Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద Questions and Answers.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద
భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామీజీ చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది.
PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.
ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం.
– నరేన్కు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.
నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీకావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.
తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్చర్స్’ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.
ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలను తెల్పండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుని, “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.
వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్ ‘ లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో’ ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.
షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ ప్రొఫెసర్ జె.హెచ్.రైట్తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.
ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.
సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.
ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?
జవాబు:
వివేకానందుని సందేశము: “మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారతజాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.
భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలనూ పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలనూ, అమాయక ప్రజలనూ, అణగద్రొక్కబడిన వారినీ ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి.”
ప్రశ్న 4.
వివేకానందుని సందేశాల ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :
నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా, అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.
మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.
మనం వ్యావహారిక భాషలోనే శాస్త్రపాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి. సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగద్రొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.
“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” (లేవండి! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి !)
PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)
1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో వివేకానంద స్వామిజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్త నారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, “ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో” అని గట్టిగా అరిచాడు. స్వామిజీ ఆగి వెనక్కి తిరగగానే, కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామిజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామిజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయనీ, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో, అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
కోతులు ఎప్పుడు పరుగుపెట్టాయి ?
జవాబు:
స్వామీజీ వెనుదిరిగి రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే కోతులు పరుగుపెట్టాయి.
ప్రశ్న 2.
వివేకానంద స్వామిజీకి కోతులు ఎప్పుడు కనిపించాయి ? ఎక్కడ కనిపించాయి ?
జవాబు:
వివేకానంద స్వామిజీకి దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు కోతులు కాశీలో దారిలో కనిపించాయి.
ప్రశ్న 3.
‘ఆ జంతువులనెదుర్కో’ అని ఉపదేశించిన వ్యక్తి ఎవరు ?
జవాబు:
‘ఆ జంతువుల నెదుర్కో’ అని ఒక వృద్ధ సన్యాసి స్వామికి అరిచి చెప్పాడు.
ప్రశ్న 4.
వివేకానందస్వామి కోతుల సంఘటన నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి ?
జవాబు:
కోతుల్లాగే కష్టాలు మానవులను వెన్నాడుతాయనీ, ఎప్పుడైతే, ఆగి మనం వెనక్కు తిరిగి ఆ కష్టాలను ఎదుర్కుంటామో అప్పుడు అవి పారిపోతాయనీ, స్వామికి కోతుల సంఘటనను బట్టి నేర్చుకున్నాడు.
ప్రశ్న 5.
కోతులు సంఘటనను గూర్చి వివేకానంద ఎక్కడ చెప్పారు ?
జవాబు:
కోతుల సంఘటనను గూర్చి స్వామిజీ అమెరికాలో చెప్పాడు.
2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్కాంగ్, చైనా, జపాన్ లోని రేవులలో ఆగింది. స్వామిజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామిజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామిజీతో మాట్లాడింది. స్వామిజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ, గమనించి, ‘స్వామీ మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి’ అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
స్వామీజీ వేటిని చూసి విస్తుపోయారు ?
జవాబు:
స్వామిజీ, షికాగోలో భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలయినవి చూసి విస్తుపోయారు.
ప్రశ్న 2.
వివేకానంద స్వామి ప్రయాణించిన ఓడ ఎక్కడ ఆగింది ?
జవాబు:
వివేకానందస్వామి ప్రయాణించిన ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది.
ప్రశ్న 3.
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ ఎవరు ? ఆమె ఏ నగరానికి చెందినది ?
జవాబు:
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ పేరు “సాన్బోర్న్”. ఆమె బోస్టన్ నగరానికి చెందినది.
ప్రశ్న 4.
స్వామిజీ బొంబాయిలో ఎప్పుడు బయలుదేరారు ?
జవాబు:
స్వామిజీ బొంబాయిలో 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరారు.
ప్రశ్న 5.
స్వామిజీ ఎప్పుడు చికాగో చేరుకున్నారు?
జవాబు:
స్వామిజీ జూలై నెల మధ్యలో చికాగో చేరుకున్నారు.