Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటానికి గల కారణాలు ఏవి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దారితీసిన కారణాలు :
1. స్థానికత (Domiclle) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది. అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘనవల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మానవ అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. తెలంగాణలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 40.78 శాతం. 1987-88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో కంటె ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం చాలా తక్కువ.
అందువల్ల తెలంగాణాలో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే పేదరికం పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో పోలిస్తే నాటికి అధిక ఆదాయం కలిగిన ప్రాంతం. ఆ అధిక ఆదాయాన్ని తెలంగాణ మిగులు అంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూలో 40 శాతానికి పైగా సమకూరుస్తుంది.
3. జై ఆంధ్ర ఉద్యమం తరువాత 1972 తరువాత ముల్కీ నిబంధనలను, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన నిబంధనలను సవరించారు. తెలంగాణ ప్రాంతానికి వనరుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే సంస్థాగత నిర్మాణమే లేకుండా చేశారు.
4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 దశకం వరకు తెలంగాణ ప్రజలకు విద్యా సౌకర్యాల దుర్భరంగా ఉండేవి. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా కనిష్టంగా 37 శాతం మాత్రమే ఉండేది. వృత్తి విద్యా కళాశాలపైన ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల కళాశాలలు కొన్నింటిని మాత్రమే స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేది.
5. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కృష్ణానదిపై నిర్మించిన నాగర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు మాత్రమే నిర్మించారు. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల నల్లగొండ జిల్లాలో ఎంతో వ్యవసాయ భూమి ముంపుకు గురి కాగా, ఆ జిల్లాకు సాగర్ ద్వారా అందవలసిన న్యాయబద్ధ వాటా దక్కలేదు.
6. గోదావరి పైన ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుంది. కానీ దీని పనులు నత్త నడక కాలంలో నడిపించారు. 20 లక్షల ఎకరాలకు నీరు అందించవలసిన ప్రాజెక్టు ఆయకట్టును 50 సంవత్సరాల రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే అందేట్టు చేశారు. 1966 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశించినా అది జరగలేదు.
7. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులలో నీటి కేటాయింపు హామీ ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సైతం సంతృప్తికరంగా ప్రగతి సాధించలేదు.
8. తెలంగాణలో నిజాం ప్రభుత్వ పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును సరైన నిర్వహణ లేకుండా చేశారు. దాని పూడికమేట వేసి, ప్రాజెక్టు కింద ఆయకట్టు తగ్గిపోసాగింది.
9. మెదక్, నిజామాబాద్ జిల్లాలలోకి పొలాలకు నీరు అందించవలసిన మంజీరా నీళ్ళను, తాగునీటి అవసరాలకోసం హైదరాబాద్కు తరలించారు.
10. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు, తెలంగాణలోని మహబూబ్నగర్లో 50 నుంచి 60 వేల ఎకరాలకు అందవలసి ఉండగా, ఆ జలాలను దౌర్జన్యంగా రాయలసీమకు తరలించారు.
ప్రశ్న 2.
భారత యూనియన్లో తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిన తీరును చర్చించండి.
జవాబు.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 60 సంవత్సరాలుగా వివిధ రూపాలలో నడిచిన ప్రజాపోరాటాల అంతిమ విజయం. 1948 నుంచి 1956 వరకు తెలంగాణకు ప్రత్యేక ఉనికి, గుర్తింపు ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక చారిత్రక, భౌగోళిక సంస్కృతిక గుర్తింపు, ప్రాతిపదిక ఉన్నాయి.
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, ఇష్టంలేని, అసమానమైన ఇరుపక్షాలను బలవంతంగా ఒక్కటి చేయడం అనవచ్చు. అందువల్ల అవి విడిపోవడం అనే అనివార్యత, ఆ బలవంతపు కలయికలోనే ఉంది.
తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలకు నోచుకోక, సహజవనరుల విషయంలో తీవ్రదోపిడీకి, ఇతర ప్రాంతాల అభివృద్ధికి తన వనరులను వదులుకోవాల్సిన పరిస్థితులకు గురి అయింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రాంతానికి కొన్ని సంరక్షణలు కల్పించినప్పటికీ, వివిధ ప్రభుత్వాల కుయుక్తుల వలన పాలనలో అవి అసంపూర్ణంగా, నిరర్థకంగా మారడం కనిపిస్తుంది.
ఆంధ్ర పాలకుల కుయుక్త నైపుణ్యాల ముందు తెలంగాణ రాజకీయ శిష్టవర్గం సరితూగలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నదీజలాల్లో భాగస్వామ్యం, తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అక్రమ తరలింపు, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు తదితర విషయాల్లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ యువతను నిరాశ నిస్పృహలకు గురిచేశాయి.
దీనితో 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో, ఈ ప్రత్యేక రాష్ట్రవాదం తీవ్రతరమై, రాజీలేని పోరాటంగా మారి 2001-2014 మధ్యకాలంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది.
భిన్న రాజకీయ భావజాలం గల శక్తులు జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందడం ఈ పోరాటంలో ఒక ప్రత్యేక అంశం. ఇది ఒక విధంగా ప్రజా రాజకీయాలలో (Mass Politics) కొత్త నేర్పు. ఈ JAC లలో రాజకీయ JAC కులసంఘాల JAC, విద్యార్థి JAC, ఉద్యోగుల JAC మొదలైనవి ప్రధానమైనవి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాజకీయ బృందాలచే కాక వివిధ వృత్తుల సామాజిక శ్రేణులనూ, వివిధ కులసంఘాలనూ పోరాటంలోకి తీసుకువచ్చింది.
ఆ విధంగా ప్రత్యేక రాష్ట్ర మహాయత్వానికి విశాలమైన ప్రజామద్ధతులను కూడగట్టింది. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుక ఒక చారిత్రక సంఘటన, ప్రజా ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలలోకి ఒదిగించి, సమత్వం, న్యాయం, ఆత్మగౌరవం అన్న ప్రాతిపదికలతో దాన్ని చట్టసభల చర్చలలోకి తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీ పుట్టుక ఎంతో పనికి వచ్చింది.
ఈ విధంగా దోపిడి, అణచివేత, ఆధిపత్యాల నుండి విముక్తి కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమయ్యింది. లోక్సభ, రాజ్యసభలలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దానితో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ, భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా అవతరించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు) తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)
రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.
లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.
శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణ శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.
ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ల పాత్రను వివరించండి.
జవాబు.
1. రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) :
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.
2. కులసంఘాలు జెఎసి :
సమాజంలోని కొన్ని కులాలు సంఘాలు ఏర్పరచుకోవడం, ఈ సంఘాలన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్న ధోరణిగా పేర్కొనవచ్చు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడానికి సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల సమూహాలు, వివిధ కుల వృత్తుల సమూహాలు, దళిత బహుజనులు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఒకే వేదిక పైకి వచ్చి, సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) గా ఏర్పడ్డాయి. ఈ విధంగా కులసంఘాలు సంఘటితమై పోరాటం చేయడాన్ని కులంపైన ఉండే ఆదిమ విశ్వాసంగా అర్థం చేసుకోరాదు.
3. విద్యార్థుల జెఎసి :
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడటానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.
ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల స్థాయిలో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.
4. ఉద్యోగుల జెఎసి :
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఉపాధ్యాయులు తదితరవర్గాలు ఉద్యోగల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) పేరుతో ఒక వేదికను ఏర్పరచుకొని అనేక నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చురుకుగా నిర్వహించాయి.
వివిధ స్థాయిలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ (Pen Down), ఢిల్లీ ఛలో, మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మితిమీరిన ఆలస్యానికి నిరసనగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపట్ల ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యోగల జెఎసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
జవాబు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి, ప్రణాళికారచన, స్థానికపాలన, ప్రజారోగ్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్య, తెలంగాణ ప్రాంత విద్యాలయాల్లో అడ్మిషన్లు, తెలంగాణా ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకాలు, లఘు, కుటీర పరిశ్రమలను వీటిని రీజనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో 12 సంవత్సరాల శాశ్వత నివాసం ఉంటేనే వారికి తెలంగాణా ప్రాంతపు విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ఇది ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించే చర్య, వీటితోపాటు మరో ప్రధాన రాజకీయ నిర్ణయం ఒప్పందంలో ఉన్నది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి చెందినవాడైతే ఉపముఖ్యమంత్రి మరో ప్రాంతానికి చెందినవారై ఉండాలి.
అలాగే మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ మంత్రుల నిష్పత్తి 60:40 ఉండాలని ప్రతిపాదించబడింది. అంతేకాకుండా 2 నుంచి 5 వరకు ఉండే ముఖ్యమైన మంత్రిత్వశాఖలు అంటే హోమ్, ఆర్థిక ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు వంటి శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలి అని ఒప్పందం జరిగింది.
ప్రశ్న 2.
1969 నాటి తెలంగాణ ఆందోళన గురించి వివరించండి.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురి కాగా తెలంగాణాలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1909లో జరిగిన ‘జై తెలంగాణ ఉద్యమం’.
ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణాలోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి. ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయింది.
ముల్కీ నియమాల ఉల్లంఘనవల్ల కాలేజీల్లో అడ్మిషన్లు కోల్పోవడం తెలంగాణ వారికి సర్వసాధారణమైపోయింది. ఖమ్మంలో ఇటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మొదట నిప్పురవ్వ పుట్టింది. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విషయంలో ముల్కీ ఉల్లంఘన జరిగిందనే నిరసన, నిరాహార దీక్షగా పరిణమించింది.
1969లో అది వెనువెంటనే ఉప్మానియా విశ్వవిద్యాలయానికి పాకింది. తరువాత తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష, శాసన సభ్యులూ విద్యార్థులకు మద్ధతుగా “ప్రత్యక్ష చర్యకు” పూరుకుంటామని హెచ్చరించారు.
యువకులు, మేధావులు, టీచర్లు మహిళలూ ఇలా వివిధ జనాల మద్ధతు ఉద్యమానికి తోడయింది. అధికార సభ్యుడయిన కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మదన్మోహన్, మల్లికార్జున్, పులి వీరన్న వంటి విద్యార్థి నాయకులు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘనలను ప్రశ్నించి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను హామీ మేరకు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్యర్యంలోని ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరుకార్చింది.
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.
లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ, భారత యూనియన్లో 29న రాష్ట్రంగా అవతరించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుత దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)
రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.
లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.
శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణా శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.
ప్రశ్న 4.
జూన్ 2, 2014కు గల ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పనర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.
లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ భారత యూనియన్లో 29 రాష్ట్రంగా అవతరించింది.
ఈ చట్టం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలని, నదీజదాల పంపకపు ట్రిబ్యునల్ ఉండాలని తెలిపింది.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించింది. జూన్ 2, 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోనూ నిలిచిపోయింది. ఈ మహా ప్రయత్నానికి కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేథావులు, ఎంతో ఊతం అందించారు. 2014 నాటి యు.పి.ఎ. ఛైర్పర్సన్ శ్రీమతి ఇందిరాగాంధీ, బిజెపి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన మద్ధతు చాలా విలువైనది. వందలాది అమరుల త్యాగాల ద్వారా సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆశిద్దాం.
ప్రశ్న 5.
తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘాల గురించి రాయండి.
జవాబు.
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటు ప్రధానమైంది. ప్రాంతీయ కమిటీ సలహాలను ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ అంగీకరించవలసి ఉండేది. తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘానికి ఈ కింది అంశాలపై అధికారం ఉంది.
- రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసే అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక మొదలైన అంశాలు.
- స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ అంశాలు నగరపాలక సంస్థల రాజ్యాంగ అధికారాలు, ట్రస్టుల అభివృద్ధి, జిల్లా బోర్డులు, జిల్లా అధికార సంస్థల అంశాలు.
- ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
- ప్రాథమిక, సెకండరీ విద్య.
- తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలలో ప్రవేశాల క్రమబద్ధీకరణ.
- మద్యపాన నిషేధం.
- వ్యవసాయ భూముల అమ్మకాలు
- హెచ్. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం సహకార సంస్థలు మార్కెట్లు సంతలు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
హైదరాబాదు రాష్ట్రం.
జవాబు.
భారత యూనియన్ జరిపిన పోలీస్ చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది. తరనంతరం జనరల్ చౌదరి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి.
ఆ తరుణంలో భారత ప్రభుత్వం ఐ.సి.యస్. అధికారి యం.కె. వెల్లోడిని పాలనా వ్యవహారాలు చూసేందుకు నియమించింది. తదనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రశ్న 2.
ముల్కీ నిబంధనలు.
జవాబు.
ఉర్దూ భాషలో ముల్కీ అంటే ఒక జాతి, రాజ్యం. ఆ జాతికి చెందిన ప్రజలందరిని ముల్కీలంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో, 15 సంవత్సరాలు శాశ్వత ప్రాతిపదికగా నివసించిన పౌరులను ముల్కీలంటారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక లిఖిత పూర్వకమైన అఫిడవిట్ మీద సంతకం చేసి తన పుట్టిన ప్రదేశానికి తిరిగి వెళ్ళనని ప్రకటించిన వారు ముల్కీలుగా పరిగణించబడతారు.
ప్రశ్న 3.
విశాలాంధ్ర.
జవాబు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు వారితో కలిసి ఒక విశాల తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరగాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ ఆలోచనలను వారు విశాలాంధ్ర నినాదంగా మార్చారు.
ఈ ఆలోచనను జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే తెలుగు రాష్ట్రం ఉంటే మంచిది అన్న వాదనను ‘విశాలాంధ్ర’ అనే పేరిట ప్రచారంలోకి తీసుకొచ్చింది.
ప్రశ్న 4.
1969 తెలంగాణ ఆందోళన.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురికాగా తెంగాణలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1969లో జరిగిన ‘జైతెలంగాణ ఉద్యమం’. ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణ లోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి.
ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయిది. 1969లో జరిగిన ‘ఉద్యమంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యలోని ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరు కార్చింది.
ప్రశ్న 5.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టు 2010.
జవాబు.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టులోని ప్రధానాంశాలు :
- రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజికార్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజన్ కౌన్సిలును ఏర్పాటు చేయటం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రాలు కలిసిన రెండు రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.
ప్రశ్న 6.
తెలంగాణ సంరక్షణల ఉల్లంఘనలు.
జవాబు.
ఎన్నో మంచి ఒప్పందాలు, ఎంతో విశ్వాసంతో మొదలైనా చిత్తశుద్ధి లేకపోతే, అమలులోకి రావు అనేది చారిత్రక సత్యం. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరచిన తెలంగాణ ప్రాంత సంరక్షణల ఉల్లంగన ఈ సత్యాన్నే లోకానికి తెలిపింది. మరోసారి వీటితో పలు ఉల్లంఘనలు కింది విధంగా జరిగాయి.
స్థానికత (Domicile) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉండి. పెద్ద పమనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది.
అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘన వల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.
ప్రశ్న 7.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
జవాబు.
ఆంధ్రప్రదేశ్ పనర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ చట్టం 2014 నుండి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.
ప్రశ్న 8.
సకల జనుల సమ్మె.
జవాబు.
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జనజీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటావార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మె కాలంలో నిత్యకృత్యమైనాయి. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమంగా
నిలిచింది.
ప్రశ్న 9.
మిలియన్ మార్ట్.
జవాబు.
17 ఫిబ్రవరి 2011లో మొదలుపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయనిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు.
దీని తరువాత తెలంగాణ జె.ఏ.సి. పదిలక్షల మంది (మిలియన్) జనాలను హైదరాబాద్కు ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చారు.
అదే సంవత్సరం ఈజిప్ట్ లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పు కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చ్ అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ జరిగింది.
ప్రశ్న 10.
రాజకీయ జెఎసి.
జవాబు.
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) : రాజకీయ సంయు కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009 న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిసిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.
ప్రశ్న 11.
విద్యార్థుల జెఎసి.
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిద కళాశాలలు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడడానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.
ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్థాయిల్లో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.