TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద పెద్ద పేరాలలో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం రాతనైపుణ్యాలలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం. మూలంలోని అంశం ప్రతిబింబించేలా తక్కువ పదాల్లో భావాన్ని వ్యక్తీకరించడమే సంక్షిప్తీకరణ. విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో దీనిని ఒక అంశంగా చేర్చాం.

ప్రశ్న 1.
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం :
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 2.
ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం :
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 3.
ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు. *(M.P.)
జవాబు:
సంక్షిప్తరూపం :
ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.

Leave a Comment