Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంభాషణ రచనా నైపుణ్యం Questions and Answers.
TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం
ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ‘సంభాషణ’ అంటారు. మనం రోజూ ఇంట్లోనూ, బయట ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొర్లుతుంటాయి. ఎదుటి వారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ.
సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. సూచించిన పదాలను ఆధారం చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. సందర్భోచితంగా వాడే జాతీయాలు, సామెతలు, పదబంధాలు సంభాషణలను ఆసక్తికరంగా మారుస్తాయి.
ప్రశ్న 1.
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ఎయిడ్ – మందులు – కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి : నమస్తే డాక్టర్ !
డాక్టర్ : నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి : మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్ : రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి : చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
డాక్టర్ : భేష్ పసుపు పెట్టి మీ టీచరు మంచి పని చేసింది. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది.
విద్యార్థి : అవును డాక్టర్ ! నా మోకాలు బాగా కమిలి పోయింది. మా అమ్మ కాలికి వేడినీళ్ళతో కాపడం కూడా పెట్టింది.
డాక్టర్ : మంచి పనిచేసింది సురేశ్ ! దెబ్బను ప్రతిపూటా డెట్టాల్ నీళ్ళతో కడగాలి. నేనిచ్చే మందు పెట్టు, దుమ్ము తగలనీయకు.
విద్యార్థి : ఏమైనా పథ్యం చెయ్యాలా డాక్టర్ ?
డాక్టర్ : అవసరం లేదు. బలమైన ఆహారం తీసుకో !
విద్యార్థి : సరే డాక్టర్ ! నమస్కారం.
ప్రశ్న 2.
ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. *(M.P.)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి : తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి : నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి : ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి : దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి : ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి : ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి : ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి : మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి : అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి : రెండు రోజుల్లో.
విద్యార్థి : ధన్యవాదాలు సర్ !
ప్రశ్న 3.
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని : నమస్తే సర్ !
ప్రిన్సిపాల్ : నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని : సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్ : దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని : దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్ : ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని : నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్ : అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని : అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్ : మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని : అట్లాగే సర్ ! ధన్యవాదాలు.
ప్రశ్న 4.
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన : నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ : నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన : అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ : ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా !
వందన : నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ : అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన : మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ : బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా!
వందన : వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ : ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన : ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ : తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన : ధన్యవాదాలు సర్ !