Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన Textbook Questions and Answers.
TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధనలను తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు.
బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభారక శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకులు వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.
ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు నూరు మొదటి సారి సాహిత్య ప్రపంచానికి తెలియపరిచారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే.
సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.
ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదారభాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం (ఉ.వి. సంస్కృత అకాడమీ పక్షాన అర్యేంద్రశర్మగారి పేరుతో ప్రకటితం) పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.
తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి, సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు.
ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్ధకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు నుంచి, హిందీ నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్, పిహెచ్. పట్టాలు సంపాదించుకున్నారు.
ప్రశ్న 2.
జానపద గేయాలు సేకరించడంలో బిరుదురాజు అనుభవాలు ఎలాంటివి ?
జవాబు:
జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.
ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెన్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి.
తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటిగంట దాకా కోలాటాలు వేయించారు. ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెప్పి డబ్బులిచ్చాడు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డాడు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫోటోలు తీయనిచ్చేవారు కాదు.
ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ-శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.
II సంగ్రహరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథం. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.
ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు.
ప్రశ్న 2.
ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు సంస్కృతంలో కృషిచేసిన తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలిపారు. కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీ పరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.
ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యులు రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులను పరిష్కరించి సాహిత్య చరిత్రలో వారి పేర్లకు చిరస్థాయి నందించారు.
ప్రశ్న 3.
విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదురాజు రామరాజు సేవ ఎలాంటిది ?
జవాబు:
బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడు వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగుశాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగుశాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వత్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.
వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అక్కడ నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.
ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవ చక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం. శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు.
ప్రశ్న 4.
బిరుదురాజు మల్లినాధసూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించాడు ?
జవాబు:
తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడు తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసి వెళ్లి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. అంతటితో సంతృప్తి పడక వారి పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇవ్వబోయారు. కాని అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పి వారు ఇవ్వలేదు.
తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ, భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టడం చూసి తన మిత్రుడు కొండయ్య సహకారంతో ఆ భూస్వామిని ఒప్పించి, భూమిని పురోహితునికి ఇప్పించారు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలను బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు.
III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు స్వగ్రామమేది ?
జవాబు:
వరంగ్ జిల్లా దేవునూరు.
ప్రశ్న 2.
బిరుదురాజు రామరాజు పిహెచ్.డి గ్రంథం పేరేమి ?
జవాబు:
తెలుగు జానపద గేయ సాహిత్యం.
ప్రశ్న 3.
పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసిన సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు.
ప్రశ్న 4.
రామరాజు చిన్నప్పటినుండి ఎటువంటి భావాలు ప్రోది చేసుకున్నాడు ?
జవాబు:
దేశభక్తి భావాలు.
ప్రశ్న 5.
బిరుదురాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నాడు ?
జవాబు:
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.
ప్రశ్న 6.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (1978) వత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ?
జవాబు:
భోదనా భాషగా తెలుగు.
ప్రశ్న 7.
తెలుగుజాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ?
జవాబు:
శ్రీ కోలాచలం మల్లినాథ సూరి.
ప్రశ్న 8.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !
కఠిన పదాలకు అర్ధములు
55వ పుట
అధ్యాపకుడు = ఉపన్యాసకుడు, లెక్చరర్ (ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు)
రీడర్ = అసోసియేట్ ప్రొఫెసర్
ఆచార్యుడు = ప్రొఫెసర్
డీన్ = పీఠాధిపతి
మార్గదర్శకుడు = ఆదర్శప్రాయుడు
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాల
శిలా శాసనాలు = రాళ్ళపై చెక్కిన చట్టాలు, సమాచారం
56వ పుట
భవిష్యత్ తరాలకు = రాబోయే తరాలకు
పరిణతవాణి = (ఇక్కడ కార్యక్రమం పేరు), అనుభవజ్ఞుల మాట
ప్రసంగాలు = ఉపన్యాసాలు
తలచడం = అనుకోవడం
దైవమొకటి = దైవం మరొకటి
ఆశించినవి = కోరుకున్నవి
ప్రసాదించిన = ఇచ్చిన
ఆసక్తి = ఇష్టం
కృషి = శ్రమ, పని
ప్రోది = పోషించు, పెంచు
విలాయత్ = విదేశాలకు
ఐ.సి.ఎస్. = (ఇండియన్ సివిల్ సర్వీసెస్) ఇప్పటి ఐ.ఏ.ఎస్ లాంటి విద్య
దైవ + ఇచ్చ = దేవుని కోరిక
ప్రతిభా = పుట్టుకతో వచ్చిన తెలివి
వ్యుత్పత్తి = పాండిత్య౦
అభ్యాసం = సాధన
రాణింపు = గుర్తింపు
కొత్త పుంతలు = నూతన మార్గాలు
కృతకృత్యుడు = విజయం సాధించినవాడు
అభిరుచి = ఇష్టం
అరుదు = తక్కువ
దాక్షిణాత్య = దక్షిణ భారత
ప్రథముడు = మొదటివాడు
మధ్యకాలీన = మధ్యయుగం నాటి
కృతులు = రచనలు
పరిష్కరించి = తప్పొప్పులను సవరించి
ప్రకటించు = ప్రచురించు
సాటి = సమానమైన
తోటివారు = వెంట ఉన్నవాళ్ళు
57వ పుట
మెప్పు = పొగడ్త, గౌరవం
దృష్టి సోకని = కనిపించని
శ్రమించినట్లు = కృషి చేసినట్లు
థీసిస్ = పరిశోధనా గ్రంథం
అముద్రిత = ప్రచురించబడని
ఎమిరిటస్ ప్రొఫెసర్ = గౌరవ ఆచార్యుడు
సర్వేక్షణం = సర్వే చేయించడం, సేకరించడం
స్నాతకోత్తర = పోస్ట్ గ్రాడ్యుయేట్
రీసర్చ్ జర్నల్ = పరిశోధన పత్రిక
ఆర్థిక వనరులు = డబ్బుకు సంబంధించిన వనరులు
పక్షాన = తరపున
వత్రోత్సవాలు = అరవై సంవత్సరాల సందర్భంగా నిర్వహించే ఉత్సాహం
సదస్సు = సమావేశం
సంగ్రహంగా = క్లుప్తంగా, తక్కువగా
మనవి చేస్తాను = చెప్తాను
సంపాదించిన = సంపాదకత్వం వహించిన
పీఠికలు = ముందుమాటలు
58వ పుట
జానపద గేయ సంకలనం = జానపద గేయాలతో కూడిన పుస్తకం
ఎరుక పరచడం = తెలియజేయడం
మరుగు = కనపడకుండా
చరితార్థులు = చరిత్రను సృష్టించిన వారు, గొప్పవారు
సంచిక = ప్రత్యేక పుస్తకం
ఈ కోవకు = ఈ పద్ధతికి
పాఠాలు = ఒక గ్రంథానికి చెందిన వేరు వేరు తాళపత్రాలలో వేరు వేరుగా ఉన్న విషయాలు
నిఘంటువు = అక్షర క్రమంలో పదాల అర్థాలను సూచించే పుస్తకం
కూర్చడం = తయారుచేయడం
అనువాదం = భాషాంతరీకరణ
59వ పుట
గేయాలు = పాటలు
రవిక కనుములు =
జాకెట్ పీస్లలు, స్త్రీల వస్త్ర విశేషం
క్షమార్పణ = క్షమాపణ, మన్నించమనడం
గాయక భిక్షుకులు = పాటలుపాడి అడుక్కునే వారు
పాత గుడ్డలు = పాత బట్టలు
వేసవి = ఎండాకాలం
సొమ్మసిల్లి = స్పృహ తప్పి
బలిజాయన = బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన (శైవుడు)
బస్తేడు = సంచి నిండా
ఆర్ష శాక = ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది
లిపి = రాసే విధానం
తొలి పాఠాలు = మొదటిసారి నేర్చుకున్నవి, ప్రాథమిక అంశాలు
ఏటవాలులో = ఒక పక్క వంపులో
నూరడం = మొనతేల్చడానికి రాయడం
వరాహ లాంచనం = పంది గుర్తు
సత్యం + అప్రియం = అప్రియమైన (బాధ కలిగించే) సత్యాన్ని
న బ్రూయాత్ = చెప్పకూడదు
60వ పుట
లెదర్ పాడ్ = శాసనాల అధ్యయనానికి ఉపయోగించే తోలు సంచి
మంది మార్బలం = ఎక్కువ మందితో
బ్రహ్మరథం (జాతీయం) = అధిక గౌరవం
వాహ్యాళి = సరదాగా తిరగడం, విహారం
గండి = చేరుకట్టకు పడిన రంధ్రం.
ప్రతిష్ఠించి = స్థాపించి
లిపి పరిణామం = రాత మారిన విధానం
తహసీల్దార్ = ఒక తాలూకాకు ఉన్నతాధికారి
పూజాగృహ = పూజగది
ఘంటాలు = తాళపత్రాలపై రాయడానికి వాడే ఇనుప కలాలు
కన్నులకద్దుకొని (జాతీయం) = నమస్కరించి
పూజాద్రవ్యం = పూజింపదగిన సామాగ్రి
నామమాత్రపు (జాతీయం) = అతి తక్కువ
కౌలు = వ్యవసాయ భూమి వినియోగించుకున్నందుకు భూ యజమానికి ఇచ్చే మొత్తం
కంటతడి (జాతీయం) = ఏడవడం
ఉపాయశాలి = ఉపాయం గల వ్యక్తి
పురోహితుడు = పూజారి, బ్రాహ్మణుడు
ఓరియంటల్ కాన్ఫరెన్సు = భాషాపరమైన సమావేశం
61వ పుట
అమూల్య = వెలకట్టలేని
వరివస్య = సేవ
భగవత్ + ఇష్టమే = భగవంతుని ఇష్టం
నమస్సులు = నమస్కారాలు
నా సాహిత్య పరిశోధన Summary in Telugu
రచయిత పరిచయం
పాఠం పేరు : నా సాహిత్య పరిశోధన
దేని నుండి ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన పరిణత వాణి కార్యక్రమంలో
గ్రహింపబడినది : ఉపన్యాసం
రచయిత పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు
రచయిత కాలం : జననం : ఏప్రిల్ 16, 1925, మరణం : ఫిబ్రవరి 8, 2010
రచయిత స్వస్థలం : వరంగల్ జిల్లా దేవునూరు
తల్లిదండ్రులు : లక్ష్మీదేవమ్మ, నారాయణరాజు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పిహెచ్.డి.
పరిశోధనాంశం : : తెలుగు జానపద గేయసాహిత్యం
పరిశోధన పర్యవేక్షణ : ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం
ఉద్యోగం : 1952లో ఉస్మానియా తెలుగుశాఖలో అధ్యాపకుడు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖాధ్యక్షుడిగా ఉన్నారు. 1967 నుంచి 1974 వరకు వరంగల్ స్నాతకోత్తర పని చేశారు. 1978 నుంచి 1982 మధ్య ఆర్ట్స్ విభాగం పీఠాధిపతిగా ఉన్నారు. 1980 నుంచి 1981 వరకు నేషనల్ లెక్చరర్గా ఉన్నారు. 1983లో పదవీ విరమణ చేశారు.
తెలుగు రచనలు : ‘మరుగు పడిన మాణిక్యాలు’ ‘చరిత్రకెక్కని చరితార్థులు’, ఎన్నో జానపద గేయ సంకలనాలు.
ఆంగ్ల రచనలు : ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్.
జానపద గేయ సాహిత్యం : వీరి తెలుగు జానపద గేయసాహిత్యం అనే పరిశోధన దక్షిణ భారతదేశభాషల్లోనే మొదటి జానపద సాహిత్య పరిశోధన.
గ్రంథాలు : బిరుదు రామరాజు వందలకొద్దీ జానపద గేయాలను, అనేక తాళపత్ర గ్రంథాలను, శిలాశాసనాలను సేకరించాడు. ప్రాచీన కావ్యాలను పరిష్కరించాడు. ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రలను సేకరించి పుస్తకాలుగా వెలువరించాడు.
‘జాతీయాచార్య’ పదవి : ఈయన చేసిన సాంస్కృతిక సేవకుగాను ‘జాతీయాచార్య’ పదవి లభించింది.
పాఠ్యభాగ నేపథ్యం
సాహిత్యరంగంలో 70 ఏండ్లు పైబడిన వారి జీవిత విశేషాలు, అనుభవాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతో ఆంధ్రసారస్వత పరిషత్తు పరిణతవాణి అనే పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసింది. అందులో భాగంలో 27 జులై 1995న ఆచార్య బిరుదురాజు రామరాజు చేసిన ప్రసంగమే ప్రస్తుత పాఠ్యాంశం.
ఇది ప్రసంగ వ్యాసం కాబట్టి ఉత్తమపురుషలో ఉంది. వారి భావాలను అర్థంచేసుకోవడానికి ప్రథమ పురుషలోకి మార్చి సారాంశాన్ని అందిస్తున్నాం.
పాఠ్యభాగ సారాంశం
అంతా దైవ నిర్ణయమే : తెలుగులో “తానొకటి తలచిన దైవమొకటి తలచును” అనీ, ఇంగ్లీషులో “మాన్ ప్రపోజెస్ (బట్) గాడ్ డిస్పోజెస్” అనే సామెతలున్నాయి. ఆ సామెతలు తనకోసమే పుట్టాయని, తన జీవితంలో చాలావరకు దైవమనుకున్నవే జరిగాయని బిరుదురాజు రామరాజు అన్నారు. అందువలన దైవం ప్రసాదించిన వాటిలోనే తన ఆసక్తిని పెంచుకొని కృషి చేశాడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు పెంచుకుని రాజకీయాల్లోకి పోదామనుకున్నాడు. వారి పెద్దలు తనను విదేశాలకు పంపించి ఐ.సి.ఎస్. చేయించాలనుకున్నారు. దైవం తెలుగు పంతుల్ని చేస్తే, దైవేచ్ఛనే తనయిష్టంగా మలచుకొని తెలుగు సాహిత్యరంగంలో స్థిరపడ్డాడు.
జానపద సాహిత్య పరిశోధనకు కారణాలు : బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. మంచి గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. కొత్త మార్గంలో కృషి చేసి గుర్తింపు పొందవచ్చునని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధన ప్రారంభించి విజయం సాధించాడు. జానపద గేయాలతోపాటు వందల సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు, పదుల సంఖ్యలో శిలాశాసనాలు సేకరించారు.
వారి తరం యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుల్లో తాళపత్ర గ్రంథాల్లో, శాసనాల్లో అభిరుచిగల వాళ్ళు తక్కువ. కావున ఆ కృషి కూడా మంచి ఫలితాలను ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించేలా చేసింది. ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య సాహిత్యభాషల్లో పరిశోధన చేసిన వారిలో మొదటివాడుగా గుర్తింపు పొందారు.
జానపద సాహిత్య సేవలో బి. రామరాజు : మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు వంటి పెద్దల పరిశోధనలు ఆదర్శంగా పెట్టుకొని సాహిత్య చరిత్రలకెక్కని ప్రాచీన మధ్యకాలంనాటి దాదాపు వంద తెలుగు, సంస్కృత కావ్యాలను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతవరకు వెలుగు చూడని తెలుగు, సంస్కృత గ్రంథాలు పన్నెండు వరకు పరిష్కరించి ప్రకటించారు. ఈ రంగంలో సాటివారిలో, తోటివారిలో ఎవరూ చేయని పని చేసినందుకు పెద్దల మెప్పు పొందారు.
జానపద సాహిత్యం కోసం తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం పల్లెటూళ్ళు తిరిగినపుడే ఇంతకు పూర్వం చారిత్రకుల దృష్టి సోకని క్రొత్త శిలాశాసనాలు నాలుగైదు కనుగొన్నాడు. జానపద గేయ సాహిత్యం గూర్చి శ్రమించినట్లే ఆంధ్రుల సంస్కృత సాహిత్య సేవ గురించి శ్రమించాడు. వాటినన్నిటిని గూర్చి సంస్కృత పరిశోధనా గ్రంథంలో రాశాడు. మద్రాసు, తంజావూరు, కాకినాడ, విశాఖపట్నాలలో ఉన్న తాళపత్ర గ్రంథాల్లోని ‘ఆంధ్రుల అముద్రిత సంస్కృత కృతుల పరిచయం కూడా చేశాడు.
1978-1982 మధ్యకాలం కళ పీఠాధిపతిగా ఉన్నప్పుడు, 1980-1981 యు.జి.సి. నేషనల్ లెక్చరర్ కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. రిటైర్ అయిన తరువాత ఉస్మానియా, యు.జి.సి. ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉండి ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టును నిర్వహించారు. ఓరుగల్లు మండలం జానపద విజ్ఞానం సర్వేక్షణం కూడా చేయించారు.
బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి, దానికి కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చేశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగు శాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.
బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు.
జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.
ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులతో పాటు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాల ద్వారా అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు వందకుపైగా మొదటిసారి సాహిత్య ప్రపంచానికి తెలియచేశారు.
సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి: సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుడు రాసిన శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు. ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావు రాసిన రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామ పంతుల అనంత రామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.
తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్నరాఘవ నాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం, సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు.
ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు. ఇంటర్ వరకు ఉర్దూ నేర్చుకున్నందున ఉర్దూ – తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు, హిందీల నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్., పిహెచ్.డి పట్టాలు సంపాదించుకున్నారు.
జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953 – 1955 సంవత్సరాల మధ్య కాలంలో జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక (జాకెట్) ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట దాకా కోలాటాలు వేయించారు.
ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి డబ్బులిచ్చారు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డారు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫొటోలు తీయనిచ్చేవారు కాదు.
ఫొటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ బండిలో నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ – శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.
శాసనాల సేకరణలో అనుభవాలు : అప్పటి ఆర్షశాఖ (ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది) డైరెక్టర్ గొప్ప చారిత్రక పరిశోధకులు. వారివద్ద శాసన లిపులు చదివే తొలిపాఠాలు నేర్చుకున్నారు. తాళపత్రాల కోసం పోతూ ముస్తాబాదులో 29-10-1954 బస్సెక్కి మానేరు వద్ద దిగి ఆ ప్రాజెక్ట్ చూచి కాలినడకన గంభీరావుపేటకు పోతుంటే గంభీరావుపేట చెరువు కట్టకు ఏటవాలులో ఒక శిలాశాసనం కనబడింది. కొడవండ్లు, గొడ్డండ్లు నూరటం చేత శాసనం కొంత భాగం అరిగిపోయింది. వరాహ లాంఛనం (పంది గుర్తు) ఉండటం వల్ల అది కాకతీయుల కాలపు శాసనమని గుర్తించారు.
గంభీరావుపేటలో వై. రామేశ్వర శర్మ, కటకం వెంకటేశ్వర్ల ఇంట్లో వంద తాళపత్ర గ్రంథాలు తీసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని చెరువు కట్ట దగ్గరున్న శాసనాన్ని తవ్వించారు. దానిని భూమిలోపల కనపడకుండా పూడ్చి పెట్టించారు. హైదరాబాదు వెళ్ళి ఆర్షశాఖ డైరెక్టరుకు ఈ విషయం చెప్తే శాసనలిపులు నేర్చి శాసనాలు తీసి ప్రకటించటం ఇష్టం లేకనో ఏమోగాని, ఆయన పాఠాలు చెప్పటం మానేశారు. అప్రియమైన సత్యాన్ని పలుకకూడదు. (నబ్రూయాత్ సత్యమప్రియం).
ఈ విషయం ఆదిరాజు వీరభద్రరావు గారికి చెప్పితే వారు శాసనలిపులు బోధించటమేకాక శాసనాలు తీసే విధానం నేర్పి, తమ వద్ద ఉన్న ఇనుప బ్రష్షు, మసి లెదర్ పాడ్ ఇచ్చారు. వాటి సహాయంతో రెండు మూడు శాసనాలు తీయించాడు. కరీంనగరం జిల్లా గంగాధర గ్రామం జమీందారు కొడుకు రామరాజు విద్యార్థి. తమ గ్రామం గుట్టపై శాసనముందని చెప్పితేపోయి చూసి చాలా గొప్ప శాసనం అనే గుర్తించారు. ఈ విషయం ఒక సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకునికి చెప్పితే వచ్చే ఆదివారం కలిసి పోదాం.
శాసనం తీసుకువద్దాం అని చెప్పి మరునాడే మంది మార్బలంతో పోయి శాసనం తీసుకువచ్చి మైసూరులో జరిగిన హిస్టరీ కాంగ్రెస్లో ఆ శాసనం గూర్చి పేపరు చదివి గొప్ప సన్మానం పొందాడు. వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళినప్పుడు నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.
ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవచక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం, శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్ట్ ఫొటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు. వారి తరువాత తెలుగు విద్యార్థులకు శాసనాలతోపాటు శాసనలిపి కూడా బోధించవలెననే కోరికతో ఆ పటాలు పెట్టించినా ఇప్పుడా పటాలు లేవు, శాసనలిపి పాఠాలూ లేవు.
మల్లినాథ సూరి ఘంటాలు పొందిన విధానం : తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వస్థలం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడైన తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసిపోయి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇస్తే వారు ఇవ్వలేదు. అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పారు. తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ ఆ భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టారు.
మిత్రుడు కొండయ్య సహకారంతో, ఆ భూస్వామిని ఒప్పించి భూమిని పురోహితునికి ఇప్పించాడు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలు రామరాజుకు ఇచ్చాడు. ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్కు తీసుకొనిపోయి పండితులకు చూపించారు. పద్మవిభూషణ ఆర్.ఎన్. దాండేకర్ రామరాజు గారి ఇంటికి వచ్చి వాటిని చూసిపోయారు. మల్లినాథసూరి గూర్చి పి. హెచ్. డి పరిశోధన చేసిన వారెవరో వాటి ఫొటోలు తమ గ్రంథంలో ప్రచురించారు. అటువంటి అమూల్య సంపదను కాపాడుకునే సంస్థ లేనందుకు బాధ పడ్డారు. బరోడా ప్రాచ్య సంస్థ వారికి గాని, పూనా ప్రాచ్యసంస్థవారికి గాని ఇస్తే కాపాడుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.
చివరి కోరిక : 1945వ సంవత్సరంలో ‘ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !’ అనే గేయంతో ప్రారంభమైన తన సాహిత్య వ్యాసంగం “ఆంధ్ర యోగుల చరిత్రలు ఐదు సంపుటాలు”, “ఆంధ్రుల సంస్కృత సాహిత్య వరివస్య”, “నేను నా సాయి” అనే రచనలతో ముగిస్తే బాగుంటుందనేవి తన చివరి కోరికలన్నారు. అవి తీరి ఏ కోరిక కోరని స్థితి కల్పించవలెనని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇకపై భగవంతుని ఇష్టమే తన ఇష్టమని, నమస్కారాలతో బిరుదురాజు రామరాజు తన ప్రసంగాన్ని ముగించారు.