TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు
“గోలకొండ కవుల సంచిక” ద్వారా సమాధానమిచ్చినవాడు.
తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి.
సాహిత్య, సాంస్కృతిక సామాజిక, రాజకీయ రంగాల్లో
బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో
తెలుసుకుందాం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డిగార్ని గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చేసిన పరిచయం ఎటువంటిది ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే, ఒక గొప్ప మూర్తి మన కంటి ఎదుట దర్శనమిస్తుంది. బహుముఖ ప్రతిభకు, ప్రతాపరెడ్డి నిలువెత్తు ఉదాహరణం. సురవరం ప్రతాపరెడ్డి గారు మేధా సంపన్నుడు. సాహిత్య రంగంలో రెడ్డి గారి ప్రతిభకూ, ప్రజ్ఞకూ స్తాటిలేదు.

రెడ్డిగారు విమర్శకులలో గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో గొప్ప రాజకీయవేత్త. పత్రికా రచయితలలో పత్రికా రచయిత. నాటక కర్తలలో నాటక కర్త. పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు. దేశాభిమానులలో పెద్ద దేశాభిమాని, సహృదయులలో రెడ్డిగారు గొప్ప సహృదయులు.

ప్రతాపరెడ్డిగారి వంటి స్నేహితుణ్ణి, పండితుణ్ణి, రసజ్ఞుడిని చాలా అరుదుగా చూస్తాం. రెడ్డిగారు ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కలవాడని, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వ్రాశారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డిగారి ప్రతిభా పాండిత్యాలను వెల్లడించే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభా విశేషాలు రాయండి.
జవాబు:
ఒకసారి హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సాహిత్య సభ జరిగింది. ఆ రోజు నాచన సోమన రాసిన ఉత్తర హరివంశముపై విశ్వనాథ సత్యనారాయణగారు ప్రసంగం చేయాలి. ఆ సభకు అధ్యక్షుడిగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూర్చున్నారు.

సభ ప్రారంభం కాగానే, ప్రతాపరెడ్డిగారు ధీరగంభీరంగా తొలిపలుకులు మాట్లాడారు. క్రమంగా మాటల చినుకులు మహావర్షంగా మారాయి. దాదాపు గంటసేపు రెడ్డిగారు మాట్లాడిన ఆ ఉపన్యాసం, సభ్యులను కట్టిపడేసింది.

సోమన కవిత్వంలోని కొత్తకోణాలు సభ్యులకు పరిచితమవుతున్నాయి.. తరువాత విశ్వనాథ సత్యనారాయణగారు లేచి, అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, చెప్పడానికి తనకు ఇంకేమీ మిగుల లేదని, హరివంశంలోని కొన్ని పద్యాలు మాత్రం చదివి, వ్యాఖ్యానిస్తానని అన్నారట.

విశ్వనాథ వంటి మహాకవి, పండిత విమర్శకుడినే ఆ విధంగా ప్రతాపరెడ్డిగారి ఉపన్యాసం, ఆనాడు నిశ్చేష్టుడిని చేసింది. ఈ సంఘటన ప్రతాపరెడ్డిగారి ఉపన్యాస శక్తినీ, విమర్శనాశక్తినీ వెల్లడిస్తుంది.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డిగారి బాల్యము – విద్యాభ్యాసము గూర్చి రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారు 1896లో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థాన రాజధానియైన “బోరవిల్లి” లో జన్మించారు. ఈయన మొదటి పేరు “పాపిరెడ్డి”. పాపిరెడ్డి గురువు, చండశాసనుడు. దానితో పాపిరెడ్డికి చదువుపై విముఖత పెరిగింది. బడిమానేసి, గోలీలాడుకొనేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నాన్నకు తెలిసి, కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం, మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తెలుగులో కవియై కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. తన సంకల్పాన్ని అమలుచేశాడు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని నెరవేరుస్తాయి.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్నీ, ఇతర ప్రబంధాలనూ, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర, సంస్కృత సాహిత్యం చదివాడు. బి.ఏ లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలనుకున్నాడు. అందుకు వేదం వేంకటరామశాస్త్రి గారితో సిఫారసు కూడా చేయించాడు.

కాని సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీవారు పరీక్షించారు. ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగంతో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు.. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డిగారు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు. ప్రతాపరెడ్డి గారు పుస్తకాలు కొన్ని, విమర్శనాత్మకంగా చదివేవారు.

ప్రశ్న 4.
ప్రతాపరెడ్డిగార్కి గోల్కొండ పత్రికతో గల సంబంధాన్ని రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారికి, మద్రాసులో చదివే రోజులలోనే పత్రిక పెట్టాలని కోరిక కలిగింది. జాతీయోద్యమ ప్రభావంతో పత్రికకు ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు. చివరకు రెడ్డిగారు హైదరాబాదులో ఉన్నప్పుడు పత్రికను ప్రారంభించారు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అంగీకరించదని, ‘గోల్కొండ’ అనే పేరు పత్రికకు పెట్టారు.

10 మే, 1926న గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యింది. గోల్కొండ పత్రిక, తెలుగు పత్రికా రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తుంది. పత్రిక ప్రారంభమయ్యింది కాని, తగిన ఆర్థిక వనరులు లేనందున, నడపడం కష్టమయ్యింది. అయినా ప్రతాపరెడ్డి గారు అధైర్యపడలేదు.

ప్రతాపరెడ్డి తానే రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమాస్తాగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆటంకాలను దాటి, లక్ష్యమును చేరుకున్నాడు. గోల్కొండ పత్రిక రెండు లక్ష్యాలతో నడచింది.

1) ఆంధ్రభాషా సేవ

2) జాతి, మత, కులవివక్షత లేకుండా ఆంధ్రులలో అన్ని శాఖలవారి సత్వరాభివృద్ధికీ పాటు పడడం. నాటి నిజాం దుష్కృత్యాల గురించి, సంపాదకీయాలు సాగేవి. ప్రతాపరెడ్డి రచయితలను కవ్వించి, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిష్పక్షపాతంగా పత్రికను నడిపారు.

ఆ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్న, నడివీధిలో నరికి చంపారు. అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు సాహసంతో నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ పత్రికలో సంపాదకీయాలు రాశారు. ఈయన 23 సంవత్సరాలు గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా తెలంగాణకు సేవలందించాడు. ప్రతాపరెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

ప్రశ్న 5.
ప్రతాపరెడ్డిగార్కి వివిధ సంస్థలతో గల అనుబంధం గురించి తెలపండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారిని గురించి, దాశరథి రాస్తూ “అతడు లేని తెలంగాణ, అలంకరణలేని జాణ” అని రాశాడు. ప్రతాపరెడ్డిగార్కి అనేక సంస్థలతో అనుబంధముంది. తెలంగాణలో ఆంధ్రమహాసభ, పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోడానికి ఆవిర్భవించింది. ఆ ఆంధ్రమహాసభ మొదటి సమావేశం, మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ సభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షత వహించారు.

విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ప్రతాపరెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు. ఆ తర్వాత, ఆ సంస్థలకు వీరే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డిగార్కి కులమతాల పట్టింపులు లేవు. అందుకే రెడ్డిగారు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘములకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రతాపరెడ్డి గారు హైదరాబాదు ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రెడ్డిగార్కి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధకమండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం, మొదలయిన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విధంగా ఆనాడు తెలంగాణలో ఉన్న పెక్కు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరికి అనుబంధముంది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 6.
సురవరం ప్రతాపరెడ్డిగారి సాహిత్య కృషిని వివరించండి.
జవాబు:
ప్రతాపరెడ్డిగారు, ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించారు. కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో వీరు రచనలు చేశారు. ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు. సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు అన్న వీరి రచనలు, పరిశోధకులుగా ప్రతాపరెడ్డిగార్కి సాటిలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. రాజుల చరిత్రయే చరిత్రగా చెలామణి అయ్యే రోజుల్లో, ప్రజల సాంఘిక చరిత్రయే అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపజేసారు. చరిత్ర రచనకు రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథము ఒజ్జబంతి అయ్యింది. అందుకే ఈ గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది.

వీరి హిందువుల పండుగలు అన్న గ్రంథము, హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలను, ఆచార సంప్రదాయాలను తెలిపే ప్రామాణిక గ్రంథము. వీరు, హిందువుల పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్రప్రమాణంగా తెలిపారు. ప్రతాపరెడ్డి గారి ఈ హిందువుల పండుగలు అన్న గ్రంథానికి విపులంగా పీఠిక వ్రాయడానికి తనకు శక్తి, వ్యవధి కూడా చాలదని రాధాకృష్ణన్ గారు రాశారు. దానిని బట్టి, ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమౌతుంది.

సాహిత్యము ఆనందాన్నీ, ఉపదేశాన్నీ కూడా ఇవ్వాలి.

ప్రశ్న 7.
సురవరం ప్రతాపరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని గూర్చి రాయండి.
జవాబు:
నిరాడంబరత, నిర్భీతి, నిజాయితి, నిస్వార్థత అన్నవి ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో ఈయన అచ్చమైన తెలుగు వాడిగా జీవించాడు. ఈయన తెలుగు అంకెలనే వాడేవాడు. ఈయన ‘స్వవేష భాషా దురభిమాని’ అని పేరు పొందాడు. ఈయన ఎవరినీ పొగిడేవాడు కాడు. తనను ఎవరైనా పొగిడితే, అంగీకరించేవాడు కాదు..

ప్రతాపరెడ్డి గారిలో ధర్మావేశం పాలు ఎక్కువ. ఆత్మీయతకే తప్ప, అహంకారానికి చోటులేని హృదయం ఈయనది. మంచి ఎక్కడున్నా, ఈయన గ్రహించేవాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు గారిని మొదట పరిశోధనవైపు మళ్ళించింది. సురవరం వారే ఈ విధంగా ఈయన ఎన్నో రచనలకు ప్రేరకుడు, కారకుడు.

ఈయనకు కులమతాల పట్టింపులేదు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో, భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశాన్ని రెడ్డిగారే కల్పించారు. అంబేద్కర్ కన్న ముందే, దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చిన వాడు ‘భాగ్యరెడ్డివర్మ’. ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి మీసాలు ఉండాలని ప్రశ్నించి మీసాల కృష్ణుని చిత్రాన్ని తన గోల్కొండ పత్రికా కార్యాలయంలో వీరు పెట్టుకున్నాడు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూర్ సంస్థానాధీశులతో తనకు గల పరిచయాన్ని వీరు కేవలం సాహిత్య సమారాధనకే వినియోగించారు.

ప్రతాపరెడ్డి గారు ప్రజల మనిషి. 1952లో వనపర్తి శానస సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని వీరు అన్ని కోణాల్లో ప్రభావితం చేశారు. ఈయన జీవనం పవిత్రం.
ప్రతాపరెడ్డి గారు రైతు, రాజబంధువు, కావ్య వేద నిష్ణాతుడు. స్వతంత్రుడు, శాసనకర్త, పురుషార్థజీవి, సంస్కృతీ పరిరక్షకుడు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి, జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకకు “దేశబంధు” అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిలో కలిసిపోవు. హైద్రాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. “దేశబంధు” పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే “గోల్కొండ” పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926 న గోల్కొండ పత్రిక పురుడు బోసుకుంది. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రతాపరెడ్డి తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు .
జవాబు:
ప్రతాపరెడ్డి, జాతీయోద్యమంతో ప్రభావితుడయ్యాడు. అందుకే ఆయన తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు పెడదామనుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
గోల్కొండ పత్రిక ప్రారంభించిన తేదీ ఏది ?
జవాబు:
గోల్కొండ పత్రికను ప్రారంభించిన తేదీ 10 మే, 1926.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి పేరు వినగానే, గుర్తుకు వచ్చే విషయం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి పేరు వినగానే “గోల్కొండ” పత్రిక గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 4.
గోల్కొండ పత్రిక ప్రత్యేకత ఏది?
జవాబు:
గోల్కొండ పత్రిక నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. అది ప్రతాపరెడ్డి అక్షరాలకోట.

ప్రశ్న 5.
కార్యసాధనకు కావలసినదేది ?
జవాబు:
కార్యసాధనకు కావలసినది “సమయస్ఫూర్తి”.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలు ప్రకటించాడు.

పరిశోధకుడుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “హిందువుల పండుగలు”, “రామాయణ విశేషములు”. రాజుల చరిత్రయే, చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించినదీ గ్రంథం.

హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం ‘హిందువుల పండుగలు’.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరిశోధకుడిగా సాటిలేని కీర్తిని ప్రతాపరెడ్డిగార్కి తెచ్చిన గ్రంథం ఏది ?
జవాబు:
పరిశోధకుడిగా ప్రతాపరెడ్డి గార్కి సాటిలేని కీర్తిని తెచ్చిన గ్రంథం “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”.

ప్రశ్న 2.
చరిత్ర రచనలో ప్రతాపరెడ్డి గారు అనుసరించిన నూతన మార్గం ఏది ?
జవాబు:
రాజుల చరిత్రయే చరిత్రగా, ఆనాడు చెలామణి అయ్యేది. ఆ పరిస్థితులలో ప్రజల సాంఘిక చరిత్రే, అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపచేశారు.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి గారు ఆదరించిన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారు కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి సాహిత్య ప్రక్రియలను ఆదరించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 4.
‘హిందువులు పండుగలు’ అన్న రెడ్డిగారి గ్రంథంలో గల విశేషాలేవి ?
జవాబు:
”హిందువులు పండుగలు’ అనే గ్రంథంలో రెడ్డిగారు, హిందువుల పండుగల వెనుక ఉన్న నేపథ్యాలనూ, ఆచార సంప్రదాయాలనూ వివరించారు.

ప్రశ్న 5.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అన్న గ్రంథము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథము.

Leave a Comment