Telangana SCERT 9th Class Telugu Guide Telangana 5th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.
TS 9th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక మధురిమ
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 45)
బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
ప్రశ్నలు
ప్రశ్న 1.
బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు ?
జవాబు:
బలవంతుడను అనే అహంకారంతో పదిమందితోనూ తగవు పెంచుకుంటే, ఆ పదిమంది కలసి, ఆ బలవంతుణ్ణి చావగొడతారు. అందువల్ల బలవంతుడననే అహంకారం ఉండరాదు.
ప్రశ్న 2.
చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నారు ?
జవాబు:
చలిచీమలు సహజంగా బలములేనివి. కాని ఆ చలిచీమలు అన్నీ కలిసి, బలవంతమైన సర్పాన్ని చంపుతాయి. దానిని బట్టి సంఘీభావంతో బలహీనులు కూడా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరని చలిచీమల నుండి నేను నేర్చుకున్నాను.
ప్రశ్న 3.
పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి?
జవాబు:
- బలవంతుడనే గర్వంతో, పెక్కుమందితో విరోధం కూడదు.
- బలహీనులు కూడా కలసిమెలసి ఉంటే, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరు. అనే నీతులు ఈ పద్యం ద్వారా గ్రహించాలి.
ప్రశ్న 4.
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడుతాయి ?
జవాబు:
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా శతక ప్రక్రియలో కనబడతాయి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 48)
ప్రశ్న 1.
“భక్తుడు పద్ధతి తప్పడు” అని కవి అన్నాడు కదా! పద్ధతి తప్పడమంటే, మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
భక్తుడు పద్ధతి తప్పడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భక్తుడు భగవంతుణ్ణి విశ్వసించి భగవంతుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తాడనీ, తాను చేసే దైవ పూజా పద్ధతిని విడిచి, మరోదారి త్రొక్కడనీ ఎల్లవేళలా భక్తుడు భగవంతుడినే నమ్మి కొలుస్తాడనీ దీని భావము.
ప్రశ్న 2.
కీర్తి ఎలా కలుగుతుంది?
జవాబు:
కీర్తి అంటే మంచిపేరు. లోకానికి ఉపకారం జరిగే మంచి పనులు చేస్తే, కీర్తి కలుగుతుంది. మిగిలిన వారికంటె తాను కష్టపడి మంచి విజయాలు సాధిస్తే, అతడికి మంచి కీర్తి కలుగుతుంది. రాజులు వంటివారు మంచిగా ప్రజలను పాలిస్తే, వారికి కీర్తి కలుగుతుంది. కవులూ, పండితులూ వంటివారు మంచి గ్రంథ రచనలు చేస్తే వారికి కీర్తి కలుగుతుంది.
ప్రశ్న 3.
మనిషి చేయకూడని పనులేమిటి?
జవాబు:
ఇతరుల సొమ్మును ఆశించి, జోస్యాలు చెప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. అన్యాయంగా కీర్తిని పొందరాదు. కొండెములు చెప్పరాదు. హింస చేయరాదు. లేనిపోని వ్యాఖ్యానాలు చేయరాదు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 49)
ప్రశ్న 1.
“పరోపకారం శరీరానికి ఆభరణం” అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడు ?
జవాబు:
పరోపకారం చేయడం కోసమే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మన శక్తి కొద్దీ, మనం ఇతరులకు సాయపడాలి. మన శరీరానికి అందం కోసం, సుగంధద్రవ్యాలు రాసుకుంటూ ఉంటాము. నిజానికి అవి శరీరానికి అందాన్ని ఇవ్వవనీ, పరులకు గొప్పగా ఉపకారం చేయడమే, మనిషికి నిజమైన అలంకారమనీ కవి తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
ప్రశ్న 2.
రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే, పనులు నెరవేరుతాయి ?
జవాబు:
రాజు తనకు తానుగా తన బుద్ధితో చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి. అతనికి స్వయంగా మంచి బుద్ధి పుట్టాలి. అప్పుడే ఆయన పనులు నెరవేరతాయి.
ప్రశ్న 3.
దుర్యోధనుడు ఎట్లాంటివాడు ?
జవాబు:
దుర్యోధనుడికి తనకు తానుగా బుద్ధిలో ఆలోచన పుట్టదు. అతడు తన మిత్రులు సలహా ప్రకారమే నడచుకొనేవాడు. దుష్ట చతుష్టయము” అని పిలువబడే ఆ మిత్రుల సలహా సంప్రదింపుల ప్రకారమే, దుర్యోధనుడు నడచుకొనేవాడు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 50)
ప్రశ్న 1.
సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సజ్జనాప్తి వల్ల పేదవాడికి ధనతృష్ణ నశిస్తుంది.
ప్రశ్న 2.
ధనమువల్ల కలిగే దోషాలు ఏవి ?
జవాబు:
ధనము ఉంటే ధనం మీద అభిమానము, ఇంకా ధనం సంపాదించాలనే దురాశ పెరుగుతాయి. ధనము వల్ల మదము, అహంకారము పెరుగుతాయి. ధనతృష్ణ పెరిగితే, ధన సంపాదన కోసం తప్పుడు మార్గాలను మానవుడు అనుసరిస్తాడు. అవినీతికి పాల్పడుతాడు. సజ్జనులకు కష్టాలు కల్గిస్తాడు.
ప్రశ్న 3.
మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
మనుషులు కామక్రోధలో భమదమోహమాత్సర్యములతో నిండి యున్నారని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు. మనుషులలో స్వార్థం, అవినీతి, దుర్మార్గం, మోసం పెరిగిపోయాయని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 51)
ప్రశ్న 1.
ఇంట్లో బాధలు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
సహజంగా ఇళ్ళల్లో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి.
- వచ్చిన కోడలిని అత్తగారు తన కుమారుని భార్యగా ఆదరించకుండా, వేరింటి పిల్లగా చూడడం మొదటి కారణం.
- వచ్చిన కోడలు అత్తగారిని తన తల్లిగా చూడడం మాని, ఏదో రాక్షసిని చూసినట్లు చూడడం రెండో కారణం.
- కోడలు కట్న కానుకలను ఎక్కువగా తేలేదని, ఆమెను నిందించడం.
- కోడలి పుట్టింటి వారిని గూర్చి అగౌరవంగా మాట్లాడడం.
- ఇచ్చిన కట్నం చాలలేదనడం, మనవడే పుట్టాలనడం వంటి కారణాల వల్ల ఇంట్లో బాధలు కలుగుతాయి.
ప్రశ్న 2.
ఇతర మతస్థులతో కూడా ఎందుకు ప్రేమగా ఉండాలి ?
జవాబు:
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలూ దైవాన్ని గురించి ఒకే మాట చెపుతున్నాయి. భగవంతుడిని ప్రేమించాలని ఆయనే సర్వానికీ కారణమనీ, అన్ని మతాలూ చెపుతున్నాయి.
అన్ని మతాలు చెప్పేది ఒకటే కనుక, ఇతర మతస్థులతో కూడా మనం ప్రేమగా ఉండాలి. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మత కలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతి ధామం అవుతుంది.
ప్రశ్న 3.
‘శాంతి’ అంటే ఏమిటి? ఇది నేడు ఎందుకు కనుమరుగైపోయింది ?
జవాబు:
‘శాంతి’ అంటే కామక్రోధాది షడ్గుణాలు లేకపోవడం. ‘శాంతి’ అంటే ప్రేమ, సహనము, ఆదరము. నేడు కులమత కలహాల వల్ల, ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం వల్ల, అవినీతి, లంచగొండితనం, అక్రమ పరిపాలనల వల్ల, అశాంతి పెరిగింది. మనుష్యులలో మానవత్వం నశించి, దానవత్వం ప్రబలింది. అన్ని ప్రాణులనూ తనలాగే చూస్తే, శాంతి వర్ధిల్లుతుంది.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
అ) “సమాజానికి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు శతకకవులు” చర్చించండి.
జవాబు:
శతకకవులు తమ శతకాలను తమకు గల ఎంతో అనుభవంతో, తమకు కలిగిన పుస్తక జ్ఞానంతో, దృష్టాంతాలతో, నీతులతో రాస్తారు. కాబట్టి శతకాలలో ముఖ్యంగా నీతి శతకాల్లో శతకకవులు చెప్పిన నీతులు సమాజానికి చక్కని మార్గాన్ని నిర్దేశిస్తాయి.
ఉదాహరణకు మనం చదివిన శతక పద్యాలు చూద్దాం.
- అందె వేంకటరాజం గారు, నింబగిరి శతకంలో కోడలిని కూతురుగా చూడాలని, కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలని, దళితులను సోదరులుగా చూడాలని, ఇతర మతాల వారిని తమ వారిగా ప్రేమించాలని చెప్పి, సమాజానికి మంచి మార్గాన్ని చూపించారు.
- అలాగే కాళహస్తీశ్వర శతకంలో పరుల సొమ్మును ఆశించి మనుష్యులు చేసే చెడ్డపనులను గూర్చి చెప్పారు. పరద్రవ్యమును ఆశించి, ఆ చెడ్డపనులు చేయరాదని ధూర్జటి ఆ విధంగా సమాజానికి హితాన్ని బోధించాడు.
- మల్ల భూపాలీయంలో చెవికి శాస్త్రజ్ఞానము, చేతికి దానము, శరీరానికి పరోపకారము ముఖ్యాలంకారాలని కవి చెప్పాడు.
- రాజుకు సరైన ఆలోచన మనస్సులో పుట్టడం ముఖ్యమని భాస్కర శతక కర్త చెప్పాడు. దీనిని బట్టి శతకకవులు సమాజానికి మార్గనిర్దేశకులు అన్న మాట సత్యము.
ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలలో కింది భావాలకు తగిన పద్య పాదాలను గుర్తించండి.
అ) “సూర్యచంద్రులు గతిదప్పినా”
జవాబు:
“జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్” అనేది, పై భావాన్ని ఇచ్చే పద్యపాదము.
ఆ) ‘మొదటిదైన ధనం పేదకు ఉండదు’
జవాబు:
‘తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.
ఇ) ‘అన్ని జీవులను తనలాగే ఆదరిస్తే’
జవాబు:
‘’అఖిల జీవుల తనవోలె నాదరింప’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.
ప్రశ్న 3.
కింది పద్యాలను పాద భంగము లేకుండా పూరించండి. వాటి భావం రాయండి.
అ) కులశైలంబులు ………………. సర్వేశ్వరా!
జవాబు:
“కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్!
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా !
భావం : ఓ సర్వేశ్వరా! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్దతిని తప్పడు.
ఆ) ధనము, ధనాభిమానము, ………. శ్రియఃపతీ !
జవాబు:
ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ !
భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.
ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదువండి.
సీ|| కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబుననె నింద గూడ వచ్చు
కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు
కోపంబు మిత్రులన్ కొంచెపరుచు
కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగా కొరివి యగును
తే॥ కోపము నరుని సాంతము కూల్చును భువి
లేదు వెదికిన యిటువంటి చేదు ఫలము
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
– ప్రసిద్ధి రామప్పవరకవి (సిద్దప్ప), కరీంనగర్ జిల్లా.
పై పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
అ) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు ?
ఎ) వేపపండు
బి) కోపం
సి) పాపం
డి) కాకరపండు
జవాబు:
బి) కోపం
ఆ) కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ?
ఎ) శాపం
బి) పాపం
సి) నింద
డి) కొరివి
జవాబు:
ఎ) శాపం
ఇ) కోపంచేత మనుషులు ఎట్లా మారుతారు ?
ఎ) పాపాత్ములు
బి) దురాత్ములు
సి) నీచాత్ములు
డి) క్రూరాత్ములు
జవాబు:
డి) క్రూరాత్ములు
ఈ) ‘సొంతం’ అను పదం అర్థమేమిటి?
ఎ) కొంత
బి) మొత్తం
సి) సగం
డి) శూన్యం
జవాబు:
బి) మొత్తం
ఉ) కోపం ఎవరి కొంప ముంచుతుంది ?
ఎ) మనుషుల
బి) మంచివారి
సి) దుర్మార్గుల
డి) నీచుల
జవాబు:
ఎ) మనుషుల
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జవాబు:
ధనతృష్ణ సజ్జనాప్తిచే నశిస్తుంది. సజ్జనాప్తి అంటే సత్పురుష సహవాసం. శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకాలలో, సత్సంగత్వం వల్ల నిస్సంగత్వము, నిస్సంగత్వము వల్ల నిర్మోహత్వము ఏర్పడుతాయని చెప్పారు.
ధనముపై దురాశ అంత తేలికగా నశించదు. మంచివారితో కలియడం వల్ల, వారి మంచి మాటల వల్ల క్రమంగా ధనముపై దురాశ పోతుంది. చనిపోయినపుడు మనం సంపాదించిన ద్రవ్యం, మన వెంటరాదని, మనం చేసుకున్న పుణ్యపాపకర్మల ఫలమే, మన వెంట వస్తుందనీ, సజ్జన సహవాసం వల్ల తెలుస్తుంది. దాని వల్ల ధనతృష్ణ క్రమంగా నశిస్తుంది.
ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి ?
జవాబు:
చెవులకు శాస్త్ర పాండిత్యము అందాన్ని ఇస్తుంది. కుండలాలు చెవులకు అందాన్ని ఇవ్వవు. చేతులకు దానము అందాన్ని ఇస్తుంది. చేతులకు కంకణాలు అందాన్ని ఇవ్వవు. శరీరానికి పరోపకారమే అందాన్ని ఇస్తుంది. శరీరానికి సుగంధలేపనాలు, అందాన్ని ఇవ్వవు. శాస్త్ర పాండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.
ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ?
జవాబు:
ఆపదలు రాకుండా ఉండాలంటే, మన ప్రవర్తనలో మార్పులు రావాలి.
- కోడలిని కూతురివలె చూడాలి.
- కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలి.
- దళితులను తన సోదరుల వలె మన్నించాలి.
- పరమతస్థులను తనవారివలె ప్రేమించాలి.
- జీవులందరినీ తనవలె చూసుకొని, ప్రేమతో ఆదరించాలి.
ఈ) “ధనవంతునికంటే కూడా పేదవాడు గొప్పవాడు.” దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ధనవంతుడిలో సామాన్యంగా ఈ కింది మూడు దోషాలు ఉంటాయి.
- ధనము,
- ధనాభిమానము,
- ధనతృష్ణ.
ఇందులో పేదవాడికి ధనము ఉండదు. కాబట్టి పేదవాడికి ‘ధనము’ అనే దోషం అతడిలో ఉండదు – ధనవంతుడిలో ఉండే ధనతృష్ణ అనే దోషము పేదవాడికి సజ్జన సహవాసం చేత పోతుంది. అందువల్ల పేదవాడిలో ధనము, ధనతృష్ణ అనే రెండు దోషాలు ఉండవు. అందుచేతనే ధనికుని కంటే పేదవాడు గొప్పవాడని చెప్పాలి.
ధనము ఉన్న కొద్దీ, ఇంకా సంపాదించాలనే దురాశ పెరుగుతుంది. ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేయాలా ? అనే చింత పట్టుకుంటుంది. ఆ ధనాన్ని ఎలా దాచాలా అనే విచారం కలుగుతుంది. ఆ విచారంతో ధనవంతుడు ఎ.సి గదుల్లో కూడా హాయిగా నిద్రపోలేడు.
పేదవాడికి ధనం పోతుందనే విచారం లేదు. అందువల్ల ధనికుని కంటే పేదవాడు గొప్ప అని నా అభిప్రాయం.
ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ‘శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి’ వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతకకవులు తన కాలం నాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాలలో చెపుతారు. ఆ కవులు నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీతి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు. మన శతకపద్యాల్లో ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బ్రతుకుతున్నారో చెప్పాడు.
పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం, అబద్ధాలాడడం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పడం, హింసను ప్రేరేపించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది ధూర్జటి కాలం నాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.
అలాగే అందె వేంకటరాజంగారు ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు, దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తిచూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.
ఈశ్వరుడు విషాన్ని మింగడం గొప్పకాదనీ, నేటి మనుష్యులలోని విషాన్ని పోగొట్టమనీ రాజరాజేశ్వర శతక పద్యంలో కవి చెప్పారు. నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగి పోయిందని, కవి ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు. కాబట్టి శతక పద్యాలు, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయనీ, విమర్శిస్తాయనీ చెప్పడం యథార్థము.
ప్రశ్న 3.
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ) పాఠంలోని మీకు నచ్చిన పద్య భావాల్ని ఆధారంగా చేసుకొని ఒక కథను రాయండి.
జవాబు:
తీరని రుక్కు కోరిక
‘రుక్కు’ గారి భర్త, రైల్వేలో ఏదో పనిచేసేవాడు. రుక్కుగారి పెద్దకొడుకు కంప్యూటర్ ఇంజనీరు. రుక్కుగారు పెద్దకొడుక్కి మూడేళ్ళ కితం పెళ్ళయింది. ప్రస్తుతం రుక్కుగార్కి ఏడాది దాటిన మనవడు ఉన్నాడు. రుక్కుగారి కోడలు కూడా కంప్యూటర్ బి.టెక్ చదివింది. రుక్కుగార్కి మరో కొడుకు ఉన్నాడు. కాని ఎడ్రస్ లేదు. పెద్ద కొడుకు చేత హైదరాబాద్లో బ్యాంకు లోను పెట్టించి, రుక్కు మూడు బెడ్రూమ్ల ఇల్లు కొనిపించింది. రుక్కుగారి భర్త ఈ మధ్యనే రిటైరయ్యాడు. రుక్కుగార్కి హైదరాబాద్ వెళ్ళి కోడలుపై పెత్తనం చేస్తూ కొడుకు డబ్బును అంతా తానే మేనేజ్ చేయ్యాలని పెద్ద ఆశ. రుక్కుకు ఇంకెక్కడా ఇల్లు లేదు. మొగుడికి ఏదో కొద్దిపాటి పెన్షను రావచ్చు. కోడలును తన గుప్పిట్లో పెట్టి నలిపేస్తూ, మనవడిని తన ఇష్టం వచ్చినట్లు పెంచాలని రుక్కుగారి ఉబలాటం. రుక్కుకు కూతురు లేదు. రుక్కుకు తన మాట ఇంట్లో సాగకపోతే, ఏడుపు వస్తుంది.
‘రుక్కు’ తన ఇంటికి వచ్చినప్పుడల్లా పెంట పెడుతుంది. ఇప్పుడు పర్మనెంటుగా మొగుడిని వెంట పెట్టుకొని హైదరాబాద్ వస్తే ఏం అల్లరిచేస్తుందో అని రుక్కు కోడలుకు గుండె గుబగుబలాడుతోంది. రుక్కు మొగుడు పాపం పెంపుడు కుక్క పిల్లలాంటివాడు. నోట్లో నాలుక లేదు. “అద్దె ఇంట్లో మనమిద్దరం హాయిగా ఉందాం. హైదరాబాద్ వద్దు. అన్నాడు రుక్కుతో ఆమె భర్త. రుక్కుకు చాలా కోపం వచ్చింది. ఏడ్చింది. రుక్కుకు జోస్యాల మీద మంచి నమ్మకం. ఒక మఠంలో సన్యాసి రుక్కు హైదరాబాద్ వెళ్ళడం మంచిది కాదని జోస్యం చెప్పాడు. పాపం రుక్కుకు కోడల్ని ఎలా సతాయించాలో అర్థం కాలేదు. కొడుకు కూడా రుక్కును రావద్దన్నాడు. జోస్యం అల్లాగే ఉంది. రుక్కు కోరిక తీరే మార్గం ఇప్పట్లో లేనట్లే.
(లేదా)
ఆ) పాఠంలోని పద్యభావాల ఆధారంగా విద్యార్థులలో నీతి, విలువల పట్ల అవగాహన పెంచటానికై ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
‘విద్యార్థులు – నీతినియమాలు’
విద్యార్థి సోదరులారా! దైవభక్తి కలిగి ఉండండి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ధనం కోసం అబద్ధాలాడకండి. ర్యాంకుల కోసం తప్పుడుదారులు తొక్కకండి. తోడి పిల్లలపై కొండెములు చెప్పి, హింసను ప్రేరేపించకండి. సిరి శాశ్వతం కాదు. వేషభాషలపై వెర్రితనం మంచిది కాదు. విద్య ప్రధానము. అలంకారాలు ముఖ్యం కాదు. పరోపకారమే విద్యార్థులకు నిజమైన అలంకారం అని తెలుసుకోండి.
మీరు కార్యాన్ని సాధించాలంటే బాగా బుద్ధి పెట్టి ఆలోచన చెయ్యండి. ఇతరుల సలహాలపై ముందుకు సాగకండి. ధనముపై దురాశ పెంచుకోకండి. మన చుట్టూ మనుష్యులలో విషం ఉన్న వాళ్ళున్నారు. వారి విషయంలో జాగ్రత్తపడండి.
మీ దళిత మిత్రులను సోదరులుగా చూడండి. పరమతాల వారిని ప్రేమించండి. జీవులందరినీ మీలాగే చూడండి. గురువుల మాటలను తలదాల్చండి. శాంతి, సత్యము, అహింసలకు ప్రధాన స్థానమియ్యండి. ఇది కరపత్రం కాదు. భగవద్గీత అని నమ్మండి.
ఇట్లు,
విద్యార్థి మిత్రులు.
III. భాషాంశాలు
పదజాలం
1. కింది పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఆపద = కష్టం
వాక్యప్రయోగం : ఆపదలు వచ్చినపుడు ఓర్పుతో, ఉపాయంతో వ్యవహరించాలి.
అ) నిక్క = నిజము
వాక్యప్రయోగం : సర్వకాలములయందు భగవంతుని ముందు నిక్కం మాట్లాడాలి.
ఆ) ఒజ్జ = గురువు
వాక్యప్రయోగం : శిష్యులకు ఒజ్జలమాటలు శిరోధార్యములు.
ఇ) తృష్ణ = దప్పి, పేరాస
వాక్యప్రయోగం : ధనతృష్ణ మానవులకు సర్వానర్ధదాయకము.
ఈ) విభూషణం = ఆభరణము
వాక్యప్రయోగం : నేటికాలంలో యువతకు విద్యయే విభూషణం.
2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : కూతురు : పుత్రిక, కుమార్తె
వాక్యప్రయోగము : జనకుని పుత్రిక సీతాదేవి, ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు.
అ) తృష్ణ :
- దప్పిక
- దప్పి
- పిపాస
వాక్యప్రయోగము : వేసవి తాపం వల్ల దప్పిక పెరిగింది. పిపాస తీరాలంటే నిమ్మ నీరు త్రాగాలి.
ఆ) సజ్జనుడు :
- సత్పురుషుడు
- సుజనుడు
వాక్యప్రయోగము : సుజనుడికి లోకమంతా మంచిగానే కన్పిస్తుంది. ఆ సత్పురుషుడు లోకానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు.
ఇ) మహి :
- భూమి
- ధరణి
- వసుధ
వాక్యప్రయోగము : భూమిపై పచ్చనిచెట్లు లేవు. ధరణి అంతా నిర్జీవంగా కనిపిస్తోంది.
ఈ) శైలము :
- పర్వతము
- అద్రి
- గిరి
వాక్యప్రయోగము : గిరి పుత్రిక పార్వతి పర్వతమును ఎక్కుతోంది.
3. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
అ) ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.
జవాబు:
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.
ఆ) సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది.
జవాబు:
సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినపుడే సింగం వేటాడుతుంది.
ఇ) ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.
జవాబు:
ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.
ఈ) కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
జవాబు:
కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
వ్యాకరణాంశాలు
1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు గుర్తించి రాయండి.
అ) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఆ) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
ఇ) కుండలమొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
ఈ) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి
2. కింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
అ) కార్యదక్షుడు – కార్యమునందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
ఆ) మూడుదోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
ఇ) కర్మశాల – కర్మము కొఱకు శాల – చతుర్థీ తత్పురుష సమాసం
ఈ) ఆశాపాశం – ఆశ అనె పాశం – రూపక సమాసం
3. కింది పద్యపాదాలు పరిశీలించి, గణవిభజన చేసి, గణాలు గుర్తించి, ఏ పద్యపాదమో రాయండి.
అ) ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్
పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి. కాబట్టి ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
ఆ) భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోటఁ బ్రధానులెంత ప్రజ్ఞా…..
పై పాదంలో భ, ర, న, భ, భ, ర వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.
సరళాదేశ సంధి
కింది పదాలు చదువండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి.
ఉదా : 1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్
జవాబు:
1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్ ………..
పై పదాలను గమనిస్తే, ఆ పదాల చివర ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర ‘న’ కారం ఉన్నది. ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ద్రుతం (న) చివరగల పదాలను ‘ద్రుత ప్రకృతికాలు’ అంటారు. కావున చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ద్రుతప్రకృతికాలే.
అభ్యాసము : మీరు కూడా మరికొన్ని ద్రుతప్రకృతిక పదాలు రాయండి.
- చేసెను
- వ్రాసెను
- వచ్చుచున్
- నాకొఱకున్
- నాయందున్
కింది వాటిని పరిశీలించండి.
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
పై పదాలను పరిశీలిస్తే
‘న్’ కు ‘క’ పరమైతే ‘క’ – ‘గ’ గా మారుతుంది.
”న్’ కు – ‘చూ’ పరమైతే ‘చూ’ – ‘జూ’ గా మారుతుంది.
‘న్’ కు ‘ట’ పరమైతే ‘ట’ – ‘డ’ గా మారుతుంది.
‘న్’ కు ‘త’ పరమైతే, ‘త’ – ‘ద’ గా మారుతుంది.
‘న్’ కు – ‘ప’ పరమైతే, ‘ప’ – ‘బ’ గా మారుతుంది.
అంటే
క → గ
చ → ‘జ’
ట → ‘డ’
త → ‘ద’
ప → ‘ఐ’ లుగా మారాయి
క, చ, ట, త, ప – లకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు.
గ, జ, డ, ద, బ – లకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు.
పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే,
సూత్రము : ద్రుత ప్రకృతికాలకు పరుషాలు లు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి.
ఇప్పుడు కింది ఉదాహరణలను పరిశీలించండి.
పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే
సూత్రము : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
4. కింది సంధి పదాలను విడదీసి, ద్రుత ప్రకృతిక సంధి లక్షణాలను పరిశీలించండి.
అ) గురువులఁగాంచి = గురువులన్ + కాంచి – గురువులఁగాంచి; గురువులం గాంచి ; గురువులన్గాంచి
ఆ) ఎక్కువగఁజొప్పడ = ఎక్కువగన్ + చొప్పడ – ఎక్కువగఁజొప్పడ ; ఎక్కువగంజొప్పడ ; ఎక్కువగన్జప్పడ
ఇ) తలఁదాల్చి = తలన్ + తాల్చి – తలదాల్చి ; తలం దాల్చి ; తలన్దాల్చి
ఈ) చెవికింగుండలంబు = చెవికిన్ + కుండలంబు – చెవికిఁగుండలంబు ; చెవికి౦గుండలంబు ; చెవికిన్గు౦డలంబు
శార్దూలం
కింది రెండు పద్యపాదాలను గణవిభజన చేసి పరిశీలిద్దాం!
గమనిక :
- పై పద్యపాదంలో వరుసగా మ, స, జ, స, త, త, గ గణాలు వచ్చాయి.
- పద్యానికి నాలుగు పాదాలున్నాయి.
- ప్రతి పాదంలో రెండవ అక్షరంగా ‘శ’ ఉన్నది. అంటే ప్రాస నియమం కలిగి ఉంది.
- 13వ అక్షరంతో యతి మైత్రి (నా 5) ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి.
పై లక్షణాలు గల పద్యం “శార్దూలం”.
మత్తేభం
పై పద్యపాదాన్ని పరిశీలిస్తే
- దీనిలో వరుసగా స, భ, ర, న, మ, య, వ గణాలు వచ్చాయి.
- పద్యానికి నాలుగు పాదాలున్నాయి. ప్రతిపాదంలో ‘వ’ రెండవ అక్షరంగా ఉండి ప్రాసనియమం కలిగి ఉన్నది.
- 14వ అక్షరం యతి మైత్రి (చె – చే) చెల్లుతుంది.
- ప్రతిపాదంలో 20 అక్షరాలున్నాయి.
- ఈ లక్షణాలు గల పద్యం “మత్తేభం”.
ఈ పాఠ్యాంశంలోని ఐదు, ఏడు పద్యాలకు గణవిభజన చేసి అవి ఏ పద్యపాదాలో తెలుపండి.
గమనిక :
- పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి.
- కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము.
- యతి 11వ అక్షరము (ధ-దా) లకు.
7వ పద్యం :
గమనిక :
1) పై ఏడవ పద్యపాదంలో వరుసగా 6 ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు క్రమంగా వచ్చాయి. కాబట్టి ఇది ‘సీస
పద్యపాదము’
1, 3 గణాద్యక్షరాలకు యతి కూ – కో
5, 7 గణాద్యక్షరాలకు యతి మం – మం
ప్రాజెక్టు పని
మీ పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతకపద్యాల పుస్తకాలను పరిశీలించి, మీకు నచ్చిన ఏవేని ఐదు పద్యాలు సేకరించి, వాటికి భావాలు రాయండి. నివేదిక రాసి, ప్రదర్శించండి.
ప్రశ్న 1.
సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతివాచస్పతీ!
భావం : నీతిలో బృహస్పతి వంటివాడా! సురభిమల్లా! తలకు, గురుపాదాలకు పెట్టే నమస్కారం, చేతులకు త్యాగం, చెవులకు మంచి వినే గుణం ఉండాలి. నోటికి సత్యవాక్కు ఉండాలి. బాహువులకు విజయం, మనసుకు మంచితనం ఉండాలి. అలాంటి పండితుడు సంపదలేకపోయినా ప్రకాశిస్తాడు.
ప్రశ్న 2.
బీదలకన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్యసం
పాదనకై యబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!
భావం : ఓ మనసా ! బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. నీచమైన సౌఖ్యాల కోసం అబద్ధాలు చెప్పకు. తగవులు పెట్టుకోకు. మర్యాదను మీరకు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇటువంటివే జీవన వేదాలని తెలుసుకో. వివేకమనే ధనం ఇదే కదా !
ప్రశ్న 3.
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!
భావం : దయా సముద్రుడా ! తరిగొండ నరసింహస్వామీ ! ఈశ్వరుడు పట్టుదలతో తన పక్షం వహించి ప్రసాదించిన సంపదలో శక్తిమేరకు పేదవారికి పెట్టాలి. అలాగే పేదలను నిందించకుండా అన్నం పెట్టిన వానికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ప్రయత్నించకపోయినా సంపద చేరుతుంది.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
I
1వ పద్యం: (కంఠస్థ పద్యం)
మ॥ “కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!
ప్రతిపదార్థం :
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామీ !
కులశైలంబులు = కులపర్వతాలు (సప్తకుల పర్వతాలు)
పాదు = ఆశ్రయము (స్థిరత్వము)
పెల్లగిలి = పెల్లగింపబడి (ఉన్మూలితమై)
దిక్కులంబునన్
(దిక్ + కూలంబునన్ = దిక్కుల ఒడ్డున (దగ్గర)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రములు
మేరలన్ = హద్దులను (చెలియలికట్టలను)
ఆక్రమించి = అతిక్రమించి
సముదంచద్భంగిన్
(సముదంచత్ + భంగిన్)
సముదంచత్ = అధికంగా పైకినెట్టబడిన
భంగిన్ = విధముగా
ఉప్పొంగినన్ = మిక్కిలి పొంగినా
జలజాతప్రియ శీతభానులు ;
జలజాతప్రియ = పద్మములకు ప్రియుడైన సూర్యుడును
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడునూ
యథాసంచారముల్ = (వారు) సంచరింపవలసిన తీరుగా సంచరించడం (తిరుగవలసిన రీతిగా తిరగడం)
తప్పినన్ = మరచిపోయినా
భవద్భక్తుండు
(భవత్ + భక్తుండు) = నీ భక్తుడు
తలకండు = చలించడు;
ఉబ్బడు = పొంగిపోడు;
చొప్పు = పద్ధతిని
తప్పడు = దాటడు; (విడిచిపెట్టడు)
భావం : ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్యచంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్ధతిని తప్పడు.
విశేషములు :
1) కులపర్వతాలు ఏడు అవి :
- మహేంద్రము
- మలయము
- సహ్యము
- శక్తిమంతము
- గంధమాదనము
- వింధ్యము
- పారియాత్రము
2వ పద్యం : (కంఠస్థ పద్యం)
శా॥ జాతుల్ సెప్పుట, సేవ చేయుట మృషల్ సంధించు టన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌట మి
ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరా!
జాతుల సెప్పుట
(జాతుల్ + చెప్పుట) = జాతకాలు చెప్పడమూ,
సేవచేయుట = రాజులకు కాని, ఇతరులకు కాని సేవ చేయడము
మృషల్ = అసత్యములు
సంధించుట = కూర్చుటయు; (మాట్లాడడమూ)
అన్యాయవిఖ్యాతిన్;
అన్యాయ = అన్యాయ మార్గములో
విఖ్యాతిన్ = కీర్తిని
పొందుట = పొందడమూ
కొండెకాడు = కొండెములు చెప్పేవాడు (ఒకరిమీద చాడీలు చెప్పేవాడు)
అవుట = అవడమూ, (కావడం)
హింసారంభకుండు
(హింసా + ఆరంభకుండు) = హింసా ప్రయత్నము చేసేవాడు
జౌట = అగుటయూ (కావడమూ)
మిధ్యా తాత్పర్యములు = అసత్యమైన భావములు
ఆడుట = చెప్పడమూ;
అన్నియున్ = ఈ పైన చెప్పిన అన్ని పనులునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనాన్ని
ఆశించి = చేజిక్కించుకోవాలనే ఆశ చేతనే కదా!
ఈ శ్రీ = ఇలా సంపాదించిన ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలకాలముపాటు
ఉండగలదో = నిలిచి యుంటుందో! (ఎవ్వరికీ తెలియదు)
భావం : ఓ శ్రీకాళహస్తీశ్వరా! లోకములోని మనుష్యులు, జాతకములు చెప్పడమూ, ఇతరులకు సేవలు చేయడమూ, అసత్యము లాడడమూ, అన్యాయంగా కీర్తిని సంపాదించడమూ, చాడీలు చెప్పడమూ, హింసా ప్రయత్నం చేయడమూ, అనవసర అర్థాలు చెప్పడమూ వంటి పనులు చేస్తూ, తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. కాని ఇలా సంపాదించిన ధనం, ‘ఎంతకాలం నిలుస్తుంది ? (ఎంతోకాలం నిలబడదని భావం.)
II
3వ పద్యం : (కంఠస్థ పద్యం)
మ॥ చెవికిం గుండల మొప్పుగాడు శ్రుతమే, చేదమ్మికిన్గంకణం
బు విభూషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్
బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతివాచస్పతీ!
ప్రతిపదార్థం :
లవితేంద్రాతి వైభవా !
లవిత (లలిత) = సుందరుడైన
ఇంద్ర = ఇంద్రుడి
అతిగ = అతిక్రమించిన (మించిన)
వైభవా = వైభవము గలవాడా!
నీతివాచస్పతీ = నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా!
సురభి మల్లా = ఓ సురభిమల్ల భూపాలుడా!
చెవికిన్ = చెవులకు
శ్రుతమే (శ్రుతము +ఏ) = శాస్త్రపాండిత్యమే కానీ,
కుండలము = కుండలములు ధరించడం
ఒప్పుగాదు (ఒప్పు + కాదు) = అందము కాదు
చేదమ్మికిన్ = పద్మము వంటి చేతికి;
దానమే
(దానము + ఎ) = దానమే కాని
కంకణంబు = కంకణము
‘విభూషాఢ్యము
(విభూషా + ఆఢ్యము) = గొప్ప అలంకారము
కాదు = కాదు;
మహిన్ = భూమండలములో
పుణ్యాత్ము = పుణ్యాత్ముని యొక్క
నెమ్మేనికిన్
(నెఱి + మేనికిన్) = అందమైన శరీరానికి
ఉపకార ప్రౌఢియే = గొప్ప ఉపకారమే కాని
ప్రవిలేపంబులు = పూత పూసుకొనే సుగంధ ద్రవ్యములు
సొమ్ములు + కావు = ఆభరణములు కావు
భావం : వైభవంలో ఇంద్రుని మించినవాడా! నీతిలో బృహస్పతితో సమానమైన వాడా! ఓ సురభిమల్ల మహారాజా! చెవులకు శాస్త్రపాండిత్యమే అందంకాని, కుండలాలు కాదు. చేతులకు దానమే అందంకాని, కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణం కాని, సుగంధ విలేపనాలు కావు.
4వ పద్యం : (కంఠస్థ పద్యం)
ఉ॥ భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!
ప్రతిపదార్థం:
భాస్కరా = ఓ సూర్య భగవానుడా!
భూపతికిన్ = రాజునకు;
ఆత్మబుద్ధి = తన తెలివి
మదిన్ = మనస్సు నందు
పుట్టనిచోన్ = కలుగకున్న పక్షంలో
ప్రధానులు = (ఆ రాజుగారి) మంత్రులు
ఎంత = ఎంతయో
ప్రజ్ఞాపరిపూర్ణులు = గొప్పబుద్దితో నిండినవారు
ఐనన్ = అయినప్పటికీ
కార్యము = పని
కొనసాగదు = నెరవేరదు;
ఎట్లనన్ = ఎలా అంటే
కార్యదక్షులై = పనులయందు నేర్పరులైన
ద్రోణభీష్మకృప యోధులు ;
ద్రోణ = ద్రోణాచార్యులు
భీష్మ = భీష్ముడు
కృప = కృపాచార్యుడు మొదలయిన
యోధులు = వీరులు;
అనేకులు = అనేకమంది
కూడి = కలసి
కౌరవక్ష్మాపతికార్యము = కౌరవులకు రాజయిన దుర్యోధనుని పనిని; (యుద్ధ విజయాన్ని)
ఏమైనన్ = ఏ మాత్రమైనా
చేయగన్ = చేయడానికి
చాలిరె = సరిపోయినారా? (సరిపోలేదు)
భావం : భాస్కరా! రాజుకు సరైన ఆలోచన పుట్టనపుడు, మంత్రులు ఎంత తెలివి కలవారయినా, కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచనలేని దుర్యోధనుడి పనులను, కార్యదక్షులైన ద్రోణ, భీష్మకృపాచార్యాది మహావీరులు, నెరవేర్పలేక పోయారు కదా!
విశేషము : దుర్యోధనుని పక్షంలో మహావీరులయిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటి వారున్నా, దుర్యోధనుడికి యుద్ధ విజయాన్ని వారు తెచ్చిపెట్టలేకపోయారు.
III
5వ పద్యం : (కంఠస్థ పద్యం)
చం॥ ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!
ప్రతిపదార్థం :
వేంకటపతి
అఖిలాండపతీ = ఓ వేంకటేశ్వరా!
(అఖిల + అండ, పతీ) = ఓ బ్రహ్మాండనాథా!
శ్రియఃపతీ = లక్ష్మీపతీ!
ధనమున్ = ధనమునూ
ధనాభిమానమున్
(ధన + అభిమానమున్) = ధనమునందు అభిమానమునూ
సదా = ఎల్లప్పుడునూ
తృష్ణయున్ = పేరాశయునూ (అనే); (ధనం సంపాదించాలనే కోరికయును)
మూడు దోషముల్ = మూడు దోషాలూ
ధనికునకున్ = ధనవంతుడికి (ఉంటాయి)
అందున్ = ఆ మూడు దోషాలయందు
తొల్తటిది = మొదటిది (అనగా ధనము)
పేదకున్ = బీదవానికి
లేదు = లేదు
అతని = ఆ పేదవాడి
తృష్ణ = ధనముపై పేరాశ
సజ్జనాప్తిని (సజ్జన + ఆప్తిని) = మంచివారితో కూడడం (సహవాసం) వల్ల
శమించున్ = శమిస్తుంది (నశిస్తుంది)
కావునన్ = కాబట్టి
ధనికుని కంటెన్ = ధనవంతుడి కన్నా
పేద = బీదవాడు
కడున్ = మిక్కిలి
ధన్యుడు = ధన్యాత్ముడు
భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా, అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.
6న పద్యం: (కంఠస్థ పద్యం)
మ॥ గరమున్ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీయాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమునున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూది విడనైనన్సంధి లేదో ప్రభూ
హర శ్రీవేములవాడ రాజఫణి హారా! రాజరాజేశ్వరా!
ప్రతిపదార్థం :
ఓ ప్రభూ = ఓ ప్రభువా!
హర = ఈశ్వరా
శ్రీవేములవాడ = సంపత్కరమైన వేములవాడ అనే పుణ్యక్షేత్రంలో వెలసిన
రాజఫణి, హారా = పెద్ద సర్పము కంఠహారంగా కలవాడా?
రాజరాజేశ్వరా = ఓ రాజరాజేశ్వర స్వామీ !
గరమున్ = కాలకూట విషాన్ని
మ్రింగి = మ్రింగి (తిని)
సుజన దుఃఖమ్మున్ = సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని
హరించితిన్ = పోగొట్టాను
అంచున్ = అని
నీ యాత్మలోన్ (నీ + ఆత్మలోన్) = నీ మనస్సులో
మురియంబోకు = సంతోషపడవద్దు
ఈ నరులందున్ = ఈ మనుష్యులందు
ఉండు = ఉండే
విషమ్ము = విషము
సూదిన్ = సూదిని
ఇడనైనన్ = గ్రుచ్చడానికైనా
సంధిలేదు = సందులేదు
ముందు = ముందుగా
మనుష్యదుర్విషమున్ = మనుష్యులలో ఉన్న చెడ్డ విషాన్ని
ఉన్మూలింపుమా = నశించునట్లు చెయ్యి
భావం : సర్పరాజు వాసుకిని కంఠమున ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామీ ! విషాన్ని మ్రింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నీలో నీవు మురిసిపోవద్దు. సూదిమొనకు కూడా చోటు లేనంతగా నిండిపోయిన ఆ మనుష్యులలోని భయంకరమైన విషాన్ని ముందుగా తొలగించు.
7వ పద్యం : (కంఠస్థ పద్యం)
సీ||
కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు?
తేగీ॥
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు?
వరశుభవిలాస | శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ ! నరసింహ! దివ్యనామ!
ప్రతిపదార్థం :
వరశుభవిలాస;
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారే వాడా!
భవ్యగుణధామ;
భవ్య = శ్రేష్ఠమైన
గుణ = గుణాలకు
ధామ = నిలయమైనవాడా!
‘శ్రీ నింబగిరి నివాస;
శ్రీ = సంపత్కరమైన
నింబగిరి = నింబగిరియందు
నివాస = నివసించేవాడా?
దివ్యనామ = ఇంపయిన పేరుగలవాఁడా?
నరసింహ = ఓ నరసింహస్వామీ
కోడలిన్ = కోడలిని (కొడుకు భార్యను)
కూతురు చందానన్ = తన కూతురునువలె
చూచినన్ = చూచినట్లయితే
మందిరమునన్ = ఇంట్లో
ఘోరముల్ = భయంకరములైన సంఘటనలు (కోడలిని దహనం చేయడం, కొట్టడం, విషాన్ని త్రాగించడం వంటివి)
మండునే = చెలరేగుతాయా ?
కార్మిక జనులన్ = ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను
భాగస్థులుగాన్ = (ఆ) ఫ్యాక్టరీ లాభనష్టాల్లో భాగము కలవారిగా
కాంచన్ = చూస్తే
కర్మశాలన్ = ఫ్యాక్టరీలో
అలజడుల్ = ఆందోళనలు (సమ్మెలు వగైరా)
క్రమ్మునే = వ్యాపిస్తాయా? (జరుగుతాయా?)
దళితులన్ = హరిజనులను
నిజసహోదరులుగాన్ = తన తోడబుట్టినవారిగా
మన్నించన్ = గౌరవిస్తే (ఆదరిస్తే)
జగానన్ = ప్రపంచంలో
ఉత్పాతములు = ఉపద్రవములు
పుట్టునే = కలుగుతాయా ?
పరమతస్థులన్ = = ఇతర మతాలవారిని
తమ వారిగా = తమకు కావలసిన వారిగా (తమ మతంలోని వారిగా)
ప్రేమించన్ = ప్రేమగా చూస్తే
కలహాగ్నులు
(కలహా + అగ్నులు) = కయ్యాలు అనే అగ్నిహోత్రములు
ఆగడములు = దౌష్ట్యములు (అన్యాయాలు)
రేగునే = విజృంభిస్తాయా? (పెరుగుతాయా?)
అఖిల జీవులన్ = అన్ని ప్రాణులనూ
తనవోలెన్ = తనవలెనే (ఆత్మవత్ సర్వభూతాని అన్న విధంగా)
ఆదరింపన్ = ప్రేమగా చూస్తే
ఉర్వియందున్ = భూమండలంలో
ఆపదలు = ఆపత్తులు
ఉద్భవించునే = సంభవిస్తాయా ? (సంభవింపవు)
భావం : నింబగిరిలో విలసిల్లే దేవా! శ్రేష్ఠమైన శుభాలతో ఒప్పేవాడా! అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా! ఓ నరసింహదేవా! కోడలిని కూతురి మాదిరిగా చూస్తే, ఇంట్లో ఘోరాలు సంభవించవు. కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారంలో అల్లర్లు జరుగవు. దళితులను తన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే, ప్రపంచంలో ఉపద్రవాలు పుట్టవు. ఇతర మతస్థులను తనవారిగా ప్రేమతో చూస్తే, కొట్లాటలు, ఆగడాలు పెరగవు. ప్రాణులనందరినీ తనవలె ఆదరంగా చూస్తే, భూమిమీద కష్టాలు పుట్టవు గదా!
8వ పద్యం : (కంఠస్థ పద్యం)
శా॥ ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్సుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్డిన్ సల్పుచున్ భవ్యమౌ
నాశీర్వాదము వొజ్జచేఁ బడసితానందంగనౌ నంచితం
బౌశాంతంబును వచ్యుతార్చిత పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!
ప్రతిపదార్థం:
అచ్యుతార్చితపదాబ్జా ;
అచ్యుత = శ్రీమహావిష్ణువు చేత
అర్చిత = పూజింపబడిన
పదాబ్జా (పద + అబ్జా) = పద్మములవంటి పాదములు
చంద్రమౌళీశ్వరా = చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామీ !
ఆశాపాశ నిబద్ధుడై ;
ఆశాపాశ = ఆశలు అనే త్రాళ్ళచే
నిబద్ధుడై = కట్టబడినవాడై
చెడక = చెడిపోక
నిత్యంబు = ఎల్లప్పుడునూ
ఓర్పుతో = సహనముతో
దేశికాదేశంబున్ ;
దేశిక = గురువుగారి యొక్క
ఆదేశంబున్
తలదాల్చి
(తలన్ + తాల్చి) = శిరసావహించి
యోగవిధులు = యోగాభ్యాస విధులు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగ విధులు)
అర్థిన్ = ప్రీతితో
సల్పుచున్ = ఆచరిస్తూ
భవ్యమ్ = అనుకూలమైన
ఆశీర్వాదమున్ = ఆశీస్సును
ఒజ్జచేస్ = గురువుగారిచేత
పడసి = పొంది
(అంచితంబు + ఔ) = ఒప్పియున్న
తాన్ = తాను
అందంగనౌన్ = అందుకోగలడు (సంపాదించగలడు)
భావం : విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వరా! ఆశ అనే పాశముచే బంధింపబడి, చెడిపోకుండా, ఎల్లప్పుడూ ఓర్పుతో గురువుగారి ఆదేశాలను తలదాల్చి, యోగాభ్యాస విధులను ఆచరిస్తూ, గురువుగారి దివ్యమైన ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శ్రేష్ఠమైన శాంతిని
పొందగలుగుతాడు.
పాఠం ఉద్దేశం
శతక పద్యాలు నైతికవిలువల్ని పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠ్యం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం, శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతకపద్యాల్లో ప్రతిపద్యం చివర ‘మకుటం’ ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్రభావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వరశతకం, ఉత్పలమాల, ఏకప్రాసశతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలున్నాయి.
కవుల పరిచయం
1) సర్వేశ్వర శతక కర్త :
- యథావాక్కుల అన్నమయ్య.
- ఈయన కవితా శైలి ధారాళమైనది.
- ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యములో గొప్ప పేరున్నది. ఈయన కాలము 13వ శతాబ్దం.
2) శ్రీకాళహస్తీశ్వర శతక కర్త :
- ధూర్జటి
- ఈయన కాలము 16వ శతాబ్దం.
- శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో “ధూర్జటి” ఒకడు.
- రాజుల సేవను ఈయన ధైర్యంగా ధిక్కరించాడు.
- ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు, “అతులితమాధురీమహిమ” కలదిగా మెచ్చుకున్నాడు.
- ఈయన
- శ్రీకాళహస్తీశ్వర శతకం,
- శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు.
3) “మల్ల భూపాలీయం” నీతిశతక కర్త :
- ఎలకూచి బాల సరస్వతి. కాలం 17వ శతాబ్దం.
- ఈయన నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థానకవి.
- ఈయన తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంతో పాటు, 12 గ్రంథాలు రచించాడు.
- భర్తృహరి సుభాషిత త్రిశతిని, తెలుగులోనికి అనువదించిన వారిలో ఈయన మొదటివాడు.
4) భాస్కర శతక కర్త :
- మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం.
- ఈయన ‘భాస్కరా’ అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకొనేటట్లు, తన పద్యధారను కొనసాగించాడు.
5) ఉత్పలమాల :
- ఉత్పల సత్యనారాయణాచార్య
- జననం : 4-7-1928. మరణం : 23-10-2007,
- ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతీయుడు.
- రసధ్వని, “ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు,” గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి రాశాడు.
6) ఏకప్రాస శతపద్యమాలిక కర్త:
- గౌరీభట్ల రఘురామ శాస్త్రి
- జననం : 22-04-1929, మరణం : 4-2-2004.
- సిద్ధిపేట జిల్లాలో “రిమ్మనగూడ” ఈయన జన్మస్థానం.
- వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి రచించారు.
7) నింబగిరి నరసింహ శతక కర్త:
- డా॥ అందె వేంకటరాజం
- జననం : 14-10-1933, మరణం : 11-09-2006. జన్మస్థలం : జగిత్యాల జిల్లా కోరుట్ల,
- రచనలు : నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, “భారతరాణి” నాటికల సంపుటి మొదలైనవి రాశాడు.
- బిరుదులు : కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.
8) చంద్రమౌళీశ్వర శతక కర్త :
- ఇమ్మడిజెట్టి చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా “తాళ్లపల్లి” జన్మస్థలం.
- జననం : 31-03-1934. మరణం : 11-03-2001
- రచనలు :
- హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం మొదలైనవి.
ప్రవేశిక
పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతినీ, జీవిత అనుభవాలనూ, భక్తినీ, వైరాగ్యాన్నీ శతకపద్యాలలో కవులు రాశారు. ఈ శతక పద్యాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ, రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి కొన్ని శతక పద్యాలను మనం చదువుదాం.