Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సాధారణ వ్యాసాలు Questions and Answers.
TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు
1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.
చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.
తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి.
తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటాలు ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.
తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 16) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724-1948) తెలంగాణ నేలను పరిపాలించారు.
క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.
కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగనగర్’ అనే పేరొచ్చింది.
వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.
తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.
మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.
ఆదిమ సమాజ• జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.
రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.
సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.
తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.
చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.
వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.
తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…
2. యువత – జీవన నైపుణ్యాలు
ఒకదేశ అభివృద్ధి. ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం. ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.
జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.
పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.
1. స్వీయ అవగాహన (Self Awareness) :
ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.
2. సహానుభూతి (Empathy):
పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.
3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill):
మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.
4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions):
యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.
5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill):
సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.
ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.
6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making):
సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.
7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking):
ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.
8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking):
యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.
ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.
3. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషులు పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది.
ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.
వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.
ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.
1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. . పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.
ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు.
ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు.
సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.
తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు.
అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు. కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.
ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు. ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు.
తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.
బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.
4. జాతీయ విపత్తులు
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.
విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.
విపత్తు లక్షణాలు
- ఆకస్మికంగా సంభవించడం
- అతివేగంగా విస్తరించడం
- ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం.
- ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.
సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.
- సహజమైనవి
- మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.
భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.
ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.
భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.
విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు
- సంసిద్ధత
- ఉపశమన చర్యలు
- సహాయక చర్యలు
- పునరావాసం.
విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.
అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.
2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.
విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.
విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.
విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి.
విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.