Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలను వివరించండి.
జవాబు.
ప్రజాబాహుళ్యంలో స్వయంపాలన – స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారతదేశంలో జాతీయవాదం వెళ్ళాలనుకుంది. ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు.
భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం, సంస్కృతి, గత వైభవం ఉన్నాయి. సగర్వంగా స్వయంపాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది. ఈ కారణం వల్ల భారతీయులు స్వయంపాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు.
మానసికంగా గతవైభవ, సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు, బ్రిటీష్ పాలన దోపిడి- నిరంకుశత్వం మరోవైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది.
1. బ్రిటిష్ వలసవాద పాలన :
భారతదేశంలో బ్రిటీషు వారి పాలనకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. బ్రిటిషు పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలన నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది. బ్రిటిషువారు పరిపాలన అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) ప్రారంభించారు.
భారత శిక్షా స్మృతి (Indian Penal Code), నేర విచారణ స్మృతి (Criminal Procedure Code) సంహితలను తయారుచేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. పోస్టు – టెలిగ్రాఫ్, సమాచారవ్యవస్థ, రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పరచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పరచారు.
2. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి.
ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.
దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.
3. మహాతిరుగుబాటు :
1857 వ సంవత్సరంలో భారతీయ సైన్యంలోని వేలాదిమంది సిపాయిలు, పదవీచ్యుతులైన సంస్థానాధీశులు, గ్రామీణ చేతివృత్తులవారు, చిన్నకారు సన్నకారు రైతులు భారతదేశంలో బ్రిటిషు వారి పాలనను అంతమొందించడానికి సమైక్య తిరుగుబాటు చేశారు.
బ్రిటిషు పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకంపట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రత్యేకంగా లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యాసంక్రమణ సిద్ధాంతం’ (Doctrine of Lapse) స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది.
4. ఆంగ్లవిద్య :
భారతదేశంలో బ్రిటీషువారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనివల్ల సహేతుక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి. ఆంగ్లవిద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం తదితర విలువలపై అవగాహన కల్పించాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్త్వవేత్తలైన జెర్మీబెంథాం.
జాన్ సూవర్ట్ మిల్, జాన్లాక్ రూసో, ఆడమస్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్త్విక భావజాలం నుంచి స్ఫూర్తిని పొందారు. అయితే ఈ ఆదర్శాలను, విలువలను బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండును మాత్రమే గౌరవించి, భారతదేశంలో ఆచరించేవారు కాదు.
ఈ విధమైన ద్వంద్వప్రమాణాలు మధ్య తరగతి వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు – విలువలపై చైతన్యపరచి, బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రధానంగా సమన్యాయ పాలన (Rule of Law) జాతీయవాదం, స్వయం ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగత వాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. దానితో మధ్యతరగతి విద్యావంతులు స్వయంపాలన, స్వాతంత్య్రం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు.
5. ఆర్థిక దోపిడి :
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి, ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడి చేశారు. బ్రిటిష్వారు భారతదేశంలోని ముడిపదార్థాలను ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకు పోయేవారు.
అలాగే ఇంగ్లాండ్లోని తయారైన వస్తువులను భారత మార్కెట్లో నింపివేసేవారు. భారతీయ పారిశ్రామికవేత్తల నుండి, చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారినుండి వస్తువులు-సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు.
ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపైన, గ్రామీణ చేతివృత్తుల వారిపైన కఠిన నిబంధనలు విధించేవారు. దీనివల్ల భారతీయ చేతివృత్తులవారు తమతమ వృత్తులను వదిలివేసి, అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయరంగంలోకి బదిలీ అయ్యారు. మరికొంతమంది గ్రామీణ చేతివృత్తుల వారు మహాసముద్రాలను కూడా లెక్కచేయక, విదేశాలకు కడుపు చేతపట్టుకొని వలసలు పోయారు.
6. కరువు కాటకాలు, పేదరికం :
భారతదేశం 19వ శతాబ్దం చివరిభాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితులను, అంట వ్యాధులను ఎదుర్కొంది. ప్రధానంగా 1873, 1875, 1877, 1895 సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో, ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు భారతీయ, సమాజంలో అశాంతిని, అలజడిని తీసుకువచ్చింది.
7. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు, నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ప్రముఖమైనవి అమృత బజారపత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.
8. పాశవిక పాలన :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ, నిరంకుశ చట్టాలను ప్రయోగించేది. వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం (Seditious Meetings Act), ఆయుధాల చట్టం (Arms Act), ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం, (Vernacular press Act), రౌలత్ చట్టం (Rowlat Act) తదితర చట్టాలను ప్రయోగించి ప్రజల స్వేచ్ఛలను హరించేది. ప్రజల స్వేచ్ఛలను అడ్డుకోవడమేకాక, పత్రికాస్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది.
9. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో, హక్కులను అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటీషు అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.
అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం. ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.
10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptino of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.
క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయుల జాతీయలో భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.
ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు.
ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు. అవి:
- మితవాద దశ (1885 – 1905)
- అతివాద దశ (1906 -1919)
- గాంధీ దశ (1920 – 1947).
1. మితవాద దశ (1885 – 1905) :
భారత జాతీయ కాంగ్రెస్ లోని తొలి నాయకులు “మితవాదులు”గా పేర్కొనబడిరి. 1885 నుండి 1905 వరకు ఉన్న దశను భారత జాతీయోద్యమంలో మితవాద దశ అంటారు.
కాంగ్రెస్లోని మితవాదులు :
భారత జాతీయ కాంగ్రెస్లోని తొలి నాయకులను మితవాదులందురు. 1885 – 1905 -మధ్యకాలంలో మితవాద నాయకుల నాయకత్వంలో కాంగ్రెన్ నడిచెను. వారికి బ్రిటిష్ వారి న్యాయ విధానం నందు పూర్తి విశ్వాసము కలదు. అందువల్లనే మితవాదులు “ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన” (Prayer, Petition, Protest) అనే పద్ధతులను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వంతో బేరసారాలాడే దృక్పథాన్ని అవలంభించారు.
కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ మితవాదులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజే మెహతా, డి.యి. వాచా, డబ్ల్యు.సి. జెనర్జీ, ఎస్.ఎన్. బెనర్జీ, R.C. దత్తు, L.M. గోష్ మరియు G.K. గోఖలే మొదలగువారు.
మితవాదుల కోర్కెలు :
- సైనిక ఖర్చును తగ్గించుట
- ఇండియన్ కౌన్సిల్ను రద్దుచేయుట
- ఇంగ్లండ్ బాటు భారతదేశంలో కూడా సివిల్ పరీక్షలు నిర్వహించుట
- శాసన మండలిని విస్తృతపరచి భారతీయులను ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేయుట.
2. అతివాద దశ (1905 – 1920) :
భారత జాతీయోద్యమంలోని రెండవ దశను అతివాద దశగా పేర్కొంటారు. 1906-1919 మధ్యకాలంలో కాంగ్రెస్లో అతివాదులు ప్రధాన పాత్ర పోషించారు. అతివాదులలో ప్రముఖులు బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు. వీరు అతివాద ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులు మితవాదుల సామరస్య వైఖరిని అతివాదులు విమర్శించారు.
అతివాద విధానాలు :
- అతివాదులలో ప్రముఖుడైన బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించెను. –
- అతివాదులకు బ్రిటిష్ వారి దయాదాక్షిణ్యాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు. అనుకొన్నది సాధించుటయే అతివాదుల కార్యక్రమం.
- స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.
- జాతీయ విద్యా విధానాన్ని సమర్థించిరి, ప్రాంతీయ భారతీయ భాషల ద్వారా విద్యాబోధన జరగాలి అని తెల్పిరి.
3. గాంధీ దశ (1920 – 1947) :
స్వాత్రంత్రోద్యమ మూడవ దశ గాంధీజీ నాయకత్వంలో నడిచింది. 1920-1947 మధ్యకాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది. అందుచే ఈ కాలమును గాంధీయుగం అందురు. ఈ సమయంలో క్రాంగ్రెస్ శాంతియుత పద్ధతుల ద్వారా పూర్ణస్వరాజ్య సాధన కోసం ఉద్యమించెను. విప్లవ మార్గంలో పోతున్న ప్రజలను శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నడిపించిన ఖ్యాతి మహాత్ముడికి దక్కెను.
సత్యాగ్రహం :
గాంధీజీ సత్యాగ్రహం అనే విధానాన్ని ప్రతిపాదించెను. సత్యాగ్రహం అంటే సత్యమైన సహనం. దీనికి అహింసా విధానమే మూలము.
రౌలత్ చట్టం వ్యతిరేకత :
భారత రాజకీయోద్యమాన్ని నడిపించిన తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ జాతీయోద్యమ నాయకుడయ్యెను. నాయకత్వం చేపట్టిన వెంటనే మొట్టమొదట రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరపవలసిందిగా గాంధీజీ పిలుపు ఇచ్చెను.
సహాయ నిరాకరణోద్యమం :
1920 ఆగస్టులో గాంధీజీ తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించెను. ఈ ఉద్యమంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి : విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి. ఈ అంశాల ప్రాతిపదికపై సత్యం అహింసా పద్ధతుల ద్వారా మాత్రమే పోరాటం సాగించాలని గాంధీజీ పిలుపునిచ్చెను.
శాసనోల్లంఘన ఉద్యమం:
జాతీయోద్యమ చరిత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక గొప్ప మలుపు. 1930 మార్చితో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్ తీరంలోని దండి గ్రామంలో ఉప్పు తయారుచేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించెను. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధరించుట, మద్యపాన నిషేధం, జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
గాంధీ – ఇర్విన్ ఒడంబడిక :
మహాత్మాగాంధీ – వైశ్రాయ్ ఇర్విన్ల మధ్య ఒక అవగాహన కుదరడంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
క్విట్ ఇండియా ఉద్యమం :
క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన 1942, ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించెను. చిట్టచివరి స్వాతంత్ర్యోద్యమ ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ గాంధీజీ తన ఉపన్యాసాన్ని “విజయమో – వీరస్వర్గమో” (Do or Die) అంటూ ముగించారు. ఈ పిలుపు ప్రజల్లో ఉద్రేకం, ఉత్సాహం నింపి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగడానికి దారితీసెను.
చివరగా క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ సూచనల మేర దేశ విభజనకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించిరి. భారతదేశం, భారత్-పాకిస్తాన్లుగా విడిపోయెను. 1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రమును పొందెను.
ప్రశ్న 3.
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రధాన అంశాలను, విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
1919 చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించెను. కొన్ని ఇతర కారణాలు కూడా ఈ చట్ట రూపకల్పనకు దోహదం చేశాయి. సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు, స్వరాజ్యవాదుల ఉద్యమాలు, నెహ్రూ నివేదిక, జిన్నా నివేదిక, గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన శాసనోల్లంఘన ఉద్యమం మొదలగునవి ఈ చట్టం చేయడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 అధికరణాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.
ప్రధానాంశాలు :
1. 1935 భారత ప్రభుత్వ చట్టం అతివివరణాత్మకమైన శాసనం.
2. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన వ్యవస్థను ఈ చట్టం ఆవిష్కరించెను.
3. పరిపాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించెను. అవి :
i) 59 పాలనాంశాలతో కూడిన కేంద్ర జాబితా (Central list)
ii) 54 పాలనాంశాలతో కూడిన ప్రాంతీయ జాబితా (Provincial list)
iii) 36 పాలనాంశాలతో కూడిన ఉమ్మడి జాబితా (Concurrent list)
ఈ మూడు జాబితాలలో పేర్కొనని అవశిష్టాంశాల (Residuary items) పై శాసనాధికారం గవర్నర్ జనరల్ కు ఇచ్చెను.
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికే శాసనాధికారం ఉంటుంది.
ఉదా : విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, నాణేలు, సైనిక దళాలు మొదలగు అంశాలు.
బి) ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాంతీయ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాధికారం కలదు.
ఉదా : పోలీస్, విద్య, ప్రాంతీయ పబ్లిక్ సర్వీసులు మొదలైన అంశాలు.
సి) ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శాసనం చేయవచ్చును.
ఉదా : క్రిమినల్ లా & ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, వివాహాలు, విడాకుల వంటి అంశాలు
4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిరి. కేంద్ర కార్యనిర్వహణాధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చారు. కేంద్ర పాలనాంశాలను రిజర్వుడ్ ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలని విభజించారు. దేశ రక్షణ, మత విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన ప్రాముఖ్యం ఉన్న అంశాలు అన్నీ రిజర్వుడ్ పాలనాంశాలు.
వీటిని గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. మిగిలిన అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. వీటిని ప్రజాప్రతినిధులైన శాసనసభలోని మంత్రులు నిర్వహిస్తారు. ఆరు రాష్ట్రాల్లో ద్వంద్వ సభా విధానాన్ని అమలు చేయడం జరిగెను.
5. రాష్ట్రాల్లో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగెను. అక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కూడా నెలకొల్పారు. గవర్నర్లకు విశేషమైన విచక్షణాధికారాలు ఇచ్చారు.
6. ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో స్థాపించారు. దానికి 1935 చట్టాన్ని కూడా వ్యాఖ్యానించే అధికారం కలదు.
7. 1858 చట్టము సృష్టించిన భారత మండలిని రద్దు చేశారు.
8. 1935 చట్టాన్ని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్క అధికారం ఇచ్చారు. సంస్థానాలకు ప్రత్యేక హోదా కల్పించారు.
9. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయవచ్చు.
10. ఓటు హక్కును ఇతర వర్గాలకు కూడా విస్తరించారు.
విమర్శ :
భారత రాజ్యాంగ చరిత్రలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రగతి శీలక చట్టమని రాజ్యాంగ వాదులు భావించారు. ఎందుకంటే ఈ చట్టం ఆధారంగానే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. పూర్వ చట్టాలతో పోల్చితే ఈ చట్టం భారతదేశంలో మరింత బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి, స్పష్టమైన శాసన నిర్మాణ, న్యాయశాఖల అధికారాల పరిధిని విస్తృతం చేసింది.
అయితే ఈ చట్టాన్ని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిశితంగా విమర్శించాయి. భారత వ్యతిరేక చట్టంగా సి.వై.చింతామణి పేర్కొన్నాడు. ఈ చట్టం ప్రాథమికంగా చెడిపోయిన, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని చట్టంగా మహ్మదాలీ జిన్నా విమర్శించాడు.
ఇక జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటన్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టంగా వర్ణించాడు. రాజేంద్రప్రసాద్ మినూమసానీ, కె.టి.షా వంటి ప్రముఖ నాయకులు ఈ చట్టంలో ఎన్నో అసంగతమైన విషయాలున్నాయని వ్యాఖ్యానించారు.
ఇక బ్రిటన్లో క్లిమెంట్ అట్లీ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఏమాత్రం ఇష్టంలేని ప్రాంతాలను కలిపి ఉంచే ఉద్దేశంతో రూపొందిన, వింత పోకడలు గల రాజ్యాంగ సమ్మేళనంగా కొందరు ఈ చట్టాన్ని పరిగణించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టమని సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు.
ఈ చట్టం సూచించిన అఖిల భారత సమాఖ్య ఆచరణ సాధ్యం కాదని కొందరు వాదించారు. ప్రతిపాదిత సమాఖ్యలో పాల్గొనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, సంస్థానాధికారుల స్థాయిలలో తేడాలుండటం, రాష్ట్రాలు, సంస్థానాల మధ్య పాలనపరమైన వైవిధ్యాలు ఉండటంతో సమాఖ్య వ్యవస్థ సజావుగా కొనసాగదని వారు భావించారు.
అలాగే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లకు మితిమీరిన అధికారాలను ఈ చట్టం కల్పించడంతో భారతీయులు కోరుకున్న స్వయంప్రతిపత్తి ఒక నినాదంగా మిగిలిపోయింది. ఈ చట్టం ద్వారా మైనారిటీలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు భారతదేశంలో జాతీయతాభావ వికాసానికి అవరోధంగా నిలిచాయి.
ఈ చట్టం భారత వ్యవహారాల కార్యదర్శిని ఒక రాజులాగా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర శాసనసభలోని రాష్ట్రాల మండలి (Council of State) ని ఈ చట్టం ప్రగతి నిరోధక భావాలు, దుష్టజనకూటమి, సాంప్రదాయ భావాలు ఉన్న రాజకీయ నాయకుల నిలయంగా రూపొందించింది. మొత్తంమీద ఈ చట్టం ద్వారా కల్పించిన రక్షణలన్నీ కంటితుడుపు చర్యగా మిగిలిపోయాయని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు :
1. అతిపెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం :
భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు. 12 షెడ్యూళ్ళతో ఏర్పరచారు. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు.
అలాగే సమాజంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యంగంలో పొందుపరచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్, రాష్ట్రపబ్లిక్ సర్వీసు కమీషన్ల ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది.
ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, అధికార భాష – వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటివల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది.
2. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం:
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో స్వేచ్ఛ – స్వాతంత్య్రాలలో దేశీయంగా బాహ్యంగా నిర్ణయాలు తీసుకొనే సార్వభౌమాధికారాన్ని పొందింది.
రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976 లో పొందుపరచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక-ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది.
3. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు-లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.
ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, వ్యక్తి గౌరవాన్ని – జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.
4. దృఢ – అదృఢల మేలు కలయిక :
భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు.
ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో మూడింట రెండువంతుల మెజారిటీ (2/3) తో సవరించవవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంట్లోని రెండు సభల్లో 2/3 మెజారిటీతోపాటు, కనీసం 50% రాష్ట్రాల శాసన సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి.
5. ఏకకేంద్ర – సమాఖ్య లక్షణాలు :
భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం (Union of States) గా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది.
భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్కు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి.
ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత దృఢ-సర్వోన్నత రాజ్యాంగం రెండు స్థాయిల్లో (కేంద్ర – రాష్ట్ర) ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్రపార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి. వైర్ భారతదేశాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు.
6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం:
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటీష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటీష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.
అలాగే బ్రిటీషు రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.
7. స్వతంత్ర న్యాయశాఖ:
భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు – కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.
8. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్యవిధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని – రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
9. ప్రాథమిక హక్కులు:
భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏడురకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి ఆరు హక్కులుగా ఉన్నాయి. అవి
- సమానత్వపు హక్కు
- స్వాతంత్రపు హక్కు
- పీడనను, దోపిడిని వ్యతిరేకించే హక్కు
- మత స్వేచ్ఛ హక్కు
- విద్య – సాంస్కృతిక హక్కులు
- రాజ్యాంగ పరిహార హక్కు
అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
10. ప్రాథమిక విధులు :
భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం లోని నాలుగు-ఎ (Part – IV A) భాగంలో 51 ఎ (51 A) నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పది ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరచారు. అయితే ఆ తరువాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం (2002) ఆధారంగా మరో ప్రాథమిక విధిని వీటికి జత చేశారు.
11. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు -భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏకపౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్చిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు.
12. సార్వజనీన వయోజన ఓటు హక్కు:
భారత రాజ్యంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటుహక్కును కల్పించింది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా, కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు.
భారతపౌరులు ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్య కాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు.
13. ద్విసభా పద్ధతి :
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలుంటాయి. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
14. పంచాయతీ రాజ్ – నగరపాలిక చట్టాలు :
దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటుచేసి, బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్యసాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని విశ్వసించాడు. స్వాతంత్య్రానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది.
15. షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు :
భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించింది. కేంద్రప్రభుత్వం – వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదాగల కమీషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
జవాబు.
1. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి. ఈ ఉద్యమాలన్నింటికి రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.
దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.
2. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ముఖ్యమైనవి అమృతబజార్ పత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ, నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.
జాతీయవాద భావాల వ్యాప్తిలోను, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోను వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రఖ్యాత స్వాతంత్ర్యోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, డా॥బి.ఆర్. అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికలు ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు.
3. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కులను, అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటిషు అభ్యర్థులతో సమానంగా అవాకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.
అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.
4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptin of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.
క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.
ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్ర వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమంలో రెండో దశయే అతివాదదశ. ఈ దశను కొందరు చరిత్రకారులు తీవ్ర జాతీయతా దశగా వర్ణించారు. హిందూ పునరుజ్జీవనం, బ్రిటిష్ పాలకులపట్ల ద్వేషం లార్డ్ కర్జన్ క్రూరపాలన, బెంగాల్ విభజన, క్షీణించిన ఆర్థిక పరిస్థితులు, సమకాలీన అంతర్జాతీయ సంఘటనలు, విదేశాలలో భారతీయుల కడగండ్లు మొదలైన అంశాలు భారతీయులను ఈ దశలో జాతీయోద్యమం వైపు మొగ్గు చూపేటట్లు ప్రభావితం చేశాయి. అలాగే మితవాదులు అనుసరించిన మెతకవైఖరి కూడా ఈ కాలంలో ఉద్యమకారులలో అసంతృప్తిని పెంపొందించింది.
బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి నాయకులు అతివాదులుగా పరిగణించబడి ఈ దశలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులు బెంగాల్ను రెండు ముక్కలుగా విభజించడాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.
బ్రిటిష్ పాలకులు ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత, ఉదార ప్రియులనే మితవాదుల అభిప్రాయంలో అతివాదులు విభేదించారు. బ్రిటిష్పాలకులు భారతదేశంపట్ల అనుసరించిన అణచివేత, ప్రగతి వ్యతిరేకత, అప్రజాస్వామిక పద్ధతుల వల్లనే భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
బాలగంగాధరతిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అలాగే మిగిలిన అతివాదులు బ్రిటిష్ పాలకులపట్ల సకారాత్మక (passive) ప్రతిఘటన వైఖరిని అనుసరించారు. మొత్తం మీద అతివాదులు కింద పేర్కొన్న పద్ధతులను భారతీయులు అనుసరించవలసి ఉంటుందని ఉద్భోదించారు.
- వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
- స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
- శాసన మండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషిచేయడం.
- స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
- నకారాత్మక ప్రతిఘటనకు (Passive resistence) పాల్పడటం.
వందేమాతరం, స్వదేశీ వంటి ఉద్యమాలను అతివాదులు నిర్వహించారు. భారతీయులకు స్వయం పాలన, స్వరాజ్యం సాధించాలనే ప్రధాన ఆశయంతో వారు ఆ ఉద్యమాలను చేపట్టారు. తమ ఆశయసాధన కోసం ముస్లింలీగ్ వంటి ఇతర పార్టీలు, సంస్థలతో కలిసి ఉద్యమించారు.
అతివాదుల ఒత్తిడికి లోనైన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ పునరేకీకరణ (reunification) కు అంగీకరించింది. అలాగే మాంటేగు ఛేమ్స్ఫర్డ్ పథకం ద్వారా ప్రాతినిథ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
ప్రశ్న 3.
భారత జాతీయోద్యమంలోని గాంధీ దశలోని ప్రధాన సంఘటనలు రాయండి.
జవాబు.
1920 నుండి 1947 మధ్య జరిగిన భారత జాతీయోద్యమంలో గాంధీదశ చిట్ట చివరి దశగా, ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించి, మితవాద పద్ధతులు – అతివాద పద్ధతులను మేళవించి, జాతీయోద్యమాన్ని నడిపించారు.
గాంధీ దశలోని సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమము :
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో సహాయ నిరాకరణోద్యమం ఒక గొప్ప మలుపుగా చరిత్రకారులు భావించారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిస్తూ, జలియన్వాలాబాగ్ ఘోర సంఘటనను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని 1920 ఆగస్టులో ప్రారంభించారు. అవి ఏమిటంటే :
- సకారాత్మక కార్యక్రమాలు
- నకారాత్మక కార్యక్రమాలు.
ఆ రెండింటిని కింద పేర్కొనడమైంది.
1. సకారాత్మక కార్యక్రమాలు (Positive or Constructive Programmes) :
సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
అ) సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటి రూపాయల విరాళాల సేకరణ.
ఆ) భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
ఇ) జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు మొదలగునవి.
2. నకారాత్మక కార్యక్రమాలు (Negative Programmes):
నకారాత్మక కార్యక్రమాలలో కింది అంశాలను ప్రస్తావించడమైంది.
అ) బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
ఆ) బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
ఇ) బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ మొదలగునవి.
శాసనోల్లంఘనోద్యమం (Civil Disobedience Movement (1930 – 34) :
సహాయ నిరాకరణోద్యమం తరువాత భారత జాతీయోద్యమంలో చెప్పుకోదగిన సంఘటనలలో శాసనోల్లంఘన ఒకటి. ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ మార్గదర్శకత్వంలో ప్రారంభించింది.
అంతకుముందు 1929 డిసెంబర్ 29న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైన భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకు సంపూర్ణ స్వరాజ్య సాధనయే తన ఆశయంగానూ, అందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలనే అల్టిమేటము జారీచేసింది.
శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పుసత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతీ ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ‘దండి’ అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. గాంధీజీతో సహా దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించడానికి పోటీ పడ్డారు.
క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement, 1942 August – 1994 May) :
భారత జాతీయోద్యమంలో అంతిమ ఘట్టమే క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్య్రం, భారతీయులకు స్వీయ రాజ్యాంగం కావాలని అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రతిసారీ బ్రిటిష్ పాలకులు భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చక, అరకొర పథకాలను మాత్రమే ప్రకటించారు.
వేరొకవైపు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు సంబంధిత భారత జాతీయ నాయకులతో చర్చించకుండానే భారతదేశాన్ని మిత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేకపోయాయి.
అంతలో జపాన్ సైన్యం భారతదేశం వైపు దండయాత్రకు పాల్పడుతుందనే పుకార్లు వ్యాపించాయి. బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో భారతదేశం వదలి వెళ్ళడం భావ్యమని, తద్వారా జపాన్ సైన్యం దండయాత్రను నివారించవచ్చనే అభిప్రాయాన్ని గాంధీజీ వెల్లడించాడు.
భారతీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ భారత రాజప్రతినిధితో తెలపడానికి మీరాబెన్ అనే కార్యకర్తను పంపించింది.
అయితే ఆమెతో భారత రాజప్రతినిధి సమావేశమవడానికి అంగీకరించలేదు. దాంతో గాంధీజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 9న ప్రారంభించింది.
ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్హూల్ ఉద్యమాన్ని వర్ణించండి.
జవాబు.
హోమ్హూల్ ఉద్యమం :
భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలలో హోమ్హూల్ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు సారధ్యం వహించారు. మాండలే జైలులో ఆరేళ్ళపాటు కారాగార శిక్ష అనుభవించిన లోకమాన్య బాలగంగాధర్ తిలకన్ను 1914 జూన్లో బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టింది.
భారతదేశానికి తిరిగి వచ్చిన తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహృద్భావ సంబంధాలు పునరుద్ధరించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నొప్పించకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఐర్లాండ్ తరహాలో కొన్ని హోంరూల్ మండలులను నెలకొల్పడానికి కృషి చేశాడు. అందులో భాగంగా మద్రాస్లో దివ్యజ్ఞాన సమాజ
స్థాపకురాలు అనిబిసెంట్ అనే ఐరిష్ నాయకురాలితో సమన్వయం ఏర్పరచుకున్నాడు. 1916లో తిలక్, అనిబిసెంట్లు విడివిడిగా హోంరూల్ లీగ్్న స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి కృషిచేశారు.
అనిబిసెంట్ న్యూఇండియా, కామన్వీల్ అనే పత్రికలను స్థాపించి జార్జి అరెండెల్ అనే వ్యక్తిని హోంరూల్ లీగ్ వ్యవస్థాపరమైన కార్యదర్శిగా నియమించింది. ఒక్క బొంబాయి మినహా మహారాష్ట్ర అంతటా, మైసూరు సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్లలోనూ, అనిబిసెంట్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో హోంరూల్ లీగ్ విధివిధానాలను ప్రజలలో వ్యాప్తిచేశారు.
హోంరూల్ లీగ్ కు సంబంధించిన కరపత్రాలను వారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేశారు. అయితే తిలక్ సత్ప్రవర్తనతో వ్యవహరించలేదనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని 1916 జులైలో నిర్బంధంలో ఉంచింది.
దాంతో తిలక్ అభిమానులు, హోంరూల్ లీగ్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. నిర్బంధం నుంచి తిలకన్ను విడిపించడానికి మహమ్మదాలీ జిన్నా జిల్లాకోర్టు, హైకోర్టులలో తిలక్ తరఫున వాదించాడు. తిలకై తన పోరాటాన్ని ఉధృతం చేశాడు. తిలక్ 6 చోట్ల, అనిబిసెంట్ 20 చోట్ల హోంరూల్ లీగ్ కార్యాలయాలను స్థాపించారు.
హోంరూల్ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాలను స్థాపించడం, విద్యార్థులకు జాతీయ రాజకీయాలపై అవగాహన కల్పించడం, సామాజీక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా వారు ప్రారంభించారు.
భారతీయులకు స్వపరిపాలన (self rule) విషయంలో ఆసక్తిని పెంపొందించాడు. హోంరూల్ లీగ్ ఉద్యమ ఉధృతిని నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిరువురిని అనేక ప్రాంతాలలో బహిరంగ సభలలో పాల్గొనడాన్ని నిషేధించింది.
1916 డిసెంబర్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హోంరూల్ లీగ్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చివరి రోజున హోంరూల్ల సభ్యులతో తిలక్ సమావేశాలు నిర్వహించాడు.
అయితే హోంరూల్ లీగ్ కు హెచ్చిన ప్రాధాన్యతను నివారించడానికి 1917 జూన్లో అనిబిసెంట్, ఆమె అనుచరుల బృందాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మొత్తం మీద స్వపరిపాలన సంస్థలను ఏర్పరచి, వాటిని భారతీయ ప్రతినిధులతో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలనే హోంరూలీగ్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టులో చారిత్రాత్మక ప్రకటన ద్వారా భారతీయులకు స్వపరిపాలన, స్వేచ్ఛలను ప్రసాదించడానికి అంగీకరించాడు. మాంటెంగ్ ప్రకటన తరువాత 1917 సెప్టెంబర్ లో అనిబిసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడంతో హోంరూల్ ఉద్యమం సద్దుమనిగింది.
ప్రశ్న 5.
సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి.
జవాబు.
ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోతుంది. మహాత్మాగాంధీ ఈ ఉద్యమాన్ని పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920-22 మధ్య కాలంలో నిర్వహించారు. ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలు: సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
- సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటిరూపాయల విరాళాల సేకరణ.
- భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
- జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు.
- బ్రిటిష్ శాసన మండలుల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థల ఏర్పాటు.
- స్వదేశీ వస్తువుల వినియోగం.
సకారాత్మక కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలను ప్రస్తావించడమైంది.
- బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
- బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
- బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ.
- శాసన మండలులకు జరిగే ఎన్నికల బహిష్కరణ.
- స్థానిక సంస్థల పదవులకు రాజీనామా సమర్పించడం.
- విదేశీ వస్తువుల బహిష్కరణ.
ప్రశ్న 6.
భారత ప్రభుత్వ చట్టం 1919 లోని ప్రధాన అంశాలేవి ?
జవాబు.
1919 భారత ప్రభుత్వ చట్టములోని ప్రధానాంశాలు :
- బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది.
- భారత ప్రభుత్వం, దాని ఆదాయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపైన, చర్యలపైన పరిశీలన, నియంత్రణాధికారాలు భారత కార్యదర్శికే చెంది ఉంటాయి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పాలనాంశాలపై భారత కార్యదర్శి అధికారాలను తగ్గించింది.
- ప్రభుత్వ పాలనాంశాలు రెండుగా విభజింపబడెను. అవి : 1) కేంద్ర పాలనాంశాలు (47), 2) రాష్ట్ర పాలనాంశాలు (51). రాష్ట్ర పాలనాంశాలను మళ్ళీ రెండుగా విభజించారు. అవి : 1) రిజర్వుడు పాలనాంశాలు (28), 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు (22). అఖిల భారత ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర పాలనాంశాల జాబితాలోను రాష్ట్ర ప్రాముఖ్యం ఉన్న పాలనాంశాలను రాష్ట్ర పాలనాంశాల జాబితాలోను చేర్చెను.
- భారత మండలి నిర్మాణంలో మార్పులు చేసిరి. భారత వ్యవహారాల కార్యదర్శి అధికారాలను కొన్నింటిని తొలగించి వాటిని భారత హైకమీషనర్ క్కు ఇచ్చారు.
- భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్లను వేరుచేశారు. ప్రాంతీయ వనరులకు సంబంధించి ప్రాంతీయ శాసనసభలకు తమ బడ్జెట్లను తామే సమర్పించుకోవడానికి, సొంతంగా పన్నులు విధించుకోవడానికి అధికారాలు కల్పించారు.
- కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ ఎగువసభ కాగా, కేంద్ర శాసనసభ దిగువసభ అయ్యెను. ఎగువసభ పదవీకాలం 5 సంవత్సరాలుగా, దిగువసభ పదవీకాలం 8 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
- కేంద్ర శాసనసభ అధికారాలు పెరిగెను. అది బ్రిటిష్ ఇండియా మొత్తానికి, భారతీయ విషయాలకు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్రిటిష్ రాజరికానికి సంబంధించిన సైనిక దళాలకు వర్తించేలా శాసనాలు రూపొందించవచ్చును.
- రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలు రెండు భాగాలుగా విభజించారు. అవి: 1) రిజర్వుడు పాలనాంశాలు, 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు.
ప్రశ్న 7.
భారత స్వాతంత్య్ర చట్టం – 1947 ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు.
భారత వ్యవహారాల నిర్వహణ కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి, అమలు చేసిన చట్టాలలో చిట్టచివరి చట్టమే భారత స్వాతంత్ర్య చట్టము 1947 ప్రధాని అట్లీ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సలహామేరకు 1947, జులై 4వ తేదీన కామన్స్ సభలో భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
తరువాత బ్రిటిష్ పార్లమెంటులోని రెండు సభలు దానిని రెండు వారాల్లోగా ఆమోదించాయి. భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానంపై బ్రిటిష్ రాణి 1947, జులై 18వ తేదీన సంతకం చేసింది.
ప్రధానాంశాలు :
- ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి.
- ఇండియా పాకిస్తాన్లకు వేర్వేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి.
- స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
- భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది.
- బ్రిటిష్ రాజు/రాణికి ఇప్పటివరకు ఉన్న “భారత చక్రవర్తి” అనే బిరుదు రద్దవుతుంది.”
- ఇండియా పాకిస్తాన్లు రెండింటికీ చెరొక గవర్నర్ జనరల్ నియమితులవుతారు.
ప్రశ్న 8.
భారత్ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఏవేని మూడింటిని రాయండి.
జవాబు.
1. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.
ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.
2. రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరుచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్, రాజ్యాంగం నుండి స్వీకరించారు.
ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో-రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
3. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు భారతదేశంలో నివసిస్తున్నవారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏకపౌరసత్వం ఏర్పాటు చేశారు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారత జీతీయోద్యమంలో మితవాదులు.
జవాబు.
మితవాద దశనే సంస్కరణల శకంగా వర్ణించడం జరిగింది. ఈ దశలో ప్రముఖ జాతీయ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల ఉదార వైఖరి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమానుగత సంస్కరణలను అమలు చేయాలని సూచించారు.
బ్రిటిష్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య, స్వేచ్ఛావాద ప్రియులనే, భారతీయులలో బ్రిటిష్ పాలకులు రాజకీయ చైతన్యాన్ని విజ్ఞప్తులు, మధ్యవర్తిత్వం వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని మితవాదులు ఆకర్షించగలిగారు. బ్రిటిష్ పాలన అనేది దైవ సమ్మతం, దైవ నిర్ణయంగా వారు పరిగణించారు.
ప్రశ్న 2.
అతివాదులు అనుసరించిన పద్ధతులు.
జవాబు.
- బ్రిటిష్ వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
- స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
- శాసనమండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషి చేయడం.
- స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
- నకారాత్మక ప్రతిఘటనకు పాల్పడటం.
ప్రశ్న 3.
సైమన్ కమీషన్.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ‘భారత ప్రభుత్వ చట్టం 1919’ అమలు తీరును సమీక్షించి, సంస్కరణలు చేపట్టడానికి వీలుగా చర్యలు సూచించమని ఒక శాసనబద్ధ కమిషన్ ను నియమించింది. ఏడుగురు ఆంగ్లేయులతో కూడిన ఈ కమిషన్కు సర్ఆన్ సైమన్ చైర్మన్ గా వ్యవహరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ కార్యవ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి, ‘సైమన్ గో బ్యాక్’ (Simon Go Back) పేరుతో ఒక నినాదాన్నిచ్చింది.
ప్రశ్న 4.
శాసనోల్లంఘన ఉద్యమం.
జవాబు.
ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ప్రారంభించుట జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యదినంగా పాటించాలని భారతీయులకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు.
గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న “దండి” అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. రెండోదశ గాంధీజీ ఎర్రవాడ (పూణె) కారాగారంలో ఉండగా 1932 జనవరి-1933 జులైల మధ్య నిర్వహించడం జరిగింది. శాసనోల్లంఘనలో మూడవదశ 1933 ఆగష్టు, 1934 మే నెల మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. ఆ దశలో భారత కాంగ్రెస్ నాయకులు సామూహిక శాసనోల్లంఘన స్థానాలలో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని కొనసాగించారు.
ప్రశ్న 5.
మింటో – మార్లే సంస్కరణల చట్టం.
జవాబు.
ఈ చట్ట రూపకల్పనలో భారత ప్రతినిధి లార్డ్మింటో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మార్లేలు కీలకపాత్ర పోషించారు. దీనిని మింటోమార్లే సంస్కరణల చట్టంగా వర్ణించడం జరిగింది. భారతదేశంలో శాసనమండలాల నిర్మాణ, నిర్వహణలలో గణనీయమైన మార్పులకు ఈ నాంది పలికింది.
బెంగాల్ విభజనకు నిరసనగా ఉవ్వెత్తున ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, పెద్ద దేశమైన రష్యాపై చిన్న దేశమైన జపాన్ విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, ప్రవాస భారతీయుల కడగండ్లు, దుర్భర దారిద్య్రం, విప్లవ భావాలను రేకెత్తించిన కొన్ని రహస్య సంస్థల కార్యకలాపాలు వంటి అనేక అంశాలు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ పాలకులను విశేషంగా ప్రభావితం చేశాయి.
ప్రశ్న 6.
రాజ్యాంగ పరిషత్.
జవాబు.
భారత రాజ్యాంగ పరిషత్తులో 389 సభ్యులున్నారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన 296 సభ్యులు ఉన్నారు. మిగిలిన 93 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జులై – ఆగష్టులలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
మొత్తం సభ్యులలో 210 స్థానాలు జనరల్ కేటగిరీకి నిర్దేశించగా, వాటిలో 199 స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో ఆ పార్టీ బలం 208గా ఉంది. కాగా ముస్లింలీగ్ 73 స్థానాలను గెలుచుకుంది.
కాంగ్రెస్ తరఫున గెలిచిన సభ్యులలో మహాత్మాగాంధీ సూచించిన వివిధ రంగాలకు చెందిన 16 మంది మేధావులు ఉండటం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్కు సంబంధించిన 30 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్కర్ ముఖ్య సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది.
ప్రశ్న 7.
రాజ్యాంగ ముసాయిదా కమిటి.
జవాబు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగష్టు 29న ఏర్పరచింది. కమిటీలో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ కమిటీలో సభ్యులుగా సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాధుల్లా, డాక్టర్ కె.ఎమ్. మునీ, బి.ఎల్. మిత్తర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటి ముఖ్య లేఖకుడిగా ఎస్.ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు.
ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబరు 26న ఆమోదించింది.
ప్రశ్న 8.
భారత రాజ్యాంగ ధృఢ అధృఢ లక్షణాలు.
జవాబు.
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు.
భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దు వంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.
ప్రశ్న 9.
భారత రాజ్యాంగ ప్రవేశిక.
జవాబు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం హామిగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది.
భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని సృష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి యధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.
ప్రశ్న 10.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు.
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.
అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధాన మంత్రినాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.
ప్రశ్న 11.
భారత రాజ్యాంగ ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
జవాబు.
ఏకకేంద్ర రాజ్యలక్షణాలైన ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ, ఒకే ఎన్నికల సంఘం, రాష్ట్రాల పాలనలో అఖిల భారత సర్వీసుల సిబ్బంది పాత్ర, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్ల నియామకం, రెండు ప్రభుత్వాలు, పార్లమెంటు ఎగువసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాజ్యాంగ అంశాల సవరణలో పార్లమెంటు చొరవ వంటి అంశాలు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికారాల విభజన, న్యాయశాఖ ఔన్నత్యం, ద్విసభా విధానం వంటివి భారత రాజ్యాంగంలో పేర్కొనడమైంది. అయితే మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర రాజ్యం కంటే లక్షణాలే భారత రాజ్యాంగంలో అధికంగా ఉన్నాయి.
ప్రశ్న 12.
సార్వజనిక ఓటు హక్కు.
జవాబు.
భారతదేశంలో వయోజన పౌరులందరికి సార్వజనీన ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. భారత పౌరులందరూ ఒక్క వయో సంబంధమైన పరిమితి మినహా ఇతర అంశాలైన కులం, మతం, భాష, ప్రాంతం, వర్ణం, వర్గం, ఆస్తులతో నిమిత్తం లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
ఓటు హక్కు ద్వారా ప్రజా సార్వభౌమాధికార భావన ఆచరణలోకి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఓటు హక్కును పౌరులకు ప్రసాదించడానికి వయోపరిమితి 1950 నుంచి 1987 వరకు 21 ఏళ్ళగానూ, 1998 నుంచి (రాజ్యాంగం 61వ సవరణ చట్టం మేరకు) 18 ఏళ్ళుగానూ నిర్ణయించడమైనది.