Telangana SCERT 9th Class Telugu Guide Telangana 9th Lesson కోరస్ Textbook Questions and Answers.
TS 9th Class Telugu 9th Lesson Questions and Answers Telangana కోరస్
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 91)
“అన్నపురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
హంసతూలికలొక చోట
అలసినదేహాలొక చోట
సంపదలన్నీ ఒకచోట
గంపెడు బలగాలొకచోట
వాసన నూనియలొకచోట
మాసిన తలలింకొక చోట
కమ్మని చకిలాలొక చోట
గట్టిదొడలింకొక చోట”
-కాళోజి
ప్రశ్నలు
ప్రశ్న 1.
పై కవితాపంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి?
జవాబు:
పై పంక్తులు సంఘంలో ఉండే పరస్పర విరుద్ధ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. ఆకలి వేసేవాడి దగ్గర అన్నంలేదు. అక్కరలేనివాడి దగ్గర “అది పోగుపడి ఉంది అని ఈ పంక్తులు తెలుపుతున్నాయి.
ప్రశ్న 2.
అలసిన దేహాలకు ఏం కావాలి ?
జవాబు:
అలసిన దేహాలకు కొంచెం విశ్రాంతి కావాలి. కడుపునిండా తిండి కావాలి. కాసింత ఓదార్పు కావాలి. శ్రమపడ్డాడనే గుర్తింపు కావాలి. సంఘం యొక్క మన్నన కావాలి.
ప్రశ్న 3.
‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట’ అంటే మీకేం అర్థమైంది ?
జవాబు:
ఆకలి లేనివాడికి, తింటే పడనివాడికి, దిట్టంగా వాడి దగ్గర ధనం, ఆహారపదార్థాలు ఉంటాయి. కాని వాడు వాటిని తినలేడు. వాడికి ఆకలి లేదు. తింటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది. ఆకలి వేస్తున్నవాడికి అన్నం కావాలి కాని వాడికి తినడానికి తిండిలేని దరిద్రం. ఈ విధంగా సంఘంలో పరస్పర వైరుధ్యాలున్నాయని నాకు అర్థమయ్యింది.
ప్రశ్న 4.
“కమ్మని చకిలాలొకచోట – గట్టి దౌడలింకొక చోట” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
‘కమ్మని చకిలాలు’ అంటే కమ్మని జంతికలు. అవి కొరికి తింటే కమ్మగా ఉంటాయి. వాడి దగ్గర ఆ చకిలాలు ఉన్నాయి. కాని గట్టిగా ఉండే వాటిని కొరికి తినడానికి వాడికి గట్టి దౌడలు, దంతాలు లేవు. అంటే ఆ కమ్మని చకిలాల ప్రయోజనం వాడికి అందదు. అలాగే మరో వ్యక్తికి గట్టి దౌడలు, దంతాలు ఉన్నాయి.
కాని వాడికి తినడానికి చక్కిలాలు లేవు. వాడికి గట్టి దౌడలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విధంగా ప్రయోజనం, ఉపయోగం లేనిచోట సంపదలు పోగు పడుతున్నాయి. కావలసిన బీదవాడి వద్ద దరిద్రం ఉంటోందని అర్థం.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 93)
ప్రశ్న 1.
‘భూమికి – ఆకాశానికి ఉన్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు’ – అని కవి అనడానికి కారణం ఏమిటి ?
జవాబు:
దళితవాద కవి సలంద్ర లక్ష్మీ నారాయణగారు, తన ‘కోరస్’ అనే కవితలో భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధం తాను చెప్తే కొంతమంది నవ్వుతారన్నాడు. నిజమే. `భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని మనం గుర్తించాలని రచయిత ఉద్దేశం.
భూమి, ఆకాశము అనేవి రెండూ పంచ మహా భూతాలలోనివే. ఈ సృష్టి నిర్మాణానికి పంచమహా భూతములే కారణం. అటువంటిది ఉన్నత కులాలవారు, తాము ఆకాశం వలె ఎత్తుగా గొప్పవారము అని, దళితులు భూమిలా అడుగున పడియుండాలని అంటారు.
నిజానికి భూమ్యాకాశములు రెండూ సృష్టికి సమాన కారణాలే అయినట్లు, దళితులూ, అగ్రవర్ణాల వారూ అందరూ సమాజంలో సమానమే అని, ఆ మాట కవిగారు అంటే అగ్రవర్ణాలవారు నవ్వుతారనీ కవిగారి అభిప్రాయం.
ప్రశ్న 2.
‘ప్రవాహం – నిశ్చలత’కు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు ?
జవాబు:
‘ప్రవాహం’ అంటే చైతన్యం. నీటిలో ప్రవాహం ఉంటే ఒక చోట నీరు కదలి, మరోచోటికి పోతుంది. పై నుండి అక్కడికి కొత్తనీరు వస్తుంది. సమాజం ఒక ప్రవాహం లాంటిది. పాత పోయి కొత్తదనం వస్తూ ఉంటుంది. ప్రవాహంలో స్తబ్ధత, నిశ్చలత ఉండవు. ప్రవాహంలో ఉండే కదలిక, చైతన్యము అనేవి, సమాజ లక్షణాలు.
నిశ్చలత అంటే కదలకుండా అక్కడే పడియుండడం. సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించకుండా, పాత చింతకాయ పచ్చడి మనస్తత్వాన్ని కల్గియుండడం ‘నిశ్చలత’.
సమాజంలో వస్తున్న కొత్తమార్పులను ఆహ్వానించడం ప్రవాహం అనీ, పాతతరం భావాలనే అంటిపెట్టుకొని పడియుండడం నిశ్చలత అనీ, నేను అర్థంచేసుకున్నాను.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 94)
ప్రశ్న 1.
‘గొంతు నొక్కేయడం’ అనే పదంలో విశేషార్థంపై మాట్లాడండి.
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అంటే, గొంతు, నొక్కడం అని రెండు శబ్దాల అర్థం వేరుగా తీసుకొంటే, పీక నొక్కడం అనే అర్థం వస్తుంది. కాని గొంతు నొక్కేయడం అన్నది పదబంధము. ఏ మాటకు ఆ మాట అర్థం తీసికోరాదు.. ఆ రెండు పదాలు కలిసిన పదానికి, విశేషార్థం ఉంటుంది. ‘గొంతు నొక్కేయడం’ అనే పదబంధానికి, ఆ వ్యక్తి మనస్సులోని విషయం, పైకి రాకుండా తొక్కిపెట్టడం అనే విశేషార్థం వస్తుంది.
బలవంతంగానో, భయపెట్టో లేక బ్రతిమాలో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపుచేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అని చెప్పాలి.
ప్రశ్న 2.
‘ఒంటరి’ అంటే మీకేం అర్థమయ్యింది. ?.
జవాబు:
‘ఒంటరి’ అంటే ఏకాకి. అనగా తాను చెప్పే విషయాన్ని ఇతరులెవ్వరూ సమర్థించకున్నా, తనతో ఇతరులు గొంతు కలుపకున్నా, తాను ఒక్కడే ధైర్యంగా నిర్భయంగా చెప్పదలచుకున్న విషయాన్ని లోకానికి చెపుతానని కవి అన్నాడు. దాన్నే కవి ‘ఒంటరి’ అన్నాడు.
ప్రశ్న 3.
‘చూపుడు వేళ్ళు’ – అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు:
సామాన్యంగా ఇతరులను బెదరించాలన్నా, ఇతరుల మాటల్లో తప్పులు ఎత్తి చూపాలన్నా, తమ చూపుడు వేళ్ళను ఎదుటివారికి చూపిస్తూ వారిని బెదిరిస్తారు.
“నిన్ను చంపేస్తాం జాగ్రత్త” అని ఎదుటివారిని భయపెట్టడానికి, మనం మన చూపుడువ్రేలిని ఎదుటివారి వైపు చూపిస్తాం. ఎదుటివారిని భయపెట్టడానికి, బెదిరించడానికి సామాన్యంగా మన చూపుడు వ్రేలును ఉపయోగిస్తాం. కవి కూడా తన భావాలు నచ్చనివారు తనవైపు వారి చూపుడు వ్రేళ్ళను చూపించి, భయపెట్టి తనను చంపుతారనీ, నిందిస్తారనీ అన్నాడు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
“కోరస్” అనే పేరు వినగానే మీకేమనిపించింది ? ‘కోరస్’ అనే పేరు ఈ కవితకు సరిపోతుందా ? ఎందుకు ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘కోరస్’ అనే పేరు వినగానే మేము నిత్యమూ పాఠశాలలో బాలబాలికలు అందరూ కలిసి పాడే వందేమాతరం, జనగణమన గేయాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కొక్కసారి, పై పాటలను ఒక విద్యార్థి లేక విద్యార్థిని చెపుతూంటే, మిగిలిన పిల్లలం మేము కోరస్ గా అనగా గొంతులు కలిపి ఒకే కంఠధ్వనితో పాడుతాము. లేదా మా పిల్లలం అంతా కలిసి, కోరస్ గా పాడతాము.
ఈ కవితకు కోరస్ అనే పేరు, అంతగా సరిపడదు. కాని ఈ కవిత చివర, రచయిత సమాజం అంతా చివరకు తన అభిప్రాయాలను గౌరవిస్తుందనీ, అందరూ తనతోపాటే గొంతు కలిపి తన పాటను పాడుతారనీ చెప్పాడు. సమాజం తనతో కోరస్ ఈ పాట పాడుతుందని కవి తన ఆకాంక్షనూ, తన ఆత్మ విశ్వాసాన్నీ ప్రకటించాడు.
అందువల్ల ఈ వచన కవితకు, ‘కోరస్’ అన్న శీర్షిక సరిపోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.
ప్రశ్న 2.
‘కోరస్ ‘ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు ? చర్చించండి.
జవాబు:
‘కోరస్’ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావనలివి.
- సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ, అంత తొందరగా అంగీకరించదు.
- భూమ్యాకాశాలకు సంబంధం ఉన్నదని చెపితే, సమాజం నవ్వుతుంది.
- పువ్వుకీ, ముళ్ళకూ మధ్య భేదం చెపితే, సమాజం కోపపడుతుంది.
- ప్రవాహ నిశ్చలతలకు, రూపం కల్పిస్తే సమాజం ఒప్పుకోదు.
- ఆలోచనకూ, ఆచరణకూ అర్థం చెప్తే సమాజం అపార్థం చేసుకుంటుంది.
- మేధస్సుకూ, మూర్ఖత్వానికీ ఉన్న పోలికను చెపితే, సమాజం రాళ్ళు విసరుతుంది.
- సమాజం యొక్క యథార్థ స్వరూపాన్ని సమాజానికి తెలియపరిస్తే సమాజం ఎదురుతిరుగుతుంది.
- సమాజాన్ని ఎవరైనా ఒంటరిగా ఒక వ్యక్తి విమర్శిస్తే, ఆ సమాజం ఆ వ్యక్తి గొంతును నొక్కేస్తుంది.
- సమాజం గురించి తనలో తానే విమర్శించుకుంటున్న వ్యక్తిని, సమాజం పిరికివాడంటుంది. మూర్ఖుడంటుంది. బెదరించి చంపుతుంది.
- చివరకు సమాజం తనతో కోరస్ పాడుతుంది.
పై విధమైన భావనలు సమాజం పట్ల కవికి ఉన్నాయి.
ప్రశ్న 3.
కింది కవితా పంక్తులు చదువండి. భావం రాయండి.
ఆకులు లేకుంటే
చెట్టునెలా గుర్తిస్తావు ?
పచ్చదనమే చెట్టుకు చిరునామా ! చెరువులో బంగళాలు మొలిచాయి నీటి తల్లికి ఇన్ని సమాధులా ! చెట్టుతనం కట్టెతనమయ్యింది
చిగురుకలలేవి ? చిటపటలు తప్ప ?
జవాబు:
పై కవితా పంక్తుల భావము :
చెట్టుకు ఆకులు లేకపోతే, అది ఏ చెట్టో గుర్తించడం ఎలా ? అది చెట్టు అనడానికి దానికి గల పచ్చదనమే గుర్తు. ఈనాడు చెరువులు కప్పుపడి, ఆ ప్రాంతంలో భవనాలు కట్టబడ్డాయి. తల్లి వంటి నీటికి ఇలా సమాధులు నిర్మిస్తారా ? చెరువులను కప్పివేస్తారా ? చెట్టు బ్రతికుంటేనే, దానికి చెట్టుతనం ఉంటుంది.
చెట్టు చచ్చిపోతే అది పొయ్యిలో కాల్చే కట్టె వలె అవుతుంది. చచ్చిన చెట్టులో కట్టెతనమే ఉంటుంది. చెట్టు, కట్టెగా మారితే, దానికి చిగురులు పుట్టినట్లు కలలు రావు. దానికి నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు వినిపించే చిటపటలే వినబడతాయి.
ప్రశ్న 4.
“కోరస్” కవిత నుండి – కింది భావాలకు తగిన కవితా పంక్తులు గుర్తించండి.
అ) నాకు భయమన్నదే లేదు – నేను ఒక్కడినే నా పాట పాడుకుంటా.
జవాబు:
“నాకు భయం లేదు, నేను నేడు, ఈ పాట,
ఒంటరిగానే పాడుకుంటాను !”
ఆ) నేను స్తబ్దంగా వుంటే పిరికివాడంటారు.
జవాబు:
“నేను
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊబుసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికివెధవననీ”
ఇ) వీళ్ళ అసలు రూపాలు చూపిస్తే, తట్టుకోలేక నన్నే విమర్శిస్తారు.
జవాబు:
“మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు”
ఈ) ఆలోచనలకు వాటి అమలుకు మధ్య రూపమిస్తే వీళ్ళు అంగీకరించరు.
జవాబు:
“ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు”
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడంలో అంతరార్థం ఏమిటి ? వివరించండి.
జవాబు:
కవి సలంద్ర లక్ష్మీనారాయణ, తన కోరస్ అనే కవితలో, తెలివికీ మూర్ఖత్వానికీ దగ్గర పోలిక ఉందని తాను అంటే, మేధావులు, తన మీద రాళ్ళు విసరుతారని చెప్పాడు. అంటే మేధావులు తనను నిందిస్తారని ఆయన చెప్పాడు.
మూర్ఖుడు తనకు తోచిందే తప్ప ఇతరులు చెప్పిన దానిని విని, ఆ మాటల్లోని మంచి చెడ్డలను గ్రహింపడు. మేధావులు కూడా, అంతా తమకే తెలుసుననీ, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరంలేదనీ అనుకుంటారు. ఇతరులు చెప్పింది. వినకపోడం మూర్ఖత్వమనీ, ఒక విధంగా మేధావికీ, మూర్ఖుడికీ పోలిక ఉందనీ చెపితే మేధావి కోపపడతాడు. తనను మూర్ఖుడితో పోల్చి చెప్పినవాడిపై మేధావి రాళ్ళు విసరుతాడు. అంటే కోపపడతాడు.
మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని, ఈ మాటల్లోని అంతరార్థము.
ఆ) మేధస్సు, మూర్ఖత్వం మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
మేధస్సు గల మేధావి తానే మేధ గలవాడిననే గర్వంతో ఇతరులు ఎవరైనా ఏదైనా చెపితే అది సరయినదే అయినా, తాను అంగీకరించడు. తనకున్న తెలివితో తాను చెప్పినదే సరయినదని వాదిస్తాడు. తన మూర్ఖపు పట్టు ఎంతమాత్రం విడిచిపెట్టడు.
మూర్ఖుడు కూడా తాను అనుకున్నదే కాని కొత్తదాన్ని అంగీకరించడు. “చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు” అని భర్తృహరి మూర్ఖుణ్ణి గూర్చి నిజం చెప్పాడు. ఒక విధంగా మేధావి కూడా మూర్ఖుడిలాగే ప్రవర్తిస్తాడు. తాను అనుకొన్నదే తప్ప, ఇతరులు చెప్పిన దానిని అతడు అంగీకరించడు.
దీనిని బట్టి మేధావికీ, మూర్ఖుడికీ పేరులో తప్ప వ్యవహారంలో పెద్దగా తేడా కనిపించదు.
ఇ) కవి దృష్టిలో మేధావులంటే ఎవరు ?
జవాబు:
మేధావులు అంటే, తెలివిగలవారు. సమాజానికి ఏది మంచో, ఏది చెడో తెలిసికోగల బుద్ధిమంతుల్ని మేధావులు అని చెప్పాలి.
మూర్ఖుడి వలె, ఏది చెప్పినా వినని మేధావి కూడా మూర్ఖుడితో సమానమే అని కవి ఉద్దేశ్యము. సమాజంలో వస్తున్న మార్పులను గమనించలేనివారు మేధావులు కారని కవి భావన. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహింపలేనివాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించాలని కవి భావన.
ఈ) ‘గొంతునొక్కేయడం’ అంటే మీకేమి అర్థమయింది ? ఒక ఉదాహరణ తెలుపండి.
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అనేది ఒక పదబంధం. ఒక వ్యక్తి మనసులోని భావాన్ని పైకి చెప్పనీయకుండా అణచివేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
బలవంతంగానో, బయపెట్టో లేక మరో రీతిగానో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపు చేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అంటారు.
ఉదా : న్యాయస్థానంలో నిజం చెప్పడానికి వచ్చిన సాక్షి గొంతు నొక్కేశారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “కోరస్” పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
నేను భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధాన్ని చెప్తే సమాజం నన్ను చూసి నవ్వుతుంది. పువ్వుకీ, ముళ్ళకీ ఉన్న తేడా చెప్తే సమాజం నాపై కోపపడుతుంది. ప్రవాహానికీ, నిశ్చలతకూ రూపం కల్పిస్తే సమాజం అంగీకరించదు. ఆలోచనలకూ, వాటి అమలుకూ మధ్య రూపమిస్తే సమాజం అంగీకరించదు. మేధావులకూ, మూర్ఖులకూ పోలిక ఉందంటే మేధావులు రాళ్ళతో కొడతారు. వారి అసలు రూపాలు వివరంగా చూపిస్తే నన్ను విమర్శిస్తారు.
నేను గొంతెత్తి ఒంటరిగా మాట్లాడితే, నా గొంతు నొక్కేయాలని చూస్తారు. ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే, పిరికి వాడవని అంటారు. నన్ను మూర్ఖుడని అంటారు. చూపుడు వేలుతో నన్ను బెదిరించి చంపేస్తారు. అయినా భవిష్యత్తులో నన్ను వ్యతిరేకించినవాళ్ళే, సత్యాన్ని గ్రహించి, తన మాటతో ఏకీభవిస్తారనీ, తనతో కలిసి కోరస్ ఆలపిస్తారనీ కవి ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించాడు.
3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ). కవి సలంద్ర ఆలోచనలను, ఈ కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి.
జవాబు:
సాహిత్య పత్రికకు లేఖ
ఖమ్మం,
X X X X.
ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది,
ఉత్తమ సాహిత్య కళా సాంస్కృతిక మాసపత్రిక,
హైదరాబాదు.
సంపాదక మహాశయా!
నమస్కారాలు. మాకు తొమ్మిదవ తరగతిలో దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన ‘దళిత మానిఫెస్టో’ కవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన ‘కోరస్’ వచన కవిత పాఠ్యభాగంగా నిర్ణయింపబడింది. ఆ కవితలోని అంతరార్థాన్నీ, ఆ కవిగారి ఆలోచనలనూ నాకు నచ్చి లేఖారూపంగా రాస్తున్నా. దయతో దీన్ని పరిశీలించి, మీ సాహిత్య పత్రికలో ప్రచురింప కోరిక.
సలంద్ర వారి కోరస్ కవిత అద్భుతంగా ఉంది. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తూ, అనేక విధాలుగా తన ప్రశ్నలనూ సందేహాలనూ ‘కోరస్’ అన్న తన వచన కవితలో వెలిబుచ్చాడు.
ఈయన భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సహజ బంధాన్ని గుర్తించాలని, పూల సౌకుమార్యాన్నీ, ముళ్ళ కాఠిన్యాన్నీ గ్రహించాలనీ అంటాడు. నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, నీటి నిశ్చలత్వానికీ గల తేడాను గ్రహించాలంటాడు. ఇవేవీ తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దంటాడు.
ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేనివాళ్ళూ, ప్రజల పక్షాన నిలబడనివాళ్ళూ నిజమైన మేధావులు కారన్న సత్యాన్ని తెలిసికోమంటాడు. ఒంటరిగా తాను ప్రగతిశీల భావాలు పాడుతానంటాడు. తనను పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్రవేసినా తాను లెక్కచేయనన్నాడు. ఇప్పుడు తనను వ్యతిరేకించినవాళ్ళే, భవిష్యత్తులో తనతో ఏకీభవించి, తన పాటతో గొంతు కలిపి, కోరస్ పాడతారన్నాడు. సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.
ఇట్లు,
మీ విశ్వసనీయ
కొంగర సత్యవాణి,
తొమ్మిదవ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం.
చిరునామా :
ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది మాసపత్రిక,
అమీర్ పేట, హైదరాబాదు – 500004
III. భాషాంశాలు
పదజాలం
1. కింది పదాలకు అర్థాలు రాయండి. ఆ పదాలతో సొంతవాక్యాలు రాయండి.
మేధస్సు = తెలివి
ఉదా : వాక్యప్రయోగము : వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది. ఆచరించేది, చేసేది.
అ) ఆచరణ = ………………………
జవాబు:
ఆచరణ = ఆచరించేది, చేసేది.
వాక్యప్రయోగము : గురువుల ఉపదేశాలు ఆచరణ యోగ్యంగా ఉండాలి.
ఆ) ప్రతిబింబం = ………………….
జవాబు:
ప్రతిబింబం = మారురూపు
వాక్యప్రయోగము : సూర్యుడి ప్రతిబింబం చెరువు నీళ్ళలో కనబడుతుంది.
ఇ) నిశ్చల = ………………………….
జవాబు:
నిశ్చల = స్థిరత్వము
వాక్యప్రయోగము : సంపూర్ణ నిశ్చలతతో కూడిన మనస్సుతో భగవంతుని స్మరించాలి.
ఈ) కోరస్ = ……………………………
జవాబు:
కోరస్ = గొంతు కలుపటం
వాక్యప్రయోగము : విద్యార్థినీ, విద్యార్థులందరూ కలిసి, కోరస్ గా జనగణమన గేయం పాడారు.
2. కింది జాతీయాలను వివరించండి.
అ) రాళ్ళు విసరడం : ………………………….
జవాబు:
‘రాళ్ళు విసరడం’ అంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పుపట్టడం అని అర్థము. ఎవరైనా ఒక మంచిపని చేస్తోంటే అది చూసి సహించలేని దుర్మార్గులు మంచిపని చేసేవాడిపై లేని నేరాలు ఆరోపించి, అతడిపై దోషాలు ఆరోపిస్తారు. దాన్నే ‘రాళ్ళు విసరడం’ అంటారు.
ఆ) గొంతునొక్కేయడం : ……………………
జవాబు:
‘గొంతు నొక్కేయడం’ అంటే మాట పైకి రాకుండా అడ్డుపెట్టడం అని అర్థము. ఎవరైనా ఉన్న సత్యాన్ని ధైర్యంగా వారు గొంతు విప్పి మాట్లాడుతుండగా, వారు మాట్లాడితే సత్యం బయటపడుతుందనే భయంతో, బలవంతంగానో, లేక బెదరించో లేక బతిమాలో, అతడు గొంతువిప్పి మాట్లాడకుండా చేయడాన్ని, ‘గొంతునొక్కేయడం’ అంటారు.
వ్యాకరణాంశాలు
1. కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.
అ) చూసుకొండంటూ = …………………………….
జవాబు:
చూచుకొండు + అంటు – ఉత్వ సంధి
ఆ) గొంతెత్తి = …………………………….
జవాబు:
గొంతు + ఎత్తి – ఉత్వ సంధి
2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
అ) ముక్కలు చెక్కలు = ……………………
జవాబు:
ముక్కలును, చెక్కలును – ద్వంద్వ సమాసం
ఆ) గొంతునొక్కేయటం = ……………………….
జవాబు:
గొంతును నొక్కేయటం – ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) నా పాట = …………………………..
జవాబు:
నా యొక్క పాట – షష్ఠీ తత్పురుష సమాసం
3. కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారములను గుర్తించి రాయండి.
* పువ్వుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
ప్రవాహానికి నిశ్చలతకీ రూపం కలిస్తే.
“ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
జవాబు:
పై గేయపంక్తులలో “అంత్యానుప్రాస అలంకారం ఉంది.
లక్షణం : పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే, అది ‘అంత్యానుప్రాసాలంకారం’ అవుతుంది.
సమన్వయము : పై పాదాల్లో పదాల చివర ‘కీ’ అనే అక్షరం, పునరుక్తమయ్యింది. అంటే తిరిగి తిరిగి వచ్చింది – అలాగే వాక్యాల చివరలో “ప్తే, స్తే, ప్తే” – అనే సంయుక్తాక్షరం, పునరుక్తమయ్యింది. అందువల్ల పై పాదాల్లో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
* కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.
లక్షణం : ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పినట్లయితే ‘ఉపమాలంకారం’ అవుతుంది.
సమన్వయము : పై వాక్యంలో
- ‘లేడిపిల్ల’ అనేది ఉపమానము;
- కిశోర్ అనేది “ఉపమేయం”
- ‘లా’ ఉపమావాచకం
- ‘పరుగెత్తుతున్నాడు’ అనేది సమానధర్మం.
పై విధంగా ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పబడింది. కాబట్టి ఇది ఉపమాలంకారం.
* మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది.
జవాబు:
పై వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది.
లక్షణం : సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.
సమన్వయము : ఇక్కడ ‘పండుగ వాతావరణం’ అనేది ఉపమానం. ‘ఇంటి వాతావరణం’ అనేది ఉపమేయం. ఉపమేయం అయిన ఇంటి వాతావరణాన్ని, ఉపమానం అయిన ‘పండుగ వాతావరణం’ గా ఊహించారు. కాబట్టి ‘ఉత్ప్రేక్షాలంకారం’.
4. కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) ఆయన ప్రశ్నలను, సందేహాలను ‘కోరస్’ కవిత ద్వారా లేవనెత్తాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఆయనచేత ప్రశ్నలు, సందేహాలు ‘కోరస్’ కవిత ద్వారా లెవనెత్తబడతాయి. (కర్మణి వాక్యం)
ఆ) నా మీద రాళ్ళు విసురుతారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నా మీద రాళ్ళు విసరబడతాయి. (కర్మణి వాక్యం)
ప్రాజెక్టు పని
తెలుగు కవిత్వంలో అభ్యుదయ కవులుగా పేరు పొందిన ఎవరిదైన ఒకరి కవితలను సేకరించి నివేదిక రాసి, చదివి వినిపించండి.
జవాబు:
“శ్రీశ్రీ” గా పిలువబడే అభ్యుదయ కవి “శ్రీరంగం శ్రీనివాసరావు” గారు. ఆయన “మహాప్రస్థానం” అనే ఖండకావ్యం రాశాడు. ఆయన కవితలు రెండు పరిశీలిద్దాం.
జయభేరి
1. “నేను సైతం,
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”.
2. నేను సైతం
ప్రపంచాబ్దపు
తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను”
పై గేయంపై నా అభిప్రాయం :
ఇక్కడ నేను అంటే శ్రీశ్రీ కాదు. శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచం యొక్క అభ్యుదయం కోసం, ఆ శ్రామికుడు ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతో కృషి చేశాడు. గతంలో నేను సైతం అనే నుడికారం, మానవజాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకోని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఇతడికి చరిత్రలో గుర్తింపు లేదు. ఇప్పుడితడు తిరగబడి తన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందిగా ఘోషిస్తున్నాడు.
3. “మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం” ……………..
పై గేయంపై నా అభిప్రాయం :
పై మహాప్రస్థాన గేయం, ఒక యుద్ధగీతంలా నడచింది. ఇదొక వీరగానం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం. ప్రస్తుత దోపిడీ వ్యవస్థ నుంచి, ఈ పీడిత సమాజం నుంచి, సామ్యవాద వ్యవస్థకి, సమసమాజ వ్యవస్థకి, ప్రయాణం చేయడమే మహాప్రస్థానం. అభ్యుదయ మార్గం వైపు ప్రస్థానం సాగించాలన్నది శ్రీశ్రీ ప్రబోధం. భావావేశానికి తగిన శబ్దప్రయోగంతో, శ్రీశ్రీ మహాప్రతిభకి ఈ గేయం అద్దం పడుతుంది. ఈ గేయం రచనా కాలంనాటికే, రష్యాలో సామ్యవాదవ్యవస్థ అనే ‘మరోప్రపంచం’ ఏర్పడింది.
మహాప్రస్థాన గేయం ఒక మహాప్రవాహం. ప్రళయ ఝంఝా ప్రభంజనం. దీని వేగానికి తట్టుకోలేక సహృదయుడు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీని గమనవేగం, భావతీవ్రత, అంత శక్తివంతమైనవి.
వచన కవితా పంక్తులు – సారాంశము
I.
1 నుండి 6 పంక్తులు నేను –
నేను –
భూమికీ – ఆకాశానికీ వున్న
సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు,
నేను –
పువ్వుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
వీళ్ళు కోప్పడుతారు
భావం :
భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకు ఉన్న మెత్తదనాన్ని (సుకుమారత్వాన్ని), ముళ్ళకు ఉన్న కఠినత్వాన్ని గ్రహించాలి. నేను భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సంబంధం గురించి చెపితే వీళ్ళు నవ్వుతారు. ముల్లుకూ, పువ్వుకూ తేడా చెపితే, కోపిస్తారు.
7 నుండి 12 పంక్తులు
నేను –
ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కల్పిస్తే
వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు,
నేను –
ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు,
భావం :
నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, కదలని నీటికి గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకొనే ఆలోచనలకూ, ఏమి చేయలేనితనానికీ మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దని కవి కోరుతున్నాడు.
3 నుండి 20 పంక్తులు
నేను –
మేధస్సుకీ – మూర్ఖత్వానికీ
సామ్యం చూపితే వీళ్ళు
నా మీద రాళ్ళు విసురుతారు.
నాకు తెలుసు
నేను మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు.
భావం :
నేను మూర్ఖుడికీ, తెలివి గలవాడికీ పోలికలు చూపిస్తే, సమాజం నామీద రాళ్ళు విసరుతుంది. మీరేమిటో మీరు తెలిసికోండని వారి ముఖం చూసుకోడానికి అద్దం చూపిస్తే, . దాన్ని ముక్కలుగా బద్దలు చేస్తుంది.
II.
1 నుండి 4 పంక్తులు నేను –
నేను –
గొంతెత్తి ఒంటరిగానే
పాట పాడినా మాట్లాడినా
నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు.
భావం :
కవి తాను ఎవరికోసమూ చూడకుండా, ఒంటరిగానే, తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటున్నాడు. తన గొంతు పైకి విన్పించకుండా అణచి పెట్టాలని సమాజం ప్రయత్నిస్తుంది.
5 నుండి 10 పంక్తులు
“నేను –
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికి వెధవననీ
మూర్ఖున్ననీ
చూపుడు వేళ్ళతో చంపేస్తారు
భావం :
తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణచి వేయాలని చూసేవాళ్ళకు కవి తాను భయపడనంటాడు. సమాజం తనను పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్రవేసినా, తాను లెక్కచేయనని కవి ఈ పంక్తుల్లో ప్రకటించాడు.
(11 నుండి 17 పంక్తులు)
అయినా నాకు తెలుసు
రేపు వీళ్ళే
నా పాటకి కోరస్ అందుకుంటారు –
నాకు భయం లేదు
నేను నేడు
ఈ పాట
ఒంటరిగానే పాడుకుంటాను !
భావం :
భవిష్యత్తులో, నేడు తనను వ్యతిరేకించిన వాళ్ళే, యథార్థాన్ని తెలుసుకొని తన మాటతో ఏకీభవిస్తారనీ, తన పాటతో గొంతు కలుపుతారనీ (కోరస్ అందిస్తారనీ), ఆశావహ దృక్పథాన్ని కవి వెల్లడించాడు. అప్పటి వరకూ తాను ఒంటరిగానే, భయం లేకుండా, తన హృదయంలోని భావనలను ప్రకటిస్తానని కవి ఆత్మవిశ్వాసంతో పలికాడు.
పాఠం ఉద్దేశం
తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి, ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ప్రక్రియ – వచనకవిత
ఈ పాఠం వచనకవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛాకవిత్వాన్ని ‘వచనకవిత’ అంటారు. చెప్పేది వచనమే ఆ చెప్పే మాటల్లో ‘కవిత్వం’ పాలు వుంటేనే అది వచనకవిత అవుతుంది. వచనకవిత భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచనకవితలు ‘వస్తువు- అభివ్యక్తి-శిల్పం’ ఆధారంగా ప్రతిభ కలవిగా గుర్తింపబడతాయి.
ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన ‘చావుగీతం’ కవితా సంకలనం లోనిది.
కవి పరిచయం
పాఠం పేరు : ‘కోరస్’
కవి : సలంద్ర లక్ష్మీనారాయణ
దేని నుండి గ్రహింపబడింది : కవి రచించిన ‘చావుగీతం’ కవితా సంకలనం నుండి గ్రహించబడింది.
కవి జనన-మరణాలు : జననము : 12-01-1956
మరణము : 17-09-1986
జన్మస్థలము : నిజామాబాద్ పట్టణంలో జన్మించారు
తొలి కవితా సంపుటి : ‘వేడిగాలి’ అనే కవితా సంకలనం ద్వారా ఈయన తన మొదటి కవితా సంపుటిని అందించారు.
‘చావుగీతం’ సంచలనం : 1979లో ఈయన రచించిన ‘చావుగీతం’ కవితాసంపుటి సంచలనం సృష్టించింది.
దళిత సాహిత్యోద్యమం : ఈ కవి రచించిన ‘దళిత మానిఫెస్టో’ అనే కవిత, దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పదగినది.
ప్రవేశిక
వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. అయినా వాటిని గురించి. పదే పదే చెబుతూ, ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి, ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా. ఈ నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. ఆ వైనాన్ని చదివి తెలుసుకుందామా ?