TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘భగీరథ ప్రయత్నం’ పాఠ్య సారాంశం రాయండి.
జవాబు:
సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయిన తీరును మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటే భగీరథుడు సంతోషించి, సాగరుల భస్మరాశులపై దేవనదీ నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, తన వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా కోరాడు.

అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. కానీ దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. కావున శివున్ని మెప్పిస్తే దేవనదిని ఆయన భరిస్తాడు అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు. ఆరాజు తపస్సుకు మెచ్చిన శివుడు దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను.

అని చెప్పగా భగీరథుడు విజయం సాధించానని సంతోషించాడు. శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలని మనస్సులో అనుకున్నాడు.

దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా శబ్దం చేస్తూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉండి పోయింది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది. అని దేవతలు వేడుకొనగా శివుడు పరమ సంతోషంతో ఆ గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది.

భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు.

బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అస్నటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆగొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 2.
‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి.
జవాబు:
భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది.

ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాదినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పండరీనాథుడి గురించి రాయండి.
జవాబు:
భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం నాటివాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు. పండరీనాథరావు తల్లిదండ్రులు వేంకటాబిన్, గోపాలరావు.
శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే ఆయన గ్రంథాన్ని 1810, మే ఏడవ తేదీన శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. కాని అది అలభ్యం. శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

ప్రశ్న 2.
కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?
జవాబు:
సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు. వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు.

వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షీ తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 3.
గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?
జవాబు:
భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు తన తలపై గంగను నిలిపాడు. దేవతల కోరికపై శివుడు తన జటాజూటం నుండి గంగను విడిచాడు. గంగ ఏడు పాయలుగా ప్రవహించింది. అందులో ఒకటి భగీరథుని వెంట వెళుతూ జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో “ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వాన్ని అణచావు.

ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి పుట్టింది కావున జాహ్నవి అనే పేరుతో భూలోకంలో గంగ పిలువబడుతుంది.

ప్రశ్న 4.
గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?
జవాబు:
శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.

ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది.

III ఏకపద/ వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మం అయ్యారు ?
జవాబు:
కపిల మహర్షి

ప్రశ్న 2.
‘పండరీనాథ రామాయణం’ ఎవరికి అంకితం ఇచ్చారు ?
జవాబు:
శ్రీరామచంద్రునికి

ప్రశ్న 3.
భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు ?
జవాబు:
గోకర్ణంలో

ప్రశ్న 4.
గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?
జవాబు:
శివుడు

ప్రశ్న 5.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?
జవాబు:
శ్రీమత్ పండరీనాథ రామాయణం

ప్రశ్న 7.
భగీరథుడిని ఎవరు ఆశీర్వదించారు ?
జవాబు:
బ్రహ్మ

ప్రశ్న 8.
సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?
జవాబు:
పాతాళం

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. శంభుమస్తకముపైఁ బడియె గడు నద్భుతంబుగాన్
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : శంకరుని తలపై అందంగా పడింది.

సందర్భం : శివునిపై కోపంతో శివున్ని పాతాళానికి తొక్కి వేయాలని దేవలోకంలో ప్రవహించే గంగానది హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. దానికి గంగ శివునిపై కోపం పెంచుకుంది. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడి శివుని జటాజూటంలో చిక్కుకున్నది.

2. నాకంబునకుద్గమించె భయ కృత్రేతత్వ నిర్ముక్తమై (Imp)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : భయంకరమైన ప్రేత స్వభావాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారు.

సందర్భం : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. అల ఇలపై అడుగిడిన గంగా జలంలో సామాన్యులు స్నానం చేసి పుణ్యలోకాలకు వెళ్తున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేశారు. అలా పవిత్రులై తమ భయంకరమైన ప్రేతరూపాలను వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

3. నాటనుండి జహ్నునకు కూఁతురగుట
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : ఆ రోజు నుండి జహ్ను మహర్షికి కూతురైనది.

సందర్భం : భగీరథుని వెంట వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యాగశాలను ముంచి వేస్తే జహ్నువు గంగను మింగాడు. దేవతల ప్రార్థనతో మళ్ళీ చెవుల నుండి వదిలిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : జహ్నువు గంగను తాగేయడాన్ని చూసిన దేవతలందరూ ఆశ్చర్యచకితులై “నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింపచేశావు. గంగాదేవి యొక్క గర్వం అణిచివేశావు. ఇకపై ఈ గంగ నీ కూతురుగా `’గుర్తించబడుతుంది అని అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజు నుండి గంగ జాహ్నవిగా పిలువబడుతున్నది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4. నుతింపఁగా సకలదైవతకోటులకైన శక్యమే (V.Imp) (M.P)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : కీర్తించడానికి సమస్త దేవ సమూహాలకూ సాధ్యం కాదు

సందర్భం : ఎంతో తపస్సు చేసి, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పాతాళంలో పడిఉన్న తన పితరుల భస్మ రాశులపై గంగను ప్రవహింపజేసిన భగీరథున్ని బ్రహ్మదేవు మెచ్చుకుంటున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : బ్రహ్మ భగీరథున్ని కరుణతో చూసి “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యం కాలేదు. దానిని సాధించిన నిన్ను, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు” అని అన్నాడు.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు :

1వ పద్యం :

ఉ||
అంత భగీరథుండు చతురంతమహీవలయంబుఁ బ్రోవుచున్
మంత్రులు చెప్ప సాగరసమాజము కాపిల కోపవహ్ని చే
నంతకు ప్రోలి కేఁగుట సమగ్రముగా విని కోసలేశుఁ డ
త్యంత విచారమగ్నమతి యయ్యెను దత్పరమార్ధసిద్ధికై.

ప్రతిపదార్థం:

అంత = అప్పుడు
చతురంత = నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన
మహీవలయంబుఁ = భూ మండలాన్ని
బ్రోవుచున్ = పరిపాలిస్తూ
సాగరసమాజము = సగర మహారాజు పుత్రులు
కాపిల కోపవహ్ని చే = కపిల మహర్షి కోపాగ్నికి
నంతకు ప్రోలి కేఁగుట = భస్మీపటలం అయిన విధానాన్ని
సమగ్రముగా = వివరంగా
మంత్రులు చెప్ప = మంత్రులు చెప్తుండగా
కోసలేశుఁ డు = కోసల రాజ్యాన్ని పాలిస్తున్న
భగీరథుండు = భగీరథుడు
విని = ఆలకించి
తత్ + పరమార్థసిద్ధికై = ఆ పనిని పూర్తి చేయడానికి
అత్య౦త = ఎక్కువైన
విచారమగమతి = బాధతో నిండిన మనస్సు కలవాడు
యయ్యెను = అయ్యాడు

తాత్పర్యం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసల రాజు అయిన భగీరథుడు, తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకొని ఆపనిని పూర్తిచేయడానికి సిద్ధపడ్డాడు.

2వ పద్యం :

అ ||
తనకు సుతులు లేమిఁ దద్రాజ్యభర మెల్ల,
మంత్రులందు నిల్పి మనుజవరుఁడు
వీఁక మెఱయఁ దాను గోకర్ణమున కేఁగి
యందుఁ జేసె ఘోరమైన తపము.

ప్రతిపదార్థం :

తనకు = భాగీరథునికి
సుతులు లేమిఁ = కొడుకులు లేని కారణంగా
తత్ రాజ్య = ఆ రాజ్య
భర మెల్ల = భారాన్ని
మంత్రులందు నిల్పి = మంత్రులకు అప్పగించి
మనుజవరుఁడు = మానవులను కాపాడేవాడు (మహారాజు)
వీఁకము + ఎరయ = ఉత్సాహము ఏర్పడే విధంగా
తాను = భగీరథుడు
గోకర్ణమునకు + ఏగి = గోకర్ణము అనే ప్రదేశానికి వెళ్లి
అందున్ = అందులో (అక్కడ)
ఘోరమైన = గొప్పదైన
తపము = తపస్సును
జేసె = చేశాడు

తాత్పర్యం : భాగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, (తన పితరుల ఆత్మలకు శాంతి లభింప చేయడానికి) గోకర్ణం వెళ్లి అక్కడ గొప్ప తపస్సు చేశాడు.

3వ పద్యం :

తే ||
వాయుభక్షకుఁడై యూర్ధ్వబాహుఁ డగుచు
మహిత పంచానలంబుల మధ్యమందు
స్థాణువోయన నచలుఁడై తగ వసించి
తపము గావించె వేయువత్సరము లిట్లు.

ప్రతిపదార్థం :

వాయుభక్షకుఁడై = గాలిని ఆహారంగా తీసుకొని
యూర్ధ్వబాహుఁ డగుచు = చేతులు పైకెత్తి
మహిత = గొప్ప
పంచ = ఐదు
అనలంబుల = అగ్నుల
మధ్యమందు = మధ్యలో
స్థాణువోయనన్ = రాయి ఏమో అనగా
అచలుఁడై = కదలకుండా
తగ వసించి = నిలిచి
ఇట్లు = ఈ విధంగా
వేయువత్సరములు = వేయి యేళ్ళు
తపము = తపస్సు
గావించె = చేశాడు

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4వ పద్యం :

ఉ||
దానికి మెచ్చి యిట్లనుఁ బితామహుఁ డోమను జేశ ! యోతప
శ్రీనిధి యోభగీరథ ! విశిష్టజనస్తుతమైన నీతపం
బే నిదె మెచ్చినాఁడ భవదిష్టము వేఁడుము దాని నిచ్చెదన్
మానవనాథ యంచుఁ గడు మన్ననఁ బల్క నతండు హృష్టుఁడై.

ప్రతిపదార్థం :

దానికి మెచ్చి = ఆ తపస్సుకు మెచ్చి
పితామహుఁడు = బ్రహ్మ
యిట్లనున్ = ఈ విధంగా అన్నాడు
ఓ మనుజ + ఈ శ ! = ఓ మహారాజా !
ఓ తపశ్రీనిధి = తపస్సంపన్నుడా !
ఓ భగీరథ ! = ఓ భగీరథ !
విశిష్టజనస్తుతము + ఐన = జనులచే పొగడబడే
నీతపంబున్ = నీ తపస్సును
ఏ + ఇదె = నేను ఇప్పుడే
మెచ్చినాఁడ = మెచ్చినాను
భవత్ + ఇష్టము = నీ కోరికను కోరుకొనుము
వేడుము = కోరుకొనుము
దానిన్ + ఇచ్చెదన్ = దానిని తీర్చుతాను
మానవనాథ = మహారాజా
అనుచున్ = అంటూ
కడు = ఎక్కువైనా
మన్ననఁ బల్కన్ = గౌరవంతో పలకగా
అతండు = భగీరథుడు
హృష్టుఁడై = సంతోషించి

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

5వ పద్యం :

ఉ ||
అంజలి చేసి మ్రొక్కి వినయావనతాననుఁడై జగత్ప్రభున్
గంజభవుం గనుంగొని జగజ్జన గీతయశుండు భూమిభృ
త్కుంజరుఁ డిట్లనున్ మొదలు గోరెద సాగరభస్మమున్ జగ
ద్రంజన ! దేవతాసరి దుదంచిత వారిపరిఫ్లుతంబుగాన్.

ప్రతిపదార్థం :

అంజలి చేసి = రెండు చేతులు జోడించి
మ్రొక్కి = నమస్కరించి
వినయ + అవనత + ఆననుఁడై = వినయంతో తల వంచుకొని
జగత్ప్రభున్ = ఆ దేవుణ్ణి
కంజభవున్ = పద్మము నుండి పుట్టినవాడు (బ్రహ్మను)
కనుంగొని = చూసి
జగజ్జన గీతయశుండు = జనులందరిచే పొగడబడే కీర్తి కలవాడు
భూమి భృత్కుంజరుడు = మహారాజు (భగీరథుడు)
ఇట్లు + అనున్ = ఈ విధంగా పలికాడు
జగద్రంన ! = జనులకు ఆనందాన్ని కలిగించే వాడా
మొదలు = మొదట
సాగరభస్మమున్ = సాగరుల భస్మరాశులపై
దేవతాసరిత్ = దేవనది యొక్క
ఉదంచిత వారి = గొప్ప నీటిని
పరిఫ్లుతంబుగాన్ = ప్రవహించే విధంగా
గోరెదన్ = కోరుకుంటా

తాత్పర్యం : రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తల వంచుకొని అ బ్రహ్మను చూసి జనులచే పొగడబడే కీర్తి కలిగిన భగీరథుడు మొదట సాగరుల భస్మరాశులపై దేవనది యొక్క నీటిని ప్రవహింప చేయమని కోరాడు.

6వ పద్యం :

ఉ||
వెండియుఁ గోరెదన్ భువన విశ్రుతుఁడై న తనూజు సద్యశో
మండితు నప్రమేయగుణు మత్కులవర్ధను దేవదేవ ! యీ
రెండువరంబు లిచ్చి కృతకృత్యుఁగ నన్నానరింపవే ! నతా
ఖండల ! వాగధీశ ! శ్రితకల్పమహీజ ! త్రిలోకనాయకా !

ప్రతిపదార్థం :

వెండియుఁన్ = మళ్ళీ (తరువాత)
కోరెదన్ = కోరుకుంటాను
దేవదేవ ! = ఓ దేవా
నత + ఆఖండల ! = ఇంద్రునిచే నమస్కరించబడే వాడా !
వాగధీశ ! = వాక్కులకు అధిపతీ (సరస్వతికి భర్తా !)
(ఆ)శ్రితకల్పమహీజ ! = ఆశ్రయించిన వారికి కల్పవృక్షము వంటి వాడా
త్రిలోకనాయకా ! = మూడు లోకాలకు నాయకుడా!
భువన = భూమండలంలో
విశ్రుతుఁడై న = ప్రసిద్ధుడయ్యే
తనూజున్ = కొడుకును
సత్ + యశో మండితున్ = మంచి కీర్తి పొందే వాడిని ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
అప్రమేయగుణున్ = ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
మత్ కులవర్ధనున్ = మా వంశోద్ధారకున్ని
యీ రెండువరంబులు = ఈ రెండు కోరికలను
ఇచ్చి = ఇచ్చి
కృతకృత్యుఁగ = అనుకున్న పని పూర్తి చేసినవాడిగా
నన్నున్ + ఒనరింపవే ! = నన్ను అనుగ్రహించు

తాత్పర్యం : ఓ వాక్కులకు అధిపతి అయినవాడా!, ఇంద్రునిచే నమస్కరించబడే వాడా!, ఆశ్రయించిన వారికి లేదనక ఇచ్చే కల్ప వృక్షము వంటి వాడా, మూడు లోకాలకు నాయకుడా! భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని రెండవవరంగా అనుగ్రహించు.

7వ పద్యం :

మ॥
అని యభ్యర్థితుఁ జేయ మెచ్చి యపు డయ్యంభోజసంభూతుఁ డి
ట్లనియెన్ వంశవివర్ధనుండు సుతుఁ డుద్యత్తేజుఁడుం గల్గు నీ
కనఘా ! దివ్య సరిత్ప్రవాహ పతనంబై నన్ భరింపంగ నో
పునె భూమిస్థలి ? దేవదేవుఁడగు శంభుం డొక్కడుం దక్కఁగాన్.

ప్రతిపదార్థం :

అని = అలా
యభ్యర్థితుఁన్ + చేయ = కోరుకొనగా
మెచ్చి = మెచ్చుకొని
అపుడు = అప్పుడు
ఆ + అంభోజ సంభూతుఁడు = కమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మదేవుడు)
ఇట్లనియెన్ = ఈ విధంగా అన్నాడు.
అనఘా ! = పాపము లేని వాడా (పుణ్యాత్ముడా)
వంశవివర్ధనుండు = వంశాన్ని పెంచే తేజస్సు కల
సుతుఁడు = కొడుకు
నీకున్ + కల్గున్ = నీకు పుడుతాడు
దివ్య సరిత్ ప్రవాహ = దివ్య లోకాలలో ప్రవహించే (నది)
పతనంబై నన్ = కింద పడితే
దేవదేవుఁడగు = దేవతలకు దేవుడైన
శంభుం డొక్కడున్ = శంకరుడు ఒక్కడు
తక్కఁగాన్ = తప్ప
భూమిస్టలి ? = భూమండలం
భరింపంగన్ + ఓపునే = ఓర్చుకోగలదా ?

తాత్పర్యం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు. “ఓ పుణ్యాత్ముడా ! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే పరమ శివుడు తప్ప భూమండలం భరిస్తుందా?”

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

8వ పద్యం :

మ||
అని యిట్లయ్యజుఁ డానతిచ్చి మఱి దా నంతర్హితుండైన నె
క్కొను సద్భక్తి భగీరథుండు చరణాంగుష్ఠం బిలన్నిల్పి శం
భుని హృత్పద్మగుఁ జేసి దుష్కర తపంబుం జేయ నద్దేవుఁ డ
మ్మనుజాధీశు తపంబు మెచ్చి పలికెన్ మాధుర్య మేపారఁగన్.

ప్రతిపదార్థం :

యిట్లు = ఈ విధంగా
అని = చెప్పి
ఆ + అజుడు = బ్రహ్మ
ఆనతిచ్చి = చెప్పి
మఱి దాన్ = తాను
అంతర్హితుండైనన్ = అంతర్ధానం (మాయం) అయ్యాడు
ఎక్కొను = ఎక్కువైన
సద్భక్తి = భక్తి తో
భగీరథుండు = భాగీరథుడు
చరణ + అంగుష్ఠంబు = కాలి బొటన వేలును
ఇలన్ నిల్పి = భూమిపై నిలిపి
శంభుని = శంకరుని గూర్చి
హృత్ + పద్మగుఁ జేసి = హృదయాన్ని పద్మముగా చేసి
దుష్కర = కఠినమైన
తపంబున్ చేయన్ = తపస్సు చేస్తే
ఆ + దేవుడు = ఆ శివుడు
ఆ + మనుజాధీశు = రాజు
తపంబు మెచ్చి = తపస్సుకు సంతోషించి
మాధుర్యము + ఏపారఁగన్ = ఆప్యాయత నిండగా
పలికెన్ = పలికాడు

తాత్పర్యం : అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేస్తే ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో పలికాడు.

9వ పద్యం :

మ.కో॥
నీ తపంబున కేను మెచ్చితి నిరోదక వాహినిన్
నా తలస్ ధరియించెదన్ జననాథ! లెమ్మని పల్క ను
ర్వీతలేశుఁడు హృష్టుఁడై కనువిచ్చి శంకరుఁ జూచి సం
ప్రీతి మ్రొక్కి నుతించి తన్ గృతకృత్యుఁగాఁ దలఁచెన్ మదిన్.

ప్రతిపదార్థం:

జననాథ ! = ఓ రాజా
లెమ్ము + అని = లేవుమని
నీ = నీ
తపంబునకున్ = తపస్సుకు
ఏను = నేను
మెచ్చితి = సంతోషించాను
నిర్జర = దేవలోకంలోని
ఉదక = నీటి
వాహినిన్ = ప్రవాహాన్ని (నదిని)
నా తలన్ = నా తలపై
ధరియించెదన్ = ధరిస్తాను
పల్కన్ = చెప్పగా
ఉర్వీతలేశుఁడు = రాజు (భగీరథుడు)
హృష్టుడై = సంతోషించి
కనువిచ్చి = కన్నులు తెరిచి
శంకరుఁన్ + చూచి = శంకరుణ్ణి చూసి
సంప్రీతి మ్రొక్కి = మనస్ఫూర్తిగా మొక్కి
నుతించి = కీర్తించి
తన్ = తాను
కృతకృత్యుఁగాఁన్ = విజయము సాధించానని
మదిన్ = మనసులో
తలచెన్ = అనుకున్నాడు

తాత్పర్యం : ఓ రాజా నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై ధరిస్తాను. అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి, కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

10వ పద్యం :

క ||
భూతేశు ప్రతిజ్ఞకు సం
జాతాతి క్రోధ యగుచు స్వర్గంగ నిజ
స్రోతోవేగంబున హరుఁ,
బాతాళం బంటంద్రొక్కు భావం బిడియెన్.

ప్రతిపదార్థం :

భూతేశు = శివుని
ప్రతిజ్ఞకు = మాటకు
సంజాతాతి = పుట్టిన పెద్ద
క్రోధ యగుచు = కోపంతో
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
పాతాళంబు + అంటన్ = పాతాళం చేరే విధంగా
త్రొక్కు = తొక్కేస్తాను
భావంబు + ఇడియెన్ = భావించింది

తాత్పర్యం : శివుడు ఇచ్చిన మాటకు పెద్దగా కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది.

11వ పద్యం :
క||
హరుఁ డయ్యవలేపమునకుఁ,
బరమక్రోధాకుల స్వభావుం డగుచున్,
సరిదుత్త మయగు గంగం,
దిరోహితను జేయంగా మదిం దలపోసెన్.

ప్రతిపదార్థం :

హరుఁడు = శివుడు
ఆ + అవలేపమునకుఁ = గంగాదేవి గర్వానికి
బరమ = ఎక్కువైన
క్రోధాకులస్వభావుండు = కోపముచే నిండిన స్వభావుడు
అగుచు = అయి
సరిత్ + ఉత్తమయగు = ఉత్తమమైన నది
గంగన్ = గంగను
తిరోహితన్ చేయగా = మరుగు పరచాలి అని
మదిన్ + తలపోసెన్ = మనస్సులో అనుకున్నాడు

తాత్పర్యం : గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు గంగ గర్వాన్ని మరుగుపర్చాలి అని మనస్సులో అనుకున్నాడు.

12వ పద్యం :

ఆ ||
ఇవ్విధమున వార లిరువు రొండొరుల ని
గ్రహమునకుఁ దలంపఁగా నెఱంగి
దానిఁ జూచుటకుఁ బితామహముఖదేవ,
దేవయోను లరుగుదెంచి రపుడు.

ప్రతిపదార్థం :

ఈ + విధమున = ఈ విధంగా
వారలు + ఇరువురు = గంగా, శివుడు ఇద్దరూ
ఒండొరులన్ = ఒకరిని ఒకరు
నిగ్రహమునకుఁ = ఓడించాలని
దలంపఁగాన్ = అనుకోవడం
ఎఱంగి = తెలుసుకొని
దానిఁన్ = ఆ సన్నివేశాన్ని
చూచుటకుఁన్ = చూడడానికి
పితామహముఖ = బ్రహ్మ మొదలైన
దేవయోనులు = దేవతలకు జన్మించిన వారు
అరుగుదెంచిరి = వచ్చారు
అపుడు = అప్పుడు

తాత్పర్యం : ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. అప్పుడు

13వ పద్యం :

ఆ||
మాననీయ తద్విమానమండల సహ
స్రములతోడ నభము చాల మెఱసి
భాసమాన భూరిభానుమండల సహ
స్రములతోడ మెఱయు క్రమము దోఁప.

ప్రతిపదార్థం :

మాననీయ = గౌరవింప తగిన
సహస్రముల = వేల
తత్ విమానమండల = ఆ విమాన సముదాయం
తోడ = తో
నభము = ఆకాశం
చాల మెఱసి = చాల మెరిసింది
భాసమాన = సూర్య సమానమైన
సహస్రముల = వేల
భూరి భానుమండల = గొప్ప సూర్యలోకాల
తోడ = తీరుగా
మెఱయు = మెరుస్తున్నట్లు
క్రమము దోఁప = అనిపించింది

తాత్పర్యం : అనేకులైన దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా అనిపించింది.

14వ పద్యం :

శా||
ఈరీతిన్ జగదీశు మస్తకముపై నేపారి యగ్గంగ దు
ర్వారప్రక్రియ వ్రాలియున్ వెడలిపోవన్ లేక తన్మాయచే
వారింపంబడి తజ్జటాటవి భ్రమింపం జొచ్చెం బెక్కేండ్లుగా
సారోదార పయోదమండల చరత్ సౌదామనీ తుల్యయై.

ప్రతిపదార్థం :

ఈరీతిన్ = ఈ విధంగా
జగదీశ = శివుని
మస్తకముపైన్ + ఏపారి = తలపై పడి
ఆ + గంగ = ఆ గంగా
దుర్వార = నివారింపలేని
ప్రక్రియ = విధంగా
వ్రాలియున్ = పడి
వెడలిపోవన్ లేక = వెళ్ళలేక
తత్ + మాయచే = శివుని మాయచే
వారింపంబడి = నిలుపబడి
తత్ + జటాటవి = ఆ శివుని జడలనే అడవిలో
పక్కెండ్లుగా = ఎన్నో సంవత్సరాలు
సార + ఉదార = గొప్ప
పయోదమండల = మబ్బులలో
చరత్ సౌదామనీ = కదులుతున్న మెరుపు
తుల్యమై = లాగ
భ్రమింపన్ చొచ్చెన్ = తిరిగింది

తాత్పర్యం : ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

15వ పద్యం :

ఉ||
ఆ సమయంబునన్ జలరుహాసను మున్నిడి నిర్జరుల్ జగ
ద్భాసకుఁడైన శంకరుని పాలికి వచ్చి నుతించి యంజలుల్
చేసి జగత్రయీశ! సురసింధ్వవలేపము నీదు మాయచేఁ
బాసె భవన్మహామహిమ భావమునందుఁ దలంపకుండుటన్

ప్రతిపదార్థం :

ఆ సమయంబునన్ = ఆ సమయంలో
జలరుహాసను = బ్రహ్మ
మున్నిడి = ముందుంచుకొని
నిర్జరుల్ = దేవతలు
జగత్ భా సకుఁడైన = జగానికి వెలుగును ఇచ్చే మిత్రుడైన
శంకరుని పాలికి వచ్చి = శంకరుని వద్దకు వచ్చి
నుతించి = కీర్తించి
యంజలుల్ చేసి = నమస్కరించి
జగత్రయ + ఈశ ! = మూడు లోకాలకు పాలకుడా దేవనది
సురసింధు = దేవనది
అవలేపము = గర్వము
నీదు మాయచే = నీ మాయచేత
బాసెన్ = పోయింది
భవన్ = నీ
మహా మహిమ = గొప్ప మహిమ చేత
భావమునందుఁన్ = మనసులో
తలంపక + ఉండుటన్ = గ్రహించకపోవడం చేత

తాత్పర్యం : ఆ సమయంలో బ్రహ్మను ముందుంచుకొని దేవతలందరూ జగానికి జ్ఞానమనే వెలుతురునిచ్చే శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా ! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది.

16వ పద్యం :

క॥ పర్వత సమభావం బీ
యుర్విం బరమాణు వొందనోపని భంగిన్
సర్వేశ! భవత్సమత సు
పర్వాపగ పొందఁ గలదె భావింపంగన్ :

ప్రతిపదార్థం :

సర్వేశ ! = సర్వమునకు ఈశుడా !
ఈ + ఉర్విన్ = ఈ భూమిపై
పర్వత సమభావంబు = పర్వతముతో సమానమైనవి కూడా
పరమాణువు = అతిచిన్న (విలువను)
ఒందనోపని = పొందలేని
భంగిన్ = తీరుగా
భవత్ + సమత = నీ సమభావం
సుపర్వ + ఆపగ = దేవనది
భావింపగన్ = మనసులో నైనా
పొందఁ గలదె = పొందగలదా

తాత్పర్యం : ఓ ‘సర్వేశ్వరా! ఈ భూమిపై (నీ సృష్టిలో) పర్వత సమాలు కూడా చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఆ విధంగా నీ సమభావాన్ని గంగానది మనస్సులోనైనా ఉహించగలదా ?

17వ పద్యం :

ఉ ||
పాలితసర్వలోక ! నిజభక్తు భగీరథు దీను పైఁ గృపా
శీలతఁ బూనియైన సురసింధు విమోచన మాచరింపఁగాఁ
బోలును దీనిచే సగరపుత్ర విముక్తి మనుష్యలోక సా
తాళ పవిత్రభావము లుదార భవత్కృప నుల్లసిల్లెడిన్.

ప్రతిపదార్థం:

పాలిత సర్వలోక ! = సర్వలోకాలను పాలించే వాడా
నిజభక్తున్ = నీ భక్తున్ని
భగీరథున్ = భాగీరథునిపై
దీనున్ + పైఁన్ = దీనునిపై
కృపాశీలతఁన్ = కృపతో
పూనియైన = అయినా
సురసింధు = దేవనదిని
విమోచనము = విడుదల
ఆచరింపఁగాఁన్సోలును = చేయవలెను
దీనిచే = ఈ గంగ జలముచే
సగరపుత్ర = సగరుని పుత్రుల ఆత్మలకు
విముక్తి = ప్రశాంతత
మనుష్యలోక = మానవలోకానికి
పాతాళ = పాతాళలోకానికి
పవిత్రభావముల్ = పవిత్రభావములు
ఉదార = గొప్పతనము
భవత్కృపన్ = నీ కృప కారణంగా
ఉల్లసిల్లెడిన్ = కలుగుతుంది

తాత్పర్యం : సర్వలోకాలను పాలించేవాడా ! నీ భక్తుడైన భగీరథుని, దీనునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగాజలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవలోకానికి, పాతాళలోకానికి నీ కరుణ కారణంగా గొప్పతనము కలుగుతుంది.

18వ పద్యం :

ఆ||
అని నుతింప నవ్వి యద్దేవదేవుండు,
పరమ సుప్రసన్న భావుఁ డగుచు
గంగ నపుడు విడిచె ఘనతరంబగు బిందు,
సరమునందు సురలు సంతసిల్ల

ప్రతిపదార్థం :

అని = అని
నుతింప = వేడుకొనగా
ఆ + దేవదేవుండు = ఆ శివుడు
నవ్వి = నవ్వి
పరమ = చాలా
సుప్రసన్న భావుఁ డు + అగుచు = చాలా ఆనందంతో
గంగన్+ అపుడు = అప్పుడు గంగానదిని
సురలు = దేవతలు
సంతసిల్లను = సంతోసించగా
ఘనతరంబగు = గొప్పదైన
బిందు సరమునందు = ‘సముద్రంలోకి
విడిచె = వదిలాడు

తాత్పర్యం : అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి పరమ సంతోష హృదయుడై ఆ గంగానదిని దేవతలు సంతోషిస్తుండగా సముద్రంలోకి వదిలాడు.

19వ పద్యం :

సీ॥
అబ్బంగి హరముక్త యై గంగ సప్తప్ర,
వాహ రూపంబులు వరుసఁ దాల్చి
భాసురహ్లాదినీ పావనీ నందినీ,
నామముల్గల మహానదులు మూఁడు
సురరాజుదిక్కున కరిగి సీతాసుచ
క్షుస్సింధు నామక ప్రోతములును
బశ్చిమదిశ కేఁగెఁ బదఁపడి యేడవ,
యగు ప్రవాహం బద్భుతాభిరామ
ఆ॥ మగుచు నబ్బగీరథావరు చెంత
కరుగు దేరఁజూచి యవ్విభుండ
రమ్యమైన దివ్య రథమెక్కి కదలెన
య్యమరసింధు వెంట ననుగమింప

ప్రతిపదార్థం :

ఆ + బంగి = ఆ విధంగా
హరముక్త యై = శివునిచే విడువబడిన
గంగ = గంగానది
సప్తప్రవాహ = ఏడు పాయలుగా
రూపంబులువరుసం దాల్చి = రూపాంతరం చెంది
భాసురహ్లాదినీ, పావనీ, నందినీ = భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (పేర్లు)
నామముల్గల = పేర్లు గల
మహానదులు మూఁడు = మూడు నదులు
సురరాజు = ఇంద్రుని (తూర్పు)
దిక్కునకు + అరిగి = దిక్కుకుపోయాయి
సీతా, సుచక్షు, సింధు = సీతా, సుచక్షు, సింధు (పేర్లు)
నామక ఫ్రోతములును = పేర్లు గల ప్రవాహాలు
పదపడి = అత్యంత వేగంతో
పశ్చిమదిశకు + ఏగెఁ = పశ్చిమానికి వెళ్ళాయి
యేడవయగు = ఏడవది అయిన
ప్రవాహంబు = ప్రవాహం
అద్భుత + అభిరామము = ఎంతో మనోజ్ఞం
అగుచున్ = అయి
ఆ + భగీరథావరు = గౌరవింపదగిన ఆ భగీరథుని
చెంతకున్ = వద్దకు
అరుగున్ = వెళ్ళుటను
తేరఁజూచి = పరిశీలించి
ఆ + అమరసింధు = ఆ దేవనది
వెంటన్ = తన వెంబడి
అనుగమింప = వస్తుండగా
ఆ + విభుండు + అ = ఆ రాజు
రమ్యమైన = అందమైన
దివ్య రథమెక్కి = గొప్ప రథాన్ని ఎక్కి
కదలెన్ = కదిలాడు

తాత్పర్యం : ఆ విధంగా శివుని జడలనుండి విడువబడిన గంగా నది ఏడుపాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా తన వద్దకు రావడం గమనించిన భగీరథుడు గంగానది తనను అనుసరించి రాగా అందమైన గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

20వ పద్యం :

తే||
హర తనుస్రుష్టమగుటచే నతిపవిత్ర,
మయ్యె నమరాపగాతోయ మనుచు నింద్ర
ముఖ్యసురయక్షగంధర్వమునిగణములు,
కోర్కులలరంగఁ బలుమాఱుఁగ్రుంకెనందు.

ప్రతిపదార్థం :

హర = శివుని
తను = శరీరాన్ని
స్ర్పుష్టము + అగుటచేన్ = స్పర్శించినందున
అతి పవిత్రమయ్యెన్ = ఇంకా పవిత్రంగా మారింది
అమర + ఆపగ = దేవనది యొక్క
తోయము = జలము
అనుచున్ = అనుకుంటూ
ఇంద్రముఖ్యసుర = ఇంద్రుడు మొదలైన దేవతలు
యక్షగంధర్వ = యక్షులు, గంధర్వులు
మునిగణములు = మునుల సమూహాలు
కో ర్కు లలరంగఁ = వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు
పలుమాఱు = అనేక సార్లు
గ్రుంకెనందు = అందులో దుమికారు

తాత్పర్యం : శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది యొక్క జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు నదిలో స్నానం చేశారు.

21వ పద్యం :

ఆ||
అంత జహ్నుఁ డను మహారాజు యజ్ఞంబు,
సేయుచుండ నమర సింధు వతని
యజ్ఞశాల ముంప నాతఁ డన్నది మ్రింగె,
జలధి మ్రింగు కుంభజన్ముఁడట్లు.

ప్రతిపదార్థం :

అంత = అపుడు
జహ్నుఁ డను = జహ్నువు అనే పేరుగల
మహారాజు = మహారాజు
యజ్ఞంబు = యజ్ఞం
సేయుచుండన్ = చేస్తుండగా
అమర సింధువు = దేవనది
అతని = ఆ జహ్నువు యొక్క
యజ్ఞశాల = యజ్ఞశాలను
ముంపన్ = ముంచి వేయగా
ఆతఁడు = ఆ జహ్నువు
జలధి = సముద్రాన్ని
కుంభజన్ముఁడట్లు = అగస్త్యుని లాగ
ఆ + నదిన్ = ఆ గంగా నదిని
మింగె = మ్రింగాడు

తాత్పర్యం : అపుడు జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు.

22వ పద్యం :

సీ|| దానికి సుర లద్భుతం బొంది రాజర్షి
వరుఁడైన జహ్ను భూవల్లభునకు
నిట్లని రో మానవేశ! తావక తపం
బత్యమోఘము గదా యవనిలోన !
నధిప ! నిప్పీతవారిధి యగస్త్యుఁడు నేఁడు,
విస్మృతుండయ్యె నీ విపుల మహిమ
గర్వ మంతయుఁ బాసె గంగకు నిఁక నీదు,
తనయయై వర్తించు ధరణిలోనఁ

ఆ|| గాన దీని విడువఁగాఁ దగు నీ వన్న,
నమ్మహానుభావుఁ డపుడు తనదు
శ్రుతుల వలననుండి సురసరిత్ప్రవరను,
విడిచె దివిజు లెల్ల విస్మితులుగ.

ప్రతిపదార్థం:

దానికి = అప్పుడు
సురలు = దేవతలు
అద్భుతం బొంది = ఆశ్చర్యం పొంది
రాజర్షివరుఁడైన = రాజ ఋషులలో శ్రేష్ఠుడైన
జహ్ను భూవల్లభునకున్ = జహ్నువు అనే రాజుతో
ఇట్లనిరి = ఈ విధంగా అన్నారు
ఓ మానవేశ ! = ఓ మానవులకు ఈశ్వరా
తావక = తమరి
తపంబు = తపస్సు
అతి + అమోఘము గదా = చాల గొప్పది కదా
అవనిలోన ! = ఈ భూమిపై
నధిప! = గొప్పవాడా!, (రాజా !)
నిష్పీతవారిధి = సముద్రాన్ని తాగిన
యగస్తుడు = అగస్త్య ముని
నేఁడు = ఈ రోజు
నీ విపుల మహిమన్ = = నీ గొప్ప మహిమ చేత
విస్మృతుండయ్యె = గుర్తు లేకుండా అయ్యాడు (మరిపించావు)
గంగకున్ = గంగాదేవి యొక్క
గర్వ మంతయుఁ బాసె = పొగరు అణిగింది
ఇక = ఇక పై
నీదు = నీ యొక్క
తనయయై = కూతురుగా
వర్తించు = గుర్తింపు పొందును
ధరణిలోనఁ = భూమిపై
గాన = కావున
దీనిన్ = ఈ గంగను
నీవు విడువఁగాఁ దగున్ = నీవు విడిచి పెట్టవలెను
అన్నన్ = అనగానే
ఆ + మహానుభావుఁడు = ఆ జహ్ను రాజర్షి
అపుడు = అప్పుడు
దివిజుల్ + ఎల్ల = దేవతలందరూ
విస్మితులుగ = = ఆశ్చర్యపడగా
తనదు = తనయొక్క
శ్రుతుల వలన నుండి = శ్రవనేంద్రియాల (చెవుల) నుండి
సురసరిత్ + ప్రవరను = దేవలోకంలో ప్రవహించే నదిని
విడిచెన్ = విడిచిపెట్టాడు

తాత్పర్యం : అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. ఓ మహారాజా నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి యొక్క పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై ఈ గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు.

23వ పద్యం :

ఆ||
నాఁటనుండి జహ్నునకు కూఁతు రగుట జా
హ్నవి యనంగ గంగ భువిఁ జరించె
నంత నబ్బగీరథావనీపతి రథం
బనుగమించి చనియె నంబునిధికి.

ప్రతిపదార్థం :

నాఁటనుండి = ఆ రోజు నుండి
జహ్నునకు = జహ్ను మహర్షికి
కూతురగుట = కూతురు కావడం వలన
జాహ్నవి = జాహ్నవి
యనగంగ = అనే పేరుతో
గంగ = గంగాదేవి
భువిఁన్ + చరించెన్ అంతన్ = భూమిపై ప్రవహించింది.
ఆ + భగీరథ + అవనీపతి = భగీరథుడు అనే పేరు గల రాజు యొక్క
రథంబు + అనుగమించి = రథాన్ని అనుసరించి
అంబునిధికి = సముద్రానికి
చనియెన్ = వెళ్ళింది

తాత్పర్యం : ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథాన్ని అనుసరించి (రథం వెంబడి) సముద్రానికి వెళ్ళింది.

24వ పద్యం :

సీ||
అంత శుష్కంబైన యబ్ధిలో సాగరుల్,
ద్రవ్విన వివరంబు దరియఁ జొచ్చి
యబ్బగీరథుఁడు గంగానుగతుండైర
సాతలంబున కేఁగి సగరపుత్ర
భస్మరాసులు దీనభావుఁడై కనునంత,
నగ్గంగ తద్రాసు లన్ని దడిఁయఁ
బ్రవహించెఁ దాన నిష్పాపులై సాగరుల్
దివ్యరూపములొంది దివిజులట్లు.

ఆ||
తక్షణమ విమాన తతులతో నబ్బగీ,
రథుఁడు చూడ నమరరాజి పొగడ
బృథులమైన నాకపృష్ఠ మారోహించి,
వెలసి రతుల హర్ష వివశు లగుచు..

ప్రతిపదార్థం :

అంత = అపుడు
శుష్కంబైన = ఎండిపోయిన
అబ్ధిలో = సముద్రంలో
సాగరుల్ = సగర పుత్రులు
ద్రవ్విన వివరంబు = తవ్వినరంధ్రం (మార్గం)లో
దరియఁ జొచ్చి = తరింప చేయడానికి
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
గంగాగుతుండై = గంగ వెంట రాగా
రసాతలంబునకు + ఏగి = పాతాళానికి వెళ్లి
సగరపుత్ర = సగర పుత్రుల
భస్మరాసులు = బూడిద కుప్పలను
దీనభావుఁడై = దీన భావముతో
కనునంతన్ = చూస్తుండగా
ఆ + గంగ = ఆ గంగానది
తత్ + రాసులన్ని = ఆ కుప్పలన్నిటిని
ద డియాఁ = తడిచే విధంగా
బ్రవహించెఁ = ప్రవహించింది
దాన = కావున
నిష్పాపులై = పాపము పోయిన వారై
సాగరుల్ = సగర పుత్రులు
దివ్యరూపములొంది = దివ్యమైన రూపాలు పొంది
దివిజులట్లు = దేవతలలాగా
తక్షణమ = ఆ క్షణంలో
విమాన తతులతో = విమాన వరుసలతో
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
చూడన్ = చూస్తుండగా
అమరరాజి = దేవతల సమూహం
పొగడ = పొగిడే విధంగా
అతుల = అసామాన్యమైన
వివశులగుచు = పట్టరాని
హర్ష = ఆనందంతో
బృథులమైన = గొప్పదైన
నాకపృష్ఠమారోహించి
వెలసిరి = స్వర్గాన్ని చేరుకున్నారు

తాత్పర్యం : అపుడు ఎండిపోయిన సముద్రంలో సాగరులు తవ్విన మార్గంలో వారిని తరింపజేయడానికి గంగ తనవెంట రాగ భగీరథుడు పాతాళానికి వెళ్లి సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు)

25వ పద్యం :

చ||
అపుడు చతుర్ముఖుండు దివిజావృతుఁడై చని యబ్బగీరథుం
గృప దళుకొత్తఁ జూచి పలికెన్ సగరాదులచేతఁ గాని యీ
యపరిమిత ప్రతిజ్ఞ యను నబ్ధిఁ దరించితి వత్స నీవు, నీ
తపము నుతింపఁగా సకలదైవత కోటులకైన శక్యమే !

ప్రతిపదార్థం :

అపుడు = అప్పుడు
చతుర్ముఖుండు = బ్రహ్మ
దివిజ + ఆవృతుఁడై = దేవతా సమూహముచే
చనిన్ = వెళ్లి
ఆ + భగీరథున్ = ఆ భగీరథున్ని
గృపన్ + తళుకొత్తఁ = కరుణతో
చూచి = చూసి
పలికెన్ = (ఈ విధంగా) పలికాడు
సగరాదులచేతఁ గాని = సగరుడు మొదలైన వారిచే సాధ్యం కాని
ఈ + అపరిమిత = ఈ గొప్ప
ప్రతిజ్ఞ యనున్ = ప్రతిజ్ఞ అనే
అబ్ధిఁని + తరించితివి = సముద్రాన్ని దాటావు
వత్స = కుమారా
నీవు = నిన్ను
నీ తపమున్ = నీ తపస్సును
నుతింపఁగా = మెచ్చుకోవడం
సకల = అందరు
దైవత కోటులకైన = దేవతల సమూహానికైనా
శక్యమే ! = సాధ్యమా ! (సాధ్యం ‘కాదు అని భావం)

తాత్పర్యం : అపుడు బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథున్ని కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యంకాలేదు. దానిని సాధించిన నిన్ను నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

26వ పద్యం :

సీ||
దేవయుగంబున దేవతాహితమున
కై కుంభజుండు ము న్నబ్ధి గ్రోలెఁ
దత్కారణంబున ధరను శుష్కీభూత
మై యుండె నిందాఁక నప్పయోధి;
నృప ! సాగరుఁడవైన నీవు నేఁ డిగ్గంగ,
నీటిచే సంభోధి నించు కతన
సాగరుండన మూఁడు జగములఁ బెంపొందు;
నయ్యబ్ధి యెందాఁక నవని మెఱయుఁ

ఆ||
బృధులమైన నాకపృష్ఠమం దందాఁక,
సంచరింపఁగలరు సగరసుతులు;
అనఘ! నీవు నట్ల యస్మ దుద్దామా ధా
మమున నుండఁగలవు మనుజనాథ !

ప్రతిపదార్థం:

దేవయుగంబున = సత్య యుగంలో
దేవతాహితమునకై = దేవతల మేలు కొరకు
కుంభజుండు = కుండనుండి జన్మించిన వాడు (అగస్త్యుడు)
మున్ను + అబ్దిన్ = మునుపు సముద్రాన్ని
గ్రోలెఁన్ = త్రాగాడు
తత్కారణంబున = ఆ కారణముతో
ధరను = భూమిపై
ఇందాఁక = ఇప్పటివరకు
ఆ + పయోధి = ఈ సముద్రం
శుషీభూతమై = ఎండిపోయి
యుండెన్ = ఉన్నది
నృప ! = రాజా
నీవున్ = నీవు
సాగరుఁడవైన = సగర వంశంలో జన్మించిన వాడవు
నేఁ డు = ఈ రోజు
ఈ + గంగ = ఈ గంగ
నీటిచే = నీటితో
అంభోధిన్ = సముద్రాన్ని
ఇంచు కతన = నింపిన కారణంగా
సాగరుండన = సాగరుడనే పేరుతో
మూఁడుజగములఁ = మూడు లోకాలలో
బెంపొందు = ప్రసిద్ధి చెందును
మనుజనాథ ! = రాజా
ఆ + అబ్ధి = ఆ సముద్రం
యెంకన్ = ఎప్పటివరకు
అవనిన్ = ఈ భూమిపై
మెఱయున్ = వెలుస్తుందో
బృధులమైన = గొప్పదైనా
నాకపృష్ఠమందు = స్వర్గ లోకంలో
అందాఁక = అప్పటిదాకా
సంచరింపఁగలరు = ఉండగలరు
సగరసుతులు = సగరుని పుత్రులు
అనఘ ! = పాపములేని వాడా
నీవున్ = నీవు కూడా
అట్ల = అదే విధంగా
అస్మ దుద్దామ = ఆ కాంతివంతమైన
ధామమునన్ = లోకంలో
ఉండఁగలవు = ఉంటావు

తాత్పర్యం : సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభ సంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని త్రాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండి పోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది గంగ నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో అప్పటివరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆ కాంతివంతమైన లోకంలో ఉంటావు.

27వ పద్యం :

ఆ||
జగతి జహ్ను తనయ యగుట నిగ్గంగ జా
హ్నవి యనంగ బరఁగు నవనిలోనఁ
ద్వత్తనూజ యగుటవలన భాగీరథి,
యనఁ జరించు లోకమున నృపాల !

ప్రతిపదార్థం:

నృపాల = ఓ రాజా!
ఈ + గంగ = ఈ గంగా నది
జగతిన్ = ఈ భూమిపై
జహ్ను = జహ్ను మహర్షి
తనయ = కూతురు
అగుటన్ = కావడం వలన
అవనిలోన = ఈ భూమిపై
జాహ్నవి = జాహ్నవి.
అనంగ = అనే పేరుతో
బరగున్ = పిలువబడుతుంది
లోకమున = ఈ లోకంలో
త్వత్ + తనూజ = నీ కూతురు
అగుటవలన = కావడం వలన
భాగీరథి = భాగీరథి
ఆనన్ = అనే పేరుతో
చరించున్ = ప్రవహిస్తుంది

తాత్పర్యం : ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది.

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

చ||
గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన త్రిలోచనుండు స
ర్వగుఁడు సహింపఁజాలు ననవద్య తపోమహిమన్ బ్రసన్నుఁ జే
యఁగఁదగు, నాతనిం; గరుణ నాతఁడు మేలని పల్కినన్ సురా
పగ తదుదగ్ర మస్తకముపైఁ బడు దతణమంద భూవరా!

ప్రతిపదార్థం :

భూవరా ! = రాజా
గగన ధునీ = ఆకాశ నది
నిపాతము = పడితే
జగత్ + ప్రభుఁడైన = జగత్తును పాలించే
త్రి లోచనుండు = మూడు కన్నులు కలవాడు
సర్వగుఁడు = సర్వము తెలిసినవాడు
సహింపఁజాలున్ = భరిస్తాడు
అనవద్య = గొప్ప
తపోమహిమన్ = తపో మహిమ చేత
ప్రసన్నున్ + చేయగఁన్ + తగున్ = ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం
ఆతని = శివుని
కరుణన్ = కరుణ చూపడంలో
నాడు మేలని = శివుడే ఉత్తముడు అని
పల్కినన్ = చెప్పగా
సుర + ఆపగ = దేవ నది
తత్ + ఉదగ్ర = అతని గొప్ప
మస్తకముపైఁన్ పడు = తలపై పడును
తత్ + క్షణమందు = ఆ క్షణంలో

తాత్పర్యం : ఓ మహారాజా! ఆకాశగంగ పడితే జగత్తుని పాలించేవాడు, మూడు కన్నులు కలవాడు, సర్వం తెలిసిన వాడు, అయిన శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన అతని శిరస్సుపై పడుతుంది.

2వ పద్యం :

ఉ||
ఆ సమయంబునందు దివిజాపగ వేగము దుస్సహంబుగాఁ
జేసి మహాఘనధ్వనివిజి న్నిజనిస్వనముల్ జగత్రయ
త్రాసకరంబులై మొరయ దారుణలీల హిమాచలాభమై
భాసీలు శంభుమస్తకముపైఁ బడియెం గడు నద్భుతంబుగాన్. (V.Imp)

ప్రతిపదార్థం :

ఆ సమయంబునందు = ఆ సమయంలో
దివిజ + ఆపగ = దేవలోకంలో ప్రవహించే నది
దుస్సహంబుగా = సహింప రాని
వేగము = వేగంతో
మహాఘనధ్వని = పెద్ద శబ్దం
జేసి = చేసి
విజిన్ + నిజ = గెలవాలనే కోరికతో
నిస్వనముల్ = మ్రోత
జగత్రయ = మూడు లోకాలకు
త్రాసకరంబులై = భయం కలిగించేవిగా
మొరయు = మోగగా
దారుణలీల = భయంకరముగా
హిమాచలాభమై సిలు = హిమాలయ పర్వతము లాగ
భాసిలు = ప్రకాశిస్తున్న
శంభు = శంకరుని
మస్తకము పైఁ = తలపై
కడున్ అద్భుతంబుగాన్ = మిక్కిలి అద్భుతముగా
బడియెన్ = పడింది

తాత్పర్యం : ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగా నది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడింది.

3వ పద్యం :

శా||
నానాదేశ నివాసులైన జను లానందంబు సంధిల్ల సు
స్నానంబుల్ సురవాహినీ జలములన్ సంతుష్టులై చేయని
త్యానూనంబగు వైభవంబునఁ దదీయంబౌ పితృవ్రాతమున్
వే నాకంబున కుర్గమించె భయకృత్రేతత్వ నిర్ముక్తమై.

ప్రతిపదార్థం :

నానాదేశ = అనేక ప్రదేశాలలో
నివాసులైన = నివసించే
జనులు = ప్రజలు
ఆనందంబు = ఆనందం
సంధిల్ల = ఉట్టిపడగా
సురవాహినీ = దేవనది యొక్క
జలములన్ = జలములలో
సంతుష్టులై = సంతోషంతో
సుస్నానంబుల్ = స్నానములు
చేయ = చేయగా
నిత్య + అనూనంబగు = శాశ్వతమైన
వైభవంబునఁన్ = వైభవాన్ని
తదీయంబౌ = దానికి సంబంధించిన
వే = వేలమంది (అసంఖ్యాకము)
పితృవాతమున్ = పితరుల సమూహము
భయకృత్ = భయాన్ని కలిగించే
ప్రేతత్వ = ప్రేత తత్వం నుండి
నిర్ముక్తమై = విడిచిన వారై
నాకంబునకున్ = స్వర్గానికి
ఉద్గమించెన్ = వెళ్ళారు

తాత్పర్యం : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేయగా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

భగీరథ ప్రయత్నం Summary in Telugu

పాఠ్యాంశం పేరు ఏ గ్రంథం నుండి గ్రహించబడినది

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం 1

కవి పరిచయం

పాఠ్యాంశ పేరు : భగీరథ ప్రయత్నం
ఏ గ్రంధం నుండి గ్రహించబడినది : ప్రస్థుత పాఠ్యభాగం “శ్రీమత్ పండరీనాథ రామాయణం” లోని బాలకాండ ద్వితీయాశ్వాసం లోనిది.
కవి పేరు : మోతుకూరి పండరీనాథరావు
కవి కాలం : 18వ శతాబ్దానికి చెందినవాడు.
స్వస్థలం : ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ.
కవిగారి వంశం : మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు.
తల్లిదండ్రులు : వేంకటాబిన్, గోపాలరావు,
తండ్రి ప్రత్యేకత : తండ్రి గోపాలరావు సంస్కృతాంధ్ర భాషలలో మంచి పండితుడు.
గ్రంథం : శ్రీమత్ పండరీనాథ రామాయణం
అంకితం : 7 మే,1810న శంకర జయంతిరోజున శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
రచన విశేషత : శ్రీమత్ పండరీనాథ రామాయణంలో వాల్మీకి రామాయణ ఘట్టాలతోపాటు కొన్ని స్వీయకల్పనలు చేయడం వల్ల ఆరుకాండల్లో సుమారు 7,335 పద్యగద్యాలతో రసవత్తర కావ్యంగా పండితలోకం ప్రశంసలు పొందింది.
ఇతర గ్రంథాలు : పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. అది అలభ్యం.
కవి శివకేశవ భక్తుడు : శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

పాఠ్యభాగ సందర్భం

శ్రీరాముని వంశంలోని పూర్వీకుడు సగరుడు. అయోధ్యను పాలించిన సూర్యవంశంలో ఇతని పూర్వీకులైన ఇక్ష్వాకు, మాంధాత, త్రిశంకు, హరిశ్చంద్రుడు, రఘువు, దశరథుడు మొదలైన వారు పేరుపొందిన చక్రవర్తులు. సగరునికి సుమతి (వైదర్భి), కేశిని (శైభ్య) అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సుచేశాడు.

భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజుసునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు.

వాటిని ఖండాలుగా చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు తయారయ్యారు. వీరు పెరిగి ప్రజలను కష్ట పెట్టసాగారు. వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిలమహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో కపిలమహర్షి కోపాగ్నికి భస్మమైపోతారు. వారికి ఊర్ధ్వగతులు కల్పించడానికి అసమంజసుడు, అంశుమంతుడు మొదలైన అనేకులు ప్రయత్నం చేశారు. కాని ఎవరూ విజయం సాధించలేదు.

దిలీప చక్రవర్తి కుమారుడైన భగీరథుడు సురగంగను భువికి దింపి, పాతాళంలో ఉన్న సాగరుల భస్మరాసులపై ప్రవహింపజేసి, ఉత్తమగతులను కల్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘భగీరథ ప్రయత్నం’ అనే పాఠ్యభాగం. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యాలు సైతం సుసాధ్యమవుతాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్యోద్దేశ్యం.

పాఠ్యభాగ సారాంశం

భగీరథుడు బ్రహ్మను వరాలు కోరడం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని సంకల్పించాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ గొప్ప తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదురకాల అగ్నులమధ్య రాయిలాగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ “ఓ మహారాజా! జనులందరూ పొగిడే విధంగా నువ్వు చేసిన తపస్సుకు నేను సంతోషించాను.

నీకు ఏం వరం కావాలో కోరుకో. దానిని తీరుస్తాను”. అని ఎంతో గౌరవంతో అన్నాడు. భగీరథుడు సంతోషించి, రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తలవంచుకొని ఆ బ్రహ్మను. చూసి సాగరుల భస్మరాశులపై దేవనది నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా
కోరాడు.

భగీరథునికి శివుడు ప్రత్యక్షం కావడం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు “ఓ పుణ్యాత్ముడా! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. ఆకాశగంగను శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన గంగ అతని శిరస్సుపై పడుతుంది” అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు.

ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో “ఓ రాజా! నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను” అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

గంగ శివుని జటాజూటంలో చిక్కుకొనుట : శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలి అని మనస్సులో అనుకున్నాడు. ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా వెలిగింది.

ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా పెద్ద శబ్దంతో మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. ఓ సర్వేశ్వరా! ఈ నీ సృష్టిలో పర్వతసమాలు చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఈ విధమైన నీ సమతాభావం గంగానదికి తెలియదు.

శివుడు గంగను వదులుట : సర్వలోకాలను పాలించేవాడా! నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి.

సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగా నది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

గంగ జహ్నుమహర్షి యాగశాలను ముంచుట : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆ నదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది.

ఇకపై ఈ భూమిపై గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెనని అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన మార్గం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు (సాగరులు) పాపములు పోయినవారై, దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు

సగర పుత్రుల శాపవిమోచనం : బ్రహ్మ, దేవతలందరితో కలిసి వెళ్లి భగీరథుణ్ణి కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు సాధ్యంకాని ప్రతిజ్ఞా అనే సముద్రాన్ని నీవు దాటావు. నిన్నూ, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు. సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభసంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని తాగాడు.

(కాలకేయులనే రాక్షసులు దేవతలకు కనబడకుండా సముద్రంలో దాక్కున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి అగస్త్యుడు సముద్రాన్ని పూర్తిగా తాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండిపోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో ఈ సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా! ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అప్పటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు.

నీవు కూడా అదేవిధంగా ఆ గొప్ప లోకంలో ఉంటావు. ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది అని బ్రహ్మదేవుడు దీవించాడు.

Leave a Comment