Reviewing AP Inter 2nd Year Telugu Study Material Grammar అలంకారాలు can help students prepare confidently for exams.
AP Intermediate 2nd Year Telugu Grammar అలంకారాలు
“అలంకరోతి ఇతి, అలంకారః” అని, అలంకార శబ్దానికి సంస్కృత భాషలో వ్యుత్పత్తి చెపుతారు. ‘అలంకారము’ అనగా అలంకరించేది, అని అర్థము. కవులు, కావ్యాన్ని కన్యకతో పోలుస్తారు. కన్య అందాన్ని, సొమ్ములు లేక అలంకారాలు, ఏ విధంగా రెట్టింపు చేస్తాయో, అలాగే కావ్యంలోని అలంకారాలు కూడా, కావ్యము యొక్క అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కావ్యంలో అలంకారాలకు, రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
- కావ్య సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం
- భావాన్ని సులభంగా అర్థం అయ్యేలా చేయడం.
అలంకారాలు రెండు రకములు.
- శబ్దాలంకారాలు : ఇవి శబ్దము ప్రధానముగా కలవి.
- అర్థాలంకారాలు : ఇవి అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి.
కింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణలతో సమన్వయించండి.
1. శబ్దాలంకారాలు :
శబ్దాలంకారాలు, ప్రధానంగా మూడు విధాలు.
- అనుప్రాసాలంకారం
- యమకం
- ముక్తపదగ్రస్తం
అ) అనుప్రాసాలంకారం : ‘అనుప్రాస’ అంటే, హల్లుల ‘పునరుక్తి’. “హల్లుల పునరుక్తి” అంటే, వచ్చిన హల్లే, మళ్ళీ మళ్ళీ రావడం, అని అర్థం. పునరుక్తి, చెవులకు ఇంపు అయిన శబ్దాన్ని, అందిస్తుంది. ఈ ‘అనుప్రాస’, నాలుగు విధాలు. ఇవి :
1. వృత్త్యనుప్రాస :
లక్షణము : ఒకే హల్లు, పలుమార్లు వచ్చినట్లయితే, అది, “వృత్త్యనుప్రాసాలంకారం”. ఒకే హల్లు, పలుసార్లు రావడాన్ని, ‘ఆవృత్తి’ అంటారు.
ఉదాహరణ : విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు
ఈ పై ఉదాహరణములో ‘ష్ణు’ అనే సంయుక్తాక్షరం, చాలాసార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి, ఇది ‘వృత్త్యనుప్రాస’కు ఉదాహరణము.
వృత్త్యనుప్రాసకు మరికొన్ని ఉదాహరణలు :
- కాలువ లన్నియు గలగల పారెను (‘ల’ అనే హల్లు, ఆవృత్తి అయ్యింది)
- కాకీక కాకికి కాక కేకికి ఉంటుందా ! (‘క’ అనే హల్లు, పలుమార్లు వచ్చింది) పై రెండు వాక్యాలలో “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.
2. ఛేకానుప్రాస :
లక్షణము : రెండు హల్లులు, లేదా రెండు హల్లుల జంట, వెంట వెంటనే వస్తూ, అర్థభేదం కలిగి ఉంటే, దాన్ని “ఛేకానుప్రాసాలంకారం” అంటారు.
ఉదా : “కందర్ప దర్ప హర సుందర దర హాసములు”
పై ఉదాహరణలో, దర్ప అనే హల్లుల జంట, అవ్యవధానంగా, అంటే వెంట వెంటనే, అర్థభేదంతో వచ్చింది.
వివరణ : కందర్ప అంటే మన్మథుడు అని అర్థం. ‘దర్ప’ హర, అంటే గర్వాన్ని పోగొట్టేది అని అర్థం.
ఇక్కడ ఈ విధంగా ‘దర్ప‘ శబ్దం, అవ్యవధానంగా, అర్థభేదంతో వచ్చింది. అలాగే “సుందర” అంటే అందమైన అని అర్థము.
“దరహాసము” అంటే చిరునవ్వు అని అర్థము.
ఇక్కడ ‘దర‘ శబ్దం కూడా అవ్యవధానంగా, అర్థభేదంతో వచ్చింది.
కాబట్టి “కందర్ప దర్ప హర సుందర దరహాసము” అనే ఉదాహరణలో, “ఛేకానుప్రాస” అనే ‘శబ్దాలంకారం’ ఉంది.
ఛేకానుప్రాసకు, మరికొన్ని ఉదాహరణములు :
- సర్వదా విచారింపని పని చేయరాదు
- నంద నందన ! నీకు వందనములు
గమనిక :
- మొదటి ఉదాహరణలో, ‘పని‘ అనే హల్లుల జంట, అర్థభేదంతో అవ్యవధానంగా వచ్చింది.
- రెండవ ఉదాహరణలో, ‘నంద‘ అనే హల్లుల జంట, అర్థభేదంతో, అవ్యవధానంగా వచ్చింది.
![]()
3. అంత్యానుప్రాస :
లక్షణము : (‘అంత్య’ అంటే, చివర అని అర్థం) పాదం చివరలో కాని, లేదా పదం చివరలో కాని, అనుప్రాస ఉన్నట్లయితే, దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.
ఉదా :
1) “ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీత చౌర్య లీలున్, ప్రియ వా
గ్జాలున్, బరి విస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్, బాలున్”
గమనిక : పై ఉదాహరణలో, పదముల చివర ‘లున్‘ అనే అనుప్రాస, ఉంది. కాబట్టి దీనిలో అంత్యానుప్రాసాలంకారం ఉంది.
ఉదా :
2) “పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగాని కంతా సౌఖ్యం నిండగ
గమనిక : పై ఉదాహరణలో 1, 2 పాదాల్లో చివర ‘న్నీ’ అనే అనుప్రాస ఉంది. అలాగే 3, 4 పాదాల్లో ‘బిందుపూర్వక డగ’ అనేది చివరలో అనుప్రాసగా ఉంది.
మన పాఠ్యపుస్తకంలోని, శ్రీనాథుడు రచించిన ‘శాంతికాంక్ష’ పద్యభాగంలోని ద్విపదలో, ‘అంత్యానుప్రాస అలంకారం ఉంది.
ఉదా :
3) అనుగు భూపతి పుత్ర
అంచిత గాత్ర
వీరకామ నరేంద్ర
విభవ దేవేంద్ర
గమనిక : పై ఉదాహరణములోని 1, 2, పాదాల్లో చివర, ‘త్ర’ అనే హల్లు, ఆవృత్తి అయ్యింది. అలాగే 3, 4 పాదాల్లో చివర “బిందువుతో కూడిన ‘ద్ర’ అనే హల్లు” ఆవృత్తి అయ్యింది. కాబట్టి పై పాదాల్లో, ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
4. లాటానుప్రాస :
లక్షణము : అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదం కలిగిన శబ్దాలు, వెంట వెంటనే వస్తే, అది “లాటానుప్రాసాలంకారం” అవుతుంది.
గమనిక : అర్థం అంటే, ఆ పదానికి ఉన్న సామాన్యమైన అర్థం. తాత్పర్యం అంటే, ఆ పదానికి సందర్భానుసారంగా మనము విశేషంగా తీసుకొనే అర్థం. ఈ క్రింది ఉదాహరణలను చూడండి.
ఉదా : ‘అమ్మ చూపించే ప్రేమ, ప్రేమ !’
పై వాక్యంలో ‘ప్రేమ’ అనే మాట, రెండుసార్లు వచ్చింది. అందులో మొదటిసారి వచ్చిన ‘ప్రేమ’కు, ప్రేమ, వాత్సల్యం అని అర్థాలు. అదే ‘ప్రేమ’ అనే పదం, వెను వెంటనే వచ్చినప్పటికీ, దానికి మనము “నిజమైన ప్రేమ” అనే తాత్పర్యాన్ని, తీసుకుంటాం. ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థము వేరు. తాత్పర్యం వేరు. దీన్నే, మనం ‘లాటానుప్రాస’ అని పిలుస్తున్నాం.
మఱికొన్ని ఉదాహరణలు :
1) “కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
………………………………………….
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి
![]()
II. అర్థాలంకారాలు :
అర్థాన్ని ఆశ్రయించి ఉండేవి, “అర్థాలంకారములు”. అడిదము సూరకవి, తన చంద్రాలోకంలో, 100 అర్థాలంకారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. కువలయానందకవి, 124 అర్థాలంకారాలను పేర్కొన్నాడు.
1. ఉపమాలంకారం : ఉపమాలంకారాన్ని, “ఉపమానాలంకారం” అని, కూడా అంటారు. ‘ఉపమ’ అంటే సామ్యం, లేదా ‘పోలిక’, అని అర్థం.=
లక్షణము : “ఉపమేయానికి, ఉపమానానికి, మనోహరమైన పోలిక చెపితే, అది “ఉపమాలంకారం”. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చడం ఉపమాలంకారం. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి.
- ఉపమేయం : మనము దేన్ని అయితే వర్ణిద్దామని అనుకుంటామో, ఆ వస్తువును, “ఉపమేయము” అని అంటాం. అంటే వర్ణింపబడే వస్తువును, ‘ఉపమేయం’ అంటారు.
- ఉపమానం : ఉపమేయాన్ని వర్ణించడానికి, దేన్ని అయితే పోలికగా తీసుకొస్తామో, అది ‘ఉపమానము’.
- సమాన ధర్మం : ఉపమాన, ఉపమేయాల్లో సమానంగా ఉండే ధర్మము, లేదా గుణం “సమాన ధర్మం”.
- ఉపమావాచకం : ఉపమేయ, ఉపమానాల ధర్మ సామ్యాన్ని కలిపే, అవ్యయ పదాన్ని, “ఉపమావాచకం” అంటారు.
ఉదా : వలె, పోలె, కైవడి, కరణి, భంగి, చూవె, క్రియన్, లా/లాగ, మొదలయినవి.
ఉపమాలంకారానికి ఉదాహరణం : ‘మా అమ్మ భూదేవిలా గొప్ప సహన వంతురాలు.’
గమనిక :
- పై వాక్యంలో అమ్మ గురించి చెపుతున్నాం. కాబట్టి, ‘అమ్మ’ అనే మాట, ‘ఉపమేయము’.
- అమ్మని భూదేవితో పోలుస్తున్నాము. కాబట్టి, భూదేవి అనే మాట “ఉపమానం”.
- సహనం అనే విషయం ఇద్దరిలోనూ ఉంది కాన, ‘సహనవంతురాలు’ అనేది, సమాన ధర్మం.
- ఉపమేయాన్ని, ఉపమానాన్ని, అనుసంధించడానికి వాడిన పదం ‘లా’ అనేది, ‘ఉపమావాచకం’. కాబట్టి ఇది “ఉపమాలంకారం”.
ఈ పాఠ్యపుస్తకములోని “సత్యప్రాశస్త్యము” అనే పద్య పాఠంలో, ఈ క్రింది పద్యాలలో ‘ఉపమాలంకారములు’ ఉన్నాయి.
1) సత్య ప్రాశస్త్యము 9వ పద్యం
కం॥విను గార్హ పత్యమను న
య్యనలము విహరింపఁబడి తదాహవ నీయం
బున వెలుగునట్ల వెలుగును
జనకుడు దాఁ బుత్రుఁడై నిజద్యుతి తోడన్”
గమనిక : పై పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.
2) ‘సత్య ప్రాశస్త్యము’ పద్యభాగంలో 10వ పద్యము.
కం॥ తాన తన నీడ నీళ్ళుల
లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత ! త
త్సూను జనకుండు సూచి మ
హానందముఁ బొందు నతిశయ ప్రీతి మెయిన్
గమనిక : పై పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.
2. ఉత్ప్రేక్షాలంకారం : ఊహ ప్రధానంగా కలది, “ఉత్ప్రేక్ష”.
ఉత్ప్రేక్ష లక్షణం : ధర్మ సామ్యాన్ని బట్టి, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి నట్లయితే, అది “ఉత్ప్రేక్షాలంకారం” అవుతుంది.
ఉదా : ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచెదను.
సమన్వయము : ఇక్కడ చీకటి, నలుపు. అది దృష్టి నిరోధకం (అంటే చూపుకు అడ్డు). పొగ, నలుపు. పొగ కూడా, ‘దృష్టి నిరోధకం’. కాబట్టి, ఈ సమాన ధర్మాల వల్ల, కవి చీకటిని, పొగలాగ ఊహించుకొన్నాడు. కాబట్టి, ఇది “ఉత్ప్రేక్షాలంకారము”.
- ఆ ఏనుగు, నడగొండయో అన్నట్లుంది. (అంటే ఆ ఏనుగు, నడుస్తున్న కొండ ఏమో అన్నట్లు ఉంది అని భావం)
- ఆమె ముఖము పద్మమేమో అన్నట్లుంది.
పై రెండు ఉదాహరణల్లో కూడా ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
3. రూపకం (రూపకాలంకారము) :
లక్షణము : ఉపమేయానికీ, ఉపమానానికీ, అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేదని చెప్పినట్లయితే, అది “రూపకాలంకారం” అవుతుంది.
ఉదా : అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు.
సమన్వయము : పై ఉదాహరణలో, “అతడు, చేసిన తప్పును తెలిసికొని, పశ్చాత్తాపము అనే అగ్నిలో, కాలిపోతున్నాడు” అని భావము. ఇక్కడ ‘పశ్చాత్తాపాగ్ని’ అనే సమాసంలో, పశ్చాత్తాపము అనేది, ఉపమేయము. అగ్ని అనేది, ఉపమానము. ఇక్కడ ఉపమేయ, ఉపమానాలకు రెండింటికీ, భేదం లేదని చెప్పబడింది. కాబట్టి ఇది “రూపకాలంకారము”.
ఉదా :
- రుద్రమ్మ చండీశ్వరీ దేవి
- సంసార సాగరం
![]()
4. స్వభావోక్తి :
లక్షణము : జాతి గుణ క్రియాదుల చేత, ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే, అది “స్వభావోక్తి” అలంకారం అవుతుంది.
ఉదాహరణ :
మ॥ “ఒడలందెల్ల విభూతి పూత, పులితో లొడ్డాణ, మల్లాడు కెం
జడ, లాత్మైక విచార నిశ్చల దృగ ఙ్ఞాతంబు, లచ్చెనక
చ్చడ, మంసంబున రుండమాల, గళదేశ స్థాణువుం గ్రాలగా”
పై పద్యానికి భావం : శరీరమందు అంతా విభూతి పూత, ఒడ్డాణముగా పులితోలు, కదిలే ఎఱ్ఱని జడలు, ఆత్మ విచారము నందే నిశ్చలమైన నేత్ర పద్మాలు, మంచి గోచి, భుజముపై పుట్టెలమాల, కంఠములో శివలింగము, ప్రకాశిస్తున్నాయి.
సమన్వయము : పై పద్యంలో, పరమశివుని రూపము, యథాతథముగా వర్ణింపబడింది. కాబట్టి దీనిలో “స్వభావోక్తి అలంకారం” ఉంది.
ఈ పాఠ్య పుస్తకంలోని ‘హనుమత్సందేశము’ పద్యభాగం క్రింది పద్యాలలో స్వభావోక్తి అలంకారం ఉంది.
1) హనుమత్సందేశము – 11వ పద్యం చూడండి.
“నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు
ధవళాబ్జ పత్ర నేత్రములవాడు
కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు” (అర్థానికి పాఠం చూడండి)
పై పద్యంలో, కవయిత్రి మొల్ల, శ్రీరాముని రూపాన్ని అత్యంత సహజంగా స్వభావోక్తిలో వర్ణించింది.
2) హనుమత్సందేశము – 23వ పద్యం చూడండి.
పద్యం “నిడుద పెన్నెఱివేణి జడలుగా సవరించి
మలిన జీర్ణాంబరం బొలియ గట్టి
భూమి రజంబు విభూతి పూతగఁ బూసి” (అర్థానికి పాఠం చూడండి) పై పద్యంలో, మొల్ల సీతాదేవి స్థితిని, అత్యంత సహజంగా చిత్రించింది. కాబట్టి పై పద్యంలో ‘స్వభావోక్తి’ ఉంది.
5. అతిశయోక్తి :
లక్షణము : ఒక వస్తువు యొక్క స్థితిని, గుణాన్ని లేదా స్వభావాన్ని, ఉన్నదానికంటె ఎక్కువగా వర్ణిస్తే, అది “అతిశయోక్తి అలంకారం” అవుతుంది.
ఉదాహరణ : ఈ పాఠ్య పుస్తకంలో కవయిత్రి మొల్ల ‘హనుమత్సందేశము’ అనే పద్యభాగంలో, ఒక చక్కని అతిశయోక్తిని చెప్పింది. సీతాదేవి కోరిక మేరకు, హనుమంతుడు, తన చిన్న వానర దేహాన్ని, విపరీతంగా పెంచాడు. ఆ సందర్భంలో మొల్ల చెప్పిన ఈ పద్యం చూడండి.
1) పద్యం
కం॥ “చుక్కలు తలపూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నందె నాత్మస్థితికిన్”
పద్య భావము : “నక్షత్రాలే తన తలలో పూలు అయ్యేటట్లుగా, ఆకాశ వీధిలో ఆశ్చర్యం కొలిపే విధంగా, తన శరీరాన్ని పెంచి, హనుమంతుడు సీతాదేవికి ఆనందం కలుగజేశాడు.” దీనిలో “అతిశయోక్తి” అలంకారము ఉంది.
మఱికొన్ని ఉదాహరణలు :
- ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
- మా వీధిలో ఒకాయన తాటి చెట్టంత పొడవు ఉన్నాడు.
6. అర్థాంతరన్యాస :
లక్షణము : సామాన్యాన్ని విశేషంతో కాని, విశేషాన్ని సామాన్యముతో కాని, సమర్థించి చెప్పినట్లయితే, అది ” అర్థాంతరన్యాసాలంకారం” అవుతుంది.
ఉదా : “హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !”
సమన్వయము : హనుమంతుడు సహజంగా వానరం. వానరం, సముద్రాన్ని దాటడం అన్నది, “విశేషం”. ‘మహాత్ములకు సాధ్యము కానిది లేదు’ అనేది, సామాన్య వాక్యం. ఇక్కడ, పైన తెలిపిన విశేషము, సామాన్య వాక్యం చేత ‘ఇక్కడ సమర్థింపబడింది. కాబట్టి, ఇది “అర్థాంతరన్యాసాలంకారము”.
![]()
మరో ఉదాహరణ చూద్దాము :
ఈ మన పాఠ్యపుస్తకంలో, ‘సత్య ప్రాశస్త్యము’ అనే పద్యభాగంలో నన్నయగారు, చెప్పిన ఈ క్రింది పద్యం చూడండి.
పద్యం :
ఆ.వె. “ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ
వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని
తప్పఁ బలుక నగునె ? ధార్మికులకు.”
(సత్య ప్రాశస్త్యములో 1వ పద్యం)
వివరణ : శకుంతల దుష్యంతునితో ఇలా అంటున్నది. “అన్నీ బాగా తెలిసి కూడా, నేనెవరో తెలియదని, ఇతరుల వలె ఎందుకు మాట్లాడతావు ? ఇతరులకు తెలియదనే మిషతో, అసత్యం పలుకవచ్చునా ?”
పై పద్యంలో, గొప్పవాడైన దుష్యంతుడు, అన్నీ తెలిసి కూడా, శకుంతల ఎవరో తనకు తెలియదని, అబద్ధమాడడం “విశేషం”. “ధర్మాత్ములు అబద్ధాలు ఆడకూడదు’ అనేది, సాధారణ లోకధర్మం ఇది ‘సామాన్యం’. ఇక్కడ, సామాన్యం చేత, విశేషము, సమర్థింపబడింది కాబట్టి ఈ పద్యంలో, “అర్థాంతర న్యాసాలంకారం’ ఉంది.
అభ్యాసం
I. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
“ఆపదలో సాయంచేసే మిత్రుడు మిత్రుడు” – ఇందులోని అలంకారమేది ?
జవాబు:
“ఆపదలో సాయం చేసే మిత్రుడు మిత్రుడు” – దీనిలోని అలంకారం లాటాను ప్రాసాలంకారం.
ప్రశ్న 2.
“ఉపమానం” అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
“ఉపమానం” అంటే పోల్చడానికి స్వీకరించిన వస్తువు.
ప్రశ్న 3.
శబ్దాలంకారాలు ఎన్ని ?
జవాబు:
శబ్దాలంకారాలు ఆరు.
ప్రశ్న 4.
ప్రతి పాదం చివర ఒకే అక్షరంతో అంతమయ్యేది ఏ అలంకారం ?
జవాబు:
ప్రతి పాదం చివర ఒకే అక్షరంతో అంతమయ్యే అలంకారం అంత్యాను ప్రాసాలంకారం.
ప్రశ్న 5.
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం.
ప్రశ్న 6.
ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ఉత్ప్రేక్ష అంటే ఊహ ప్రధానంగా కలది.
ప్రశ్న 7.
మా అమ్మ మాట రతనాల మూట. ఇది ఏ అలంకారం ?
జవాబు:
“మా అమ్మ మాట రతనాల మూట” – ఇది అతిశయోక్తి అలంకారం.
ప్రశ్న 8.
ఉపమావాచకాలకు ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:
ఉపమావాచకాలకు ఉదాహరణలు – వలె, పోలె, పట్టి, కైవడి, కరణి, భంగి, క్రియన్, లాగ.
ప్రశ్న 9.
అలంకారాలు ఎన్ని రకాలు ?
జవాబు:
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు
- శబ్దాలంకారాలు
- అర్థాలంకారాలు
ప్రశ్న 10.
“చిలుకలు కిలకిల పలికెను” ఇది ఏ అలంకారం ?
జవాబు:
“చిలుకలు కిలకిల పలికెను” – ఇది వృత్త్యనుప్రాసాలంకారం
![]()
ప్రశ్న 11.
“మానవత్వం కలిగిన మనిషి మనిషి” – ఇది ఏ అలంకారం ?
జవాబు:
“మానవత్వం కలిగిన మనిషి మనిషి” – ఇది లాటానుప్రాసాలంకారం.
ప్రశ్న 12.
జ్ఞాన సూర్యుడు – ఇందులో ఏ అలంకారం ఉంది ?
జవాబు:
జ్ఞాన సూర్యుడు – ఇందులో రూపకాలంకారం ఉంది.
ప్రశ్న 13.
అర్థాలంకారం అంటే ఏమిటి
జవాబు:
అర్థాలంకారం అంటే అర్థం ప్రధానంగా గల అలంకారం.
ప్రశ్న 14.
కొమ్మా ! ఈ విల్లందుకొమ్మా ! – ఇది ఏ అలంకారం ?
జవాబు:
కొమ్మా ! ఈ విల్లందుకొమ్మా !” – ఇది యమకాలంకారం
ప్రశ్న 15.
అంత్యానుప్రాసకు ఒక ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
అంత్యానుప్రాసకు ఉదాహరణ – త్యాగం చేసేవాడే నాయకుడు. కష్టాలలో ఆదుకున్నవాడే ఆత్మీయుడు.
అదనపు సమాచారం
అలంకార చిత్రాలు :
- వృత్త్యనుప్రాస : చిలుకలు కిలకిల పలికెను.
- ఛేకానుప్రాస : గజము గజం లోతు నీళ్ళలో నిలబడింది.
- లాటానుప్రాస : ఆపదలో సాయం చేసే మిత్రుడు మిత్రుడు.
- యమకం : ప్రతి వారికీ ఒక ప్రతి ఉచితం.
- అంత్యానుప్రాస : లక్ష్యం చేరేందుకు చెయ్యాలి పోరాటం. ఊరికేరాదు తలకు కీర్తి కిరీటం.
- ఉత్ప్రేక్షా : పున్నమి నాటి వెన్నెల వరిపిండి ఆరబోసినట్లున్నది.
- ఉపమా : లతా మంగేష్కర్ పాట కోకిల గానం వలె శ్రావ్యంగా ఉంటుంది.
- స్వభావోక్తి : మానస సరోవం తీరాన కైలాస పర్వతం వెండికొండలా మెరుస్తూ దర్శించిన వారి మనసులకు దివ్యానుభూతి కల్గిస్తుంది.
- రూపకం : గౌతమబుద్ధుడు జ్ఞాన సూర్యుడు.
- అతిశయోక్తి : పద్మశ్రీ శోభానాయుడు గారి నాట్యానికి నెమళ్ళు పురి విప్పి పరవశించి ఆడాయి.