Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 7th Lesson భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 7th Lesson భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం. అధికారాలు, విధులపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఎన్నికల సంఘం నిర్మాణం :
రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం ‘ఎన్నికల సంఘం’ ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాఆనుగుణంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనల కనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.
అధికారాలు విధులు :
భారత ఎన్నికల సంఘం విస్తృతమైన అధికారాలను కలిగి, విదులను నిర్వహిస్తుంది.
- ఎన్నికల సంఘం భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు నిచ్చి, రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉపప్రాంతీయ పార్టీలుగా వర్గీకరిస్తుంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయిస్తుంది.
- ఎన్నికల నిర్వహణకై ఓటర్ల జాబితాలు రూపొందిస్తుంది. 18 సంవత్సరాలు వయస్సు నిండిన పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేసుకుంటుంది. ఓటర్ల జాబితాకు మార్పులు చేర్పులు చేస్తుంది.
- సముచిత తేదీలతో ఎన్నికల షెడ్యూళ్ళను ప్రకటిస్తుంది. (సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికలు రెండింటినీ ప్రకటిస్తుంది).
- ఎన్నికలలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికలు ప్రవర్తన నియమావళిని రూపొందిస్తుంది.
- దేశంలో ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంది. ఇతర పరిపాలన శాఖలు, విభాగాల సహాయంతో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తుంది.
- ఎన్నికల సమయంలో హింస, రిగ్గింగు వంటి అక్రమాలు జరిగినప్పుడు ఎన్నికలను రద్దు చేయడం లేదా వాయితా వేయడం చేస్తుంది.
- పార్లమెంటు సభ్యులు లేదా రాష్ట్ర శాసన సభ్యుల అనర్హతలకు సంబంధించి భారత రాష్ట్రపతికి లేదా సంబంధిత రాష్ట్ర గవర్నర్కు సలహాలు, సూచనలు చేస్తుంది.
- ఎన్నికల సంఘం భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు, రాష్ట్రశాసన మండలి మొదలైన వాటికి సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. అంతేకాక, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది.
- ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ఎన్నికల ట్రిబ్యునళ్ళను నియమిస్తుంది. రాజకీయ పార్టీలకు గుర్తింపు, ఎన్నికల చిహ్నాల కేటాయింపు, ఎన్నికల వివాదాలు తదితర అంశాల్లో వివిదాలను పరిష్కరించడానికో ఒక న్యాయస్థానం వలె పనిచేస్తుంది.
ప్రశ్న 2.
భారత రాజకీయ పార్టీల వ్యవస్థ లక్షణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రధాన లక్షణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.
1. బహుళ పార్టీ వ్యవస్థ :
స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకపార్టీ ప్రాబల్య వ్యవస్థ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్య వ్యవస్థ ఉండేది. అయితే 1990 దశకం నుంచి జరిగిన అనేక పరిణామాలు భారతదేశం ఒక బహుళపార్టీ వ్యవస్థగా అవతరించడానికి దోహదం చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు 53 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రబలంగా పనిచేస్తున్నాయి.
2. సిద్ధాంత భావజాలాల సమాచారం :
వివిధ రాజకీయ పార్టీలు అనుసరించే రాజకీయ భావజాలాల ప్రాతిపదికన భారదేశంలోని రాజకీయ పార్టీలను సాంప్రదాయ భావజాల పార్టీలు, వామ పక్ష భావజాల పార్టీలు, మధ్య మార్గ భావజాల పార్టీలుగా వర్గీకరించవచ్చు. భారతీయ జనతా పార్టీ, శివసేన తదితర పార్టీలు భారతీయ సంస్కృతి, వారసత్వం సాంప్రదాయ ప్రతీకలు, గతవైభవవాదం, హిందుత్వ తదితర అంశాలపట్ల విశ్వాసాన్ని కలిగి సాంప్రదాయ భావజాల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
కమ్యూనిస్టు పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు సామ్యవాద సిద్ధాంత భావజాలాన్ని విశ్వసించి పేదల పక్షం వహించే వామపక్ష పార్టీలుగా గుర్తింపు పొందాయి ఈ రెండు ప్రధాన భావజాలాలను, ఇతర భావజాలాలను మేళవించి అనేక ఇతర రాజకీయ పార్టీలు మధ్యేమార్గ భావజాల పార్టీలుగా ప్రచారంలో ఉన్నాయి.
3. కార్యకర్తల బలం గల పార్టీలు – శాశ్వత కార్యకర్తలు లేని పార్టీలు :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలు ఇతర నిర్వాహకులను ఎన్నికల సందర్భంగా మాత్రమే నియమించుకుంటాయి. శాశ్వత కార్యకర్తలు లేకపోవడంతో తాత్కాలికంగా ఎన్నికల సమయంలో మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలను ఈ విధంగా నియమించుకుంటాయి.
అయితే భారతీయ జనగా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సస్టు పార్టీ తెలుగుదేశం పార్టీ తదితర పార్టీలు బలీయమైన కార్యకర్తల వ్యవస్థలను కలిగి ఎన్నికల సమయంలోను, సాధారణ సమయాల్లోను చురుకుగా పనిచేస్తాయి.
4. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం :
భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు తమతమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వవు. కొన్ని పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో గ్రామాల నుంచి, జాతీయ స్థాయిలో కేంద్ర కార్యవర్గం వరకు అన్ని పదవులకు అధిష్టానవర్గం నామినేట్ చేసే నాయకుడే ఎక్కువగా ఉంటారు. ప్రధాన సమస్యలపై పార్టీల్లో చర్చ కూడా ఉండదు. అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యం అవుతుంది.
5. నిరంతర చీలికలు-వర్గవైషమ్యాలు, :
భారతదేశంలోని రాజకీయ పార్టీలు నాయకుల మధ్య విభేదాల కారణంగా చీలికలకు గురి అవుతాయి. నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, సంఘర్షణలు వివిధ పార్టీలలో చీలికలకు, అనేక ఇతర రాజకీయ పార్టీల అవతరణకు దారితీస్తాయి. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వర్గ వైషమ్యాలు, ముఠాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
6. రాజకీయ సంకీర్ణాలు :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో రాజకీయ సర్దుబాట్లు, సంకీర్ణాలు, మైత్రికూటములు, ఏర్పరచుకోవడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈ సంకీర్ణాలు, మైత్రీకూటములు ఎన్నికల పూర్వ మైత్రి, ఎన్నికల అనంతర మైత్రి కూటములుగా ఏర్పడతాయి.
7. జనాకర్షక నాయకత్వం :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీల్లోని నాయకుల జనాకర్షణ శక్తిపై ఆధారపడతాయి. దీనినే జనాకర్షక నాయకత్వమని వ్యవహరిస్తారు.
ప్రశ్న 3.
ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలు :
1. రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధి. ఎన్నికలలో గెలిచిన తరువాత మరో రాజకీయ పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అనర్హతను ఎదుర్కొంటారు. అంతేకాక, పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుడు ఎ) ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు లేదా బి) తాను ఎన్నికైన పార్టీ జారీ చేసే విప్ (whip) ఆదేశాలకు వ్యతిరేకంగా పార్లమెంటులోగానీ, రాష్ట్రశాసనసభల్లో కానీ ఏదైనా అంశానికి జరిపే ఓటింగ్కు దూరంగా ఉండడం లేదా భిన్నంగా ఓటువేయడం జరిగినప్పుడు, అనర్హత వేటును ఎదుర్కొంటాడు.
2. ఇండిపెండెంట్ సభ్యులు, నామినేషన్ సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తరువాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరితే దాని ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇదే విధంగా పార్లమెంటుకు లేదా రాష్ట్రాల శాసన సభలకు నామినేట్ అయిన సభ్యుడు తాను నామినేట్ అయిన ఆరునెలల తరువాత ఏదైనా ఒక రాజకీయ షార్టీలో చేరినప్పుడు సభ్యత్వానికి అనర్హుడవుతాడు.
3. ఫిరాయింపుల నిరోధక చట్టం-కొన్ని మినహాయింపులు :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యులు ఆ పార్టీ సంఖ్యా బలంలోని2/3 వంతు సభ్యులతో చీలిక ద్వారా మరొక పార్టీలో చేసినప్పుడు లేదా చీలిక పరంగా ఉండడానికి నిర్ణయించుకున్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వారికి వర్తించవు.
4. పార్టీనుంచి బహిష్కరణలకు వర్తించని నిబంధనలు :
ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుని ఆ పార్టీ నుంచి బహిష్కరించనప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు ఆ సభ్యునికి వర్తించవు. ఆ సభ్యుడు అనర్హతను ఎదుర్కొనే అవకాశం లేదు. ఎన్నికైన పదవీకాలాన్ని సభ్యుడు పూర్తి చేయవచ్చు.
5. ఫిరాయింపుల నిరోధక చట్టం నిర్ణయాత్మక అధికారం :
పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభల సభాధ్యక్షులకు (స్పీకర్) సభ్యులపై ఫిరాయింలు నిరోధక చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. సభ్యుని ఎన్నిక జరిగిన సభ పదవీ కాలంలో అతని అనర్హతలకు సంబంధించిన అన్ని అంశాలపైన నిర్ణయాత్మక అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరించండి.
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం, “ఎన్నికల సంఘం” ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాలానుగతంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ ను, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.
ఈ విధంగా భారతదేశంలో ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. భారతదేశంలోని అన్ని రకాల ఎన్నికలను నిర్వహించి, పర్యవేక్షించి, నియంత్రణ చేసే అధికారాలను రాజ్యాంగం ఎన్నికల కమిషనుకు దాఖలు పరిచింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. వీరిలో ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.
సాధారణంగా వీరి పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా వారి వయస్సు 65 సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కానసాగుతారు. వారు తమ పదవికి రాజీనామా చేయవచ్చు. అలాగే అసమర్థత, అనుచిత ప్రవర్తన, రాజ్యాంగ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోన్వీడం తదితర కారణాలపై వారిని పదవి నుంచి తొలగించవచ్చు.
ఈ తొలగింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంటులోని రెండు సభలు ఒక తీర్మానాన్ని ఒక్కొక్క సభలో హాజరై, ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు సంపూర్ణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
ప్రశ్న 2.
భారతదేశంలో ఎన్నికల సంస్కరణలపై ఒక సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు :
1. రాజకీయాలు నేరపూరితం కావటం-నివారణ చర్యలు :
దేశంలో రాజకీయాలు కొన్ని ప్రాంతాలలో నేరపూరితం అయ్యే ధోరణి వృద్ధి చెందింది. ఈ సమస్యను నివారించేందుకై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలతోపాలు, వారిపై ఉన్న నేరారోపణలకు సంబంధించిన కేసుల వివరాలను జతపరచాలి.
2. ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరగటం-ఎన్నికల వ్యయంపై పరిమితులు :
భారతదేశ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్నికలలో అవాంఛనీయమైన అక్రమాలు నివారించటానికి 2003 సంవత్సరం నుండి ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయంపై పరిమితులు విధిస్తూ వస్తోంది.
3. ఎన్నికలలో కులం, మతం తదితర అంశాల వినియోగం :
ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులు కులం, మతం, లింగపర తెగలు మొదలగు అంశాలతో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎన్నికల సంఘం నివారణాచర్యలు చేపట్టింది.
4. ఎన్నికల ప్రవర్తన నియమావళి :
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళికి కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించటం జరిగింది.
ప్రశ్న 3.
భారత జాతీయ కాంగ్రెస్ గురించి పేర్కొనండి.
జవాబు.
భారత జాతీయ కాంగ్రెస్కు 1885లో ఏర్పరచారు. భారత జాతీయోద్యమంలో ఈ పార్టీ గణనీయమైన పాత్ర పోషించింది. కొద్దిమంది చరిత్రకారులు భారత జాతీయోద్యమ చరిత్రను భారత జాతీయ కాంగ్రెస్తో సరిపోల్చారు. స్వాతంత్ర్యానంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఆధిపత్య పార్టీగా 1980 దశకం వరకు కొనసాగింది.
ఈ పార్టీ స్వాతంత్రానంతరం తొలి మూడు దశాబ్దాల కాలం కేంద్ర ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యంతో అధికారంలో కొనసాగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి తదితరులు నాయకత్వం వహించి,
దేశ ప్రధాన మంత్రులుగా ఉండేవారు. అదే సందర్భంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. అనతికాలంలోనే 1980 ఎన్నికలలో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలోను అనేక రాష్ట్రాల్లోను అధికారంలోకి వచ్చింది.
1984లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి హత్యకు గురయ్యారు. తదనంతరం జరిపిప సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా తిరిగి అధికారంలోకి వచ్చారు.
ప్రశ్న 4.
భారతీయ జనతా పార్టీ గురించి చర్చించండి.
జవాబు.
భారతీయ జనతా పార్టీని 1980 ఏప్రిల్, 6న లాంఛనప్రాయంగా ఏర్పరిచారు. అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో ఈ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సాంఘిక-సాంస్కృతిక సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి.
హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉంటుంది. పార్టీ అవతరణ మొదలు ఈ పార్టీ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. లోక్ సభలో ఆధిక్యం సంపాదించడం ద్వారా కేంద్రంలో 1998, 1999, 2014, 2019 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అటల్ బిహారీ వాజ్పాయ్, నరేంద్రమోడీ ఈ పార్టీ తరఫున ప్రధానమంత్రులుగా ఉన్నారు. భారీతీయ జనతా పార్టీ ఈన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్యకూటమిని (National Democratic Alliance-NDA) ఏర్పరచింది. ఈ పార్టీ సిద్ధాంత భావజాలాలలో సురక్ష (భధ్రత), సూచిత (పరిశుద్ధ-పారదర్శకత), స్వదేశీ (దేశీయ వస్తువుల వినియోగానికి ప్రోత్సాహం, సంరక్ష (సంక్షేమం) తదితర అంశాలు ఉన్నాయి.
భారతదేశ సాంస్కృతిక జాతీయవాదంపట్ల ఈ పార్టీకి విశ్వాసం ఉంది. గాంధేయ సామ్యవాదాన్ని విశ్వసిస్తుంది. అయోధ్యలో రామమందిన నిర్మాణం, భారతదేశంలోని ఉన్నత పదవులు చేపట్టకుండా విదేశాలలో జన్మించిన వారినవ అడ్డకోవడం, పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఈ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మానిఫెస్టో)లో ప్రధానంగా ప్రస్తావించింది.
ప్రశ్న 5.
నమూనా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం.సి.సి) అనగానేమి ?
జవాబు.
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళిని కొన్ని మార్గదర్వకాల రూపంలో విడుదల చేస్తుంది. దీనినే నమూనా ఎన్నికల నియమావళిగా పేర్కొంటారు.
వీటిలో, ప్రభుత్వం ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా నిరోధించడం, ప్రభుత్వ సంస్థలు ఎన్నికల సమయంలో కొత్త నియామకాలు చేపట్టకుండా నివారించడం, ఎన్నికల ప్రచారంపై హేతుబద్ధమైన పరిమితులు విధించడం, సాధారణ జనజీవనం ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళం ఎదుక్కొనకుండా చేడడం, ఎన్నికలలో మద్యం, సారా తదితర, మత్తు పదార్థాలు పంపిణీ చేయకుండా నిరోధించడం, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగం చేయకుండా నివారించడం తదితర అంశాలు ఉన్నాయి.
పోలింగ్ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల అధికారులు ఎన్నికల అధికారులు, సిబ్బందికి తమవంతు పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అభ్యర్ధులు తమ తమ ఎన్నికల చిహ్నాలను, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ప్రదర్శించడం నిషేధం, ఎన్నికల నమూనా ప్రవర్తన నియమావళి పూర్తిగా అమలుచేయడానికి ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల పరిశీలకులకు సమర్పించవచ్చు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అనగానేమి ?
జవాబు.
ముద్రణ చేసిన బ్యాలట్ పేపర్ పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. వీటిని ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీను) గా వ్యవహరిస్తారు. వీటిలో బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనే పరికరాలు ఉంటాయి. బ్యాలట్ యూనిట్లో ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, వారి ఎన్నికల చిహ్నాలు ఉంటాయి. ఓటర్లు కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటు వేస్తారు. కంట్రోల్ యూనిట్ను బ్యాలట్ యూనిట్తో అనుసంధానిస్తారు.
బారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013 సంవత్సరంలో నోటా (NOTA) అనే బటన్ ఏర్పాటు చేశారు. ఒక ఓటరు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులెవ్వరూ సరైన వారు కాదని భావించినప్పుడు పైన పేర్కొన్న అభ్యర్థులెవ్వరూ కాదు (None of the abvoe) అనే బటన్ వినియోగించుకోవచ్చు.
ప్రశ్న 2.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పరచారు. ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25వ తీదీని జాతీయ నియోజకుల దినోత్సవం (National Voters Day) గా పాటిస్తారు. దేశంలోని యువకులు ఓటర్లుగా నమోదై, రాజకీయ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ప్రశ్న 3.
ఎన్నికలలో ధన ప్రభావం వృద్ధిచెందడాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశ ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వానికి లెక్కలు చూపని నల్లధనం ఉపయోగించి కొద్దిమంది అభ్యర్థులు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం జరుగుతోంది. ధనాన్ని ఉపయోగించి కొద్దిమంది నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓట్లు కొనుగోలు చేయటం, ఓటర్లకు క్రికెట్ కిట్లు, చీరలు, మొదలైన బహుమతులను ఎరవేయటం, కుల సంఘాలకు, ఇతర సంఘాలకు భారీగా విరాళాలు ఇవ్వటం సర్వసాధారణమైంది.
ప్రశ్న 4.
ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (E.P.I.C) లను వివరించండి.
జవాబు.
`ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డులనే ఓటరు గుర్తింపు కార్డులని పేర్కొంటారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు వారి ఫొటో, అడ్రస్ తదితర వివరాలతో కూడిన గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. పోలింగ్ జరిగే రోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.
ఈ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికలలో జరిగే బోగస్ ఓటింగ్ నివారించడానికి ఈ గుర్తింపు కార్డు పద్ధతిని ఒక ఎన్నికల సంస్కరణగా ప్రవేశపెట్టారు.
ప్రశ్న 5.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గురించి తెలపండి.
జవాబు.
భారత కమ్యూనిస్టు పార్టీలో 1964లో ఏర్పడిన చీలిక ఫలితంగా మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) ఏర్పడింది. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే ఒక బలీయమైన శక్తిగా మారి విస్తరించింది. ఈ పార్టీ ఏర్పరిచిన సంకీర్ణాల ఆధారంగా కేరళ, పశ్చిమ ‘బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
ఈ పార్టీ సిద్దాంత భావజాల అంశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, ప్రాథమిక హక్కుల్లో పనిచేసే హక్కు చేర్చడం, బహుళజాతి సంస్థలను జాతీయకరణ చేయడం, కార్మికులు, సంఘాల హక్కుల పరిరక్షణ, భూసంస్కరణలు తదితరాలు ప్రధానమైనవి.
ప్రశ్న 6.
శివసేనపై ఒక లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు.
శివసేన పార్టీని మహారాష్ట్రలో బాలా థాకరే 1966లో స్థాపించారు. మరాఠి ప్రజల సంస్కృతి, గౌరవ మర్యాదల పరిరక్షణ ధ్యేయంగా ఈ పార్టీ ఏర్పడింది. దీనితో బాటు హిందుత్వ భావజాలానికి కట్టుబడి, అల్పసంఖ్యాక వర్గాలను సంతృప్తిపరచే విధానాలను వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
ప్రశ్న 7.
సిఫాలజీ అనగానేమి ?
జవాబు.
రాజనీతిశాస్త్రం అధ్యయనంలో భాగంతా ఎన్నికల పరిమాణాత్మక విశ్లేషణ మరియు బ్యాలెటింగ్, ఎన్నికలను శాస్త్రీయంగా వివరించి, విశ్లేషించటాన్ని ‘సిఫాలజీ’ అంటారు. దీనిలో భాగంగా ఓటర్ల ఎన్నికల ప్రవర్తన, మనోగతాలను అధ్యయనం చేయడం జరుగుతుంది.
ప్రశ్న 8.
ఎన్నికల సంస్కరణలపై ఏర్పడిన ఏవేని రెండు కమిటీలు లేదా కమిషన్లు పేర్కొనండి.
జవాబు.
ఎ) సంయుక్త పార్లమెంటరీ కమిటీ (1972).
బి) తార్కండే కమిటీ (1975).
ప్రశ్న 9.
ఎన్నికల సర్వేలు అనగానేమి ?
జవాబు.
ఎన్నికల సందర్భంగా వివిధ పరిశోధన సంస్థలు, మీడియా విభాగాలు ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునే విధంగా సర్వే చేపట్టడం జరుగుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులపై ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సర్వేలు వివరించే ప్రయత్నం చేస్తాయి. ఈ సర్వేలు మూడు రకాలు.
- ఎన్నికల పూర్వ సర్వే (Pre Poll Survey)
- ఎగ్జిట్ పోల్ సర్వే (Exit Poll Survey)
- ఎన్నికల అనంతర సర్వే (Post Poll Survey)
ప్రశ్న 10.
బహుజన సమాజ్ పార్టీపై ఒక లఘువ్యాఖ్య రాయండి.
జవాబు.
బహుజన సమాజ్ పార్టీ దేశంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, అప్ప సంఖ్యక వర్గాలు తదితరుల సంక్షేమానికి పాటుపడుతుంది. ఈ పార్టీ దేశంలోని దళితులు, సమాజంలో అణచివేతకు గురైన పీడితవర్గాలు తదితరుల అభ్యున్నతికి కంకణం కట్టుకుంది. బహుజన సమాజ్ పార్టీని 1985లో కాన్షిరాం స్థాపించారు.
ఆ తరువాత పార్టీ నాయకత్వం మాయావతి చేతికి వచ్చింది. ఈ పార్టీకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఎంతో పలుకుబడి ఉండి. బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో కొనసాగింది. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల చిహ్నం ఏనుగు.