Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 3rd Lesson సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 3rd Lesson సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సొంత వ్యాపారాన్ని నిర్వచించి, దాని లక్షణాలను తెలపండి.
జవాబు.
అర్థం:
1) సొంత వ్యాపారం, వ్యాపార సంస్థలో అతిపురాతనమైంది. దీనిలో కేవలం ఒకే వ్యక్తి వ్యాపారానికి మూలధనం సమకూర్చి, తన నిర్వహణా నైపుణ్యాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి, వ్యాపారంలో వచ్చే ఫలితాలకు తానొక్కడే బాధ్యత వహిస్తాడు. సొంత వ్యాపారంలో యజమాని ఒక్కడే ఉన్నందువల్ల దీనిని “వ్యక్తిగత వ్యాపారం” లేదా “ఏకవ్యక్తి సంస్థ” అని కూడా అంటారు.
2) సొంత వ్యాపారి లాభం ఆర్జించే ఉద్దేశంతో సంస్థకు అవసరమైన నిధులను సమకూర్చి, వాటిని వ్యాపార కార్యకలాపాలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ నియంత్రణ చేస్తాడు.
నిర్వచ జేమ్స్ స్టీఫెన్సన్: “సొంత వ్యాపారి అంటే తన చేత, తన కోసం ప్రత్యేకంగా వ్యాపారం నిర్వహించే వ్యక్తి, అతను వ్యాపార సంస్థ మూలధనానికి యజమానియే కాకుండా, సంస్థ వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు మరియు సంస్థలో వచ్చే లాభనష్టాలకు బాధ్యత వహిస్తాడు”.
జే.ఎల్.హాన్సన్: “మూలధనాన్ని సమకూర్చడానికి, వ్యాపార నష్టభయాన్ని భరించడానికి, వ్యాపార నిర్వహణను చేపట్టడానికి కేవలం ఒకే వ్యక్తి బాధ్యత వహించే వ్యాపార వ్యవస్థను సొంత వ్యాపారం అంటారు”.
సొంత వ్యాపారం లక్షణాలు:
సొంత వ్యాపార సంస్థ ముఖ్యమైన లక్షణాలను క్రింద తెలపడమైంది.
1) వ్యక్తిగత శ్రద్ధ: సొంత వ్యాపారం, వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కలిగిన ఒక వ్యక్తి శ్రద్ధాసక్తులతో ప్రారంభిస్తాడు. అతను వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసి, అవసరమైన ఉత్పత్తి కారకాలను సమకూర్చుతాడు. వ్యాపారంలో వచ్చే లాభనష్టాలను తానే అనుభవిస్తాడు.
2) ఒకే యజమాని: సొంత వ్యాపార సంస్థలో ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. అన్ని వనరులను తానే సమకూర్చుకొని, తన కోసం వ్యాపారాన్ని ప్రారంభించి, తానే వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాడు.
3) చట్టపరమైన లాంఛనాలు తక్కువ: సొంత వ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టపరమైన లాంఛనాలు చాలా తక్కువ. అందువల్ల దీనిని స్థాపించడం, రద్దు చేయడం చాలా సులభం.
4) అపరిమిత ఋణ బాధ్యత: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన లక్షణం సొంత వ్యాపారి యొక్క ఋణ బాధ్యత అపరిమితం. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే, వ్యాపార అప్పులను చెల్లించడానికి సంస్థ ఆస్తులు సరిపోనట్లయితే, సొంత వ్యాపారి తన వ్యక్తిగత అస్తులను అమ్మి వ్యాపార అప్పులను చెల్లించవలసి ఉంటుంది.
5) యాజమాన్యం, నిర్వహణ రెండూ ఒక్కటే: సొంత వ్యాపారంలో యజమాని, నిర్వాహకుడు ఒక్కడే. యజమాని అయిన సొంత వ్యాపారి తన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని తన వ్యాపార నిర్వహణకు ఉపయోగిస్తాడు. యజమాని మరణించిన, దివాలా తీసిన సొంత వ్యాపారం మూతపడుతుంది.
6) వ్యక్తిగత ప్రేరణ: సొంత వ్యాపారి కష్టానికి మరియు ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. తాను ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది సొంత వ్యాపారి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
7) రహస్యాలను కాపాడటం: సొంత వ్యాపారంలో అన్ని రకాల నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను తన వద్దే గోప్యంగా ఉంచుకుంటాడు.
8) ప్రత్యేక వ్యక్తిత్వం లేకపోవడం: సొంత వ్యాపారానికి యజమాని నుండి వేరుగా ప్రత్యేక వ్యక్తిత్వం లేదు. సొంత వ్యాపారం, సొంత వ్యాపారి రెండూ ఒక్కటే. దీని స్థాపనకు, నిర్వహణ మరియు నియంత్రణకు ప్రత్యేక చట్టం ఏమీ లేదు. సొంత వ్యాపారంలో ఏది సంభవించినా సొంత వ్యాపారే దానికి పూర్తిబాధ్యుడు.
9) ఏక వ్యక్తి నియంత్రణ: వ్యాపార సంస్థకు సంబంధించిన నిర్వహణ, పూర్తి నియంత్రణ శక్తి సొంత వ్యాపారి కలిగి ఉంటాడు. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, వాటిని అమలు పరుస్తాడు. సొంత వ్యాపారి తన ఇష్టానుసారంగా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
10) పరిమిత ప్రాంతానికి కార్యకలాపాలు: సొంత వ్యాపారి పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా శక్తి కలిగి ఉన్నందువల్ల, సొంత వ్యాపార వ్యవస్థ చేపట్టే కార్యకలాపాలు పరిమిత ప్రాంతానికి మాత్రమే విస్తరిస్తాయి. సొంత వ్యాపారి పరిమిత వనరులను సమకూర్చి, చిన్న వ్యాపారాన్ని మాత్రమే పర్యవేక్షణ చేయగలడు. కాబట్టి తన కార్యకలాపాలను ఎక్కువ ప్రాంతాలకు విస్తరించలేడు.”
ప్రశ్న 2.
సొంత వ్యాపారం ప్రయోజనాలు, లోపాలను వివరించండి.
జవాబు.
సొంత వ్యాపారం ప్రయోజనాలు: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలను క్రింద తెలపడమైంది.
1) స్థాపన, రద్దు సులభం: సొంత వ్యాపార వ్యవస్థను సులభంగా, తేలికగా స్థాపించవచ్చు. దీనిని స్థాపించడానికి అవసరమైన చట్టపర లాంఛనాలు చాలా తక్కువ. సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక గల వ్యక్తి ఎలాంటి సమయం వృధా కాకుండా త్వరగా ప్రారంభించవచ్చు. అదే విధంగా యజమాని ఇష్టానుసారంగా ఏ సమయంలోనైనా సంస్థను రద్దు పరుచుకోవచ్చు.
2) సత్వర నిర్ణయాలు, సరైన కార్యచరణ: సొంత వ్యాపార వ్యవస్థ కార్యకలాపాలలో ఇతర వ్యక్తుల జోక్యం ఉండదు. అందువల్ల యజమాని వ్యాపారానికి సంబంధించిన వివిధ సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకుని, సరైన కార్యచరణను చేపట్టవచ్చు. నిర్ణయాలలో జాప్యానికి అవకాశం లేదు.
3) కార్యకలాపాలలో సులభతత్వం: సాధారణంగా సొంత వ్యాపారం చిన్న తరహాలో కొనసాగుతుంది. వ్యాపార కార్యకలాపాలలో మార్పులు అవసరమైనప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా మార్పులు చేర్పులు చేయవచ్చు. చిన్న తరహా వ్యాపార వ్యవస్థలు తమ ఉత్పత్తిని డిమాండ్కు అనుగుణంగా సులభంగా మార్పు చేసుకోవచ్చు.
4) ప్రత్యక్ష ప్రేరణ: సొంత వ్యాపారంలో వచ్చిన పూర్తి లాభాలు యజమానికే చెందుతాయి. సొంత వ్యాపారి ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అత్యంత కష్టపడి పనిచేస్తాడు. సొంత వ్యాపారంలో కష్టానికి, ప్రతిఫలానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇది సొంత వ్యాపారిని పూర్తిస్థాయిలో కష్టపడి పనిచేయడానికి, వ్యాపారాన్ని సక్రమంగా, సమర్థవంతంగా నడిపించడానికి ప్రేరేపిస్తుంది.
5) వ్యాపార రహస్యాలు: ప్రతి వ్యాపారంలో కొన్ని మెలకువలు, కిటుకులుంటాయి. వీటినే వ్యాపార రహస్యాలు అంటారు. ఇవి కేవలం యజమానికే తెలిసి ఉంటాయి. సొంత వ్యాపారి తన ఖాతా వివరాలను బయటకు వెల్లడి చేయనవసరం లేదు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి వ్యాపార రహస్యాలు అత్యంతావశ్యకం.
6) ఖాతాదారులతో ప్రత్యక్షసంబంధం: సొంత వ్యాపారంలో అన్ని కార్యకలాపాలను యజమానే నేరుగా నిర్వహిస్తాడు. అందువల్ల యజమాని వినియోగదారులతో, ఉద్యోగులతో, వ్యక్తిగత పరిచయాలు, మంచి సంబంధాలను కలిగి ఉంటాడు. యజమాని వినియోగదారుల ఇష్టాయిష్టాలు, ప్రత్యేక అభిరుచులు తెలుసుకొని వాటికి అనుగుణంగా వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేపట్టవచ్చు.
7) సులభంగా ఋణాలు పొందవచ్చు: సొంత వ్యాపారి నిరంతరం కష్టపడి పనిచేసి తన వ్యాపార సంస్థకు మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. దీని ద్వారా మార్కెట్లో తనవిశ్వసనీయత పెరుగుతుంది. తద్వారా వ్యాపారానికి అవసరమైన ఋణాలను సులభంగా పొందవచ్చు.
8) స్వయం ఉపాధి: ఒకరి పర్యవేక్షణలో పనిచేయడానికి ఇష్టంలేని వ్యక్తులకు సొంత వ్యాపార వ్యవస్థ ఉపాధిని అందించే మార్గం వంటిది. కాబట్టి వ్యక్తులు చిన్న తరహాలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చు.
9) నిర్వహణ ఖర్చులతో ఆదా: సొంత వ్యాపారే వ్యాపార వ్యవస్థకు యజమాని, నిర్వాహకుడు మరియు నియంత్రకుడు కాబట్టి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేక పరిజ్ఞానం గల ఉద్యోగులను నియమించనవసరం లేదు. సొంత వ్యాపారస్తుడు వ్యాపార కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటాడు. వృధాను తగ్గిస్తాడు. అందువల్ల వ్యాపార నిర్వహణ ఖర్చులను ఆదా చేస్తాడు.
సొంత వ్యాపారం లోపాలు:
సొంత వ్యాపారం లోపాలను క్రింది విధంగా గమనించవచ్చు
1) పరిమిత వనరులు: సొంత వ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.
2) అపరిమిత ఋణబాధ్యత: సొంత వ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.
3) పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.
4) అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.
5) భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంత వ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.
6) తప్పుడు నిర్ణయాలు: వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. సొంత వ్యాపారి వివిధ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పరిజ్ఞానం కోసం నిపుణులను సంప్రదించడు. అందువల్ల సొంత వ్యాపారి తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఇది నష్టాలకు దారితీయవచ్చు.
ప్రశ్న 3.
“అన్ని విషయాలను నిర్వహించుకోగల శక్తివంతుడై ఉండాలేగాని, ప్రపంచంలో సొంత వ్యాపారానికి మించినది మరొకటి లేదు” – చర్చించండి.
జవాబు.
సొంత వ్యాపారము నాగరికత పుట్టినప్పటి నుంచి అమలులో ఉన్నది. ఇది అతిపురాతనమైనది. చరిత్రగతిని పరిశీలిస్తే వాణిజ్యము సొంత వ్యాపారముతోనే ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. అన్ని దేశాలలోనూ ఈ రకం వ్యాపారమే అధికముగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఎవరైనా వ్యాపారము ప్రారంభించదలిస్తే మొదట కొద్దిపాటి మూలధనముతో సొంత వ్యాపారము ప్రారంభించి, అనుభవము గడించి క్రమేణ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. చిన్నకార్లను తయారుచేసే ప్రఖ్యాతిచెందిన ఫోర్డు కంపెనీ ఒకనాడు సొంత వ్యాపారముగా స్థాపితమై, తరువాత అభివృద్ధి చెందినదే. ఈ రకముగా సొంత వ్యాపార సంస్థ అత్యంత ముఖ్యమైనది.
ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడు ఒక్కడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు తానొక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహించుకుంటాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమైతే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు . శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టము వస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంత వ్యాపారము నడుస్తుంది. వ్యాపార రథానికి సారథిగా, వ్యాపార విజయానికి నాయకుడిగా నిలబడాలి అంటే సొంత వ్యాపారికి దూరదృష్టి, చొరవ, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, వ్యాపార దక్షత, సామర్థ్యము, ఓర్పు, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసము, లౌక్యము మొదలైన లక్షణాలు కలిగి ఉండవలెను.
ఈ విధముగా పైవిషయాలన్నీ నిర్వహించగల శక్తిమంతుడై వ్యాపారస్తుడు ఉన్నయెడల సొంత వ్యాపారానికి మించినది మరొకటి లేదు. అతడు స్వేచ్ఛగా, హాయిగా వ్యాపారము చేసుకుంటూ తాను సాధించదలచిన వ్యాపార విజయాన్ని, సంతృప్తిని పొందుతాడు.
ప్రశ్న 4.
ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపారం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రము ప్రకారము అమలులోనికి వచ్చినవి. హిందూ శాస్త్రములో రెండు వాదాలు ఉన్నవి.
- మితాక్షరవాదము,
- దయాభాగవాదము.
మితాక్షరవాదము, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు మినహాయించి మిగతా భారతదేశానికి వర్తిస్తుంది. దయాభాగవాదం పై రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వ్యాపార వ్యవస్థ హిందూ వారసత్వ చట్టం 1956లో నిర్వహించబడి నియంత్రించబడుతుంది.
అవిభక్త హిందూ కుటుంబము ఏవిధమైన ఒప్పందము వలన ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రములోని మితాక్షరవాదం వలన ఏర్పడినది. అవిభక్త హిందూ కుటుంబము సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. అంటే ఎటువంటి ఒప్పందము వలన కాక కుటుంబములో జన్మించడం వలన కుటుంబ వ్యాపారములో హక్కును పొందుతారు. వీరిని దాయాదులు అంటారు.
అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారమును కుటుంబ యజమాని నిర్వహించును. అతను సామాన్యముగా కుటుంబ సభ్యులలో పెద్దవాడై ఉంటాడు. అతనిని ‘కర్త’ లేదా ‘మేనేజర్’ అంటారు. కుటుంబ వ్యాపారము మీద అతనికి సంపూర్ణ అధికారము, నియంత్రణ ఉంటుంది. వ్యవహారములన్నీ అతడే నిర్వహించును. సమిష్టి ఆస్తికి, దాయాదుల సంక్షేమానికి కుటుంబ- కర్తయే పరిరక్షకుడు. కర్త ఋణబాధ్యత అపరిమితము కాని దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాకే పరిమితమై ఉంటుంది. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగటము ఇష్టము లేకపోతే కుటుంబము ఆస్తి పంపకమును కోరవలెను.
ముఖ్య లక్షణాలు:
1) స్థాపన: హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారానికి కనీసము ఇద్దరు సభ్యులు ఉండి పూర్వీకుల ఆస్తులుండాలి. ఇది ఒప్పందము మీద కాక హిందూ చట్టం ప్రకారము ఏర్పడుతుంది.
2) హిందూ చట్టం ప్రకారం నిర్వహణ: ఈ వ్యాపార వ్యవస్థ ఉమ్మడి యాజమాన్యంలో ఉంటుంది. ఇది హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం నిర్వహించబడి, నియంత్రించబడుతుంది.
3) సభ్యత్వము: సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారములో సభ్యత్వం కేవలము ఆ కుటుంబములో జన్మించడము వలన మాత్రమే కలుగుతుంది. బయట వ్యక్తులు ఒప్పందము వలన ఇందులో ప్రవేశించలేరు.
4) నిర్వహణ: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు మాత్రమే నిర్వహిస్తాడు. అతనిని కర్త అంటారు. మిగిలిన సభ్యులకు సంస్థ నిర్వహణలో పాల్గొనే హక్కు ఉండదు. కర్త తన ఇష్టానుసారము వ్యాపారాన్ని నిర్వహించడానికి అధికారము ఉన్నది. అతడి అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగడం ఇష్టము లేకపోతే అందరి ఒప్పందముతో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారాన్ని రద్దుచేయవచ్చు.
5) లాభనష్టాల పంపిణీ: వ్యాపార లాభాలలో దాయాదులందరికి సమాన వాటా ఉంటుంది.
6) ఋణబాధ్యత: దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాలకు మాత్రమే పరిమితము. కాని కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపార ఋణాలకు అతని సొంత ఆస్తులను కూడా ఉపయోగించవలెను.
7) మనుగడ: కుటుంబ సభ్యులలో ఎవరు మరణించినా వ్యాపార మనుగడకు అంతరాయము కలగదు. కర్త మరణించినపుడు, దాయాదులలో పెద్దవాడు కర్త స్థానాన్ని తీసుకుంటాడు. హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారము అందరి సభ్యుల అంగీకారముతో రద్దుకావచ్చు లేదా కోర్టు చేసిన పంపకాలతో రద్దు అవుతుంది.
8) ఖాతాలు: ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారానికి సంబంధించిన ఖాతాలన్నింటిని కర్త నిర్వహిస్తాడు. కానీ ఇది కర్త యొక్క బాధ్యత కాదు. కర్త సభ్యులెవ్వరికీ బాధ్యుడు కాడు. అదే విధంగా కుటుంబ సభ్యులెవ్వరూ వ్యాపారానికి సంబంధించిన లాభనష్టాల గురించి కర్తను అడగరాదు.
ప్రశ్న 5.
ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపార వ్యవస్థ ప్రయోజనాలను, లోపాలను తెలపండి.
జవాబు.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1) కేంద్రీకృత సమర్థవంతమైన నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటము వలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.
2) అవిచ్ఛిన్న మనుగడ: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. ఒకవేళ మరణించిన ఆ కుటుంబంలో వయసులో పెద్దవాడైన వ్యక్తి వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల అది నిరంతరము కొనసాగుతుంది.
3) అపరిమిత సభ్యత్వం: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో జన్మించడం ద్వారా సభ్యులు అవుతారు. మైనర్లు కూడా దీనిలో సభ్యులుగా ఉండవచ్చు.
4) మెరుగైన పరపతి సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క రుణబాధ్యత అపరిమితము.
5) శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.
6) వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.
7) సమర్థతను బట్టి పని అప్పగించుట కుటుంబ సభ్యులకు వారి సామర్ధ్యాన్ని బట్టి పనులు అప్పగించబడతాయి. కర్త సొమ్ము వినియోగములో జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తాడు.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క లోపాలు:
1) శ్రమకు, ప్రతిఫలానికి మధ్య ప్రత్యక్ష సంబంధము లేకపోవడం: వ్యాపారాన్ని కర్త ఒక్కడే నిర్వహిస్తాడు. కాని లాభాలు వచ్చినపుడు సభ్యులందరూ సమానముగా పంచుకుంటారు. దాయాదుల సోమరితనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
2) పరిమిత నిర్వహణా సామర్థ్యము: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు కర్త మాత్రమే నిర్వహిస్తాడు. నిర్వహణ విధులన్నీ అతనే చూసుకుంటాడు. వ్యాపార నైపుణ్యానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము అతనికి ఉండకపోవచ్చు.
3) సభ్యుల మధ్య అనుమానాలు: కర్త ఈ వ్యాపారాన్ని అత్యంత గోప్యముగా నిర్వహిస్తాడు. ముఖ్యమైన విషయాలను దాయాదుల నుంచి రహస్యముగా ఉంచుతాడు. దీని వలన కుటుంబ సభ్యులకు అతని మీద అనుమానం వచ్చే అవకాశము ఉన్నది.
4) పరిమిత మూలధనము ఆర్థిక వనరులు: ఇందులోని పెట్టుబడి ఒక కుటుంబ ఆర్థిక వనరులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యాపార విస్తృతికి సంబంధించిన నిధులు లభించకపోవచ్చు.
5)-కష్టం ఒకరిది, సుఖం ఇంకొకరిది: ఉమ్మడి కుటుంబ వ్యాపారములో కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వ్యాపారము కోసం అతడు కష్టించి కృషి చేస్తాడు. దాయాదులు కష్టపడకుండా అనుభవిస్తారు.
6) నిర్వహణను కర్తకు వదిలివేయడము: వ్యాపార నిర్వహణను పూర్తిగా కర్తకే వదిలివేయడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. తత్ఫలితముగా వ్యాపారము దెబ్బతినవచ్చు. కర్త చేసిన తప్పిదాలకు దాయాదులు కూడా బాధ్యతను వహించవలసి ఉంటుంది.
ప్రశ్న 6.
సహకార సంఘం అంటే ఏమిటి ? నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
సహకార సంఘం అర్థం:
1) “కో ఆపరేషన్” అనే పదం లాటిన్ భాషలోని ‘కో-ఆపరి’ అనే పదం నుంచి ఉద్భవించింది. “కో” అంటే “తో” అని, “ఆపరి” అంటే “పనిచేయడం” అని అర్థం. అందువల్ల కో-ఆపరేషన్ అంటే కలిసి పనిచేయడం. కాబట్టి ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో కలిసి పనిచేసే వ్యక్తుల సముదాయాన్ని “సహకార సంఘం”
అంటారు.
2) ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించుకునే నిమిత్తం స్వచ్చందంగా ఒక చోట చేరిన వ్యక్తుల సముదాయాన్ని సహకార సంఘం అంటారు. ఈ సంఘాలు స్వయం సహాయం, పరస్పర సహాయం అనే సూత్రాలపై పనిచేస్తాయి. సభ్యులకు సేవలు అందించడమే దీని ప్రాథమిక లక్ష్యం. “ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు” అనేది
సహకార సంఘాల నినాదం.
నిర్వచనం:
- భారత సహకార సంఘాల చట్టం, 1912 సెక్షన్ 4 ప్రకారం “సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయంతో స్థాపించిన సంస్థను “సహకార సంస్థ” అంటారు.
- హెచ్.సి. కెల్వర్ట్ నిర్వచనం ప్రకారం “సమాన హక్కుల ప్రాతిపదికన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే నిమిత్తం ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను సహకార వ్యవస్థ” అంటారు.
లక్షణాలు:
ఈ దిగువ తెలిపినవి సహకార సంఘాల ముఖ్యమైన లక్షణాలు
1) స్వచ్ఛంద సంఘం:-సభ్యులకు సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంఘమే సహకార సంస్థ. ఈ సహకార సంఘంలో ప్రవేశించడానికి, సంస్థ నుండి విరమించడానికి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలు కలిగిన వ్యక్తులు తమకు నచ్చినప్పుడు ఈ సంఘంలో సభ్యులుగా చేరవచ్చు. స్వచ్ఛంద సభ్యత్వం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య లక్షణం.
2) స్వేచ్ఛా సభ్యత్వం: ఒకే రకమైన ఆర్థిక ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా సహకారసంస్థలో సభ్యులుగా చేరవచ్చు. ఈ సంస్థలో కుల, మత, జాతి, రంగు, లింగ వివక్షతతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా సభ్యుడిగా చేరవచ్చు.
3) సభ్యుల సంఖ్య: సహకార సంఘంను ఏర్పాటు చేయడానికి కనీసం 10 మంది వ్యక్తులు అవసరం. బహుశ రాష్ట్ర సహకార సంఘాలలో ప్రతి రాష్ట్రం నుండి కనీసం 50 మందికి తగ్గకుండా సభ్యులు ఉండాలి. సహకార సంఘాల చట్టం, 1912 ప్రకారం సహకార సంఘంలో గరిష్ట సభ్యుల సంఖ్యకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే సంఘం స్థాపించిన తరువాత అందులోని సభ్యులు ఎంత మందికి మించకూడదో నిర్ణయిస్తారు.
4) సంఘం నమోదు: భారతదేశంలో సహకార సంఘాలను సహకార సంఘాల చట్టం, 1912 ప్రకారం గాని లేదా రాష్ట్ర సహకార సంఘాల చట్టం ప్రకారం గాని నమోదు చేయించాలి. బహుళ రాష్ట్ర సహకార సంఘాలను బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002 ప్రకారం నమోదు చేయించాలి. ఒకసారి నమోదైన తర్వాత ఈ క్రింది ప్రత్యేక న్యాయసత్వం, నిర్దిష్ట లక్షణాలను పొందుతుంది.
- సంఘం శాశ్వత మనుగడను అనుభవిస్తుంది.
- దీనికి ప్రత్యేక అధికార ముద్ర ఉంటుంది.
- ఇతర వ్యక్తులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు.
- ఇతరులపై కోర్టులో దావా వేయవచ్చు. ఇతరులు దీనిపై దావా వేయవచ్చు.
- తన పేరుపై సొంత ఆస్తులను కలిగి ఉండవచ్చు.
5) ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరైనందువల్ల ఈ సంఘాలను ప్రభుత్వం నియంత్రణ, పర్యవేక్షణ చేస్తుంది. సహకార శాఖ వారు ఈ సంఘాల పనితీరును పరిశీలిస్తారు. ప్రతి సహకార సంఘం తన ఖాతాలను ప్రభుత్వ సహకార శాఖ వారిచే తప్పకుండా ఆడిట్ చేయించాలి.
6) మూలధనం: సహకార సంఘానికి అవసరమైన మూలధనాన్ని సభ్యులు సమకూర్చుతారు. అయితే సభ్యులు అందించే మూలధనం పరిమితంగా ఉండడంవల్ల అప్పుడప్పుడు ఈ సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, శిఖరాగ్ర సంస్థల నుండి వచ్చే ఋణాలు, గ్రాంట్లపై ఆధారపడతాయి.
7) ప్రజాస్వామిక సూత్రాలపై నిర్వహణ: సహకార సంఘాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించబడతాయి. సంఘం నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుంది. అయితే, సమర్థవంతమైన నిర్వహణ కోసం సహకార సంఘం ఒక కమిటీని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికలలో సభ్యులు వారు తీసుకున్న వాటాలతో సంబంధం లేకుండా “ఒక వ్యక్తి ఒక ఓటు” అనే ప్రాతిపదికపై నిర్వహణ కమిటీని ఎన్నుకుంటారు. ఈ నిర్వహణ కమిటీ విధులను సంఘం సర్వసభ్య సమావేశంలో నిర్ణయిస్తారు.
8) సేవా లక్ష్యం: అన్ని సహకార సంఘాల ప్రాథమిక ధ్యేయం సభ్యులకు సేవలందించడం. ఇతర వ్యాపార సంస్థల మాదిరిగా లాభార్జన ఈ సంఘాల ధ్యేయం కాదు. ఈ సంఘం సభ్యులు కాని వారికి సేవలందించినప్పుడు నిర్వహణ ఖర్చులను చెల్లించడానికి నామమాత్రపు లాభాన్ని ఆర్జిస్తాయి.
9) ఒక వ్యక్తి, ఒక ఓటు: సహకార సంఘంలో ఒక వ్యక్తికి ఎన్ని వాటాలున్నప్పటికీ ఒక సభ్యునికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తి తన సంపద ద్వారా సంఘాన్ని ప్రభావితం చేయరాదు. సంఘ నిర్వహణలో అందరి సభ్యులకు సమాన హక్కు ఉంటుంది.
10) మిగులు పంపిణీ: సంఘం సభ్యులకు పరిమిత డివిడెండ్లను పంపిణీ చేయగా మిగిలిన లాభాలను కొంత మొత్తం బోనస్ రూపంలో సభ్యులకు పంపిణీ చేస్తుంది. మరి కొంత మొత్తాన్ని రిజర్వు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని సంఘం సంక్షేమానికి కేటాయిస్తుంది.
11) పెట్టుబడిపై రాబడి: సహకార సంస్థలోని మిగులు నుండి బోనస్ పంపిణీ చేసే ముందు, డివిడెండ్ల రూపంలో సభ్యులు తమ పెట్టుబడిపై రాబడి పొందే హక్కును కలిగి ఉంటారు. ఇది సహకార సంఘంలో సభ్యులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
12) నగదు వర్తకం: సహకార సంఘాల యొక్క అతి ముఖ్యమైన సూత్రం నగదుపై వర్తకం నిర్వహించడం. నగదు వర్తక సూత్రాన్ని ఖచ్చితంగా పాటించినప్పుడే సహకార సంఘాలు వర్ధిల్లుతాయి. ఈ నగదు వర్తకం రాని బాకీలు, వసూలు ఖర్చులను నివారించడంతో పాటు సహకార సంఘానికి ఆదాయంను చేకూరుస్తుంది.
ప్రశ్న 7.
“స్వయం – సహాయం అనే ప్రాతిపదికపై ఏర్పడిన వ్యవస్థే సహకార సంఘం” – చర్చించండి.
జవాబు.
సమాజములోని బలహీనవర్గాల ఆసక్తులను రక్షించుటకై సహకార ఉద్యమము ఏర్పడినది. సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, కంపెనీ వ్యాపారము చేసే సంస్థల ధ్యేయము లాభ సముపార్జనే లాభాన్ని సంపాదించడానికి ఈ సంస్థలు వినియోగదారులకు అందించే సేవలు చాలా పరిమితముగా ఉంటాయి. లాభార్జన దృష్టితో అవి ధరలను పెంచడము, కల్తీ సామానులు అమ్మడం మొదలైన హీనమైన చర్యలకు పాల్పడతాయి. సాంఘిక ప్రయోజనము బాధ్యతల కంటే తమ స్వప్రయోజనము, స్వలాభము సూత్రాలుగా ఉండేవి. పెట్టుబడిదారులు, శ్రామికులు, వినియోగదారులు దోపిడీచేస్తున్నారు. వస్తు పంపిణీలో మధ్యవర్తుల వలన ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య అగాధము ఏర్పడినది. లోపభూయిష్టమైన పెట్టుబడిదారీ విధానాన్ని సంస్కరించి సామ్యవాద రీతి సమాజ స్థాపనకై సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగినది.
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షరహితమైన పరస్పర సహాయము, సేవాశయము కొరకు పరిమిత నిధులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించటానికి సర్వమానవ సమానత్వ ప్రాతిపదికమీద ఏర్పరచిన స్వచ్ఛంద సంఘము సహకార సంస్థలు. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు, సమాజ సేవకు పాటుబడుటయే ఈ సంస్థల లక్ష్యము. దీని ప్రధాన ఆశయము లాభార్జనకాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరు అనేది దీని ఆశయం. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయం దీని మార్గదర్శక సూత్రము.
మన దేశములో సహకార సంస్థలను లాభాల కొరకు ఆకలిగొన్న వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి బలహీనవర్గాలవారి ఆసక్తులను రక్షించుటకు సహకార సంస్థలు ఏర్పడినవి.
ప్రశ్న 8.
సహకార సంఘాల ప్రయోజనాలను, లోపాలను వివరించండి.
జవాబు.
సహకార సంఘాల వలన ప్రయోజనాలు:
1) స్థాపనా సులభం: సహకార సంస్థలను స్థాపించుట సులభము. పదిమంది కలసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక సంస్థగా ఏర్పడవచ్చు. నమోదుచేయుటకు అవలంబించవలసిన చట్టబద్ధమైన లాంఛనాలు చాలా తక్కువ.
2) ప్రజాస్వామిక నిర్వహణ: సంస్థల నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునకు ఉంటుంది. ఒక మనిషికి ఒకే ఓటు. అతనికి ఎన్ని వాటాలు అయినా ఉండవచ్చు.
3) సేవాఉద్దేశం: సహకార సంస్థల ముఖ్య ఉద్దేశము సేవలను అందించుట. సభ్యులకు చౌక ధరలకు వస్తువులను అందజేస్తుంది. తక్కువ వడ్డీలకు ఋణాలను అందిస్తుంది. సభ్యుల మధ్య సహకార భావనను కలుగజేస్తుంది.
4) నిర్వహణ ఖర్చులు తక్కువ: సహకార సంస్థలలో పరిపాలన ఖర్చులు తక్కువ. పాలక మండలి సభ్యులు వేతనము తీసుకోకుండా నిర్వహణ పనులు చేపడతారు.
5) పరిమిత ఋణబాధ్యత: సభ్యుల ఋణబాధ్యత వారు చెల్లించిన వాటా మూలధనానికే పరిమితమై ఉంటుంది.
6) స్థిరత్వము: సభ్యుల మరణము, విరమణ లేదా దివాలా తీయడంవలన సంస్థ మనుగడకు భంగము కలగదు.
7) సామాజిక ప్రయోజనాలు: ఈ సంస్థలు ప్రజాస్వామ్యములో విద్య, శిక్షణ, స్వయం పరిపాలన, స్వయం సహాయం, పరస్పర సహాయము మొదలైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది.
8) పన్ను రాయితీలు: సహకార సంఘాల ఆదాయముపై కొంత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతే::శిక నమోదు రుసుములోను, స్టాంపు డ్యూటీలోను మినహాయింపు ఉంటుంది.
9) ప్రభుత్వ ప్రోత్సాహం. ప్రభుత్వము సహకార సంఘాలకు అప్పులు, గ్రాంట్ల రూపములో ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజములో ఆర్థికముగా, సాంఘికముగా వెనుకబడిన వర్గాలకు సహాయపడే ధ్యేయముతో ఈ సంఘాలకు ఉదారముగా ధన సహాయం అందిస్తుంది.
10) వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు: ఈ సంఘాలలో సభ్యుడు ఎప్పుడైనా వాటాలను కొనవచ్చు కాబట్టి వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు.
11) మధ్యవర్తులు తొలగింపు: సహకార సంస్థలు వస్తువులను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలుచేసి వాటిని వినియోగదారులకు అందజేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు.
12) వ్యాపారాలపై నియంత్రణ ఇతర వ్యాపారసంస్థలు అధిక ధరలతో వినియోగదారులను దోచుకుంటున్నప్పుడు, ఇవి తక్కువ ధరలకు వస్తువులను అందజేస్తుంది.
13) సభ్యుల మధ్య సుహృద్భావము: ఒకరి కోసము అందరూ, అందరి కోసం ఒకరు అనే సూత్రముపై సహకార సంఘాలు పని చేస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య సోదరభావం, సంఘీభావము పెంపొందిస్తాయి.
సహకార సంఘాల వలన లోపాలు:
1) అసమర్థ నిర్వహణ: పాలకవర్గ సభ్యులకు గౌరవ వేతనము మాత్రమే లభిస్తుంది. కాబట్టి వారు నిర్వహణలో పూర్తి ఆసక్తిని చూపరు. ఆదాయ వనరులు స్వల్పముగా ఉంటాయి. కాబట్టి సమర్థవంతులైన, వృత్తి నిపుణులైన నిర్వాహకులను నియమించుట కష్టము.
2) పరిమిత ఆర్థిక వనరులు: డివిడెండ్ల పరిమితి మరియు ఒక వ్యక్తికి ఒక ఓటు అనే సూత్రము వలన ధనవంతులు ఈ సంఘాలలో చేరడానికి ఇష్టపడరు. పరిమితమైన వనరుల వలన విస్తృతికి అవకాశముండదు.
3) సభ్యుల మధ్య ఐక్యమత్యం లేకపోవడం: సభ్యుల మధ్య మనస్పర్థలు, తగాదాల వలన సహకార సంస్థలు విఫలమవుతాయి.
4) కష్టపడేవారికి ప్రోత్సాహము ఉండదు: సంఘాలకు ఎక్కువ లాభాలు వచ్చినా వారి సేవలకు చెల్లింపు జరగదు కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నిర్వహణలో ఎక్కువ ఆసక్తిని చూపరు.
5) వాటాల బదిలీ ఉండదు: ఏ సభ్యుడు తన వాటాలను బదిలీచేయడానికి వీలులేదు కాని మూలధనాన్ని వాపసు తీసుకోవచ్చు.
6) కఠినమైన ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘముల చట్టములోని నియమ నిబంధనలను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించవలెను.
7) రహస్యాలు దాగవు: సంస్థ వ్యవహారాలు సభ్యులందరికి తెలుస్తాయి కాబట్టి వ్యాపార రహస్యాలు దాగవు.
8) రాజకీయాల జోక్యము: మేనేజ్మెంట్ కమిటీలో ప్రభుత్వము సభ్యులను నామినేట్ చేస్తుంది. ప్రతి ప్రభుత్వము తమ సొంతపార్టీ సభ్యులను ఈ సంఘాలకు పంపుతుంది.
9) పోటీతత్వము లేకపోవుట: సహకార సంస్థలకు పరిమిత వనరులు ఉండటము వలన పెద్ద సంస్థల పోటీని తట్టుకోలేవు. అవి భారీ ఉత్పత్తి ద్వారా ఓవర్హెడ్ ఖర్చులను తగ్గించుకోగలవు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సొంత వ్యాపారం లక్షణాలను వివరించండి.
జవాబు.
సొంత వ్యాపారం లక్షణాలు:
సొంత వ్యాపార సంస్థ ముఖ్యమైన లక్షణాలను క్రింద తెలపడమైంది.
1) వ్యక్తిగత శ్రద్ధ: సొంత వ్యాపారం, వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కలిగిన ఒక వ్యక్తి శ్రద్ధాసక్తులతో ప్రారంభిస్తాడు. అతను వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసి, అవసరమైన ఉత్పత్తి కారకాలను సమకూర్చుతాడు. వ్యాపారంలో వచ్చే లాభనష్టాలను తానే అనుభవిస్తాడు.
2) ఒకే యజమాని: సొంత వ్యాపార సంస్థలో ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. అన్ని వనరులను తానే సమకూర్చుకొని, తన కోసం వ్యాపారాన్ని ప్రారంభించి, తానే వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాడు.
3) చట్టపరమైన లాంఛనాలు తక్కువ: సొంత వ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టపరమైన లాంఛనాలు చాలా తక్కువ. అందువల్ల దీనిని స్థాపించడం, రద్దు చేయడం చాలా సులభం.
4) అపరిమిత ఋణ బాధ్యత: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన లక్షణం సొంత వ్యాపారి యొక్క ఋణ బాధ్యత అపరిమితం. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే, వ్యాపార అప్పులను చెల్లించడానికి సంస్థ ఆస్తులు సరిపోనట్లయితే, సొంత వ్యాపారి తన వ్యక్తిగత అస్తులను అమ్మి వ్యాపార అప్పులను చెల్లించవలసి ఉంటుంది.
5) యాజమాన్యం, నిర్వహణ రెండూ ఒక్కటే: సొంత వ్యాపారంలో యజమాని, నిర్వాహకుడు ఒక్కడే. యజమాని అయిన సొంత వ్యాపారి తన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని తన వ్యాపార నిర్వహణకు ఉపయోగిస్తాడు. యజమాని మరణించిన, దివాలా తీసిన సొంత వ్యాపారం మూతపడుతుంది.
6) వ్యక్తిగత ప్రేరణ: సొంత వ్యాపారి కష్టానికి మరియు ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. తాను ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది సొంత వ్యాపారి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
ప్రశ్న 2.
సొంత వ్యాపారం లోపాలు / పరిమితులను తెలపండి.
జవాబు.
సొంత వ్యాపారము పరిమితులు:
1) పరిమిత వనరులు: సొంత వ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకు నలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.
2) అరుణబాధ్యత: సొంత వ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.
3) పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.
4) అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.
5) భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంత వ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.
6) తప్పుడు నిర్ణయాలు: వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. సొంత వ్యాపారి వివిధ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పరిజ్ఞానం కోసం నిపుణులను సంప్రదించడు. అందువల్ల సొంత వ్యాపారి తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఇది నష్టాలకు దారితీయవచ్చు.
ప్రశ్న 3.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం లక్షణాలను రాయండి.
జవాబు.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1) కేంద్రీకృత సమర్థవంతమైన నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటము వలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.
2) అవిచ్ఛిన్న మనుగడ: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. ఒకవేళ మరణించిన ఆ కుటుంబంలో వయసులో పెద్దవాడైన వ్యక్తి వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల అది నిరంతరము కొనసాగుతుంది.
3) అపరిమిత సభ్యత్వం: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో జన్మించడం ద్వారా సభ్యులు అవుతారు. మైనర్లు కూడా దీనిలో సభ్యులుగా ఉండవచ్చు.
4) మెరుగైన పరపతి సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క రుణబాధ్యత అపరిమితము.
5) శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.
6) వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.
ప్రశ్న 4.
సహకార సంఘాల లక్షణాలను వివరించండి.
జవాబు.
1) ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని పరస్పర సహాయము, సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకే సమానత్వ ప్రాతిపదిక ర్పడిన స్వచ్చంద సంఘము సహకార సంఘము.
2) 1912 సహకార సంఘాల చట్టము ప్రకారము ‘సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంస్థ’ అంటారు.
లక్షణాలు:
1) స్వచ్ఛంద సంఘము: ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రజలు తమంతట తాముగా స్వప్రయోజనాల కోసము ఏర్పాటు చేసుకున్న సంఘమే సహకార సంస్థ. ఈ సంస్థలో చేరడానికిగాని, వదిలివెళ్ళడానికి సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
2) బహిరంగ సభ్యత్వము: సహకార సంఘములో చేరడానికి కులము, మతము, జాతి, రాజకీయ సిద్ధాంతాలు, విశ్వాసాలు మొదలైన వాటితో సంబంధము లేదు. సభ్యత్వము అందరికీ లభిస్తుంది.
3) సభ్యుల సంఖ్య: సహకార సంస్థలను స్థాపించడానికి 10 మంది సభ్యులు కావలెను. రాష్ట్ర సహకార సంఘాలలో వ్యక్తులు 50 మంది కావలెను. గరిష్ట సభ్యులకు పరిమితి లేదు.
4) ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉంటాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ప్రతి సంవత్సరము వార్షిక నివేదికలను, లెక్కలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించవలెను. సహకార శాఖ ఆడిటర్ వీటిని తనిఖీ చేస్తాడు.
5) మూలధనము: సంఘాల మూలధనమును సభ్యులే సమకూరుస్తారు. మూలధనము పరిమితముగా ఉండటము వలన ప్రభుత్వము నుంచి ఋణాలు, రాష్ట్ర, కేంద్ర సహకార
సంస్థల నుంచి గ్రాంట్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహయాన్ని పొందుతాయి.
6) ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ: ఈ సంస్థ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలమీద జరుగుతుంది. ప్రతి సభ్యునికి సంఘ నిర్వహణలో పాల్గొనే అవకాశము ఉంటుంది. సంఘములోని సభ్యులందరికి ఓటు హక్కు సమానము. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది..
7) సేవాశయము: సహకార సంస్థల ప్రధాన ధ్యేయము సభ్యులకు సేవచేయుటయే, లాభార్జన కాదు.
8) పెట్టుబడిపై రాబడి: సభ్యులకు తమ పెట్టుబడులపై డివిడెండు లభిస్తుంది.
9) మిగులు పంపిణీ: సహకార సంస్థలు వ్యాపారము చేయగా వచ్చిన మిగులు నుంచి కొంత మొత్తాన్ని విరాళాలకు (విద్య, వైద్యం మొదలైనవి) మరికొంత మొత్తాన్ని రిజర్వు నిధులకు కేటాయించి, మిగిలిన దానిని సభ్యులకు పరిమితమైన లాభాంశాలుగా పంచుతారు.
10) సహకార సంస్థల నమోదు: సహకార సంస్థను సహకార సంఘాల చట్టము 1912 క్రింద నమోదు చేయించవలెను. అప్పుడు దానికి కంపెనీ హోదా వస్తుంది. దాని వలన సంస్థకు న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన న్యాయసత్వము కలుగుతుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపార వ్యవస్థ అంటే ఏమిటి ?
జవాబు.
1) అర్థం:
లాభాలను ఆర్జించే ఉద్దేశంతో వనరులను సమీకరించి, వాటిని ఒక క్రమపద్ధతిలో ఉపయోగించి, నియంత్రించి, సమన్వయ పరిచే వ్యవస్థను వ్యాపార సంస్థగా చెప్పవచ్చు.
2) నిర్వచనం:
వీలర్ (Wheeler) ప్రకారం వ్యాపార సంస్థ అంటే “కొనుగోలు, అమ్మకాలు జరిపే ఉద్దేశంతో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమాదాయం చేత స్థాపించబడి, ప్రత్యేక నిర్వహణ విధానాల ప్రకారం నిర్వహింపబడే ఒక సంస్థ, కంపెనీ లేదా వ్యవస్థ”.
3) స్వరూపాలు:
వ్యాపార సంస్థ స్వరూపం ఆ సంస్థకు కావలసిన మూలధనం, నిర్వహణ సామర్థ్యం, సంస్థ పరిమాణం, ఋణ బాధ్యత నష్టభయం, కాలపరిమితి మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థను ఒక వ్యక్తియే స్థాపించి, నిర్వహించవచ్చు (సొంత వ్యాపారం) లేదా వ్యక్తుల సముదాయం స్థాపించి, నిర్వహించవచ్చు (భాగస్వామ్యం) లేదా కుటుంబ సభ్యులు నిర్వహించవచ్చు (ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం) లేదా కంపెనీ రూపంలోనైనా నిర్వహించవచ్చు.
ప్రశ్న 2.
సొంత వ్యాపారాన్ని నిర్వచించండి.
జవాబు.
1) ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. దీనినే వ్యక్తిగత వ్యాపారం లేదా ఏక వ్యక్తి సంస్థ అంటారు.
2) వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు అతడే చేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహిస్తాడు.
3) లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టమువస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగరూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.
ప్రశ్న 3.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారము అంటే ఏమిటి ?
జవాబు.
- కుటుంబంలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ కొనసాగే వ్యాపారాన్ని ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటారు.
- ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కనిపించే ఒక విశిష్ట వ్యాపార వ్యవస్థ. ఈ వ్యాపారం ఉమ్మడి కుటుంబానికి లోబడి ఉంటుంది.
- కుటుంబ పెద్దనే వ్యాపార పెద్దగా కొనసాగుతాడు. ఇతనినే ‘కర్త’ అని, మిగతా సభ్యులను ‘సహవారసులు’
అంటారు.
ప్రశ్న 4.
సహకార సంఘంను నిర్వచించండి.
జవాబు.
- ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని, పరస్పర సహాయము సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకు సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము సహకార సంఘము.
- 1912 సహకార సంఘాల చట్టం ప్రకారము సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంఘము అంటారు.
అదనపు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వివిధ రకాల సహకార సంఘాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు.
ప్రజల అవసరాల ప్రకారము భారతదేశములో వివిధ రకాల సహకార సంఘాలను స్థాపించడం జరిగినది. అవి దిగువ పేర్కొనబడినవి.
1) వినియోగదారుల సహకార సంఘాలు: నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే నిమిత్తము వినియోగదారులు ఈ రకమైన సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు. ఈ సంఘాలు నేరుగా వస్తువులను టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తములో తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో ఈ సంఘ సభ్యులకు విక్రయించడం జరుగుతుంది. సభ్యులు కానివారికి ఎక్కువ ధరకు అమ్మి ఆ విధముగా వచ్చిన లాభాలను సభ్యుల సంక్షేమం కోసం కొంత ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని డివిడెండ్ల రూపములో సభ్యులకు పంచడం జరుగుతుంది.
2) ఉత్పత్తిదారుల సహకార సంఘాలు చిన్న ఉత్పత్తిదారులు, చేతివృత్తులవారు, ముడిపదార్థాలు, పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఉత్పత్తిదారులకు, చేతివృత్తుల వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఈ సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు.
3) మార్కెటింగ్ సహకార సంఘాలు: తాము ఉత్పత్తిచేసిన వస్తువులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే నిమిత్తము చిన్న ఉత్పత్తిదారులు స్వచ్ఛందముగా ఏర్పాటుచేసుకున్న సంఘాలే మార్కెటింగ్ సహకార సంఘాలు. ఇవి మార్కెటింగ్ చేయడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చిన్న ఉత్పత్తిదారులకు సహాయపడతాయి.
4) గృహ నిర్మాణ సహకార సంఘాలు: అల్పాదాయవర్గ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణముగా సొంతముగా ఇళ్ళు నిర్మించుకోలేని వారికి ఈ సంఘాలు వారి సభ్యులకు ప్రభుత్వము ద్వారా స్థలము పొందడానికి, ప్లాట్లుగా ఇవ్వడానికి ఋణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీర్ఘకాలానికి సులభ వాయిదాలలో నిర్మాణ వ్యయాన్ని సభ్యులు చెల్లిస్తారు. కొంతకాలము తరువాత సభ్యులు వారి ఇంటికి సొంతదారులు / యజమానులు అవుతారు.
5) వ్యవసాయ సహకార సంఘాలు: శాస్త్రీయపద్ధతిలో వ్యవసాయము క్షేస్తూ భారీ వ్యవసాయ ప్రయోజనాలను పొందడానికి చిన్న వ్యవసాయదారులు స్వచ్ఛందంగా కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘాలే వ్యవసాయ సహకార సంఘాలు. ఈ సంఘాలు వ్యవసాయదారులకు ట్రాక్టర్లు, ఖరీదైన ‘ ఎంత్రాలను అద్దెకు అందజేస్తుంది. నీటి సరఫరా, ఎరువులు, విత్తనాల సరఫరా మొదలైన వసతులను సమక్ష. ‘రుస్తుంది.
6) సహకార పరపతి సంఘాలు: ఆర్థిక సమస్యలు ఉన్న రైతులు, చేతి వృత్తులవారు, కార్మికులు, ఉద్యోగులు వీటిని స్థాపిస్తారు. ఈ సంఘాలు సభ్యుల నుంచి పొదుపు మొత్తాలను సేకరించి, అవసరము ఉన్న సభ్యులకు తక్కువ వడ్డీ రేట్లకు ఋణాలు అందిస్తాయి. ఇచ్చిన ఋణాన్ని సభ్యుల నుంచి సులభ వాయిదాలలో తిరిగి వసూలు చేసుకుంటాయి.
ప్రశ్న 2.
కర్త.
జవాబు.
- హిందూ అవిభక్త కుటుంబములో పెద్దవాడిని కర్త లేదా మేనేజరు అంటారు.
- వ్యాపార నిర్వహణ అంతా అతని చేతుల మీదగానే జరుగుతుంది. వ్యాపారము మీద అతని సంపూర్ణ అధికారాలు ఉంటాయి.
- అతని అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.
ప్రశ్న 3.
సహవారసులు.
జవాబు.
- కర్త కాకుండా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ సభ్యులందరిని సహవారసులుగా పిలుస్తారు.
- సంస్థ లాభాలను వీరు సమానముగా పంచుకుంటారు. వీరి ఋణబాధ్యత వారి వాటాల మేరకు పరిమితము.
ప్రశ్న 4.
దయాభాగ.
జవాబు.
- దయాభాగము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వాదనలోని నిబంధనల మితాక్షరవాదం వలె ఉంటాయి.
- ఈ వాదన ప్రకారము దాయాదులకు ఆస్తిపై గల హక్కు వారసత్వము ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి హిందూ అవిభక్త కుటుంబములోని వాటా సభ్యుల మరణము, జననం వలన మార్పురాదు.
ప్రశ్న 5.
మితాక్షర.
జవాబు.
- ఈ వాదము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తప్ప మిగిలిన భారతదేశమంతా వర్తిస్తుంది.
- అవిభక్త హిందూ కుటుంబ సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. పుట్టుక ద్వారా సభ్యునకు ఆస్తిలో వాటా వస్తుంది. ఈ హక్కు అతని / ఆమె మరణము వరకు ఉంటుంది. కాబట్టి ఆస్తిలో వాటా దాయాదుల సంఖ్యను బట్టి మారుతుంది. అనగా జీవించి ఉన్న సభ్యులకే ఆస్తిహక్కు ఉంటుంది.
- భర్త పోయిన స్త్రీకి ఆస్తిహక్కు ఉండదు. కాని మనోవర్తి క్రింద కొంత మొత్తాన్ని అడగవచ్చు.