Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.
సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాధించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.
హక్కులనేవి రాజ్యం, సమాజం చేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.
అర్థం :
“హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు : రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.
- ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
- బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
- టి.హెచ్. గ్రీన్ : “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
- హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”
పౌరహక్కులు :
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా :
1. జీవించే హక్కు (Right to Life) :
జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి. హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది.
అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.
2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty) :
స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు. వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
3. సమానత్వ హక్కు (Right to Equality) :
సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.
4. ఆస్తి హక్కు (Right to Property) :
ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.
5. కుటుంబ హక్కు (Right to Family) :
కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.
6. మత హక్కు (Right to Religion) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.
7. ఒప్పందం హక్కు (Right to Contract) :
ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.
8. విద్యా హక్కు (Right to Education) :
ఆధునిక కాలంలో విద్యా హక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు.
అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీసస్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.
9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది.
వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.
10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies) :
వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు.
ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.
రాజకీయ హక్కులు : ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :
1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు. వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.
ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.
2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.
3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.
4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.
ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.
5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.
అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై, పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.
ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.
సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కీ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.
హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.
అర్థం : “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.
హక్కుల నిర్వచనాలు :
రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.
- ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
- బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
- టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
- హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”
హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights) :
హక్కులను రాజ్యం ప్రతిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.
1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule) :
ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.
2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.
3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights) :
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.
4. అధికారాల వేర్పాటు (Separation of Powers) :
హక్కుల పరిరక్షణకు అధికారాల వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య ఏర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.
5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.
6. సమన్యాయపాలన (Rule of Law) :
చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.
7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary) :
వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.
8. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.
9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities) :
సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్థక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.
10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance) :
వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి.
వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recall), దృఢమైన ప్రతిపక్షం లాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.
ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
భావం : మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ ” హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.
మానవ హక్కుల ఆవిర్భావం :
ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.
మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో మానవ హక్కులు కనుమరుగయ్యాయి.
మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.
మానవ హక్కుల ఆశయాలు :
- ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
- పేదరికం నుండి విముక్తి.
- వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
- భయం నుండి విముక్తి.
- రక్షణ పొందే స్వేచ్ఛ.
- అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
- వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
- సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
- గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
- దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.
మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది.
చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ?
జవాబు.
హక్కులు-నిర్వచనం :
“హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.
హక్కుల లక్షణాలు (Features of Rights) : హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.
1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society) :
హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. అవి మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.
2. సామాజిక స్వభావం (Social Nature) :
హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.
3. ప్రకృతిసిద్ధమైనవి (Natural) :
హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.
4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state) :
హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.
5. నిరపేక్షమైనవి కావు (Not Absolute):
హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై ‘రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. ‘అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.
6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities) :
హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి.
అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు ‘లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.
7. విశ్వవ్యాప్తమైనవి (Universal) :
హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.
8. మార్పులకు అవకాశం (Scope for changes) :
హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.
9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State) :
చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.
10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good) :
హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖ సౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.
ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :
1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.
ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.
2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.
3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.
4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.
ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.
5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ్య స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.
అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.
ప్రశ్న 3.
ముఖ్యమైన కొన్ని పౌర, రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.
సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.
ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ప్రశ్న 4.
మానవ హక్కుల వర్గీకరణ, లక్ష్యాలను రాయండి.
జవాబు.
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.
- ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
- పేదరికం నుండి విముక్తి.
- వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ
- భయం నుండి విముక్తి.
- రక్షణను పొందే స్వేచ్ఛ.
- అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
- వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
- సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
- గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
- దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.
మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :
- పౌర, రాజకీయ హక్కులు
- సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.
1.A. పౌరహక్కులు : సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు ఉదాహరణలు.
- జీవించే హక్కు
- స్వేచ్ఛ హక్కు
- వ్యక్తుల భద్రత హక్కు.
- వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
- చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
- బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
- నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
- ఆస్తి హక్కు
- వివాహపు హక్కు
- వాక్ స్వాతంత్య్రపు హక్కు.
- భావ ప్రకటన హక్కు
- సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
- సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
- స్వేచ్ఛగా సంచరించే హక్కు.
1.B. రాజకీయ హక్కులు :
- ఓటు హక్కు
- ఎన్నికలలో పోటీచేసే హక్కు
- అధికారం పొందే హక్కు
- విమర్శించే హక్కు
- విజ్ఞాపన హక్కు
2.A. సాంఘిక హక్కులు:
- విద్యా హక్కు
- ఆరోగ్య హక్కు
- వినోదపు హక్కు మొదలైనవి
2.B. ఆర్థిక హక్కులు :
- పని హక్కు
- సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
- కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
- సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు
2.C. సాంస్కృతిక హక్కులు:
- నాగరికత
- కళలు
- సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.
ప్రశ్న 5.
వివిధ రకాలైన విధులను చర్చించండి.
జవాబు.
బాధ్యతలు :
సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ‘ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.
బాధ్యతల రకాలు (Types of Responsibilities) :
బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి : (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.
(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities) :
నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి.
సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities) :
చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.
చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి:
- సంవర్థక బాధ్యతలు
- సంరక్షక బాధ్యతలు.
1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities) :
సంవర్థక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.
2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities) :
చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.
ప్రశ్న 6.
పౌర, రాజకీయ హక్కుల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.
సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.
ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ప్రశ్న 7.
హక్కులు, విధుల మధ్య సంబంధాన్ని తెల్పండి.
జవాబు.
హక్కులు | విధులు | |
నిర్వచనం | రాజ్యం ప్రజలకందించిన అధికారాలు, హక్కులు. | ఓ వ్యక్తి అనుభవించే హక్కు ఇతరుల పట్ల అతను నిర్వహించవలసిన విధి అవుతుంది. |
చట్టం | సాధారణంగా న్యాయస్థానాల ద్వారా హక్కులకు రక్షణ కలిగేలా రాజ్యం చూస్తుంది లేదా సవాలు చేయవచ్చు. | పౌర విధులను న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే వీలు కాదు. |
ఆధారంగా | వ్యక్తి అనుభవించే అధికారాలు హక్కులు. | వ్యక్తిగతంగా విధులు నిర్వర్తించడం, జవాబుదారీతనం ఆధారంగా విధులు ఉంటాయి. |
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి.
జవాబు.
- “వ్యక్తి మూర్తిమత్వ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
- “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా… ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
హక్కులను ‘వర్గీకరించండి.
జవాబు.
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :
- సహజ హక్కులు
- నైతిక హక్కులు
- చట్టబద్ధమైన హక్కులు.
చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి :
- పౌర హక్కులు
- రాజకీయ హక్కులు
- ఆర్థిక హక్కులు.
ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు.
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా :
- జీవించే హక్కు
- స్వేచ్ఛ హక్కు
- సమానత్వపు హక్కు
- ఆస్తి హక్కు
- కుటుంబపు హక్కు
- విద్యా హక్కు మొదలైనవి.
ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు.
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కులు సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు.
జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.
ప్రశ్న 5.
నైతిక హక్కులు.
జవాబు.
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి.
ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.
ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ?
జవాబు.
రాజ్యము, ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.
ప్రశ్న 7.
మానవ హక్కుల లక్ష్యాలను తెల్పండి.
జవాబు.
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.
- ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
- పేదరికం నుండి విముక్తి.
- వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
- భయం నుండి విముక్తి.
ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు, అవి ఏవి ?
జవాబు.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.
ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు.
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.
ప్రశ్న 10.
విధులు వర్గీకరణ.
జవాబు.
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
- నైతిక బాధ్యతలు
- చట్టబద్ధమైన బాధ్యతలు.
చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
- సంవర్థక బాధ్యతలు
- సంరక్షక బాధ్యతలు.
ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు.
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.
ప్రశ్న 12.
కొన్ని ముఖ్య ఆర్థిక హక్కులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక హక్కులు :
వ్యక్తులు తమ జీవనభృతికి సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాలద్వారా సంపాదించుకొనేందుకు ఈ హక్కులు అవకాశం కల్పిస్తాయి. అట్లాగే ఇవి వ్యక్తుల దైనందిన అవసరాలకు తోడ్పడుతాయి. హక్కులు వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. వర్ధమాన శతాబ్దంలోని (21వ శతాబ్దం) ప్రపంచ దేశాలన్నింటిలో ఈ హక్కులకు ప్రాచుర్యం లభించింది.
కనీస వేతనాన్ని పొందే హక్కు, పనిహక్కు, విశ్రాంతిని పొందే హక్కు, పనిచేసే ప్రదేశాలలో కనీస సదుపాయాలను పొందే హక్కు, కార్మిక సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, వృద్ధాప్యం మరియు అంగవైకల్యం నుంచి ఉపశమనం పొందే హక్కు మొదలైనవి ఆర్థిక హక్కులకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.