TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar భాషాభాగములు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

భాషా భాగములు : తెలుగు భాషలోని శబ్దాలన్నీ ప్రధానంగా, ఐదురకాలైన భాషాభాగాలతో కూడి యుంటాయి. భాషలోని భాగాలే భాషాభాగాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం

1. నామవాచకం :
‘నామం’ అంటే పేరు. పేర్లను తెలియజేసే భాషా పదాలు, ‘నామవాచకాలు’. నామవాచకానికి, ‘విశేష్యం’ అని పేరు కూడా ఉంది.
ఉదా :
రాము, రఘ, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత మొదలయినవి నామవాచకములు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాము కళాశాలకు వెళ్ళాడు. – (‘రాము’ అనేది నామవాచకం)
  2. వరంగల్ పెద్ద పట్టణం – (వరంగల్ అనేది నామవాచకం)
  3. వనిత, కవిత అక్కా చెల్లెళ్ళు – (వనిత, కవిత అనే పదాలు నామవాచకాలు)
  4. భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం – (‘భద్రాచలం’ అనేది నామవాచకం)
  5. కూచిపూడి నాట్యం గొప్పది – (‘కూచిపూడి’ అనేది నామవాచకం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
ఉదా :
వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది మొదలయినవి సర్వనామాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. – (‘అతడే’ సర్వనామం)
  2. అతడు శ్రీరాముడు. – (‘అతడు’ సర్వనామం)
  3. వీడు అబద్దాల కోరు. – (‘వీడు’ సర్వనామం)
  4. ఆమె సౌందర్యవతి. – (‘ఆమె’ సర్వనామం)
  5. మనం భారతీయులం. – (‘మనం’ సర్వనామం)

3. విశేషణం :
నామవాచకం, సర్వనామాల గుణాలను తెలియజేసేవి ‘విశేషణాలు’.
ఉదా :
నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని, తియ్యని మొదలయినవి విశేషణాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. – (‘మంచి’ విశేషణము)
  2. స్వాతి అందమైన పాప. – (‘అందమైన’ విశేషణము)
  3. కృష్ణుడు నల్లని వాడు. – (‘నల్లని’ విశేషణము)
  4. మాధవి మనోహరమైన స్త్రీ. – (‘మనోహరమైన’ అనేది విశేషణము)
  5. శ్రీనివాసుడు ధనవంతుడు. – (‘ధనవంతుడు’ విశేషణము)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

4. క్రియ :
చేసే పనిని తెలియజేసే పదాన్ని ‘క్రియ’ అంటారు.
ఉదా :
కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడుచు మొదలయినవి క్రియలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాముడు రావణుని సంహరించాడు. – (‘సంహరించాడు’ అనేది క్రియ)
  2. వాల్మీకి రామాయణం రచించాడు. – (‘రచించాడు’ అనేది క్రియ)
  3. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. – (‘వెళ్ళాడు’ అనేది క్రియ)
  4. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. – (‘మాట్లాడుతున్నాడు’ అనేది క్రియ)
  5. సుప్రజ నిద్రిస్తుంది. – (‘నిద్రిస్తుంది’ అనేది క్రియ)

5. అవ్యయం :
లింగ, విభక్తి, వచనం లేని శబ్దములను ‘అవ్యయాలు’ అంటారు.
ఉదా :
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట – మొదలయినవి అవ్యయాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఎక్కడ ఆరోగ్యం వుంటుందో అక్కడ సంపద వుంటుంది. – (ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు)
  2. మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను. – (‘అప్పుడు అవ్యయం’)
  3. బంగారు లేడిని చూచి సీత ఆహా ! అనుకుంది. – (‘ఆహా’ అనేది అవ్యయం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

గమనిక :
భాషాభాగాలపై ఈ అభ్యాసములోని ప్రశ్నలలో నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలలో ఇస్తారు. ఐదు జవాబులకూ, ఐదు మార్కులు. మీకు ఈ అభ్యాసంలో 12 ప్రశ్నలు ఉన్నాయి. వీటి నుండే, మీకు పేపర్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, శ్రద్ధగా చదువండి. ఐదుకి ఐదుమార్కులు పొందండి.

అభ్యాసం

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ? *(M.P)
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 6.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 7.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 8.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 9.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 10.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ? *(M.P)
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 11.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 12.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

Leave a Comment