Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 6th Lesson పి.వి.నరసింహారావు Textbook Questions and Answers.
TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson పి.వి.నరసింహారావు
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. పి.వి. నరసింహారావు గుణగుణాలను తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు స్థితప్రజ్ఞుడు. సంస్కరణ శీలుడు. అపర చాణక్యుడు. న్యాయ శాస్త్రజ్ఞుడు. బహుభాషాకోవిదుడు. అందరికీ అయినవాడు. తెలంగాణ మహనీయుడు. దక్షిణ భారతం నుండి ప్రధానియైన మొదటివాడు. గొప్ప సాహితీ వేత్త. పద్నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన పండితుడు. దానకర్ణుడు. ఆటల్లో ఆరితేరినవాడు. సంగీతంలోనూ ఆయనకు ప్రవేశమున్నది. దేశహితాన్ని కోరిన మహామనీషి.
2. పి.వి. నరసింహారావు బాల్య విశేషాలు తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలంలోని వంగర. వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో ఆయన 28 జూన్ 1921న జన్మించాడు. తల్లిదండ్రులు రుక్మాబాయమ్మ, సీతారామారావు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయనను దత్తత చేసుకున్నారు.
3. పి.వి. విద్యాభ్యాసాన్ని వివరించండి.
జవాబు.
పి.వి.కి బాసరలో అక్షరాభ్యాసం జరిగింది. వంగరలో చదువు ప్రారంభించి హుజూరాబాద్లో 3, 4, తరగతులు చదివాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్టుగా వచ్చేవాడు. గణితం ఆయనకు ఇష్టమైన విషయం. టెన్నిస్ బాగా ఆడతాడు. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతం పాడతాడు. హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. మహారాష్ట్రలోని పూణేలో బి.యస్సి. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టాపొందాడు.
4. పి.వి. నరసింహారావు సాహిత్య సేవను తెల్పండి.
జవాబు.
పి.వి. నరసింహారావు 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. జయ అనే మారు పేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో విజయ అనే కలం పేరుతో ‘గొల్లరామవ్వ’ కథను కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథవారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోనతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు. తన రాజకీయ సాహిత్య అనుభవాలతో ఆయన రాసిన ‘ది ఇన్ సైడర్’ నవల బాగా ప్రసిద్ధి పొందింది.
5. పి.వి. బహుముఖ ప్రతిభను వివరించండి.
జవాబు.
పి.వి. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుదేలిన నాయకుడు. అనేక భాషలలో పండితుడు. రాజకీయరంగంలో శాసన సభ్యుడి నుండి ప్రధానమంత్రి వరకు అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాడు. దేశాన్ని ప్రగతిబాటలో నడిపించాడు. పాత్రికేయునిగా కాకతీయపత్రికను స్థాపించి అనేక రచనలు చేశాడు. ఎన్నో నవలలకు అనువాదాలు రాశాడు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చదువులోను ఆటపాటలలోనూ ఆరితేరినవాడు.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. పి.వి. నరసింహారావు జీవిత విశేషాలను సంగ్రహించండి.
జవాబు.
పి.వి. నరసింహారావు సీతారామారావు, రుక్మాబాయమ్మల కుమారుడు. పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు దత్తత చేసుకున్నారు. పి.వి. చదువులోను ఆటపాటల్లోనూ నిష్ణాతుడు. ఎల్.ఎల్.బి. పట్టా పొంది హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు. రాజకీయ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నో శాఖలలో మంత్రిగా పనిచేస్తూ పలు సంస్కరణలు చేసి అందరి ప్రశంసలు పొందాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు.
దీనివల్ల పేదలకు ఎంతో మేలు జరిగింది. తన రాజకీయ చతురతతో మిత్ర పక్షాలను కూడగట్టుకొని తాను ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలన నందించాడు. సాహితీవేత్తగా అనువాద గ్రంథాలు నవలలు రచించాడు. కాకతీయ పత్రికను స్థాపించి సమర్థవంతంగా నిర్వహించాడు. ఆచితూచి మాట్లాడడమే కాదు. రచనలోనూ పి.వి.ది అదే గాంభీర్యం, పరిణతి, దేశభక్తి కనిపిస్తుంది. సమున్నత వ్యక్తిత్వం కలవాడు పి.వి. నరసింహారావు.
2. పి.వి. నరసింహారావు రాజకీయ జీవిత విశేషాలు సంగ్రహించండి.
జవాబు.
పి.వి. నరసింహారావు రాజకీయ జీవితం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమితో ప్రారంభమైంది. తరువాత నాలుగు సార్లు మంథని శాసనసభ నియోజక వర్గంలో గెలిచాడు. రెండవసారి ఎన్నికైనపుడు రాష్ట్ర జైళ్ళు, ప్రజాసంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖల మంత్రిగా పనిచేశాడు. ఆయాశాఖలలో సంస్కరణలు తెచ్చాడు. మూడవసారి ఎన్నికైనపుడు ముఖ్యమంత్రియైనాడు.
పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు. 1977లో హనుమకొండ నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడుగా ఉంటూ హెూం, విదేశాంగ శాఖల మంత్రియైనాడు. రాజీవ్ గాంధి మంత్రి వర్గంలో మానవ వనరుల శాఖ, హెూంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991లో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత స్థితిని తొలగించాడు. మిత్ర పక్షాలను కూడ గట్టుకొని తాను ప్రధాన మంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పరచాడు. ఐదు సంవత్సరాలు చక్కనిపాలన నందించి రాజకీయ పండితులను ఆశ్చర్యపరచాడు.
పరిచిత గద్యభాగాలు
1. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్ది మంది రాజకీయ వేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. 1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. ‘కాకతీయ’ పత్రికలో ‘జయ’ అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో “గొల్లరామవ్వ” కథను ‘విజయ’ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించాడు. ఈ రచనకు పి.వి. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోన్ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు.
జవాబు.
1. పి.వి. స్థాపించిన పత్రిక ఏది ?
2. ఆయన మారుపేర్లు తెల్పండి.
3. తెలంగాణా పోరాటంలో ఆయన చేసిన రచన ఏది ?
4. ‘అబల జీవితం’ ఏ భాషలోని పుస్తకానికి అనువాదం ?
5. వేయి పడగలు తెలుగులో రాసిందెవరు ?
2. కింది వాక్యాలను సరైన క్రమంలో అమర్చండి.
1998లో ది ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది. 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు. 1977లో కేంద్ర రాజకీయాలలో ప్రవేశించాడు. 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. 1991లో ప్రధానమంత్రియైనాడు.
జవాబు.
- 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు.
- 1948 పి.వి. కాకతీయ పత్రికను స్థాపించాడు.
- 1977 కో కేంద్ర రాజకీయాలలో (పవేశించాడు.
- 1991లో ప్రధానమంత్రియైనాడు.
- 1998లో ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది.
3. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1924లో బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో పి.వి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో మూడు, నాలుగు తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం రోజూ సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో వెళ్ళి వచ్చేవాడు. చదువుకునే రోజుల్లో పి.వి. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తానెప్పుడూ క్లాస్లో సెకెండ్ రావడం ఎరుగనని ‘ఐ విట్నెస్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పి.వి. చెప్పాడు. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరినవాడే. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పి.వి.కి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడిన కీర్తనలు శ్రావ్యంగా పాడేవాడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
బాసరలో ఉన్న దైవం ఎవరు ?
జవాబు.
జ్ఞాన సరస్వతి.
ప్రశ్న 2.
పి.వి. మూడు నాలుగు తరగతులు ఎక్కడ చదివాడు ?
జవాబు.
హుజూరాబాద్లో
ప్రశ్న 3.
ఆయన ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ?
జవాబు.
ఐ విట్నెస్
ప్రశ్న 4.
ఆయనకు ఇష్టమైన ఆట ఏది ?
జవాబు.
టెన్నిస్
ప్రశ్న 5.
పి.వి. వంగర నుండి హుజూరాబాద్ ఎలా వెళ్ళేవాడు ?
జవాబు.
సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో