Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి.
జవాబు.
పరిచయం : సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్లలో క్రీ.పూ. 4వ శాతబ్దంలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీకు రాజనీతి వేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధిచేసిరి.
అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను రాజనీతిశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన ‘పాలిటిక్స్’ లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రమని పేర్కొనినాడు.
పదపరిణామము :
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. పోలిస్ అంటే నగర రాజ్యం (City – State) అని అర్థం. పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన పొలిటియా (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ప్రభుత్వం – లేదా రాజ్యాంగం అని అర్థం.
రాజనీతిశాస్త్రం – నిర్వచనాలు :
జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రానికి ఆది అంతాలు రాజ్యమే” అని నిర్వచించారు.
ఆర్.జి. గెటిల్ : “గతకాలపు రాజ్యం యొక్క చారిత్రక వివరణ, వర్తమాన రాజ్యపు విశ్లేషణాత్మక వర్ణన భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుందనే రాజకీయ చింతన చేసేదే రాజనీతిశాస్త్రం”.
రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం” నిర్వచించాడు.
డేవిడ్ ఈస్టన్ : “అధికారంతో కూడిన వివిధ చర్యల, పద్ధతుల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేసే నియంత్రణా విధానాలను తెలియజేసేదే రాజనీతిశాస్త్రం”గా నిర్వచించినాడు.
రాజనీతిశాస్త్రం-పరిధి :
రాజనీతిశాస్త్రం సైద్ధాంతిక, అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణంవల్ల రాజనీతిశాస్త్ర పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘికశాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించబడింది.
రాజనీతిశాస్త్ర పరిధిని అంశాల వారీగా కింది విధంగా చెప్పవచ్చు.
i) వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం :
రాజనీతిశాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి, సమాజం, రాజ్యం ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంగా అరిస్టాటిల్ మాటలు ఉటంకించడం సముచితం. ఆయన “మానవుడు సంఘజీవి అదే విధంగా రాజకీయ జీవి కూడా” అని అభివర్ణించాడు.
ii) రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. అదే విధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. వీటితోపాటు రాజ్య స్వభావం దాని విధుల నిర్వహణను సైతం వివరిస్తుంది.
iii) ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదే విధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది.
iv) సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం :
వ్యక్తుల రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి, పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.
ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతిశాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.
v) హక్కులు, విధుల అధ్యయం :
రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ హక్కులు, పౌరహక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతిశాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతోంది.
vi) జాతీయ – అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం :
రాజనీతిశాస్త్ర పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయరాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ – రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.
vii) తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం, ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాలను వాటి నిర్మాణాలను అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది.
viii) ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం :
20వ శతాబ్దపు రాజనీతిశాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడింది. అదే విధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లోని రాజకీయ సామాజికీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయాభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రసరణ వంటి నూతన భావాలను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.
ix) ప్రభుత్వ విధానాల అధ్యయనం :
ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్, ఎ. ఆల్మండ్ చార్లెస్ మెరియమ్ వంటి వారు ఆధునిక రాజనీతిశాస్త్రం విధానాల అధ్యయనం శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే. ప్రాథమిక విధిగా రాజనీతిశాస్త్రజ్ఞులు భావించాలన్నారు.
ప్రభుత్వం పథకాలను రూపొందించే సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ప్రసార – ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రలను పోషిస్తున్నాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు, జాతీయ వ్యవసాయ విధానం పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యావిధానం వంటి జాతీయ ప్రతిష్ఠను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది.
ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమేకాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.
1. రాజనీతిశాస్త్రం సిద్ధాంతాలను – భావనలను వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం వ్యక్తికి – రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛా – సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది.
2. రాజనీతిశాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది.
రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రాజరికం, కులీనపాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనకు ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదే విధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతలను, వాటి మధ్యగల సంబంధాలను – భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది.
3. రాజనీతిశాస్త్రం హక్కులను – విధులను గురించి వివరిస్తుంది.
రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. అదే విధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులను కల్పించాలి. ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతలనివ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది.
4. రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆయా కాలాల్లో, పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.
అదే విధంగా కారల్ మార్క్స్ భావాలు రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం సంభవించడానికి మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడంవల్ల మనం తెలుసుకోవచ్చు.
అంతేకాదు మన భారతదేశంలో ‘ప్రజలను శాంతియుతంగా స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మాగాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావిత పరిచాయో మన గమనంలోనే ఉన్నాయి. ఈ విధంగా రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది.
5. రాజనీతిశాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది.
అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలురకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతిశాస్త్రం విశ్లేషిస్తుంది.
శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటువల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యతను పొందాయి. రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు.
6. రాజనీతిశాస్త్రం ప్రపంచ సంస్థలను గురించి వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది.
7. రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు.
రాజనీతిశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలురకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటిని అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతిశాస్త్ర విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు.
ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రానికి చరిత్ర, అర్థశాస్త్రానికి గల సంబంధాలను తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం – చరిత్ర :
చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవగాథ సాంఘికశాస్త్రాలకు ప్రయోగశాలవంటిది. మానవజాతికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్యరంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.
తొలిమానవుడి నుంచి నేటి వరకూ ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గతకాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మతసిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్యగల అంతర్ సంబంధాలు లిఖితపత్రమే చరిత్ర.
చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయభావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికీ, సిద్ధాంతీకరించడానికీ చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతిశాస్త్రానికీ చరిత్రకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ‘జె.ఆర్.సీలీ’ వివరిస్తూ “రాజనీతిశాస్త్రంలేని చరిత్ర ఫలరహితం, చరిత్రలేని రాజనీతిశాస్త్రం మూలరహితం” అన్నాడు.
రాజకీయ వ్యవస్థలు ప్రాచీనకాలం నుంచి నేటివరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతిశాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిమీగ్ ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచి విప్లవం, రష్యావిప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికీ, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికీ రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం.
ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్త్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్దాంతాలను ప్రతిపాదించారు.
‘రాబ్సన్’ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. రాజనీతిశాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి.
చరిత్ర నిర్ధిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే, రాజనీతిశాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైనవాటిని గురించి చర్చిస్తుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, భూత, వర్తమాన పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది.
రాజనీతిశాస్త్రం – అర్థశాస్త్రం :
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.
అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. ‘దారిద్ర్యం విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.
ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.
అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతిసంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది.
ఉత్పత్తి – అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు. ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మ్కార్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ‘ఫాసం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రానికి – సమాజశాస్త్రానికి గల సంబంధాలను వివరించండి.
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘికవ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం – పరిణామం వికాసం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది.
అందువల్ల సమాజశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతిశాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమేగాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి.
రాజనీతిశాస్త్రవేత్తకు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్త్వవేత్తలు సాంఘిక విధానాన్నే రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికీ సంఘానికీ తేడాలేదు.
గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థీకాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతిశాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్ణయించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇటీవలి కాలంలో రాజకీయ సమాజశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలావరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి.
ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే, దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ రాజకీయాలను చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
రాజనీతిశాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితంకాగా సమాజశాస్త్రం క్రమబద్ధం కాని మానవ సముదాయాలను గురించి కూడా వివరిస్తుంది. రాజనీతిశాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్, రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజశాస్త్రం భూత, వర్తమాన కాలాల్లో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది.
ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రానికి – అర్థశాస్త్రానికి గల సంబంధాలను చర్చించండి.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.
సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.
అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.
ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.
తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.
అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.
ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.
ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర స్వభావం ఏమిటి ?
జవాబు.
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. ‘పోలిస్’ అంటే నగర – రాజ్యం (City State) అని అర్ధం. ‘పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన ‘పొలిటియా’ (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ‘ప్రభుత్వం – లేదా రాజ్యాంగం’ అని అర్థం.
ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే రాజ్యం, ప్రభుత్వం, రాజ్యానికి సంబంధించిన సంస్థలకు వివరణగా భావించాలి. ప్రాచీనగ్రీకులు రాజకీయాలను రాజ్యానికి సంబంధించిన సైద్ధాంతిక, పాలనా నిర్వహణకు చెందిన అంశంగా పరిగణించారు.
రాజకీయాలకు – రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల విషయంలో రాజనీతిశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాజనీతిశాస్త్రాన్ని సంప్రదాయిక వాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు వేరువేరుగా నిర్వచించారు. సంప్రదాయిక రాజనీతిశాస్త్రవేత్తల అభిప్రాయంలో రాజ్యం, ప్రభుత్వం, రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. రాజ్యం లేకుండా ప్రభుత్వం – ప్రభుత్వం లేకుండా రాజ్యం మనుగడకు కొనసాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల రాజ్యం – ప్రభుత్వం రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువులుగా సంప్రదాయ రాజనీతిశాస్త్రవేత్తలు అభివర్ణించారు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమదేశాలకు చెందిన రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ నూతన సిద్ధాంతాలను, అధ్యయన దృక్పథాలను, పద్ధతులను, నమూనాలను రాజనీతిశాస్త్రంలో పొందుపరచి దాన్ని పునఃనిర్వచించి రాజనీతిశాస్త్ర పరిధిని విస్తృత పరిచారు.
1930వ దశకంలో హెరాల్డ్ లాస్వెల్ (Harold Lasswell) అనే రాజనీతి పండితుడు రాజనీతిశాస్త్రాన్ని, ‘రాజకీయ అధికారాన్ని’ (Political Power) అధ్యయనం చేసే శాస్త్రంగాను, అధికారాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా (Who, When and How) చేజిక్కించుకుంటారనే విషయాన్ని ముఖ్య అధ్యయన అంశంగా రాజనీతిశాస్త్రజ్ఞులు ఎంచుకోవాలని నొక్కి వక్కాణించారు. అటు పిమ్మట రెండు దశాబ్దాల తరవాత 1950వ దశకంలో మరికొంతమంది రాజనీతి పండితులు రాజనీతి శాస్త్రాన్ని విధాన నిర్ణయ శాస్త్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే ?
ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారనే విషయం కంటే ప్రజల సమస్త జీవన రీతులను మెరుగుపర్చటానికి రాజ్యం ఎటువంటి విధానాలను (Policies) రూపొందించి అమలుపరుస్తుందనే అంశం రాజనీతిశాస్త్ర అధ్యయనంగా ఉండాలని వీరు భావించారు. అందువల్ల రాజనీతిశాస్త్రం విధాన నిర్ణయ శాస్త్రంగా స్థిరీకరించబడిన మానవ సమూహాల రాజకీయ చర్యలను, కార్యకలాపాలను విశ్లేషించేదిగా పరిణతి చెందింది.
ఈ క్రమంలో రాజ్యం తీసుకునే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉండే రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, కార్మిక – కర్షక సంఘాలు, ఇతర సంస్థలు, పాలనా యంత్రాంగాలు వాటి పాత్రలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం అభివృద్ధి చెందింది.
రాజనీతిశాస్త్రాన్ని విశాల దృక్పథంలో చూసినట్లయితే మనకు రెండు అధ్యయన కోణాలు కనబడతాయి. అవి : ఒకటి సంప్రదాయిక కోణాలు, రెండు ఆధునిక కోణాలు. సంప్రదాయిక కోణంలో రాజనీతిశాస్త్రాన్ని చూసినట్లయితే అది సంప్రదాయాలను, విలువలను, అధ్యయనం చేయడానికి, అదే విధంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాలను, కొన్ని సంప్రదాయిక సిద్ధాంతాలను వివరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.
ఆధునిక కోణంలో చూసినట్లయితే, భౌతిక పరిస్థితులకు, వాస్తవిక అంశాలకు, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనలకు, రాజ్యం – ప్రభుత్వం రూపొందించే విధానాలకు సమాజంలో సంభవించే సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.
ప్రశ్న 4.
రాజనీతిశాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు. అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు.
అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలను గ్రీకులు ఒక సమగ్రమైన భావనగా చూశారు. కాలక్రమంలో రాజకీయాల పట్ల గ్రీకుల భావన అనేక మార్పులకు చేర్పులకు గురై ప్రాధాన్యతను కోల్పోయింది. ఆధునిక కాలంలో రాజకీయాలు అనే భావన విస్తృతార్థాన్ని సంతరించుకుంది.
వాస్తవానికి, సామాజిక పరిణామక్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తివిధానంలో చోటు చేసుకున్న మార్పులు (వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తిదశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ) రాజకీయాలను విస్తృత పర్చాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి.
ఈ నేపథ్యంలో రాజనీతిశాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన ‘రాజ్యం – ప్రభుత్వం’ లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా, రాజ్యపరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం – విధులు వంటివి రాజనీతిశాస్త్ర అధ్యయన అంశాలుగా పరిగణించబడ్డాయి.
సామాన్యశాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనావాద ఉద్యమంగా ఒక ఉప్పెనలా సాంఘికశాస్త్రాల అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు.
ఈ ఉద్యమం, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం పరిణామం చెందింది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర నిర్వచనం.
జవాబు.
- జె.డబ్ల్యు. గార్నర్ : “రాజనీతిశాస్త్రనికి ఆది అంతాలు రాజ్యమే”.
- పాల్ జానెట్ : “రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను తెలియజేసే సాంఘికశాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
- రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం”.
ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను నాలుగు మాటల్లో తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొంటుంది.
ప్రశ్న 3.
సమాజశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది.
మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది. అందువల్ల సమాజశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా
రూపాంతరం చెందాయి.
ప్రశ్న 4.
అర్థశాస్త్రానికి – రాజనీతిశాస్త్రానికి గల భేదం.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.
సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.
అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.
ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.
తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.
అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.
ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.
ప్రశ్న 5.
ప్రవర్తనావాదం.
జవాబు.
సామాన్యశాస్త్రల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయపరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది.
ప్రశ్న 6.
ఉత్తర – ప్రవర్తనావాదం.
జవాబు.
రాజనీతిశాస్త్ర అధ్యయన ధృక్పథంలో ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూ ఆవిష్కరించడిన మరో కోణమే ఉత్తర ప్రవర్తనావాదం. ప్రవర్తనావాదం పూర్తి శాస్త్రీయతకు పీటవేయగా, ఉత్తర ప్రవర్తనావాదం విలువలకు – శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాలను విశ్లేషించాలని భావించింది.
ప్రశ్న 7.
మాస్టర్ సైన్స్.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు.
అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టర్ సైన్స్”గా అభివర్ణించాడు. అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు.
ప్రశ్న 8.
అరిస్టాటిల్.
జవాబు.
అరిస్టాటిల్ ప్రముఖ గ్రీకు రాజనీతి తత్వవేత్త. ప్లేటో శిష్యుడు. అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు కాలం నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంధమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొన్నాడు.