Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
MSME లను నిర్వచించి, వాటి ఆవశ్యకతను వివరించండి.
జవాబు.
MSME ల నిర్వచనం: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి (MSMED) చట్టము, 2006 ప్రకారము MSME లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును.
- ఉత్పత్తి సంస్థలు
- సేవా సంస్థలు
1. ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
MSMEల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచింపబడినవి.
- సూక్ష్మ సంస్థ (Micro enterprise): యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థను సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ (Small enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ (Medium enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
2. సేవా సంస్థలు: సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.
- సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలు మీంచకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్లకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
MSMEల ఆవశ్యకత: సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ సంస్థలు సమాజంలోని బడుగు బలహీన ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. MSME లు మనదేశంలో ఔత్సాహిక వ్యవస్థాపకులను, చిన్న వ్యాపారులను ప్రోత్సహించి, వినూత్నమైన వస్తువులను తయారు చేయుటకు ప్రోత్సహిస్తున్నాయి.
- MSMEలు మొత్తం భారతదేశ ఉత్పత్తులలో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి.
- భారతదేశములోని 40% ఎగుమతులు MSME ల ద్వారా జరుగుతున్నవి.
- భారతదేశములో దాదాపుగా 40% వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు MSMEల ద్వారా కల్పించబడుతున్నవి.
- భారతదేశములోని 90% MSMEలు చట్టం ప్రకారము నమోదు అవసరము లేని సంస్థలే. (వీటిలో 80% వరకు సొంతవ్యాపార సంస్థలే)
- భవిష్యత్ వ్యాపారవేత్తలకు MSME లు వారి పెట్టుబడిస్థాయి ఆధారముగా, వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నవి.
- MSME లు భారతదేశములో వెంచర్ మూలధనము వ్యాపారము కోసము, విదేశీ కంపెనీలకు మంచి మార్కెట్ను కల్పిస్తున్నవి.
- MSME లు మన స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు 8% వాటాను కలిగి ఉంది.
- MSME లు సంప్రదాయ పరిశ్రమల నుండి చాలా అత్యాధునిక పరిశ్రమల వరకు 8000 లకు పైగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రశ్న 2.
భారతదేశంలో MSME లు ఎదుర్కొనే సమస్యలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఎదుర్కొనే సమస్యలు: భారతదేశంలోని MSME లు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిలో చాలావరకు నియంత్రించగల సమస్యలు మరికొన్ని సమస్యలు నియంత్రించడానికి వీలు లేనివి. మన దేశంలోని MSME లు ఎదుర్కొంటున్న సమస్యలను క్రింద చర్చించడం
జరిగింది. అవి:
1. బాంకుల నుండి తగినంత ఋణ సదుపాయం లేకపోవడం: బాంకులు MSME లకు తగినంత ఋణాలు మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఋణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ ఋణాల మంజూరుకు చాలా సమయం పడుతోంది. అలాగే MSME ల వ్యవస్థాపకులు చాలా రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బాంకులు ఈ సంస్థలు నడవడానికి సరిపడే మొత్తం మూలధనాన్ని సమకూర్చలేక పోతున్నాయి.
2. బహుళ జాతి సంస్థల నుండి పోటీ: ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి కార్యకలాపాలు చేపడుతూ వినియోగదారులకు వస్తువులను చాలా తక్కువ ధరలకు అందజేస్తున్న బహుళ జాతి సంస్థల నుండి ఈ MSME లు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ బహుళ జాతి సంస్థల నుండి పోటీని తట్టుకోవడం MSME -లకు చాలా ఇబ్బందిగా మారుతుంది.
3. తక్కువ అవస్థాపన (Infrastructure) సదుపాయాలు MSME లు చాలా వృద్ధి చెందుతున్నప్పటికీ వీటి స్థాపనకు మరియు నిర్వహణకు అవసరమయిన వసతులు / సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువ వసతులతో MSME లు తమ ఉత్పాదకతను ఎక్కువ సామర్థ్యంమేరకు పెంచలేకపోతున్నాయి, తద్వారా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా అవుతుంది.
4. అందుబాటులో లేని ముడిసరుకు మరియు ఇతర కారకాలు: MSME లను స్థాపించడానికి, అవసరమైన ముడిసరుకు నైపుణ్యం గల కార్మిక శక్తి మరియు ఇతర కారకాలు అవసరమైనంతగా మార్కెట్లో అందుబాటులో లేకపోవడం ఒక సమస్యగా ఉంది. ఈ కారకాలు తగినంతగా లేకపోవడం వలన తమ వస్తువులను సరసమైన ధరలకు అందచేయలేకపోతున్నాయి.
5. ఆధునిక సాంకేతికత లేకపోవడం: MSME ల వ్యవస్థాపకులకు ఆధునిక సాంకేతికతపై సరియైన పరిజ్ఞానము లేకపోవడం మరియు ఈ సంస్థలు పాత పద్ధతిలో ఉత్పత్తి విధానాలను అవలంభించడం ఒక సమస్యగా పరిగణించవచ్చు.
6. మార్కెటింగ్ మరియు పంపిణీ మార్గాలు సరిగా లేకపోవడం: MSME లు వినూత్నమైన, ఆధునిక పంపిణీ మార్గాలను అవలంభించలేకపోతున్నాయి. తద్వారా వీటి యొక్క వ్యాపార ప్రకటనలు మరియు అమ్మకాల ప్రోత్సాహకాలు, బహుళ జాతి సంస్థలతో పోల్చినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనమైన వ్యాపార ప్రకటనలు మరియు మార్కెటింగ్ మార్గాల వల్ల అమ్మకాలలో వృద్ధిని సాధించలేకపోతున్నాయి. తద్వారా లాభాలను పెంచుకోలేకపోతున్నాయి.
7. శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం: MSME లు సరియైన శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను తగినంతగా చేపట్టలేకపోతున్నాయి. వీటి వ్యవస్థాపకులు వినూత్న ఉత్పత్తి విధానాలను అవలంభించలేకపోతున్నారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని అన్ని సంస్థలకు చేరటం లేదు.
ప్రశ్న 3.
భారతదేశంలో MSME లకు అందించే వివిధ సదుపాయాలను చర్చించండి.
జవాబు.
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు కల్పించే సదుపాయాలు: ఇతర సంస్థలతో పోల్చినప్పుడు MSME లు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను, ప్రయోజనాలను పొందుతున్నాయి. MSMED చట్టం ఈ క్రింద పేర్కొనబడిన సదుపాయాలను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు కల్పిస్తుంది.
1. MSME లు కొన్ని ప్రత్యేక ఉత్పత్తులను చేపట్టడం: MSME లు కొన్ని ప్రత్యేక తరహా వస్తువులను తయారు చేసుకోవడానికి సౌలభ్యం ఉంది. కొన్ని ఉత్పత్తులను MSME లు మాత్రమే చేపట్టే రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ సంస్థలకు కల్పించింది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం దృష్ట్యా మరియు ఈ సంస్థలను పరిరక్షించుకొనుట కొరకై కొన్ని రకాల వస్తువులను ఈ సంస్థలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రభుత్వం దాదాపుగా 350 వస్తువులను MSME ల ద్వారా మాత్రమే కొనుగోలు చేసే విధానాన్నీ అమలులోకి తీసుకురావడం జరిగింది.
2. స్థలం కేటాయింపు: MSME లను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల (Special Economic Zones) లో చిన్న తరహా పరిశ్రమలకు 10 శాతం స్థలాన్ని తప్పనిసరిగా కేటాయించే నిబంధన అమలు చేయుట జరిగింది.
3. వస్తుసేవలకు తగిన సమయంలోపల చెల్లింపులు జరుగుట: కొనుగోలుదారులు ఒక నిర్ణీత సమయం లోపల MSME లకు చెల్లింపులను చేయవలననే నిబంధన MSMED చట్టంలో రూపొందించబడింది. ఈ నిబంధన ద్వారా కొనుగోలుదారులు తమ సప్లయర్స్కి నిర్ణీత సమయం లోపల చెల్లింపులు జరపాలి.
4. ప్రభుత్వం నుండి గట్టి మద్దతు మరియు ప్రోత్సాహము: ప్రభుత్వం ప్రాధాన్యతా ఋణాలు ఇవ్వడంలోనూ మరియు ప్రాధాన్యతా కొనుగోలు విధానం అవలంభించడం ద్వారా MSME లకు మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రభుత్వం ఈ సంస్థలకు ఋణాలు అందచేయడంలోనూ, మార్కెటింగ్ సహాయము అందించడంలోనూ, సాంకేతిక సలహాలు ఇవ్వడంలోనూ, శిక్షణ మరియు నైపుణ్య వృద్ధిని అందించడంలోనూ ప్రోత్సాహకాలు ఇస్తూ MSME లను ప్రోత్సహిస్తున్నాయి.
5. చెల్లింపులో ఆలస్యానికి కొనుగోలుదారు నుండి వడ్డీ: ఒకవేళ కొనుగోలుదారులు సకాలంలో తాము కొన్న వస్తు సేవలపై సొమ్ము చెల్లించలేనప్పుడు ఆలస్యమైన కాలానికి MSME లకు వడ్డీ చెల్లించే సదుపాయాన్ని ఈ చట్టం ద్వారా అందించారు. ఆలస్యమైన కాలానికి చెల్లించవలసిన మొత్తంపై బాంకు వడ్డీకి మూడు రెట్లుగా నెలవారీగా సమ్మేళనం చేసి ఈ వడ్డీని చెల్లించవలెను.
6. వివాదాల సూచన: MSME లు వస్తు, సేవలు అందించినందుకు చెల్లించవలసిన మొత్తాల పైగానీ, వాటిపై వడ్డీకి సంబంధించి గానీ ఇంకా ఎలాంటి వివాదాలకు సంబంధించిన ఏ అంశమైనా కానీ సూక్ష్మ, చిన్నతరహా సంస్థల సులభ మండలికి రాజీ నిమిత్తము నివేదించవచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
MSME ల చట్టం 2006 ప్రకారం ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు.
ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన సరుకుగా మార్చి, వాటి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలు అని చెప్పవచ్చును.
MSME ల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచించబడినది.
- సూక్ష్మ సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థలను సూక్ష్మ సంస్థలు అంటారు.
- చిన్నతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే, దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 2.
MSME ల చట్టం, 2006 ప్రకారం సేవాసంస్థలను నిర్వచించండి.
జవాబు.
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.
- సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 3.
MSME ల నమోదు ప్రక్రియ గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు.
MSMED చట్టం ప్రకారం MSME ల నమోదుకు కావలసిన అంశములు:
- ఏ వ్యక్తి అయినా ఇష్టానుసారము సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థను స్థాపించవచ్చు.
- ఇష్టానుసారము సేవలను అందించడానికి లేదా సేవలు చేయడం కోసం మధ్యతరహా సంస్థను స్థాపించవచ్చు.
- వస్తు ఉత్పత్తి కోసము లేదా తయారీ కోసం మధ్యతరహా సంస్థను స్థాపించడానికి పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1951లోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధముగా అనుసరించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నియమావళి పత్రాన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన లేదా సూచించిన అధికారి వద్ద నమోదు కోసం దాఖలు చేయాలి.
ప్రశ్న 4.
భారతదేశంలో MSME లకు అందించే ప్రోత్సాహక చర్యలను వివరించండి.
జవాబు.
MSME చట్టములో పొందుపరిచిన ధ్యేయాలకు అనుగుణముగా MSME ల చట్టము ఈ క్రింద పేర్కొనబడిన సదుపాయాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు కల్పిస్తుంది.
1. వస్తు, సేవల మొత్తాన్ని సకాలములో చెల్లించడానికి కొనుగోలుదారు బాధ్యత: MSME చట్టములోని సెక్షన్, 15 ప్రకారము ఈ సంస్థలు తమ వస్తుసేవల అమ్మకాలకు సంబంధించి, తమకు రావలసిన వసూళ్ళు సకాలములో రావడానికి తోడ్పడుతుంది. కొనుగోలుదారుడు తాను కొన్న వస్తు, సేవల విలువకు సరైన మొత్తాన్ని అమ్మకపుదారుకు నిర్ణీత సమయములో చెల్లించవలసిన బాధ్యతను తెలియజేస్తుంది.
ఎ) వ్రాతపూర్వక ఒప్పందము ఉన్నప్పుడు: వ్రాతపూర్వక ఒప్పందములో సూచించిన తేదీకిగాని, అంతకు ముందు తేదీకిగాని చెల్లింపు జరగాలి. ఎలాంటి పరిస్థితులలోను ఒప్పందములో తెలిపిన తేదీకంటే 45 రోజులు మించకుండా
ఉండాలి.
బి) ఒప్పందము లేనప్పుడు: అమ్మకపుదారుకు, కొనుగోలుదారుకు మధ్య ఎలాంటి ఒప్పందము లేకపోతే, నిర్ణయించిన తేదీలోపు అంటే వ్యవహారము జరిగిన 15 రోజులలోపు చెల్లించాలి.
కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు, ఒప్పందము తేది పదాలను చట్టములో దిగువ విధముగా నిర్వచింపబడినవి. అమ్మకపుదారు నుంచి ప్రతిఫలము నిమిత్తము, ఎవరైతే వస్తువులను కొనుగోలు చేస్తారో లేదా సేవలను పొందుతారో వారిని కొనుగోలుదారు అంటారు.
అమ్మకపుదారు అంటే సూక్ష్మ లేదా చిన్న తరహా సంస్థ.
ఒప్పందము తేదీ అంటే వస్తువులు బదిలీ జరిగిన తేదీ లేదా సేవలను అందించిన రోజు.
2. ఆలస్య కాలానికి కొనుగోలుదారు ద్వారా వడ్డీ చెల్లింపు: ఏదైనా కారణాల వలన కొనుగోలుదారు తాను చెల్లించవలసిన మొత్తాన్ని సకాలములో చెల్లించకపోతే, అతడు ఆ మొత్తానికి వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ వడ్డీ సాధారణ బ్యాంకు వడ్డీకి మూడు రెట్లుగా చెల్లించాలి. నెలవారీ మొత్తముగా బాకీ ఉన్న మొత్తముపై వడ్డీని చెల్లించాలి.
3. తగాదాల నివేదన: వస్తుసేవల కోసం చెల్లించవలసిన మొత్తానికి, వడ్డీకి సంబంధించి ఏమైనా తగాదాలు ఉంటే వాటిని సూక్ష్మ, చిన్న సంస్థల మార్గదర్శిక మండలికి సూచించవచ్చు. ఈ మండలి తగిన విచారణచేసి, న్యాయం చేకూరుస్తుంది.
MSME లకు అవసరమైన ప్రోత్సాహక చర్యలు: MSME రంగం ప్రోత్సాహకానికి, అభివృద్ధికి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు దిగువ సూచించిన చర్యలను చేపట్టినవి.
- ఉద్యోగులలో, నిర్వాహకులలో, వ్యవస్థాపకులలో నైపుణ్యాల వృద్ధికి చర్యలు, సాంకేతిక అభివృద్ధికి ఏర్పాట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు లేదా అవస్థాపనా సౌకర్యాలు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల సముదాయాల అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు చేపడతాయి.
- ఈ సంస్థలకు కాలానుగుణముగా, అవసరమైన ఋణసదుపాయాలను అందించడం, సంస్థలు ఖాయిలాపడటానికి అవకాశాలు తగ్గించడం తద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడం లాంటి చర్యలు చేపడతాయి.
- ప్రభుత్వము, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు MSMEల ఉత్పత్తులను, సేవలను వాటి ప్రాధాన్యము ఆధారముగా సేకరిస్తాయి.
- ఈ సంస్థల ప్రోత్సాహకానికి, అభివృద్ధికి కావలసిన ప్రత్యేక నిధులను ఏర్పరచడం లేదా ప్రభుత్వ నిధులను సమకూర్చడం వంటి చర్యలు చేపడతాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సూక్ష్మ సంస్థ అంటే ఏమిటి ?
జవాబు.
- ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
- సేవా సంస్థలు అయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
ప్రశ్న 2.
చిన్న తరహా సంస్థను నిర్వచించండి.
జవాబు.
- ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
- సేవాసంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 3.
మధ్యతరహా సంస్థను నిర్వచించండి.
జవాబు.
- ఉత్పత్తి సంస్థలయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
- సేవాసంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 4.
ఉత్పత్తి సంస్థను నిర్వచించండి.
జవాబు.
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
ప్రశ్న 5.
సేవా సంస్థ అంటే ఏమిటి ?
జవాబు.
- సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు.
- సేవాసంస్థలను పరికరాలలో పెట్టుబడిని బట్టి సూక్ష్మ సేవాసంస్థలు, చిన్నతరహా సేవాసంస్థలు మరియు మధ్య తరహా సేవా సంస్థలుగా విభజించవచ్చు.