Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 5th Lesson కేంద్ర రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 5th Lesson కేంద్ర రాష్ట్ర సంబంధాలు
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను వివరించండి.
జవాబు.
మన రాజ్యాంగం తొమ్మిదో భాగంలో 245 నుంచి 255 వరకు గల ప్రకరణాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య. శాసన సంబంధాలను స్పష్టంగా పేర్కొన్నవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భారతదేశ ప్రజల శాంతి, సంతోషం, ప్రగతికి దోహదపడే శాసనాలను రూపొందిస్తాయి.
భారత పార్లమెంట్ దేశం మొత్తానికిగానీ, దేశంలో ఏదో ఒక ప్రాంతానికిగానీ వర్తించే విధంగా శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ఇక రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తాయి.
రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ ఆధిక్యత :
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
- జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలలోని అంశాలపై చట్టాలు చేయాలని రాజ్యసభలో హాజరైన సభ్యులలో 2/3 వంతు సభ్యులు తీర్మానిస్తే వాటిపై పార్లమెంట్ చట్టం చేయవచ్చు. అయితే అటువంటి చట్టం ఆరు మాసాలపాటు అమలులో ఉంటుంది. అవసరమైతే, దాన్ని మరో ఆరు మాసాలు పొడిగించవచ్చు. (ప్రకరణం 249).
- రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పడు పార్లమెంట్ జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. అటువంటి శాసనం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నంతకాలం చెల్లుబాటవుతుంది. అత్యవసర పరిస్థితి ఉపసంహరణ జరిగిన ఆరుమాసాల తరువాత రద్దవుతుంది.
- 352వ ప్రకరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేస్తుంది. (ప్రకరణం 250).
- ఏవైనా రెండు లేదా అంతకుమించిన రాష్ట్ర శాసన సభలు తమ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనం అవసరమని ఒక తీర్మానం ద్వారా పార్లమెంట్ని కోరితే అందుకు తగిన శాసనం చేస్తుంది. 1953 ఎస్టేట్ సుంకం చట్టం, 1955 ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1974 జలకాలుష్య నివారణ చట్టం 1976 పట్టణ భూపరిమితి చట్టం మొదలైనవి. పార్లమెంట్ ఆమోదించిన వాటిలోనివి (ప్రకరణం 252).
- భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం దేశం యావత్తు లేదా కొన్ని ప్రాంతాలకు ఉద్దేశించిన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్కు ఉంది. వీటిలో 1960 జెనీలా కన్వెన్షన్ చట్టం, 1982 యాంటి హైజాకింగ్ చట్టం మొదలైనవి. (ప్రకరణం 253)
- ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తే ఆ రాష్ట్ర శాసనసభ తరపున పార్లమెంట్ శాసనాలను రూపొందిస్తుంది.
ప్రశ్న 2.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న పరిపాలనా సంబంధాలను వివరించండి.
జవాబు.
రాజ్యాంగం రెండవ భాగంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన సంబంధాలు వివరించబడ్డాయి. పరిపాలన సంబంధాలలో కేంద్రం ఆధిపత్యాన్ని వివిధ నిబంధనలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక, శాసనపరమైన అధికారాల ద్వారా కింది విషయాలలో రాష్ట్రాలపై నియంత్రణ చేస్తుంది.
- రాష్ట్రాల గవర్నర్లను నియమించడం, బదిలీ చేయటం, తొలగించటం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. గవర్నర్ల నియామకం అధికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.
- గవర్నర్ పంపే కొన్ని రకాల రాష్ట్ర బిల్లులను వీటో చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (ప్రకరణం 2000)
- కొన్ని ప్రత్యేక అంశాలపై ఆర్డినెన్సున్ను జారీ చేసేటపుడు రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతిని సంప్రదించవచ్చు. (ప్రకరణం 213)
- జాతీయ, మిలటరి ప్రాధాన్యత కలిగిన సమాచార వ్యవస్థకు అవసరమైన నిర్మాణాలు మరియు నిర్వహణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయవచ్చు.
- కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనా విధులను పరస్పరం బదిలీ చేసుకోవడానికి రాజ్యాంగం వీలు కల్పించింది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ పాలనావిధిని రాష్ట్రానికి అప్పగించవచ్చు. (ప్రకరణం 258)
- ఏదైనా అంతర్రాష్ట్ర నది, నదీలోయకు చెందిన జలాల వినియోగం పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన వివాదం ఏర్పడితే దాని పరిష్కారానికి అవసరమైన శాసనాన్ని పార్లమెంట్ రూపొందించవచ్చు. (ప్రకరణం 262)
- కేంద్ర ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. CRPF వంటి పారామిలటరి దళాలను రాష్ట్రాలకు పంపే అధికారం కేంద్రానికి ఉంది.
- అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (ప్రకరణం 263)
- కొత్త ఆల్ ఇండియా సర్వీసును సృష్టించటం లేదా ఉన్న వాటిలో దేనినైనా రద్దు చేసే అధికారం భారత రాజ్యాంగం రాజ్యసభకు ఇచ్చింది. (ప్రకరణం 312)
- ప్రతీ రాష్ట్రంలో అంతర్గత అశాంతిని, బహిర్గత దాడుల నుంచి రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వపు రాజ్యాంగబద్ధమైన విధి.
- రాజ్యాంగ ప్రకరణం 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినపుడు కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రాలకు విస్తరించవచ్చు. కార్యనిర్వాహక అధికారాలు విస్తరించడంలో ఏవైనా రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయవచ్చు.
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే రాష్ట్రపతిపాలన విధించవచ్చు. (ప్రకరణం 356)
- దేశమంతటా కేంద్రం, రాష్ట్రాల చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన ఉత్తర్వుల పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం ఉండి తీరాలి.
పైన పేర్కొన్నవి సాధారణ పరిస్థితులలో కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలు. అయితే అత్యవసర పరిస్థితి అమలు కాలంలో మన రాజకీయ వ్యవస్థ ఏకకేంద్ర రాజ్యాంగంగా రూపొందుతుంది. రాష్ట్రపతి రాజ్యాంగంలోని 352, 356, 360వ ప్రకరణాల ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటించినపుడు ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. పరిపాలనా సంబంధాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యతను రాజ్యాంగం చాటుతుంది.
ప్రశ్న 3.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను తెలపండి.
జవాబు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసన, పరిపాలనాపరమైన వ్యవహారాలను నిర్వహించుకునేందుకు ఎంతో విత్తం అవసరమవుతుంది. ఆర్థిక రంగంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల విధింపు వసూలు పంపిణీల గురించి మన రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాలను మన రాజ్యాంగం 12వ భాగంలో 264 నుంచి 300 ఎ వరకు గల అధికరణాలలో ప్రస్తావించారు.
1. కేంద్రం విధించే పన్నులు, సుంకాలు:
కొన్ని రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఇందులో కస్టమ్స్, ఎగుమతి సుంకాలు, ఆదాయపు పన్ను, పొగాకుపై సుంకం, జూట్ మొదలైనవి. కార్పోరేషన్ పన్ను, ఆస్తి విలువపై పన్ను, వ్యవసాయేతర భూమిపై ఎస్టేట్ సుంకం, రైల్వేలు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్, వైర్లెస్ సెట్స్, విదేశీమారకం, నాణాలు మొదలైనవి.
2. రాష్ట్రాలు విధించే పన్నులు, సుంకాలను రాష్ట్రాలు వాడుకోవడం :
కొన్ని రకాల పన్నులపై ప్రత్యేకంగా రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. అవి : భూమిశిస్తు, కేంద్ర జాబితాలో గల డాక్యుమెంట్లు మినహా విధించే స్టాంపు డ్యూటీ, వారసత్వ సుంకం, ఎస్టేట్ సుంకం, వ్యవసాయ భూమిపై ఆదాయపు పన్ను, రహదారి వాహనాలపై పన్నులు, ప్రకటనలపై పన్నులు, విద్యుత్ వినియోగంపై పన్ను మొదలైనవి.
3. కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలు వసూలు చేసుకుని వాడుకోవడం :
కొన్ని రకాల పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు ఆ పన్నుల మొత్తాలను వసూలు చేసుకుని వినియోగించుకుంటాయి. వీటిలో స్టాంపు డ్యూటీ, ఔషధాలు, టాయిలెట్ సంబంధమైన పదార్థాలపై ఎక్సెజ్ సుంకం, బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వడ్డీ వ్యాపారం, వాటా ధనం మార్పిడి మొదలైనవి.
4. కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు :
రైల్వే ఛార్టీలు, రైల్, సముద్రపు రవాణా లేదా విమాన ప్రయాణీకులు వెంట తెచ్చే వస్తువులపై, సరుకు రవాణాలపై టర్మినల్ పన్నులు, వ్యవసాయేతర భూములపై ఎస్టేట్ డ్యూటీ విధించడం మొదలైనవి.
5. కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు :
కొన్ని వస్తువులపై కేంద్రం పన్నులు విధించి, వసూలు చేస్తుంది. అయితే వాటిని రాష్ట్రాలకు పంపిణి చేస్తుంది. ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఔషధాలు, టాయిలెట్ సంబంధమైనవి.
ప్రశ్న 4.
సర్కారియా కమీషన్ చేసిన సిఫార్సులను వివరించండి.
జవాబు.
జూన్ 9, 1983న కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాల మధ్యనున్న అధికారాలు, విధులు, బాధ్యతలను పునఃపరిశీలన చేయవలసిందిగా ఈ కమీషన్ ను కోరింది.
1987 అక్టోబర్ 27న తన నివేదికను సర్కారియా కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దశాబ్దం తరువాత ఆ కమీషన్ పేర్కొన్న మొత్తం సిఫార్సుల్లో 230 సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం సిఫార్సులలో 170 సిఫార్సులను అమలు చేసింది.
సిఫారసులు: సర్కారియా కమీషన్ సిఫారసులలో క్రింది పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.
1. బలమైన కేంద్రం :
బలమైన కేంద్ర ప్రభుత్వం వైపు కమిషన్ మొగ్గుచూపింది. జాతి సమైక్యత, సమగ్రతల కోసం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అధికారాలు తగ్గించే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది.
2. సంప్రదింపులు :
రాష్ట్రాల అధికారాల జాబితా నుంచి కొన్నింటిని ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. అంతేకాదు ఉమ్మడి జాబితాలోని అంశాలతో సహా కేంద్రం రాష్ట్రాలను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది.
3. సహకార సమాఖ్య :
ప్రణాళికల రూపకల్పన అమలులో కేంద్ర-రాష్ట్రాల మధ్య అత్యున్నత సహకారం పరస్పరం అందించుకోవాలని సూచించింది.
4. గవర్నర్ల నియామకం :
గవర్నర్ పదవిని రద్దు పర్చాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. అయితే క్రియాశీల రాజకీయాలలో ఉన్న నాయకులను గవర్నర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించింది. రాజకీయేతర వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులను మరీ ముఖ్యంగా మైనారిటీలను గవర్నర్లుగా నియమించాలని సూచించింది. గవర్నర్లుగా పదవీ విరమణ పొందిన వ్యక్తి ఆ తరువాత ఎటువంటి లాభదాయకమైన పదవిలో పనిచేయడానికి అనుమతించరాదని సూచించింది.
5. ముఖ్యమంత్రి నియామకం :
ముఖ్యమంత్రి నియామకం శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఆధారంగా జరగాలని కమిషన్ సూచించింది. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రానపుడు ఏ నాయకుడికి మెజారిటీ సభ్యుల మద్ధతు లభిస్తుందో ఆ వ్యక్తినే గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించాలి.
6. రాష్ట్రపతి పాలన :
అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలి.
ప్రశ్న 5.
M.M. పూంఛీ కమీషన్ సిఫారసులను తెలపండి.
జవాబు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అద్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి 2007లో కేంద్రంలో అధికారంలో ఉన్న UPA ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తియైన జస్టిస్ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసింది. పూంఛీ కమీషన్ 31 మార్చి 2010లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
“భారతదేశ సుస్థిరతను కాపాడి దేశ సమైక్య, సమగ్రతలను పరిరక్షించాలన్నా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నా కూడా మనదేశంలో సహకార సమాఖ్య కీలకంగా పనిచేయాలని” పూంఛీ కమీషన్ భావించింది. కమీషన్ చేసిన సిఫార్పులలో ముఖ్యమైనవి కింద పేర్కొనబడ్డాయి.
1. గవర్నర్ల నియామకం :
కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకాన్ని సర్కారియా కమీషన్ సూచించిన విధంగా ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలి. గబర్నర్ గా నియమించబడే వ్యక్తి నిష్ణాతుడై వ్యక్తియై ఉండాలి. క్రియాశీలకర రాజకీయాలలో పాల్గొనని వ్యక్తియై ఉండటంతోపాటు ఆ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు నిర్దిష్టంగా ఉండాలి.
2. రాష్ట్రపతి పరిపాలన :
రాష్ట్రపతి పరిపాలనను దుర్వినియోగం చేయకుండా రాష్ట్రాల హక్కులను, కాపాడే విధంగా సూచనలు చేసింది. రాష్ట్రపతి పరిపాలనను అవసరమైనప్పుడు సమస్యాత్మక స్థానిక ప్రాంతాలకు మాత్రమే వర్తించే విధంగా 356 అధికరణలో మార్పులు చేయాలి.
3. ముఖ్యమంత్రుల నియామకం :
కమీషన్ అభిప్రాయం ప్రకారం రాష్ట్ర శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలి. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో అంటే “ హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నియామకం విషయంలో వివరణాత్మకమైన మార్గదర్శకాలను రాజ్యాంగ సాంప్రదాయంగా ఏర్పాటు చేయాలి.
4. అఖిల భారత సర్వీసులు :
మూడంచెల సాలనా వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించేటప్పుడు అఖిల భారత సర్వీసులో సమగ్రంగా మార్పులు చేయాలి. దీని వల్ల అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు పరిపాలనలో ‘ కీలకపాత్రను పోషిస్తారు.
5. విత్తపరమైన సంబంధాలు :
కమీషన్ అభిఆయం ప్రకారం రాష్ట్రాలకు విస్తృతమైన విధుల కేటాయింపు జరపడంతోపాటు వెనకబడిన రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయించడం ద్వారా విత్తపరంగా రాష్ట్రాలు సుస్థిరతను సాధించగలుగుతాయి.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను నిర్దేశించే రెండు అంశాలు.
జవాబు.
కేంద్ర – రాష్ట్రాల సంబంధాలను ప్రభావితం చేసే అంశాలు: భారత రాజ్యాంగం 9వ భాగంలో 245 నుంచి 255 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలను వివరించాయి. కేంద్ర – రాష్ట్రాలు శాసనపరమైన పరిధిని ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి 1. ప్రాదేశిక పరిధి 2. విషపరమైన పరిధి.
ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య శాసన సంబంధ విషయాలను ఎలా విభజిస్తారు ?
జవాబు.
కేంద్ర – రాష్ట్రాల సంబంధాలు: భారత ప్రభుత్వ చట్టం 1935ను అనుసరించి రాజ్యాంగం నిర్మాతలు శాసనపరమైన అంశాలను మూడు జాబితాలు క్రింద విభజించారు. అవి: 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో వీటి సవరణ ఉంది.
ప్రశ్న 3.
కేంద్ర జాబితాపై ఒక నోట్ రాయండి.
జవాబు.
కేంద్ర జాబితా : కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఇందులో ప్రస్తుతం 100 అంశాలున్నాయి.
ఉదా : దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా మొదలగునవి.
ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం.
జవాబు.
ఆర్థిక సంఘం నిర్మాణం :
ఆర్థిక సంఘ నిర్మాణాన్ని రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదించిన విత్తచట్టం, 1951 ప్రకారం నిర్ణయిస్తారు. ఆ చట్టం ప్రకారం ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఛైర్మన్గా నియమితుడయ్యే వ్యక్తి ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉంటాడు. మిగతా నలుగురు సభ్యులు క్రింది పేర్కొన్న విభాగాలకు సంబంధించినవాడై ఉంటారు.
- హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన లేదా హైకోర్టు న్యాయమూర్తి నియామాకానికి అర్హతగల వ్యక్తియై ఉండాలి.
- ప్రభుత్వంలో విత్తం, పద్దులు విషయాల గురించి ప్రత్యేక పరిజ్ఞానం గలవాడై ఉండాలి.
- పరిపాలన, ఆర్థిక విషయాల గురించి అపారమైన అనుభవం ఉండాలి.
- అర్థశాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
ప్రశ్న 5.
సర్కారియా కమిషన్
జవాబు.
సర్కారియా కమిషన్ : 1983 జూన్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్ను ఏర్పరచింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన చేయవలసిందిగా ఈ కమిషన్ను కోరడమైనది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్ పేన్ అనే ఇద్దరు సభ్యులున్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్.సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు.
1987 అక్టోబర్ 27వ తేదీ 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. శాసన, పరిపాలన, ఆర్థిక, రాజ్యాంగపరమైన రంగాలకు సంబంధించి అనేక సిఫారసులను పేర్కొంది. దశాబ్దం తరువాత ఆ కమీషనర్ పేర్కొన్న మొత్తం సిఫారసుల్లో 230 సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం సిఫారసుల్లో 170 సిఫారసులను – అమలు చేసింది.
ప్రశ్న 6.
నీతి ఆయోగ్.
జవాబు.
NITI ఆయోగ్ (National Institution of Transforming India Ayog 2013) జనవరి 1 నుంచి ఉనికిలోనికి వచ్చింది. జాతీయాభివృద్ధి ప్రాథమ్యాలలో కేంద్ర – రాష్ట్రాల సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు సహకార సమాఖ్యను ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా జాతి నిర్మాణం జరపడం దీని విధి.
నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు :
- పేదరిక నిర్మూలన.
- అసమానతల తొలగింపు.
- సంస్థాగత అభివృద్ధి ప్రక్రియ ద్వారా గ్రామాల సమగ్ర వృద్ధి.
- పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ అంచనా.
నీతి ఆయోగ్క ప్రధానమంత్రి ఛైర్మన్ గా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రాంతీయ మండళ్ళతో కూడిన గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. గతంలో ఉన్న ప్రణాళికా సంఘాన్ని రద్దుపరచి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. సమకాలీన ప్రపంచీకరణ అవసరాలకు అనుగుణంగా నీతి ఆయోగ్ సంస్థ పనిచేస్తుంది.
ప్రశ్న 7.
ఉమ్మడి జాబితా.
జవాబు.
ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలు రెండింటికీ ఉంటుంది. ఈ జాబితాలో ప్రధాన అంశాలు : క్రిమినల్లా, వివాహ, విడాకులు, వ్యవసాయేతర సంబంధ సంపద, బదిలీ, ఒప్పందాలు, అపరిష్కృత అంశాలు, అడవులు, విద్య, కార్మిక సంక్షేమం, కార్మిక సంఘాలు స్టాంపులు మొదలైనవి. ప్రస్తుతం ఈ జాబితాలో 52 అంశాలున్నాయి.
ఈ జాబితాలో అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు రెండింటికీ ఉంటుంది. అయితే కేంద్ర శాసనానికి, రాష్ట్రశాసనానికీ మధ్య వైరుధ్యం ఏర్పడితే శాసనానికే ఆధిక్యం ఉంటుంది.
ప్రశ్న 8.
అంతః రాష్ట్ర కౌన్సిల్.
జవాబు.
భారత రాజ్యాంగం 263వ ప్రకరణం ఆధారంగా అంతరాష్ట్రమండలి ఏర్పాటయింది. రాష్ట్రాల మధ్య సహకార సమన్వయాలను సాధించే లక్ష్యంతో ఈ మండలి పనిచేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే ఆశయంతో రాష్ట్రపతి ఈ మండలిని అవసరమైన సందర్భాలలో నెలకొల్పుతాడు.
అంతర్రాష్ట్ర మండలి కింద పేర్కొన్న అంశాల నిర్వహణకు దోహదపడుతుంది.
- రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారంలో తగిన సూచనలివ్వటం.
- దేశంలోని కొన్ని లేదా అన్ని రాష్ట్రాలు నిర్వహించే విధుల విషయంలో ఎదురయ్యే వివాదాలను పరిష్కరించడం.
- ఏదైనా ఒక అంశంపై రాష్ట్రాల మధ్య విధానపరమైన సమన్వయాన్ని సూచించడం.
నిర్మాణం :
భారత రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ 1990, మే 28న అంతఃరాష్ట్ర మండలిని వి.పి. సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. అందులో కిందివారు సభ్యులుగా ఉన్నారు.
- ప్రధానమంత్రి
- రాష్ట్ర ముఖ్యమంత్రులు
- కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు
- ప్రధానమంత్రితో సూచించబడిన ఆరుగురు కేంద్రమంత్రులు.
అంతరాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. దాని సమావేశాలకు నిర్వహిస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ మండలి సమావేశాలకు అధ్యక్షత వహించవలసిందిగా కేంద్ర మంత్రులతో ఒకరిని నామినేట్ చేస్తాడు.
ప్రశ్న 9.
అవశిష్ట అధికారాలు.
జవాబు.
రాజ్యాంగంలోని 248 అధికరణ ప్రకారం అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు మూడింటిలోను లేని అంశాలనూ అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది.