Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar అనువాదం Questions and Answers.
TS Inter 1st Year Telugu Grammar అనువాదం
ఒక భాష నందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం. దీనినే ఆంగ్లంలో Translation అంటారు. అనువాదం చేయదలచుకున్న భాషను మూల భాష (Source Language) అని, అనువాదం ఏ భాషలోకి చేయదలచుకున్నారో భాషను లక్ష్య భాష (Target Language) అని అంటారు. ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్యాంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతం లోని విషయాలను, సంస్కృతీ విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు తోడ్పడుతుంది.
భారతీయ భాషలలో ఒక భాషనుంచి మరొక భాషలోకి, విదేశీ భాషలలోకి, విశ్వసాహిత్యం నుంచి భారతీయ భాషలలోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలి, హిందీ, ఉర్దూ, తమిళ, మళయాళ, కన్నడ ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం, ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యం అనువాదం అయింది.
మూలరచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడం మరొక పద్ధతి.
అనువాద విధానంలో పాటించాల్సిన మెలకువలు
అనువాదంలో సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి. భాషాసంబంధమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.
భిన్న సంస్కృతులు భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పద బంధా లను ముందుగా క్రోడీకరించుకోవాలి. ఇంగ్లీషులో ice, snow, dew లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదా నికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి.
ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషా సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. దానిని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి.
సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడుతారు. అట్లాగే, ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అంటే -జాతికి, ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది. సాంఘిక జీవితం ఉంటుంది. మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతిభావాలు, భావాల తీరును బట్టి భాషలుంటాయని గమనించాలి.
భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఇంగ్లీషులో bread, soup, sandwich లాంటి మాటలను గమనించండి. తెలుగు అన్నంలోనూ, కూరల్లోనూ చాలా రకాలున్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు.
ఇంగ్లీషులో Rice అంటే అన్నం కావచ్చు. బియ్యమూ కావచ్చు. అంటే, ఇంగ్లీషువారికి Rice అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి కొత్తపదాల సృష్టి వాళ్ళకు అవసరం లేకుండా పోయింది. అంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం ప్రధానపాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గమనించాలి.
అనువాదంలో భాషా సమస్యలు కూడా ప్రధాన అంశమే. మూలభాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండటం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని……… 1. రాసే అలవాట్లు, 2. పదాలు, నుడికారాలు వాటి అర్థ విశేషాలు 3. పదనిర్మాణం 4. వాక్య భేదాలు, ప్రయోగాలు ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన సమస్యలుగా గుర్తించాలి.
మూలభాషలోని నుడికారం తెలియకపోతే, తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పిన సమస్యలను గుర్తించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది.
అనువాదం అభ్యాసానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు
ప్రశ్న 1.
A journey of thousand miles begins with a single step
జవాబు:
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.
ప్రశ్న 2.
There is plenty of water in that region.
జవాబు:
ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది.
ప్రశ్న 3.
There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.
ప్రశ్న 4.
Imagination rules the world.
జవాబు:
ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది.
ప్రశ్న 5.
Maturity comes with experience not age.
జవాబు:
పరిణతి, వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది.
ప్రశ్న 6.
Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.
ప్రశ్న 7.
A picture is a poem without words.
జవాబు:
పదాలు లేని పద్యమే చిత్రం
ప్రశ్న 8.
The best way to predict the future is to create it.
జవాబు:
భవిష్యత్తును అంచనావేయటానికి ఉత్తమ మార్గం, దానిని సృష్టించటమే.
ప్రశ్న 9.
Learn as if you live forever.
జవాబు:
ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి.
ప్రశ్న 10.
By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.
ప్రశ్న 11.
Reading is to the mind what exercise is to the body.
జవాబు:
శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది.
ప్రశ్న 12.
Sometimes, later becomes never do it now.
జవాబు:
కొన్నిసార్లు, తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి.
ప్రశ్న 13.
Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.
ప్రశ్న 14.
Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.
ప్రశ్న 15.
What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.
ప్రశ్న 16.
Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.
ప్రశ్న 17.
A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.
ప్రశ్న 18.
What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు?
ప్రశ్న 19.
I completed reading the book yesterday.
జవాబు:
నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను.
ప్రశ్న 20.
Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.