TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి. (V.Imp)
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ‘ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది.

తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది.

రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, లోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

ప్రశ్న 2.
దుందుభి గొప్పతనాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
గంగాపురం హనుమచ్ఛర్మ దుందుభి నది గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు. కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు దుందుభి ఒడిలో శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొందాయన్నారు.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ దుందుభి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతుంది. పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, తాటికమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. దుందుభి పెంచిన కారణంగా తాటిచెట్లపై ప్రేమలు పెరిగాయి.

లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందింది. పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన దుందుభి నదిని బంధించడం పిచ్చి పని. పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కల దుందుభి విషయంలో సాధ్యపడదు.

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చి తన కారుణ్యాన్ని చూపినందుకు కవి మెచ్చుకున్నాడు.

అలలు అనే చేతులతో ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. దుందుభి ప్రవహించి తెలుగు భూములను పవిత్రంగా మార్చింది. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే దుందుభి పంట భూములకు పాలు ఇవ్వడానికి ప్రవహించింది కావున తన గొప్పతనాన్ని కావ్యంలో పెట్టాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?
జవాబు:
తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు. ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.

ప్రశ్న 2.
దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

ప్రశ్న 4.
దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?
జవాబు:
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.

ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?
జవాబు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

ప్రశ్న 2.
దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?
జవాబు:
దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

ప్రశ్న 3.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 4.
హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?
జవాబు:
గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

ప్రశ్న 5.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 6.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను

ప్రశ్న 7.
విజయపురిని ఏలిన వారెవరు ?
జవాబు:
ఇక్ష్వాకులు

ప్రశ్న 8.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం.

వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని

2. పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.

వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

3. విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.

వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4. మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.

వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

మ॥ తొలిజల్లు ల్గురియంగ ! పేరలల పొత్తుంగొంచు పోరాడి యొ
డ్డులతో రాయుచు గ్రామసీమలకు గోడుంబాప నేతెంచి, మా
తలపు ల్ముట్టియు సస్యపాకముల నాత్మ ల్దేర్చి; గోదమ్మ
కృ స్థలు మాకందని కుందు దీర్చితి ప్రశస్తం బిద్దియౌ ! దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి నదీ!
తొలిజల్లుల్ = తొలకరి వాన
కురియం = పడగానే
పేరు + అలల = పెద్ద అలలతో
పొత్తుంగొంచు = స్నేహం చేసి
పోరాడి = పోరాటం చేసి
ఒడ్డులతో రాయుచు = గట్లను తాకుతూ
గ్రామసీమలకు = గ్రామాల్లోని భూములకు
గోడు = బాధ
బాపన్ = పోగొట్టడానికి
ఏతెంచి = వచ్చి
మా తలపులు = మా కోరికలు
ముట్టియు = తాకి, తీర్చి
సస్య = పైరు
పాకములన్ = పంటలతో
ఆత్మల్ + తేర్చి = మనసులను ఆనందపరచి
గోదమ్మ = గోదావరి నదీ
కృష్ణలు = కృష్ణా నది మొదలైనవి
మాకు + అందని = మాకు అందడం లేవు అనే
కుందున్ = “బాధ
తీర్చితి = తీర్చావు
ప్రశస్తంబు + ఇద్దియౌ ! = ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది

తాత్పర్యం : ఓ దుందుబి,! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది.

2వ పద్యం :

ఉ||
బంగరు రంగుల న్విరియఁ బారిన సంధ్యలు మావిపూత ను
ప్పొంగిన కోయిలమ్మ రుతముల్ ! తొలికారు మొయిళ్ళు ! వానిలో
వంగి చలించు చంచలలు ! నాకొక భావన నేర్పరించి ని
న్నుం గిలిగింతగొల్పుమనె నూతనగీతి మదంబ దుందుభీ !

ప్రతిపదార్థం :

మత్+అంబ దుందుభీ != మా అమ్మ వంట దుందుభి
బంగరు రంగులన్ = బంగారపు రంగులు
విరియం బారిన = వ్యాపించిన
సంధ్యలు = సంధ్యా సమయాలు (ఉదయాలు, సాయంత్రాలు)
మావి పూతన్ = మామిడి పూతతో
ఉప్పొంగిన = ఎక్కువ సంతోషించి
కోయిలమ్మ రుతముల్ = కోకిలలు చేసే శబ్దాలు, ధ్వనులు
తొలికారు మొయిళ్ళు! = తొలకరి వర్షానికి ముందు ఉండే నల్లని మబ్బులు
వానిలో = ఆ మేఘాలలో నుండి
వంగి చలించు = వంపులతో కదిలే
చంచలలు! = మెరుపులు
నాకున్ + ఒక = నాకు ఒక రకమైన
భావనన్ = ఆలోచనను, ఊహను
ఏర్పరిచి = కలిగించి
నిన్నుం = నిన్ను (దుందుభిని)
నూతనగీతి = కొత్త పాటలతో
గిలిగింత గొల్పుము+అనె = ఆనంద పరుచుమన్నవి

తాత్పర్యం : మా అమ్మ వంటి దుందుభి! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

3వ పద్యం :

చ||
తలచినయంతనే హృదయ తంత్రుల ఝమ్మని మ్రోతలెత్తెనో
మలచినగుండెలోపలి యమాయికత ల్జలమై స్రవించెనో
శిలలు ద్రవించెనో, యెద భజించు ప్రియుండగు స్వీయనాథుపై
వలపులు పుల్కరించుడు నభంగురతం జనుదెంతు దుందుభీ!

ప్రతిపదార్థం :

దుందుభీ! = ఓ దుందుభి
తలచిన అంతనే = మనసులో తలుచుకోగానే, అనుకోగానే
హృదయ తంత్రుల = హృదయమనే వీణ తీగలపై
ఝం + అని = ఝం అనే
మ్రోతలు+ఎత్తైన్+ఓ = ధ్వనులు వచ్చాయా ?
మలచిన = కదిలిన
అమాయికతల్ = అమాయకత్వం, తెలియనితనం
జలమై = నీరై
స్రవించెనో = కారిందా
శిలలు = రాళ్లు
ద్రవించెనో = కరిగాయా
ఎద = హృదయంలో
భజించు = కీర్తించే
ప్రియుండు + అగు = ప్రియమైన వాడైన
స్వీయ నాథుపై = భర్తపై
వలపులు = ప్రేమలు
పుల్కరించుడున్ = గిలిగింతలు పెడుతున్నాయా
అభంగురతన్ = ఆగకుండా (భంగం = ఆటంకం)
చనుదెంతు = వస్తున్నావు

తాత్పర్యం : ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తీగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4వ పద్యం :

ఉ||
కూళలు కొంద రేవొ తమ కోసము శాసనముల్ సృజించి, భూ
గోళము నాక్రమించుకొని, క్రొవ్వగ వారి విలాసఘట్టనన్
వేళకు కూడుగానక తపించి గతించిన దైన్య శుష్క కం
కాళము లెన్నొ నీయొడిని గాంచె నిరంతర శాంతి సౌఖ్యముల్.

ప్రతిపదార్థం:

కొందరు = కొంత మంది
కూళలు = క్రూరులు
తమ కోసము = స్వార్థం కోసం
శాసనముల్ = చట్టాలను
సృజించి = తయారు చేసి
భూగోళమున్ = భూమిని
ఆక్రమించుకొని = వశపరచుకొని
క్రొవ్వగ = గర్వాన్ని పొంది
వారి విలాస ఘట్టనన్ = వారి యొక్క ఆనందం కోసం చేసే ఒత్తిడివల్ల
వేళకు = సమయానికి
కూడు గానక = తిండి పొందక
తపించి = బాధపడి
గతించిన = మరణించిన
దైన్య = దీనస్థితిలో
శుష్క = ఎండిన
కంకాళములు+ఎన్నో = ఎన్నో అస్థిపంజరాలు
నీయొడినిన్ = నీ ఒడిలో
నిరంతర = ఎల్లప్పుడు
శాంతి సౌఖ్యముల్ = శాంతిని సుఖాలను
కాంచెన్ = చూశాయి, పొందాయి

తాత్పర్యం : కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీన స్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

5వ పద్యం :

ఉ|| మాయురె దుందుభీ! ప్రబల మైన కృపాధిషణన్ దరిద్రనా
రాయణ పక్షమై ధన పరత్వము రోయుచు ‘జమ్ము’ ‘తుంగ’ ల
త్యాయతవృత్తి బెంచి నిలయమ్ముగ బాకను గూర్చి స్వాదుపా
నీయము నిచ్చి త్రావగ జనించిన ప్రేమను చిందె దీగతిన్,

ప్రతిపదార్థం :

మాయురె దుందుభీ ! = ఆహా దుందుభి !
ప్రబలమైన = బలమైన, అధికమైన
కృపాధిషణన్ = కరుణతో
దరిద్రనారాయణ పక్షమై = పేదల వైపు ఉండి
ధన పరత్వము = ధనమే ప్రధానమనే గుణాన్ని
రోయుచు = అసహ్యించుకుంటూ
జమ్ము, తుంగ ల = జనుమును, తుంగ అనే గడ్డిని
అతి + ఆయత వృత్తి = చాలా పొడుగ్గా
బెంచి = పెంచి
నిలయమ్ముగ = నివాసంగా
పాకను గూర్చి = గుడిసెను కట్టి
స్వాదు పానీయమును = = తీయటి నీటిని
త్రావగ ఇచ్చి = తాగడానికి ఇచ్చి
జనించిన = పుట్టిన
ప్రేమను = ప్రేమతో
చిందెదు ఈ గతిన్ = ఈ విధంగా గంతులు వేస్తున్నావు

తాత్పర్యం : ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టి ఇచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

6వ పద్యం :

చ||
శిల నులిమూసలోఁ గరగి చిత్తరువుంబలె స్వేచ్చ రూపురే
ఖల వరభావ మచ్చునిడి, కాంచు జగమ్ముల నేలి పేరులన్
వలవని మేటి శిల్పకుల వర్యుల మంజుల దివ్యహస్తకౌ
శలమును బోలి వర్షములు సాగెదవా మము దేర్చ వాహినీ.

ప్రతిపదార్థం :

వాహినీ = నదీ (దుందుభి)
శిలన్ = రాయిని
ఉలి = ఉలితో
మూసలో = అచ్చులో
కరగి = కరిగిన
చిత్తరువున్ బలె = చిత్రాల వంటి
స్వేచ్చన్ = స్వేచ్ఛతో
రూపురేఖలన్ = ఆకారాలను
వరభావము = గొప్ప కల్ప
అచ్చునిడి = రూపం ఇచ్చి
కాంచు = చూసే
జగమ్ములన్ = ప్రజలను
ఏలి = పాలించి, ఆనందపరచి
పేరులన్ = ప్రఖ్యాతులను
వలవని = ఆశించని
మేటి = గొప్ప
శిల్ప కుల వర్యుల = శిల్పులలో గొప్పవారి
మంజుల = అందమైన, మనోజ్ఞమైన
దివ్య = గొప్ప
హస్త కౌశలమును = చేతి నైపుణ్యం
బోలి = లాగా
మము దేర్చ = మిమ్మల్ని ఆనందపరచడానికి
వర్షములన్ = వర్షాకాలంలో, సంవత్సరాల పాటు
సాగెదవా = పారుతున్నావా

తాత్పర్యం : ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

7వ పద్యం :

ఉ||
కత్తిని గంటము నెదిపి కావ్యరసమ్మున రౌద్రవృత్తి రే
కెత్త రసజ్ఞచిత్త ముడికించు కళాత్మక వీరమూర్తి నీ
పొత్తున గోనబుద్ధుడు సపూర్వచరిత్ర రచించే తద్విధిన్
మెత్తనిమేనిలో బిరుసు మీరెదవా వరద ల్వరించినన్.

ప్రతిపదార్థం:

కత్తిని = కరవాలాన్ని, ఖడ్గాన్ని
గంటమున్ = గంటమును, కలమును
మెదిపి = కదిలించి, ఉపయోగించి
కావ్యరసమ్మున = కావ్యంలోని రసాలను
రౌద్రవృత్తి రేకెత్త = రౌద్రస్వభావంతో
రసజ్ఞ చిత్తము = రసాన్ని గుర్తించి ఆనందించే మనసు
ఉడికించు = తపించే విధంగా
కళాత్మక = సృజనశీలి అయిన
వీరమూర్తి = వీరుడు
నీ పొత్తున = నీ స్నేహంలో (నీ పక్కన ఉండి)
గోనబుద్ధుడున్ = గోన బుద్ధారెడ్డి అనే పేరుగల వాడు
అపూర్వ చరిత్రన్ = ముందు లేని గొప్ప చరిత్రను (రంగనాథ రామాయణాన్ని) రచించాడు
రచించే = రచించాడు
తత్ + విధిన్ మెత్తని = అటువంటి
మెత్తని = సుకుమారమైన
మేనిలో = శరీరంలో
వరదల్+వరించినన్ = వరదలు వచ్చినప్పుడు
బిరుసు = గట్టిదనాన్ని, కఠినత్వాన్ని
మీరెదవా = పెంచుకుంటావా

తాత్పర్యం : కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

8వ పద్యం :

చ||
అవమతిలేదు నీయెద రహస్యపు వేళలనైన శైవవై
ష్ణవములపైన దానికిల సత్తులసీద్రుమపాళి బిల్వప
త్రవనము తీరదేశముల దాల్చుచు తిక్కన గంటమీను స
త్కవితను బోలి పారెదపు తాత్వికత నివకేశవాఢ్యవై.

ప్రతిపదార్థం:

రహస్యము+వేళలన్+ ఐనన్ = తెలియని సమయంలో కూడా (ప్రాచీన కాలంలో)
శైవ = శివునికి సంబంధించిన
వైష్ణవము = విష్ణుకు సంబంధించిన
ల పైన = అంశాలపై
దానికి = ఆ మతాలకు సంబంధించి
ఇలన్ = ఈ భూమిపై
నీ యెద = నీ మనసులో
అవమతిలేదు = అనాసక్తత లేదు
సత్ + తులసీ = మంచి తులసి
ద్రుమపాళి = చెట్ల వరుసతో
బిల్వపత్ర వనము = మారేడు పత్ర వృక్షాల సమూహంతో
తీర దేశముల = నీ రెండు అంచులు,
తాల్చుచు = నింపి ఉంచుతూ
తిక్కన = కవిబ్రహ్మ తిక్కన
గంటము + ఈను = కాలము ఇచ్చిన
సత్కవితను బోలి = మంచి కవిత తీరుగా
శివ = శివుని
కేశవ = నారాయణుని
తాత్వికతన్ = తత్వాలతో
ఆఢ్యపై = సంపన్నురాలవై
పారెదవు = ప్రవహిస్తావు

తాత్పర్యం : తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

9వ పద్యం :

ఉ|| పేదలయిండ్లకై తనువు బెంచి యభిన్నత బేర్చు బుద్ధి సాం
ద్రాదర భావవీచుల విధమ్మగు కమ్మల కప్పుగూర్చి; మె
ప్పూదుచు చేవ బోవ తమ ప్రోవుల మంట దరిద్రశీతముల్
ఏదెడు తాళవృక్షముల కేర్పడె ప్రేమలు నీవుబెంచుటన్.

ప్రతిపదార్థం:

పేదలయిండ్లకి + ఐ = పేదవారి ఇండ్లకోసం
తనువు బెంచి = శరీరాన్ని పెంచి
అభిన్నత = భిన్నత్వం లేని విధంగా
పేర్చు = పేర్చుచు
బుద్ది సాంద్ర = మనసులో గాఢమైన
ఆదర బావ వీచులన్ = గౌరవ భావమనే తరంగాల
విధమ్ము + అగు = విధంగా
కమ్మలన్ = తాటి ఆకులతో (తాటి ఆకులను కమ్మలు అంటారు)
కప్పు గూర్చి = కప్పును తయారు చేసి
మెప్పుదుచున్ = మెప్పును పొందుచు
చేవ బోవన్ = శక్తి నశించగా
తమ ప్రోవుల = తమ సమూహంతో (తాటి ఆకుల కుప్పతో) వేసిన
మంటన్ = చలి మంటలతో
దరిద్ర శీతముల్ = దరిద్రమైన చలినుండి
ఏదెడు = పోగొట్టుకుంటారు
నీవు బెంచుటన్ = నీవు పెంచిన కారణంగా
తాళ వృక్షములకున్ = తాటిచెట్లపై
ప్రేమలు = ప్రేమలు
ఏర్పడెన్ = ఏర్పడ్డాయి, పెరిగాయి

తాత్పర్యం : పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి.

10వ పద్యం :

ఉ||
శంకను దక్కి లోకమున సాగిన హింసను రూపుమాపఁ బా
దాంకములందుఁ జీమలు గతాసువులై చెడకుండునట్లు క్షే
మంకరబుద్ధి మాసి చను మానవతం బ్రకటించు జైన తీ
ర్ధంకర పానయోగ్య జల దాయినివై యశము స్వహింపవా!

ప్రతిపదార్థం :

శంకను దక్కి = అనుమానం లేకుండా, భయం లేకుండా
లోకమున = లోకములో
సాగిన హింసను = నడిచిన హింసను
రూపుమాపన్ = లేకుండా చేయడానికి
పాద + అంకములందున = పాదాల దగ్గర ఉన్న
చీమలు = చీమలు
గత + అసువులు + ఐ = పోయిన ప్రాణాలు
చెడకుండునట్లు = చెడిపోకుండా ఉండేటట్లు
క్షేమంకరబుద్ధి = శుభాన్ని కలిగించే మనసుతో
మాసి = నశించి
చను = పోయె
మానవతన్ = మానవత్వాన్ని
ప్రకటించు = తెలపడానికి, నిలపడానికి
జైన తీర్థంకర = జైన తీర్థంకరులకు
పానయోగ్య = తాగడానికి అనుకూలమైన
జల దాయినివై = నీటిని ఇచ్చే దానివై
యశమున్ = కీర్తిని
వహింపవా ! = పొందవా

తాత్పర్యం : భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం).

11వ పద్యం :

మ|
నిను బంధించి రిదేటి వెర్రితల పాండిత్యమ్ము? శక్యంబె పా
వనభావమ్ముల నిగ్రహింప కడు తీవ్రంబైన జ్వాలావళిన్
గొనిమూట న్బిగియింపగా సలిల సంకోచంబు స్వేచ్ఛెకజీ
వనవౌ నీయెడ సాగునే విమల భాస్వద్రూప శైవాలినీ!

ప్రతిపదార్థం :

విమల = పరిశుద్ధమైన
భాస్వత్రూప = ప్రకాశవంతమైన
శైవాలినీ! = ఓ నదీ
నిను బంధించిరి = నిన్ను బంధించారు
ఇది ఏటి = ఇదెక్కడి
వెర్రితల = పిచ్చెక్కిన
పాండిత్యమ్ము = తెలివి
పావన = పవిత్రమైన
భావమ్ముల = భావాలను
నిగ్రహింప = ఆపడం
శక్యంబె = సాధ్యమా
కడు = మిక్కిలి
తీవ్రంబైన = తీవ్రమైన
జ్వాల + ఆవళిన్ కొని = అగ్ని సమూహాన్ని
కొని = “తీసుకొని
మూటన్ + బిగియింపగా = మూటలో బంధించడం
సలిల = నీటిని
సంకోచంబు = ఆపడం, చిన్నగా చేయడం
స్వేచ్ఛ + ఏక జీవనవు + ఔ = స్వేచ్ఛయే జీవితముగా కలదానివి అయిన నీ విషయంలో
నీయెడ = నీ విషయంలో
సాగునే = సాధ్యమవుతుందా ?

తాత్పర్యం:పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

12వ పద్యం :

ప్రతిపదార్థం :

చ||
కదలెడు పూరిపుల్లకు గకావికలై భయమొంది డప్పితో
బొదలిన జింక దుప్పి కదుపుల్ జలముల్గొన నిన్నుజేరి
బెదవుల ముట్టువేళ గని పెంపగు చేపల బల్లటీ ల్గొనం
గదిమి తృష్ణార్తతన్ వెరవు గల్గియు దిక్కుల బార జూతువా ?

ప్రతిపదార్థం :

కదలెడు = కదులుతున్న
పూరిపుల్లకు = గడ్డిపోచకు కూడా
భయమొంది = భయపడి
కకావికలై = చెల్లాచెదురై
పొదలిన = తిరిగి అలసిన
డప్పితో = దాహంతో
జింక, దుప్పి కదుపుల్ = జింకల దుప్పుల గుంపులు
జలముల్ + గొనన్ = నీరు తాగడానికి
నిన్ను + చేరి = నీ దగ్గరికి వచ్చి
క్రీ = కింది
పెదవుల = పెదవులతో
ముట్టువేళన్ = నీటిని తాకుతుండగా
కని = చూసి
కదిమి = స్వార్థంతో
పెంపు + అగు = పెరిగిన
చేపల పల్లటీల్ = చేపలు గంతులు
కొనన్ = వేస్తుంటే
తృష + ఆర్తతన్ = దాహం తీరక కలిగే బాధతో
దిక్కులన్ = దిక్కులు పట్టుకొని
వెరవు గల్గియు = ఉపాయంతో
పారన్ + చూతువా ? = వెళ్ళడం చూస్తావా ?

తాత్పర్యం : కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా ?

13వ పద్యం :
మ||
అరప్రేవుం దడుపంగజాలని నిర ల్పాహారమై, రక్త మా
విరిగా, లోకహితార్థమై కడగు చుర్విం జెమ్మట న్ముంచి, క
ష్టరతిం గుందెడు మానవాళికి గరిష్ఠప్రేమ “సీతాఫలో”
త్కరమున్ మేలొలిపంటగా నొసగు నీకారుణ్యమగ్గించెదన్.

ప్రతిపదార్థం :

అర ప్రేవున్ = సగం పేగును కూడా
తడుపంగ = తడపడానికి
చాలని = సరిపోని
నిర్ + అల్పాహారము + ఐ = అల్పాహారము లేని వారై
రక్తము + ఆవిరిగా = రక్తాన్ని ఆవిరిగా చేసి
లోకహిత + అర్థమై = లోకానికి మంచి చేయడానికి
కడగుచు = ప్రయత్నం చేసే
ఉర్విన్ = ఈ భూమిని
చెమ్మటన్ = చెమటతో, స్వేదంతో
ముంచి = మునిగేలా చేసి, తడిపి
కష్టరతిం = కష్టాలతో
కుందెడు = బాధపడే
మానవాళికి = మానవులకు
గరిష్ఠప్రేమన్ = అత్యంత ఎక్కువ ప్రేమతో
మేల్ తొలిపంట గాన్ = మంచి మొదటి పంటగా
సీతాఫల + ఉత్కరమున్ = సీతాఫలాలను
ఒసగు
నీ కారుణ్యము +  = ఇచ్చే
+ అగ్గించెదన్ = నీ కరుణను స్థుతిస్తాను, మెచ్చుకుంటాను

తాత్పర్యం : సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

14వ పద్యం :

తే.గీ॥ ప్రచురతర రసవాదాన బ్రభవమందు
స్వర్ణయోగం బదేమాయె ? సరవి నష్ట
సిద్ధు లేనీట మునిగె ? యజించు క్రమము
డెలియలేనట్టి జడబుద్ధి తేలివచ్చె !

ప్రతిపదార్థం:

ప్రచురతర = ప్రచారంలో గల
రసవాదాన = రసవాద విద్య (బంగారాన్ని తయారు చేసే విద్య)
ప్రభవము అందు = పుట్టు
స్వర్ణయోగంబు = బంగారు యోగము
అది + ఏమాయె ? = అది (స్వర్ణ యోగం) ఏమైనది
సరవిన్ అష్టసిద్ధులు = క్రమంగా అష్టసిద్ధులు
ఏనీట మునిగె ? = ఏ నీటిలో మునిగి పోయాయి
యజించు క్రమము = యజ్ఞాలు చేసే పద్ధతులు
తెలియలేనట్టి = తెలుసుకోలేని
జడబుద్ధి = తెలివి తక్కువతనం
తేలివచ్చె ! = ప్రకటితమైనది

తాత్పర్యం : గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగి పోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం).

15వ పద్యం :

తే.గీ॥ ఆర్ష జీవిత పద్దతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.

ప్రతిపదార్థం :

ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన
జీవిత పద్ధతులు = = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లుగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువు గానొ = బరువుగా మారాను కదా

తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !

16వ పద్యం :

ఉ||
జేనెడు పొట్టకై పరుల సేవకు కాయము నమ్మి నైచ్యసం
ధానపు జీవితమ్మున వ్యథం గొని చాల కృశించు వ్యక్తి, సం
ఘానికి జాతికౌ నొక విఘాతము మాన్పగలేడు ఎట్టిదౌ
పూనికతోడ కొల్వునకుఁ బోయిన స్వేచ్ఛ నశించు దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి !
జానెడు పొట్టకై = జానెడు ఉన్న కడుపు కోసం
పరుల సేవకు = ఇతరులక సేవచేయడానికి
కాయమును + అమ్మి = శరీరాన్ని అమ్మి
నైచ్య సంధానపు = నీచత్వంతో కూడిన
జీవితమ్మున = జీవితంలో
వ్యథన్ + కొని = జీవితంలో
చాల కృశించు = చాల బాధపడే
వ్యక్తి = మనిషి
సంఘానికి = సమాజానికి
జాతికి ఔ = జాతికి కూడా
నొక = ఒక
విఘాతము = చేటును
మాన్పగలేడు = పోగొట్టలేడు
ఎట్టిది + ఔ = ఎటువంటిది అయినా
పూనికతోడ = ప్రయత్నముతో
కొల్వునకున్ = సేవకు, ఉద్యోగానికి
పోయిన = వెళ్ళినా, వెళ్తే
స్వేచ్ఛ నశించు = స్వేచ్ఛ నశిస్తుంది.

తాత్పర్యం : ఓ దుందుభి! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్టలేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

17వ పద్యం :

దుందుభీ ! అలల చేతుల నెత్తి నీ వాడు
నాటలన్ గని తరుపు లలరులం బులకించె
పులకపులకయు నొక్క పుష్పమై వికసించె
పుష్ప మొక మధుపాత్రబోలి విందులు వెట్ట
ప్రవహించి మాసీమ పావనమ్ముగ జేసి
తెలుగు సంస్కృతులతో తేజరిల్లెడి నీవు
మా పొలాలకు పాలు జేప బారితిగాన
నీ యుదంతము కొంత నిలిపితిని కావ్యాన.

ప్రతిపదార్థం :

దుందుభి ! = ఓ దుందుభి
అలల చేతుల నెత్తి = అలలు అనే చేతులతో
నీవు + ఆడున్ = నీవు ఆడే
ఆటలన్ గని = ఆటలు చూసి
తరువులు = = చెట్లు
అలరులన్ = పూవులతో
పులకించె = పులకరించాయి
పులక పులకయున్ = ఒక్కొక్క పులకరింత
ఒక్క = ఒక్కొక్క
పుష్పము + ఐ = పూవుగా
వికసించే = వికసించింది
పుష్పము + ఒక = ప్రతీ పూవు ఒక
మధు పాత్రన్ + బోలి = తేనె నింపిన పాత్ర లాగా
విందులు + పెట్టన్ = ఆతిథ్యమివ్వగా
ప్రవహించి = ప్రవహించి
మా సీమన్ = మా భూమిని
పావనమ్ముగ జేసి = పవిత్రంగా మార్చి
తెలుగు సంస్కృతులతో = తెలుగు వారి సంస్కృతులతో
తేజరిల్లెడి = ప్రకాశించే
నీవు = నీవు
మా పొలాలకున్ = మా పంట భూములకు
పాలు చేపన్ = పాలు ఇవ్వడానికి
పారితి కానన్ = ప్రవహించావు కావున
నీ + ఉదంతము = నీ చరిత్రను,
కావ్యాన = కావ్యంలో
కొంత = కొద్దిగా
నిలిపితిన్ = నిలిపాను, తెలిపాను

తాత్పర్యం : ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

18వ పద్యం :

భాగ్యనగరాత్యంత పరిసరమ్ముల బుట్టి
పాలమూ ర్మండలపు భాగాన బంధింప
బడి నీలగిరిసీమ బరగు దేవరకొండ
భూముల బండించి ముందు కటునటు సాగి
పలనాటి బ్రహ్మయ్య పరగణాలో బారు
కృష్ణమ్మలో గలసి కెలకుల నడయాడి
ఏలేశ్వరుని పూజ కేగి భక్తులతోడ
అట నుపాధ్యాయు కీర్త్యంశముల గొన్నింటి
వెలువరచి చరిత కొక వెలుగుబాటను జూపి

ప్రతిపదార్థం :

భాగ్యనగర = హైదరాబాదుకు
అత్యంత పరిసరమ్ములన్ = అతి సమీపములో
పుట్టి = జన్మించి
పాలమూరు మండలపు భాగాన = పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా ప్రాంతంలో
బంధింపబడి = ఆనకట్టచే నిలుపబడి
నీలగిరిసీమన్ + పరగు = నీలగిరి (నల్లగొండ జిల్లా) ప్రాంతంలో ఉన్న
దేవరకొండ = దేవరకొండ
భూములన్ పండించి = పొలాలను పండే విధంగా చేసి
ముందుకు = ఇంకా ముందుకు
అటునటు = అలా అలా
సాగి = ప్రవహించి
పలనాటి బ్రహ్మయ్య = పలనాటి బ్రహ్మనాయుడు
పరగణాలో = పాలించిన ప్రాంతంలో
పారు = పారి
కృష్ణమ్మలో గలసి = కృష్ణానదిలో
కెలకుల = దగ్గరలో
నడయాడి = ప్రవహించి
ఏలేశ్వరుని పూజకు ఏగి = ఏలేశ్వర స్వామి పూజకు పోయి
భక్తుల తోడ = భక్తులతో
అటన్ = అక్కడ
ఉపాధ్యాయున్ = నాగార్జునుని
కీర్తి + అంశములన్ = కీర్తికి సంబంధించిన అంశాలను
కొన్నింటి = కొన్నిటిని
వెలువరచి = చెప్పి
చరితకు ఒక = చరిత్ర రాయడానికి ఒక
వెలుగుబాటను = కాంతి మార్గాన్ని
చూపి = చూపించి

తాత్పర్యం : హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి,

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

19వ పద్యం :

ఇక్ష్వాకువంశీయు లేలిన విజయపురిం
దరిసి నాగార్జునుని దర్శించి ధన్యవై
తెలుగుభూముల సస్యఫలభరితముల జేసి
ఆచంద్రతారార్క మాంధ్రసంతతికి ఆ
శీరక్షతలను సచ్చీలంబు జేకూర్చి
ఇహపరమ్ములను సర్వేప్పితమ్ము లొసంగి
మము బెంచు తల్లివై మా పాలవెల్లివై
ప్రవహింతువా దుందుభీ !
మా సీమ
పాలయేఱుగ దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభి! = ఓ దుందుభి
ఇక్ష్వాకువంశీయు లేలిన = ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించిన
విజయపురిన్ = విజయపురాన్ని
తరిసి = చేరి
నాగార్జునుని = ఆచార్య నాగార్జునున్ని
దర్శించి = చూసి
ధన్యవై = ధన్యతను పొంది
తెలుగు భూములన్ = తెలుగు నేలలో
సస్య ఫల భరితముల జేసి = పైరు పంటలతో నింపి
ఆ చంద్ర తార + అర్కము = నక్షత్రాలు, సూర్య చంద్రులు ఉన్నంతకాలం (శాశ్వతంగా)
ఆంధ్ర సంతతికి = తెలుగుతల్లి బిడ్డలకు
ఆశీః + అక్షతలను = ఆశీర్వదపూర్వక అక్షతలను
సత్ + శీలంబున్ = మంచి నడవడిని
చేకూర్చి = అందించి
ఇహ పరమ్ములను = ఈ లోకములో, పరలోకంలో
సర్వ + ఈప్పితమ్ములు = అన్ని కోరికలను
ఒసంగి = తీర్చి
మము బెంచు తల్లివై = మమ్మల్ని పెంచే తల్లిగా మారి
మా పాలవెల్లివి + ఐ = మాకు పాల ప్రవాహానివై
ప్రవహించువా = ప్రవహిస్తావా
మా సీమ = మా ప్రాంతాలలో
పాలయేఱుగ = పాల నదిలాగా
దుందుభీ! = దుందుభి నదీ!

తాత్పర్యం : ఓ దుందుభి ! ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా ! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా !

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు :

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

ఉ||
పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు శాసనమ్ములై,
కట్టిన దేవళమ్ముల వికాసము జాతికి జీవగఱ్ఱయై,
పుట్టువు సార్ధతం బొరయ పొల్పుమిగిల్చిన శ్రీచళుక్య స
మ్రాట్టులు నీదు తీరమున రాచరికమ్ముల నోచి రెందరో.

ప్రతిపదార్థం :

పట్టినరాయి = (వారు) పట్టుకున్న ప్రతీ రాయి
శిల్పము + ఐ = శిల్పంగా మరి
పాతిన = భూమిలో నిలిపిన
బండలు = రాళ్లు అన్ని
శాసనమ్ములు + ఐ = శాసనాలుగా మారి
కట్టిన = కట్టించిన
దేవళమ్ముల = దేవాలయాల
వికాసము = అభివృద్ధి
జాతికి = తెలుగు జాతికి
జీవగఱ్ఱయై = జీవనాధారమై
పుట్టువు = జన్మ
సార్ధతంబు ఒరయ = సాఫల్యం చెందగా
పొల్పు మిగిల్చిన = స్థిరత్వాన్ని పొందిన
శ్రీచళుక్య సమ్రాట్టులు శ్రీ చాళుక్య వంశానికి చెందిన చక్రవర్తులు
నీదు = నీ యొక్క
తీరమున = తీరంలో
ఎందరో = ఎంతో మంది
రాచరికమ్ములన్ = రాజులుగా
నోచిరి = నోచుకున్నారు, అదృష్టాన్ని పొందారు

తాత్పర్యం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

2వ పద్యం :

ఉ||
అద్దమువంటి నీజలము లందు స్వరూపము దిద్దుచున్న యా
నిద్దపు చందమామ యొడి నిద్దుర నొందగ కీచురాళ్ళతో
దద్దయు జోలబాడిన విధమ్మున, నూగు తరంగడోలికన్
ముద్దుగ నిద్రబుచ్చెదు ప్రపుల్లశరత్తుల మాతృమూర్తివై.

ప్రతిపదార్థం:

అద్దమువంటి = అద్దం లాంటి స్వచ్ఛమైన
నీ జలముల+అందు = నీ నీటిలో
స్వరూపమున్ = తన రూపాన్ని
దిద్దుచున్న = చూసుకుంటున్న, అలంకరించుకుంటున్న
ఆ నిద్దపు = ఆ అందమైన
చందమామ = చందమామ
ఒడి నిద్దురన్ ఒందగ = నీ ఒడిలో నిద్ర పోతున్నప్పుడు
కీచురాళ్ళతో = కీచురాయి కీటకాల శబ్దాలతో
తద్దయు జోల = మంచి జోల పాటలను
పాడిన విధమ్మునన్ = పాడిన తీరుగా
ఊగు = ఊగుతున్న
తరంగ డోలికన్ = అలలు అనే ఉయ్యాలలో
ముద్దుగ = ముద్దుగొలిపే విధంగా
ప్రపుల్ల = ప్రకాశవంతమైన
శరత్తుల = శరత్కాలంలోని వెన్నెలలో
మాతృమూర్తివై = తల్లిలాగ మారి
నిద్రపుచ్చెదు = నిద్రపుచ్చుతున్నావు

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

అలతులు శ్రావ్యమౌ పలుకు లందము చిందగ రంగు దిద్దిన
ట్టులు తమరెక్క లొప్ప నుదుటుం గొని సచ్ఛకునాళిఁ జూపి మా
పొలముల క్రొత్తగింజల బుభుక్షల బాసెడు పాలపిట్ట జం
టలఁ గనుగొంచు ముందుకు హుటాహుటి సాగుము రమ్యవాహినీ !

రమ్యవాహినీ ! = అందంగా ప్రవహించేదానా!, దుందుభి !
అలతులు = అతి కానివి, చిన్నవి
శ్రావ్యము + ఔ = వినడానికి బాగున్న, విన సొంపైన
పలుకుల = మాటలతో
అందము చిందగ = అందం ఏర్పడగా
రంగు దిద్దినట్టులు = రంగులు వేసినట్లు
తమరెక్కలు + ఒప్ప = తమ రెక్కలు ప్రకాశించగా
ఉదుటుం గొని = గర్వంతో
సత్ + శకున + ఆళిన్ = మంచి శకునాల సమూహాన్ని
చూపి = చూపించి
మా పొలముల = మా పొలాలలోని
క్రొత్తగింజల = కొత్తగా పండిన పంట గింజలను
బుభుక్షల బాసెడు = ఆకలిని తీర్చుకునే
పాలపిట్ట జంటలన్ = పాలపిట్టల జంటలను
కనుగొంచు = చూస్తూ
హుటాహుటి = హడావిడిగా
ముందుకు = ముందు వైపు
సాగుము = సాగిపొమ్ము

అందంగా ప్రవహించే ఓ దుందుభి! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

దుందుభి Summary in Telugu

(‘దుందుభి ‘ కావ్యంలోనిది)

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు దేని నుండి : దుందుభి
గ్రహింపబడినది : ‘దుందుభి’ కావ్యము నుండి గ్రహింపబడింది.
కవి పేరు : గంగాపురం హనుమచ్ఛర్మ
కాలం : జననం : 1925 మరణం : ఆగష్టు 15, 1996
స్వస్థలం : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు (జన్మస్థలం: వేపూరు)
తల్లిదండ్రులు : సీతమ్మ, రామకిష్టయ్య
చదువు : సంస్కృతాంధ్రసాహిత్యం, వ్యాకరణం, అలంకారశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఋగ్వేదాన్ని నేర్చుకోవడమేగాక తర్వాత కాలంలో నృసింహ దీక్షితులతో కలిసి “ఋగ్వేద విజ్ఞానం” రచించాడు.
విశేషతలు : స్వాతంత్రోద్యమం, భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన స్వగ్రామంతోపాటు కల్వకుర్తి తాలూకాలో అనేక గ్రామాల్లో విద్యార్థుల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషిచేశాడు. అన్ని కులాల వారి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు ఇతర పౌరోహిత కార్యక్రమాలు హనుమచ్ఛర్మ చేస్తుంటే అందరూ ఆ కాలంలో వింతగా చూసేవారు. అది అతనిలోని సామాజిక సమరసతకు నిదర్శనం. హనుమచ్ఛర్మకు బాల్యంనుంచి కవిత్వంపై కూడా ఆసక్తి ఎక్కువ.
రచనలు : హనుమచ్ఛర్మ ‘దుందుభి’ కావ్యం ముద్రితంకాగా మల్కిభరాముడు, గోపన, గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అముద్రితాలు.

పాఠ్యభాగ సందర్భం

పూర్వ పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా జీవనాధారం దుందుభి నది. ఈ నది షాబాద్ కొండల్లో పుట్టి డిండి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. హనుమచ్ఛర్మ ఈ నదిని చూసి ఉప్పొంగి కవిత్వం రాశాడు. దుందుభిలా సాగిన హనుమచ్ఛర్మ పద్య ధార శ్రావ్యంగా ఉంటుంది. దుందుభి అందచందాలను, విశిష్టతను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

ఓ దుందుభి ! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది. మా అమ్మ వంటి దుందుభి ! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ? కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు.

అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా ? తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు.

నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి. భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం)

పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా !

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహరం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను. అందంగా ప్రవహించే ఓ దుందుభి ! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగిపోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం)

ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా ! ఓ దుందుభి ! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్ట లేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా ! దుందుభి !

Leave a Comment