TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 2nd Lesson సింధూ నాగరికత, వేద సంస్కృతి Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 2nd Lesson సింధూ నాగరికత, వేద సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధూ నాగరికత (హరప్పా నాగరికత) ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు.
హరప్పా నాగరికత ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలైన మెసపటేమియా(ఇరాక్), ఈజిప్టకు సమకాలీనమైనది. వారికంటే ఉన్నతమైనది. వారి సంస్కృతిలోని ప్రధానాంశాలు.
హరప్పా లిపి : హరప్పా లిపి తొలిసారిగా క్రీ.శ. 1853లో గుర్తించారు. అయితే ఇంత వరకు దానిని ఎవరూ చదవలేకపోయారు. హరప్పా లిపి ‘చిత్రలిపి’ విభిన్న చిత్రాల రూపంలో ఉంది. కొందరు ఇది ద్రవిడమని, ఇంకొందరు ప్రోటోద్రవిడియన్ అని, సంస్కృతం అని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హరప్పా లిపిని చదవలేకపోవడం వలన వారు సాహిత్యానికి చేసిన సేవను, వారి ఆలోచనలను తెలుసుకోలేకపోతున్నారు.

నగర నిర్మాణ పద్ధతి : హరప్పా నాగరికత నగర నాగరికతకు ప్రసిద్ధి చెందింది. హరప్పా మొహంజోదారో నగరాల్లోని వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉపవీధులను తూర్పు నుంచి పడమరకు ఒక క్రమ పద్ధతి గల ‘గ్రిడ్ పద్ధతి’లో నిర్మించారు. రహదారి సూత్రాలకనుగుణంగా విశాలమైన రహదారులు ఏర్పాటు చేసుకున్నారు.

భూగర్భ మురుగునీటి కాలువలు : ఇది హరప్పా నాగరికత యొక్క ప్రత్యేకాంశం. ప్రతి ఇంటి నుంచి మురికినీరు వీధుల్లోని భూగర్భ మురుగు కాలువలలోకి చేరేవి. ఇది నేటి ఆధునిక కాలంలోని డ్రైనేజి వ్యవస్థకు ధీటుగా ఉన్న వ్యవస్థ. ఈ మురుగునీరు అంతా ఊరి చివరకు నదిలో కలిపేవారు.

కాల్చిన ఇటుకలు : వీరు ఇటుకల తయారీలో సిద్ధహస్తులు. ఇటుకల తయారీలో మట్టిని వాడారు. స్నానపు గదులు, బావులు వంటి వాటికి ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. కాల్చిన ఇటుకలు తయారు చేయడం వారి సాంకేతిక ఉన్నతికి సూచిస్తుంది.

రాజకీయ వ్యవస్థ : హరప్పాలో దొరికిన ఆధారాలతో నాటి ప్రభుత్వాన్ని గురించి కాని, నాటి పాలనావ్యవస్థ గురించి స్పష్టమైన సమాచారం లభించలేదు.
వ్యవసాయం : గోధుమలు, బార్లీ, బఠాణీలు, నువ్వులు, ఆవాలు హరప్పా ప్రజల ఆహార పంటలు. లోథాల్, రంగపూర్లో వరి పండించినట్లు తెలుస్తోంది. పత్తిని తొలిసారిగా పండించింది హరప్పావాసులే.

వ్యాపారం : నాడు స్వదేశీ, విదేశీ వ్యాపారాలు సాగాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెండిని, కర్నాటకలోని కోలార్ గనుల నుంచి బంగారాన్ని, రాజస్థాన్లోని భేత్రి గనుల నుంచి రాగిని దిగుమతి చేసుకొనేవారు. వ్యాపార లావాదేవీలు వస్తుమార్పిడిలో సాగేవి.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 2.
సింధు నగర ప్రణాళికల గురించి చర్చించండి.
జవాబు.
నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడమనేది హరప్పా నాగరికతలోని ప్రధాన అంశం. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే నగరీకరణ సాధ్యమవుతుంది. మొహంజోదారో, హరప్పా, చన్హుదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దంపడుతున్నాయి. సింధూ నాగరికతలో నగర నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. స్వల్ప తేడాలున్నప్పటికీ, సింధూ నాగరికత ప్రధాన నగరాలలో దాదాపుగా ఒకే రకమైన నగర నిర్మాణ పద్ధతులను చేపట్టారు.

కోట ప్రాంతం : హరప్పా, మొహంజోదారోలోని కట్టడాలు పెద్దగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి నగర ప్రణాళిక ద్వారా, నాటి నగర జీవితాన్ని గురించి కచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకొనేందుకు వీలవుతుంది. ఈ రెండు నగరాల్లోనూ, పశ్చిమ దిశలో కోటలు, ప్రహరీలు ఉన్నాయి. కోటలు పశ్చిమంవైపు ద్వారం కలిగి ఉండేవి. ఇవి విపత్కర సమయాల్లో ప్రజలకు రక్షణ కల్పించేవి. మిగతా సమయాల్లో సామాజిక కేంద్రాలుగా ఇవి ఉపయోగపడేవి. తవ్వకాల్లో బయల్పడిన ఈ పెద్ద కోటలవల్ల నాడు కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రముఖ ప్రజాసంబంధిత కట్టడాలు కోట లోపల ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో కోటకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున నివాస ప్రాంతముంది. హరప్పాలోని కోట 1400 అడుగుల పొడవు 600 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తును కలిగి ఉంది. కోట గోడ పునాదుల వద్ద 45 అడుగుల వెడల్పు మేర ఇటుకలను ఉపయోగించారు. మొహంజోదారోలోని కోట పెద్ద భవనాలను కలిగి ఉంది. కొలతల్లో తేడా ఉన్నప్పటికీ మిగతా సింధూ నగరాల్లో కూడా ఇలాంటి కోట నిర్మాణ ప్రాంతాలనే చూడవచ్చు. కాలీబంగన్లో హరప్పా వలే, కోట దిగువన నివాస ప్రాంతం ఉంది. అయితే చన్హుదారోలో మాత్రం కోట లేదు.

హరప్పా, మొహంజోదారో నగరాల్లోని ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుబంధంగా ఉప వీధులను తూర్పు నుంచి పడమరకు నిర్మించారు. మొహంజోదారో, హరప్పా నగరాల్లో ఒక క్రమ పద్ధతిగల గ్రిడ్ పద్ధతిలో రహదారులను నిర్మించారు. రహదారి సూత్రాల మేరకు వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా రహదారులను నిర్మించారు. పశ్చిమ కూడలి ప్రాంతం తప్ప మిగతా అంతా ప్రత్యేక నివాసాలుగా ఏర్పాటుచేశారు. ఒకే పరిమాణం గల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు. నిర్మాణాల్లో రాయి, చెక్క కూడా ఉపయోగించడమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎత్తైన వేదికలపైన నిర్మాణాలు చేశారు.

మురుగు నీటి కాలుకలు : హరప్పా నాగరికత నగర ప్రత్యేకత మురుగు నీటి కాలువల నిర్మాణం. హరప్పా సంస్కృతిలోని అన్ని నగరాలు, పట్టణాల్లో చిన్న, పెద్ద గృహాలు ప్రహరీలు, స్నానపు గదులు కలిగి ఉండేవి. ఇంట్లో ఉపయోగించిన మురుగు నీరు వీధుల్లో రహదారి పక్కన ఉన్న మురుగు కాలువకు చేరేది. ఇవి భూగర్భ మురుగు కాలువలు. వీటి మధ్యలో అక్కడక్కడా శుభ్రపరిచేందుకు మనిషి దూరేందుకు వీలుగా రంధ్రాలు ఉండేవి. వీటిపైన మూతలను ఏర్పాటు చేశారు. వీటిని బట్టి హరప్పా వాసులు పరిశుభ్రత విషయంలో గొప్ప పరిణతికలవారని చెప్పవచ్చు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 1
ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1 : 2 : 4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్పా మరియు మొహంజోదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నానపు గదులు, బావిచుట్టూ ఉండే కాలువలకు ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. ఎక్కువ అంతస్తులు ఉన్న గృహాల్లో నిలువు మురుగు నీటి గొట్టాలను ఏర్పాటు చేశారు. స్నానాల గదులను వీధులకు ఆనుకొని నిర్మించారు. మొత్తం మీద సింధూ నగర నిర్మాణాల గురించి, ఒక సామాన్య పరిశీలకుడిని కూడా మెప్పించే విషయం. నాటి ప్రజలు పౌర, ప్రజా సంబంధ పారిశుద్ధ్య అంశాలపై చూపిన శ్రద్ధ, ప్రాధాన్యతలే.

మహా స్నానవాటిక : మొహంజోదారోలోని నిర్మాణాల్లో ‘మహా స్నానవాటిక’ ప్రధానమైంది. ఇది కోటలోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 × 7.01 మీటర్ల పొడవు, వెడల్పులను 2.4 మీటర్ల లోతును కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగు భాగం కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. గదుల వెనక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు, ఉపయోగించిన నీరు మురుగు కాలువలోకి వెళ్ళేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రజావసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయోగించేందుకు ఈ స్నానవాటికను నిర్మించారో కచ్చితంగా చెప్పలేం.
TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 2

ప్రశ్న 3.
సింధు నాగరికత కాలంనాటి సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
సామాజిక పరిస్థితులు: సింధూ నాగరికత జాతి నిర్మాతలు ఎవరనే విషయమై చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. సింధూ ప్రజల కంకాళాల (పుర్రెలు) శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో నాలుగు జాతులు ఉండేవని తెలుస్తుంది. 1. ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్, 2. మెడిటరేనియన్, 3. మంగోలాయిడ్స్, 4. ‘ఆల్పైన్. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్ వారు ఉండేవారు. తరువాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికతా లక్షణాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రవిడ జాతి ఆవిర్భవించింది. సింధూ ప్రజల మతం, సంస్కృతీ లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండటం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. సింధు ప్రజలు టర్కో ఇరానియన్లు అనీ, ద్రావిడ భాష అయిన ‘బ్రాహుయ్’ మాట్లాడారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సింధూ నాగరికత ప్రధాన లక్షణం పట్టణీకరణ. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కూడా సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో పాలుపంచుకొన్నాయి. ధనవంతులు, ప్రభావశీలురు పెద్ద భవనాల్లో నివసించేవారనీ, మిగిలిన వారు చిన్న ఇళ్ళలో నూ, కార్మికులు ఒకే గదిలో నివాసం ఉన్నట్లు పురావస్తు ఆధారాలు తెలియచేస్తున్నాయి. వీరు ప్రధానంగా గోధుమ, పాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకొనేవారు. వీటితోపాటుగా చేపలు, మాంసాహారం కూడా తీసుకొనేవారు. తవ్వకాల్లో బయటపడిన మేకలు, జింకలు, దున్నపోతులు, పందులు, తాబేళ్ల అవశేషాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నాటి జంతుబలుల ఆచారాన్ని మనం గమనించవచ్చు. అలాగే కోళ్ల పందెంను చిత్రించిన ఒక ముద్రిక కూడా దొరికింది.

పత్తిని పండించి, వస్త్రాలను నేసుకొనేవారు. వారి ఆభరణాలు ఇప్పటికీ చెప్పుకోదగిన రీతిలో తయారు చేయబడ్డాయి. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టియటైట్ మరియు బంకమట్టితో వీటిని తయారు చేసేవారు. వడ్డాణం, గాజులు, చెవి కమ్మలు, దండలు మొదలగు వివిధ రకాల ఆభరణాలను స్త్రీలు ధరించేవారు. ఇలాగే గృహాలంకరణ కోసం మరియు చిన్న పిల్లల ఆటల కోసం రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసేవారు.

ఆర్థిక పరిస్థితులు : సింధూ నాగరికత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారంపైనే ఆధారపడింది. వీరు విరివిగా వ్యవసాయం చేశారు. సింధూ గ్రామాలు ఎక్కువభాగం నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండి ఆహారధాన్యాలను సమృద్ధిగా పండించాయి. గ్రామస్థులు తమ అవసరాలకే కాకుండా వృత్తి పనివారు, వ్యాపారులు వంటి పట్టణాల్లో నివసించేవారి అవసరాలు తీర్చేందుకు కూడా కష్టపడి పనిచేసేవారు.

మత పరిస్థితులు : హరప్పా కాలంనాటి మత విశ్వాసాలు, ఆచారాలు తెలుసుకొనేందుకు కేవలం ఆ కాలంలో లభ్యమైన ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటిపై చెక్కిన అమ్మతల్లి, పశుపతినాథుడు, జంతువులు మరియు వృక్షాలు తదనంతర కాలంలోని హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నాయి. సింధూ సమాజపు మత విశ్వాసాల్లో అమ్మతల్లి ఆరాధన అనేది బాగా ప్రసిద్ధి చెందింది. తవ్వకాల్లో నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తుల విగ్రహాలు చాలా వరకు లభించాయి. సింధూకాలంలో బాగా చెప్పుకోదగిన పురుష దేవత పశుపతినాథుడు లేదా పశువులను రక్షించే దేవత. ఇతనికి సంబంధించిన ప్రతిమలు ముద్రికలపై చెక్కబడ్డాయి. ఆధునిక శివునికి ఇతనికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ దేవుడికి కొమ్ములు ఉన్న మూడు తలలు ఉన్నాయి. ఈ కాలం నాటి ప్రజలు అగ్నిని పూజించినట్లుగా తెలిపే ఆధారాలు కాలీబంగన్, లోథాల్లో లభించాయి. ఇక్కడ దొరికిన యజ్ఞవేదికలు, ఇతర చిన్న వస్తువులు తప్ప, సింధూ కాలంలో దేవాలయాలు కానీ ఇతర ఆరాధన ప్రదేశాలు కానీ మనకు ఎక్కడా లభ్యం కాలేదు. వ్యవసాయాధారిత సమాజం కాబట్టి వారు ఎద్దులు, కోడెలు, పాములు, వృక్షాలను కూడా పూజించేవారు. “జంతు బలుల ఆచారం సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి 3

ఇదే కాకుండా ముఖ్యంగా మరణానంతర జీవితంలో విశ్వాసాలు కూడా ఉన్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 4.
తొలివేదకాలంనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
క్రీ.పూ. 1500-1000 వరకు గల కాలాన్ని తొలివేద నాగరికతా కాలం అంటారు. తొ- ప్రాంతమైన ‘సప్త సింధు’ ప్రాంతంలో నివసించారు. సింధు, జీలం (నితస్తా), చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్, సరస్వతి అనేవి ఏడు నదులు. ఈ ప్రాంతంలో ఋగ్వేద ఆర్యులు నివసించేవారు.

ఈ ఆర్యులు తరచు యుద్ధాలలో మునిగితేలేవారు. ఆర్యులు దాసదాస్యులతో యుద్ధాలు చేశారని కొందరు చరిత్రకారుల భావన. కొన్నిసార్లు తమలో తాము కలహించుకునేవారు. భరత పాలక వర్గాన్ని పదిమంది రాజులు ప్రధానంగా వ్యతిరేకించారు. అప్పుడు జరిగిందే దశరాజ యుద్ధం. ఈ యుద్ధంలో సుధా అనే భరతరాజు విజయం సాధించాడు. ఈ భరతులు, పురులతో కలిసి ‘కురులు’ అనే నూతన పాలకవర్గంగా రూపొందారు.

తొలి వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ : వేదకాలంనాటి ఆర్యులు రాజ్యాలవలెకాక తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. రాజు స్వేచ్ఛను సభ, సమితి అడ్డుకొనేవి. ఈ రెండు ప్రజాసభల అనుమతి లేనిదే రాజన్ అధికారం స్వీకరించలేడు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్య పాలన ఉండేదికాదు. రాజన్కు పురోహితుడు, సేనాని పాలనలో సహకరించేవారు.

తొలి వేద ఆర్థిక వ్యవస్థ : ఆర్యుల కాలంనాటి కంచులోహ పనివారు తయారుచేసిన వివిధ పనిముట్లు, ఆయుధాలు, హరప్పా కాలానికంటే గొప్పవిగా పేరుపొందాయి. ఋగ్వేదం కంచులోహ పనివారు, వడ్రంగి, రథాలను తయారు చేసే వారిని ప్రశంసించింది.

ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధాన పాత్ర పోషించాయి. పశువులను వ్యాపారంలో మారకంగా కూడా ఉపయోగించారు. మనిషి విలువ వంద గోవులతో సమానం. వారి జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. వారు వ్యవసాయానికి సంబంధించిన గొప్ప పరిజ్ఞానం సంపాదించారు.

తొలి వేద కాలం నాటి సమాజం : వేదకాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దను గృహపతి అనేవారు. సమాజంలో ఏకభార్యత్వం అమల్లో ఉండేది. స్త్రీలు, పురుషుడితో సమానంగా అనేక కార్యక్రమాలలో పాల్గొనేవారు. స్త్రీలకు ప్రజాసభలైన సభ, సమితిల్లో సభ్యత్వం ఉండేది. బాల్యవివాహాలు, సతీసహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమలులో లేవు.

స్త్రీ, పురుషులు నూలు, ఉన్ని దుస్తులు ధరించేవారు. వివిధ రకాల ఆభరణాలు ధరించేవారు. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి వీరి ప్రధాన ఆహారం. ఆవు మాంసం భుజించడం నిషేధింపబడింది. రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యం ప్రజలకు వినోదాలు.

వర్ణవ్యవస్థ ; ‘వర్ణం’ అనే పదానికి రంగు, అక్షరం అనే అర్థాలున్నాయి. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దాసదాస్యులు బానిసలుగా, శూద్రులుగా చూడబడ్డారు అని కొందరు చరిత్రకారుల భావన. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి. నాలుగు వర్ణాలు. శూద్రులను గురించి ఋగ్వేద పదవ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఋగ్వేద కాలంలో వృత్తులనుబట్టి విభజన ప్రారంభమయింది. అయితే ఈ వృత్తి విభజన బలంగా లేదని తెలుస్తుంది.

మతం – దేవతలు : ఋగ్వేద ఆర్యుల ప్రధాన దేవుడు ఇంద్రుడు. ఇంద్రుడు యుద్ధ దేవుడు. మార్స్ ఇంద్రుడికి సహాయకుడు. మానవులకు దేవతలకు వారధి అగ్ని. ఇంకా అదితి, పృథ్వి, ఉష వంటివారు ఋగ్వేదంలో పేర్కొనబడ్డ ప్రధాన దేవతలు. ఈ దేవతల కృప కోసం యజ్ఞాలు చేయడం జరిగేది. దాన, దక్షిణలు పూజారులకు ఇచ్చేవారు. వైదిక ప్రజలు ఎటువంటి ఆలయాలను నిర్మించినట్లు తెలియలేదు.

ప్రశ్న 5.
మలివేదకాలంనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరిస్థితులను వివరించండి.
జవాబు.
మలివేద కాలంనాటికి ఆర్యులు తూర్పు దిక్కుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపద బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక రాజ్యాలు, తెగలు ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణకాలమని, రామయణ, మహాభారతాలు ఈ కాలంలోనే రచింపబడ్డాయని కొందరు చరిత్రకారుల
భావన.

విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం మలివేదకాలంలో ప్రధానమైన అంశం. ఈ కాలం ఆరంభంలో కురు, పాంచాల రాజ్యాలు విలసిల్లాయి. భారత యుద్ధం కురు వంశీయుల చరిత్రే. ఈ యుద్ధం క్రీ.పూ. 950 సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తుంది. కురు రాజ్య పతనం తర్వాత కోసల, కాశి, విదేహ రాజ్యాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. రాజకీయ వ్యవస్థ : మలివేద కాలంనాటికి విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. జన లేదా తెగల రాజ్యాలు మలివేద కాలంలో జనపదాలు లేదా రాష్ట్రాలుగా మారాయి. విశాల రాజ్యాలతో అధికారం విస్తృతమైంది. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు రాజులు వివిధ యజ్ఞాలు, పూజలు నిర్వహించేవారు. రాజసూయ, అశ్వమేధ, నజపేయ యాగాలు చేసేవారు. రాజులు ‘ఏకరాట్’, ‘సామ్రాట్’ వంటి బిరుదులు ధరించేవారు. ఖజానా అధికారి, పన్ను వసూలు అధికారి మొదలైనవారు నూతన అధికారులు సభ, సమితులు పూర్వ అధికార ప్రాభవాలను కోల్పోయారు.

ఆర్థిక వ్యవస్థ : మలివేదకాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇది అడవులను ఛేదించి విస్తృత భూభాగాలను వ్యవసాయంలోకి తెచ్చేందుకు అవకాశాన్ని కలిగించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. వ్యవసాయానికి అభివృద్ధి చెందిన నూతన పనిముట్లు వాడారు. గోధుమ, బార్లీ, వరి పంటలు పండించారు. ఎరువుల వాడకం నేర్చుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తి నైపుణ్యం పెరిగింది. లోహ, చర్మ, వడ్రంగి, కుండల తయారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. వంశపారంపర్య -వర్తకులు తయారయ్యారు. శతమాన, కృష్ణల అనే బంగారు, వెండి నాణాలు వాడుకలోకి వచ్చాయి.

సామాజిక వ్యవస్థ : మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ ధృఢపడింది. ఉన్నత వర్ణాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులను అనుభవించారు. అటువంటి హక్కులు శూద్రులకు లేవు. వృత్తులను బట్టి మలివేద కాలంలో ఉపకులాలు ఏర్పడ్డాయి.

మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థలో తండ్రి అధికారం బలపడింది. స్త్రీల పరిస్థితిలో మార్పు లేదు. పురుషులకు సేవకులుగా భావించారు. స్త్రీలు ప్రజాసభల్లో సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోయారు. బాల్యవివాహాలు సర్వసాధారణమయ్యాయి. ఏమైనప్పటికీ పాలకవర్గాల్లోని స్త్రీలు ప్రత్యేక హక్కులు అనుభవించారు.

కులవ్యవస్థ : మలివేద కాలంలో కులవ్యవస్థ పటిష్టమైంది. సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు కులాలుగా విభజింపబడింది. బ్రాహ్మణులు ప్రధానమైన వారుగా గుర్తింపు పొందారు. యజ్ఞయాగాలు, పూజా సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. రెండవ వారు అయిన, క్షత్రియులు యోధధర్మాన్ని నిర్వహించేవారు. మూడవ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యాపారం చేసేవారు. నాలుగు కులాల్లో శూద్రులు తక్కువ వారుగా గుర్తింపు పొందారు. మొదటి మూడు వర్ణాలవారు ద్విజులు. అంటే రెండుసార్లు జన్మించినవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులు శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది.

మతం – దేవతలు : వేదకాలం నాటి దేవతలైన ఇంద్రుడు, అగ్నిలకు ప్రాధాన్యత తగ్గింది. త్రిమూర్తులు అంటే సృష్టి, స్థితి, కర్మ. లయకారకులైన విష్ణు, బ్రహ్మ, శివులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రార్థనలు తెరమరుగై కర్మకాండలు, యజ్ఞయాగాదులు అధికమయ్యాయి. పూజారి అనేది వృత్తిగా మారి వంశపారంపర్యమైంది.
కర్మకాండలు, యజ్ఞయాగాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీన్ని ప్రజలు మరింత అధికం చేశారు. మలివేద కాలం చివర్లో పూజారులు, ఉత్సవాలు, కర్మకాండల పట్ల వ్యతిరేకత తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. బౌద్ధ, జైన మతాలు దీనికి తార్కాణం. హిందూ ధర్మాన్ని బోధించే ఉపనిషత్తులు కర్మకాండలను వ్యతిరేకించి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతిని సంపాదించే మార్గంవైపు దృష్టి సారించాయి.

ప్రశ్న 6.
తొలివేదకాలం, మలివేదకాలం మధ్య తేడాలను విశ్లేషించండి.
జవాబు.
తొలి వేదకాలం

  1. తొలి వేదకాల ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించారు.
  2. వేదాలు సంకలనం చేయబడ్డాయి.
  3. ‘తెగ’ నాయకుడిని ‘రాజన్’ అని పిలిచేవారు.
  4. సంచార జీవితం గడుపుతూ పశుపోషణలో ఉండేవారు.
  5. వైయక్తిక కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉండేది.
  6. స్త్రీలు సమాజంలో అన్ని రంగాలలో సమానత్వాన్ని పొందారు.
  7. స్త్రీలు ప్రజాసభలలో ఉండేవారు.
  8. వర్ణ వ్యవస్థ బలపడలేదు.
  9. గురుకుల పద్ధతిలో విద్యావ్యవస్థ ఉండేది.
  10. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి ప్రధాన ఆహారం మరియు మాంసాహారం.
  11. ప్రకృతి శక్తుల ఆరాధన ఉండేది,
  12. ఇంద్రుడు, అగ్ని, వరుణ, సూర్యుడు వంటి దేవతలను ఆరాధించేవారు.
  13. ఆలయాలు నిర్మించబడలేదు. యుద్ధాలలో విజయా నికి, సంతానానికి ప్రార్థించేవారు.
  14. పశువులను సంపదగా భావించేవారు.
  15. బాల్యవివాహాలు లేవు.
  16. విధవా వివాహాలు జరిగేవి.
  17. కంచు వంటి వాటితో పనిముట్లు తయారు చేసేవారు.
  18. దేశీయ వ్యాపారం జరిగేది.
  19. శాస్త్ర, సాంకేతిక వృద్ధి గురించి తెలియదు.

మలి వేదకాలం

  1. మలి వేదకాల ఆర్యులు తూర్పు గంగా మైదాన ప్రాంతాలకు విస్తరించారు.
  2. మలివేదకాలం పురాణ కాలంగా పేరొందింది. ఇతి హాసాలైన రామాయణ, భారతాలు రచించబడ్డాయి.
  3. తెగలు చిన్న చిన్న రాజ్యాలుగా రూపొందాయి. రాచరికం వారసత్వమైంది.
  4. ఆర్యులు వ్యవసాయం చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
  5. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.
  6. స్త్రీల పరిస్థితి దిగజారింది.
  7. `స్త్రీలు ప్రజా:)భలలో సభ్యులుగా ఉండే అర్హత కోల్పోయారు.
  8. వర్ణ వ్యవస్థ దృఢమయ్యింది.
  9. గురుకుల వ్యవస్థ మరింత బలపడింది.
  10. మాంసాహార వినియోగం బాగా తగ్గింది.
  11. మత ఆరాధనలు మరింత సంక్లిష్టమయ్యాయి.
  12. త్రిమూర్తి ఆరాధన పెరిగింది.
  13. కర్మకాండలు, యజ్ఞాలు అధికమయ్యాయి. ఉప నిషత్తులు, కర్మసిద్ధాంతం వంటివి వికసించాయి.
  14. భూమి ప్రధాన సంపదగా మారింది.
  15. బాల్య వివాహ వ్యవస్థ ఉన్నట్లు కొందరి భావన.
  16. విధవా వివాహాలు నిషేదం.
  17. ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
  18. దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది.
  19. జోతిష్య, ఖగోళ, ఆయుర్వేద శాస్త్రాలలో అద్వితీయ ప్రగతి సాధించారు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధు నాగరికత భౌగోళిక విస్తృతి.
జవాబు.
పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా, మొహంజోదారో నగరాలే కాకుండా ఈ నాగరికతకు చెందిన కొన్ని వందల చిన్న, . పెద్ద పట్టణాలను తవ్వకాల ద్వారా వెలికితీసారు. వీటిలో ఎక్కువ భాగం భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ మరియు పాకిస్తాన్లోని సింధు, పంజాబ్ మరియు బెలూచిస్తాన్ రాష్ట్రాలలో, కొంత మేర ఆఫ్ఘనిస్తాన్లో విస్తరించి ఉన్నాయి. ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల.

ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్లోని షోరుగై మొదలుకొని దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, పశ్చిమాన పాకిస్తాన్ – ఇరాన్ సరిహద్దుల్లోని సుట్కాజిందూర్ మొదలు తూర్పున ఉత్తర ప్రదేశ్లోని అలంగీర్ ప్పూర్ వరకు నాగరికత విస్తరించిందని తెలుస్తుంది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి పాకిస్తాన్ దేశాని కంటే విశాలమైందిగానే కాకుండా ప్రాచీన ఈజిప్ట్, మెసపొటోమియా నాగరికతల కంటే విశాలమైందిగా ప్రసిద్ధి చెందింది.

ప్రశ్న 2.
మహాస్నానవాటిక.
జవాబు. మొహంజోదారోలోని నిర్మాణాల్లో ‘మహాస్నానవాటిక’ ప్రధానమైంది. ఇది కోటలోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 × 7.01 మీటర్ల పొడవు, వెడల్పులను 2.4 మీటర్ల లోతును కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగుభాగం కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. గదుల వెనుక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు, ఉపయోగించిన నీరు మురుగు కాలువలోకి వెళ్ళేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రజావసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయో ంచేందుకు ఈ స్నానవాటికను నిర్మించారో ఖచ్చితంగా చెప్పలేం..

ప్రశ్న 3.
సింధు లిపి.
జవాబు.
సింధూ ప్రజలు లిపిని ఉపయోగించారు. వీరి లిపిని సాధరణంగా ముద్రికలపైనా, కొన్ని రాగి పరికరాలపై, కుండలపై, కొన్ని ఆభరణాలపై మరియు గుర్తింపు బోర్డుల (Signboards) పై గుర్తించారు. ముద్రికలపై కొన్ని పదాలు లేదా చిహ్నాలు ఉన్నాయి. అయితే ఈ లిపిని ఇంతవరకు ఎవరూ పరిష్కరించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చరిత్రకారుల లిపిలో భాగంగా 375 నుంచి 410 వరకు గల వివిధ రకాల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఇవి అక్షరాల సమన్వితం కాకుండా. బొమ్మల రూపంలో లేదా సంకేతాల రూపంలో ఉన్నాయి. కొన్ని ముద్రికల్లో వాటిని కుడి వైపు నుంచి ఎడమకు రాస్తే, మరికొన్నింటిలో ఎడమ నుంచి కుడి వైపుకు రాయడం జరిగింది. బహుశా ఈ ముద్రికలను వ్యాపార అవసరాల కోసం ఉపయోగించి ఉండొచ్చు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎస్.ఆర్. రావు సింధూ లిపీకి బ్రహ్మీ లిపికి సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రశ్న 4.
సింధూనాగరికత పతనానికి కారణాలు.
జవాబు.
క్రీ.పూ 1750 తర్వాత హరప్పా, మొహంజోదారో లాంటి ముఖ్య నగరాలు అదృశ్యమవ్వగా, మిగతా స్థలాల్లో ప్రత్యేకించి సింధూలోయ దక్షిణ భాగంలో అంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో క్రమేణా అంతరించాయి. మొహంజోదారోలో నిరంతర వరదలు నగరాన్ని ధ్వంసం చేయగా, అక్కడి నుంచి ప్రజలు వలస పోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని పేర్కొన్నాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని పండితులు తిరస్కరించారు. కోటి జి, కాలీబంగన్, లోథాల్లు హఠాత్తుగా అంతరించినట్లు కనిపించదు. ఇక్కడ, వరదలు తీవ్ర మార్పులను కలిగించి, మామూలు నీటి పారుదల విధానాన్ని దెబ్బతిసి, ఫలితంగా నగరాల ఆర్ధిక క్షీణతకు కారణమయ్యాయి. అయితే, థార్ ఎడారి విస్తరించడం, భూకంపాలు, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి పర్యావరణ మార్పులే సింధూనాగరికత పతనానికి కారణమని ఈనాడు అనేకమంది చరిత్రకారులు నమ్ముతున్నారు. మొత్తం మీద వివిధ కారణాల సమ్మిళితంగా ప్రపంచంలోని పురాతనమైన సింధూ నాగరికత పతనమైంది.

ప్రశ్న 5.
వేదసాహిత్యం.
జవాబు.
‘వేద’ అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పబడ్డాయి. అధర్వణ వేదంలో మంత్ర తంత్రాలు ఉన్నాయి. వేదాలతోపాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఈ కాలంలో ప్రధానమైన రచనలు. బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఇవన్నీ వచనంలో రచింపబడి పూజా పద్ధతిలో ఉన్నాయి. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మత్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్త్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు.

ప్రశ్న 6.
వేదకాలంలో స్త్రీల స్థితిగతులు.
జవాబు.
తొలివేదకాలంలో సమాజంలో ఏకపత్నీ వ్రతం అమలులో ఉండేది. ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం ఉండేది. భార్య కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. పురుషులతో సమానంగా స్త్రీలకు ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జన పొందేవారు. ప్రజాసభలైన సభా సమితులలో స్త్రీలకు సభ్యత్వం ఉండేది. సతీసహగమనం వంటివిలేవు. మలివేదకాలం నాటికి స్త్రీ పరిస్థితి దిగజారింది. పురుషుడి కంటే తక్కువగా, సేవకులుగా స్త్రీలను భావించారు. ప్రజా సభలలో ఉండే అర్హత కోల్పోయారు. బాల్యవివాహాలు సాధారణమయ్యాయి. ఐతరేయి బ్రాహ్మణం ప్రకారం కూతురిని భారంగా చూసేవారు. పాలకవర్గాలలోని స్త్రీలు ప్రత్యేక హక్కులు అనుభవించేవారు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సింధూ ముద్రికలు.
జవాబు.
హరప్పా ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు రెండువేల ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించాయి. ఇవి సాధారణంగా చతురస్రాకారంలో ఉండి, స్టియటైట్తో తయారు చేయబడ్డాయి. ఈ ముద్రికలపైన వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు సింధూ లిపి గుర్తులు కూడా ఉన్నాయి. మూపురం కలిగిన ఎద్దు, దాని మెడ నుంచి కిందకి వేలాడుతున్న చర్మము, వెడల్పైన కొమ్ములుతో చెక్కబడిన ముద్రిక ప్రత్యేకతను సంతరించుకొంది. కొమ్ములున్న శిరోవేష్ఠనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైంది. ఈ దేవత మూడు తలలను కలిగి యోగ ముద్రలో ఆశీనమై ఏనుగు, పులి, ఖడ్గ మృగం, గేదె అనే నాలుగు జంతువులు చుట్టూ కలిగి ఉంది. దీన్ని చాలామంది చరిత్రకారులు’ ‘పశుపతి’ (శివుడు) గా భావించారు.

ప్రశ్న 2.
లోథాల్.
జవాబు.
లోథాల్లో ముఖ్యమైన నిర్మాణంగా నౌకాశ్రయంను గుర్తించారు. ఇది 223 × 35 మీటర్ల పొడవు, వెడల్పులను, 8 మీటర్ల లోతును కలిగి అతిపెద్ద నిర్మాణంగా ఉంది. దీనిలోకి తూర్పువైపు నుంచి 12.30 మీటర్ల వెడల్పు గల ఒక కాలువను ఏర్పాటు చేశారు. ఈ కాలువ దగ్గరలోని నదికి అనుసంధానించబడింది. బహుశా ఈ కాలువ ద్వారా సరుకులను లోపలి ప్రాంతాల నుంచి రేవు దాకా తీసుకొచ్చేవారు. చాలామంది పండితులు ఈ కృత్రిమ నిర్మాణాన్ని నౌకాశ్రయంగా భావించారు. ఇక్కడ నుంచే వస్తువులను నౌకలలోకి చేర్చడం, దించడం లాంటివి చేసేవారు. దీనికి సమీపంలో ఉన్న ధాన్యాగారం వద్ద అనేక ముద్రికలు లభ్యం అయ్యాయి. వీటి ఆధారంగా సింధూనాగరికతలో లోథాల్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రశ్న 3.
సింధూకాలంనాటి ఇటుకలు.
జవాబు.
ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1:2:4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్పా మరియు మొహంజోదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నాపు గదులు, బావిచుట్టూ ఉండే కాలువలకు ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు.

ప్రశ్న 4.
చన్హుదారో.
జవాబు.
చన్హుదారో మొహంజోదారోకు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పూసల తయారీ పరిశ్రమలు బయల్పడ్డాయి. ఈ ప్రాంతం ఎడారిలో ఉంది. సరస్వతీ నది క్రమంగా ఎండిపోవడంతో ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రశ్న 5.
వేదాలు.
జవాబు.
‘వేద’ అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పబడ్డాయి. అధర్వణ వేదంలో మంత్ర తంత్రాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
వేదాంగాలు.
‘జవాబు.
శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, చాందస్, జ్యోతిష్య అనేవి ఆరు వేదాంగాలు. శిక్ష ఉచ్ఛారణను వివరిస్తుంది. ‘కల్ప’ కర్మకాండలకు సంబంధించింది కాగా ‘వ్యాకరణ’ వ్యాకరణానికి సంబంధించింది. ‘నిరుక్త’ శబ్దాలను గురించి వివరిస్తుంది. ‘చందస్’ ఛందస్సును గురించి వివరిస్తుంది. జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది.

ప్రశ్న 7.
ఉపనిషత్తులు.
జవాబు.
ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్త్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు అనుబంధాలు.

ప్రశ్న 8.
ఇతిహాసాలు.
జవాబు.
రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాస ! అనగా ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసాలు.

ప్రశ్న 9.
సభ, సమితి.
జవాబు.
సభల అనుమతి లేకుండా రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలులేదు. ఎ.ఎల్. బాషం ‘పేర్కొన్నట్లు ‘సభ’లో తెగలోని ్నత వర్గాల వారు సభ్యులుకాగా, సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్య పాలకులు ఉండేవారు కాదు.

TS Inter 1st Year History Study Material Chapter 2 సింధూ నాగరికత, వేద సంస్కృతి

ప్రశ్న 10.
గవిష్ఠి.
జవాబు.
ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధానపాత్ర పోషించాయి. ఋగ్వేదం యుద్ధాన్ని ఆవుల కోసం అన్వేషణగా (గవిష్ఠి) పేర్కొంది.

Leave a Comment