Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair theory) అని కూడా అంటారు. Laissez Fair అనేది ఫ్రెంచ్ పదం.
దాని అర్థం ‘ఓంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం’ కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.
వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.
రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.
- వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
- ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
- వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
- తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.
సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.
ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.
వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.
నైతిక వాదన :
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.
ఆర్థికవాదన :
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమస్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమస్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.
వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.
కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో వ్యక్తుల అవసరంకంటే సమాజ అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.
జీవైకవాదం :
హార్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.
సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.
అనుభవిక వాదం :
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.
ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.
ప్రశ్న 2.
ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.
తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.
ఆధునిక ఉదారవాదం 19వ శాతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి. హెచ్, గ్రీస్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.
అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.
అర్థం, నిర్వచనాలు :
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం. సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.
వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.
మౌలిక అంశాలు :
- వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
- వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలుకరాల వ్యక్తి ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
- పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
- ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
- ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
- ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
- ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.
ప్రశ్న 3.
సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.
జవాబు.
సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవ వీరుల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.
రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.
నిర్వచనం వివరణ :
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం” ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు.
సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.
ప్రధానసూత్రాలు :
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.
1. సమాజానికి ప్రాముఖ్యత :
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.
2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.
పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.
3. పెట్టుబడిదారీ దారీ వ్యవస్థ నిర్మూలన :
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.
దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.
4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.
5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం :
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది. అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.
6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం :
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.
7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం :
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని’ సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.
8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.
ప్రశ్న 4.
గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భరతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.
గాంధీయిజం – ప్రధాన సూత్రాలు :
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.
2. నైతిక నిరపేక్షత :
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైది. సర్వాంతర్యామి అయినట్టఁ భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.
3. అహింస – సిద్ధాంతం :
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.
గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.
అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.
గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.
గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :
- వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
- అంతర్గత వైరుధ్యాలు
- విదేశీ దురాక్రమణలు
- కుటుంబ వ్యవస్థ
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.
అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హిసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ”పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.
సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.
సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.
- అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
- ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
- ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.
సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.
- సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
- అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
- సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
- అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
- దొంగతనం చేయరాదు.
- ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
- విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
- ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
- అంటరానితనాన్ని పాటించరాదు.
- మతపరమైన సహనం ఉండాలి.
సత్యాగ్రహం – వివిధ రూపాలు :
- శాసనోల్లంఘనం
- అహింస
- హర్తా నిరసన
- హర్తాల్
- హిజరత్
ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.
అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.
5. మతం రాజకీయాలు :
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.
రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.
6. లక్షా సాధనాలు :
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు. అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.
గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టుపెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.
7. ధర్మకర్తృత్వం :
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair Theory) అని కూడా అంటారు. (Laissez Fair) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.
వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాఁటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేణి దావాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.
రాజ్యం కింద తెలిపిన పరిమిత విదులను నిర్వహిస్తుంది.
- వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
- ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
- వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వసాల నుంచి రక్షణ కల్పించడం.
- తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.
సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి :
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.
ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజి.మోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్అం తటా విస్తరించింది. దీనిని ఆడమ్స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.
ప్రశ్న 2.
సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
సామ్యవాదం లోపాలు :
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.
- సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
- కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
- సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
- ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.
సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికుల నిరుద్యోగుల మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.
సామ్యవాద సిద్ధాంతం సమసజస్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.
సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.
ప్రశ్న 3.
సత్యాగ్రహ భావనను తెలపండి.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Fores) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.
ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.
సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం :
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.
- అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
- ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
- ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.
సత్యాగ్రహం సూత్రాలు :
- సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
- అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
- సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
- అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
- దొంగతనం చేయరాదు.
- ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
- విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
- ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
- అంటరానితనాన్ని పాటించరాదు.
- మతపరమైన సహనం ఉండాలి.
సత్యాగ్రహం – వివిధ రూపాలు :
- శాసనోల్లంఘనం
- అహింస
- హర్తా నిరసన
- హర్తాల్
- హిజరత్.
ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.
అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.
ప్రశ్న 4.
మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
జవాబు.
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.
రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం.
జవాబు.
వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రధమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez Fair) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.
ప్రశ్న 2.
నయా ఉదారవాదం.
జవాబు.
నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.
నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఎఫ్.ఎ. ఫెయక్ (1899 – 1922), ఆస్ట్రేలియా తత్వవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.
ప్రశ్న 3.
లేజాఫేయర్ (జోక్యరహితవాదం).
జవాబు.
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయా లంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.
లేజాఫేయర్ (Laissez Fair) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.
ప్రశ్న 4.
జె.యస్.మిల్.
జవాబు.
జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్.మిల్’ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.
ప్రశ్న 5.
సామ్యవాదం అర్థం.
జవాబు.
మ్యవాదం వ్యక్తి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్య దం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.
నిర్వచనాలు :
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్ సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.
ప్రశ్న 6.
పెట్టుబడిదారీ విధానం.
జవాబు.
వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.
లక్షణాలు :
- వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
- ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యాజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
- వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
- పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.
ప్రశ్న 7.
మార్క్సిజం.
జవాబు.
కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది. కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.
పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్ట్ల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.
ప్రశ్న 8.
అహింసా సిద్ధాంతం.
జవాబు.
అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.
దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి. అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.
ప్రశ్న 9.
సత్యాగ్రహం.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.
అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ. అభిప్రాయం.
ప్రశ్న 10.
ధర్మకర్తృత్వం.
జవాబు.
గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని’ ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.
ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.
ప్రశ్న 11.
సహాయ నిరాకరణ.
జవాబు.
సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.
అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 8, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.
ప్రశ్న 12.
శాసనోల్లంఘనం.
జవాబు.
‘సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.
సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.