Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 4th Lesson రాష్ట్ర ప్రభుత్వం Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 4th Lesson రాష్ట్ర ప్రభుత్వం
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు, విధుల గురించి రాయండి.
జవాబు.
గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహకశాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రపతిచే నియమితుడైన గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీద అమలవుతాయి.
గవర్నర్ అధికారాలు విధులు : గవర్నర్ ముఖ్యమైన అధికారాలు, విధులను నిర్వర్తిస్తాడు. అవి :
- కార్యనిర్వాహక అధికారాలు – విధులు
- శాసనాధికారాలు విధులు
- ఆర్థికాధికారాలు – విధులు
- న్యాయాధికారాలు – విధులు
- ఇతర అధికారాలు – విధులు
- విచక్షణాధికారాలు విధులు
1. కార్యనిర్వాహక అధికారాలు-విధులు :
రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ అధీనంలో ఉంటాయి. రాజ్యాంగం 154వ ప్రకరణంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగానూ లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా వినియోగిస్తాడు.
- గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు.
- ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
- మంత్రులకు శాఖలు కేటాయించడం, వాటిని మార్పు చేయడం చేస్తాడు.
- ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను తొలగిస్తాడు.
- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తాడు.
- రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల ఛైర్మన్, సభ్యులను నియమిస్తాడు. అవి,
ఎ) పబ్లిక్ సర్వీస్ కమిషన్
బి) అధికార భాషా సంఘం
సి) మైనారిటీ కమిషన్
డి) మహిళా కమీషన్
ఇ) ప్రభుత్వరంగ సంస్థల కమిటీలు
2. శాసన నిర్మాణాధికారాలు :
గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉంటాడు.
- గవర్నర్ రాష్ట్ర శాసన సభలను సమావేశపరుస్తాడు. వాయిదా వేస్తాడు. రాష్ట్ర శాసన సభను రద్దుచేస్తాడు.
- శాసనసభలో స్వయంగా ప్రసంగిస్తాడు, లేదా తన సందేశాలు పంపుతాడు.
- శాసనమండలిలో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.
- ఆంగ్లో-ఇండియన్ తెగకు చెందిన వారెవరూ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆ తెగకు సంబంధించిన ఒకరిని నామినేట్ చేస్తాడు.
- శాసనసభ తొలివార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ప్రారంభిస్తాడు.
- రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు. బిల్లులలో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పునఃపరిశీలనకు పంపుతాడు.
ఆర్థికాధికారాలు :
గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో శాసనసభలో ద్రవ్యబిల్లులు సమర్పించేందుకు అనుమతిస్తాడు. శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సహకరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ అగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. వివిధ విత్త సంబంధమైన నివేదికలను విధానసభకు సమర్పించేలా చూస్తాడు.
న్యాయాధికారాలు :
గవర్నర్కు న్యాయసంబంధ అధికారాలు, విధులు ఉన్నాయి. జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారుల నియామకం, పదోన్నతులను గవర్నర్ ప్రభావితం చేస్తాడు. రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా రద్దుచేయడానికి అధికారం ఉంటుంది.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహాలిస్తాడు. రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాలలోని న్యాయసిబ్బందిని హైకోర్టు సూచనలపై నియమిస్తాడు.
ఇతర అధికారాలు :
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు పంపుతాడు.
విచక్షణాధికారాలు : ఈ అధికారాలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు. అవి :
- ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం.
- రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
- శాసన, పరిపాలనా, సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
- శాసనసభను రద్దుపరచడం.
- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం.
- శాసనసభ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి, దానిని పునఃపరిశీలన కోసం వెనకకు పంపడం.
ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు, విధులు వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 164వ ప్రకరణను అనుసరించి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. సాధారణంగా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.
అధికారాలు విధులు : ముఖ్యమంత్రి ఎన్నో అధికారాలను, విభిన్నమైన విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పరిశీలించవచ్చు.
1. మంత్రిమండలి ఏర్పాటు :
రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి స్వతంత్ర అధికారం, బాధ్యత. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలో కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేట్లు చూస్తాడు.
మంత్రుల శాఖలు కేటాయింపు, మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్కు సలహా ఇస్తాడు. ఎవరినైనా మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా కూడా గవర్నర్కు సలహా ఇస్తాడు.
2. మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం :
ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అధ్యక్షుడు. ఇతడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్ణయిస్తాడు. సమావేశాలలో చర్చలను ప్రారంభిస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు.
3. గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి :
గవర్నర్ – మంత్రిమండలి మధ్య ముఖ్యమంత్రి ప్రధానమైన వారధిగా ఉంటాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను తెలియపరచవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాష్ట్రశాసనాల ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలుపుతాడు. గవర్నర్కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తాడు.
4. శాసనసభ నాయకుడు :
ముఖ్యమంత్రి శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ సభ్యుల నాయకుడిగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను ఇతడు శాసనసభలో తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగాను, విజయవంతంగాను అమలయ్యేలా శాసనసభ్యుల మద్దతు కోరతాడు.
5. అధికార ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విధానాలు, కార్యక్రమాలను ప్రకటిస్తాడు. శాసనసభ సమావేశాలలోనూ, శాసనసభ వెలుపలా అతడు చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం, చట్టబద్ధత ఉంటాయి.
6. అధికారపార్టీ నాయకుడు :
రాష్ట్రంలో అధికారపార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. పార్టీ సమావేశాలలో అతను పాల్గొంటాడు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పార్టీ సభ్యులకు తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలను విజయవంతంగా, సమర్థవంతంగా అమలుచేయడానికి పార్టీ సభ్యుల సహకారం, మద్దతు కోరతాడు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేకూరుస్తాడు.
ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలను తెలపండి.
జవాబు.
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అంతర్భాగం. మంత్రి మండలిలో ఒకటి లేదా అంతకుమించిన పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఉండవచ్చు. వారందరూ సమిష్టిగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారు.
నిర్మాణం:
రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, కేబినేట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ గవర్నర్చే నియమించబడతారు. రాష్ట్ర శాసనసభలో తన పార్టీకి చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించవలసిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు తగిన సూచనలిస్తాడు.
అధికారాలు – విధులు :
రాష్ట్ర మంత్రిమండలికి క్రింద పేర్కొన్న అధికారాలు విధులు ఉంటాయి.
1. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన :
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, ఖరారు చేసి అమలులో ఉండే బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ కోసం మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ సందర్భంలో మంత్రిమండలి సభ్యులు అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ముఖ్యంగా కేబినెట్ మంత్రులు అనేక పర్యాయాలు సమావేశమై మొత్తం మంత్రిమండలి పేరుతో విధానపరమైన నిర్ణయాలు తీసుకొంటారు.
2. పరిపాలన నిర్వహణ :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలు, చట్టాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన నిర్వహిస్తారు. ప్రతీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకు మించిన శాఖల పరిపాలనపై నియంత్రణను, బాధ్యతను కలిగి ఉంటాడు.
3. సమన్వయ విధి :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాఫీగా నిర్వహించటం సాధ్యంకాదు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలలో తీసుకొన్న నిర్ణయాలను మంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, మద్దతునిస్తారు.
4. నియామక అధికారాలు :
రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులనందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి నియామకాలు జరిపే వారిలో అడ్వకేట్ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులు మొదలైనవి అనేకం ఉంటాయి.
5. శాసన నిర్మాణంలో పాత్ర :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనకు సంబంధించిన విషయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలే నిర్ణయిస్తుంది.
శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసననిర్మాణ విషయంలో కీలకమైన సంస్థగా కొనసాగుతుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు సలహాలిస్తుంది.
ప్రశ్న 4.
రాష్ట్ర శాసనమండలి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు.
శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. ప్రస్తుతం కేవలం ఏడు రాష్ట్రాలలోనే శాసనమండలి ఉంది. అవి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు.
శాసనమండలి సభ్యత్వ సంఖ్య కనీసం 40 లేదా శాసనసభ సభ్యులలో 1/3 వంతు మించరాదు. శాసనమండలి ఏర్పాటు లేదా రద్దు. విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన సిఫారసును భారత పార్లమెంట్ ఆమోదిస్తుంది.
అర్హతలు : శాసనమండలి సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థి కింది అర్హతలు కలిగి ఉండాలి.
- భారత పౌరుడై ఉండాలి.
- 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.
కాలపరిమితి :
శాసనమండలి శాశ్వతసభ. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ప్రతీ సభ్యుడు ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు శాసనమండలి సమావేశమవ్వాలి. రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలల వ్యవధి మించరాదు.
నిర్మాణం : శాసనమండలికి ఎన్నికయ్యే సభ్యులు అయిదు విభిన్న రకాలుగా ఎన్నుకోబడతారు.
- మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికలగణం ఎన్నుకొంటుంది.
- మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకొంటారు.
- మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్ళపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
- మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
- మిగిలిన సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక, సేవారంగాలకు సంబంధించిన వారై ఉంటారు.
శాసనమండలి సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. సభా నిర్వహణ కోసం ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఉంటారు. శాసనమండలి సభ్యుల ద్వారా వీరు ఎన్నికవుతారు. శాసనసభ సభ్యులకున్న అధికారాలే శాసనమండలి సభ్యులకు ఉంటాయి.
శాసనమండలి అవిశ్వాస తీర్మానం ఆమోదించడం ద్వారా ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను పదవి నుంచి తొలగించవచ్చు. దీనిని సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది.
ప్రశ్న 5.
రాష్ట్ర శాసనసభలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
ప్రజాస్వామ్యయుతమైన శక్తిమంతమైన, ప్రజామోదం పొందిన శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకొంటారు.
నిర్మాణం :
ప్రతీ రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ సభ్యత్వం సంఖ్య 60-500 మధ్య ఉంటుంది. శాసనసభ సభ్యులను రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నుకొంటారు. శాసనసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.
శాసనసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రతినిధులకు కేటాయించబడ్డాయి. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారికి శాసనసభలో ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే ఆ తెగకు చెందిన ఒకరిని నామినేట్ చేస్తాడు.
అర్హతలు : శాసనసభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థికి కింది అర్హతలు ఉండాలి.
- భారతపౌరుదై ఉండాలి.
- 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు.
- కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.
ఒకే వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.
కాలపరిమితి :
లోకసభలాగా శాసనసభ కూడా శాశ్వతసభ కాదు. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఏ సమయంలోనైనా గవర్నర్ దీన్ని రద్దు చేయవచ్చు. 356 వ ప్రకరణం ఆధారంగా రాష్ట్రపతి శాసనసభను సస్పెన్షన్లో ఉంచడం లేదా రద్దు పరచడం చేయవచ్చు.
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ చట్టం ద్వారా ఆరునెలలు పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ఆరునెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ :
శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు ఇద్దరు ఎన్నుకోబడ్డ సభా నిర్వహణాధిపతులు ఉంటారు. ఒకరు స్పీకర్, మరొకరు డిప్యూటీ స్పీకర్. శాసనసభా నిర్వహణకు సంబంధించిన స్థానం, అధికారాలు, విధులు స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ఒకే విధంగా ఉంటాయి.
వీరిని శాసనసభ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అలాంటి తీర్మానాన్ని శాసనసభలో సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమెదించవలసి ఉంటుంది. ప్రతీ ఏటా శాసనసభ కనీసం రెండుసార్లు సమావేశమవుతుంది. సమావేశాల మధ్య ఆరునెలలు మించిన వ్యవధి ఉండకూడదు.
ప్రశ్న 6.
హైకోర్టు యొక్క అధికారాలు మరియు విధులను వివరించండి.
జవాబు.
హైకోర్టు అధికారాలు, విధులు :
హైకోర్టు ఈ కింది అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
ప్రాథమిక అధికార పరిధి :
- రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు, ఆదేశాలు, వివాహాలు, విడాకులు, కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటుంది.
- అధికరణ 226 ప్రకారం హైకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరి, కో-వారెంటో మరియు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై నిషేధపు ఉత్తర్వులు వాటి రిట్లను జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.
- పార్లమెంట్, శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను పరిష్కరించడం.
అప్పీళ్ళ అధికార పరిధి :
1. పౌర వివాదాలు :
జిల్లా కోర్టు లేదా కిందిస్థాయి కోర్టు యొక్క తీర్పుపై హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. 5,000 రూపాలయలకు మించిన విలువగల కేసులను చట్టానికి సంబంధించిన కేసులను హైకోర్టు స్వీకరిస్తుంది.
2. క్రిమినల్ వివాదాలు :
సెషన్స్ కోర్టు ద్వారా 4 సంవత్సరాలకంటే ఎక్కువ శిక్ష పడిన కేసులు, పెద్ద శిక్షలను కలిగి ఉన్న అన్ని కేసులను హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. సెషన్ కోర్టు ద్వారా విధించబడ్డ మరణ శిక్ష హైకోర్టు ద్వారా ఆమోదించబడవలసి ఉంటుంది.
3. కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
హైకోర్టు యొక్క నిర్ణయాలు, తీర్పులు నమోదు చేయబడి భద్రపరచబడతాయి. న్యాయపరంగా ప్రామాణికంగా భావించబడతాయి.
4. ధృవీకరించే అధికారం (Power of Certification) :
చాలా కేసులలో హైకోర్టు తన తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి ఒక ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది.
5. న్యాయసమీక్షాధికారం (Judicial Review) :
హైకోర్టుకు ఏ చట్టాన్నైనా, ఆర్డినెన్సైనైనా పునఃపరిశీలించి దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకమైనదిగా ప్రకటించే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి భారత న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగిఉంది.
ఇందుకోసమే కాకుండా ప్రభుత్వంలోని అన్ని అంగాలు రాజ్యాంగ అధికార పరిధి కింద పని చేస్తాయని హామీ ఇవ్వడం కూడా న్యాయ సమీక్షాధికారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రాథమిక హక్కులను ప్రత్యేకంగా ఆస్తిహక్కును కాపాడుతుంది.
6. పరిపాలన అధికారాలు (Administrative Functions) :
అధికరణ 227 ప్రకారం ప్రతీకోర్టు తన కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం కలిగి ఉంది.
- ఇది తన కింది కోర్టులో వ్యవహారాల్లో అనుసరించాల్సిన నియమాలను, వాటి విధానాలను తయారుచేసి క్రమబద్దం చేయవచ్చు.
- తన కింది కోర్టులకు సంబంధించిన వివరాలను, సమాచారాన్ని తెప్పించుకోవచ్చు.
- ఒక కేసుని ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకి బదిలీ చేయగలదు (అధికరణ 228) లేదా ఆ వివాదాన్ని తన వద్దకు బదిలీ చేయించుకుని తీర్పు ఇవ్వగలదు.
- తన కింది న్యాయస్థానాలకు సంబంధించిన దస్త్రాలు, రికార్డులను పరిశోధించే పరిశీలించే అధికారం కలిగి ఉంది.
- కింది కోర్టులో ఉద్యోగులను నియమించి, వారి వేతనం, ఇతర సదుపాయాలు, పని నియమాలను నిర్ణయించే అధికారం హైకోర్టుకి ఉంది.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ:
భారత రాజ్యాంగంలోని 153 నుంచి 167 వరకు ఉన్న 15 అధికరణాలు రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ గురించి పేర్కొన్నాయి. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో
- గవర్నర్
- ముఖ్యమంత్రి
- రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు కొందరు ఉంటారు.
ప్రశ్న 2.
గవర్నర్కు ఉన్న రెండు శాసనాధికారాలు.
జవాబు.
గవర్నర్కు రెండు శాసన నిర్మాణాధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.
- అతడు రాష్ట్ర శాసనసభ్యులను సమావేశపరుస్తాడు. వాయిదా, రాష్ట్ర శాసననిర్మాణ శాఖలోని విధాన సభను రద్దు చేస్తాడు.
- విధాన సభలో స్వయంగా ప్రసంగిస్తాడు. లేదా తన సందేశాలను పంపుతాడు.
- విధాన పరిషత్లోని ఆరోవంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.
ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం.
జవాబు.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం :
రాష్ట్ర మంత్రిమండలి
- ముఖ్యమంత్రి, కొందరు
- కాబినెట్ హోదా ఉన్న మంత్రులు
- స్టేట్ హోదా ఉన్న మంత్రులు ఉంటారు.
కొన్నిసార్లు దానిలో డిప్యూటీ మంత్రులు కూడా ఉంటారు.
ప్రశ్న 4.
గవర్నర్ విచక్షణాధికారాలు.
జవాబు.
గవర్నర్ విచక్షణాధికారాలు :
- ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం.
- రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
- శాసన, పరిపాలనా సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
- విధాన సభను రద్దు చేయడం మొదలైనవి.
ప్రశ్న 5.
ముఖ్యమంత్రి నియామకం.
జవాబు.
ముఖ్యమంత్రి నియామకం:
రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. విధాన సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. కొన్నిసార్లు విధానసభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ లభించకపోతే, స్థిరత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో గవర్నర్ అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తాడు.
విధాన సభలో మిగిలిన పార్టీల శాసన సభ్యులతో సహా మెజారిటీ సభ్యుల మద్దతును పొందగలిగే పార్టీ లేదా పార్టీల నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు.
ప్రశ్న 6.
శాసనసభ.
జవాబు.
శాసనసభనే రాష్ట్ర విధానసభ అని, అసెంబ్లీ అని, ప్రజాప్రతినిధుల సభ అని వ్యవహరిస్తారు. రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో దిగువ సభ విధానసభ, అందులో రాష్ట్రంలోని ఓటర్లచే ఎన్నుకోబడిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
ప్రశ్న 7.
శాసనసభ మండలి (లేదా) విధాన పరిషత్తు.
జవాబు.
విధానపరిషత్తు లేదా శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో రెండోసభ లేదా ఎగువసభ. ప్రస్తుతం భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో విధానపరిషత్తులు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు. విధాన పరిషత్తు సభ్యత్వ సంఖ్యలో మూడోవంతు మించకూడదు. విధానపరిషత్తు ఏర్పాటు లేదా రద్దు విషయంలో భారత పార్లమెంటు తీర్మానం చేస్తుంది.
ప్రశ్న 8.
శాసనసభ స్పీకర్.
జవాబు.
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు. స్పీకర్ విధానసభ సభ్యుల హక్కులు, స్వేచ్ఛలకు సంరక్షకుడిగా వ్యవహరిస్తాడు. సభలో క్రమశిక్షణా చర్యలు అమలు అధికారం అతడికి ఉంటుంది.
ప్రశ్న 9.
హైకోర్టు నిర్మాణాన్ని తెలపండి.
జవాబు.
హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కల్గి ఉంటుంది. రాజ్యాంగం రెండు సంవత్సరాలకు మించకుండా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో అధికమైన పనిభారాన్ని నిర్వహించడానికి నియమించబడతారు.