Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar స్థూల అవగాహన Questions and Answers.
TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన
విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా చేర్చడం జరిగింది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. అయితే ఆ చదివే విధానం పాఠకుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఒక గంటలో పేజీలు పేజీలు తిప్పివేస్తారు. మరికొందరు ఎక్కువ సమయాన్ని తీసుకుని తక్కువ పేజీలు చదువుతారు. ఇది వారి వారి నైపుణ్యాలను బట్టి వుంటుందని గమనించాలి.
ఐతే, విద్యార్థులు పుస్తక పఠనంలో అనేక మెలకువలను పాటించాలి. ప్రధానంగా మనం చదివే విషయం మీద దృష్టి సారించాలి. మనం చదివే ‘పేరా’లో ఏ అంశం గురించి ప్రస్తావిస్తున్నారో గమనించాలి. అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలను క్రమపద్ధతిలో గుర్తుంచుకోవాలి.
అలా చేసినపుడు మనకు విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. అవగాహన లేకుండా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం శూన్యం. కాబట్టి విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాలను పరీక్షించడానికి చిన్నచిన్న పేరాలను విషయ ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేసుకొని వారిచేత చదివించాలి. ఆ తర్వాత దానిని వారెంత వరకు అర్థం చేసుకున్నారో తెల్సుకోవడం కోసం చిన్నచిన్న ప్రశ్నలు అడగాలి.
దానిని బట్టి విద్యార్థుల అవగాహనా సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ దృష్టితో ఇంటర్ విద్యార్థులకు ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా సిలబస్లో చేర్చడం జరిగింది.
1. కథానిక
ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది. ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం.
ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.
ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.
ప్రశ్నలు
ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది
ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో
ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలన్పో
ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి
ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి
2. నవల
ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన ప్రక్రియ నవల. ఆంగ్లంలో ‘Novel’ అనే పదంనుండి ‘నవల’ పుట్టింది. అయితే నవల పదానికి మూలం సంస్కృతంలో కనిపిస్తుందని కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి ‘నవాన్ విశేషాలాతి గృష్ణాతీతి నవలా’ అంటూ ‘కొత్త విశేషాలు తెలిపేది నవల’గా నిర్వచించాడు. 1872 కాలంలో నవలను ‘వచన ప్రబంధము’ అనే పేరుతో పిలుచుకున్నారు. దీనికి సమర్ధనగా కందుకూరి వీరేశలింగం ‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని’ అని ప్రకటించుకున్నాడు.
‘తెలుగులో తొలి నవల ఏది?” అనే విషయంలో పరిశోధకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 1872లో గోపాలకృష్ణమశెట్టి ‘శ్రీరంగరాజ చరిత్రము’ నవల వెలువడింది.’ ‘శ్రీరంగరాజ చరిత్రము’లో నవలా లక్షణములు లేవనే అభిప్రాయాలతో ‘రాజశేఖర చరిత్ర’నే తొలి నవలగా అందరూ అంగీకరించారు. ఈ నవలకు ‘వివేకచంద్రిక’ అనే మరో పేరు ఉంది. ఇది ఆంగ్లంలో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ అనే ప్రసిద్ధ నవలకు అనుకరణ.
రచనా కాలంలోని ‘వాస్తవికాలనే జీవితాచార వ్యవహారాలను చిత్రించేది నవల’ అని ‘తెలుగు నవలా పరిణామం’ గ్రంథంలో బొడ్డపాటి కుటుంబరావు, ‘వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల’ అని ఆర్.ఎస్. సుదర్శనం నిర్వచించారు. కథ సంఘటన చుట్టు తిరిగితే, నవల అనేక జీవితాల చుట్టు తిరుగుతుంది.
కథకు సంక్షిప్తత ప్రాణమయితే, నవల విస్తృతమైన వివరణలతో నడుస్తుంది. కథ, కథావస్తువు, ఇతివృత్త నిర్వహణ, పాత్రలు, పాత్రోచిత సంభాషణలు, సంఘటనలు, సన్నివేశం, నేపథ్య చిత్రణ, మంచి ఎత్తుగడ, అర్థవంతమైన ముగింపు మొదలైన లక్షణాలతో, పద్ధతులతో నవల పఠితల్ని ఆకర్షితుల్ని చేస్తుంది.
ప్రశ్నలు
ప్రశ్న 1.
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి నవలను ఏవిధంగా నిర్వచించాడు?
జవాబు:
విద్యావాన్ విశేషాన్వాతి గృష్ణాతీతి నవలా అంటూ కొత్త విశేషాలు తెలిసేది నవలగా నిర్వచించారు.
ప్రశ్న 2.
‘మొదటి వచన ప్రబంధము నేనే రాసానని’ ఎవరన్నారు?
జవాబు:
కందుకూరి విరేశలింగం
ప్రశ్న 3.
తెలుగులో తొలి నవల ఏది?
జవాబు:
రాజశేఖర్ చరిత్ర
ప్రశ్న 4.
‘తెలుగు నవలా పరిణామం ‘ గ్రంథకర్త ఎవరు?
జవాబు:
ఆర్.ఎస్ సుదర్శనం’
ప్రశ్న 5.
నవల దేనిచుట్టూ తిరుగుతుంది.
జవాబు:
అనేక జీవితాల
3 స్థూల అవగాహన
సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది.
1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం. సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివి వుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.
‘ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.
కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.
ప్రశ్నలు
ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది?
జవాబు:
మంజరీ మధుకరీయము
ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు
ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు?
జవాబు:
వ్యవహారధర్మబోధిని
ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం
ప్రశ్న 5.
‘కనకతార’ నాటకకర్త ఎవరు?
జవాబు:
చందాల కేశవదాసు
4. వచన కవిత
కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న. కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది.
వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు. వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది.
వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.
వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.
ప్రశ్నలు
ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు
ప్రశ్న 2.
శిష్టా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి?
జవాబు:
ప్రహ్లాద కవిత
ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు ఎవరు?
జవాబు:
కందుర్తి
ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’
ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు
5. లఘు కవితా ప్రక్రియలు
వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, హైకూ, నానీల ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది. పదిపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం.
మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలు పెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా|| సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు. జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’.
హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది. హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది. తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు రాసినవారే ఎక్కువ.
నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు’ అని అర్థం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు. నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.
కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం.
ప్రశ్నలు
ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి ఎవరు?
జవాబు:
ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు?
జవాబు:
ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:
ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:
ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి?
జవాబు: