Telangana SCERT 9th Class Telugu Grammar Telangana లేఖలు Questions and Answers.
TS 9th Class Telugu Grammar లేఖలు
ప్రశ్న 1.
నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ.
జవాబు:
భద్రాచలం,
X X X X X
ప్రియ స్నేహితురాలు పద్మకు,
నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.
నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీదేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.
ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.
చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.
ప్రశ్న 2.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ.
జవాబు:
హైదరాబాదు,
X X X X X
ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,
నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.
ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని నేడు పిలుస్తున్నారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.
భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించే దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.
ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.
చిరునామా :
జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 30. 4/159,
కెనడీ రోడ్,
వాషింగ్టన్, అమెరికా.
ప్రశ్న 3.
మీ వీధిలో మంచినీటి సమస్య గురించి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ రాయండి..
జవాబు:
మహబూబ్నగర్,
X X X X X
మంచినీటి సరఫరాశాఖ చీఫ్ ఇంజనీర్ గారికి నమస్కరించి
గోపాలకృష్ణ వ్రాయు విన్నపము.
మా ప్రాంత కుటుంబాలవారు మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజులుగా మా ప్రాంతంలో, అందులోను ముఖ్యంగా మా వీధిలో మంచినీటి నల్లాలు పనిచేయడంలేదు. కాలనీవాసులు. త్రాగేటందుకు చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బావినీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని నల్లాలు సరిగా పనిచేయునట్లు చూడవలసిందిగా కోరుతున్నాను.
ఇట్లు,
తమ విధేయుడు,
వి. గోపాలకృష్ణ,
చిరునామా :
చీఫ్ ఇంజనీర్,
మంచినీటి సరఫరాశాఖ కార్యాలయం,
మహబూబ్నగర్.
ప్రశ్న 4.
మీ వాడలో ఎక్కువైన దోమల బాధను నివారించడానికి, తగు చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి.
జవాబు:
కరీంనగర్,
X X X X X
మునిసిపల్ కమిషనర్ గారికి,
కరీంనగర్ మునిసిపాలిటీ,
కరీంనగర్.
ఆర్యా,
కరీంనగర్ మునిసిపాలిటీ గాంధీనగర్ లోని మా పేటలో ఈ మధ్య దోమలు ఎక్కువయ్యాయి. మురుగు కాల్వలలో నీరు సరిగా ప్రవహించుట లేదు. మురుగు కాలువలు శుభ్రం చేయటం లేదు. ఒక్కొక్క చోట కాలువలు నిండి రోడ్లపై మురికినీరు పిల్ల కాలువల వలె ప్రవహిస్తున్నాయి. దానితో దోమలు పెరిగి మా వాడలోని ప్రజలు చాలా బాధపడుతున్నారు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. చంటిపిల్లలు దోమలు కుట్టి రోగగ్రస్తులవుతున్నారు.
కావున మీరు శ్రద్ధవహించి, సంబంధిత అధికారులకు తెలిపి, మా వాడ పరిశుభ్రాన్ని కాపాడి, మమ్ము దోమల బారినుండి రక్షింపగలరని ఆశించుచున్నాను.
ఇట్లు,
తమ విధేయుడు,
వి. రాజశేఖర్.
చిరునామా :
కమిషనర్,
పురపాలక సంఘ కార్యాలయం,
కరీంనగర్.
ప్రశ్న 5.
నగరంలో మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
వరంగల్లు,
X X X X X
ఈనాడు పత్రికా సంపాదకునకు,
ఆర్యా,
మన వరంగల్లు నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి.
ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరిసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహకరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరుతున్నాము.
ఇట్లు,
తమ విధేయుడు,
పి. శ్రీనివాస్.
చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
ప్రశ్న 6.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ.
(లేదా)
నేత్రదానం ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ.
జవాబు:
ఆదిలాబాదు,
X X X X X
ఈనాడు పత్రికా సంపాదకునకు,
అయ్యా,
మన దేశంలో పాక్షిక గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం.
అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.
ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.
చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
సోమాజీగూడ,
హైదరాబాదు – 500 001.
ప్రశ్న 7.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:
హైదరాబాదు,
X X X X X
ప్రియ మిత్రుడు నరేంద్రకు,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో రక్తదానం అవసరాన్ని గూర్చి తెలియజేస్తున్నాను.
కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తియొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పటికప్పుడు ఆయా రక్త గ్రూపు కలవారు దొరకటం చాలా కష్టం.
కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంకులలో. నిల్వచేసి అవసరం వచ్చినపుడు ఆయా వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను రక్తదానం చేశాను. నీవు కూడా నాలాగే రక్తదానం అవసరాన్ని గుర్తించి అందుకు సహకరించగలవని ఆశిస్తున్నాను.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.
చిరునామా :
ఆర్. నరేంద్ర, 10వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
బెల్లంపల్లి.
ప్రశ్న 8.
‘సంఘసంస్కర్త’ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ.
జవాబు:
భద్రాచలం,
X X X X X
ప్రియమైన చెల్లెలు సుజాతకు,
ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘసంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను.
వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటే సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం.
ఇట్లు,
మీ సోదరుడు,
పి. సందీప్ కుమార్.
చిరునామా :
పి. సుజాత, 10వ తరగతి,
ఎస్.ఆర్. హైస్కూలు,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.
ప్రశ్న 9.
ఉగ్రవాదం వల్ల సంభవిస్తున్న నష్టాలను వివరిస్తూ మిత్రునకు ఒక లేఖ రాయండి.
జవాబు:
స్టేషన్ ఘనాపూర్,
X X X X X
ప్రియ మిత్రురాలు సాయిచంద్రికకు,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ మధ్య దేశంలో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వాటిని గురించి ఈ లేఖలో తెలియజేయదలచాను.
ఉగ్రవాదం మన జాతీయ సమైక్యతకు తీవ్రభంగాన్ని, అశాంతిని కలిగిస్తున్నది. వారి పాశవిక చర్యలకు అనేకమంది తమ ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. అంతేకాక వారు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు నష్టపరుస్తున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమీలేదు. కాబట్టి ఉగ్రవాదులు తమ దుష్టమైన మార్గాన్ని విడిచిపెట్టి దేశశ్రేయస్సుకు పాటుపడాలని ఆశిస్తున్నాను.
ఇట్లు,
నీ మిత్రురాలు,
హరి అపర్ణ.
చిరునామా :
గార్లపాటి సాయిచంద్రిక,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
భద్రాచలం,
ఖమ్మం జిల్లా.
ప్రశ్న 10.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లా కలెక్టరుకు ఒక వినతి పత్రం రాయండి.
జవాబు:
అసిఫాబాదు,
X X X X X
కలెక్టరుగారి దివ్యసముఖమునకు
అసిఫాబాదు గ్రామ నివాసి వ్రాయు విన్నపం.
అయ్యా,
మాది అసిఫాబాదు. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్నారు. ఏ రోజునకు ఆ రోజు కాయకష్టం. చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంవల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవుతున్నారు.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కాబట్టి మా గ్రామంలో హాడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా. మనవి చేస్తున్నాను.
ఇట్లు,
తమ విధేయుడు,
అక్కపెద్ది పూర్ణచంద్.
చిరునామా :
జిల్లాధికారి,
జిల్లాధికారి కార్యాలయం,
ఆదిలాబాదు.