TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.

దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)

అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 2.
కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.
జవాబు:
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు.

లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది.

తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

ప్రశ్న 2.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణి వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.

ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 4.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది.

సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనే పత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి.

తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?
జవాబు:
వరంగల్లు జిల్లా దేశాయిపేట.

ప్రశ్న 2.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 3.
రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

ప్రశ్న 4.
రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?
జవాబు:
పచ్చతోరణం.

ప్రశ్న 5.
కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు:
క్రీ. శ. 1900

ప్రశ్న 6.
మున్షీ ప్రేమచంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
జవాబు:
మాడపాటి హనుమంతరావు.

ప్రశ్న 7.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 8.
‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?
జవాబు:
అడవి బాపిరాజు.

కఠిన పదాలకు అర్ధములు

జాతీయం అంటే ఒక భాషకు సొంతమైన పదబంధాలు. ఇవి నిఘంటువుల పరంగా ఉన్న అర్థం కాకుండా విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి.)

47వ పుట

బహుముఖ ప్రజ్ఞాశాలి = అనేక అంశాల్లో మేధావి
సహాధ్యాయులు = కలిసి చదువుకున్నవారు
సన్నిహిత = దగ్గరి
వి + ఆసంగం
(వ్యాసంగం) = మిక్కిలి ఆసక్తి
సంపుటి = ఒకే రచయిత రాసిన రచనల సమాహారంగా వచ్చిన పుస్తకం

48వ పుట

ఆవిర్భవించిన = పుట్టిన, ప్రారంభమైన
విస్మృతి = మరుపు
విశిష్టమైన, ప్రశస్తమైన,
గణుతికెక్కిన = గొప్ప
ఏకశిలా నగరం = వరంగల్లు
జాను తెలుగు = అచ్చమైన తెలుగు
వర్ధిల్లినది,
ప్రవర్ధమానమైనది = = పెరిగినది
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాలు
ఏబది = యాబై

49వ పుట

స్వర్గీయ = స్వర్గానికి చేరిన (మరణించిన)
విజ్ఞుల = మేధావులు, తెలిసిన వారు
ఆర్క్యాలజీ శాఖ = పురావస్తు పరిశోధక శాఖ
ప్రకటితమైనవి = ప్రచురింప బడినవి
తెలుగు దీపాలు = తెలుగు అనే దీపాలు
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
మిణుకుమిణుకుమని = చిన్నగా
ఆదరించినారు = గౌరవించినారు, కాపాడి నారు
అణచివేత = అభివృద్ధి కాకుండా చూడటం
నిరంతరాయంగా = అంతరాయం (అడ్డంకి) లేకుండా
సివిలియన్ అధికారులు = పౌర (ఉన్నత) అధికారులు
వికాసం = అభివృద్ధి
గొడ్డలిపెట్టు(జాతీయం) = అడ్డంకి (మూలం నుండి నశింప చేయడం)
కవి సమ్మేళనాలు = కవులు కలిసే సమావేశాలు
సారస్వత సభలు = సాహిత్య సభలు
కంటగింపు (జాతీయం)= విరోధించు
అస్తిత్వ౦ = ఉనికి
ఉద్యమం = ప్రయత్నం

50వ పుట

తుద = చివర
ప్రామాణిక = శాస్త్రీయ
ప్రచ్ఛన్నంగా = రహస్యంగా (మరోవిధంగా)
వాగ్బంధన = మాటలను బంధించడం
తాండవం = గంభీర నాట్యం
ఉద్దండులైన = గొప్పవారైన
సంస్కృత + ఆంధ్ర = సంస్కృతము లోనూ, తెలుగు లోను
బొత్తిగా = అసలే
సంకటం = కష్టం
ద్వీపకల్పం = మూడువైపులా నీళ్ళుండి, ఒక వైపుమాత్రమే దారి ఉండే ప్రదేశం
స్వాతంత్ర్య ప్రాప్తి = స్వాతంత్రం రావడం
మిక్కిలి = ఎక్కువ
గ్రాస = తిండి
వాసః = బట్టలకు, నివాసానికి
దైన్య౦ = దీన స్థితి (లేకపోవడం)
కృశించిరి = చిక్కిపోయారు, కష్టపడ్డారు
గ్రహణం పట్టింది
(జాతీయం) = ఆటంకం ఏర్పడింది
అవధానం = పద్యాలతో ఆడే ఒక సాహిత్య క్రీడ, ఏకాగ్రత

51వ పుట

సంకల్పించుట = నిశ్చయించుట
నిష్కళంక = మచ్చలేని, కళంకము లేని
కూర్చి = గురించి
దివాను = మంత్రి
ఉభయులు = ఇద్దరు
తోడ్పాటు = సహకారం
అభ్యుదయము = అభివృద్ధి
మేల్కొల్పుట = చైతన్య పరుచుట
మహనీయులు = గొప్పవారు
మార్గదర్శకత్వం = నాయకత్వం
కంకణ బద్దులు
కావడం (జాతీయం) = (కంకణం కట్టుకున్నవారు) సిద్ధం కావడం
నవ యుగ + ఉదయం = కొత్త కాలం ప్రారంభం
వాఙ్మయము = రచనలు
అనుయాయులను = అనుసరించే వారిని (శిష్యులను)

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

52వ పుట

గోచరించుట = కనిపించుట
అడుగు జాడలలో
(జాతీయం) = మార్గదర్శకత్వంలో (చూపిన మార్గంలో)
ప్రవీణులు = పాండిత్యం కలిగిన వారు
మహారాష్ట్రము
(భాషాపరంగా) = మరాఠీ భాష
సరళమైన = సులభమైన
పేర్కొనవలసి = చెప్పవలసి
అనువాదం = భాషాంతరీకరణం
మిత వాది = శాంతిని కోరేవాడు (తక్కువ వాదించేవాడు)
వైతాళికుడు = మేల్కొల్పేవాడు, చైతన్య పరిచే వాడు
వ్యాసకర్త = వ్యాసాలు రాసే వ్యక్తి
సంపన్న కుటుంబం = ధనవంతుల కుటుంబం
అవలంబింపక = ఆశ్రయించక, చేయక
స్వీకరింపక = తీసుకోక
అర్పించిన = ఇచ్చిన
త్యాగమూర్తి = ఏది ఆశించకుండా ఇచ్చిన వ్యక్తి
నిర్భయంగా = భయం లేకుండా
విజ్ఞాన నిక్షేపాలు = జ్ఞానాన్ని దాచబడినవి
పరిశోధనాత్మకము = పరిశోధన చేసి చెప్పినది
విమర్శకులు = ఒక రచనలోని మంచి చెడులను చెప్పేవారు
ప్రతిభా సంపన్నులు = ప్రతిభ అనే సంపద కలవారు
నిరీక్షణము = (ఇక్కడ కథ పేరు) వేచి ఉండటం
ప్రథమ శ్రేణి = ఉత్తమ శ్రేణి
హితబోధిని = (ఇక్కడ పత్రిక పేరు) మంచిని బోధించేది

53వ పుట

ఇంచుమించు = దాదాపు
ఒకే పర్యాయం = ఒకటే సారి
జాతీయోద్యమం = స్వాతంత్ర్యోద్యమం
చారిత్రాత్మకమైనది = చరిత్రలో నిలిచిపోయేది
అర్థ వార పత్రిక = వారానికి రెండు సార్లు వచ్చే పత్రిక
ప్రబుద్ధము = చైతన్య వంతము
దేశ + అభ్యుదయానికి = దేశ అభివృద్ధికి
గాఢమైన = ప్రచురించబడినవి
నవీన = కొత్త, నూతన
హర్షించి = సంతోషించి
ప్రశంసాత్మకమైన = పొగడదగిన

54వ పుట

ప్రస్తావించని = చెప్పని
దోహదము = ఉపయోగం
పరంపర + ఆగతము = ఒకరినుండి మరొకరికి
విభిన్న = కొత్త
పుంఖాను పుంఖాలుగా (జాతీయం)
= ఒకదాని తరువాత మరొకటి
(ఎక్కువగా)

తెలంగాణ సాహితీ వికాసం Summary in Telugu

(సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలోనిది)

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం 1

పాఠం పేరు : తెలంగాణ సాహితీ వికాసం
గ్రంథం : సాహిత్యోపన్యాసాలు
రచయిత : డా. దేవులపల్లి రామానుజరావు
కాలం : జననం : ఆగస్టు 25, 1917 – మరణం : జూన్ 8, 1993
స్వస్థలం : వరంగల్లు జిల్లా, దేశాయిపేట
తల్లిదండ్రులు : అండాలమ్మ, చలపతిరావు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., నాగపూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం
సహాధ్యాయులు : ఉన్నత పాఠశాలలో కాళోజి నారాయణరావు, న్యాయ కళాశాలలో పి. వి. నరసింహారావు
మొదటి రచన : పచ్చ తోరణం (ఖండ కావ్య సంపుటి)

రచనలు :
1) సారస్వత నవనీతం
2) తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం
3) తెలంగాణలో జాతీయోద్యమాలు
4) నా రేడియో ప్రసంగాలు
5) ఉపన్యాసతోరణం
6) వేగుజుక్కలు
7) తెనుగు సాహితి
8) యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
9) సాహిత్యోపన్యాసాలు
10) తలపుల దుమారం
11) పంచవర్ష ప్రణాళికలు
12) బంకించంద్ర ఛటర్జీ జీవితం
13) హైదరాబాద్లో స్వాతంత్ర్యోద్యమం
14) మన దేశం – తెలుగు సీమ
15) జవహర్లాల్ నెహ్రూ
16) గౌతమ బుద్ధుడు
17) కావ్యమాల.

సాహిత్య సేవ : వరంగల్లులోని శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శి, 1946లో శోభ సాహిత్య పత్రిక నిర్వహణ, 15 సంవత్సరాలు గోల్కొండ పత్రికకు సహ సంపాదకులు, ఆంధ్ర సారస్వతపరిషత్తు కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమి కార్యనిర్వాహక సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యుడు, మూడు సార్లు ఆక్టింగ్ వైస్ చాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి, డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు.

డాక్టరేట్ పట్టము : 1960-62 కాలంలో సాహిత్యరంగం నుంచి రాజ్యసభ సభ్యుడు, గురజాడ శతవార్షికోత్సవ సంచిక, రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1990 లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.

పాఠ్యభాగ సారాంశం

దేవులపల్లి రామానుజరావు రాసిన సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలో తెలంగాణా సాహితీ వికాసం అనే వ్యాసంలో తెలంగాణా సాహిత్య వైభవాన్ని వివరించారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు.

ప్రాచీన సాహిత్యంలో తెలంగాణా కృషి : తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం కూడా తెలంగాణాలో వర్ధిల్లింది. రాజకీయంగా వేరుపడి పోయినప్పటికిని భాషా దృష్ట్యా తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది.

ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. కావున తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామాంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున జయంతి రామయ్య పంతులు ఆదేశంపై దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగారు. ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు.

ఈ తెలంగాణ- శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదు.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితి గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నిజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు. వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది.

ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు ఐనప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణలో తెలుగు భాషా స్థితి : తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. రాజభాష ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు అక్షరాస్యత చాలా తక్కువ.

సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

తెలుగు భాషాభివృద్ధికి సంస్థానాల కృషి అటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ఆదరించి, ప్రోత్సహించిన సంస్థానాల కృషిని మరచిపోకూడదు. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాల కృషిని ప్రశంసించాలి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

ఈ అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

తెలంగాణలో తెలుగు అభివృద్ధి – కొమర్రాజు లక్ష్మణరావు కృషి : తెలంగాణలోని పరిస్థితులను గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారు వారు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు. లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందింది. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంధమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు.

మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డిల కృషి : మాడపాటి హనుమంతరావు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తెలుగు భాషలలో ప్రవీణులు. మరాఠి, హిందీ, సంస్కృత భాషలతో తగినంత పరిచయం కూడా ఉంది. ఉర్దూలో కూడా మంచి రచయిత. ముషీర్ దక్కన్ అనే ఉర్దూ దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాశారు. తెలుగులో సరళమైన వచనరచన చేయగలిగిన మేధావి. “క్షాత్ర కాలపు హింద్వార్యులు” అనే గ్రంథాన్ని మరాఠి నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగులో మొదటి కథానికా రచయితలలో హనుమంతరావు ఒకరు. స్వయంగా మంచి కథలను రాయడమేగాక మున్నీ ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. భారత రాజకీయాలలో గోపాలకృష్ణ గోఖలేవంటి మితవాది మాడపాటి హనుమంతరావు.

తెలంగాణాలో రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు మార్గదర్శకులు. రాజకీయాలతో సంబంధం లేనివారు, గొప్ప పండితులు, బహుగ్రంథ రచయిత, ఉత్తమ వ్యాసకర్త, గ్రంథాలయోద్యమ నిర్వాహకులు ఆదిరాజు వీరభద్రరావు. ఈయన తెలంగాణాలో నవచైతన్యానికి తోడ్పడినారు.

సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండలో వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలవంటివి.

రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

తెలంగాణా సంస్కృతికాభివృద్ధి – పత్రికల పాత్ర : తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతం చేసిన మరికొన్ని సంస్థలున్నాయి. అందులో రెండు పత్రికలు ముఖ్యమైనవి. తెలంగాణాలోని మొదటి పత్రిక “హితబోధిని” 1818 వ సంవత్సరమున స్థాపితమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో రెండు పత్రికలు దాదాపు ఒకే కాలంలో ప్రారంభమైనాయి. అందులో ఒకటి తెనుగు పత్రిక. ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడి ఐదేండ్లు నడిచింది. రెండవది నీలగిరి. ఇది నల్లగొండ నుండి షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో వచ్చింది.

ఇది కూడా ఐదేండ్లు నడిచింది. ఈ రెండు పత్రికలు సాహిత్య ప్రచారానికి, రచయితలకు, జాతీయోద్యమానికి చేయూతనిచ్చాయి. దీని తరువాత 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. తెలంగాణను చైతన్యవంతం చేయడంలో గోలకొండ పత్రిక చేసిన కృషి చరిత్రాత్మకమైంది. సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రికకు సంపాదకులుగా ఉండి, దేశాభ్యుదయానికి, భాషాభివృద్ధికి అపారమైన కృషిచేశారు. ఈ విధంగా తెలంగాణా రచనా రంగంలో నూతన యుగము ప్రారంభమైంది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో యువ రచయితల కోసం సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో విమర్శనాత్మకమైన వ్యాసాలు, కథలు, కవితలు, విజ్ఞానాత్మకమైన వచన రచనలు వచ్చేవి. బూర్గుల రామకృష్ణారావు ఉర్దూ భాష సారస్వతాలను గురించి, ఉమర్ ఖయాంను గురించి వ్రాసిన వ్యాసాలు యిందులో ప్రకటితమయ్యాయి.

రామకృష్ణారావు స్వయంగా బహుభాషాప్రవీణులు, కవులు, విమర్శకులు. ఆయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైన వ్యాసాలను రాశారు. ఈ పత్రికలతో పాటు ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి. ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి.

సికింద్రాబాదు నుంచి, ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి, అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడి కొంతకాలం నడిచింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి. తెనుగు, నీలగిరి, గోలకొండ, సుజాత మొదలైన పత్రికల ఆవిర్భావంతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించింది. దీనితో ఒకే రకమైన సంప్రదాయ సాహిత్యమే కాకుండా విభిన్నమైన సాహిత్యం పుంఖానుపుంఖంగా (ఎక్కువగా) వెలువడింది.

Leave a Comment