Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar లేఖారచన Questions and Answers.
TS Inter 1st Year Telugu Grammar లేఖారచన
మన మనసులోని భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని ఇతరులకు తెలుపడానికి ఉత్తమసాధనం ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అనే దానిని నేడు మనం లేఖ అంటున్నాం. సాధారణంగా అన్ని సందర్భాలలో వ్యక్తులతో, సంస్థలతో ప్రత్యక్షంగా చర్చించలేని విషయాలను లేఖల ద్వారా చేరవేస్తాం. లేఖలను ఒకప్పుడు వక్షుల ద్వారా, జంతువుల ద్వారా చేరవేసే వాళ్ళు.
స్మార్ట్ ఫోన్స్ లేని రోజులలో ఉత్తరాల కోసం ఎదురు చూసేవారు. దీనిలో ఒక ఆనందం, ఉద్వేగం దాగి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, నేడు ఎస్.ఎం.ఎస్., ఈ – మెయిల్, సామాజిక మాధ్యమాల స్థాయికి చేరింది. అయితే మనుషుల మధ్య అనుబంధాలను ఆనాటి లేఖలు ఏర్పరచినట్లుగా, నేటి సామాజిక మాధ్యమాలు ఏర్పరచలేకపోయాయనవచ్చు.
ఉత్తరాలు సంఘజీవితంలో ఒక భాగం. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లేఖలే కాదు, వ్యాపార సంబంధ, ఉద్యోగసంబంధ లేఖలు రాయడం కూడా ముఖ్యమైన అంశమే. భవిష్యత్తులో వివిధ రంగాలలో స్థిరపడే విద్యార్థులకు వ్యక్తిగతంగానూ, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగానూ లేఖారచన చేయడం అవసరమే. అందుకే, మనం లేఖారచన ప్రాధాన్యతను గుర్తించి, చక్కని శైలిలో, స్పష్టంగా లేఖలు రాయడం నేర్చుకోవాలి.
చక్కని ఉత్తరాలు రాయాలి అంటే లేఖా రచనలోని మెలకువలను మనం తెలుసుకోవాలి.
లేఖారచనలో పాటించే సాధారణ మెలకువలు
ముందుగా లేఖలో పై భాగాన కుడివైపు మనం ఎక్కడి నుండి రాస్తున్నామో ఊరి పేరు, తేదీలను పొందుపరచాలి. ఊరిపేరు తరువాత కామా (,) ఉంచి, తేది తరువాత విరామ చిహ్నం (.) ఉంచాలి.
ఉత్తరాలలో రెండవ ప్రధానవిషయం సంబోధన, ఉత్తరాలు రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో దానిని బట్టి సంబోధన ఉంటుంది. మనకంటే పెద్దవారి విషయంలో మాన్యశ్రీ, పూజ్యులైన, గౌరవనీయులైన అని సంబోధిస్తారు. వ్యాపార లేఖల్లో మహాశయా! ఆర్యా! అయ్యా! అమ్మా! అని సంబోధిస్తారు. స్నేహితులకు ప్రియమైన అని సంబోధిస్తారు.
ఉత్తరాలలో మూడవ అంశం ప్రధాన విషయం మనం చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, అంశాలవారిగా విభజించి రాయాలి. ముఖ్యంగా వ్యాపార లేఖలలో ఇది మరింత అవసరం. ఉద్యోగ సంబంధ లేఖలలో మన అర్హలు, అనుభవం, ఉద్యోగం పట్ల అవగాహన ఇలా విభజించి రాస్తే బాగుంటుంది. ప్రధానవిషయ వివరణ తరువాత ముగింపువాక్యాలు రాయాలి. స్నేహితులకు, బంధువులకు “ప్రత్యుత్తరం రాయగలరు” అని అధికారులు, ఉద్యోగ సంబంధ ఉత్తరాలలో కృతజ్ఞతలు వంటి వాక్యాలు రాయాలి.
లేఖ చివరన సంతకానికి ముందు లేఖను బట్టి భవదీయుడు, విశ్వసనీయుడు, విధేయుడు వంటివి ఉపయోగించాలి.
ఉత్తరం ముగిసిన తరువాత ఎడమ వైపు చివరన “పూర్తి చిరునామా” రాయాలి. కొన్ని లేఖలలో పై భాగంలోనే పూర్తి చిరునామా రాస్తారు.
లేఖల్లో భేదాలు
- సాధారణంగా లేఖల్లో వ్యక్తిగత లేఖలు, వ్యవహార లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు అని విభజించవచ్చు. కానీ, నియమిత భేదాలు ఇవి మాత్రమే ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.
- మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రాసే లేఖలను వ్యక్తిగత లేఖలు అంటారు.
- ప్రభుత్వపరంగా జరిగే కార్యకలాపాలన్నీ వ్యవహార లేఖలుగా గుర్తించవచ్చు. దీంట్లో స్పష్టత, సంక్షిప్తత, సరళత, యథార్థత వంటివి ప్రముఖ అంశాలుగా కనిపిస్తాయి. వీటిలో అధికారిక లేఖలు, అర్థ అధికారిక లేఖలు, మెమోరాండం, నోటిఫికేషన్, సర్యులర్ వంటివి వివిధ వైవిధ్యాలతో కూడా ఉంటాయి.
- వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యే సంపాదకీయ లేఖలు, వినతి పత్రాలు, ఆహ్వాన లేఖలు మొ||నవి సాంఘిక లేఖల క్రిందికి వస్తాయి.
- ఒక సంస్థ వ్యాపార అభివృద్ధికి రాసే లేఖలు వ్యాపార లేఖలు. వీటిలో సుబోధకత, సంగ్రహత, స్పష్టత, సందర్భ శుద్ధి, యథార్థత, సంక్షిప్తత అనేవి ప్రధాన లక్షణాలు.
1. తల్లిదండ్రులకు లేఖ
వరంగల్,
10-02-2020.
పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.
నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను . నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.
ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను. బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.
ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.
ఇట్లు
మీ కుమారుడు
xxxxx
చిరునామా
జి. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ.యన్. రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం . 504106
2. కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ
కరీంనగర్,.
15-06-2020.
గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.
విషయము: టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.
నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.
కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,
ఇట్లు
మీ విద్యార్థి
XXXX
3. స్నేహితులకు లేఖ
మెదక్
09-08-2020.
ప్రియమైన సౌమ్యకి,
నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.
ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.
మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX
చిరునామా ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.
4. అధికారికి లేఖ
దిలావర్పూర్,
10.08.2020.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.
విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.
ఆర్య !
నమస్కారములు.
నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్ పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయింది.
దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,
ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్
5. ఉద్యోగానికి లేఖ
నల్లగొండ,
26.07.2020.
శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.
విషయము: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము: నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2020.
ఆర్యా,
ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.
ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,
ఇట్లు
మీ భవదీయుడు
XXXX
దరఖాస్తుతో జత చేసిన పత్రాలు:
- ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
- జనన ధ్రువీకరణ పత్రం
- స్థానిక ధ్రువీకరణ పత్రం
- ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం