TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson మిత్రలాభం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 1st Chapter మిత్రలాభం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ముసలి గద్ద, మార్గాల వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
భాగీరథీ నదీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతో జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద హెచ్చరించింది.

అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఎలా తప్పించుకోవాలని ఆలోచించి, అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకుంది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది.

నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది. అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. ఆ తరువాత నేను చంపదగిన వాడనా, కాదా నిర్ణయించండి. లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.

ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీ నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు. ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి. అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ! ఎంతపాపముచేసి ఈ పిల్లిజన్మ ఎత్తానో ? అది చాలదని ఈపాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది.

ధర్మశాస్త్రము విని, నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం చేస్తానా? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని ఏక కంఠంతో బోధిస్తున్నాయి. ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది.

భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు.

కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనగా గద్దవిని కోపం తెచ్చుకోకండి. కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు. పోయినమాట పోని. నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, పోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ, ఆ చెట్టు తొర్రలో నివసించేది.

ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్థరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది. అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధ పడి వెతకడం ప్రారంభించాయి. అది తెలుసుకున్న పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి, ముక్కులతో పొడిచి
చంపాయి.

ప్రశ్న 2.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి. (V.Imp) (M.P)
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.

ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.

నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు.

అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి.

అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల ‘ సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి.

కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో ! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ముసలి గద్దను చూసి బిడాలము ఏమనుకుంది ?
జవాబు:
భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను.

ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది “రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాల”ని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది.

ప్రశ్న 2.
గృహస్థుని ధర్మమేమిటి?
జవాబు:
భాగీరథి తీరంలోని జువ్వి చెట్టుపై ఉన్న గద్దతో కపట స్నేహం చేయాలని వచ్చిన పిల్లిని ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడిగింది. పిల్లి తనగురించి చెప్తూ ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని అన్నది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? అని ప్రశ్నించింది.

అంటే గృహస్థులు ఇంటికి వచ్చిన వారిని చంపకూడదని చెప్పింది. ఇంకా శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలతో అయినా తృప్తిపరచాలని అన్నది. ఇంటికి వచ్చిన వారిని నిరాశతో పంపకూడదని అలాపంపడం మహా పాపం అని పిల్లి గద్దకు చెప్పింది.

ప్రశ్న 3.
తనను రక్షించమని వేడుకున్న జింకతో నక్క ఏమన్నది ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒకరోజు నక్క జింకకు బాగా పండిన ఒక పొలం చూపించింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయగా, ఒకరోజు ఆ పొలం యజమాని రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది. ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది.

దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు అని అడిగింది. అలా అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

ప్రశ్న 4.
ఎలాంటి వారి సాంగత్యము వెంటనే మానుకోవాలి ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒక పొలం చూపించి యజమాని పన్నిన వలలో చిక్కుకునేల చేసింది. రక్షించమని వేడుకున్నా రక్షించలేదు. సాయంకాలమైనా తన మిత్రుడు ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ వచ్చి వలలో ఉన్న జింకను చూసింది. నేను ముందే హెచ్చరించినా నామాట వినక పోతివి. మంచివారికి కూడా ‘చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చేవాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు.

ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అని చెప్పింది. అది విన్న జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని నేను ఉహించలేదని చెప్పింది.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్నయసూరి జన్మస్థలమేది ?
జవాబు:
శ్రీ పెరంబుదూరు

ప్రశ్న 2.
చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథమేది ?
జవాబు:
శబ్ద లక్షణ సంగ్రహం

ప్రశ్న 3.
నీతిచంద్రికకు ఆధార గ్రంథాలేవి ? (V.Imp) (M.P)
జవాబు:
విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం.

ప్రశ్న 4.
సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు ?
జవాబు:
పాటలీపుత్రం

ప్రశ్న 5.
దయాళువులకు కరస్థమైనది ఏది ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నవి ?
జవాబు:
అహింసా పరమోధర్మః

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

ప్రశ్న 7.
లోకమే కుటుంబమని భావించు వారెవరు ?
జవాబు:
మహాత్ములు

ప్రశ్న 8.
పరులకు హాని చేయగోరువారు ఏమైపోతారు ?
జవాబు:
చెడిపోతారు

చాంద్రాయణ వ్రత విశేషం

చాంద్రాయణ వ్రత విధానమేమిటంటే చంద్రుని యొక్క కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు నిరాహారంగా ఉండడం. పూర్ణిమ నాడు సంపూర్ణంగా భోజనం చేయడం. శుద్ధ పాడ్యమి రోజు ఒక ముద్ద (సాలగ్రామ పరిమాణం) తినాలి. అలా పూర్ణిమ వరకు పెంచుకుంటూ పదిహేను ముద్దలు (సాలగ్రామ పరిమాణం) తీసుకోవాలి. మళ్ళీ బహుళ పాడ్యమి నాడు పదునాలుగు ముద్దలు తిని అలా రోజు రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ అమావాస్యనాడు ఉపవాసం చేయాలి. దీనినే చాంద్రాయణ వ్రతమంటారు. కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తం చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వలన నశిస్తాయని నమ్మకం. పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్య సముపార్జన కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ వ్రతం చేస్తే మరణించిన తరువాత మహాపుణ్యాన్ని పొంది చంద్రలోకాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఈ వ్రతానికి కుల గోత్రాలకు సంబంధం లేదు. అందరూ ఆచరించవచ్చు.

పాఠంలోని సామెతలు / జాతీయాలు :

 • రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరయుట.
 • మ్రాను లేని దేశంలో ఆముదపు చెట్టు మహా వృక్షం కాదా.
 • చేటుగాలము దాపురించినవాడు హితులమాట వినడు.
 • నాలిక తీపు లోను విషమని యెఱుగరునా.

పాఠంలోని కొన్ని నీతి వాక్యాలు

 • కులశీలములు తెలియక యెవ్వరికి తావు ఇవ్వరాదు.
 • కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు.
 • సజ్జన సాంగత్యం సమస్తదోషములు పోగొట్టును; సర్వశుభములిచ్చును.
 • మహాత్ములకు లోకమే కుటుంబం.
 • ప్రపంచమున్నంత కాలం బ్రతుకబోము.
 • ఎప్పుడో కాలుడు మ్రింగ కాచియున్నాడు.
 • మంచివారికి సహితం దుష్టుల వలన భయము గలదు.
 • సజ్జన సాంగత్యము వలన సర్వశ్రేయములవలె; దుర్జన సాంగత్యము వలన సర్వానర్ధములు ప్రాప్తించును.
 • పరులకు హాని చేయ కోరువారు తామే చెడిపోవుదురు.

అలంకారం : క్రమాలంకారం
“పోగాలము దాపించిన వారు దీప నిర్వాణ గంధము, నరుంధతిని, మిత్రవాక్యమును
మార్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”
పోగాలము వచ్చినవారు
దీపం ఆరిపోతే వచ్చే వాసనను – గుర్తించలేరు.
అరుంధతీ నక్షత్రాన్ని – చూడలేరు.
మిత్రుని మాటలు వినరని పెద్దలు చెప్తారు అని క్రమంగా అన్వయించుకోవాలి.
ఇలా అన్వయించుకునే అలంకారాన్ని క్రమాలంకారం అంటారు.

కఠిన పదాలకు అర్ధములు

40వ పుట

మిత్ర లాభం = స్నేహం వలన లాభం
మైత్రి = స్నేహం
కాకము = కాకి
కూర్మము = తాబేలు
మృగము = జింక
మూషికము = ఎలుక
సవిస్తరముగా = వివరంగా
వనము, = అడవి
సఖ్యము = స్నేహం
వాసము = నివాసం
పోతరించి = బలిసి
సమీపమునకు = దగ్గరికి
మృతకల్పుడన = జీవచ్ఛవంగా

41వ పుట

తార్కాణము = నిదర్శనము
సావాసము = స్నేహం, కలిసి నివసించడం
జంబుకము = నక్క
మార్గాలము = పిల్లి
మృతి పొందెను = చనిపోయినది
జరద్దవము = గద్ద పేరు
చీకు ముసలి = గుడ్డి ముసలి
భక్షించుట = తినుట
మ్రాను = చెట్టు
సద్గు = చప్పుడు
కోలాహలము = పెద్ద శబ్దం, అల్లరి
బిడాలము = పిల్లి
కడు దాపునకు = చాలా దగ్గరికి
సురిగి = వెనుదిరిగి
శీఘ్రము = వెంటనే
వధ్యుడనో = చంపదగిన వాడనో
పూజ్యుడు = గౌరవింప దగినవాడు

42వ పుట

మాంసాశనము = మాంసాహారము
చాంద్రాయణ వ్రతము = ఒక వ్రతం పేరు (వివరణ చూడండి)
వధింప = చంపడానికి
మిక్కుటము = ఎక్కువ
నిష్కాముడు = కోరికలు లేని వాడను
కరస్థము = సులభము (చేతిలో ఉన్నట్లు)
భూత దయ = జీవుల పట్ల దయ
కడపట = చివరకు
తక్కినది = మిగిలినది
క్షుధ = ఆకలి
యథేచ్ఛముగా = ఇష్టం వచ్చినట్లుగా
మార్జాలము = పిల్లి

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

43వ పుట

చుంచువులు = పక్షి ముక్కులు
ప్రథమ దర్శనము = మొదటిసారి చూడటం
వర్ధిల్లు చున్నది = కొనసాగుతున్నది, పెరుగుతున్నది
మాఱు = బదులు
లఘు బుద్ధులకు = చిన్న బుద్ధి కలవారికి, తెలివిలేని వారికి
కాలుడు = యముడు
కాచి = వేచి
నావిని = అనగా విని
క్షేత్రము = పొలము
క్షేత్ర స్వామి = పొలం యజమాని
గూఢముగా = రహస్యంగా
ఎప్పటివాడుక = అలవాటుగా
కాలపాశము = యముని చేతిలోని తాడు
విపత్తు = ఆపద

44వ పుట

యత్నము = కృషి, పని
నేడుగా పండుగు = ఈ రోజు పండుగ (ఆనందం)
దాపునకు, కదియ = దగ్గరికి
నులి, నరములతో = పేగులు, నరములతో
భట్టారక వారము = ఆదివారము
హరిణము = జింక
తావు చేరమికి = నివాస స్థలానికి రాలేదని
చేటు గాలము = చెడు కాలము
హితులు = మేలు కోరేవారు
దీప నిర్వాణ గంధము = దీపము ఆరినప్పుడు వచ్చే వాసన
మూర్కొనరు = వాసనను గుర్తించలేరు
కనరు = చూడరు
ప్రత్యక్షమందు = ఎదురుగా
ఇచ్చకములు = ప్రియవచనములు
పరోక్షమందు = వెనక
కార్యహాని చేయు = పని చెడగొట్టె
సంగాతకుడు = స్నేహితుడు
పయోముఖ = పాలవంటి ముఖము కలిగిన
విషకుంభము = విషముతో నిండిన కుండ
సాంగత్యము = స్నేహం
అవశ్యము = తప్పక
దుర్జనులు = చెడ్డవారు
అనర్థము = కీడు
ప్రాప్తించును = కలుగుతాయి
జిత్తుల మారి = మోసము చేయు జీవి
నాలిక తీపు లోను విషము = మాటల్లో తీపి లోపల విషము ఉండుట (కపటం)
వెరపు = ఉపాయం
మసలరాదు = కదలకు
బడియ = కర్ర
(మీ) / బూరటించి = ఉబ్బించి

45వ పుట

తాకుపడి = దెబ్బతిని

మిత్రలాభం Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం 1

రచయిత పరిచయం

పాఠం పేరు : మిత్రలాభం
దేని నుండి గ్రహింపబడినది : నీతి చంద్రికలో మిత్రలాభం అనే మొదటి భాగంలోనిది.
రచయిత పేరు : పరవస్తు చిన్నయసూరి
రచయిత కాలం : జననం : 20-12-1806, మరణం : 1861
రచయిత స్వస్థలం : తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబుదూరు

తల్లిదండ్రులు : శ్రీనివాసాంబ, వేంకటరంగ రామానుజాచార్యులు
సంప్రదాయం : చాత్తాద శ్రీ వైష్ణవ సంప్రదాయం
తండ్రి వృత్తి : మదరాసు సుప్రింకోర్టు (ఇప్పటి హై కోర్టు) లో న్యాయమూర్తి

గురువులు : కంచి రామానుజాచార్యులు, (తర్క, మీమాంస, అలంకార శాస్త్రాలు) ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు, శ్రీరామశాస్త్రులు (వేదాలను, వేదార్థాలను, హయగ్రీవ మంత్రోపదేశం)
బహుభాషావేత్త : సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత, తమిళభాషలలో విద్వాంసుడు.
ఉద్యోగం : ఆఫ్ఘన్ మిషన్ పాఠశాలలో (1836), పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితునిగా (1844), రాజధాని కళాశాలలో ఆచార్యునిగా (1847), మదరాసు విశ్వవిద్యాలయంలో ప్రధాన పండితుడు (1857) పదవులను నిర్వహించాడు.

ప్రధాన రచనలు : చిన్నయసూరికి కీర్తిని ఆర్జించి పెట్టిన రచనలు బాలవ్యాకరణం, నీతిచంద్రిక.
ఇతర రచనలు : మొత్తం ఇరవై నాలుగు రచనలు. వాటిలో ప్రధానమైనవి: ఆంధ్ర శబ్దానుశాసనము, ఆంధ్ర ధాతుమాల, శబ్ద లక్షణ సంగ్రహం, నీతి సంగ్రహం, విభక్తి బోధిని, పద్యాంధ్ర వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, అక్షరగుచ్చము, లక్ష్మీనారాయణ తంత్రము, హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము.

పరిష్కరణ : నన్నయ భారత ఆదిపర్వాన్ని, కూచిమంచి తిమ్మకవి ‘నీలాసుందరీ పరిణయము’ను పరిష్కరించి ముద్రించాడు.
పత్రికలు : ‘వర్తమాన తరంగిణి’ పత్రికలో రచనలు చేశాడు. ‘సుజనరంజని’ అనే మాసపత్రికను నడిపాడు. నీతి చంద్రిక అంటే నీతులనే వెన్నెల.

సూరి బిరుదు : ఈ గ్రంథాన్ని రాజధాని కళాశాల అధికారి అర్బత్ నాట్కు అంకితమిచ్చాడు. అర్బత్నాట్ ‘చిన్నయసూరి’ అని ఆంగ్లాక్షరాలలో చెక్కిన బంగారు కడియాన్ని చిన్నయకు బహూకరించి ‘సూరి’ (పండితుడు) అనే బిరుదును ప్రదానం చేశాడు.

నీతి చంద్రిక పరిచయం

* వచన సాహిత్యంలో ధృవతార వంటిది నీతి చంద్రిక.
* నీతిచంద్రికకు మూలం సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన పంచతంత్రం, నారాయణ పండితుడు రాసిన హితోపదేశం అనే గ్రంథాలు
* విష్ణుశర్మ రాసిన పంచతంత్రంలో ఐదు తంత్రాలున్నాయి. అవి

 1. మిత్రభేద తంత్రం,
 2. మిత్ర సంప్రాప్తి,
 3. కాకోలుకీయం,
 4. లబ్ది ప్రణాశం,
 5. అపరీక్షిత కారిత్వం.

* నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలో నాలుగు భాగాలున్నాయి. అవి

 1. మిత్రలాభ,
 2. సుహృద్భేద,
 3. విగ్రహ,
 4. సంధి

* ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ‘నీతి చంద్రిక’ అనే వచనగ్రంథాన్ని 1853లో చిన్నయసూరి ప్రచురించాడు.
* నీతి చంద్రికలో మిత్ర లాభం, మిత్ర భేదం అనే రెండు భాగాలున్నాయి.
* చిన్నయ సూరి కంటే ముందు, తరువాత ఇతరులు పై రచనలను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశారు. కాని అన్నింటికంటే ఎక్కువ స్తూరి రచనయే పండిత లోక ప్రశంసలు అందుకున్నది.
* ఈ గ్రంథ పఠనం వల్ల లోకజ్ఞానం, వ్యవహారదక్షత, సమయస్ఫూర్తి, మూర్తిమత్వం, నీతి కుశలతలతో పాటు భాషాజ్ఞానం, సృజనాత్మకతలు అలవడుతాయి.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

పాఠ్యభాగ నేపథ్యం

గంగానది తీరంలో పాటలీపుత్రమనే పట్టణాన్ని సుదర్శనుడనే రాజు పరిపాలించాడు. సుదర్శనుడు విష్ణుశర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు. విష్ణుశర్మ రాజకుమారులకు నీతిచంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు. ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగంలో నక్క జింకతో చెలిమి చేయుటకు ప్రయత్నించుట, ముసలిగద్ద, మార్జాల వృత్తాంతం, మృగకాక జంబుకముల కథ మొదలైనవి ఉన్నాయి.

పాఠ్యభాగ సారాంశం

విష్ణుశర్మ రాజకుమారులకు కథల ద్వారా విద్య నేర్పిస్తూ సంపాదన లేకున్నా కాకి, తాబేలు, జింక, ఎలుకలు స్నేహంగా ఉండి తమ కార్యాలను సాధించుకున్నాయి అని చెప్పాడు. అప్పుడు రాకుమారులు వాటి కథను వివరంగా చెప్పుమని కోరారు. విష్ణుశర్మ కాకి, నక్క, జింకల కథను చెప్పాడు.

నక్క జింకతో స్నేహం చేయడం : మగధ అనే దేశంలో మందారవతి అనే అడవి ఉంది. అందులో చాల రోజులనుండి ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. పుష్టిగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి మిత్రమా అని పిలిచింది. ఎవరు నువ్వు అని జింక అడిగితే, నేను నక్కను. నాపేరు సుబుద్ధి. నా బంధువులందరూ చనిపోయారు. నేను ఒంటరిగా ఈ అడవిలో జీవచ్ఛవం లాగా ఉంటున్నాను. నిన్ను దేవునిలా అనుకొని చెప్పుతున్నాను. నిన్ను చూడఁగానే నాబంధువులందఱు వచ్చినట్లు అనిపించింది. మంచి వారిని చూస్తే అన్ని పాపాలు పోతాయి.

అన్ని శుభాలు కలుగుతాయి అనడానికి నిన్ను కలవడమే నిదర్శనం. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతడు సుబద్ధి అనే మంచి నక్క, నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని జింక చెప్పింది. ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి గద్ద ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినది. ఆ కథ చెప్తాను విను అని చెప్పింది.

ముసలిగద్ద – పిల్లి కథ : భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చేవి. గద్ద ఆ ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది.

నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది. అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడనుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. తరువాత నేను చంపదగినవాడనా కాదా నిర్ణయించండి: లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.

ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలను అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాణ్ణి చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలైనా చెప్పాలి కాని ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు.

ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి. అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పింది. అలా అనఁగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ ! ఎంత పాపముచేసి ఈ పిల్లిజన్మ ఎత్తానో అది చాలదని ఈ పాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది. ధర్మశాస్త్రము విని నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం చేస్తానా ? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని బోధిస్తున్నాయి.

ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది. భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు. కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనఁ గా గద్దవిని కోపం తెచ్చుకోకండి.

కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు. పోయినమాట పోని. నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, బోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ ఆ చెట్టు తొర్రలో నివసించేది.

ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్ధరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది. అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధపడి వెతకడం ప్రారంభించాయి. అది తెలుసుకున్న పిల్లి అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి ముక్కులతో పొడిచి చంపాయి. కాబట్టి కొత్తగా వచ్చినవారిని నమ్మరాదని కాకి జింకకు చెప్పింది. అనగా విని నక్క కాకిని మిక్కిలి కోపంతో చూసి ఇలా అన్నది.

మృగ, కాక, జంబుకముల కథ : “మొదటి సారి చూసినప్పుడు నీవు కూడా కొత్త వాడివే కదా, మరి మీ మధ్య స్నేహం ఎలా పెరిగింది. నీకు ఎదురు చెప్పేవారు లేరు కాబట్టి నోటికొచ్చినట్లు నీతులు చెప్తున్నావు. మేధావులు లేనిదగ్గర చిన్న తెలివైన వారుకూడా మేధావులుగా గౌరవాన్ని పొందుతారు. చెట్లు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షంగా అనిపిస్తుంది. వీడు నావాడు, వీడు పరాయివాడు అని కొంచెపు బుద్ధిఉన్నవారే అనుకుంటారు. మహాత్ములైనవారికి లోకమంతా తనకుటుంబమే. ఈ జింక నాకు బంధువు ఐనట్లు నీవు కాదా ? మనం ప్రపంచమున్నన్ని రోజులు బతుకుతామా? యముడు చంపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

బతికినంత కాలం అందరితో మంచివాడని పించుకోవాలి గాని ఇలా విషపు భావన అవసరమా?” అని నక్క అనగానే జింక ఇలా అన్నది. ఈ మాటలన్నీ ఎందుకు మనందరం కలిసి మెలిసి ఉంటూ కాలక్షేపంచేద్దాం. వీళ్ళకు వీళ్ళు మిత్రులు, వీళ్ళకు వీళ్ళు శత్రువులు అనే నియమం ఏమిలేదు. ప్రవర్తన కారణంగానే మిత్రులు, శత్రువులు అవుతారు. అనగానే కాకి అలాగేనని చెప్పింది. ఆ మూడు చాలా రోజులు స్నేహంగా జీవించాయి. ఒకరోజు నక్క జింకతో మిత్రమా! ఈ వనం దగ్గరలో మంచిగా పండిన పొలమును నేను చూశాను.

నీవు నావెంట వస్తే నీకు చూపిస్తానని చెప్పి తనతో తీసుకువెళ్ళింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయడం ప్రారంభించింది. ఒకరోజు ఆ పొలం యజమాని దానిని గమనించి ఆ జింకను ప్రాణంతో విడవకూడదని భావించి, రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలాగానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది. అయ్యో! తెలియక వచ్చి ఈ వలలో చిక్కుకున్నాను కదా. నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించేవారెవరున్నారు అని ఆలోచించ సాగింది. ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది. ఇప్పుడు ఆ పొలం యజమాని వస్తే దీన్ని చంపకమానడు.

దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక మిత్రమా త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు. అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని. చెడుకాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను. నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు.

మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క

చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదో ఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఊపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను.

నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది, తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అదివిని జింక లేచి పరిగెత్తింది. అయ్యో! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్కచచ్చింది. చూడండి నక్క ఏమనుకున్నది, అక్కడ ఏమి జరిగింది. పరులకు హాని చేయాలని చూస్తే తమకే హాని కలుగుతుంది అని విష్ణుశర్మ రాజకుమారులకు తెలిపాడు.

Leave a Comment