TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి. (V.Imp) (M.P)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధలో నీతులను వివరించాడు. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని సారెమీద, కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పగలగా కొన్ని మాత్రమే మంచిగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి.

అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిపై మోక్షాన్ని పొందుతారు. కోపంతో మానవత్వం పోతుంది. కోపం నష్టపరుస్తుంది, పాపం పెరిగేలా చేస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని చెప్పాడు.

డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కాని పేదవారి గుర్తించరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చలిచీమలు కూడా పామును చంపుతాయి. కాబట్టి ఎదుటి వారి ముందు గొప్పలు చెప్పుకోవద్దు. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు.

సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్తులు, కులం, అధికారం, సంసారం ఇలా అనేక విషయాలపై మోహంతో భక్తి లేక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

వేదాలు తెలిసిన వేమన తాతలాంటి వాడు. సురలను ఆనందింపచేసే సుమతి శతక కర్త బద్దెన పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం తండ్రి లాంటి వారు. ఈశ్వరమ్మ అక్క లాంటిది. సిద్ధప్ప అన్న వంటి వాడు. కాళిదాసు మా చిన్నన్న. అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. వారిలాగా లోక కళ్యాణం కోసం జీవించాలి.

నాలుక తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు.

చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుందని సిద్దప్ప నీతులను చెప్పాడు.

ప్రశ్న 2.
జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి. (V. Imp)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధను రచించాడు. దీనిలో మానవులకు కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. కుమ్మరి చేసిన కుండలన్ని ఎలా అయితే పనికిరావో అలానే మానవులు అందరూ మోక్షాన్ని పొందలేరని చెప్పాడు. కేవలం మర్యాదతో మంచి పనులు చేసినవారే మోక్షాన్ని పొందుతారు.

కోపం వల్ల డబ్బు, పరువు, ఆరోగ్యం అన్ని నశిస్తాయి. కోపం కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని హితవు పలికాడు. ఏళ్ల కాలం ఒక్క తీరుగా గడవదు. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోకూడదనే సందేశాన్ని ఇచ్చాడు.

కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్థులు శాశ్వతమని భావించరాదు.

ప్రజలు సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ గర్వాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉంటే ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారని హెచ్చరించాడు.

వేమన, బద్దెన, వీరబ్రహ్మంగారు, ఈశ్వరమ్మ, సిద్ధప్ప, కాళిదాసు, అమరసింహుడు, యాగంటి మొదలైన మహానుభావులు కవికి ఆత్మ బంధువుల వంటివారని చెప్పడం ద్వారా వారిలాగా ప్రజల మేలు కొరకు జీవించాలని సూచించాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న -పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు.

తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారని సందేశాన్ని ఇచ్చాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
జవాబు:
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.

ప్రశ్న 2.
బుద్ధిమంతులు ఎలా ఉంటారు ?
జవాబు:
డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్కపీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబటి బుద్ధిమంతులు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

ప్రశ్న 3.
సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు ?
జవాబు:
వరకవి సిద్ధప్ప వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు అని చెప్పాడు. వీరందరూ వరకవి సిద్దప్పకు ఆదర్శప్రాయులని సూచించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

ప్రశ్న 4.
శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు ?
జవాబు:
నాలుక నాకు తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అన్నాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని కవి భావం.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు (V. Imp) (Model Paper)

ప్రశ్న 1.
వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు ?
జవాబు:
జూలై 9, 1903

ప్రశ్న 2.
వరకవి సిద్ధప్పకు ఏయే విద్యలలో ప్రావీణ్యం ఉన్నది?
జవాబు:
జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు యోగ విద్యల్లో

ప్రశ్న 3.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి

ప్రశ్న 4.
ఒక్కరీతిగా నడవనిది ఏది ?
జవాబు:
కాలం

ప్రశ్న 5.
బతుకమ్మలాగ నీటిలో మునిగి ముగిసేది ఏది ?
జవాబు:
తొమ్మిది రంధ్రాల మానవ శరీరం

ప్రశ్న 6.
చేప దేనిని మింగుతుంది ?
జవాబు:
గాలాన్ని

ప్రశ్న 7.
సుఖదుఃఖాలను ఒకే విధంగా చూసేదెవరు ?
జవాబు:
సుజ్ఞానులు

ప్రశ్న 8.
వెళ్ళిపోయేనాడు వెంటరానిది ఏమిటి ?
జవాబు:
ఒక కాసు కూడా రాదు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. ఐక్యమయ్యెదరు నిటులు అవని విడిచి ★(Imp)

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సాకెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : దైవంలో ఐక్యమవుతారని అర్థం

వివరణ : కుమ్మరి చేసిన కుండలన్నీ ఉపయోగపడనట్లే మానవులందరూ మోక్షాన్ని పొందలేరని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2. కోపము నరుని సాంతము కూల్చునిలను

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని వరకవి చెప్పిన సందర్భంలోనిది. (కాబట్టి)

అర్థం : కోపం మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని అర్థం.

వివరణ : కోపానికి దూరం ఉండాలని భావం.

3. నాలుకయు మాకు నిలవేల్పునాది శక్తి

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : నాలుక తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అని వరకవి సిద్దప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : నాలుక మాకు ఇంటి దేవత అయిన ఆదిశక్తితో సమానం అని అర్థం.

వివరణ : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం.

4. గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చునని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : గురువును మనస్సులో నిలిపితే మనకు గుర్తింపు వస్తుందని అర్థం.

వివరణ : గురువును నమ్ముకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసి పేరు పొందవచ్చునని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

సీ ||
కుమ్మరాతడు జేయు కుండలు నవికొన్ని
చేయుచుండగ బోవు చేతిలోన
కొన్ని సానముమీద కొన్ని చాటునబోవు
కాలి నావము కొన్ని కూలిపోవు
కొన్ని క్షేమము బొంది కొన్నాళ్లకును బోవు
కొన్ని భిన్నములయ్యి కొంతబోవు
కొన్ని యుర్విలొ బోవు కొన్ని వనమున బోవు
కొన్ని మృతికి బోవు కొరివి నుండి
తే.గీ॥ మానవులు మరియాదతో మంచిరీతి
ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా!(సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కుమ్మరి + అతడు = కుండలు చేసే వారు
చేయు కుండలున్ + అవి = చేసే కుండలలో
కొన్ని సానముమీద = కొన్ని కుండలు చేసే సారె (సానె) మీద
కొన్ని = కొన్ని
చేయుచుండగన్ = = తయారు చేస్తుండగానే
చేతిలోన పోవు = చేతిలోనే
కొన్ని చాటునబోవు = కొన్ని తెలియకుండా పగిలి పోతాయి
కాలిన + ఆవము = కాల్చే ఆవము (బట్టి) లో
కొన్ని కూలిపోవు = కొన్ని పగిలి పోతాయి
కొన్ని క్షేమము బొంది = కొన్ని మంచిగా తయారై
కొన్నాళ్లకు బోవు = కొన్ని రోజులు ఉండి
కొన్ని భిన్నములయ్యి = కొన్ని పగిలిపోయి
కొంతబోవు = కొన్ని పగిలిపోతాయి
కొన్ని యుర్విలొ బోవు = కొన్ని నేలపై పడి పగిలి పోవును
కొన్ని వనమున బోవు = కొన్ని నీటిలో పగిలి పోతాయి
కొరివి నుండి = తల కొరివి పెట్టినప్పుడు
కొన్ని మృతికి బోవు = కొన్ని పగిలిపోతాయి.
మానవులు = మనుషులు
మరియాదతో = మర్యాదపూర్వకంగా
మంచిరీతి = మంచి రీతితో
ఇటల = ఈ విధంగా
అవని = భూమిని
విడిచి = వదిలిపెట్టి
ఐక్యమయ్యెదరు = కలిసిపోతారు (మోక్షం పొందుతారు)

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సారెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. కొన్ని భూమిపై పడిముక్కలై పోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారు. (మంచి పనుల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని భావం).

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2వ పద్యం :

సీ|| కోపంబుచే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబు ననె నిందగూడవచ్చు
కోపంబు తనచావు కొంచెంబు నెరగదు
కోపంబు మిత్రులన్ కొంచపరచు
కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగాకొరివియగును.
తే.గీ॥ కోపము నరుని సాంతము కూల్చునిలను
లేదు వెదికిన యిటువంటి చేదుఫలము
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కోపంబుచే = కోపంతో
నరుల్ = మానవుల
క్రూర + ఆత్ములగుదురు = మానవత్వ౦ లేని వారుగా మారుతారు
కోపంబు = కోపమే
మనుషుల = మానవుల
కొంప ముంచు(జాతీయం) = కొంపలు ముంచుతుంది, నష్టపరుస్తుంది
కోపంబు వలననె = కోపం వల్ల
పాపంబులును హెచ్చు = పాపాలు పెరుగుతాయి
కోపంబుననే = కోపంతోనే
నింద గూడవచ్చు = నిందలు కూడా వస్తాయి
కోపంబు = కోపం
తన చావున్ = తన చావును
కొంచెంబున్ + ఎరుగదు = కొంచెం కూడా ఎరుగదు
కోపంబు = కోపం
మిత్రులన్ = స్నేహితులను
కొంపరచు = తగ్గిస్తుంది (అవమాన పరుస్తుంది)
కోపంబు హెచ్చినన్ = కోపం పెరిగితే
శాపంబులున్ వచ్చు = శాపాలు వస్తాయి
కోపంబు జూడగా = చూస్తుండగానే కోపం
కొరివియగును = పెద్ద ఆపదగా మారుతుంది
కోపము = కోపం
నరుని = మానవులను
సాంతము కూల్చున్ = పూర్తిగా నాశనం చేస్తుంది
ఇలను = భూమిపై
లేదు వెదికిన = వెతికినా దొరకదు
యిటువంటి = దీనివంటి
చేదుఫలము (జాతీయం) – చేదుగా ఉండే ఫలం, చెడు చేసేది

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది. (అవమానపరుస్తుంది.) కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుంది. (కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.)

3వ పద్యం :

సీ||
విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు
పేదవారికియరు పీటచెక్క
కాలంబు నొకరీతి గడవ దెల్లప్పుడు
యేనుగు దోమచే యెత్తబడద
నేనే బలియుడని నిక్కుచునుంటేమి
చలిచీమలు ఫణుల జంపలేద
నిడివి పొడవు దొడ్డు నెట్టగ నుంటేమి
గొడ్డలిచే మాను కోలుపోద
తే.గీ॥ బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన
వారు పదిమందిలో ప్రజ్ఞ బలుకబోరు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్దప్ప రాసిన కవిత్వమును)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
విత్తంబు గలవారికి = డబ్బు ఉన్న వారికి
ఇత్తురే కుర్చీలు = కుర్చీలను ఇస్తారు
పేదవారికి = డబ్బు లేని పేదవారికి
పీటచెక్క = చెక్క పీట కూడా ఇవ్వరు
ఇయర = ఇవ్వరు
కాలంబున్ = సమయమంతా
ఒకరీతి = ఒకే విధంగా
గడవదు + ఎల్లప్పుడు = ఎప్పటికి నడవదు
యేనుగు = ఏనుగు
దోమచే = దోమతో
యెత్తబడద = ఎత్త బడుతుంది
నేనే బలియుడన్ + అని = నేనే బలవంతుణ్ణి అని
నిక్కుచునుంటే + ఏమి = గర్వాన్ని ప్రదర్శిస్తే ఏం లాభం
చలిచీమలు = చిన్న చీమలు కూడా
ఫణుల = పాములను
జంపలేద = చంపాయి కదా
నిడివి పొడవు = ఎత్తు, పొడువు
దొడ్దున్ = లావు
ఎఱ్ఱగన్ = మంచి రంగు
ఉంటేమి = ఉన్నా కాని
గొడ్డలిచే = గొడ్డలితో
మాను = చెట్టు
కోలుపోద = ప్రాణం పోతుంది కదా
బుద్ధిమంతులు = తెలివి గలవారు
పుణ్యంపు = పుణ్యం సంపాదించుకున్న
పురుషులు +అయినవారు = మానవులు
పదిమందిలో = అందరి ఎదురుగా
ప్రజ్ఞ = తమ తెలివిని
బలకబోర = చెప్పుకోరు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్క పీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

4వ పద్యం :

సీ|| నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప
బతుకమ్మవలె నీళ్ళబడును యెపుడొ
యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలును బాడి
పొయ్యెద రొకరోజు శయ్యమీద
తల్లి యెవ్వరు తండ్రి తన బాంధవులెవరు
మళ్ళి జూడక నరుల్ మరుతురయ్య
వెళ్ళిపోయెడినాడు వెంట రాదొక కాసు
కల్ల సంసారంబు గానలేక
తే.గీ॥ పప్పు దినబోయి చిక్కాన బడిన యెలుక
విధము నర్ధంబు చేకూర్చు వివిధ గతుల
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
వివాహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
విహితుడు + అప్ప = బంగారం వంటి
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
నమ్మరాదు + ఈ ఘటము = కుండ వంటి ఈ శరీరాన్ని నమ్మరాదు
నవరంధ్రముల కొంప = తొమ్మిది రంధ్రాలతో ఉన్న ఇల్లు
బతుకమ్మవలె = బతుకమ్మ లాగ
యెపుడొ = ఎప్పుడైనా
నీళ్ళబడును = నీటిలో పడుతుంది
యుర్విలోన్ + ఉన్నాళ్ళు = భూమిపై జీవించినంతకాలం
ఉయ్యాలలును బాడి = ఊయల పాటలు పాడి
శయ్యమీద = మరణ శయ్యపై, పాడెపై
పొయ్యెదరు + ఒకరోజు = ఒకరోజు వెళ్లిపోతారు
తల్లి = కన్నతల్లి
తండ్రి = కన్న తండ్రి
యెవ్వరు = ఎవరు కూడా
తన బాంధవులెవరు = బంధువులు, చుట్టాలు ఎవరూ
మళ్ళి జూడక = తిరిగి చూడరు
నరుల్ = మనుషులు
మారుతురయ్య = మర్చిపోతారు
వెళ్ళిపోయెడినాడు = కాటికి వెళ్ళే రోజు
ఒక్క కాసు = ఒక్క కాసు కూడా
వెంట రాదు = తన వెంబడి రాదు
కల్ల సంసారంబు = సంసారం అంతా అబద్ధమని
గానలేక = తెలియక
పప్పు దినబోయి = పప్పును తినడానికి వెళ్లి
చిక్కాన బడిన = బోనులో చిక్కిన
యెలుక విధమున్ = ఎలుక లాగ
వివిధ గతుల = అనేక రకాలుగా
అర్ధంబు చేకూర్చు = (ఈ శరీరం) డబ్బును సంపాదిస్తుంది.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాని భూమిపై ఉన్నంతకాలం ఊయల పాటలు పాడి ఏదో ఒకరోజు మరణశయ్యపై వెళ్ళిపోతుంది. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసు కూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

5వ పద్యం :

ఎత్తుమేడలు యిండ్లు యిరువైన సంపదల్
నిత్యమని జనులు నిహమునందు
మమకార మొదలక మదిలొ సద్గురువుని
గనలేక సంసార కాంక్ష విడక
కూటిగుడ్డకు మర్గి కులము నెక్కువ యంచు
యెత్తు పై గూర్చుండు హెచ్చునరులు
భక్తి హీనతగాను పావన భవులయ్యి
మీనంబు గాలమున్ మ్రింగు విధము
తే.గీ॥ మానవులు మాయసంసార మగ్నులగుచు
చిక్కెదరెముని చేతిలో చింతపడుచు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎత్తుమేడలు = ఎత్తైన భవనాలు
యిండ్లు = ఇళ్ళు
యిరువైన సంపదల్ = స్థిరాస్తులు
నిత్యమని = శాశ్వతమని
జనులున్ = ప్రజలు
ఇహమునందు = భూమిపై
మమకారము + ఒదలక = ఇష్టాన్ని వదులుకోలేక
మదిలొ = మనసులో
సద్గురువుని = మంచి గురువును
గనక = చూడక, దర్శించక
సంసార కాంక్ష = సంసారంపై గల కోరిక
విడక = వదలక
కూటిగుడ్డకు = తిండికి, బట్టలకు
మర్గి (మరిగి) = అలవాటు పడి
కులము నెక్కువ యంచు = మా కులమే గొప్పది అని
హెచ్చునరులు = గర్వంతో ఉన్న నరులు
యెత్తు పై గూర్చుండు = ఎత్తులపై కూర్చొంటారు
భక్తి హీనతగాను = భక్తి లేని కారణంగా
పావన భవులయ్యి = మంచి జన్మ ఎత్తి కూడా
మీనంబు = చేప
గాలమున్ = గాలాన్ని
మ్రింగు విధము = మింగిన తీరుగా
మానవులు = మనుషులు
మాయసంసార = సంసారమనే మాయలో
మగ్నులగుచు = మునిగి
యముని చేతిలో = యమధర్మరాజు చేతికి
చింతపడుచు = బాధపడుతూ
చిక్కెదరు = చిక్కుకుంటారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎత్తైన భవనాలు, ఇళ్ళు, స్థిరమైన ఆస్థులు శాశ్వతమని భావించి ప్రజలు ఈ భూమిపై ఇష్టాన్ని వదులుకోలేక, మనసులోనైన మంచి గురువును దర్శించక, సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ, ఎత్తైన ఆసనాలపై కూర్చుంటారు. భక్తి లేని కారణంగా ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

6వ పద్యం :

సీ|| వేమన్న మా తాత వేదవేద్యులు మాకు
సుమతి మా పెదతల్లి సురవినోది
వీరబ్రహ్మముగారు వినుడి నా జనకుండు
నింపుగా మాయక్క ఈశ్వరమ్మ
ననువుగా సిధ్ధప్ప నన్న గావలె నాకు
కడగొట్టు మాయన్న కాళిదాసు
అమరసింహుడు మాకు నాత్మబంధువులౌను
యాగంటివారు మాయన్న గారు
తే.గీ॥ ఆత్మబంధువులండి మా కంత వీరు
చచ్చిన బ్రతికియున్నారు జగతి యందు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
వేదవేద్యులు = వేదాలు తెలిసిన
వేమన్న = వేమన శతకకర్త
మా తాత = మాకు తాత వంటి వాడు
సురవినోది = సురలకు వినోదాన్ని కలిగించే వాడు
సుమతి = సుమతి శతకకర్త బద్దెన
మా పెదతల్లి = మా పెద్ద అమ్మ వంటి వాడు
వీరబ్రహ్మముగారు = కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు
వినుడి = వినండి
నా జనకుండును = నాకు తండ్రి వంటి వారు
ఇంపుగా = ఇష్టంతో
మా + అక్క = అక్కలాంటిది
ఈశ్వరమ్మ = ఈశ్వరమ్మ
అనువుగా = అనుకూలంగా
సిద్ధప్ప = బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధప్ప
అన్న గావలె నాకు = అన్న లాంటి వాడు
కడగొట్టు = చిన్న
మా + అన్న = అన్న
కాళిదాసు = సంస్కృత కవి కాళిదాసు
అమరసింహుడు = అమర కోశం రాసిన
మాకున్ = అమర సింహుడు మాకు
ఆత్మ బంధువులౌను = ఆత్మ బంధువుల వంటి వారు
యాగంటివారు = యాగంటి అనే గొప్ప వారు
మా + అన్న గారు = అన్న వంటి వారు
మాకు అంత = వీరందరూ మాకు
ఆత్మబంధువులండి = ఆత్మ బంధువులు
వీరు = పైన చెప్పిన వారందరూ
చచ్చిన = చనిపోయి కూడా
జగతి యందు = ఈ భూమిపై
బ్రతికియున్నారు = (ప్రజల హృదయాలలో) జీవించే ఉన్నారు.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. (వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని అర్థం)

7వ పద్యం :

సీ|| జిహ్వయే మాతండ్రి జీవేశ్వరుడు మాకు
కాళ్ళు మా కల్లుండ్రు గానవినుడి
హస్తంబులును రెండు నాత్మబంధువులైరి
కడుపు నా పెదతండ్రి, కొడుకు నరయ
నయనంబులును రెండు నా మాతృ ననుజులు
చెవులు సోదరులును శ్రవణపరులు
ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త
నడుము నా పెదమామ నడిపికొడుకు
తే.గీ॥ పండ్లు మా యింటి చుట్టాలు భక్తవరులు
నాలుకయు మాకు నిలవేల్పు నాదిశక్తి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవా
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
జిహ్వయే = నాలుకయే
మాతండ్రి = మా తండ్రి లాంటి
జీవేశ్వరుడు = జీవానికి ఆధారం అయిన దైవం
మాకు కాళ్ళు = మా కాళ్ళు
మాకు + అల్లుండ్రు = అల్లుళ్ల వంటివి
గానవినుడి = కావున వినండి
హస్తంబులును రెండు = రెండు చేతులు
ఆత్మ బంధువులైరి = ఆత్మ బంధువుల వంటివి
కడుపు = కడుపు
నా పెదతండ్రి కొడుకు = పెద నాన్న కొడుకు
అరయ = చూడగా
నయనంబులును రెండు = రెండు కళ్ళు
నా మాతృ అనుజులు = నా కన్నా తల్లి అన్నతమ్ములు (మేన -మామలు)
శ్రవణ పరులు చెవులు = వినడానికి ఉపయోగపడే చెవులేమో
సోదరులును = అన్నదమ్ములు
ముక్కు నా ప్రియురాలు = ముక్కు ప్రియురాలు
ముఖము నా మేనత్త = ముఖం మేనత్త (తండ్రి సోదరి)
నడుము = నడుమేమో
నా పెదమామ = పెద్దమామ నడిమి
నడిపికొడుకు = కొడుకు
పండ్లు మా యింటి చుట్టాలు = పండ్లేమో చుట్టాలు
భక్తవరులు = భక్తులు
నాలుకయు మాకున్ = నాకున్న నాలుక
ఇలవేల్పు = ఇంటి దేవత
ఆదిశక్తి = ఆదిశక్తి

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. నాలుక నాకు తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

8వ పద్యం :

సీ|| చేదు ఆన్గపుకాయ చేతిలో చేకొని
గంగ స్నానము చేసి గనుడిచేదు
పోదు తీపికిరాదు బుర్రకాయ విధము
మునిగి తేలిన పోదు మూర్ఖతనము
నదులెల్ల దిరిగియు నేమముల్ బట్టినా
పదవి జేరుట యెట్లు పాపినరుడు
వెదురు బద్దలు కుక్క వాలంబునకు వేసి
గుంజికట్టిన దాని గుణముబోదు
తే.గీ॥ జ్ఞానహీనుల కెప్పుడు గ్రంథ మెచ్చి
జ్ఞానులను జేయువాడెపో జ్ఞానుడతడు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి.
చేదు ఆన్గపుకాయ = చేదుగా ఉన్న ఆనగపుకాయ (సొరకాయ)
చేదుపోదు = ఉన్న చెడు పోదు
తీపికిరాదు = లేని తీపి రాదు
బుర్రకాయ విధము = ఆ సొరకాయ లాగ
మునిగి తేలిన = (గంగలో) మునిగి తేలితే
మూర్ఖతనము పోదు = మూర్కత్వం పోదు
నదులెల్ల = అన్ని నదుల దగ్గరికి
దిరిగియు = వెళ్ళినా.
నేమముల్ బట్టినా = నియమాలు (వ్రతాలు) పట్టినా
పాపినరుడు = పాపం గల మానవుడు
పదవి జేరుట యెట్లు = మోక్ష పదవిని ఎలా చేరగలడు
వెదురు బద్దలు = వెదురు కర్రలతో
కుక్క, వాలంబునకు = కుక్క తోకకు
వేసి గుంజికట్టిన = గట్టిగా లాగి కట్టినా
దాని గుణముబోదు = దాని (వంకర) గుణం పోదు
జ్ఞానహీనులకు = జ్ఞానం లేని వారికి
ఎప్పుడు = ఎప్పుడైనా
గ్రంథ మిచ్చి = పుస్తకాన్ని ఇచ్చి
జ్ఞానులను = జ్ఞానవంతులుగా చేసేవాడే
చేయువాడెపో = చేసేవాడు
జ్ఞానుడతడు = నిజమైన జ్ఞానవంతుడు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

9వ పద్యం :

సీ|| ప్రాణముల్ బిగబట్టి పైకి లేవగవచ్చు
ఘడియకో వేషంబు గట్టవచ్చు
అన్నహారములేక అడవి తిరగవచ్చు
తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
కప్పలా చెరువులొ గడగి తేలగవచ్చు
బలువుగా వెయినాళ్ళు బ్రతుకవచ్చు
వూరూరు తిరుగుచు ఉపమివ్వగావచ్చు
కపటవృత్తుల మనసు గరపవచ్చు
తే.గీ॥ ధరణిలో వేషముల్ చాల దాల్చవచ్చు
గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు
వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ప్రాణముల్ = ప్రాణాలు (ఊపిరి)
బిగబట్టి = ఆపి
పైకి లేవగవచ్చు = పైకి లేవవచ్చు
ఘడియకో = సమయాన్ని సూచించే పదం
వేషంబు = వేషాలు
కట్టవచ్చు = వేయవచ్చు
అన్న హారములేక = అన్నము ఆహారము లేకుండా
అడవి తిరగవచ్చు = అడవిలో తిరగవచ్చు
తిన్నగా = సరిగ్గా
జపమాల = జపమాలను
ద్రిప్పవచ్చు = తిప్పవచ్చు
కప్పలా = కప్పలాగ
చెరువులో = చెరువులో
కడగి = ప్రయత్న పూర్వకంగా
తేలగవచ్చు = నీళ్ళలో తేలవచ్చు
బలువుగా = బలంగా
వెయినాళ్ళు = వెయ్యి సంవత్సరాలు
బ్రతుకవచ్చు = బతికి ఉండవచ్చు
వూరూరు తిరుగుచు = ప్రతీ గ్రామం తిరిగి
ఉపమివ్వగావచ్చు = ఉపన్యాసం ఇవ్వవచ్చు
కపటవృత్తుల మనసు = మోసపూరిత మనస్సు కలిగిన వారిని
గరపవచ్చు = మార్చవచ్చు
ధరణిలో = భూమిపై
వేషముల్ చాల దాల్చవచ్చు = ఎన్నో వేషాలు వేయవచ్చు
గురుని = గురువు
మదిలోన = మనస్సులో
నిల్పుటన్ = నిలిపితే
గుర్తు = పేరు, ప్రతిష్ఠ
వచ్చు = వస్తుంది.

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్దప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతక వచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

10వ పద్యం :

సీ||
ఎవరు తనాత్మను యేకంబుగా జేసి
సర్వభూతాలని సమము జూచి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము దానతపములన్
చేయుచుండిన ముక్తి చెందగలరు
తామరాకులు నీళ్ళ దడువకుండిన యట్లు
నుందురు సుజ్ఞానులుర్విలోన
నలసియుందురు చూడకళలేని విధముగ
గానవత్తురుధవ కాంతిబొందు
తే.గీ॥ నొకరి దూషించి భూషింపరొకరి నెపుడు
సుఖము దుఃఖమొక పదము జూతురయ్య
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎవరు = ఎవరైతే
తన + ఆత్మను = తన ఆత్మను
యేకంబుగా జేసి = పరమాత్మతో సమానంగా చేసి
సర్వభూతాలని = అన్ని జీవులను
సమము జూచి = సమానంగా చూసి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము = జ్ఞానము, వైరాగ్యము అనే యజ్ఞం
దాన, తపములన్ = దానాలు తపస్సులు
చేయుచుండిన = చేస్తే
ముక్తి చెందగలరు = మోక్షాన్ని పొందుతారు
తామరాకులు = తామర ఆకులు
నీళ్ళ = నీటిలో
తడువకుండిన యట్లు = తడవకుండా ఉన్నట్లు
ఉందురు = ఉంటారు
సుజ్ఞానులు + ఉర్విలోన = భూమిపై జ్ఞానం ఉన్నవారు
అలసి యుందురు = అలసిపోయి ఉంటారు.
చూడ = చూస్తే
కళలేని విధముగ = మొఖంలో కళ లేకుండా
గానవత్తురు = కనిపిస్తారు
అధవ = తరువాత
కాంతిబొందు = కాంతి వస్తుంది
నొకరి దూషించి = ఒకరిని తిట్టి
భూషింపరు + ఒకరిని = మరొకరిని మెచ్చుకోరు
ఎపుడు = ఎల్లప్పుడు
సుఖము = సుఖాన్ని
దుఃఖము = దుఃఖాన్ని
ఒక పదము = ఒకే విధంగా
చూతురయ్య = చూస్తారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారు.

జ్ఞానబోధ Summary in Telugu

(సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథ౦ నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ 1

* కవి పరిచయం *

పాఠ్యాంశం పేరు : జ్ఞానబోధ
కవి పేరు : “వరకవి సిద్ధప్ప
ఇది దేని నుండి గ్రహించబడినది : ఈ పాఠ్యభాగము సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథములో నుండి గ్రహింపబడినది
కాలం :  జననం: జూలై 9, 1903 – మరణం: మార్చి 23, 1984
స్వస్థలం : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి
తల్లిదండ్రులు : లక్ష్మి, పెదరాజయ్య
చదువు : ఉర్దూ మీడియంలో 7వ తరగతి
ప్రావీణ్యం గల భాషలు : తెలుగు, హిందీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీష్, సంస్కృతం
వృత్తి : ఉపాధ్యాయుడు
మకుటం : “వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప – కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప’
విశేషతలు : ‘గొప్పవాడను గాను కోవిదుడగాను తప్పులున్నను దిద్దుడి తండ్రులార’ అంటూ వినయంగా చెప్పుకున్నాడు.
నిరాడంబర జీవితాన్ని గడిపాడు. సాహిత్యంతోపాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు.
సిద్దప్ప వరకవి రచనలు : సుమారు 40 గ్రంథాలు రచించాడు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని (నాలుగు భాగాలు), వర్ణమాల కందార్థములు, కాలజ్ఞాన వర్థమాన కందార్థములు, యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, విష్ణు భజనావళి, శివభజనావళి, నీతిమంతుడు, గోవ్యాఘ్ర సంభాషణ, కాకి హంసోపాఖ్యానం, అర్చకుల సుబోధిని, అశోక సామ్రాజ్యము యక్షగానము, జీవ నరేంద్ర నాటకము మొదలైనవి. ఈయనకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండారెడ్డిపల్లెలో సమారాధనోత్సవం జరుగుతుంది. గోలుకొండ కవుల సంచికలో ఈయన పద్యాలు ప్రచురితమయ్యాయి.

పాఠ్యభాగ సందర్భం

సిద్ధప్పకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో భక్తులు, అభిమానులు ఉన్నారు. వారి మనసులను చూరగొన్నాడు. పండిత పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్ధప్ప పద్యాల్ని రాశాడు. వారు రాసిన పద్యాలను నేటికి భజన మండళ్లలో పాడుతుంటారు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని పేరుతో రాసిన పద్యాలు బహుళ ప్రచారం పొందాయి. సమాజంలోని మూఢాచారాలను నిరసిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఎరుకచేస్తూ సిద్ధప్ప రాసిన సీస పద్యాలను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

Leave a Comment