TS Inter 1st Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్విశాసనసభ నిర్మాణాన్ని వివరిస్తూ, శాసనసభ విధులను తెలపండి.
జవాబు.
శాసన శాఖ ఏకశాసనసభ లేదా ద్విశాసనసభా. విధానాన్ని కలిగి వుండవచ్చు. ఏక శాసనసభా విధానంలో ఒకే. సభ వుంటే ద్విశాసనసభా విధానంలో రెండు సభలుంటాయి. వీటిని దిగువ సభ, ఎగువ సభలుగా పేర్కొనవచ్చు.

దిగువ సభ ప్రజల మనోభావాలకు తార్కాణం కాగా, ఎగువ సభ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఉదాహరణకు భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువ సభ కాగా లోక్సభ దిగువ సభగా వుంది.

శాసనసభ విధులు :
ప్రజల అభిమతాన్ననుసరించి చట్టాలు రూపొందించడమే శాసనసభ ప్రధాన విధి. ఆధునిక సభలు చట్ట నిర్మాణంతోపాటు కొన్ని పాలనా విధులను న్యాయ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రూపాలను బట్టి కూడా శాసనసభ విధులు ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర పరిమితంగా ఉంటుంది.

పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర విస్తృతంగా ఉంటుంది. శాసనసభ విధులను కింది శీర్షికల కింద వివరించవచ్చు. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ, ఆర్థిక సంబంధ విధులు, రాజ్యాంగ విధులు, ఇతర విధులు.

శాసన నిర్మాణం :
శాసన నిర్మాణం శాసనసభ ప్రాథమిక విధి. ప్రజల అభిమతాలను గుర్తించి వాటికనుగుణంగా శాసనాలు చేయడమే శాసనసభ ముఖ్య కర్తవ్యం. కొత్త చట్టాలను చేయడానికి, కాలదోషం పట్టిన చట్టాలను మార్పు చేయడానికి, రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఉంది. శాసనాలు చేయడమేకాక వివిధ విషయాల మీద, వివరంగా చర్చలు జరపడం, సమాలోచనలు చేయడం కూడా శాసనసభ విధి. ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే ముందు శాసనసభ దానికి సంబంధించిన అన్ని అంశాలను విపులంగా చర్చిస్తుంది.

కార్య నిర్వాహక వర్గంపై నియంత్రణ :
పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహిస్తుంది. దేశంలో తలెత్తే సమస్యల గురించి, వాటి పరిష్కారాలను గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రి వర్గంపై శాసన సభ అజమాయిషీ చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది.

ఆర్థిక సంబంధం విధులు :
ప్రజాస్వామ్య దేశంలో శాసనసభకు ఉండే ఆర్థిక విధులు ముఖ్యమైనవి. శాసనసభ వివిధ పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని ఏ పద్దుల కింద ఖర్చుపెట్టాలో శాసనసభ నిర్ణయిస్తుంది. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులను విధించరాదు. ఉన్న పన్నులను రద్దు చేయరాదు.

న్యాయ సంబంధ విధులు :
శాసన సభలు ముఖ్యంగా ఎగువ సభలు న్యాయ సంబంధిత విధులను కూడా. నిర్వహిస్తాయి. ఇంగ్లాండులో ప్రభువుల సభ అత్యున్నత న్యాయ స్థానంగా పనిచేస్తుంది. అమెరికా, ఇండియాలో రాష్ట్రపతిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చే అభియోగాలను జాతీయ శాసనసభలు విచారిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను శాసనసభ ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరుపుతుంది. ప్రత్యేక సభాహక్కులు అతిక్రమించినవారిని దండించడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది.

రాజ్యాంగ విధులు :
సాధారణ శాసనాలు చేయడమే కాకుండా శాసనసభలకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంటుంది. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది.

ఇతర విధులు :
పై విధులతోపాటు శాసనసభకు మరొకొన్ని విధులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి :

  1. ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్సులను ఆమోదించడం లేదా తిరస్కరించడం.
  2. సభాధ్యక్షులను ఎన్నుకోవడం.
  3. ప్రభుత్వ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన కమిటీలను నియమించడం.
  4. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమాలను రూపొందించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి ? కార్యనిర్వాహకశాఖ విధులను తెల్పండి.
జవాబు.
పరిచయం :
ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive) :
ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.

1. పాలనాపరమైన విధులు (Administrative Functions) :

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం,
  •  శాంతిభద్రతలను కాపాడటం,
  • విధివిధానాలను రూపొందించడం,
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

2. దౌత్యపరమైన విధులు (Diplomatic Functions) :
కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదే విధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3. సైనికపరమైన విధులు (Military Functions) :
ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదే విధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law)ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4. ఆర్థికపరమైన విధులు (Financial Functions):
కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

5. న్యాయపరమైన విధులు (Judicial Functions) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదే విధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6. రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions) :
చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణ శాఖకు విన్నవిస్తుంది.

అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఈ సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7. ఆర్డినెన్స్ల జారీ (Promulgation of Ordinances) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి.

అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8. సంక్షేమ విధులు (Welfare Functions) :
నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9. పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions) :
అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహక శాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10. అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations):
శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరే విధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది.

గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11. ఇతర విధులు (Miscellaneous Functions) :
ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయశాఖను వివరించి దాని విధులను చర్చించండి.
జవాబు.
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది, ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు :
1. శాసనాలను వ్యాఖ్యానించడం :
శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2. రాజ్యాంగ రక్షణ :
రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3. హక్కుల రక్షణ :
న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4. సమాఖ్య సమతౌల్యత:
సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5. సలహారూపక విధులు :
కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది.
ఉదా : భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటీష్ రాణి ప్రివీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6. అప్పీళ్ళ విచారణ పరిధి :
కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7. రికార్డుల నిర్వహణ :
న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8. రాజ్యాధిపతిగా వ్యవహరించడం :
అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9. పరిపాలనా విధులు :
సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదే విధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా : భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనసభల ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి.
జవాబు.
ఆధునిక రాజ్యాల్లో సిద్ధాంత రీత్యా సర్వాధికారాలున్న శాసనసభ ప్రాముఖ్యం క్రమేణా తగ్గిపోతుందని రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. దీనికి అనేక కారణాలున్నాయి. కార్యనిర్వాహకశాఖ అనేక అధికారాలు సంతరించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహకశాఖ నూతన అధికారాలను సంపాదించుకుంది.

సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధి ఫలితంగా కొత్త విషయాలు ప్రభుత్వ విధానాల్లో- చోటు చేసుకోవడంలో వాటిని అర్థం చేసుకునే సాధారణ సామర్థ్యం శాసనసభలకు పూర్తిగా లేకపోవడంవల్ల శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఉన్నత రాజకీయ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీ కావడం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రాముఖ్యాన్ని పొందింది. దీనితో శాసనసభతో సంబంధం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది.

దాని వల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గడానికి మరోకారణం శాసనసభ ఒక సాధారణ చట్టాన్ని స్థూలంగా ఆమోదించి దానికి సంబంధించిన వివరాలను భర్తీ చేయడానికి కార్య నిర్వాహకశాఖకు ఇచ్చే అధికారమే ‘నియోజిత శాసనం’ ప్రణాళికలు సంక్షేమ పథకాలు అమలు పరిచేందుకు కార్య నిర్వాహకశాఖ నియోజిత శాసనాధికారాన్ని ఉపయోగిస్తుంది.

బలమైన ప్రతిపక్షం లేకపోవడం, పార్లమెంటు సమావేశాల కాలం తగ్గిపోవడం, అధికార పక్షం బాధ్యతారహితంగా ప్రవర్తించడం, సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం శాసనసభ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయని రాజనీతి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యం పెరగడానికి గల కారణాలు చర్చించండి.
జవాబు.
ఆధునిక కాలంలో కార్యనిర్వాహకవర్గం అధికారాల, విధుల పరిధి నానాటికీ విస్తృతమవుతుంది. ఈ స్థితికి కింది కారణాలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు.

1. సంక్షేమ రాజ్య భావన:
సమాజ సంక్షేమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు, ఉత్పత్తి పంపిణీ, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, విద్య, వైద్య సేవలు మొదలైనవన్నీ కార్యనిర్వాహకశాఖ పరిధి కిందకు వచ్చాయి. ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేయడం వల్ల కార్యనిర్వాహక వర్గం పరిధి పెరుగుతుంది.

2. పారిశ్రామికీకరణ :
పారిశ్రామిక విస్తరణ కూడా కార్యనిర్వాహకవర్గం పాత్రను పెంచింది. మౌలిక పరిశ్రమలను, భారీ పరిశ్రమలను జాతీయం చేయడంలో కార్యనిర్వాహకవర్గం కీలకపాత్ర వహిస్తుంది. జాతీయం చేసిన పరిశ్రమల నిర్వహణ కూడా కార్యనిర్వాహకశాఖ విధుల పరిధిని పెంచింది.

3. నియోజిత శాసన నిర్మాణం :
కార్యనిర్వాహక వర్గం శాసనసభతో పాటు ఒక రకమైన శాసనాలు చేస్తుంది. ఇట్లాంటి శాసనాలను నియోజిత శాసనాలు అంటారు. శాసన సభ ఆమోదించిన శాసనాలను అమలు చేసే సందర్భంగా కార్యనిర్వాహకవర్గం రకరకాల నిబంధనలు, నియమాలు చెయ్యాలి. ఈ విధంగా రూపొందిన శాసనాలను రెండో తరహా శాసనాలు అని కూడా అంటారు. రానురాను ప్రభుత్వ పరిధి బాగా విస్తరిస్తున్నది.

తత్ఫలితంగా ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఎన్నో శాసనాలు చేయవలసి వస్తుంది. అన్ని శాసనాలు చేయడానికి సమయం శాసనసభలకు ఉండదు. అంతేగాక అన్ని శాసనాల తయారీకి కావలసిన నైపుణ్యం శాసనసభకు వుండదు. ఈ కారణం దృష్ట్యా శాసనాధికారాలు కార్యనిర్వాహకశాఖకు వదిలి పెట్టడం తప్పనిసరైంది.

4. రాజకీయ పార్టీల పనితీరు :
రాజకీయ పార్టీల పనితీరు కూడా కార్యనిర్వాహక వర్గ ప్రాధాన్యం పెరుగుదలకు కారణం. రాజకీయ పార్టీల విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం గాక సంకుచిత ప్రయోజనాల కోసం చాలాసార్లు పనిచేయడం మనం చూస్తున్నదే.

5. ప్రణాళికారచన :
నేడు ప్రతి రాజ్యం పెద్ద ఎత్తున ప్రణాళికారచనకు పూనుకుంటున్నది. కార్యనిర్వాహక వర్గం దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు ప్రణాళికలను కార్యసాధకంగా అమలు చేయడం కార్యనిర్వాహక శాఖ విధిగా మారింది. దీనితో కార్యనిర్వాహక శాఖకు విస్తృత అధికారాలు చెలాయించే అవకాశం ఏర్పడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయసమీక్షాధికారాన్ని చర్చించండి.
జవాబు.
శాసనసభ చేసిన చట్టాలను రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేదా అని సమీక్ష చేసే అధికారమే న్యాయసమీక్షాధికారం. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను లేదా నిర్ణయాలను విచారించి అవి రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే వాటిని రద్దుచేసే అధికారం పార్లమెంటు, అసెంబ్లీ మండలిలు, పరిషత్లు మొదలయిన శాసనాలను సమీక్ష చేయడం. రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేయడం జరుగుతుంది. దీన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్షాధికారం పరిమితం కాదు. కార్యనిర్వాహకశాఖ చేసే కేంద్ర, రాష్ట్ర తుది స్థానిక సంస్థలపై శాసనసభలో చేసిన చట్టాలు మొదలైన అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగ పరిమితులకు లోనై మౌలిక శాసనం, చట్టాలు ఉంటాయి. రాజ్యాంగం సమర్థించిన ప్రతీ ప్రక్రియ ‘అన్ని చట్టాలు’, తీర్పులు అన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. న్యాయసమీక్ష అన్ని దేశాలలో కనిపించదు.

న్యాయ సమీక్ష అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది. ఇది 1803లో జస్టిస్ మార్షల్ మార్బరీ వర్సెస్ మాడిసన్ వివాదంలో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగమౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నందువల్ల అవి చెల్లవనే చారిత్రాత్మక తీర్పునిచ్చాడు.

ఈ తీర్పు ప్రకారం శాససభ రూపొందించే చట్టాలు రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేవాయని పరీక్షించే అధికారం న్యాయస్థానాలకుందని మొట్టమొదటిసారిగా స్పష్టమైంది. రాజ్యాంగపరిధికి లోబడి చేసే చట్టాలు చేసేముందు వివిధ సిద్ధాంతాలను, సూత్రాలను, భావనలన్నిటిని సమీక్షచేసి మాత్రమే చట్టాలు రూపొందించాలి.

న్యాయ సమీక్షా అధికారం క్రింది సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

  1. శాసన సామర్థ్య సిద్ధాంతం
  2. అధికార పృథక్కరణ సిద్ధాంతం
  3. రాజ్యాంగ చైతన్యతా సిద్ధాంతం
  4. క్రియాశీల సిద్ధాంతం
  5. అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం
  6. రాజ్యాంగ పురోభావనా సిద్ధాంతం.

రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా శాసనసభలు చేసే చట్టాలే కాబట్టి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. కాని న్యాయసమీక్ష పరిధిలోకి రాదు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పి ఉంటే ఆ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు. దాన్ని నిర్ణయించేది పార్లమెంట్ అయితే రాజ్యాంగం సవరణ చట్టాలపై న్యాయ సమీక్షాధికారం లేకుండా చేసే శక్తి అధికారం పార్లమెంటుకు ఉందా అనేది ఇటీవల తలెత్తిన ప్రశ్న.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 4.
సమన్యాయపాలనపై చిన్న వ్యాసం రాయండి.
జవాబు. బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ఠ లక్షణాలలో సమన్యాయపాలన ఒకటి . సమన్యాయ పాలన తొలుత ఇంగ్లండులో ప్రారంభమైంది. తరువాత ఇండియా అమెరికాలతో సహా అనేక రాజ్యాలు ఈ భావనను అనుసరించాయి. ఎ.వి. డైసీ తన ‘లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్’ అనే గ్రంథంలో సమన్యాయపాలన భావన గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వడమైనది. డైసీ ప్రకారం సమన్యాయపాలన అంటే చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని సూచిస్తుంది.

చట్టం వ్యక్తుల మధ్య ఏ విధమైన విచక్షణను పాటించదు. ప్రధానమంత్రి మొదలుకొని కార్యాలయంలో నాలుగవ తరగతి ఉద్యోగి వరకు చట్టం ముందు అందరూ సమానులే అని ఈ సందర్భంలో ఎ.వి.డైసీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా సమన్యాయ పాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌలిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది.

భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుండి 21 వరకు గల ప్రకరణలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది చట్టం ముందు అందరూ సమానులే, ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏమిటి ?
జవాబు.
ముఖ్యంగా ఇతర ప్రభుత్వశాఖలు అన్యాయాలను సరిచేయడంలో వైఫల్యం చెందినప్పుడు న్యాయశాఖ క్రియాశీలత ప్రకారం, న్యాయమూర్తులు అన్యాయాలను సరిచేయడానికి తమ అధికారాలను ఉపయోగిస్తారు. పౌరహక్కులు, వ్యక్తిగత హక్కుల రక్షణ, రాజకీయ అన్యాయం, ప్రజానైతికతవంటి అంశాలపై సామాజిక విధానాన్ని రూపొందించడంలో న్యాయస్థానాలు చురుకైన పాత్రను పోషిస్తాయి.

శాసన, కార్యానిర్వాహక శాఖలు విధాన నిర్ణయీకరణ చేయటంలో న్యాయశాఖ క్రియాశీలత అనేది వాటికి పోటీగా ఒక రకమైన విధాన నిర్ణయీకరణే. ఈ అంశం న్యాయ సమీక్షకు సంబంధించినది. అంతిమంగా న్యాయశాఖ క్రియాశీలత స్ఫూర్తి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా న్యాయశాఖ నిర్ణయాలను వేలవరించడంగా భావించాలి.

న్యాయశాఖ ప్రతి నిర్ణయం వెనుక, న్యాయశాఖ క్రియాశీలత, స్వీయ నియంత్రణ, నియంత్రణ అనే రెండు అంశాలు న్యాయ శాఖ త్వాన్ని, ప్రేరణను వివరిస్తాయి. న్యాయశాఖ క్రియాశీలత అనేది పూర్తిగా న్యాయశాఖ స్వీయ నియంత్రణకు వ్యతిరేకం. న్యాయశాఖ క్రియాశీలత చట్ట స్ఫూర్తిని, మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అదే న్యాయశాఖ స్వీయ నియంత్రణ అనేది చట్ట వివరణకు, శాసన ఆనవాయితీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.

న్యాయశాఖ. క్రియాశీలత అనేది మారుతున్న సామాజిక పరిస్థితులనుదృష్టిలో పెట్టుకొనే గతిశీలక ప్రక్రియ. న్యాయశాఖ క్రియాశీలత అనే పదాన్ని 1947లో మొట్టమొదటగా అర్ధర్ క్లెసింగర్ జూనియర్ ప్రతిపాదించాడు. ‘బ్లాక్స్ ‘డిక్షనరీ’ ప్రకారం న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయమూర్తులను సాంప్రదాయక ఆనవాయితీల నుంచి ప్రగతిశీల, నూతన సామాజిక నిర్ణయాలవైపు ప్రేరేపిస్తుంది.

న్యాయశాఖ క్రియాశీలత ప్రభుత్వాంగాల మధ్య సమతౌల్యతను బంగపరుస్తుందనే విమర్శ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో శాసన నిర్మాణ ప్రక్రియ అనేది న్యాయశాఖ క్రియాశీలత ద్వారా ఒక కొత్త ఒరవడిని సంతరించుకుంది, మారుతున్న సామాజిక సందర్భంలో న్యాయశాఖ శాసనాన్ని వివరించడంలో ఒక ఆరోగ్యకరమైన ఒరవడిని ప్రారంభించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రభుత్వాంగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు.
ప్రభుత్వ అంగాలు మూడు. అవి

  1. శాసననిర్మాణశాఖ
  2. కార్యనిర్వాహకశాఖ
  3. న్యాయశాఖ.

శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 2.
అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏమిటి ?
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
బహుసభ్య కార్యనిర్వాహకవర్గం అంటే ఏమిటి ?
జవాబు.
దీనిలో అధికారం అనేకమంది చేతుల్లో వుంటుంది. ఉదాహరణకు మంత్రిమండలి. స్విట్జర్లాండ్లోని ఫెడరల్ కౌన్సిల్, పూర్వపు సోవియట్ యూనియన్లోని ప్రిసీడియం మొదలైనవి. ఈ పద్ధతి పార్లమెంటరీ ప్రభుత్వం వున్న దేశాలలోనూ కొన్ని పూర్వపు సమాఖ్య ప్రభుత్వాలలోనూ కొన్ని మార్పులతో కనిపిస్తుంది.

ప్రశ్న 4.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటి ?
జవాబు.
న్యాయశాఖ సక్రమంగా, స్వతంత్రంగా పనిచేయాలంటే దానికి శాసన శాఖతో కార్యనిర్వాహక శాఖతో సంబంధం ఉండరాదు. ఆ రెండు శాఖల జోక్యం న్యాయశాఖ విధి నిర్వహణలో ఉండకూడదు.

  1. న్యాయశాఖ స్వతంత్రతతో ఉండాలంటే న్యాయమూర్తుల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగాలి.
  2. శక్తి సామర్థ్యాలు ప్రతిభావ్యుత్పత్తులు, స్వతంత్ర ఆలోచనాశక్తి ఉన్నవారిని సమర్థులను, అర్హతలున్నవారినీ న్యాయమూర్తులుగా నియమించాలి.
  3. న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించాలంటే వారి ఉద్యోగ పరిస్థితులు ఆకర్షణీయంగా ఉండాలి.
  4. పదవిలో ఉన్నప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు వారికి తగిన రక్షణ ఉండాలి.
  5. పదవీ విరమణ తరువాత వేరే పదవుల కోసం ఎదురు చూడకుండా ఉండాలి. పదవీ విరమణ తరువాత ప్రభుత్వోద్యోగాల్లో చేరకూడదనే నియమం ఉండాలి. అప్పుడే వారు ఏ రకమైన ప్రలోభాలకు లోనుకారు.
  6. న్యాయమూర్తుల తీర్పులపై విమర్శ ఉండకూడదు. పై పద్ధతులు, నియమాలు పాటిస్తే న్యాయమూర్తులు ఎట్లాంటి ప్రలోభాలకు ఒత్తిడిలకు, భయాలకు లోనుకాకుండా స్వతంత్రంగా ఉండి న్యాయపాలన బాగా చేయగలరు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 5.
న్యాయ సమీక్ష అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయశాఖ రాజ్యాంగానికి సంరక్షణ కర్త. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం తమతమ విధుల నిర్వహణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ చర్యలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు అమల్లోకి రాకుండా ఆజ్ఞలను జారీ చేస్తుంది. న్యాయస్థానాలకున్న ఈ అధికారాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

ప్రశ్న 6.
సెనేట్.
జవాబు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల కేంద్ర శాసనశాఖ అయిన కాంగ్రెస్లోని ఎగువసభను సెనేట్. దీనిలో మొత్తం 100 మంది సభ్యులుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం 50 కాగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులు ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
రాష్ట్రాల కౌన్సిల్.
జవాబు.
భారత పార్లమెంటులోని ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాజ్యసభ అంటారు. ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వీరు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ. విధానం ద్వారా ఎన్నుకోబడతారు. దీనిలో మొత్తం 250 సభ్యులుండగా వారిలో 238 సభ్యులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు.

మిగిలిన 12 సభ్యులను కళలు, సాహిత్యం, సహకారం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలలోని ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు, వారి స్థానంలో కొత్తవారు ఎన్నుకోబడతారు. ఒక్కో సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 8.
హౌస్ ఆఫ్ లార్డ్స్.
జవాబు.
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువసభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దీనిలో 800 మంది సభ్యులున్నారు. వారిని ప్రధానమంత్రి సిఫారసు మేరకు బ్రిటీష్ రాణి నియమిస్తారు.

ప్రశ్న 9.
పార్లమెంటరీ కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండటమేకాక భారతదేశంలో వలే పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 10.
ఏకశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ ఒకే సభను కలిగి వుంటే దానిని ఏకసభా విధానమని అంటారు. ఈ విధానంలో ఎగువసభ వుండదు. కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన దిగువసభ మాత్రమే వుంటుంది. టర్కీ, స్వీడన్, డెన్మార్క్, బల్గేరియా దేశాలను ఏకసభా విధానానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 11.
ద్విశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ రెండు సభలను కలిగి వుండటాన్ని ద్విశాసనసభా విధానం అంటారు. ఇందులో ఒకటి ఎగువ సభ కాగా రెండోది దిగువ సభ. ఉదా : బ్రిటన్, భారత్, అమెరికా దేశాలను ద్విసభా విధానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువసభ గాను లోక్సభ దిగువసభ గాను ఉన్నాయి.

Leave a Comment