Telangana SCERT 9th Class Telugu Guide Telangana 10th Lesson వాగ్భూషణం Textbook Questions and Answers.
TS 9th Class Telugu 10th Lesson Questions and Answers Telangana వాగ్భూషణం
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 98)
మాటల కోటలు గట్టి
మహారాజుగా మసలుతాడొకడు
మాట చేటలతో.
మనసు చెరిగి పోతాడొకడు.
మాటలు బాటలు వేస్తాయి.
మాటలు పాటలు రాస్తాయి.
మాటలు లేకపోతే
కవిత లేదు.
గానం లేదు.
నాగరికత లేదు.
నవ్యత లేదు జాగృతి లేదు.
చైతన్యాకృతి లేదు
వెలుగును చూపించేది
విశ్వాన్ని నడిపించేది
వాక్ఛక్తి వాగ్రక్తి
– వేముగంటి నరసింహాచార్యులు
ప్రశ్నలు
ప్రశ్న 1.
ఈ కవితను ఎవరు రాశారు ? ఇది దేని గురించి చెప్పుతుంది ?
జవాబు:
ఈ కవితను వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారు. ఇది ‘వాక్ఛక్తి’ ని గురించి చెపుతోంది.
ప్రశ్న 2.
మాటల గొప్పతనం ఏమిటి ?
జవాబు:
- మాటలు బాటలు వేస్తాయి.
- మాటలు పాటలు రాస్తాయి.
- మాటలు లేకపోతే కవిత్వం లేదు.
- మాటలు లేకపోతే సంగీతం లేదు.
- మాటలు లేకపోతే నాగరికత, నవ్యత లేవు.
- జాగృతి, చైతన్యం లేవు.
ప్రశ్న 3.
మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి?
జవాబు:
మంచిగా మాట్లాడడం అంటే, శ్రోతల మనస్సులకు ఆనందాన్ని కలిగించేలా, మంచి విషయంతో, మంచి కంఠధ్వనితో, ఎక్కువ సేపు కాకుండా, క్లుప్తంగా మాట్లాడడం.
ప్రశ్న 4.
వాక్ఛక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది ?
జవాబు:
వాక్ఛక్తి మాటలోని శక్తి. వాగ్రక్తి – మాట యందు ఆసక్తి. ఈ వాక్ఛక్తి, వెలుగును చూపించి, ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందువల్ల వాక్కునందు రక్తి అనగా ఆసక్తిని కలిగియుండాలి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 101)
ప్రశ్న 1.
“సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటే భాషణం మంచి సాధనం” – దీనిపై చర్చించండి.
జవాబు:
ఈ రోజు సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, జనాభా సమస్య, బాలకార్మిక వ్యవస్థ, చంటి పిల్లల ఆరోగ్య సమస్య, వివాహాలలో అధిక ఖర్చులు మొదలైనవి.
ఎవరి మట్టుకు వారు ఇటువంటి సమస్యలను గురించి వాటి పరిష్కార మార్గాలను గురించి తమకు తెలిసినా, మాకెందుకులే అని మాట్లాడక ఊరు కుంటున్నారు. తామొక్కరూ ఏమి చేయలేమని నిశ్శబ్దం వహిస్తున్నారు. అట్లా కాకుండా, కర్తవ్యాన్ని గూర్చి, పరిష్కారాలను గూర్చి, ప్రతివ్యక్తి గొంతెత్తి మాట్లాడితే. క్రమంగా ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకు తుంది.
ప్రశ్న 2.
“మనిషికీ, పశువుకీ ప్రధాన భేదం వాక్కు” అన్నాడు. రచయిత – అటువంటి వాక్ శక్తిని ఎట్లా పెంపొందించు కుంటారు?
జవాబు:
కొంత సాహసించి, కొంత ప్రయత్నించి, తనలోని పఠనశక్తిని వెలికితీసి ప్రయోగించాలి. ప్రతివ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల వక్తృత్వ కళలో నేర్పు సంపాదించగలుగుతాడు.
ప్రశ్న 3.
“వక్తృత్వశక్తి ఆత్మశక్తికి మరో పేరు” ఎట్లాగో చెప్పండి.
జవాబు:
వక్తృత్వం చెప్పగల శక్తి తనకున్నదని, ముందుగా అతడు తన ఆత్మలో గట్టిగా నమ్మకం కలిగి ఉండాలి. తనకు మాట్లాడే శక్తి ఉన్నదని ఆత్మ విశ్వాసం కలిగియుండాలి. తనలో ఆ శక్తి ఉందని గుర్తిస్తే, మానవ జీవితం సఫలం అవుతుంది.
ప్రశ్న 4.
వాక్శక్తిని అర్థం చేసుకుంటే ఏ.ఏ రంగాల్లో రాణించ వచ్చు? చర్చించండి.
జవాబు:
వాక్శక్తిని అర్థం చేసుకుంటే, గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వేపనివారు, ప్రచురణ. కర్తలు, ఇంకా ఎన్నో వృత్తులలో ఉన్నవాళ్ళు రాణింప వచ్చు. వారు తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 103)
ప్రశ్న 1.
‘అన్ని కళలకెల్లా ఉత్తమమైనది వక్తృత్వకళ” దీని ప్రయోజనాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
సహృదయులైన వక్తలు వక్తృత్వాన్ని సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉపన్యాసాల వల్ల ప్రజల హృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది. అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. ఏడ్పు వస్తుంది. వారు కార్యం చేయడానికి సిద్ధమవుతారు. నవరసాలతో నిండిన హృదయాలు కలవారవుతారు.
ప్రశ్న 2.
‘మాట్లాడటం సాహసమే’ అని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
శ్రోతల ఎదుట మాట్లాడడం, నవ్వులాటగాదు. అది సాహసం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు భయం కలుగుతుంది. మనం పెద్దగా చదువుకోలేదనే జంకు కల్గుతుంది. ఒకప్పుడు సభలో వక్త కంటే ఎక్కువగా చదువుకున్నవారు ఉంటారు. వారు వక్త ఉపన్యాసంలో దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఉపన్యాసానికి బాగా సన్నద్ధత కావాలి. ఒకప్పుడు సన్నద్ధం అయినా, నిలబడేటప్పటికి వక్తలు విషయం మరచిపోతూ ఉంటారు. ఒకప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అందువల్లనే రచయిత మాట్లాడడం సాహసమే అని చెప్పాడు.
ప్రశ్న 3.
‘భయాన్ని – అనుమానాన్ని వదులుకున్నవాడు వక్త కాగలడు’ – దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
భయంలేనివాడు అజేయుడు. భయాన్ని వదలుకుంటే భాషలో స్పష్టత వస్తుంది. వక్త తాను ఎలా మాట్లాడు తున్నానో అనే చింతను విడిచిపెట్టాలి. సభలో నిలబడి తన మనస్సులో ఉన్న భావాన్ని జడుసుకోకుండా, సిగ్గుపడకుండా ధారాప్రవాహంగా చెప్పాలి.
భయాన్ని, అనుమానాన్ని వడలిపెట్టి మాట్లాడితే నిజంగానే గొప్ప వక్త అవుతాడని నా అభిప్రాయము.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 104)
ప్రశ్న 1.
“విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం ఒక ఇతిహాసఘట్టం” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
నిజమే. ఆనాడు విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి “భారతీయధర్మం, అన్ని మతాల్నీ గౌరవిస్తుందనీ, అంగీకరిస్తుందనీ, అన్ని మతాలూ సత్యాలేననీ, అన్ని మతాలూ భగవంతుడిని చేరుకోడానికి మార్గాలేననీ చెప్పాడు. తన మతమే నిలవాలని అనుకోనేవారు, బావిలో కప్పలాంటి వారని సత్యాన్ని ప్రకటించాడు. అందువల్ల ఆ ఉపన్యాసం, నిజంగానే ఒక ఇతిహాసిక ఘట్టం.
ప్రశ్న 2.
ఉపన్యాసానికి ముందు ప్రణాళిక అవసరం. ఎందుకు?
జవాబు:
ఉపన్యాసం చెప్పేటప్పుడు వక్తలు, అప్పుడప్పుడు చెప్పే విషయాన్ని వదలి, ఇతర విషయాలను గూర్చి. మాట్లాడుతూ ఉంటారు. వక్త యొక్క వాగ్ధార ఎక్కడైనా ఆగిపోవచ్చు. వక్త ఒక్కొక్కసారి చెపుతూ చెపుతూ ఆగిపోతాడు. అతడు మధ్య మధ్య అనుమానాలు వచ్చి, నీళ్ళు నమలవలసి వస్తుంది. అందువల్ల ప్రసంగించ డానికి ముందు ప్రణాళిక అవసరం.
ప్రశ్న 3.
వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం. ఎందుకో చెప్పండి ?
జవాబు:
వక్తకు సమానార్థక పదాలతోనూ, పర్యాయ వాచకాల తోనూ మంచి పరిచయం ఉండాలి. అప్పుడే అతడు యథోచితంగా వాటిని ప్రయోగించగలడు. సభలోని సభ్యుల జ్ఞాన పరిమితికి తగిన పదజాలం వక్త ఉపన్యా సంలో వాడాలి. పెద్దల సభలో, విజ్ఞుల సభలో కఠిన పదాలు, వ్యంగ్యార్థాల పదాలు వాడితే రమణీయంగా ఉంటుంది. చిన్న పిల్లల సభల్లో, సామాన్యుల సభల్లో అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. కాబట్టి వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 106)
ప్రశ్న 1.
వక్తకు జ్ఞాపకశక్తి ఎట్లా ఉపయోగపడుతుంది ?
జవాబు:
వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఉపన్యాసానికి ముందే బాగా ప్రణాళిక ప్రకారం సిద్ధమైనా, మాటిమాటికీ కాగితం చూస్తూ మాట్లాడితే ఉపన్యాసం రంజుగా సాగదు. మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. చెప్ప దలచుకున్న విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను చీటీపై వ్రాసుకొని, ఏ అంశాన్నీ మరిచి పోకుండా, క్రమబద్ధంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి ఉంటే విషయాన్ని ధారాప్రవాహంగా, పూర్వకవుల పద్యాలు, శ్లోకాలు ఉదాహరిస్తూ, వాటిని వ్యాఖ్యానిస్తూ, సొగసుగా మాట్లాడగలుగుతాడు.
ప్రశ్న 2.
మంచి వక్త కావడానికి ఏం చేయాలి?
జవాబు:
- చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను చీటీపై వ్రాసుకొని, ఏ విషయమూ మరచిపోకుండా క్రమంగా చెప్పదలచిన విషయాన్ని చెప్పాలి.
- ముందుగా చిన్న పిల్లల సభల్లో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
- నదీ తీరంలోనో, కొండ మీదో, నిలబడి, ఒంటరిగా ‘కొండనూ, నదినీ, ప్రకృతినీ ఉద్దేశించి మాట్లాడితే సభాకంపనం తగ్గుతుంది.
- శ్రోతలను శిలామూర్తులని భావించి ప్రసంగం చేయాలి.
- శ్రోతల సంఖ్యను బట్టి తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.
- భావానుగుణమైన ధ్వని ప్రసారం వల్ల లాభం ఉంటుంది.
- ఉపన్యాస వాక్యాలు చిన్నవిగా ఉండాలి.
- వేగంగా మాట్లాడరాదు.
- సమయాన్ని ఉల్లంఘించరాదు.
- తర్కబద్ధంగా క్లుప్తంగా మాట్లాడాలి.
ప్రశ్న 3.
‘బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడుతాడు’ దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
బాగా ఆలోచించేవాడు ఏ మాటలు మాట్లాడితే బాగుంటుందో ముందే బాగా ఆలోచించుకొని, అవసరమైన మాటలే తక్కువగా మాట్లాడుతాడు. దీర్ఘమైన అనవసర ప్రసంగాలు చేయడు. బాగా ఆలోచించనివాడు . అవసరమైనవీ, లేనివీ కలిపి, సుదీర్ఘంగా మాట్లాడుతాడు. అందుకే వేమన ‘కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు’ అన్నాడు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 107)
ప్రశ్న 1.
“అయిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంట సేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం”. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
అయిదే నిమిషాలలో ఉపన్యాసం ముగించాలంటే, కేవలం ఆ సభకు అనుగుణమైన, అతి ముఖ్యమైన మాటలే క్లుప్తంగా, తర్కబద్ధంగా రసానుభూతి కల్గించేటట్లు, మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలో బాగా గంటలసేపు ఆలోచించ వలసివస్తుంది.
గంటసేపు మాట్లాడాలంటే ముఖ్య విషయాన్ని ఆ గంటలో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. వక్తకు కావలసిన సమయం అతని చేతిలో ఉంటుంది. కాబట్టి నేను పై మాటలను సమర్థిస్తున్నాను.
ప్రశ్న 2.
‘వాక్కు మనిషికి అలంకారం’ దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
“వాగ్భూషణం భూషణం” అన్నాడు భర్తృహరి మనిషికి నిజమైన అలంకారము వాక్కే. కేయూరములు, హారములు, విలేపన ద్రవ్యములు, పూలు, మనిషికి నిజమైన అలంకారాలు కాదు. మాట మాత్రమే నిజమైన అలంకారం. చక్కగా మాట్లాడే వ్యక్తిని, అందరూ గౌరవిస్తారు. మంచివాక్కు గలవారి మాటకు మన్నన లభిస్తుంది. మంచివాక్కు ఉంటే ఎదుటివారికి నచ్చచెప్పగలరు. మంచిగా మాట్లాడేవారు, ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
‘నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది.’ – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
కోయిల తియ్యగా కూస్తుంది. చిలుక చక్కగా మాట్లాడుతుంది. ఆ రెండింటినీ మనం ఆదరిస్తాము. కాకి “కాకా” అంటూ పరుషంగా మాట్లాడుతుంది. ఆ కాకిని మనం తరిమి పారవేస్తాము. దానిని బట్టి నోరు మంచిదైతే, ఊరు మంచిదౌతుందని గ్రహించగలం.
మనం పొరుగూరికి వెళ్ళి, అక్కడి వారితో మంచిగా, గౌరవంగా మాట్లాడితే, ఆ ఊరి ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఆ ఊరులో జనం అంతా మనలను మంచిగా చూస్తారు. అలాగే నిత్యజీవితంలో కూడా, మనం ప్రక్కవారితో మంచిగా, మన్ననగా, కలుపుగోలుగా మాట్లాడితే అక్కడి వారు మనలను మంచిగా చూస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కనుక మనిషి తియ్యగా, చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి.
ప్రశ్న 2.
కింది పదాలు ఈ పాఠంలో ఏ ఏ పేరాల్లో ఎన్నో పంక్తిలో ఉన్నాయో గుర్తించి, వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి.
అ) ధారాశుద్ధి ఆ) వక్తృత్వ కళోపాసనం ఇ) ఊనిక ఈ) వచశైలి ఉ) వ్యంగ్యార్థం ఊ) తపస్సు
జవాబు:
అ) ధారాశుద్ధి : ‘ధారాప్రవాహం’ అనే పదం, పాఠంలోని 9వ పేరాలో 6వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం చెప్పేటప్పుడు భయం సిగ్గు లేకుండా మాటలు ధారాప్రవాహంగా మాట్లాడాలని రచయిత చెప్పాడు. తడుముకోకుండా నదీ ప్రవాహంలా మాట్లాడాలన్నమాట.
ఆ) వక్తృత్వ కళోపాసనం : ఈ పదం పాఠంలో 28వ పేరాలో మూడవ పంక్తిలో ఉంది. వక్తృత్వం అనేది ‘కళ’ అని, నిద్రాణమై ఉన్న మనశ్శక్తి మేల్కోవాలంటే, వక్తృత్వకళోపాసన ముఖ్యం అనీ రచయిత చెప్పాడు. ఉపన్యాసం చెప్పడాన్ని కళగా గౌరవించి, దానిని ఆదరించాలని కవిగారి అభిప్రాయం.
ఇ) ఊనిక : ఈ పదం, పాఠంలో 19 వ పేరాలో 25 వ పంక్తిలో ఉంది. ఉపన్యాసం ‘చెప్పేటప్పుడు వక్త కొన్ని వాక్యాలను ఊనికతో ఒత్తి పలకాలి. కొన్ని వాక్యాలను మందంగా పలకాలి. వక్తృత్వంలో భావానికి తగిన ధ్వని ప్రసారం ఉండాలని రచయిత చెప్పాడు. రసానుగుణంగా పదాలు పలకాలి. రౌద్రరస పదాలను నసుగుతూ గొణుగుతూ పలకరాదు. దయ, శాంతి, కరుణ వంటి మాటలను గంభీరంగా పలకరాదు.
ఈ) వచశ్శైలి : ఈ పదం పాఠంలో 8 వ పేరాలో 2 వ పంక్తిలో ఉంది. ప్రతి వ్యక్తికి తాను మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. అతడికి ఒక ఆలోచనా పద్ధతి ఉంటుంది. వారు మాట్లాడే పద్ధతినే ‘వచశ్శైలి’ అంటారు.
ఉ) వ్యంగ్యార్థం : ఈ పదం పాఠంలో 13 వ పేరాలో 3వ పంక్తిలో ఉంది. ఉపన్యాసంలో కావ్యంలోలాగే వ్యంగ్యార్థం ప్రాధాన్యం వహిస్తుంది. వ్యంగ్యార్థ ప్రతిపాదన లేని భావాలు, వక్తకు గౌరవం తీసుకురావు. కావ్యంలాగే ఉపన్యాసం కూడా, వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించినప్పుడు అది ఉత్తమ ఉపన్యాసం అవుతుంది.
ఊ) తపస్సు : ఈ పదం పాఠంలో 22 వ పేరాలో మొదటి పంక్తిలో ఉంది. ఈ తపస్సును ఋషులు, మునులు భగవంతుని అనుగ్రహం పొందడానికి చేస్తారు. అలాగే ఉపన్యాసంలో తాను కోరుకున్న విషయాన్నే చెప్పేశక్తి, కేవలం తపస్సు వల్లనే సాధ్యమవుతుందని రచయిత చెప్పాడు.
ప్రశ్న 3.
కింది అంశాన్ని చదివి, తప్పొప్పులను గుర్తించండి.
మహాత్ములు ఒక విషయాన్ని సంకల్పించుకొని దానిని మాటల ద్వారా చెప్పి, చెప్పిన దానిని చేసి చూపిస్తారు. తలచింది చెప్పడం, చెప్పింది చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అది యెంతటి మహాత్ములకో గాని సాధ్యపడదు.
“మనసు, మాట, నడత మనిషికి ఒకటైన
మనిషి కాదు వాడు మహితుడౌను”
మనసులోని ఆలోచన, మాట్లాడేమాట, నడిచే నడత ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మహాత్ముడు. మన మాటలకు మన చేతలకు మూలం మన ఆలోచనలు. కాబట్టి మన ఆలోచనలు సదాలోచనలు కావాలి. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆలోచన ఈ మూడు ఏకం కావాలి.
అ) మాటల ద్వారా చెప్పి, చెప్పిందాన్ని చేసేవారు మహాత్ములు
జవాబు:
ఒప్పు
ఆ) చెప్పింది చేయడం చాలా సులభం.
జవాబు:
తప్పు
ఇ) ఆలోచనలు సదాలోచనలు కావాలి.
జవాబు:
ఒప్పు
ఈ) మనసు – మాట – నడత ఒకటైనవాడు మహితుడు కాడు.
జవాబు:
తప్పు
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చక్కగా పొందికగా ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మాట్లాడగలవాడికి, అన్నీ విజయాలే సిద్ధిస్తాయి. మంచి ఉపన్యాసకుడు పార్టీ నాయకుడైతే ప్రజలు ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తారు. మంచిగా నేర్పుగా మాట్లాడగలిగితే, ఉద్యోగాల ఇంటర్వూలలో నెగ్గి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. రాజకీయ నాయకులు చక్కగా వాగ్దానాలు వరదగా పారించి, ఎన్నికలలో గెలుస్తారు. మన జీవితంలో సైతమూ, ప్రక్కవారితో పొందికగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోవచ్చు.
భార్యాబిడ్డలతో కూడా నేర్పుగా, ఓర్పుగా మాట్లాడి వారి ప్రేమను పొందవచ్చు. ఒకరి వద్ద పనిచేసినపుడు యజమానికి అనువుగా మాట్లాడి, ఆ యజమాని మన్ననలను పొందవచ్చు. చక్కగా మాట్లాడడం, సరసంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు హాయి కలిగేటట్లు మాట్లాడడం అనే వాటి ద్వారా జీవితంలో ఏదైనా సాధింపగలరు.
ఆ) శాస్త్రమర్యాదలకు లోబడిన వాక్కు ‘పవిత్రమైనది’, ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?.
జవాబు:
‘వాక్కు’ అంటే మాట. వాక్కు సరస్వతీ స్వరూపము. మాట్లాడే మాట, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉండాలి. మాట, సభ్యతా సంస్కారాలు కలిగి ఉండాలి. భారతీయులు, వాక్కును సరస్వతీ దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం, పుణ్యం అని పెద్దలు అన్నారు. కాబట్టి వ్యాకరణ శాస్త్ర మర్యాదకు అనుగుణంగా తప్పులు లేని భాషను మాట్లాడాలి.
వాక్కు మనిషికి అలంకారం వంటిది. భాష మనిషికి ఎన్నడూ కళ తగ్గని అలంకారం. చక్కని భాషలేని వాడికి, మంచి వేషం ఉన్నా వ్యర్థమే. వాగ్ధార, కత్తి అంచు కంటే పదునైనది. భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి, ఆయా అక్షరాల ధ్వనులను స్పష్టంగా, నిర్దుష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉచ్చరించడం మనం అలవాటు చేసుకోవాలి.
భాష పవిత్రమైనది. కాబట్టి దానిని శాస్త్ర సమ్మతంగానే మాట్లాడాలి. మంచి భాష అలవడడం కోసం, పుస్తకాలలోని ప్రసిద్ధుల ఉపన్యాసాలను అధ్యయనం చెయ్యాలని రచయిత అభిప్రాయము.
ఇ) వక్తృత్వంలో శరీర కదలికల (అంగవిన్యాసం) పాత్ర ఎట్లాంటిది ?
జవాబు:
మహోత్సాహంతో మాట్లాడేటప్పుడు, ఉత్తేజకర భావాలను ప్రకటించేటప్పుడు, పండితుడైన వక్త కండ్లలో, కనుబొమ్మల్లో. చేతుల్లో, ముఖంలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న దానికి సరైన సమాధానం దొరకడం కష్టం.
ఈ అంగాంగ సంచలనం అన్నది, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వక్త తన భావాలను ప్రకటించేటప్పుడు, అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీలేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ మాత్రం కదలకుండా పరిమితమైన అంగవిన్యాసం చేస్తూ, స్తంభంలా నిలబడి మాట్లాడేవారు కూడా ఉంటారు.
ఈ) ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన “వాగ్భూషణం” పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది ?
జవాబు:
నేటి విద్యార్థులు అన్ని కళల కంటె, ఉదాత్తమైన ఈ వక్తృత్వం పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. విద్యార్థులకు ఈ ఉపన్యాస కళ చాలా ముఖ్యము. వారు ఉద్యోగాలు సంపాదించడానికి, ఇంటర్వ్యూలను ఎదుర్కోడానికి, ఈ ఉపన్యాసశక్తి వారికి ఉపయోగపడుతుంది. సిగ్గు, భయం లేకుండా ఇంటర్వ్యూలలో వచ్చే ప్రశ్నలకు వారు ధైర్యంగా జవాబులు చెప్పగలరు.
ఇరివెంటి కృష్ణమూర్తిగారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకొనే పద్ధతులను గూర్చి, చెప్పారు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసం చెప్పడానికి ఎలా సంసిద్ధం కావాలో చెప్పారు. వక్తకు కావలసిన పాండిత్యం గురించి ఈ వ్యాసంలో చెప్పారు. వక్త ఎటువంటి శబ్దార్థాలను ప్రయోగించాలో చెప్పారు. వక్తకు కావలసిన జ్ఞాపకశక్తిని గూర్చి చెప్పారు. ఉపన్యాసం చెప్పే పద్ధతిని ఎలా అలవాటు చేసుకోవాలో దీనిలో చెప్పారు.
ఉపన్యాసం చెప్పేటప్పుడు తమ కంఠధ్వనిని ఎలా నియంత్రించుకోవాలో, రసానుగుణంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసంలో క్లుప్తతతో, స్పష్టత అవసరం అని చెప్పారు. వక్తృత్వం అనేది ఒక కళ అనీ, దాన్ని ఆరాధించాలనీ చెప్పారు. మొత్తంపై విద్యార్థులు ఈ వ్యాసం చదివితే, ఉపన్యాసకళపై మక్కువ పెంచుకొని, ఉపన్యాసం మాట్లాడే పద్ధతులు గ్రహించి వారు మహోపన్యాసకులు కాగలరు. గొప్ప రాజకీయ నాయకులు కాగలరు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) ‘ఉపన్యాసం – ఒక గొప్పకళ’ దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ఉపన్యాసం ఒక గొప్పకళ. మాట్లాడడం, మనిషికి మాత్రమే లభించిన వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అల్లుకొని మాట్లాడితే, అది ఉపన్యాసం అవుతుంది. వక్తృత్వ కళలో అందరూ నేర్పును సాధింపవచ్చు. మాట్లాడడం నేర్చుకొని, తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకోవచ్చు.
వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలి. చదువు ఎంత వస్తే, అతడి ఉపన్యాసం అంతగా రాణిస్తుంది. అతడి మాటల్లో గాంభీర్యం, సంస్కారం ఉంటుంది. భయాన్నీ, అనుమానాలను వదలి, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే వారు మంచి ఉపన్యాసకులు అవుతారు. భయాన్ని విడిచి, ధారాప్రవాహంగా మాట్లాడాలి. ఉపన్యాసం, శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది.
కొన్ని ఉపన్యాసాలు మంచి పేరు పొందుతాయి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణుడి ఉపన్యాసం, విశ్వమతమహాసభలో వివేకానంద స్వామి ఉపన్యాసం పేరుకెక్కాయి. వక్త తాను చెప్పదలచిన విషయంపై తన్మయత్వంతో గంభీరంగా మాట్లాడాలి. వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.
వక్త చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన సామగ్రిని బాగా సేకరించాలి. దానికోసం ఎన్నో పుస్తకాలు చదివి, విషయాలు సేకరించాలి. మొదట పిల్లల వద్ద మాట్లాడాలి. ఒంటరి ప్రదేశాలలో మాట్లాడాలి. అలాచేస్తే సభాకంపం పోతుంది. విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలి.
శ్రోతల ముఖాలను చూస్తూ, మాట్లాడాలి. రసానికి అనుగుణంగా తన కంఠాన్ని సవరించి హెచ్చుతగ్గులు చేస్తూ మాట్లాడాలి. దీర్ఘపన్యాసాలు చేయరాదు. ఉపన్యాస కాలాన్ని అతిక్రమించరాదు. తర్కబద్ధమైన క్లుప్తమైన ఉపన్యాసం చాలా గొప్పది.
ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, ముగించే ముందు, ఎంతో పదిలంగా మనోరంజకంగా, మాట్లాడాలి. ఇతరుల మనస్సులకు హాయి కల్గించేటట్లు, చీకటిలో దీపం వెల్గించినట్లు, అజ్ఞానం పారిపోయేటట్లు, మాట్లాడడం, బుద్ధిమంతుడి లక్షణం.
3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.
అ) ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడవలసిన అంశమయిన ‘మాటగొప్పదనం’ మీద ప్రసంగ వ్యాసం రాయండి.
జవాబు:
‘మాటగొప్పదనం’
మిత్రులారా! ఈ రోజు ప్రపంచభాషా దినోత్సవం. ఈ సందర్భంగా ‘మాటగొప్పదనం’ గురించి ముచ్చటిస్తాను.. భర్తృహరి వాగ్భూషణం భూషణం అన్నాడు. అంటే మనిషికి వాక్కే అలంకారం. దానిని బట్టి మాటకు ఉన్న శక్తిని మనం గుర్తించవచ్చు. ‘పలుకే బంగారం’ అని పెద్దలంటారు. మాట మనిషికి దేవుడిచ్చిన వరప్రసాదం. మనిషిని మిగతా జీవుల నుండి వేరు చేసి, గొప్పవాడిగా నిలబెట్టినది మాట మాత్రమే.
ఎప్పటికేది ప్రస్తుతమో, అప్పటికి ఆ మాటలాడగలవాడు ధన్యుడు. అతడే గొప్పకార్యసాధకుడవుతాడు. మంచివాక్కు, కల్పవృక్షం వంటిది. మనిషి స్థాయి, అతడి మాట వల్ల తెలుస్తుంది. మాధుర్యం గల మాటలు కార్యసాధకములు. మంచి మాటలు, స్నేహాన్ని పెంచుతాయి. ఆనందాన్ని ఇస్తాయి: బాధలో ఉపశమనాన్ని ఇస్తాయి. మాటలలో కాఠిన్యం పనికిరాదు. కోయిలలా మాట్లాడాలి. కాకిలా మాట్లాడరాదు.
మాటలతో కోటలు కట్టి, మనిషి మహారాజు కాగలడు. దేశప్రధాని కాగలడు. మాటలు పాటలు రాస్తాయి. మాటలు స్నేహానికి బాటలు వేస్తాయి. మాటల వల్లే కవిత్వ సంగీతాలు నిలిచాయి. మాటల వల్లే నవ్యత, నాగరికత, చైతన్యం వెలుగు చూశాయి. విశ్వాన్ని వాక్శక్తి నడిపిస్తుంది. తన బాట బలిమితోనే, మాట నేర్పుతోనే, మోదీ మనకు ప్రధానికాగలిగాడు.
భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం పుణ్యం అన్నారు. మాట మనిషికి అలంకారం చక్కని భాషలేనివాడు అందమైన వేషం వేసుకొన్నా వ్యర్థమే. వాగ్ధార కత్తి అంచు కంటే పదునైనది. వాక్కు విశాలమైనది.
ఒక మంచిమాట లోకాన్ని జయిస్తుంది. వివేకానందుని చిన్న ఉపన్యాసం, ప్రపంచాన్ని జయించింది. భారతదేశం పట్ల ప్రపంచానికి గౌరవాదరాలను తెచ్చిపెట్టింది. మాట పదునైన ఆయుధం. దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత, మానవుడిపైనే ఉంది. ఒక తియ్యటి మాటతో, ప్రపంచం అంతా మనకు మిత్రరాజ్యం అవుతుంది. మాటకు కల గొప్పదనం చెప్పడం అసాధ్యం.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ప్రశ్న 1.
భారతక్రికెట్ జట్టు విజయాలు అప్రతిహతంగా సాగుతున్నాయి.
జవాబు:
అప్రతిహతంగా = (అడ్డులేకుండా) (నిరాటంకంగా)
వాక్యప్రయోగం : రోదసీ విజ్ఞాన ప్రయోగాల్లో మనదేశం అప్రతిహతమైన విజయాలు సాధిస్తోంది.
ప్రశ్న 2.
అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం.
జవాబు:
అమేయమైన = లెక్కింపవీలుకాని
వాక్యప్రయోగం : మనకు రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణ పండితుడు, అమేయమైన బుద్ధిశాలి.
ప్రశ్న 3.
జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్టం.
జవాబు:
ఉదాసీనత = ఉపేక్షాభావం
వాక్యప్రయోగం : మేధావుల ఉదాసీనత వల్లనే దేశం నేడు నష్టపోతుంది.
ప్రశ్న 4.
ఆచరణ అన్నింటి కన్న గొప్పది.
జవాబు:
ఆచరణ = ఆచరించడం
వాక్యప్రయోగం : ఆచరణ లేని ప్రబోధాలు, చిలుకపలుకులవలె వట్టిదండుగ.
ఆ) కింది పర్యాయపదాలను పదవిజ్ఞానం ఆధారంగా జతపర్చండి.
అ) కృపాణం – మది, హృదయం, ఎద
ఆ) వాక్కు – చప్పుడు, శబ్దం
ఇ) స్నేహం – కత్తి, ఖడ్గము, అసి
ఈ) మనసు – మాట, పలుకు, నుడుగు
ఉ) విశ్వాసం – చెలిమి, మైత్రి, నెయ్యము
ఊ) ధ్వని – నమ్మకం, నమ్మిక
జవాబు:
జతపరచడం – పర్యాయపదాలు
అ) కృపాణం – కత్తి, ఖడ్గం,అసి
ఆ) వాక్కు – మాట, పలుకు, నుడుగు
ఇ) స్నేహం – చెలిమి, మైత్రి, నెయ్యము
ఈ) మనసు – మది, హృదయం, ఎద
ఉ) విశ్వాసం – నమ్మకం, నమ్మిక
ఊ) ధ్వని – చప్పుడు, శబ్దం
ఇ) ‘వాగ్మి, ధ్వని’ అనే పదాలకు కింది వాక్యాలలో నానార్థాలున్నాయి. వాటిని గుర్తించండి.
అ) యుక్తియుక్తంగా మాట్లాడే ఉపన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు.
జవాబు:
వాగ్మి (నానార్థాలు) :
- యుక్తియుక్తంగా మాట్లాడేవాడు
- చిలుక
ఆ) ఆయన మాటల్లోని వ్యంగ్యార్థాన్ని గ్రహించి అభినందన పూర్వకంగా బల్లలు చరుస్తూ శబ్దం చేశారు.
జవాబు:
ధ్వని (నానార్థములు) :
- వ్యంగ్యార్థము
- శబ్దం
ఈ) కింది పట్టిక నుండి ప్రకృతి – వికృతులు గుర్తించి రాయండి.
జవాబు:
ప్రకృతి – వికృతి
1) స్నేహం – నెయ్యం
2) హృదయం – ఎడద
3) భాష – బాస
4) ప్రాణం – పానం
5) శక్తి – సత్తి
6) దీపం – దివ్వె
7) శాస్త్రం – చట్టం
8) శబ్దం – సద్దు
వ్యాకరణాంశాలు
1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) కళోపాసనం = ………………………….
జవాబు:
కళా + ఉపాసనం – గుణసంధి
ఆ) అభ్యుదయం = …………………………..
జవాబు:
అభి + ఉదయం – యణాదేశ సంధి
ఇ) తనకెంతో = ……………………….
జవాబు:
తనకున్ + ఎంతో – ఉత్వసంధి(ఉకార వికల్పసంధి)
ఈ) ఉన్నతమైన = …………………………
జవాబు:
ఉన్నతము + ఐన – ఉత్వసంధి
ఉ) రసానందం = …………………..,,,,,,,
జవాబు:
రస + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
అ) శక్తిసామర్థ్యాలు = ……………………
జవాబు:
శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఆ) పఠనశక్తి = ………………………
జవాబు:
పఠనమునందు శక్తి – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అభ్యుదయపథం = ……………………..
జవాబు:
అభ్యుదయమైన పథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ఆత్మశక్తి = ………………………..
జవాబు:
ఆత్మ యొక్క శక్తి – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) అద్భుతశక్తి = ……………………..
జవాబు:
అద్భుతమైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
‘వాక్కు’ గొప్పదనాన్ని తెలిపే ఐదు పద్యాలు సేకరించి, భావాలు రాయండి. నివేదికను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) నిండునదులు పారునిలిచి గంభీరమై
వెట్టివాగుపారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం :
గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. కాని, చిన్నవాగు గట్లుదాటి పొర్లి ప్రవహిస్తుంది. అలాగే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడుతాడు. నీచుడు బడబడ వాగుతాడు.
2) అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం :
తక్కువ బుద్ధిగలవాడు, ఎప్పుడునూ గొప్పలు చెపుతాడు. మంచి బుద్ధిగలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతాడు. కంచుమ్రోగేటట్లు బంగారం మ్రోగదు కదా !
3) మాటలాడ నేర్చి మనసురంజిలఁజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
భావం :
ఒకరి సొత్తు ఇంకొకరికి చెందాలంటే, కష్టపడి పనిచేసి, అవతలి వారి మనస్సుకు ఆనందం కలిగేటట్లు మాట్లాడడం నేర్చుకోవాలి.
(లేదా)
ప్రశ్న 2.
ఉపన్యాసం ఇవ్వడం కోసం మీకు నచ్చిన ఒక అంశాన్ని ఎన్నుకొని దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
కఠిన పదాలకు – అర్థాలు
I.
వక్తృత్వం = ధారాళంగా మాట్లాడడం, (ఉపన్యాసం)
అలవడు = అబ్బు; (నేర్చుకోడం సాధ్యమగు)
అంతర్లీనంగా = కలిసిపోయినదిగా ; (లోపల ఉండేదిగా)
ఉద్దీప్తం = ప్రకాశింపబడినది;
వక్త = మాటలాడే ఉపన్యాసకుడు;
నిక్షిప్తము = ఉంచబడినవి
నిద్రాణము = నిద్రించునవి;
ఉత్తేజపరచడం = ప్రేరణ చేయడం; (వెలుగులోకి తేవడం)
మేల్కొల్పడం = లేపడం;
బయల్వెడలి = బయటకు వచ్చి;
ప్రదర్శిస్తాయి = చూపిస్తాయి;
ఆసరా = ఆధారము;
అపోహ = భ్రాంతి
దురూహ = చెడ్డ ఊహ
కలవరపెడుతున్న = కలతపెడుతున్న
పరిష్కారం చూపడం = చక్కపెట్టడం (దారిచూపడం)
భాషణం = మాట్లాడడం;
వాక్ శక్తి = మాట యొక్క శక్తి
నిర్వహించే = నెరవేర్చే
అమేయమైనది = లెక్కింపరానిది; (సాటిలేనిది)
పఠనాశక్తి = చదివే శక్తి
పరభాగ్యోప జీవి = ఇతరులభాగ్యంపై ఆధారపడి జీవించేవాడు
దాస్యానికి = బానిసత్వానికి
తలఒగ్గుతాడు = సిద్ధపడతాడు;
బాహిరంగా = బహిరంగంగా
అభ్యుదయపథం = అభ్యుదయ మార్గం
సమంజసమైన = తగినదైన
వరిస్తున్న = లభిస్తున్న
వైయక్తిక ప్రయోజనాలు = వ్యక్తిగతమైన ప్రయోజనాలు;
తోడ్పడుతుంది = సాయపడుతుంది;
వరప్రసాదం = భగవంతుడి అనుగ్రహము
సృష్టికర్త = బ్రహ్మ
సృష్టించుకొన్నాడు = పుట్టించుకొన్నాడు
క్షుప్తంగా = సంక్షిప్తంగా
అర్ధవంతంగా = సార్థకంగా
వినసొంపు = వినడానికి అందము
సాక్షాత్కారం = ప్రత్యక్షం
అనంతం (న + అంతం) = అంతులేనిది
అప్రతిహతం (న + ప్రతిహతం) = అడ్డగించలేనిది (ఎదురులేనిది)
ఊపిరి పోస్తుంది = ప్రాణం పోస్తుంది
జాగరితం చేస్తుంది = మేల్కొల్పుతుంది;
ధర్మాభిరతిని (ధర్మ + అభిరతిని) = ధర్మము నందు ఆసక్తిని
ద్వేషానలాన్ని (ద్వేష + అనలాన్నీ) = ద్వేషాగ్నిని;
కల్ప తరువు = కల్ప వృక్షము
జీవిత సాఫల్యం = బ్రతుకు సఫలత్వం
ప్రసంగం = ఉపన్యాసం
ఆత్మవిశ్వాసం = తనయందు తనకు నమ్మకం;
దీనుడై = జాలిగొలుపువాడై
రూపుదిద్దుకుంటుంది = ఆకారం ధరిస్తుంది
గణకులు = లెక్కలు తేల్చేవారు
న్యాయవాదులు (Advocates) = వకీళ్ళు
ప్రచురణకర్తలు (Publishers) = పుస్తకాలు అచ్చువేయించేవారు
నిరంతర ప్రయత్నం = ఎల్లప్పుడూ చేసే ప్రయత్నం
కౌశలాన్ని = నేర్పును
II.
అలవరచుకొనే = అలవాటు చేసుకొనే
విద్వాంసులు = పండితులు;
నిరక్షరాస్యులు = అక్షరాలు నేర్వనివారు;
గ్రామీణులు = గ్రామ ప్రజలు
ఆరితేరినవాళ్ళు = సమర్ధులు;
శ్రోతలను = వినేవారిని;
ఆకట్టుకుంటారు = ఆకర్షిస్తారు;
అంతుండదు (అంతు + ఉండదు) = ముగింపు ఉండదు
ఉదాసీనంగా = ఉపేక్షగా; (పట్టించుకోకుండా ఉండడం)
దిగ్భ్రాంతిని = దిక్కుతోచకపోవడాన్ని
వాస్తవమే = సత్యమే
విద్వత్తు = పాండిత్యం
రాణించదు = శోభించదు
సముదాత్త భావప్రసరణ = గొప్ప భావాల వెల్లడి;
దృక్పథాన్ని = దృష్టిని
సంస్కారం = సంస్కృతి (నాగరికత)
ఇతిహాసం = చరిత్ర
సజీవంగా = ప్రాణవంతంగా
ప్రభావోపేతంగా (ప్రభావ + ఉపేతం) = ప్రభావంతో కూడినదిగా
అబ్బిన = అలవాటైన
ఉడిగిపోయి = నశించి
మరుపుతట్టుతుంది = మరుపు వస్తుంది
దోషాలు = తప్పులు
మౌనం = మాట్లాడకుండా ఉండడం
నక్కి = దాగి
వ్యక్తిత్వాన్ని = స్వభావాన్ని
వచ్శశైలి = మాటలశైలి (మాట్లాడేతీరు)
దృక్పథాన్ని = దృష్టి మార్గాన్ని
సరళమైన = తేలికయైన
సందేహం = అనుమానము
నవ్వులాట = నవ్వుతో ఆడుకొనే ఆట (తేలికయైనది)
మనశ్చైతన్య లక్షణం = మనోజ్ఞానానికి చెందిన లక్షణం
అజ్ఞాతం = తెలియబడనిది;
చొరబడుతుంది = ప్రవేశిస్తుంది;
సంకుచిత మనస్తత్వాన్ని = కుదింపబడిన మనస్తత్వాన్ని
ఆత్మవంచన = తనను తాను మోసగించుకోడం
క్షుత్వాన్ని = నీచత్వాన్ని
బిడియపడకుండా = సిగ్గుపడకుండా
జడుసుకోకుండా = భయపడకుండా
ధారాప్రవాహంగా = ప్రవాహంలా ఏకధారగా
చింత = విచారము
నిర్భయుడు = భయంలేనివాడు;
అజేయుడు = జయింపశక్యంకానివాడు;
మనః ప్రవృత్తులను = మనస్సు యొక్క నడవడులను;
సహృదయం = మంచి మనస్సు;
ఆర్ద్రతను = మెత్తదనాన్ని
కట్టలు తెంచుకొని పారుతుంది = గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది.
ఆవేశం పొంగు లెత్తుతుంది = ఆవేశం ఉరకలు వేస్తుంది
ప్రజ్వలిస్తాయి = బాగా మండుతాయి;
కన్నీటి మున్నీటిలో = కన్నీటి సముద్రంలో
తలమున్కలౌతారు = తలలోతు మునుగుతారు
కార్యోన్ముఖులవుతారు (కార్య + ఉన్ముఖులు + అవుతారు) = పని చేయడానికి సిద్ధం అవుతారు
నవరసభరితాంత రంగులౌతారు = తొమ్మిది రసాలతో నిండిన మనస్సులు కలవారవుతారు
III.
వాగి = యుక్తియుక్తంగా మాట్లాడేవాడు
ఐతిహాసిక ఘట్టం = చారిత్రక సంఘటన
ముమ్మరంగా = ఎక్కువగా
ధీరోదాత్తులు = సర్వసద్గుణులయిన నాయకులు; (ఉత్తమ నాయకులు)
కోవ = తరహా
మహోత్సాహం (మహా + ఉత్సాహం) = గొప్ప ఉత్సాహము
ఉత్తేజకరమైన = గొప్ప ఉత్సాహాన్ని కల్గించే
మనస్వి = బుద్ధిమంతుడు (ప్రశస్తమైన మనస్సు గలవాడు;)
అంగసంచాలనం = అవయవముల కదలిక
వైయక్తికం = వ్యక్తిగతం (ఆయా వ్యక్తులకు సంబంధించినది;)
హృదయోద్భూత భావ ప్రకటనం (హృదయ + ఉద్భూత, భావప్రకటనం) = మనస్సులో పుట్టిన భావాల వెల్లడి;
అంగాంగ విన్యాసం = అవయవముల కదలిక
ప్రసంగించాలి = మాట్లాడాలి.
పునశ్చరణ = తిరిగి చెప్పడం;
వివేకం = తెలివి
అభివర్ణించి = బాగా వర్ణించి చెప్పి
మెలకువ = జాగ్రత్త
నిగ్రహించుకుంటూ = అణచుకుంటూ
సంస్కారాన్ని = నాగరికతను (సంస్కృతిని)
వక్తవ్యాంశం (వక్తవ్య + అంశం) = మాట్లాడే విషయం
కేంద్రీకరించండి = దృష్టిపెట్టండి
తన్మయత్వం = దానితో ఐక్యం కావడం
శ్రద్ధాసక్తులు (శ్రద్ధా + ఆసక్తులు) = శ్రద్ధయు, ఆసక్తి;
పదజాలం = పదముల సమూహం
శబ్దార్థములు = శబ్దము యొక్క అర్ధములు, వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యము అని మూడు విధములు;
1) వాచ్యము (వాచ్యార్థము) = సంకేతితమైన అర్ధాన్ని స్ఫురింపచేసే . శబ్దవ్యాపారము
‘ఉదా : ‘రత్నగర్భ’ అనగా లోపల రత్నాలు కలది (భూమి)
2) లాక్షణికార్థము వాక్యానికి వాచ్యమైన అర్థము సరిపడకపోవడం వల్ల, దానికి సంబంధించిన విషయంలో ఆరోపించబడే శబ్దవ్యాపారము.
ఉదా : “గంగలో గొల్లపల్లె ఉన్నది” – ఇక్కడ గంగలో గొల్లపల్లె ఉండదు. కాబట్టి గంగా తీరములో గొల్లపల్లె అనే అర్థాన్ని చెపుతుంది. దీనిని లాక్షణికార్ధము అంటారు.
3) వ్యంగ్యార్థము = వాక్యార్థానికి అందాన్ని పుట్టించే మరియొక అర్థాన్ని స్ఫురింపజేసే శబ్దవ్యాపారము.
ఉదా : పూజారీ! పువ్వులు కోసుకోడానికి భయపడకుండా వెళ్ళు. నిన్ను భయపెట్టే జంతువును, సింహం తినివేసింది.
గమనిక : ఇక్కడ వెళ్ళు అని వాచ్యార్థం. కాని అక్కడ సింహం ఉంది వెళ్ళకు అనే వ్యంగ్యార్థము ఈ వాక్యంలో ఉంది.
చమత్కారస్ఫోరకంగా = చమత్కారం వెల్లడి అయ్యేటట్లుగా
మలచి = రూపుదిద్ది (చెక్కి)
పర్యాయవాచకాలు = పర్యాయపదాలు (ఒకే అర్థం కల పదాలు)
యథోచితంగా (యథా + ఉచితంగా) = తగినట్లుగా
నిర్దుష్టమైన = తప్పులులేని
సుపరిష్కృతమైన = చక్కగా పరిష్కరింపబడిన (బాగా తప్పులు లేకుండా దిద్దిన)
బహుధా = అనేక విధాలుగా
ప్రశంసాపాత్రము = పొగడ్తకు తగినది;
అధ్యయన సామాగ్రి = చదువవలసిన విషయాలు;
సంప్రదించి = మాట్లాడి
పరిజ్ఞానాన్ని = నిండు తెలివిని
జీర్ణమవుతుందో = బాగా మనస్సులో కుదురుకుంటుందో
నిస్సంకోచంగా = మోమాటం లేకుండా
తడబాటు = ఆలస్యము;
న్యూనతాభావం = తాను తక్కువ వాడననే భావం
అనుక్షణం = ప్రతిక్షణము
ఇతరాంశాలు (ఇతర + అంశాలు) = ఇతర విషయాలు
వాగ్ధార(వాక్ + ధార) = మాటల ప్రవాహం
అధ్యయనం = చదవడం
విజ్ఞాన భాండాగారాన్ని = గ్రంథాలయాన్ని
భద్రపరచుకోండి = జాగ్రత్త చెయ్యండి
సజ్జన సాంగత్యం = సత్పురుషుల స్నేహం
సంప్రదాయాభిజ్ఞులు (సంప్రదాయ + అభిజ్ఞులు) = సంప్రదాయం తెలిసినవారు;
సాఫల్యానికి = నెరవేరడానికి; (ఫలవంతం కావడానికి)
అనువైన = తగిన
IV.
మనశీలత = యోచించే స్వభావం
విలక్షణతను = విశేషమైన తత్త్వాన్ని
దృక్పథం = దృష్టిమార్గం
తడబాటు = అడ్డము;
ఉబికి వస్తుంది = బయటికి వెల్లడి అవుతుంది;
మౌఖికంగా = నోటితో గట్టిగా
వచోవైఖరి = మాట్లాడేతీరు,
వ్యాఖ్యానించడం = వివరించడం
అంశం = విషయం
స్మరణశక్తి = జ్ఞాపకశక్తి
ఏకాంతంగా = ఒంటరిగా
సభాకంపనం = సభలో మాట్లాడేటప్పుడు కలిగే వణకు;
ఆటంకం = అడ్డు
జిజ్ఞాస = తెలిసికోవాలనే కోరిక
శిలామూర్తులు = రాతి స్వరూపాలు
ఊనిక = ఊతము
మందంగా = నెమ్మదిగా
భావానుగుణమైన (భావ + అనుగుణమైన) = భావానికి తగ్గట్టుగా
మృదులంగా = మెత్తగా (నెమ్మదిగా)
నిదానంగా = తొందరపడకుండా
అవగాహన = స్పష్టంగా అర్థమవడం;
రౌద్రరస భావాలను = వీరరసభావాలను
గొణుగుతున్నారో = మాటవినీ, వినబడకుండా మాట్లాడుతున్నారో;
క్లేశాన్ని = కష్టాన్ని
సమన్వయం = సరియైన క్రమము;
చీకాకును = చిరాకును;
వడివడిగా = వేగంగా
ఉత్సుకత = ఇష్టసిద్ధికై తహతహ ;
సమయాతిక్రమణం (సమయ + అతిక్రమణం) = కాలాన్ని అతిక్రమించడం
అపోహలు = భ్రాంతులు
దీర్ఘపన్యాసాలు = ఎక్కువసేపు ఉపన్యాసాలు;
నిగ్రహించుకోవడం = అణచుకోవడం;
శ్లథనం = సత్తువలేనిది;
సువ్యవస్థితము = బాగా ఏర్పరుపబడినది
కడవెడు = కుండెడు
ఖరము = గాడిద
V.
అభిలషితార్థాన్ని = కోరిన అర్థాన్ని
నిగ్రహం = అణచుకోవడం;
అనల్పార్థ రచన (అనల్ప + అర్థ రచన) = గొప్ప అర్థాన్ని ఇచ్చే రచన
వివేకంబు = తెలివి
సూక్తి (సు + ఉక్తి) = మంచిమాట
వర్తిస్తుందనుకోవడం = సరిపోతుందనుకోడం
మనీషి = విద్యావంతుడు
Brievity = సంక్షిప్తత
Soul = ఆత్మ
Wit = చమత్కారము, సారస్యము
ఆంగ్లాభాణకం (ఆంగ్ల + ఆభాణకం) = ఇంగ్లీషు లోకోక్తి (సామెత)
Brievity is the = సంక్షిప్తతయే, చమత్కార
soul of wit = సంభాషలోని ఆత్మ
యోజించుకోవాలె = ఆలోచించుకోవాలి;
వక్తృత్వ కౌశలాన్ని = మాట్లాడడంలో నేర్పును
బహిర్గతం = బయటకురావడం
అమూల్యమైనది = విలువ కట్టలేనిది
పదిలంగా = భద్రంగా
హృదయంగమంగా = మనోరంజకంగా
హృదయం = మనస్సు (గుండె)
సదభిప్రాయం (సత్ + అభిప్రాయం) = మంచి అభిప్రాయం
ప్రసంగాంతం (ప్రసంగ + అంతం) = సంభాషణ పూర్తి
యత్నం = ప్రయత్నం
స్ఫుటమైన = స్పష్టమైన
వాణిగా = వాక్కు, సరస్వతి
ఉడిగిపోని = తరిగిపోని
కృపాణధార = కత్తి అంచు
వక్తృత్వ కళారాధనం = ఉపన్యాస కళను ఆరాధించడం;
అక్షరాస్యులకు = చదువుకున్నవారికి
నిద్రాణమైన = నిద్రించిన
జాగృతం కావాలి = మేల్కోవాలి
మనోజ్ఞంగా = సౌందర్యంగా
సంభాషించడం = మాట్లాడడం
దివ్వె = దీపము
బర్బరత్వం = తెలివిలేనితనము;
పాఠం ఉద్దేశం
‘ఉపన్యసించడం’ గొప్పకళ. మంచి వక్త కావాలంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి ? ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి ? ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం, ‘వ్యాసము’ అనే ప్రక్రియకు చెందినది. ఈ వ్యాసం, డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన “వాగ్భూషణం భూషణం” అనే పుస్తకంలోనిది.
రచయిత పరిచయం
పాఠం పేరు : “వాగ్భూషణం”
రచయిత : డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి
దేని నుండి గ్రహింపబడినది : రచయిత వ్రాసిన “వాగ్భూషణం భూషణం” అనే పుస్తకంలో నుండి గ్రహింపబడింది.
జననం : 12-07-1930
మరణం : 26-04-1989
జన్మస్థలము : రచయిత మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు.
పాండిత్యం : రచయితకు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉంది.
చేపట్టిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. ‘యువభారతి’ సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు.
రచనలు :
- తెలుగు – ఉత్తర భారత సాహిత్యాలు
- చాటువులు
- వాగ్భూషణం
- వేగుచుక్కలు
- వెలుగుబాటలు
- అడుగు జాడలు
- వెలుగు చూపే తెలుగు పద్యాలు
- దేశమును ప్రేమించుమన్నా మొదలైనవి ఈయన రచనలు.
సిద్ధాంత గ్రంథము : ‘కవి సమయములు’
ఇతర రచనలు : ఎన్నో కథానికలను, వచన కవితలను, ‘పఠనీయం’ శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు.
రాష్ట్ర విమోచనోద్యమంలో భాగస్వామ్యం : ఈయన మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా, హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.
ప్రవేశిక
మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా, పొందికగా, ఒక పద్ధతి ప్రకారం, అనుకున్న అంశం మీద అల్లుకుని మాట్లాడితే, అది “ఉపన్యాసం” అవుతుంది. ఉపన్యాసం ఒక కళ. మాట్లాడే నైపుణ్యం, ఉపన్యాస కళను పెంపొందిస్తుంది. ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నకు సమాధానమే, ఈ వ్యాసం.