Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి.`
జవాబు.
‘యూనిటరి’ (Unitary) అనే పదం ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ‘ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది.
కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.
ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government) :
1. ఏ.వి. డైసీ :
“అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం”.
2. హైర్మన్ ఫైనర్ :
“కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం”.
3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్ :
“ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే. అటువంటి ప్రభుత్వమే. ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.
ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government) :
దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.
2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government) :
ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.
3. సరళ రాజ్యాంగం (Flexible Constitution) :
ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.
4. ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏకపౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.
5. ఏక శాసన సభ (Unicameralism) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.
ప్రశ్న 2.
సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను పరిశీలించండి.
జవాబు.
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.
నిర్వచనాలు :
1. ఎ.వి. డైసీ : “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం”.
2. జె.డబ్ల్యు. గార్నర్ : “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది”.
సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government) : సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.
1. లిఖిత రాజ్యాంగం (Written Constitution) :
సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.
2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship):
సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.
3. అధికార విభజన (Division of Powers) :
సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.
4. ద్విసభా విధానం (Bicameralism) :
ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.
5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution) :
సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.
6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary):
సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను సంతృప్తిగా అనుభవిస్తారు.
సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.
ప్రశ్న 3.
అధ్యక్ష తరహా అంటే ఏమిటి ? వాటి లక్షణాలను చర్చించండి.
జవాబు.
బాగెహట్ అభిప్రాయం ప్రకారం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పార్లమెంటు ప్రభుత్వంలో రెండు శాఖలు విలీనమయి పనిచేస్తుంటాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది.
అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు :
ఎ. అధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వాధినేత :
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఇటు రాజ్యాధినేతగాను ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవంగా కార్యనిర్వాహక అధికారాలను చేలాయిస్తాడు. అతడు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తన సెక్రటరీల ద్వారా అమలుచేస్తాడు.
బి. కార్యనిర్వాహకశాఖ నుండి శాసనశాఖ వేరుచేయబడి ఉంటుంది :
ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు వేరుగాను, స్వతంత్రంగాను వ్యవహరిస్తూ ఒక శాఖ విషయంలో మరోశాఖ జోక్యం చేసుకోకపోవడం మరో’ లక్షణం.
సి. రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఎన్నిక :
అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా గాని నామినేట్ చేయడం ద్వారా గాని ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం మూలంగానే ఏర్పడుతుంది.
డి. అధ్యక్షుడి అభిశంసన :
రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పుచేసినా, చట్టాలను ఉల్లంఘించినా పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు.
ఇ. నిరోధ సమతౌల్యాలు :
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించటం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.
ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
పరిచయం :
ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ను పేర్కొనవచ్చు.
నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం
- తక్షణం, చట్టబద్దంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
- అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు : పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి :
1. నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు :
పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటీష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి.
అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.
2. సమిష్టి బాధ్యత :
సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది.
కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.
3. రాజకీయ సజాతీయత :
పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.
ఉదా : ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.
4. శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం :
పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.
అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.
5. పార్టీ క్రమశిక్షణ :
నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది.
ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతి నిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.
6. ప్రధానమంత్రి నాయకత్వం :
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు.
ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా, ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం గుణదోషాలపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అర్థము :
ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ‘tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.
నిర్వచనాలు :
డైసీ : “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి : ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా : బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.
ప్రయోజనాలు (లేదా) సుగుణాలు :
i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.
ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule) :
ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.
iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving:
కేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు.
అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.
iv) పాలనాపరమైన ఏకత (Administrative uniformity) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.
v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, ఆకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
vi) ఒకే పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ భావాలు పెంపొందించుట జరుగుతుంది.
vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries) :
ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.
లోపాలు (లేదా) దోషాలు :
i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism) :
ఏకకేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.
ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్రం. ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.
iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries) :
విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.
v) బాధ్యతారాహిత్యం (Irresponsibility) :
ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.
ప్రశ్న 2.
పార్లమెంటరీ ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సమన్వయం:
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటాయి. మంత్రిమండలి (కార్యనిర్వాహకశాఖ) శాసనసభలో (పార్లమెంటు) అంతర్భాగమే. ఆ రెండూ మెజారిటీ పార్టీ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు.
అలాగే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసనసభ్యులు ఆమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖలమధ్య వివాదాలకు, సంఘర్షణలకు సాధారణంగా అవకాశం ఉండదు.
ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ :
మంత్రిమండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రి వర్గాన్ని అదుపులో ఉంచుతుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి మంత్రి మండలిని పదవినుంచి తొలగిస్తుంది. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వనియంతృత్వంగా, బాధ్యతారహితంగా పరిపాలించే అవకాశం చాలా తక్కువ.
అధికార వికేంద్రీకరణకు అవకాశం :
పార్లమెంటరీ విధానం అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుంది. ఈ విధానంలో కార్యనిర్వహణాధికారం ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం కాదు. మంత్రుల మధ్య అధికారాలు పంపిణీ అవుతాయి.
ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం:
రాజకీయ విప్లవాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పులనైనా సులభంగా ప్రవేశపెట్టవచ్చు. మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తరువాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని స్థాపించడంలో విఫలమైతే, మధ్యంతర ఎన్నికల్ని నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
విస్తృత ప్రాతినిధ్యం :
దేశంలోని విభిన్న వర్గాలవారికి, ప్రాంతాలవారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాలవారికి, ప్రాంతాలవారికి, భాషలవారికి ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ప్రజలలో జాతీయదృక్పథం, జాతీయ సమైక్యతాభావాలు పెంపొందుతాయి.
రాజకీయ చైతన్యం :
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాబాహుళ్యంలో రాజకీయ చైతన్యం పెంపొందుతుంది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై శాసనసభలో జరిగే చర్చలు ప్రభుత్వం పని తీరుపై సామన్య ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంచుతాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను, అధికార పార్టీ లోపాలను ప్రజలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇలా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది.
పార్లమెంటరీ ప్రభుత్వం- లోపాలు:
అధికార పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం :
ఇది పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మంత్రులు శాసన, కార్య నిర్వాహక శాఖల్లో సభ్యత్వాన్ని కలిగి, ఆ రెండింటిపై అజమాయిషీ చేస్తారు. ఆ రెండు శాఖల మధ్య పూర్తి అవగాహన, సహకారం ఉంటాయి. మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పని చేయడంవల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది.
అస్థిర ప్రభుత్వం :
ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. ముఖ్యంగా బహుపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న దేశాలలో ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం మంత్రి వర్గాలు శాసన సభ్యుల మద్ధతుపై ఆధారపడి ఉండటమే. అంతేగాక అధికార పార్టీలోని విభేదాలు కూడా మంత్రివర్గం కాలపరిమితిని నిర్ణయిస్తాయి. ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసమున్నంతవరకే పదవిలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు.
మంత్రి మండలి నియంతృత్వం:
మంత్రిమండలి నియంతృత్వానికి దారితీస్తుంది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న మంత్రి మండలి సర్వాధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉన్న దేశాల్లో మంత్రివర్గ నియంతృత్వం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని స్త్రీవార్ట్, రామ్ సేమ్యుర్ మొదలైన ప్రముఖులు వ్యక్తం చేశారు.
మంత్రి మండలి నిర్మాణం కష్టం :
మంత్రి వర్గ నిర్మాణం అంత సులభం కాదు. ప్రధానమంత్రి మంత్రులను ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను అంటే కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలను, పాలనా దక్షత, పార్టీ విధేయతలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలవారిని సంతృప్తిపరచవలసి ఉంటుంది.. తన పార్టీలో అసంతృప్తి వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా క్లిష్టం.
అత్యవసర పరిస్థితులకు తగింది కాదు :
కార్యనిర్వహణాధికారాలు మంత్రుల మధ్య విభజితమై ఉండటంవల్ల ‘ నిర్ణయాలు ఆలస్యంగా జరుగుతాయి. మంత్రుల మధ్య భేదాభిప్రాయాలవల్ల కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగవు. అత్యవసర పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాలను అధిగమించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉండవు.
పార్టీ ప్రయోజనాలకు ఆధిక్యత :
పార్లమెంటరీ ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. అది అన్న వేళలా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధికారాన్ని నిర్వహిస్తుంది. దేశ సమస్యల్ని పార్టీపరంగా ఆలోచించి, వాటి ‘పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది. పార్లమెంటులో తన మెజారిటీని నిలుపుకోడానికి ఎప్పుడూ కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది.
ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ గుణదోషాలను చర్చించండి.
జవాబు.
సమాఖ్య ప్రభుత్వ ప్రయోజనాలు :
ఎ. భిన్నత్వంలో ఏకత్వం :
సమాఖ్య ప్రభుత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం ఉంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఉన్న సమాజానికి సమాఖ్య వ్యవస్థ ఎంతో మేలు.
బి. నియంతృత్వానికి వ్యతిరేకం :
సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వం ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కేంద్ర – రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరంగా అధికార విభజన ఉండటంవల్ల నింకుశత్వాన్ని నిరోధించవచ్చు.
సి. కేంద్రంపై భారం తక్కువ :
రాజ్యాంగబద్ధంగా కేంద్రం – రాష్ట్రాల ధ్య అధికారాల విభజన జరగడంవల్ల అవి వాటి వాటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అందువల్ల కేంద్రం పై భారం తగ్గుతుంది.
డి. నూతన ప్రయోగాలకు అవకాశం :
సమాఖ్య విధానంలో నూతన విధానాలను, సంక్షేమ పథకాలను ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికై నూతన ప్రయోగాలను చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇ. పెద్ద రాజ్యాలకు అనువైనది:
పెద్దవైన, విశాలమైన దేశాలకు సమాఖ్య విధానం అనువైనది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. కాబట్టి సమాఖ్య విధానం అనువైనది.
ఎఫ్. పరిపాలనలో సామర్థ్యం :
సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి. దీనితో కేంద్ర ప్రభుత్వానికి పనిభారం తగ్గి జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమర్థవంతమైనపాలన అందించటానికి అవకాశం ఉంటుంది.
సమాఖ్య ప్రభుత్వ లోపాలు :
ఎ. బలహీనమైన కేంద్ర ప్రభుత్వం :
కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది.
బి. ఏకరూపత లోపం :
సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ అంశాలపై శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించటంవల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలోను అదే విధంగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ అధికారాల విషయంలోను ఏకరూపత లోపిస్తుంది.
సి. వైరుధ్యాలు, వివాదాలు :
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉన్నప్పటికీ ఉమ్మడి జాబితా విషయంలో రెండింటికి శాసనం చేసే అధికారం ఉంటుంది. అయినప్పటికీ తమ తమ బాధ్యతలు విస్మరించటంవల్ల వివాదాలు, వైరుధ్యాలు తలెత్తుతాయి.
డి. ఖర్చుతో కూడిన యంత్రాంగం :
సమాఖ్య విధానంలో రెండు రకాల ప్రభుత్వాలుంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్నది.
ప్రశ్న 4.
ఏకకేంద్ర ప్రభుత్వం మరియు సమాఖ్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి.
జవాబు.
ఏకకేంద్ర ప్రభుత్వం | సమాఖ్య ప్రభుత్వం |
1. లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగం. | 1. లిఖిత రాజ్యాంగం తప్పనిసరి. |
2. అదృఢ రాజ్యాంగం. | 2. దృఢ రాజ్యాంగం. |
3. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో | 3. రెండు రకాల ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో |
4. కేంద్రీకృత అధికారాలు. | 4. అధికారాల వికేంద్రీకరణ కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. |
5. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఉండకపోవచ్చు. | 5. ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో భాగస్వామ్యం ఉంటుంది. |
6. చట్టాలన్నీ సారుప్యత కలిగి ఉంటాయి. | 6. కేంద్రం చట్టాలు, రాష్ట్రం చట్టాలుంటాయి. |
7. స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం లేదు. | 7. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంటుంది. |
8. నిరంకుశం ఏర్పడవచ్చు. | 8. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి. కాబట్టి నియం తృత్వానికి తావులేదు. |
9. ప్రభుత్వ విధానం సరళం, సాధారణంగా ఉంటుంది. | 9. ప్రభుత్వ విధానం కఠినతరం, సంక్లిష్టంగా ఉంటుంది. |
10. చిన్నరాజ్యాలకు అనువైనది. | 10. పెద్దరాజ్యాలకు అనువైనది. |
11. ద్విసభ విధానం (బ్రిటన్) లేదా ఏకసభ విధానం (చైనా) ఉండవచ్చు. | 11. ద్విసభా విధానం ఉంటుంది. |
12. రాజ్యాంగం అత్యున్నతమైనది (జపాన్), లేదా రాజ్యాంగం మామూలుగా ఉండవచ్చు (బ్రిటన్). | 12. రాజ్యాంగం ఆధిక్యతను కలిగి ఉంటుంది. |
13. రాజకీయ ఏకీకరణకు లేదా రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుంది. | 13.రాజకీయ ఏకీకరణకు, స్థిరత్వానికి తక్కువ అవకాశం. |
14. ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను కేంద్రం మార్చే అవకాశం ఉంది. | 14. ప్రాంతీయ ప్రభుత్వాల అధికారాలను మార్చే వీలు కేంద్రానికి ఉండదు. |
ప్రశ్న 5.
అధ్యక్ష తరహా ప్రభుత్వంపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసనశాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. దీనిని నిర్ణీత కాల పరిమితి గల ప్రభుత్వమనీ, బాధ్యతారహిత ప్రభుత్వమని కూడా సంభోదిస్తారు.
ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తాడు. అధ్యక్షుడు ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు.
అధ్యక్షుడుగాని, ఇతర సభ్యులుగాని వారివారి విధుల నిర్వహణలో ఇతరులెవ్వరికీ బాధ్యత వహించదు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వాలు అమెరికా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, జైర్, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మొదలగు దేశాలలో కొనసాగుతున్నాయి.
ప్రశ్న 6.
అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించండి.
జవాబు.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం | అధ్యక్ష తరహా పార్లమెంటరీ |
1. రెండు రకాల కార్యనిర్వాహక వర్గం, 1. వాస్తవాధికారి, 2. నామమాత్రపు అధికారి. | 1. వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి అనే తేడా ఉండదు. ఒక్కడే వాస్తవాధికారి. |
2. రాజ్యాధినేత నామమాత్రం, ప్రభుత్వాధినేత వాస్తవాధికారి. | 2. రాజ్యాధినేతనే వాస్తవాధికారిగా వ్యవహరిస్తాడు. |
3. కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు సమన్వయం ఉంటుంది. | 3. కార్యనిర్వాహక వర్గానికి శాసనశాఖకు పరస్పర సహకారం కాని సమన్వయం గాని ఉండదు. రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. |
4. కార్యనిర్వాహక శాఖ పదవీ కాలం అనిశ్చితం. | 4. కార్యనిర్వాహక వర్గానికి కచ్చితమైన కాలపరిమితి ఉంటుంది. |
5. మంత్రిమండలిని పూర్తిగా ప్రధానమంత్రి సలహామేరకు రాజ్యాధిపతి నియమిస్తాడు. | 5. క్యాబినెట్ను అధ్యక్షుడు నియమిస్తాడు. |
6. మంత్రులందరూ శాసనశాఖలో సభ్యులుగా ఉంటారు. | 6. మంత్రులు లేదా క్యాబినెట్ లేదా సెక్రటరీలు శాసన శాఖలో సభ్యులుగా ఉండరు. |
7. మంత్రులందరూ రాజ్యాధిపతికి జవాబుదారిగాను, శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు. | 7. సెక్రటరీలు శాసనశాఖకు జవాబుదారీగా ఉండరు. కేవలం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారిగా ఉంటారు. |
8. పాలనలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. | 8. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు. |
9. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రతిచర్య శాసనశాఖచే పరిశీలించబడుతుంది. | 9. శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు స్వతంత్రమైనవి, పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. |
10. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలకు వెసులుబాటు ఉంటుంది. | 10. షరిస్థితులకనుగుణంగా మారదు. వెసులుబాటు కూడా ఉండదు. |
ప్రశ్న 7.
అధ్యక్ష తరహా ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
పరిచయం :
అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు.
మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.).
నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ : “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.
ప్రయోజనాలు :
1. నియంతృత్వానికి తక్కువ అవకాశం :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.
2. సుస్థిర ప్రభుత్వం :
ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.
3. చర్యలలో జాప్యం ఉండదు :
అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.
4. పాలనా సామర్థ్యం పెరుగుతుంది :
ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.
5. బాధ్యతాయుతమైన ప్రభుత్వం :
అధ్యక్ష తరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.
6. అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం :
అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం ఆమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.
లోపాలు :
1. శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.
2. బాధ్యతారహితం :
అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.
3. సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం :
అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.
4. ప్రజాభిప్రాయానికి స్థానం లేదు :
ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.
5. శాసనసభకు అప్రధాన హోదా :
అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసనసభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహకశాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.
దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.
6. సంప్రదాయ రాజ్యాంగం :
సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగం సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.
ప్రశ్న 8.
ఆధునిక ప్రభుత్వ వర్గీకరణపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
ప్రభుత్వం ఉపయోగించే అధికారాలను బట్టి ప్రభుత్వాల వర్గీకరణను, సిసిరో, పొలిబియస్, మాకియవెల్లి, జీన్ బోడిన్, మాంటెస్క్యూ మొదలైన వారు వర్గీకరించారు. ఆధునిక కాలంలోనివారు – బ్లంట్ల, బర్జర్,, మెరియట్, సి.ఎఫ్. స్ట్రాంగ్ స్టీఫెన్ లీకాక్ మొదలయినవారు. వీరిలో స్టీఫెన్ లీకాక్ వర్గీకరణ, నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.
స్టీఫెన్ లీకాన్ ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : నిరంకుశం, ప్రజాస్వామ్యం. అదే విధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు. ఒకటి పరిమిత రాజరికం, రెండు రిపబ్లిక్. అధికారాల విభజనను బట్టి పై రెండు రకాల ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. పై రెండు రకాల ప్రభుత్వాలను వాటి ఉన్నతాధికారి ఎన్నికను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు.
ఆధునిక కాలంలోని ప్రభుత్వాలు వాటి అధికారాలను చెలాయించే స్వభావాన్ని బట్టి వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించి రెండు రకాలుగా పేర్కొన్నారు. 1. నిరంకుశ ప్రభుత్వం, 2. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక వాటి నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగాను, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడమైంది.
నియంతృత్వ ప్రభుత్వం :
ఏ ప్రభుత్వమైతే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో అదే నిరంకుశ ప్రభుత్వం లేదా నియంతృత్వ ప్రభుత్వం. నియంతృత్వ పాలన ప్రజల అభిప్రాయం గాని, వారి సంక్షేమం గాని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాలిస్తుంది.
ప్రజాస్వామ్య ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో ప్రజల భాగస్వామ్యం, వారి అభిప్రాయానికి గుర్తింపు, ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ.
జవాబు.
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి
- రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
- రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి
మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వం.
జవాబు.
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో, కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.
ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వం.
జవాబు.
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. అవి :
- కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
- లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం
- స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.
ప్రశ్న 4.
అధ్యక్ష తరహా ప్రభుత్వం.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.
ప్రశ్న 5.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే ” వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.
ప్రశ్న 6.
అలిఖిత రాజ్యాంగం.
జవాబు.
లిఖితరూపంలో లేని రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. రాజ్యాంగ సూత్రాలన్నీ ఒకే అధికార పత్రంలో రాసి ఉండవు. రాజ్య మౌలిక సూత్రాలు ఆచార సంప్రదాయాల రూపంలోనూ, శాసనసభలు ప్రజావసరాల మేరకు ఎప్పటికప్పుడు రూపొందించే చట్టాల రూపంలోనూ ఉంటాయి. అలిఖిత రాజ్యాంగం ఒక్కసారి కాకుండా కాలక్రమేణా రూపొందడం వలన దీనిని పరిణామాత్మక రాజ్యాంగం అని కూడా అంటారు. బ్రిటీష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ.
ప్రశ్న 7.
పార్లమెంటరీ కార్యనిర్వాహకవర్గం.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహకవర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండడమే కాక, భారతదేశంలోవలె పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.
ప్రశ్న 8.
అధికారాల విభజన.
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.
ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.
ప్రశ్న 9.
నిరోధ సమతౌల్యత.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించడం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.
ప్రశ్న 10.
సమిష్టి బాధ్యత.
జవాబు.
పార్లమెంటరీ విధానంలో అత్యంత ముఖ్య లక్షణం సమిష్టి బాధ్యత. పార్లమెంట్ విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఆయాశాఖలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఆ శాఖల నిర్వహణలో ప్రతిచర్యలపై క్యాబినెట్ ఉమ్మడి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రి తీసుకొనే నిర్ణయాలు యావత్తు క్యాబినెట్కు వర్తిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటారు.
ప్రశ్న 11.
అవిశ్వాస తీర్మానం.
జవాబు.
మంత్రి మండలి పైన, స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్పై పార్లమెంటుకు విశ్వాసం లేదని తెలియజేయటానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మంత్రిమండలి లేక స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది.
ప్రశ్న 12.
ప్రధానమంత్రి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవాధికారిగా కొనసాగుతారు. మంత్రులను ఎంపిక చేసుకోవటం, వారికి శాఖలను కేటాయించటం, మార్పులు చేర్పులు చేయటంతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధానమంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి ఎంతో విశిష్టత ఉంది.
ప్రశ్న 13.
రాష్ట్రపతి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను అనుసరించి రాజ్యాంగవేత్తలు రాష్ట్రపతి పదవి, అధికారాలు. హోదా లాంఛనప్రాయంగా, నామమాత్ర రాజ్యాధిపతిగా ఉండేటట్లు రూపొందించారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవంతో ఆయన తన అధికారాలను ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే మంత్రి మండలి సలహా ప్రకారం చెలాయిస్తారు.