Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar ఛందస్సు Questions and Answers.
TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత ఛందస్సులో అంతర్గతంగా వుంటుంది. గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి.
- లఘువు : ఒక మాత్ర కాలంలో పలుక బడేది లఘువు. లఘువుని (I) ఈ గుర్తుతో సూచిస్తాం.
- గురువు : రెండు మాత్రల కాలంలో పలికేది గురువు. గురువును (U) ఈ గుర్తుతో సూచిస్తాం.
- యతి : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
- యతి మైత్రి : పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి, ‘యతిమైత్రి’ అని పేరు.
- ప్రాస : పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
- ప్రాస నియమం : నాలుగు పద్య పాదాలలోనూ, ఒకే హల్లును ప్రాస స్థానంలో ప్రయోగిస్తే, దానిని ‘ప్రాసనియమం’ అంటారు.
పద్యాలు ప్రధానం మూడు రకాలు.
- వృత్తాలు,
- జాతులు,
- ఉపజాతులు.
వృత్త పద్యాలు
1. ఉత్పలమాల లక్షణము:
- ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
- ప్రతి పాదంలో, 10 వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
- నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
- నాలుగు పాదాలకు లక్షణాలు సమానం..
ఉదా :
యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా’ లకు యతిమైత్రి చెల్లుతుంది.
2. చంపకమాల లక్షణము :
- ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
- ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
- ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
- నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
- నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.
ఉదా :
యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.
గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో” యతి.
3. శార్దూలం లక్షణము :
- ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
- ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
- అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
- నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
ఉదా :
యతిమైత్రి : 1-13 అక్షరాలైన ‘శ్రే – రే’ లకు యతిమైత్రి.
4. మత్తేభం లక్షణము :
- ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
- ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
- నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
- నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
ఉదా :
యతిమైత్రి : 1-14 అక్షరాలైన ‘స-త్స’లకు యతిమైత్రి చెల్లుతుంది.
జాతులు
1. కందం లక్షణము
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు. - కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
- బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
- ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
- 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
- రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
- ప్రాసనియమం ఉండాలి.
ఉదా :
యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.
ఉపజాతులు
ప్రాస యతి ఉండి, ప్రాస నియమం లేకపోవడం, ఉపజాతి పద్యాల ప్రత్యేకత.
1. ఆటవెలది లక్షణము :
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
- ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
- ప్రాసయతిని పాటింపవచ్చును.
- ప్రాసనియమం ఉండదు.
ఉదా :
యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.
2. తేటగీతి లక్షణము :
- తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
- ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
- ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
- ప్రాసయతిని పాటింపవచ్చు.
- ప్రాస నియమం ఉండదు.
ఉదా :
యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.
3. సీసం లక్షణము :
- సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
- ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
- పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
- ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
- ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
- సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.
ఉదా :
యతిమైత్రి : 1-3 లో-లో, 5-7 క-గ లకు యతిమైత్రి చెల్లింది. లో-లో, క-గ-యతిమైత్రి చెల్లింది.
గమనిక :
ఈ అభ్యాసములో 22 చిన్న ప్రశ్నలున్నాయి. వీని నుండి మీకు పేపరులో, ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో మీరు ఆరు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. వాటికి ఆరుమార్కులు వస్తాయి. కాబట్టి వీటిని, అతిశ్రద్ధగా చదివి, ఆరుమార్కులను మీ స్వంతము చేసికోండి.
అభ్యాసం
ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.
ప్రశ్న 2.
‘గురువు’ అనగానేమి ? * (M.P)
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.
ప్రశ్న 3.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.
ప్రశ్న 4.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
ప్రశ్న 5.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
ప్రశ్న 6.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ? * (M.P.)
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :
- వృత్తాలు
- జాతులు
- ఉపజాతులు.
ప్రశ్న 7.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.
ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.
ప్రశ్న 9.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.
ప్రశ్న 10.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.
ప్రశ్న 11.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.
ప్రశ్న 12.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.
ప్రశ్న 13.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.
ప్రశ్న 14.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.
ప్రశ్న 15.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.
ప్రశ్న 16.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.
ప్రశ్న 17.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.
ప్రశ్న 18.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.
ప్రశ్న 19.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ? * (M.P.)
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.
ప్రశ్న 20.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :
- హ గణము (గలము)
- న గణము అనేవి.
ప్రశ్న 21.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.
ప్రశ్న 22.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.