Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar అలంకారాలు Questions and Answers.
TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు
ఛందస్సు ‘లయ’ ప్రధానం కాగా, అలంకారం ‘సౌందర్య’ ప్రధానం. వస్తువును అలంకరించేది అలంకారం. చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది అలంకారం.
అలంకారాలు రెండు రకాలు :
(అ) శబ్దాలంకారాలు,
(ఆ) అర్థాలంకారాలు
అ) శబ్దాలంకారాలు :
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి శబ్దాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి మనోహరంగా ఇవి భాసిస్తాయి. (కనబడతాయి, తోస్తాయి)
- వృత్త్యనుప్రాస
- ఛేకానుప్రాస
- లాటానుప్రాస
- అంత్యానుప్రాస
- యమకం
1. వృత్త్యనుప్రాస :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ హల్లులుగాని అనేకసార్లు ఆవృత్తి (మరల మరల రావడం) అయినట్లైతే దానిని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణలు :
1) చిటపట చినుకులు పటపట కురిసెను.
2) జలజల కాలువలు గలగల పారెను.
గమనిక : మొదటి ఉదాహరణలో ‘ట’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. రెండవ ఉదాహరణలో ‘ల’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది.
2. ఛేకానుప్రాస :
రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ఉదా : పాప సంహరుడు హరుడు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, మొదటి ‘హరుడు’ అనగా, హరించేవాడు అని, రెండవ ‘హరుడు’ అనే పదానికి, ‘శివుడు’ అని అర్థం. మొత్తం వాక్యానికి “పాపాలను హరించేవాడు శివుడు” అని అర్థం. ఈ విధంగా ఒకే పదం, అనగా ‘హరుడు’ అనే పదం, అర్థభేదంతో వెంటవెంటనే వచ్చింది. కాబట్టి ఇది ‘ఛేకానుప్రాస’
అలంకారము.
3. లాటానుప్రాస :
ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే, అది ‘లాటానుప్రాస’ అలంకారం అవుతుంది.
ఉదా : కమలాక్షు నర్చించు కరములు కరములు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, ‘కరములు’ అనే మొదటి పదానికి, సామాన్యమైన చేతులు అనీ, రెండవ ‘కరములు’ అనేదానికి శ్రేష్ఠమైన చేతులు అనీ, తాత్పర్య భేదము ఉంది. ‘కరములు’ అనే పదాలు, రెండింటికీ “చేతులు” అనే అర్థం. కాని, రెండవ కరములు అనే పదానికి, శ్రేష్ఠమైన చేతులు అనే తాత్పర్యము, భేదంగా ఉంది. .కాబట్టి ఇది “లాటానుప్రాస అలంకారము.
4. అంత్యానుప్రాస :
ఒకే హల్లుగానీ, ఒకే పదంగానీ పాదం యొక్క అంతంలో గాని, పదం యొక్క అంతంలో గానీ, వాక్యం చివరలో గానీ వచ్చినట్లయితే దాన్ని ‘అంత్యానుప్రాస’ అంటారు.
ఉదాహరణలు :
1) బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
వివరణ : ఇందులో ‘గా’ అనే హల్లు, నాలుగు పాదాల చివర వచ్చింది. కాబట్టి, ఇది ‘అంత్యానుప్రాస’.
2) భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఇందులో, పై పాదాల చివరలో ‘న్నో’ అనే పదం, పునరావృతమయింది. (తిరిగి వచ్చింది)
5. యమకం :
అక్షర సముదాయం అర్థభేదంతో పునరావృతమైనచో దాన్ని ‘యమకాలంకార’ మంటారు.
ఉదాహరణ : లేమా ! దనుజుల గెలవగ
లేమా ! నీవేల కడగి లేచితి విటులన్
లే, మాను ! మాన వేనియు
లే మా విల్లందు కొనుము లీలిన్ గేలన్.
వివరణ : పై పద్యంలో మొదటి ‘లేమా’ అనేది, స్త్రీ సంబోధన వాచకం. రెండవ ‘లేమా’ అనేది, గెలువలేకపోతామా ? అనే అర్థాన్ని ఇచ్చేది. మూడవ చోట, ‘లే’ కు, లెమ్మని, మానుకొమ్మని అర్థం. నాలుగో చోట, లేచి మా విల్లు అందుకొమ్మని ప్రేరేపించటం. అందువల్ల ఇది యమకాలంకారం.
ఆ) అర్థాలంకారాలు :
వివరణ :
అర్థం ప్రధానంగా కలిగి చమత్కారం కలిగించేవి ‘అర్థాలంకారాలు’. పాఠకులకు మనోల్లాసం కలిగించటంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సుమారు వంద వరకు అర్థాలంకారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైనవి “ఆఱు అలంకారాలు”.
అవి :
- ఉపమాలంకారం
- ఉత్ప్రేక్షాలంకారం
- రూపకాలంకారం
- అతిశయోక్తి అలంకారం
- అర్ధాంతరన్యాసాలంకారం
- స్వభావోక్తి అలంకారం
1. ఉపమాలంకార లక్షణము :
ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”. ఇందులో (1) “ఉపమేయం” (వర్ణించే వస్తువు), (2) “ఉపమానం” (పోల్చు వస్తువు), (3) సమాన ధర్మం, (4) ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.
ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది.
దీనిలో,
- ఉపమేయం : “రాజుకీర్తి”
- ఉపమానం : ‘హంస’
- సమాన ధర్మం : “ఓలలాడటం”
- ఉపమావాచకం : ‘వలె’
2. ఉత్ప్రేక్షాలంకార లక్షణము :
‘ఉత్ప్రేక్ష’ అంటే ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
ఉదాహరణలు :
- ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
- గాంధీ మహాత్ముని హత్య వల్ల భారతజాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు.
వివరణ : పై రెండు ఉదాహరణలలోనూ, ఊహ ప్రధానంగా ఉన్నది. మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, దుః ఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడా అన్నట్లు, అనే రెండు చోట్లనూ ఊహలే ఉన్నాయి. అందువల్ల, ఇవి ‘ఉత్ప్రేక్ష’లకు ఉదాహరణలు.
3. రూపకాలంకార లక్షణము :
ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది ‘రూపకాలంకారం’.
`ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్”
వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.
4. అతిశయోక్తి అలంకార లక్షణము :
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’. ఉన్నదాని కంటె అతిశయం చేసి చెప్పడమే, అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి.
ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం ‘అతిశయోక్తి’.
5. అర్ధాంతరన్యాసాలంకార లక్షణము :
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ, సమర్థించి చెప్పినట్లయితే ‘అర్ధాంతరన్యాసాలంకారము’.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.
6. స్వభావోక్తి లక్షణము :
జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. – ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.
గమనిక :
ఈ అభ్యాసములో అలంకారాలపై కేవలము 16 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుండియే, ఎనిమిది ప్రశ్నలు, మీకు పరీక్షల్లో ఇచ్చి, వాటిలో ఆరింటికి, జవాబులు వ్రాయమని అడుగుతారు. వాటికి “ఆఱు మార్కులు” ఇస్తారు. కాబట్టి వీటిని బాగా శ్రద్ధగా చదువండి.
అభ్యాసం
ప్రశ్న 1.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.
ప్రశ్న 2.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది’ ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృతి అయితే, అది ‘వృత్త్యనుప్రాస’ అలంకారం.
ప్రశ్న 3.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ప్రశ్న 4.
‘కమలాక్షు నర్చించు కరములు కరములు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘లాటానుప్రాస’ అలంకారము.
ప్రశ్న 5.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ప్రశ్న 6.
‘యమకం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమకాలంకారమంటారు.
ప్రశ్న 7. *(M.P)
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)
ప్రశ్న 8.
‘ఉపమేయం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’).
ప్రశ్న 9.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ? *(M.P)
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.
ప్రశ్న 10.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
రూపకాలంకారము.
ప్రశ్న 11.
‘అతిశయోక్తి’ అనగానేమి ? *(M.P)
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.
ప్రశ్న 12.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ? *(M.P)
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.
ప్రశ్న 13.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.
ప్రశ్న 14.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.
ప్రశ్న 15.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. *(M.P)
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.
ప్రశ్న 16.
ఉపమావాచకాలు ఏవి ? *(M.P)
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.