Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 6th Lesson రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి?
జవాబు:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి. బహుభాషావేత్త. తన జీవితాన్ని -ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.
1. బాలికల ఉన్నత పాఠశాల :
మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది. కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావుగారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళావిద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.
2. పరోపకారిణీ బాలికా పాఠశాల :
హైదరాబాద్ రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి న్నారు.
3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల:
ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ అధ్యక్షులు రామారెడ్డిగారే! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.
4. బాలికా పాఠశాల (గొల్లబిడ్కి) :
హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.
5. పరోపకారిణీ బాలికా పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు ఆ కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.
6. ఆంధ్రవిద్యాలయం :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామరెడ్డిగారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత అది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉ న్నత పాఠశాలగా ఎదిగింది.
ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువు కోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.
ప్రశ్న 2.
రాజాబహద్దూర్ సంఘసేవా తత్పరతను పరిచయం చేయండి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర” అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
వెంకటరామారెడ్డి గొప్ప సంఘ సేవా తత్పరులు. విద్యార్థుల కోసం, బాలికల విద్య కోసం, వితంతు వివాహాలు, బాల్య వివాహల నిరసన, అనాధల వేశ్యల రక్షణ మొదలగు అంశాలపై ఆయన చేసిన సేవ మెచ్చతగింది. హైదరాబాద్లో చదువుకునే రెడ్డి విద్యార్థులకు (హాస్టల్) వసతి గృహం, నిర్మించటం, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠశాలలను నిర్మించటం వారి సేవలో ప్రధాన భాగాలు.
సంఘ సంస్కారం :
గోల్కొండ పత్రికను స్థాపించి దాని ద్వారా యువతలో చైతన్యాన్ని నింపారు. రెడ్డిగారు పూర్వకాలం వారు అయినప్పటికి సంఘసంస్కారం కలవారు. బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. కీ॥శే॥ పండిత కేశవరావుగారు వీటిపై రెండు చిత్తు శాసనాలను చేస్తే వాటికి రెడ్డిగారు మద్దతు నిచ్చారు. దీనిపై శాసనసభవారు ఒక ఉప సంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘంలో రెడ్డిగారు ముఖ్యపాత్ర వహించారు. ఒక రెడ్డి హాస్టల్ విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించి ఉపాధిని కల్పించారు. వీరికి కులభేధ పట్టింపులు లేవు. మూఢాచారాలను నిరసించారు. అన్ని కులాల మతాల వారితో కలిసి జీవించారు.
అనాధలపై ప్రేమ :
రెడ్డిగారికి అనాధలపై, వృద్ధులపై, రోగ గ్రస్తులపై, చివరకు జంతువులపై కూడా ప్రేమ ఉండేది. జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా పనిచేశారు. అనాధ బాలికలను ధనవంతులు, నవాబులు ఉంచుకొనుట ఆచారంగా ఆ రోజులలో ఉండేది. నాటి పోలీసు అధికారి ‘సర్ ట్రెంచ్’ గానిని సంప్రదించి “శిశువుల సంరక్షక శాసనము’ను చేయించి అనాధ బాలికలను రక్షించారు.
సికిందరాబాద్ లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. వాటికి ద్రవ్యసహాయాన్ని రెడ్డిగారు పలుమార్లు చేశారు. హైదారాబాద్ లో కుష్ఠిరోగుల చికిత్సాలయం ఉండేది. అక్కడి రోగుల పట్ల సేవాభావంతో చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారు. అనాధలపై వీరికి ఎంతటి సేవాభావం ఉండేదో అలాగే హరిజనులపై ఉండేది. హిందువుల దురాచారాలలో అస్పృశ్యత ఒకటి. దీనితో పాటుగా మరొక కుసంస్కారం ఉండేది.
హరిజన బాలికలను చిన్నతనంలోనే “మురళీలు”గను, బసివిరాండ్రు”గను తయారుచేసి అగ్రవర్ణాలవారు వారితో వ్యభిచారం చేసేవారు. వారికిక వివాహం అంటూ ఉండేదికాదు. జీవితాంతం వ్యభిచారులుగానే గడపవలసి వచ్చేది. రెడ్డిగారు దీనిని నిరసించి వారిని ఆదుకున్నారు. సర్వజనులకు పరోపకారి, కరుణా సముద్రులు, ప్రజానురంజకులు, రాష్ట్రసేవాపరాయణులుగా ప్రజా సేవచేస్తూ కీర్తి ప్రతిష్టలను పొందారు రామారెడ్డిగారు.
II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి?
జవాబు:
రాజాబహద్దూర్ వెంటకరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.
భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.
తాము సంపాదించిన ధనములో ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.
కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.
ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి ‘సాహితీసేవ’ను వివరించండి?
జవాబు:
‘రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థాన కేంద్రమైన ‘బోరవెల్లి’ గ్రామంలో మే 28, 1896న జన్మించారు. వీరి స్వస్థలం ‘ఇటిక్యాలపాడు’ తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు. వీరు సంస్కృత సాహిత్యంతోపాటు ఎఫ్ఎ, బి.ఏ,బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా ఉన్నా తరువాత సాహిత్య కారునిగా మారారు.
సురవరం వారు గోల్కొండ పత్రికను స్తాపించారు. 1926 నుండి 20 సం॥ల పాటు ఆయనే సంపాదకత్వం వహించారు. “తెలంగాణలో కవులు పూజ్యుం” అన్న విమర్శకు తుడిచివేసి 354 మంది తెలంగాణ కవుల జీవిత చరిత్రలను రాశారు. గోల్కొండ కవుల చరిత్రను వెలువరించారు. 1931 నుండి 1953 వరకు తెలంగాణ సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రాశారు.
1948లో “ఆంధ్రుల సాహిత్య చరిత్రను” వెలువరించారు. “ప్రజావాణి” పత్రికను నడిపారు. భక్తతుకారాం. డచ్చల విషాదము” అన్న నాటకాలను రచించారు. హిందువుల పండుగలు హైందవధర్మవీరులు, రామాయణ విశేషాలు వంటి 40 గ్రంథాలను సురవరం వారు రాశారు.
ప్రశ్న 3.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు?
జవాబు:
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
సురవరం ప్రతాపరెడ్డిగారు 1926లో తెలంగాణలో గోల్కోండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు పాత్రినిద్యంలేదు. ఆయనే 20స||లపాటు దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దార్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కోండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం
గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణా లయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ. 7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.
ప్రశ్న 4.
రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి?
జవాబు:
శ్రీ రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.
హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్దదోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు.
బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాతంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డి ఎపుడు జన్మించారు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి మే 28. 1896న జన్మించారు.
ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
జవాబు:
1948లో రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంధానికి .
ప్రశ్న 3.
అనాధభాల బాలికల సంరకక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది?
జవాబు:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.
ప్రశ్న 4.
బొంబాయిలో మహిళావిద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు?
జవాబు:
బొంబాయిలో మహిళా విద్యా పీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.
ప్రశ్న 5.
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి ఎవరు సాయం చేశారు?
జవాబు:
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి సాయం చేసింది సర్ బన్సీలాల్గారు 15,000 రూ॥ ఇచ్చారు.
ప్రశ్న 6.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపినదెవరు?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు.
ప్రశ్న 7.
రాజాబహద్దూర్ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడా కలవు?
జవాబు:
హైదరాబాద్ లో ఒకటి, సికిందరాబాద్లో ఒకటి కలవు.
ప్రశ్న 8.
‘సర్ంచ్’ ఎవరు.
జవాబు:
‘సంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.
రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత Summary in Telugu
రచయిత పరిచయం
రచయిత : సురవరం ప్రతాపరెడ్డి
పుట్టిన తేదీ : మే 28, 1896
పుట్టిన ఊరు : మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల సంస్థానంలోని బోరవెల్లి గ్రామం ఇటిక్యాలపాడు స్వగ్రామం
తల్లిదండ్రులు : రంగమ్మ, నారాయణరెడ్డి
విద్యాభ్యాసం : సంస్కృత సాహిత్య వ్యాకరణాలతో పాటు ఎఫ్. ఎ. బి.ఎ. బి.ఎల్
వృత్తి : కొంతకాలం న్యాయవాది, సంపాదకుడు, సాహిత్య కారుడు, సామాజిక కార్యకర్త
రచనలు :
- ‘గోల్కొండ పత్రిక’
- గోల్కొండ కవుల సంచిక 354 మందితో
- మొగలాయి కథలు
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర
- భక్తతుకారం నాటిక
- డచ్చల విషాదము నాటిక
- హిందూ పండుగలు
- హైందవధర్మ వీరులు
- రామాయణ విశేషాలు
మొత్తం 40 గ్రంథాలను రచించారు.
మరణం : ఆగస్టు 25 1953
కవి పరిచయం
తెలంగాణ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం. ఇటిక్యాలపాటు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు.
సంస్కృత వ్యాకరణంతోపాటు ఎఫ్.ఎ., బి.ఏ.బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాది గా తరువాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా సాహిత్య కారునిగా మారాడు. తెలుగుభాష, తెలంగాణ భారతీయ సంస్కృత జీవనంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.
1926లో తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేని కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు 20 సం॥ల కాలం సంపాదకునిగా పనిచేశారు. తన అమూల్యమైన సంపాదకీయాలతో సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అన్న విమర్శకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ “గోల్కొండ కవుల సంచికను వెలువరించాడు.
1931, 1953 వరకు జరిగిన సామాజిక పరిస్థితులు ప్రతి బింబించేలా మొగలాయికథలను రచించారు. 1948లో సురవరంవారు రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత” పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి గ్రంథమిది.
ఆంధ్ర విద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్ వంటి సంస్థల స్థాపనకు విశేషకృషి చేశారు. ఆంధ్రమహాసభకు తొలి అధ్యక్షుడు సురవరం. శాసనసభ్యునిగా పనిచేశారు. “ప్రజావాణి”. పత్రికను కూడా నడిపారు. గ్రంథాలయం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చైతన్యానికి దోహపదపడ్డారు.
భక్త తుకారం, డచ్చల విషాదము అన్న నాటకాలు. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించారు. తెలుగు సామాజిక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన సురవరం ఆగస్టు 25, 1953న కన్నుమూశారు.
పాఠ్యభాగ సందర్భం
రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ ప్రాంతంలో మంచి పలుకుబడి గలవారు. ఆయన సంఘసేవాతత్పరులు. వీరు తమ శక్తియులతో మంచి ఉద్యోగము ను సంపాదించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పనిచేశారు. పలు భాషలతో పరిచయం ఉన్నవారు. ప్రజాభ్యుదయం కోసం తన ధనమును శక్తిని, బలమును, పలుకుబడిని వినియోగించారు. వీరి ప్రజాసేవలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహం నిర్మించటం ముఖ్యమైనది.
20వ శతాబ్దానికి పూర్వం హైదరాబాదు నగరంలో ఒకే హిందూ హెూటలుండేది. ఎంతో మంది ధనుకులుండి కూడా రెడ్డి విద్యార్థులకు విద్యాసౌకర్యం చేయలేక పోయారని బాధపడ్డారు. ఈ విషయంపై ఒక కార్యక్రమంలో ప్రస్తావించగా “ఎవరైనా బాధ్యత తీసుకున్న ఎడల సహాయం చేస్తామన్నారు. వెంకటరామారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ స్థాపించబడింది.
బాలికల ఉన్నత పాఠశాల :
హైదరాబాద్ లో బాలికలు చదువుటకు తెలుగు బోధన పాఠశాల లేకపోయింది. ఉన్నత పాఠశాలల్లో, ఉర్దూ, ఇంగ్లీషు బోధించేవారు. మాడపాటి హనుమంతరావు వంటివారు పూనుకుని మాతృభాషలో బాలికల పాఠశాలను స్థాపించారు. దీనికి వెంకటరమారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. బొంబాయి రాజధానిలోని పూనా నగరంలో “కార్వే” మహాశయులు నిర్మించిన మహిళా విద్యాపీఠానికి అనుబంధంగా ఉండి బి.ఏ డిగ్రీ చదువు అవకాశాన్ని బాలికలకు ప్రసాదించేలా అభివృద్ధిచేశారు. తరువాత హైదరాబాద్లోనే పరోపకారిణీ పాఠశాలను స్థాపించారు. దీని అధ్యక్షులు కూడా రెడ్డిగారే!
స్త్రీల క్లబ్ (కాస్మాపాలిటన్ క్లబ్):
హైదరాబాద్ నగరంలోని బొగ్గుల కుంటలో మహిళా సంఘం పేరున ఒక క్లబ్ నిర్మాణం చేశారు.
బాలికా పాఠశాల :
హైదరాబాద్ నగరంలో గొల్లఖిడ్కిలో ఆంధ్రబాలికా ప్రాథమిక పాఠశాలను కొందరు ప్రజాసేవకులు స్థాపించారు. దీని అధ్యక్షులు రెడ్డిగారే!
పరోపకారిణీ పాఠశాల :
సికిందరాబాదు నగరంలో కీ.శే. సీతమ్మగారు బాలికా మాధ్యమిక పాఠశాలను నడిపేవారు. దీనికి రెడ్డిగారు చాలసాయం చేశారు.
ఆంధ్ర విద్యాలయము :
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాషలో బోధించుటకు ఒక మాధ్యమిక పాఠశాలను నిర్మించాలనుకున్నారు. 1931న ‘దేవరకొండ’ సభలో తీర్మాన చేసినా 1944లోకి గాని అది స్థాపించబడలేదు.
గోల్కోండ పత్రిక :
గోల్కొండ పత్రిక సురవరం వారిపై రామారెడ్డికి ప్రత్యేక అభిమానం. సురవరం వారికి ముద్రణాయంత్ర నిర్మాణంకొరకు 3,500 రూ. సహాయంగా అందించారు.
సంఘ సంస్కారం :
రామారెడ్డిగారు గొప్ప సంఘ సంక్కర్త కీ॥శే॥ పండిత కేశవరావు బాల్య వివాహములు తప్పని, వితంతు వివాహాలు జరుపాలని రెండు చిత్తూ శాసనాలను చేస్తే వాటికి మద్దతు ఇచ్చినవారు రామారెడ్డి – రెడ్డి హాస్టల్లోని ఒక విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించారు. రామారెడ్డిగారికి కుల, బేధ పట్టింపులు లేవు. అందరితో కలసి ఉండేవారు.
అనాథలపై ప్రేమ :
రాజాబహద్దూర్ రామారెడ్డిగారికి అనాథలపై మిక్కిలి ప్రేమ ఉ ౦డేది. బాలికలను, వృద్ధులను, రోగపీడితులను చివరకు జంతువులపై కూడా ప్రేమ ఎక్కువే! జంతు హింసా నివారణ సంఘంలో ప్రముఖంగా సేవచేశారు. అనాధశిశువులకు పెంపుడు పిల్లలకు విశేష సేవలందించారు.
సంచ్ ఆకాలంలో పోలీసు శాఖా మంత్రిగా ఉ ండేవారు. వారితో చెప్పి “శిశు సంరక్షక శాసనాన్ని చేయించి అనాథలను బానిస బతుకుల ‘నుండి బయటపడవేశారు. అప్పటికి హైదరాబాద్లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. కుష్ఠు రోగులకు చికిత్సాలయాన్ని ‘డిచ్పల్లిలో’ స్థాపించి సేవలందించారు.
అస్పృశ్యతా నివారణపై వెంకటరామారెడ్డిగారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. హరిజన ‘బాలికలను ‘ఆరోజులలో చిన్న వయసులోనే “మురళీలు, బసివిరాండ్రుగా మార్చేవారు. వారు జీవితాంతం వ్యభిచారిణులుగా ఉండవలసి వచ్చేది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఆ కళంకాన్ని తుడిచి వేయటానికి వెంకటరామిరెడ్డి కృషిచేశారు.
రాజాబహద్దూర్ రామారెడ్డి సర్వజన ప్రియులు, పరోపకారులు, కరుణాసముద్రులు, ప్రజారంజకులు. సేవా పరత్వంతో అఖండకీర్తిని గడించారు.
కఠిన పదాలకు అర్థాలు
ద్రవ్యము = ధనము
విస్మృతులు = గుర్తింపు లేనివారు
సర్వదా = ఎప్పుడు
బాడుగ = ಅದ್ದ
ప్రముఖులు = ముఖ్యమైనవారు
ద్రవ్యసహాయ = ధన సహాయం
వితంతు ద్వహములు = భర్తచనిపోయిన స్త్రీలకు తిరిగి వివాహం జరిపించుట
కళంకము = మరక