)
అతండె = అతడే
సాటి = సమానుడు; (ఇతరులు ఎవ్వరూ సాటికారు)
భావం :
అర్జునుడు అందంలో జయంతుని వంటివాడు. దయా స్వభావములో గరుడధ్వజుడైన విష్ణుమూర్తికి (కృష్ణునకు) ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతికి భర్తయైన శివుడికి యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు. నాలుగు సముద్రాలచే ఆవరింపబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి. (మరింకెవ్వరూ సాటికాదు). అటువంటి అర్జునుడిని, పొగడటం సాధ్యమా ? (సాధ్యం కాదు).
విశేషము :
1) జయంతుడు ఇంద్రుని కుమారుడు, జయంతుని తమ్ముడు అర్జునుడు, అర్జునుడు అంటే జయంతుని వంటి వాడని భావం. ఇక్కడ తమ్ముడు అనే పదాన్నే ఉపమావాచకంగా కవి ఉపయోగించడం దీనిలో చమత్కారం.
2) ‘ప్రాణసఖుడు’ – ప్రాణాన్ని పోలినవాడని అర్థము. ఇక్కడ సఖుడు అన్న పదము కూడా ఉపమావాచకము. దయారసానికి విష్ణువు ప్రసిద్ధుడు. లోకాలను పోషించేవాడయిన విష్ణువుకు (కృష్ణుడికి), అర్జునుడు ప్రాణసఖుడని ప్రతీతి. ఈ స్నేహము నరనారాయణుల కాలం నుండీ వస్తూంది. ఈ సంబంధాన్ని తెలిపే, “ప్రాణసఖుండ”న్న మాటనే, ఉపమావాచకంగా కవి వాడాడు.
3) ఈశ్వరుడికి ప్రతిజోదు – అంటే పోలినవాడు. ఇక్కడ ‘ప్రతిజోదు’ అనే పదము, ఉపమావాచకము; త్రిపుర సంహారం చేసిన ఈశ్వరుడు పరాక్రమానికీ, యుద్ధ విజయానికీ ప్రసిద్ధుడు. పురాణాలను బట్టి చూస్తే, పంది కోసం శివుడు కిరాత వేషంలో ఉండగా అర్జునుడు కిరాతుడిని ఎదిరించి, పాశుపతాస్త్రం సాధించాడు. ఆ సంబంధాన్ని తెలిపే ‘ప్రతిజోడు’ అన్నమాటను కవి ఇక్కడ ఉపమానంగా వాడడం ఇక్కడ చమత్కారం.
పద్యంలో గల ముఖ్య చమత్కారం : ఉపమానం చెప్పవలసి వచ్చినపుడు, “వాడి తమ్ముడు వీడని, వీడి నేస్తం వాడని, వాడి జోడు వీడని అంటాము. ఈ పద్యంలో జయంతుడిని, విష్ణువుని, ఈశ్వరుడిని పోలినవాడు అనడానికి, క్రమంగా తమ్ముడు, ప్రాణ సఖుడు, ప్రతిజోడు అని వారికి ఉన్న పురాణ సంబంధా లను సూచించే పదాలనే చమత్కారంగా కవి ఉపయో గించాడు.
మొదటి మూడు పాదాలలో ముగ్గురితో పోల్చి, నాలుగో పాదంలో ‘అతని కతండె సాటి’ అని చెప్పడం, కొంచెం అసందర్భంగా కనిపిస్తుంది. దానిని బట్టి “చతురబ్ధి పరీత మహీతలమ్మునన్” అన్నదంతా పేలవంగా కేవలం పాద పూరణంగా కనిపిస్తుంది.
కాని అది సరికాదు. పై చరణాలలో చెప్పిన జయంతుడు స్వర్గంలోనివాడు. విష్ణువు వైకుంఠంలోని వాడు. శివుడు కైలాసంలోని వాడు. ఆ ముగ్గురూ ఈ లోకంలోనివారు కాదు. ఈ లోకంలో సాటిచెప్పదగిన వాడు ఎవడు అని అడిగితే, “ఈ నాలుగు సముద్రాల చేత చుట్టబడిన సర్వప్రపంచంలోనూ సాటి చెప్పతగిన వాడులేడు. అతనికతడే సాటి. అని కవి బదులు చెప్పాడు. అర్జునుడికి సాటి అయినవారు స్వర్గాది లోకాల్లో ఉన్నారేమోకాని, భూలోకంలో అర్జునునికి సాటిలేరని చమత్కారం.
10వ పద్యం
తే. పాఱఁ జూచినఁ బరసేన పాఱఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు,
వేయు నేటికి ? నలపాండవేయు సాటి
వీరుఁడిలలేడు; ప్రతి రఘు వీరుఁడొకఁడు.
ప్రతిపదార్థం:
(అర్జునుడు) పాఱఁజూచినన్ (పాఱన్ + చూచినన్) = తేరిపార జూచినంత మాత్రము చేతనే;
పరసేన = శత్రు సైన్యము
పాఱఁజూచు (పాఱన్ + చూచున్) = పారిపోడానికి ప్రయత్నిస్తుంది.
వింటికిన్ = విల్లు ఎత్తి పట్టుకోడానికి
ఒరిగినన్ = వంగినంత మాత్రం చేతనే
రిపురాజి = శత్రువుల సమూహము
వింటికి = ఆకాశానికి (ఇక్కడ స్వర్గానికి అన్నమాట)
ఒరగున్ = అభిముఖమై వెడుతుంది. (అనగా ఆ శత్రువులు చచ్చి వీర స్వర్గం పొందుతారన్న మాట)
వేయున్, ఏటికిన్ = వెయ్యి మాటలు ఎందుకు ?
అల పాండవేయుసాటి = ఆ అర్జునుడితో పోల్చదగినటువంటి
వీరుడు = పరాక్రమవంతుడు
ఇలన్ = లోకములో
లేడు = లేడు
ప్రతి = అతనికి సాటి అయినవాడు
రఘువీరుడు = రామచంద్రుడు
ఒకడే = ఒక్కడే (ఇంకొకడు లేడని భావము)
భావం :
అర్జునుడు తేరిపారజూస్తే చాలు, శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. అతడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే చాలు, శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. ఇంక వేయి మాటలు ఎందుకు ? ఆ అర్జునుడితో సాటి అని చెప్పదగ్గవాడు, పోల్చడానికి రఘురాముడేకాని, ఈ లోకంలో మరొకడు లేడు.
పాఠం ఉద్దేశం / నేపథ్యం
పాండవుల ‘నియమావళిననుసరించి, అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్యవిస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెండ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి, ‘విజయవిలాసం’ అనే ప్రబంధాన్ని చేమకూర వేంకటకవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు.
కోరిన కోర్కెలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరు గాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞాపరిపాలనావ్రతాన్ని, అర్జునుని పౌరుష, సత్త్వస్వభావాలనూ ప్రతిమానవుడు అలవరచుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ‘ప్రబంధ’ ప్రక్రియకు చెందినది. ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ‘ప్రబంధం’ వర్ణన ప్రధానమైనది. దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి.
ఈ పాఠ్యభాగం ‘ప్రతి పద్య చమత్కారచణుడు’ చేమకూర వేంకటకవి రచించిన ‘విజయవిలాసం’ ప్రబంధంలోని ప్రథమాశ్వాసం లోనిది.
కవి పరిచయం
పాఠము పేరు : చేమకూర వేంకటకవి
కవి : ‘ధర్మార్జునులు’
కవి తండ్రి : లక్ష్మణామాత్య
కాలము : 17వ శతాబ్దం
ఈయన ఎవరి ఆస్థానకవి : ఈ కవి, తంజావూరు రాజ్యాన్ని పాలించిన, ‘విజయభవన’ అనే కవిపండిత సభను నిర్వహించిన, “అభినవ భోజరాజు” అని బిరుదు పొందిన రఘునాథనాయకుని ఆస్థానకవి.
కవి రచనలు :
- సారంగధర చరిత్ర,
- విజయవిలాసం
విజయవిలాసం ప్రత్యేకత : తాను రచించిన ‘సారంగధర చరిత్ర’ కావ్యంలో మహారాజుకు అంకితం ఇవ్వదగిన లక్షణాలు లేవని తలచి, సర్వగుణ సంపన్నంగా ‘విజయవిలాసం’ కావ్యాన్ని ఈ కవి రచించాడు.
విజయవిలాసంలో చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరు పొందాడు. ‘పిల్లవసు చరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహా కావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తున్నారు.
విజయవిలాస కావ్య రచన : ఈ కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతి పద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా విజయవిలాసాన్ని రచించి రఘునాథరాయలకు ఈ విజయవిలాసాన్ని అంకితం చేశాడు.
ప్రవేశిక
ప్రాచీన కాలం నుంచీ రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మనదేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే, అనంతర కాలానికి ఆదర్శాలయినాయి. మహాభారత కాలంలోను భీష్ముడు, విదురుడు, ధర్మరాజుకు స్ఫూర్తిని ఇచ్చారు. “యథా రాజా తథా ప్రజాః” రాజు ఎట్లా ఉంటే, ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి, ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, తన సోదరులపట్ల, ప్రజలపట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకొనేందుకు ఈ పాఠం చదువండి.
విద్యార్థులకు సూచనలు
- పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
- పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
- వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.