Telangana SCERT 7th Class Telugu Guide Telangana 3rd Lesson శతక సుధ Textbook Questions and Answers.
శతక సుధ TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.
    

ప్రశ్న1.
 పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు?
 జవాబు.
 పై బొమ్మలో గురువు, విద్యార్థులు ఉన్నారు. గురువు బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారు.
    
ప్రశ్న 2.
 శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు?
 జవాబు.
 శిష్యులు తమకు తెలియని విషయాలపై ప్రశ్నలు అడిగి ఉండవచ్చు.

ప్రశ్న 3.
 గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
 జవాబు.
 గురువుగారు విద్యార్థులకు అర్థం అయ్యేలా సందేహాలు తీర్చుచూ ఉండవచ్చు.
ప్రశ్న 4.
 మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
 జవాబు.
- కలసి ఉంటే కలదు సుఖం.
- నిజాన్ని మాట్లాడండి.
- ధర్మాన్ని ఆచరించండి.
- తల్లిదండ్రులను మించిన దేవతలు లేరు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)
ప్రశ్న 1.
 ఈ వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్దమైంది?
 జవాబు.
 వంశం అంటే తన కుటుంబం. దానికి కీర్తి తేవడం అంటే తనకు తాను ఏదేని సాధించాలనే పట్టుదల ఉండాలి. చిన్నతనం నుండే తన ఆలోచనలు, ఆశయాలు, సాధించదలచిన వాటిని నిర్ణయించుకొని పట్టుదలతో కృషి చేస్తే కీర్తి తేవడానికి తనే కారణం కాగలడు అని అర్థమైంది.
ప్రశ్న 2.
 చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది?
 జవాబు.
 చెడు అలవాట్లకు లొంగిపోతే అన్నీ పోగొట్టుకుంటాము. దేనినీ సాధించలేము. పరువు పోతుంది. గౌరవము ఉండదు. ఎవరూ ఆదరించరు. అందరికీ దూరంగా ఒంటరిగా సంపదలు పోయి, బికారిగా జీవించాల్సి వస్తుంది.
ప్రశ్న 3.
 ‘భిక్షుకులకు శత్రువు లోభి’ అన్న కవి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు?
 జవాబు.
 నేను యాచకులకు పిసినారి శత్రువు అనే అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. ఇతరులు పెట్టినా చూసి ఓర్వలేడు. దాత వద్దకు పోయి తన సొమ్ము పోయినట్లు చాడీలు చెబుతాడు. దాత దానం చేయకపోతే తాను ఆనందిస్తాడు. ఇతరులకు మేలు కల్గితే బాధపడతాడు.
ప్రశ్న 4.
 ఈ చాడీలు చెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
 జవాబు.
 చాడీలు చెప్పడం అంటే ఇతరులు చేసేపనులను గూర్చి వేరే వాని వద్ద అనవసరపు మాటలు మాట్లాడుట. చాడీలు చెప్పేవానికి విలువ ఉండదు. అతని మాటలను ఎవరూ నమ్మరు. ఉపయోగం లేని మాటలు మాటలాడుట మంచి అలవాటుకాదు.

ప్రశ్న5.
 ఏయే గుణాలు అలవరచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది?
 జవాబు.
 మన మనసును ఎపుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. ఇతరులకు మంచి జరగాలని కోరుకోవాలి. మోసపు ఆలోచనలు విడచిపెట్టాలి. మంచివారితో స్నేహం చెయ్యాలి! అప్పుడే మనలోని కపటం తొలగిపోతుంది.
ప్రశ్న 6.
 ఆ సజ్జనుని లక్షణాలు ఏమిటి?
 జవాబు.
 సజ్జనుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాడు. ఇతరులలోని మంచిని తానూ ఆచరిస్తాడు. తనకు ఎవరైనా ఆపద చేయదలపెట్టినా వారికి మంచే జరగాలని కోరుకుంటాడు. ఏనుగు వెనుక కుక్కలు ఎంత మొరిగినా వెనుతిరిగి తరమదు. సజ్జనుడు తననెవరైనా గేలి చేసినా వాదములు ఆడడు.
ప్రశ్న 7.
 ఈ గేలి చేయడమంటే మీకేమర్దమైంది?
 జవాబు.
 గేలి చేయడమంటే ఎగతాళి చేయడం. అవమానించడం. మంచితనం గల వ్యక్తి ఎదురుగా గాని, మరొకచోటగాని, వెనుక కాని, అతనిని ఎక్కిరించేటట్లు పిచ్చి మాటలు, పనులు చేయుట ద్వారా అతనికి బాధ కలిగించడం అని అర్థమైంది. ధనము, దమ్ము ఇట్లా ఏయే
ప్రశ్న 8.
 గుణాలు కలిగి ఉంటే దానవులౌతారు?
 జవాబు.
 ధనము, దమ్ము, అధికారము, పొగరుతనము, కారణంలేని కోపము, వినయం లేకపోవుట మొదలగు గుణాలు ఉంటే దానవులు (రాక్షసులు) ఔతారు.
ప్రశ్న 9.
 జన ‘విజ్ఞానము విశ్వశాంతికొరకు’ దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి?
 జవాబు.
 ప్రపంచంలో ఎన్ని కొత్త వస్తువులు కనుక్కొన్నా వాటిని ప్రజల శాంతి కొరకు ఉపయోగించాలి. మానవ జీవనానికి హాని కల్గించే వాటిని దుర్వినియోగపరిస్తే అవి మానవ వినాశనానికి దారిలొస్తాయి. ఏ వస్తువునైనా ఉపయోగించే మనిషి మనసుపైన ‘విజ్ఞానము విశ్వశాంతి కొరకు’ అనేది ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 10.
 జన ‘జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న’ అని కవి ఎందుకన్నాడు?
 జవాబు.
 ప్రతి జీవికి తల్లి, జన్మభూమి చాలా విలువైనవి. అవి లేనిదే వారి జీవనము వృద్ధి కాబట్టి తల్లిని, జన్మభూమిని గౌరవించలేనివాడు ఎవరినీ గౌరవించలేడు. వారిని గౌరవించగలిగితే అందరినీ గౌరవించ గలుగుతాడు.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. పాఠ్యాంశంలోని పద్యాలలో ఏయే మంచి అలవాట్ల గురించి కవులు చెప్పారు? వాటిని అలవరచుకోవాలంటే మనం ఏం చేయాలి?
 జవాబు.
- కష్టాన్ని ఓర్చుకొనగలవాడే దేనినైనా సాధిస్తాడు.
- అరిషడ్వర్గాలను (కామము, కోపము, లోభము, మదము, మోహము, మాత్సర్యాలు) జయించిన వాడే దేనినైనా సాధిస్తాడు.
- పిసినారి తాను దానం చేయక, దాతను దానం చేయకుండా చేస్తాడు. లోభిని దూరంగా ఉంచాలి.
- తనను ఎవరేమన్నా, గేలి చేసినా సజ్జనుడు పట్టించుకోడు.
- మోసం చేసేవాడికి అందరూ మోసగాళ్ళలాగానే కనబడతారు. పై మంచి అలవాట్లు రావాలంటే ఓపికగా సాధన చేయాలి.
శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి.
- శతకం అనగా నూరు పద్యాలు కలది. చివరి పాదంలో మకుటం ఉంటుంది.
- శతకాల వలన అనేక నీతులు తెలుస్తాయి.
- మంచి భాష, పదజాలము, ధారణ అలవాటు అవుతుంది.
- శతకాలు నేర్వడం వలన మనలో ఆత్మనిగ్రహం, మంచితనం అలవడుతుంది.
- తర్వాత తరాల వారికి మంచి సంస్కృతి సంప్రదాయాలు అందించవచ్చు.
III. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం 
1. కింద ఇచ్చిన పద్యం చదవండి. అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
 సజ్జనుండు బల్కుఁ జల్లగాను
 కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
 విశ్వదాభిరామ వినురవేమ!
(అ) సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది?
 జవాబు.
 సజ్జనుని మాట చల్లగా ఉంటుంది.
(ఆ) ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది?
 జవాబు.
 కంచు మోగితే ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
(ఇ) అల్పుడు మాట్లాడుతాడు.
 జవాబు.
 అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు.
(ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు.
 అల్పుని స్వభావం.
(ఉ) పై పద్యంలో ఎవరెవరిని వేటితో పోల్చారు?
 జవాబు.
 అల్పుడు – కంచు
 సజ్జనుడు – కనకం (బంగారం)
2. కింది వాకాలను చదవండి. సరైన సమాధానాలు అనుకునేవాటిపై ‘✓’ అనే గుర్తును పెట్టండి.
(అ) నేను పక్షులపై / జంతువులపై దయ …..
 ✓ఎప్పుడూ కలిగి ఉంటాను / అప్పుడప్పుడు కలిగి ఉంటాను / అసలు కలిగి ఉండను.
(ఆ) నేను యాచకులకు భిక్ష …..
 ✓ఎప్పుడూ పెడుతాను / అప్పుడప్పుడు పెడుతాను / అసలు పెట్టను
(ఇ) నాకు మనసులో మోసపు ఆలోచనలు
 ఎప్పుడూ వస్తాయి / అప్పుడప్పుడు వస్తాయి / అసలు రావు ✓
(ఈ) నేను మంచి దృష్టితో
 ✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను
(ఉ) నేను మంచి వారితోనే స్నేహం
 ✓ఎప్పుడూ చేస్తాను / అప్పుడప్పుడుచేస్తాను / అసలు చేయను
(ఊ) నేను ఓర్పుతో
 ✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను
(ఋ) నేను అమ్మను, ఉరును …….
 ✓ఎప్పుడూ గౌరవిస్తాను / అప్పుడప్పుడు గౌరవిస్తాను / అసలు గౌరవించను
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
(అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు?
 జవాబు.
- మంచి వారితో స్నేహం ఎప్పుడూ మంచినే కల్గిస్తుంది.
- గంధం చెట్టు అడవిని గంధపు వాసనతో వ్యాప్తి చేసినట్లు మంచివారు తన మంచితనాన్ని వ్యాప్తి చేస్తారు.
- మంచివారితో స్నేహం వలన ధైర్యము కలుగుతుంది.
- చక్కగా మాట్లాడే నైపుణ్యం వస్తుంది.
- మనలోని బుద్ధిమాంద్యం తొలగుతుంది.
- అన్యాయం, అధర్మం, అసత్యములకు దూరంగా ఉంచుతుంది.
- మనకు మంచి కీర్తి లభిస్తుంది.
- మంచివారి స్నేహం వలన లోకంలో సాధించలేనిది లేదు.
(ఆ) ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి. ఎందుకు?
 జవాబు.
- జననీ, జన్మభూమి స్వర్గం కంటే విలువైనవి.
- తల్లి తన పొట్టలో 9 నెలలు తన శరీరం నుండి అన్ని అవయవాలను తయారుచేసి, మోసి చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె చూపే సహనం, ఓపిక, ప్రేమ ఎవరూ చూపలేరు.
- అందరికంటే తన బిడ్డ అందమైనదిగా భావించి జీవితం చివరి వరకు ప్రేమను ఇచ్చేది తల్లి కాబట్టి చాలా విలువైనది తల్లి.
- పుట్టిన నేల స్వర్గం కంటే చాలా గొప్పది.
- ఎక్కడికెళ్ళినా తన జన్మస్థానంలో ఉన్నన్ని విశేషాలనే ఎప్పుడూ గొప్పగా చెప్పాలి! అందుకే స్వర్గంతో సమానం.

(ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు?
 జవాబు.
- ధనం బాగా ఉంటే చాలా మంచిపనులు చేయవచ్చు.
- పేదవారికి ప్రతినిత్యము అన్నదానము చేయవచ్చు.
- పేదవారికి ఇళ్ళు వాకిళ్ళు నిర్మించి ఇవ్వవచ్చు.
- సమాజంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
- పాఠశాలలను నెలకొల్పి అందరికి చదువు చెప్పించవచ్చు.
- సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడే అనేక మంచి కార్యాలు చేయవచ్చు.
- నీటివసతి, రవాణా వసతులను కల్పించవచ్చు.
- వైద్యం చేయించుకోలేని వారికి వైద్యశాలలు నెలకొల్పవచ్చు.
- మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును.
(ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు?
 జవాబు.
- లోభి (పిసినారి) తాను సంపాదించిన దానిని తాను అనుభవించడు, ఎవరినీ అనుభవించనివ్వడు. అందుకనే సంతోషంగా ఉండలేడు.
- లోభికి ఎప్పుడూ దానగుణము లేకపోవడం వలన ఆ దాచిన ధనము తేనెటీగ తాను పెట్టిన తేనె వలె చివరకు ఇతరుల పాలగును.
- దాత దానము చేసినా తన సొమ్ము పోయినట్లుగా బాధపడతాడే కాని సంతోష పడడు.
- లోభి ఇతరులకు మేలు జరిగితే దుఃఖ పడతాడు.
- లోభికి ఎప్పుడూ విచారమే ఎందుకనగా ఎవరూ అతని పిసినారితనాన్ని ఇష్టపడరు.
- లోభి ఎంతకూడబెట్టినా సంతృప్తి లేకపోవడం వలన, ఇంకా కూడబెట్టాలనే కోరికతో ఎప్పుడూ దిగులుపడుతూ విచారంగా ఉంటాడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. పాఠంలోని శతకపద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి?
 జవాబు.
(అ) నిజమైన వ్యక్తి :
 1. మనము దానగుణము కలిగి ఉండాలి.
 2. కష్టాలను ఓర్చుకొనే గుణాన్ని అలవరచుకోవాలి.
 3. ధైర్యంతో ముందుకు వెళితేనే దేనినైనా సాధించగలం.
(ఆ) స్థిరమైన బుద్ధి :
 1. ఏనుగు, చేప, పాము, జింక, తుమ్మెదలు తమ బలహీనత వలన ఇతరులకు దొరికి పోతున్నాయి.
 2.మానవుడు తనలోని ఆరు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల) జయించినపుడే దేవతగా గౌరవించబడతాడు.
(ఇ) దాత :
 1. లోభి తాను తన సొమ్ము దానం చేయడు.
 2. దాత తన సొమ్ము దానం చేస్తున్నా చెయ్యనివ్వడు.
 3. అట్టి పిసినారిని మనం దూరంగా ఉంచాలి.
(ఈ) సజ్జన స్వభావం :
 1. మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి.
 2. మంచి పవర్తన అందాన్నిస్తుంది.
 3. గౌరవాన్ని కలిగిస్తుంది.
 4. కీర్తి పెంపొందింపచేస్తుంది.
(ఉ) స్నేహశీలత :
 1. మంచివారి స్నేహం చెయ్యాలి.
 2. మంచి స్నేహం మానవతను పెంచుతుంది.
 3. అనేక మంచి గుణాలను కలిగిస్తుంది.
IV. సృజనాత్మకత/ప్రశంస
1 పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారుచేయండి. రాయండి. ప్రదర్శించండి.
 జవాబు.
- ఆకలి రుచి ఎరుగదు.
- విసుగు లేకుండా ఇచ్చేవాడే దాత.
- కష్టాలను ఓర్చుకొన్నవాడే మనిషి.
- ధైర్యసాహసాలు కలవాడే వీరుడు.
- మనస్సును అదుపు చేయగలిగేవాడే గొప్పవాడు.
- కష్టపెట్టువాడు కలకాలం ఉండడు.
- మంచి వారితో స్నేహం చేయాలి.
2. శతకసుధ అనే పాఠం ద్వారా నీవు గ్రహించిన నీతిని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయి.
 జవాబు.
కరీంనగర్,
 తేది : XXXX
ప్రియమైన మిత్రునికి అభినందనలు.
నేనిక్కడ కుశలం. అక్కడి నీ కుశలములు తెలుపుము. మాకు ఈ నెలలో మా తెలుగు మాష్టారుగారు ‘శతకసుధ’ అనే నీతిపద్యాల పాఠాన్ని బోధించారు. అవి నేను ఈ లేఖలో కొన్ని తెలుపుతాను. శతక పద్యాలు చదవడానికి ఎంతో వీలుగా నీతులతో కూడి ఉన్నాయి. రాగవంతంగా పాడాము. ఉన్నదానిలో ఎంతో కొంత దానం చెయ్యాలి. మనలో ఉన్న పిసినారితనం, కోపం, మోహం వంటి చెడ్డ గుణాలను వదలి వెయ్యాలి. లోభి మాటలను వినకుండా మనం ఇతరకులకు దానం చెయ్యాలి. ఇతరులు నిన్ను గేలి చేసినా వాదమునకు దిగవద్దు. పేదవారిని అనవసరంగా బాధలకు గురిచేయవద్దు. నీవుగూడ ఇటువంటి మంచి విషయాలు నేర్చుకొన్న వాటిని నాకు తెలియచెయ్యి! ఉంటాను.
నీ మిత్రుడు
 కె. రమేష్,
 7వతరగతి, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
 కరీంనగర్.
చిరునామా :
 సురేష్,
 7వ తరగతి,
 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
 ఖమ్మం.
V. పదజాల వినియోగం:
1. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి.
| మకుటాలు | (3) | 1. అపహాస్యం | 
| (అ) నరుడు | (1) | 2. మోసం | 
| (ఆ) గేలి | (5) | 3. మానవుడు | 
| (ఇ) జిహ్వ | (2) | 4. భూమి | 
| (ఈ) కపటము | (4) | 5. నాలుక | 
| (ఉ) ధరిత్రి | (3) | 1. అపహాస్యం | 
 2. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.
(అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. జవాబు. భూమి, నేల, అవని
(ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు? సువాసనలు సంతోషాన్నిస్తాయి.
 జవాబు.
 తావి, పరిమళం, సువాసన

3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.
(అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
 జవాబు.
 శ్రీ : సాలెపురుగు, సంపద
(ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసికొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
 జవాబు.
 ధనము : విత్తము, సంపద
4. కింది పేరాను చదవండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.
(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)
సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో ……….. (1) పెట్టేది. ….(2) చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు. ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది.
ఉపాధ్యాయిని ………………….. (3) తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు ………………… (4) కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ………….. (5) ను ప్రశంసించారు.
 జవాబులు :
 సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.
ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పు ను ప్రశంసించారు.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది వాక్యాల్లో భాషాభాగాలను గుర్తించండి. పట్టికలో రాయండి.
(అ) మామిడిపండు తియ్యగా ఉంది.
 (ఆ) అయ్యో! రమ చదువు ఆగిపోయిందా?
 (ఇ) పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు.
 (ఈ) ఆమె మహాసాధ్వి.
 (ఉ) కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.
 (ఊ) అరుణ భానుడు తూర్పున ఉదయిస్తాడు.
 (ఋ) రాముడు మంచిబాలుడు.
| నామవాచకం | సర్వనామం | విశేషణం | (కియ | అవ్యయం | 
| మామిడిపండు |  | తియ్యగా | ఉంది |  | 
| (ఆ) రమ, చదువు |  |  | ఆగిపోయిందా? | అయ్యో ! | 
| (ఇ) పిల్లలు, శతకపద్యాలు |  |  | చదువుతున్నరరు. |  | 
| (ఈ) | ఆమె | మహాసాధ్వి |  |  | 
| (ఉ) కాంచీపురం దేవాలయాలు |  | అనేక | ఉన్నయి |  | 
| (ఊ) అరుణభానుడు |  | తూర్పున | ఉదయిస్తాడు |  | 
| (ఋ) రాముడు బాలుడు |  | మంచి |  |  | 
కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.
నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ + ఇ) = ఇ (డి)
 వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ + ఇ) = ఇ (రి)
 పై మొదటిపదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వస్వరం) ‘ఉ’, రెండవ పదం (ఇక్కడ)లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ’ ‘ఉ’కారానికి ‘ఇ’ కారం కలిపినప్పుడు ‘ఇ’ కారమే నిలబడుతుంది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటాం.
పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి.
 (ఏకాదేశమంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం.)
కింది పదాలను కలిపి రాయండి.
(అ) దానము + ఒసంగి =
 (ఆ) కవితలు + అల్లిన =
 (ఇ) విఘ్నంబు + ఐన =
 (ఈ) కపటము + ఉండు =
 (ఉ) బదులు + ఆడునె =
 జవాబు:
 (అ) దానము + ఒసంగి = దానమొసంగి
 (ఆ) కవితలు + అల్లిన = కవితలల్లిన
 (ఇ) విఘ్నంబు + ఐన = విఘ్నంబైన
 (ఈ) కపటము + ఉండు = కపటముండు
 (ఉ) బదులు + ఆడునె = బదులాడునె
ప్రాజెక్టు పని:
పాఠశాల గ్రంథాలయం నుండి వివిధ శతకాలను సేకరించి, పరిశీలించి అంశాలవారీగా కింది పట్టికలో రాయండి. ప్రదర్శించండి.
 జవాబు.
| శతకం | మకుటం | కవిపేరు | 
| దాశరథీ శతకం | దాశరథీ!కరుణాపయోనిధీ! | కంచెర్ల గోపన్న | 
| సుమతీ | సుమతీ! | బద్దెన | 
| భాస్కర | భాస్కరా! | మారద వెంకయ్య | 
| శ్రీకాళహస్తీశ్వర | శ్రీకాళహస్తీశ్వరా! | ధూర్జటి | 
| నారాయణ | నారాయణా! | బమ్మెరపోతన | 
| సర్వేశ్వర | సర్వేశ్వరా! | యథావాక్కుల అన్నమయ్య | 
 విశేషాంశాలు:
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అని శ్రీరాముడు చెప్పాడు అని ప్రతీతి. కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని భావం.
TS 7th Class Telugu 3rd Lesson Important Questions శతక సుధ
క్రింది శతకాలసు రచయితలతో జతపరచండి.
| శతకాలు | (ఊ) | (అ) వేమన | 
| 1. దాశరథి | (ఋ) | (ఆ) ఆడెపు చంద్రమౌళి | 
| 2. సుమతి | (అ) | (ఇ) ధూపాటి సంపత్కుమారాచార్య | 
| 3. వేమన | (ఉ) | (ఈ) రావికంటి రామయ్య గుప్త | 
| 4. నరసింహ | (ఇ) | (ఉ) కాకుత్థ్సం శేషప్ప కవి | 
| 5. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ | (ఈ) | (ఊ) కంచెర్ల గోపన్న (రామదాసు) | 
| 6. నగ్న సత్యాలు | (ఆ) | (ఋ) బద్దెన | 
| 7. శ్రీ శ్రీనిహాస దామ్మల | (ఊ) | (అ) వేమన | 
 క్రింది మకుటాలను శతకాలతో జతపరచండి.
| మకుటాలు | (ౠ) | శతకాలు | 
| 1. సుమతీ! | (ఈ) | (అ) దాశరథీ శతకం | 
| 2. యాదగిరి వాస! నృసింహ! రమావిభో ప్రభో! | (ఉ) | (ఆ) నరసింహ శతకం | 
| 3. చిద్విలాస భాస! శ్రీనివాస! | (ఊ) | (ఇ) నృకేసరి శతకం | 
| 4. కల్లగాదు రావికంటి మాట! | (ఋ) | (ఈ) శ్రీయాదగిరి లక్ష్మీనృససంహ శతకం | 
| 5. వేమా! / విశ్వదాభిరామ వినురవేమ! | (ఇ) | (ఉ) శ్రీశ్రీనివాస దొమ్మల శతకం | 
| 6. ధర్మపురీ నృకేసరీ! | (ఆ) | (ఊ) రావికంటి శతకం | 
| 7. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహర! నరసింహ దురితదూర! | (అ) | (ఋ) వేమన శతకం | 
| 8. దాశరథీ కరుణా పయోనిధీ! | (ౠ) | (ఋూ) సుమతీ శతకం | 
(ఉ) మోసగాని స్వభావం ఎట్టిది?
 జవాబు.
- మోసగాడు ఎప్పుడూ ఇతరులను ఎలా మోసం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు.
- మోసగాడు అన్ని సందర్భాలలో గెలవలేడు.
- ఏదో ఒక రోజు అతని మోసం బయటపడుతుంది.
- సమాజంలో మోసగాడు మాటలద్వారా, పనుల ద్వారా ఆలోచనల ద్వారా మోసం చేస్తాడు.
- ప్రతి ఒక్కరూ మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
(ఊ) ఎందుకు దానం చెయ్యాలి?
 జవాబు.
- ప్రతి వ్యక్తి ధనం సంపాదించాలి. దానం చెయ్యాలి.
- దానం చేస్తే ఇతరులకు మేలు కలుగుతుంది.
- సంపాదించినది అనుభవిస్తే ఆనందం కలుగుతుంది.
- తను సంపాదించిన దానిని దానం చెయ్యడం వలన సార్థకత చేకూరుతుంది.
- దానం ఒక పరిమితికి లోబడి చెయ్యడం వలన ఆత్మ తృప్తి కలుగుతుంది.

1. జీవితం ఆదర్శంగా ఉండాలంటే మనము ఏమి చేయాలి?
 జవాబు.
 1. జీవితము :
 (అ) ప్రతివ్యక్తి పుట్టుకతో కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉంటాడు.
 (ఆ) తల్లిదండ్రులనుండి, ఇతరుల నుండి గమనించడం ద్వారా తెలుసుకుంటాడు.
 (ఇ) అతనిపై అనేకమంది వ్యక్తుల, సమాజ ప్రభావం ఉంటుంది.
2. ఆదర్శము :
 (ఈ) పెరుగుతున్న కొద్దీ అనుకరించడం ద్వారా ఇతర లక్షణాలను అలవరచుకొంటాడు.
 (ఎ) మంచి, చెడుల విచక్షణ గూర్చి ఆలోచిస్తాడు.
 (ఏ) ఏ ప్రభావం ఎక్కువగా ఉంటే అటువైపు మరలుతాడు.
3. ఆదర్శవంతమైన ప్రవర్తన :
 (ఐ) ఆదర్శవంతమైన ప్రవర్తనకై మనం ఎల్లప్పుడూ మంచివైపు పయనించాలి.
 (ఒ) గొప్పవ్యక్తుల జీవితాలలోని విషయాలను మనమీద ప్రభావితం అయ్యేటట్లు చూసుకోవాలి.
 (ఓ) ప్రతి సందర్భంలో ఆత్మవిశ్వాసంతో, నిగ్రహంతో వ్యవహరిస్తేనే ఆదర్శవంతంగా తయారుకాగలము.
2. నీతి పద్యాలను ఎందుకు చదవాలి?
 జవాబు.
- నీతి పద్యాలలో జీవితానికి ఉపయోగపడే నీతివాక్యాలు ఉంటాయి.
- మన మనసుకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి.
- మంచి భాష, జాతీయాలు, లోకోక్తులు తెలుసుకుంటాము.
- తియ్యనైన తెలుగుభాష పద్యాల ద్వారా అభ్యాసం కాగలదు.
- మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- నీలోని నీతి నిన్నెపుడూ కాపాడుతుంది.
- ఇతరులకు మంచి సందేశాలను ఇవ్వగల్గుతాము.
- ప్రాచీన కవుల రచనాశైలి, పద్ధతులు తెలుస్తాయి.
3. పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు తెలుసుకొన్న ‘నినాదాలు’ రాయండి. (అదనపు ప్రశ్న)
 జవాబు.
- ఓర్పు, శాంతం మానవునికి ఆభరణాలు.
- పదుగు రాడు మాట పాడియై ధరచెల్లు.
- కలిమి లేములు కావడి కుండలు.
- లోభుల సంపద లోకుల పాలు.
- మోసం చేసేవాణ్ణి ఎవరూ నమ్మరు.
- పేదవారిని బాధపెట్టేవారు కలకాలం ఉండరు.
- సాధుసంగమంబు సకలార్ధ సాధనంబు.
- జననీ జన్మభూమి స్వర్గం కంటె మిన్న.
- సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి.
- రాజు స్వదేశంలోను, పండితుడు అంతటా గౌరవించబడతాడు.
- అన్ని దానముల కంటే విద్యాదానం గొప్పది.
- విద్యవలన వినయం, ధనం, సుఖం అన్నీ లభిస్తాయి.
- విద్యలేనివాడు వింత పశువు.
- శ్రమయేవ జయతే!
పర్యాయపదాలు: 
- జనని = అమ్మ, తల్లి, మాత
- దాత = త్యాగి, వితరణశీలి, ఉదారుడు
- ఏనుగు = కరి, హస్తి, ఇభము, గజము
- ధరిత్రి = భూమి, నేల, అవని, వసుధ
- దాశరథి = శ్రీరాముడు, జానకీ వల్లభుడు, రఘునందనుడు
- సూక్తి = మంచిమాట, సుభాషితము
- నరుడు = మానవుడు, మనుజుడు
- మది = మనసు, అంతరంగము
- దానవుడు = రాక్షసుడు, అసురుడు
- నవ్యము = నూతనము, కొత్తది
నానార్థాలు:
- ధర = భూమి, వెల
- కేసరి = సింహం, గుర్రము, (శేష్ఠుడు
- ధనం = విత్తం, ఆస్తి, ఆవులమంద, ధనియం, ధనిష్రా నక్షత్రం
- పాదము = కాలి అడుగు భాగం, కిరణం, పాతిక భాగం
- శ్రీ = సాలెపురుగు, బుద్దిబలం, సరస్వతి, లక్ష్మి
- ఫలము = ఫలితము, పండు
- తగవు = జగడం, పద్ధతి, మేలు, న్యాయం
- తెంపు = తెంచుట, ధైర్లము
- విభవము = సంపద, గొప్పతనము
- కాంచు = చూచు, సంపద పొందుట

ప్రకృతి – వికృతి:
- శ్రీ – సిరి
- సింహం – సింగం
- ధర్మం – దమ్మం
- సత్యం – సత్తెం
- దిశ – దెస
- సంతోషం – సంతసం
- విజ్ఞానం – విస్నాణం
- భూమి – భువి
- వంశం – వంగడం
- వర్ణము – వన్నె
- నిజం – నిక్కం
పాఠంలో వచ్చిన సంధులు:
| సోకోర్చు | సోకు + ఓర్చు | ఉత్వసంధి | 
| మానవుడున్న | మానవుడు + ఉన్న | ఉత్వసంధి | 
| భిక్షమర్థికి | భిక్షము + అర్థికి | ఉత్వసంధి | 
| చెప్పుచుండు | చెప్పుచు + ఉండు | ఉత్వసంధి | 
| శత్రువని | శత్రువు + అని | ఉత్వసంధి | 
| తనకెవ్వడు | తనకు + ఎవ్వడు | ఉత్వసంధి | 
| సూక్తి | సు + ఉక్తి | సవర్ణదీర్ఘ సంధి | 
| నీవనిశము | నీవు + అనిశము | ఉత్వసంధి | 
| ఘనములన్న | ఘనములు + అన్న | ఉత్వసంధి | 
| కపటముండు | కపటము + ఉండు | ఉత్వసంధి | 
| విద్యార్థి | విద్య + అర్థి | సవర్ణదీర్ఘ సంధి | 
| ముక్తావళి | ముక్త + ఆవళి | సవర్ణదీర్ఘ సంధి | 
| గీతామృతం | గీత + అమృతం | సవర్ణదీర్ఘ సంధి | 
| మరింకెందుకు | మరింక + ఎందుకు | అకార సంధి | 
 విగ్రహా వాక్యాలు / సమాసాలు:
ఐదు సాధనములు – ఐదు అను సంఖ్యగల సాధనములు = ద్విగు సమాసము
 తల్లిదండడులు – తల్లి మరియు తండ్రి = ద్విగు సమాసము
1. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి.
1. సోకోర్చు వాడె మనుజుడు
 ఆకొన్న కూడె యమృతము
 తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ
 తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
 జవాబు:
 ఆకొన్న కూడె యమృతము
 తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
 సోకోర్చు వాడె మనుజుడు
 తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ
2. కష్టపెట్టువారు కల కాల ముందురా
 పేదవాడు పడెడుబాధ గనుక
 కల్ల గాదు రావి కంటి మాట
 ధనము దమ్ముచేత దానవుండై పోయి
 జవాబు:
 ధనము దమ్ముచేత దానవుండై పోయి
 పేదవాడు పడెడుబాధ గనుక
 కష్టపెట్టువారు కల కాల ముందురా
 కల్ల గాదు రావి కంటి మాట
3. చిద్విలాస భాస శ్రీనివాస
 కమలనయన నిన్ను గాంచనిమ్ము
 సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
 విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
 జవాబు:
 సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
 కమలనయన నిన్ను గాంచనిమ్ము
 విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
 చిద్విలాస భాస శ్రీనివాస
II. క్రింది అపరిచిత పద్యాలు చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు తగిన విధంగా ఒక వాక్యంలో జవాబు వ్రాయండి.
4. ఆత్మశుద్ధిలేని ఆచార మదియేల?
 భాండ శుద్ధిలేని పాకమేల
 చిత్త శుద్ధిలేని శివపూజలేలరా?
 విశ్వదాభిరామ వినురవేమ!
 ప్రశ్నలు :
 (అ) పాకమునకు దేని శుద్ధి అవసరం?
 జవాబు:
 పాకమునకు భాండశుద్ధి అవసరం
(ఆ) చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయరాదు?
 జవాబు:
 చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేయరాదు.
(ఇ) ఈ పద్య సారాంశం ఏమిటి?
 జవాబు:
 ఏ పని చేసినా స్వచ్ఛత అవసరమని ఈ పద్య సారాంశం.
(ఈ) ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు?.
 జవాబు:
 ఈ పద్యాన్ని వ్రాసిన కవి వేమన.
(ఉ) ఈ పద్యానికి మకుటం ఏది?
 జవాబు:
 ఈ పద్యానికి మకుటం ‘విశ్వదాభిరామ వినురవేమ.

5. తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
 తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
 తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
 చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
 ప్రశ్నలు :
 (అ) ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చు?
 జవాబు:
 (ప్రయత్నించిన ఇసుక నుండి నూనెను తీయవచ్చు.
(ఆ) ప్రయత్నిస్తే దేనినుండి నీరు త్రాగవచ్చును?
 జవాబు:
 (వరంత్నిస్తే ఎడారిలోని ఒయాసిస్స నీరు తతరావచ్చును.
(ఇ) ఎక్కడైనా తిరిగి సాధించ గలిగేది ఏమిటి?
 జవాబు:
 ఎక్కడైనా తిరిగి సాధించగలిగేది కుందేటి కొమ్ము.
(ఈ) ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము ?
 జవాబు:
 ఎంత (ప్రయత్నించినా మూర్ఖల వునసును మార్చలేము.
(ఉ) మృగతృష్ణ అనగా ఏమి?
 జవాబు:
 మృగతృష్ణ అనగా ఎడారిలోని ఒయాసిస్సు.
III. పదజాలం
1. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వేరుగా వ్రాయండి.
(అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమంతా వెళ్తాము.
 జవాబు:
 దేవాలయం, కోవెల, గుడి
(ఆ) దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించారు. దానవులకు అమృతం దక్కలేదు. అసురులకు విచారమే మిగిలినది.
 జవాబు:
 రాక్షసులు, దానవులు, అసురులు
(ఇ) దశరథ మహారాజు కుమారుడు దాశరథి. శ్రీరాముడు రాజ్యాన్ని, ప్రజలను చక్కగా పాలించాడు. రఘునందనుని కీర్తి అంతటా వ్యాపించినది.
 జవాబు:
 దాశరథి, శ్రీరాముడు, రఘునందనుడు
(ఈ) ఈ ధరిత్రిలో అనేక జీవరాశులున్నాయి. భూమి అన్ని ఖనిజాలకు మూలము. వసుధ అన్ని ప్రాణులను తనలో ఇముడ్చుకొనును.
 జవాబు:
 ధరిత్రి, భూమి, వసుధ
(ఉ) అన్ని జంతువులలోను గజము పెద్దది. కరి తొండము పొడవుగా ఉండును. అడవులలో ఏనుగుల చేత బరువులు మోయిస్తారు.
 జవాబు:
 గజము, కరి, ఏనుగు
2. క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.
(అ) ఎప్పుడూ సత్యమునే మాట్లాడాలి! సత్తెమునకు మంచి శక్తి కలదు.
 జవాబు:
 సత్వ్యము (ప్ర) – సత్తెము (వి)
(ఆ) ఇంద్రధనస్సులో అనేక వర్ణాలున్నాయి. వాటి వన్నెలు ఏడు.
 జవాబు:
 వర్ణము (ప్ర) – వన్నెలు (వి)
(ఇ) తూర్పుదిశలో సూర్యుడు ఉదయించును. పడమటి దెసలో అస్తమించును.
 జవాబు:
 దిశ (ప్ర) – దెస(వి)
(ఈ) అందరూ సంతోషంగా జీవించాలి. ప్రతివారు సంతసం గా ఉన్నపుడే అందరికీ ఆనందము.
 జవాబు:
 సంతోషంగా (ప్ర) – సంతసం (వి)
(ఉ) నిజము నిలకడ మీద తెలియును. నీరు పల్లమెరుగు నిక్కము దేవుడెరుగు.
 జవాబు:
 నిజము (ప్ర) – నిక్కము (వి)
3. క్రింది వాక్యాలలోని విభక్తులను గుర్తించి వేరుగా వ్రాయండి.
(అ) రాముని యొక్క బాణము గురి తప్పదు.
 (ఆ) ప్రజలకు దొంగల వలన భయం కలదు.
 (ఇ) నేను నీకొరకు ఏ పనినైనా చేస్తాను.
 (ఈ) అందరి యందు దేవుడున్నాడు.
 (ఉ) ఇష్టం లేని వారి చేత ఏ పనీ చేయించలేము.
 జవాబు:
 యొక్క – షష్డీ విభక్తి
 వలన – పంచమీ విభక్తి
 కొరకు – చతుర్థీ విభక్తి
 అందు – సప్తమీ విభక్తి
 చేత – తృతీయా విభక్తి
IV. వ్యాకరణాంశాలు :
1. క్రింది వాక్యాలలోని గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
(అ) పద్యం రసానుభూతి కలిగిస్తుంది.
 (ఆ) మరింకెందుకు? ఆలస్యం చేయకండి!
 (ఇ) సోకోర్చువాడె మనుజుడు
 (ఈ) లోభి మానవుడు భిక్షమర్థికి చేత పెట్టలేడు.
 (ఉ) మానవులందు అన్ని రకాల వారున్నారు.
 జవాబు:
(అ) రస + అనుభూతి = సవర్ణదీర్ఘ సంధి
 (ఆ) మరింక+ఎందుకు = అకార సంధి
 (ఇ) సోకు+ఓర్చువాడె = ఉకార సంధి
 (ఈ)భిక్షము+అర్థికి = ఉకార సంధి
 (ఉ) మానవులు+అందు= ఉకార సంధి
2. క్రింది వాక్యాలలోని సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు వ్రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి.
(అ) అన్నదమ్ములంతా కలసి మెలసి ఉండాలి.
 జవాబు:
 అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు – ద్వంద్వ సమాసం
(ఆ) నేను రెండు పుస్తకాలు చదివాను.
 జవాబు:
 రెండు పుస్తకాలు – రెండు అను సంఖ్య గల పుస్తకాలు = ద్విగు సమాసం
(ఇ) సీతారాములు అందరికీ ఆదర్శమూర్తులు.
 జవాబు:
 సీతారాములు – సీత మరియు రాముడు = ద్వంద్వ సమాసం
(ఈ) రావణునికి పది తలలున్నాయి.
 జవాబు:
 పదితలలు – పది అను సంఖ్య గల తలలు = ద్విగు సమాసం
(ఉ) వేసవిలో కూరగాయల ధరలెక్కువ.
 జవాబు:
 కూరగాయలు – కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
ఆఁకొన్న కూడె యమృతము
 తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
 సోఁకోర్చువాఁడె మనుజుఁడు
 తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ!
ప్రతిపదార్థం
సుమతీ! = ఓ మంచి బుద్ధి కలవాడా!
 ఆఁకొన్న=  బాగా ఆకలిగా ఉన్నప్పుడు
 కూడె = తిన్న అన్నమే (ఆహారమే)
 అమృతము = అమ్తృ వలే తియ్లగా ఉండును
 ధరిత్రిన్ = భూమిపై
 తాన్ = తాను
 కొందగన్ = విసుగుచెందకుండా
 ఇచ్చువాడు + ఎ = దానం చేసేవాడే
 దాత = నిజమైన దానగుణం కలవాడు
 సోకు = కష్టాన్ని
 ఓర్చువాడు + ఎ = తట్టుకొనేవాడే
 మనుజుడు = మానవుడు
 తేకువ = సాహసం
 కలవాడు + ఎ = ఉన్నవాడే
 వంశ = తన వంశానికి
 తిలకుడు = కీర్తి తెస్తాడు.
తాత్పర్యం : ఓ మంచి బుద్ధిగలవాడా! బాగా ఆకలి వేసినపుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. విసుగులేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి. ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.
2. ఉ. వనకరి చిక్కెమైనసకు, వాచవికిం జెడిపోయె మీను,తా
 వినికికిఁ జిక్కెఁజిల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
 మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
 ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!
ప్రతిపదార్థం
కరుణాపయోనిధీ! = దయకు సముద్రం వంటివాడా!
 దాశరథీ = దశరథుని కుమారుడా! శ్రీరామా!
 వనకరి = అడవి ఏనుగు
 మైనసకున్ = శరీరపు దురదకు
 చిక్కై్ = ఆపదలో పడింది పట్టువడింది
 వాచవికిన్-వాయి చవికిన్ = నోటి రుచికి
 మీను = చేప
 చెడిపోయెన్ = గాలానికి చిక్కి నశించి పోయింది
 చిల్వ = పాము
 తాన్ = తాను
 వినికికిన్ = వినడానికి (నాదస్వరం మీది మోజుతో)
 చిక్కెన్ = దొరికిపోయింది
 లేళ్ళు = జింకలు
 కనువేదురున్ = కంటి పిచ్చితో
 చెందెను = సమీపించాయి
 తేటి = తుమ్మెద
 తావిన్ = సుగంధాన్ని
 ఓమనికిన్ = పొందడానికి
 నశించెన్ = చెడిపోయింది.
 ఇరుమూడు+ని = ఐదింటిని
 గెల్వన్ = జయించడం
 తరము+ఆ = సాధ్యమా
 ఐదుసాధనములన్ = ఐదు అవయవాలను
 నీవు = నీవు మాత్రమే
 కావన్+తగున్ = రక్షించగలవు
తాత్పర్యం: కరుణా సముద్రుడా! దశరథపుత్రుడా! శ్రీరామా! తన మేని దురదను పోగగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకులోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలౌతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నళిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను, అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నుండి ఎలా బయటపడగలను? (చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని (ప్రసాదించుమని కవిభావన)
3.సీ లోకమందెవడైన లోఖిమానవుడున్న
 ఖిక్షమర్థకిఁ చేతఁబెట్టలేడు
 తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
 యొరులు పెట్టగఁజూని యోర్వలేడు
 దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు
 జిహ్వతోఁజాడీలు చెప్పుచుండు
 ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
 మేలుకల్గినఁజాల మిడుకుచుండు
 ఆ॥వె॥ శ్రీరమానాథ! యిటువంటి క్రూరకును
 భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు
 భూషణ వికాస! శ్రీరర్మపుర నివాస!
 డుష్టసంహార నరసింహ దురితదూర!
ప్రతిపదార్థం
భూషణ = ఆభరణముల చేత
 ఐకాస = పకాశించేవాడా
 శ్రీధర్మపుర = శ్రీధర్మపురం అనే ఊరిలో
 నివాస = సివసించేవాడా!
 దుష్ట = దుర్మార్గులను
 సంహార = చంపేవాడా!
 దురిత = పాపాలను
 దూర = దూరం చేసే వాడా!
 నరసింహం = ఓ నరసింహావతారా!
 లోకమందు = (పపంచంలో
 ఎవడు+ఐన = ఎవరైనా
 లోభి = పిసినారి
 మానవుడు+ఉన్న = మనిషి ఉన్నచో
 అర్థికిన్ = యాచకునికి
 భిక్షము = ధనము లేదా ఆహారము
 చేతన్ = తన చేతితో
 పెట్టలేడు = పెట్టలేడు
 తాను = తను
 పెట్టక+ఉన్న = పెట్టకరోయిన
 తగవు = ఏ ఇబ్బందీ
 పుట్టదు = లేదు
 కాని = కాని
 ఒరులు = ఇతరులు
 పెట్టగన్ = పెట్టుచుండగా
 చూచి = చూస్తూ
 ఓర్వలేడు = ఓర్చుకొనలేడు
 దాత = దానంచేసేవాని
 దగ్గరన్ + చేరి = దగ్గరగావెళ్ళి
 తనముల్లు + ఎ = తన సంపద
 ఒయినట్లు = పోయిన విధంగా
 చాడీలు = అనవసర మాటలు
 చెప్పుచు+ఉండు = చెప్తుంటాడు
 ఫలము = దానం చేయడం
 విఘ్నంబు+ఐన = చెడిపోయిన
 పలు = చాలా
 సంతసమును = సంతోషాన్ని
 అందు = పొందుతాడు
 మేలు = మంచి
 కల్గినన్ = జరిగితే మాత్రము
 మిడుకుచు+ఉండు = దుఃఖపడును
 శ్రీరమానాథ = ఓ విష్ణుమూర్తీ!
 ఇటువంటి = ఇలాంటి
 క్రూరు = దుర్మార్గునికి
 భిక్షుకుల = యాచకులకు
 శత్రువు + అని = వ్యతిరేకి అని
 పేరు = నామము
 పెట్టవచ్చు = పెట్టవచ్చునుకదా!
తాత్పర్యం : ఆభరణాలచే ప్రకాశించేవాడా! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! ఓ నరసింహా! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవలేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లె (సొమ్ము) పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథా! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చుకదా!

*4. ఉ॥ ఏనుగుబోవఁజూచి ధ్వనులెత్తుచుఁగుక్కలు గూయసాగుచో
 దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
 మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయు చో
 ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ!
ప్రతిపదార్థం
ధర్మపురీ = ధర్మపురి అనే ఊరిలోని
 నృకేసరీ = నరసింహా!
 ఏనుగు = గజము
 పోవన్ = వెళ్ళుటను
 చూచి = చూచిన
 కుక్కలు = = శునకములు
 ధ్వనులు = శబ్దములు
 ఎత్తుచున్ = చేయుచూ
 కూయగ = ఎంతమొరిగినా
 దాని = ఆ ఏనుగు
 మనస్సు = మనసు
 కోపపడి = కోపంతో
 దందడి = వెనుదిరిగి
 వానిని = ఆ కుక్కలను
 వెంబడించును+ఏ = వెంటపడునా? (వెనుతిరిగిచూడదు)
 మానవులందు = మనుష్యులలో
 సత్+జనుడు = మంచివాడు తనను
 మత్తులు = కొందరు మూర్ఖులు
 గేలిచేయుచో = అవమానించినా
 ఆ నరుడు = ఆ మానవుడు
 వాండ్ర = ఆ మూర్ఖులతో
 బదులు = ఎదురుమాటలు
 ఆడును+ఎ = చెప్తాడా? (చెప్పడని భావం)
తాత్పర్యం : ధర్మపురి నరసింహా! ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలిచేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం.
*5. కం॥ తన మదిఁగపటము గలిగిన
 తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్
 తన మది కపటము విడిచిన
 తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!
ప్రతిపదార్థం
వేమా = ఓ వేమనా!
 తన = తన యొక్క
 మదిన్ = మనసులో
 కపటము = మోసముతో కూడిన ఆలోచనలు
 కలిగిన = ఉన్న
 తగ = ఇతర
 జీవులకున్ = మానవులలో కూడా
 తనవలెనె = తన లాగానే
 కపటము+ఉండు = మోసం ఉన్నట్లు అగుపించును
 తన = తన యొక్క
 మది = మనసులో
 కపటము = మోసం ఆలోచనలు
 విడిచిన = విడచిపెట్టినట్లైతే
 ధరలో = భూమిపై
 తనకు+ఎవ్వడు = తనకెలాంటి
 కపటిలేడు = మోసగాడే కనిపించడు కదా
తాత్పర్యం ఓ వేమా! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సునుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించు కుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా!
6. ఆ.వె|| ధనము దమ్ముచేత దానవుండై పోయి
 పేదవాడు పడెడు బాధ గనక
 కష్టపెట్టువారు కలకాల ముందురా
 కల్లగాదు రావికంటిమాట!
ప్రతిపదార్థం
ధనము = సంపద
 దమ్ముచేత = గర్వం చేత
 దానవుండైపోయి = రాక్షసుడుగా మారి
 పేదవాడు = డబ్బులేనివాడు
 పడెడుబాధ = బాధపడుచున్నా
 కనక = లెక్కచేయకుండా
 కష్టపెట్టువారు = బాధలు పెట్టేవారు
 కలకాలము = చాలాకాలము
 ఉందురా = ఉంటారా?
 కలగాదు = ఇది అబద్ధంకాదు. నిజమే
 రావికంటిమాట = ఈ మాటలు రావికంటి రామయ్య గుప్త చెప్పినవి.
తాత్పర్యం : ధనబలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక వారిని కష్టాలపాలుచేసే మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన.

7. ఆ.వె॥ సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
 కమలనయన నిన్ను గాంచనిమ్ము
 విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
 చిద్విలాస భాస! శ్రీనివాస!
ప్రతిపదార్థం
శ్రీనివాస = ఓ శ్రీనివాసా!
 చిద్విలాస భాస = జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా!
 సత్పురుషుల = మంచివారితో
 మైత్రి = స్నేహం
 సలుపగా = చేయునట్టి
 మనసు+ఇమ్ము = మంచిమనసును ఇమ్ము
 కమలనయన = కమలాలవంటి కన్నులు కలవాడా!
 నిన్ను = నిన్ను
 కనులారా చూడనీ!
 విశ్వశాంతి = ప్రపంచశాంతిని
 కోర = కోరునట్టి
 విజ్ఞానమే = విశేష జ్ఞానాన్ని
 ఇమ్ము = ఇవ్వవలసినది
తాత్పర్యం: ఓ శ్రీనివాసా! జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలాల వంటి కన్నులు కలవాడా! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు.
8. జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనమ్ములన్నసూ
 క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ
 ప్తిని కలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ
 వనిశము గూర్పు యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!
ప్రతిపదార్థం
యాదగిరివాస = యాదగిరిగుట్టపై ఉండేవాడా!
 నృసింహా = ఓ నరసింహా!
 రమా విభో = లక్ష్మికి భర్త అయినవాడా!
 ప్రభో = ఓ ప్రభువా!
 జననియు = తల్లి
 జన్మభూమియు = పుట్టినభూమి
 స్వర్గముకన్న = స్వర్గం కంటే
 ఘనమ్ములు = గొప్పవి
 అన్న = అనే
 సు + ఉక్తిని = మంచిమాటను
 వెలయింప = గొప్ప
 సత్యము + అని = సత్యమని
 దివ్య = దివ్యమైన
 పురావిభవ + ఏక = ప్రాచీన వైభవాన్ని
 నవ్య = నూతనమైన
 దీప్తిని = కాంతిని
 కలిగింప = వెలిగించడానికి
 మాతృపదపీఠం = తల్లిపాదపీఠం మీద
 శిరంబు = తలను ఉంచి
 త్యజించు = ప్రాణాలు విడిచే
 తెంపు = సాహసాన్ని
 నీవు = నీవు
 అనిశము = ఎల్లప్పుడు
 కూర్పు = నాకు కల్గించుము
తాత్పర్యం : యాదగిరివాసా! నరసింహా! లక్ష్మీదేవికి భర్త అయినవాడా! ప్రభో! జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటె మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లిపాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.
పాఠ్యభాగ ఉద్దేశం:
శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికిపైగా పద్యాలతో ఉంటుంది. ప్రతిపద్యానికి ‘మకుటం’ ఉంటుంది. ఇవి ‘ముక్తకాలు’ అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతీశతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, నృకేసరి శతకం, వేమన శతకం, నగ్నసత్యాలు శతకం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.

కవుల పరిచయాలు:
1. సుమతీ శతకం – బద్దెన :
 లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాలలో ఇమిడ్చి సుమతీ శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం). ఈయన సుమతీ శతకంతో పాటు ‘నీతిశాస్త్ర ముక్తావళి’ అనే గ్రంథాన్ని రాశాడు.
2. దాశరథి శతకం – కంచెర్ల గోపన్న :
 రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న “దాశరథీ కరుణాపయోనిధీ !” అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రామదాసు కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం – కాకుత్థ్సం శేషప్పకవి :
 జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.
5. వేమన శతకం – వేమన :
 వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధి పొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో – నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.
6. నగ్నసత్యాలు శతకం – రావికంటి రామయ్యగుప్త :
 ‘కవిరత్న’ ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.
7. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డా॥ ఆడెపు చంద్రమౌళి :
 వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు ‘కవిశశాంక’. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.
8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం – శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య :
 ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన “యాదగిరివాస ! నృసింహ ! రమావిభో ! ప్రభో !” అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి.
ప్రవేశిక:
పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతిక విలువలను పద్యాల రూపంలో నేర్చుకొని పెంపొందించుకోవడం ద్వారా జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆ ఆలస్యం? శతక పద్యాల తోటలోకి వెళ్లాం! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం!