Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం Textbook Questions and Answers.
TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
ఆడమ్స్మిత్, రికార్డో, జె.బి.సే, జె.యస్. మిల్ మొదలగు వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలంటారు. వీరు ప్రతిపాదించిన ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్నే సంప్రదాయ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అభిప్రాయంలో “సప్లై తనకు తానే డిమాండ్ సృష్టించుకుంటుంది”. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొరతగాని లేదా నిరుద్యోగితగాని ఏర్పడవు.
పరిపూర్ణ పోటీ పరిస్థితులలో దీర్ఘ కాలంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద స్థిర సమతౌల్యంలో ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. సంపూర్ణ ఉద్యోగిత ఒక సాధారణ లక్షణం అని, నిరుద్యోగిత ఒక అసాధారణ పరిస్థితి అని భావించారు.
ప్రభుత్వ జోక్యం లేకపోతే మార్కెట్ శక్తుల స్వేచ్ఛా ప్రవర్తన ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ అభిప్రాయాలను స్థూలంగా సంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతం అంటారు.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ఈ క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
- సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం.
- . పొదుపు, పెట్టుబడుల సమానత్వం.
- వేతనాల సరళత్వం.
1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం :
‘సే’ విశ్లేషణ ప్రకారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది” అంటే మార్కెట్లో ఎంత ఉత్పత్తి చేస్తే అంతకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అధికోత్పత్తి సమస్య ఉండదని ‘సే’ అభిప్రాయం.
స్వల్పకాలంలో ఉత్పత్తిదార్లు డిమాండ్కు సంబంధించిన అంచనాలలో వచ్చే తప్పిదాల వల్ల అధికోత్పత్తి, అల్పోత్పత్తి సమస్యలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఈ పొరపాట్లను ధరలో సరళత్వం ద్వారా సర్దుబాటు చేయడం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల మధ్య సమతౌల్యం సాధించవచ్చు.
2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం:
దీర్ఘకాలంలో ‘సే’ ప్రకారం సమిష్టి పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ఈ సమానత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండదు. ‘సే’ అభిప్రాయంలో పొదుపు, పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడినట్లయితే వడ్డీరేటులో మార్పు చేయడం ద్వారా వాటి మధ్య సమానత్వం చేకూరి సమతౌల్య స్థితిలో సంపూర్ణ ఉద్యోగిత సాధించవచ్చు. దీనిని ఇచ్చిన రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
ఆ ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షం మీద పొదుపు, పెట్టుబడి, S “Y” అక్షంపై వడ్డీ రేటు సూచించబడింది. ‘E’ బిందువు వద్ద పొదుపు, పెట్టుబడులు సమానం. పొదుపు ఎక్కువగా ఉంటే వడ్డీరేటు తగ్గుతుంది. పొదుపు తక్కువగా ఉంటే వడ్డీరేటు పెరుగుతుంది.
3. వేతనాల సరళత్వం :
పిగూ అభిప్రాయం ప్రకారం శ్రామిక సప్లై, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చని పిగూ వివరించారు. పిగూ సూచించిన విధానాన్నే “వేతన కోత విధానం” అంటారు.
సంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణోద్యోగిత అనేది, ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకొనే వాస్తవిక పరిస్థితి. స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య తలెత్తితే, అది కూడా తాత్కాలికమైంది. ఇలాంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక, సంఘృష్ట నిరుద్యోగిత ఉండే అవకాశం ఉంది.
ప్రమేయాలు : సాంప్రదాయ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది.
- సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
- ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
- ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ కలిగి ఉంటుంది.
- శ్రామికులు ఒకే రకమయిన సామర్థ్యం కలిగి ఉండాలి.
- వేతనాలు, ధరలు స్థిరంగా ఉండక మారుతూ ఉంటాయి.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం తటస్థంగా ఉంటుంది.
- ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి వడ్డీరేటుపై ఆధారపడి ఉంటాయి.
సంప్రదాయ సిద్ధాంతం – విమర్శ:
1930 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ‘ఆర్థిక మాంద్యాన్ని’ ఎదుర్కోవడంలో సంప్రదాయ సిద్ధాంతాలు విఫలమవడంతో, జె.యమ్. కీన్స్ సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని కింది విధంగా విమర్శించడం జరిగింది.
1. సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యం అని, సంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత సత్య దూరమని కీన్స్ విమర్శించాడు.
2. వేతనాలను తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చునన్న పిగూ వాదనను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. పటిష్టమైన కార్మిక సంఘాల ప్రతిఘటనను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించాడు. శ్రామికుల సప్లయ్ నిజ వేతనాలపై కాకుండా ద్రవ్య వేతనాలపై ఆధారపడుతుందని కీన్స్ పేర్కొన్నాడు.
కీన్స్ అభిప్రాయంలో వేతనాల స్థాయి తగ్గిస్తే కార్మిక సంఘాలు అంగీకరించవు. అంతేకాకుండా వేతనాలు తగ్గిస్తే ఉద్యోగిత పెరగడానికి బదులు ఉత్పత్తి, ఉద్యోగితలు తగ్గుతాయి.
3. కీన్స్ అభిప్రాయంలో పొదుపు పరిమాణం ఆదాయంపై ఆధారపడుతుందే కాని, వడ్డీ రేట్లలోని మార్పులచే ప్రభావితం కాదు. అందువల్ల వడ్డీ రేటులో మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వాన్ని సాధించలేం.
4. డిమాండ్, సప్లయ్ల మధ్య సమతౌల్యం స్వయంచాలకంగా ఏర్పడదు. 1930లో ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యం దీనికి ఉదాహరణ. ఆర్థిక మాంద్య నివారణలో స్వయంచాలక సర్దుబాటు పని చేయలేదు. మార్కెట్ శక్తులు విఫలమైనందున ప్రభుత్వ జోక్యం ద్వారా సమగ్ర డిమాండ్ను పెంచాలని కీన్స్ సూచించాడు.
5. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఉంటుందనే సంప్రదాయ ఆర్థికవేత్తల వాదనను కీన్స్ ఖండించాడు. “దీర్ఘ కాలంలో మనమందరం మరణిస్తాం” (in the long run we all are dead) అని కీన్స్ పేర్కొన్నాడు. నిరుద్యోగిత స్వల కాలానికి సంబంధించినదని కీన్స్ తన ఆదాయ సిద్ధాంతంలో తెలియజేశాడు.
6. ఆర్థిక వ్యవహారాల్లో ద్రవ్యం తటస్థంగా ఉండదు. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా మరియు విలువ నిధిగా తన విధిని నిర్వర్తిస్తుందని కీన్స్ తెలిపాడు. వినియోగం, పెట్టుబడి మరియు ఉత్పత్తి వంటి వాటిని ద్రవ్యం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ ఒక ముఖ్య భావన. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.
ఏ, ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కాని అది స్వల్పకాలిక సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.
సమిష్టి సప్లై ధర :
సమిష్టి సప్లై ధరను వివిధ ఉత్పత్తి రాశులను అమ్మటం వల్ల వ్యవస్థాపకుడు పొంది తీరవలసిన కనిష్ట ఆదాయంగా కీన్స్ వర్ణించాడు. సమిష్టి సప్లై పట్టిక వ్యవస్థాపకులు వివిధ ఉత్పత్తి రాశుల వద్ద పొందిన ఆదాయాన్ని కాకుండా పొంది తీరవలసిన వ్యయ, ఆదాయపు అంచనాలను మాత్రమే తెలియజేయును.
సమిష్టి డిమాండ్ ధర :
సమిష్టి డిమాండ్ వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయసంస్థలు వ్యయ సేవలపై ఖర్చు పెట్టడానికి సిద్దపడే మొత్తాలను చూపుతుంది. వివిధ ఉత్పత్తి రాశులపై వ్యయ సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాలను చూపే పట్టిక సమిష్టి డిమాండ్ పట్టిక. అనగా నిర్దిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా భవిష్యత్తులో పొందగలిగే రాబడిని సమిష్టి డిమాండ్ ధర అంటారు.
సార్థక డిమాండ్:
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానినొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది. ఆ స్థాయిలో జాతీయాదాయపు ఉద్యోగితాస్థాయిలు సమతౌల్య స్థితికి చేరుకుంటాయి. ఈ సార్థక డిమాండ్ వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని నిర్ణయిస్తుందని కీన్స్ పేర్కొన్నాడు.
సార్థక డిమాండ్ను ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
ఉద్యోగితా పరిమాణ స్థాయి (లక్షల్లో) | సమిష్టి డిమాండ్ ధర (కోట్లలో) | సమిష్టి సప్లై ధర (కోట్లలో) |
10 | 600 | 500 |
11 | 625 | 550 |
12 | 650 | 600 |
13 | 675 | 650 |
14 | 700 | 700 |
15 | 725 | 750 |
16 | 750 | 800 |
పై పట్టికలో 14 లక్షల మందిని నియమించి ఉత్పత్తి చేస్తున్న స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర, శ్రీ 700 కోట్లు వద్ద రెండు సమానమై సమతౌల్యం ఏర్పడింది. అంతకంటే తక్కువ ఉద్యోగితా స్థాయి వద్ద సమిష్టి సప్లై ధర కంటే సమిష్టి డిమాండ్ ధర అధికం. అదే విధంగా అధిక ఉద్యోగితాస్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర కంటే సమిష్టి సప్లై ధర అధికంగా ఉంటుంది. దీనిని ఇచ్చిన రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AS మరియు AD రేఖలు సమానమై సార్థక డిమాండున్ను తెలియజేయును.
ఈ బిందువు వద్ద 14 లక్షల సమతౌల్య ఉద్యోగితా పరిమాణం తెలుపుచున్నది. అందువల్ల 14 లక్షల మంది శ్రామికుల నియామకం వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిని చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో 16 లక్షల మందిని నియమించినట్లయితే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” గా పేర్కొనెను.
ప్రశ్న 3.
ప్రభుత్వ విత్త భావనను చర్చించండి. ప్రభుత్వ రాబడి ఆధారాలను విపులీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించేది ప్రభుత్వ విత్తశాస్త్రం. ఇక్కడ ‘ప్రభుత్వం’ అనే పదం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు వర్తిస్తుంది. సాంప్రదాయపరంగా వాడుతున్న ‘ప్రభుత్వ విత్తశాస్త్రం’ అనే అంశాన్ని ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.
ఆచార్య డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలను గురించి వీటి మధ్య సర్దుబాట్లకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేదే ప్రభుత్వ విత్తశాస్త్రం.”
ఆధునిక ప్రభుత్వాలు ఆర్థిక, సాంఘిక అవస్థాపనా పరికల్పనలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కోట్ల కొద్ది రూపాయలను రోడ్ల నిర్మాణం, రైల్వే మార్గాల పొడిగింపులు, రవాణా, తంతి తపాలా సౌకర్యాలలో పెంపు, విద్యా, ఆరోగ్యం, విద్యుచ్ఛక్తి, నీటి పారుదల సౌకర్యాలపై వెచ్చిస్తున్నాయి.
పేద, బడుగు వర్గాల కోసం అనేక కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వ్యయాలను అవి వసూలు చేసే వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా పొందుతాయి. సరిపడా ఆదాయ వనరులు లభించనప్పుడు, ప్రభుత్వాలు రుణాలను స్వదేశంలోను, విదేశీ మార్గాల ద్వారా పొందుతాయి. కొన్ని సందర్భాల్లో లోటు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కూడా వనరులు సమకూర్చుకొంటాయి.
ప్రభుత్వ ఆదాయం / రాబడి :
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంవల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.
పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీ నోట్ల ముద్రణ మొదలైన మార్గాలద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిని ప్రధానంగా
- పన్నుల ద్వారా రాబడి అని
- పన్నేతర రాబడి అని రెండుగా వర్గీకరించవచ్చు. వాటిలో పన్నులు ముఖ్యమైనవి.
1. పన్నుల ద్వారా రాబడి :
వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’. వాటిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. ఈ పన్నులు రెండు రకాలు. అవి :
- ప్రత్యక్ష పన్నులు
- పరోక్ష పన్నులు.
2. పన్నేతర రాబడులు :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు. పన్నేతర రాబడుల ఆధారాలను కింది విధంగా పేర్కొనవచ్చు.
ఎ) పాలనా రాబడులు :
కొన్ని సేవలను అందించడం ద్వారా ఇలాంటి రాబడి ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదా : లైసెన్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు, జరిమానాలు, పెనాల్టీలు.
బి) వాణిజ్య రాబడులు :
ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తుసేవలను విక్రయించగా వచ్చిన ఆదాయాలను ‘వాణిజ్య రాబడులు’ అంటారు.
ఉదా : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BSNL, రైల్వేలు, స్టేట్ రోడ్డు రవాణా, ఎయిర్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్.
సి) రుణాలు :
పైన తెలిపిన వివిధ మార్గాల ద్వారా సేకరించిన రాబడి సరిపోయినంతగా లేనప్పుడు, ప్రభుత్వం స్వదేశీ, విదేశీ రుణాలను, అంతర్గత, బహిర్గత రుణాలను సేకరిస్తుంది.
డి) గ్రాంట్లు :
ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్నే ‘గ్రాంట్లు’ అంటారు.
ఉదా : కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి గ్రాంట్లు పొందవచ్చు. వీటిని తిరిగి చెల్లించనవసరం లేదు.
గ్రాంట్లు రెండు రకాలు.
- సాధారణ గ్రాంట్లు : ఎలాంటి ప్రత్యేక ఉద్దేశానికి. (purpose) కాకుండా సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లు.
- ప్రత్యేక గ్రాంట్లు : ఒక ప్రత్యేక ఉద్దేశానికి నిర్దేశించి ఇచ్చే గ్రాంట్లు. ఉదా : విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే గ్రాంట్లు.
ప్రశ్న 4.
ప్రభుత్వ రుణ భావనను వివరించండి. వివిధ రుణ విమోచన పద్దతులను విపులీకరించండి. జవాబు. ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణవిమోచన / విముక్తి అంటారు.
పద్ధతులు :
1. మిగులు బడ్జెట్ :
ప్రభుత్వాలు ఆదాయ వనరులు ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువ ఉండేటట్లు చేసుకోగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం జరుగును.
2. రుణ పరివర్తనం :
పాత రుణాన్ని చెల్లించటానికి మరలా కొత్త రుణం చేయటం రుణవిమోచన జరగదు – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరుగదు.
3. రుణ విమోచన నిధి :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవిన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.
4. రుణ నిరాకరణ :
వడ్డీనికాని, అసలు కాని లేదా రెండూ కలిపి చెల్లించడానికి నిరాకరించడం. ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరించదు. ప్రభుత్వ పరపతి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల, సాధారణంగా ఈ పద్ధతిని అనుసరించదు.
5. మూలధనంపై పన్ను :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధనంపై ఒకసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు.
6. మిగులు వ్యాపార చెల్లింపుల శేషం :
మిగులు వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడగలిగితే వాటిలో కొంతవరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 5.
భారతదేశంలో కేంద్ర – రాష్ట్ర ఆర్థిక సంబంధాలను విశ్లేషించండి.
జవాబు.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక సంబంధాలు భారత రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో వివరణాత్మకంగా రూపొందించబడింది. పన్నులను ఏ విధంగా విధించాలి, పన్నుల రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే విషయం రాజ్యాంగంలో తెలపబడింది.
అంటే పన్నును విధించిన ప్రభుత్వమే పన్ను రాబడిని పొందాలనే నియమం లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధాలైన పన్నులను విధించి, వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తుంది.
రాజ్యాంగం ప్రకారం పన్ను విధింపుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నాయి. కేంద్ర జాబితా (union list) లోని అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించగా, రాష్ట్ర జాబితా (state list)లోని అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను విధిస్తాయి.
1. పన్ను విధింపుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలుంటాయి. అవి :
- కస్టమ్స్ పన్ను
- కార్పొరేషన్ పన్ను
- మూలధన సంపాదన
- ఆదాయ పన్ను
- రైల్వే ఛార్జీలు మొదలైనవి.
2. పన్ను విధింపుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలుంటాయి. అవి :
- భూమి శిస్తు
- స్టాంప్ డ్యూటీ
- ఎస్టేట్ డ్యూటీ
- వ్యవసాయ ఆదాయం
- ఎంట్రీ పన్ను
- అమ్మకపు పన్ను
- వాహనాలు మరియు విలాసాలపై పన్ను మొదలైనవి.
కేంద్ర, రాష్ట్ర జాబితాలలో పేర్కొనని ఇతర అంశాలపై పన్నును విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. పైన పేర్కొన్న కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని అంశాలే కాకుండా కింద తెలిపిన మూడు అంశాలపై పన్ను విధింపు అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
a) పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కాని వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకొంటాయి.
ఉదా : బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, ఔషధాల తయారీపై ఎక్సైజ్ పన్ను.
b) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి రాబడిని వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుంది. వ్యవసాయ భూమిని మినహాయించి ఎస్టేట్ డ్యూటీ, రైల్వే చార్జీలపై పన్ను, వార్తాపత్రికల అమ్మకాలు, అడ్వర్టైజ్మెంటు పై పన్నులు ఈ కోవకు సంబంధించినవి.
c) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి, వసూలు చేసిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనేవి. ఆర్టికల్ 270 ప్రకారం వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్నులు ఈ కోవలోకి వస్తాయి.
3. ఇతర అధికారాలు :
- 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు వనరుల కల్పన కోసం సమీకృత నిధి (consolidated fund)ని ఏర్పాటు చేయాలి.
- 360వ ఆర్టికల్ ప్రకారం, ఆర్థిక అత్యయిక పరిస్థితి ఉంటే రాష్ట్రపతి వివిధ రాష్ట్రాలకు ఆర్థిక సంబంధిత నిర్దేశాలివ్వవచ్చు.
ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు a) కేంద్ర రుణాలు, b) గ్రాంట్స్ కూడా సమకూరుస్తాయి. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి అవసరానికి మించిన ద్రవ్యం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల కలయికలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి సహజంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో రాబడి మార్గాలుంటాయి.
అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్య సౌకర్యాలపై వ్యయాలు మొదలగు వ్యయాల దృష్ట్యా వాటి రాబడులను వ్యయాలు మించుతాయి. అందుకే ఇవి కేంద్రంపై ఆధారపడతాయి.
ఇలాంటి పరిస్థితి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్లను ఇస్తుంది. గిరిజనుల సంక్షేమ, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, క్షామం లాంటి వాటికి గ్రాంటులు ఉపకరిస్తాయి.
ప్రశ్న 6.
ఫెడరల్ విత్తంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.
1. ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు : (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :
- ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
- ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
- ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
- కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందుపరచబడతాయి. వాటి ఆధికారాలు, విధులననుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాలు ద్వారా ఆర్థిక వనరులకు సమీకరించుకొంటాయి. ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి.
- ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులు కలిగి ఉండటం
- ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.
ప్రశ్న 7.
బడ్జెట్ భావనను, భాగాలను, రకాలను విశదీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ – వ్యయాల పట్టికనే ‘బడ్జెట్’గా పేర్కొనవచ్చు. దీన్ని ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ – మార్చి) రాబడి అంచనాలు మరియు చేపట్టబోయే వివిధ ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలపై వెచ్చించబోయే వ్యయాల వివరాలతో శాసనసభ ఆమోదానికి ఆర్థిక మంత్రి ద్వారా సమర్పిస్తుంది.
శాసనసభ ఆమోద ముద్ర లేకుండా సాధారణంగా ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయం చేయడానికి అవకాశం లేదు. పన్నుల ప్రతిపాదనలు, వివిధ కార్యక్రమాల అమలు ప్రభుత్వం తలపెట్టిన వ్యయాల కేటాయింపు, సంక్షేమ పథకాల వ్యయ కేటాయింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి.
కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ‘పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలు లేనప్పుడు ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తాయి.
ఉద్దేశాలు : పన్ను ప్రతిపాదనలు, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వనరుల కేటాయింపు గురించి చట్టసభ ఆమోదం పొందుట బడ్జెట్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం తన విధానాలను, కార్యక్రమాలను వివరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది.
బడ్జెట్ అంచనాలు :
బడ్జెట్లో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. అట్లాగే బడ్జెట్లో గత సంవత్సరంలో వివిధ అంశాలపై జరిగిన వాస్తవిక వ్యయ వివరాలు (actual expenditure) ప్రస్తుత సంవత్సరపు అంచనాలతోబాటు సవరించబడిన అంచనాలు ఉంటాయి.
బడ్జెట్ నిర్మాణం దానిలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది) లో కేంద్ర ప్రభుత్వ 2017-18 వార్షిక బడ్జెట్ చూపబడింది.
బడ్జెట్ లోని అంశాలు (Components of the Budget) :
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.
1. బడ్జెట్ రాబడులు :
ఇందులో (a) రెవిన్యూ రాబడులు రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు ఉంటాయి.
2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017 18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.
పైన పేర్కొన్న రాబడుల, వ్యయాల సమగ్ర అవగాహన కోసం భారతదేశంలో ఆచరణలో ఉన్న బడ్జెట్ నిర్మాణం, బడ్జెట్ లోని అంశాలు పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది. )లో చూడండి.
బడ్జెట్ రకాలు (Types of Budget) :
రాబడి, వ్యయాల మధ్య తేడాను అనుసరించి బడ్జెట్ మూడు రకాలని చెప్పవచ్చు.
1. మిగులు బడ్జెట్ (Surplus Budget) :
మొత్తం వ్యయాల (E) కంటే మొత్తం రాబడులు (R) ఎక్కువగా ఉన్నట్లయితే ‘మిగులు బడ్జెట్ ‘గా పేర్కొంటారు. (R > E).
2. లోటు బడ్జెట్ (Deficit Budget) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు. (R < E).
3. సంతులిత బడ్జెట్ (Balanced Budget) :
మొత్తం రాబడులు, మొత్తం వ్యయాలు సమానంగా ఉంటాయి. (R = E).
బడ్జెట్ ద్రవ్యలోటు (Budget Deficit) :
సాధారణంగా బడ్జెట్లో మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.
1. రెవెన్యూ లోటు :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.
2. బడ్జెట్ లోటు :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే బడ్జెట్ లోటు (budget deficit) ఏర్పడుతుంది. ”
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు.
3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు లేదా, కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. -ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లిపులు.
వివిధ రకాలైన ఆర్థికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు ముఖ్యంగా తీవ్ర కోశ లోటు ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తుంది.
భారత ప్రభుత్వ 2017 – 18 బడ్జెట్ ప్రతిపాదనల వివరాలు పట్టిక – 8.4లో పొందుపరచబడినవి.
అందులోని లెక్కల వివరాల ప్రకారం : (అన్ని విలువలు రూపాయలు కోట్లలో)
1. రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడి – రెవెన్యూ వ్యయం
రూ. 321163 = రూ.1515771 – రూ.1836934
2. బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు
(శూన్యం) = రూ. 2146735 – రూ.2146735
3. కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
రూ.546532 = 0 + రూ.546532
4. ప్రాథమిక లోటు కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు
రూ.23,454 = రూ.546532 – రూ.523078.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
‘సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది’ అను జె.బి. సే వ్యాఖ్యను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ‘సే’ మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సూత్రాన్ని జె.బి. సే ప్రతిపాదించాడు. అతని అభిప్రాయం ప్రకారం, “సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది”.
S = D లేదా సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుందని ఈ సూత్రాన్ని సాధారణంగా వివరిస్తారు.
ఆర్థికవ్యవస్థలో ఎప్పుడు అదనపు ఉత్పత్తి ఏర్పడినా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు భాటకం, వేతనం, వడ్డీ లాభం ప్రకారం రూపంలో ఆదాయాలను ఆర్జిస్తాయి. ఆ విధంగా పెరిగిన ఆదాయం మొత్తం అదుపులో ఉంచడానికి అదనపు ఉత్పత్తి కారకాల విలువకు సమానంగా ఉంటుంది.
ఆ ఆదాయం అదనపు ఉత్పత్తి అమ్మకానికి అవసరమైన అదనపు డిమాండ్ను సృష్టిస్తుంది. మొత్తం ఆదాయం వస్తువుల కొనుగోలు మీద వ్యయం చేయబడుతుందని భావించడమైంది. అలాంటి వ్యయం కొంతవరకు వినియోగ వస్తువుల మీద కొంతవరకు మూలధన వస్తువుల మీద వ్యయం చేయబడుతుంది.
ముఖ్యాంశాలు : ‘సే’ మార్కెట్ సూత్రంలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా చెప్పవచ్చు.
- సాధారణ అత్యుత్పత్తి, సాధారణ నిరుద్యోగం ఉండవు.
- ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
- ఆదాయం మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ కొంత పొదుపు చేసినప్పటికీ ఆ పొదుపు మూలధన వస్తువులపై వ్యయం చేయటం జరుగుతుంది. అంటే పొదుపు, పెట్టుబడి సమానం.
- ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో లేని వనరులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచటం సాధ్యం అవుతుంది.
- వస్తువులు, వస్తువులతో వినిమయం చేయటం జరుగుతుంది. ఆ విధమైన వస్తు వినిమయానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
- శ్రామిక మార్కెట్లో సరళ వేతన రేటువల్ల సమతౌల్యం ఏర్పడుతుంది.
- సరళ వడ్డీరేటు ద్వారా పొదుపు, పెట్టుబడి సమతౌల్యం చేరుకుంటాయి.
ప్రశ్న 2.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంత ప్రమేయాలను, ప్రధాన అంశాలను పేర్కొనండి.
జవాబు.
సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట కార్ల్ మార్క్స్ ఉపయోగించారు. ఆడమస్మిత్, డేవిడ్ రికార్డో, రాబర్ట్ మాల్టస్, జె.ఎస్. మిల్ మొదలైనవారి సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రంగా పేర్కొన్నారు.
ప్రమేయాలు :
- స్వేచ్ఛాపూరిత పెట్టుబడి ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ.
- పరిపూర్ణ పోటీ పరిస్థితులు.
- ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
- దీర్ఘకాలిక విశ్లేషణ.
- సంపూర్ణ ఉద్యోగిత.
- పొదుపులన్నీ నేరుగా పెట్టుబడిగా మారడం S = I, వడ్డీరేటు ద్వారా.
- వడ్డీ సరళత్వం.
- వేతనాల సరళత్వం.
- అపరిమిత మార్కెట్ల పరిధి.
- ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.
11. స్వయంచాలక సర్దుబాటు :
ఆర్థిక వ్యవస్థలో ఉండే స్వయంచాలక సర్దుబాటు మూలంగా మొత్తం సప్లై, మొత్తం డిమాండ్ సమానమౌతాయి.
క్రింద పేర్నొన్న మూడు ముఖ్యమైన భావనల సహాయంతో సంప్రదాయ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించవచ్చు.
- వస్తువు మార్కెట్ సమతౌల్యం.
- ద్రవ్య మార్కెట్ సమతౌల్యం.
- శ్రామికుల మార్కెట్ సమతౌల్యం.
పైన పేర్కొన్న వాటిలో మొదటి రెండు భావనలను జె.బి. సే ప్రతిపాదించగా మూడవ బావనను ఎ.సి.పిగూ అభివృద్ధి చేశాడు.
ప్రశ్న 3.
సమిష్టి సప్లయ్ ధర, సమిష్టి డిమాండ్ ధర భావనలను విభేదించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తురాశికి ఉండే డిమాండ్ను సమిష్టి డిమాండ్ తెలియజేస్తుంది. వివిధ ఉత్పత్తులు రాశుల వద్ద సమాజంలో ప్రజలు ఎంత మొత్తంలో వ్యయం చేయటానికి సిద్ధపడతారో దానిని సమిష్టి డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. వస్తు సేవలపై సమాజం ఖర్చు చేసిన ఆదాయం ఉత్పాదక సంస్థలకు ఆదాయం అవుతుంది.
నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి కొనసాగించి మార్కెట్లో విక్రయించగా వాస్తవంగా తమకు ఆదాయం వస్తుందని ఉద్యమదారులు ఆశించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ స్థాయిల వద్ద ఉత్పాదక సంస్థలు వాస్తవంగా పొందగలమని ఆశించే ఆదాయ ప్రవాహానికి మధ్య ఉండే సంబంధాన్ని సమిష్టి డిమాండ్ ధర పట్టిక తెలియజేస్తుంది.
సమిష్టి డిమాండ్ పట్టిక:
ఉద్యోగితా స్థాయి (వేలల్లో) | సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో) |
20 | 200 |
30 | 250 |
40 | 300 |
50 | 350 |
60 | 400 |
పై పట్టికననుసరించి సమిష్టి డిమాండ్కు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందని తెలుసుకోవచ్చును. ఉద్యోగితా స్థాయి పెరిగినప్పటికి సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది.
ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తురాశి సప్లైని తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టిక వివిధ రకాల ధరల వద్ద ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధరను ఉత్పాదక సంస్థలు పొంది తీరవలెను.
వివిధ ఉత్పత్తి రాశులకు ఉత్పాదక సంస్థలు పొంది తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాలకు ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టికని ఈ క్రింద పరిశీలింపవచ్చును.
సమిష్టి సప్లై పట్టిక:
ఉద్యోగితా స్థాయి (వేలల్లో) | సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో) |
20 | 200 |
30 | 250 |
40 | 300 |
50 | 350 |
60 | 400 |
పై పట్టికననుసరించి సమిష్టి సప్లై ధరకు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ఉద్యోగితా స్థాయి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది.
ప్రశ్న 4.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంపై విమర్శలను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది”. ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అత్యుత్పత్తి ఏర్పడక సప్లై అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది.
సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంతమేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత కూడా ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై, డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాల తగ్గింపు వల్ల ఉద్యోగితాస్థాయి పెరుగుతుంది.
విమర్శలు : కీన్స్ అను ఆర్థిక శాస్త్రవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.
1. సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారము పొదుపు, పెట్టుబడి సమానంగా ఉండుట వలన సప్లయ్ దానికి తగిన డిమాండ్ను సృష్టించును, కాని వాస్తవానికి పొదుపు, పెట్టుబడులు సమానంగా ఉండవు. అందువలన సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు.
2. వేతనాల తగ్గుదల ఉండదు :
సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం సప్లై కన్నా డిమాండ్ తక్కువైనపుడు వేతనాలు, ధరలు తగ్గును. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాల తగ్గుదలను ప్రతిఘటిస్తాయి.
3. పరిపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉండుననే ప్రమేయం తీసుకొనడమైనది. కాని వాస్తవానికి పరిపూర్ణ పోటీ ఎక్కడా ఉండదు.
4. స్వల్ప కాలానికి అన్వయించబడదు:
దీర్ఘకాలంలో సాంప్రదాయక ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారము సప్లై, డిమాండ్లు సమానము కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానము కావు. అందువలన సాంప్రదాయ ఉద్యోగితా సిద్దాంతము స్వల్పకాలానికి అన్వయించబడదు.
5. ఉత్పత్తి, వినియోగం సమానంగా ఉండవు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి, ఆదాయం, వినియోగం సమానంగా ఉంటాయి. కాని ధనవంతుల విషయంలో వినియోగం కంటే ఆదాయం ఎక్కువగా ఉండును. పేదవారి విషయంలో ఆదాయం తక్కువగా ఉండును. అందువలన ఉత్పత్తి, వినియోగము సమానంగా ఉండవు.
ప్రశ్న 5.
‘సార్థక డిమాండ్’ భావనను వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ భావన ఆయువు పట్టు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.
ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కానీ అది స్వల్పకాల సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.
సార్థక డిమాండ్ :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది.
సమతౌల్య స్థాయి వద్ద ఉత్పత్తైన వస్తురాశిని కొనడానికైన మొత్తం వ్యయం సార్థకమైన డిమాండ్ అవుతుంది. సార్థకమైన డిమాండ్ ఉత్పత్తైన వస్తురాశి విలువకు సమానం. వస్తురాశి విలువ జాతీయాదాయానికి సమానం. ఆదాయం మొత్తం వ్యయానికి సమానమౌతుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.
సార్థకమైన డిమాండ్ = జాతీయ ఆదాయం వినియోగ వ్యయం + పెట్టుబడి వ్యయం.
ఈ విధంగా సార్థకమైన డిమాండ్ వినియోగ వ్యయం, పెట్టుబడికి సమానం. ఆదాయము మొత్తం వ్యయానికి సమానం.
Y = C + I
విదేశీ వ్యాపారం ఉన్న ఆర్థిక వ్యవస్థలో నికర ఎగుమతులు (X – M)కు సమిష్టి డిమాండ్లో చేరి ఉంటుంది.
Y = C + I + G + (X – M)
Y = జాతీయోత్పత్తి
C = వినియోగ వ్యయం
I = పెట్టుబడి
G = ప్రభుత్వ వ్యయం
X = ఎగుమతి విలువ
M = దిగుమతి విలువ
సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక పటముల సహాయంతో వివరించవచ్చు.
సార్థక డిమాండ్ పట్టిక:
ఉద్యోగితా స్థాయి (వేలల్లో) | సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో) | సమిష్టి సప్లై ధర (లక్షలలో) |
20 | 200 | 175 |
30 | 250 | 225 |
40 | 300 | 300 |
50 | 350 | 325 |
60 | 400 | 425 |
పై పటములో X అక్షంపై ఉద్యోగిత, Y అక్షంపై సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర చూపాం. AS సమిష్టి సప్లై రేఖ, AD సమిష్టి డిమాండ్ రేఖ. ఇది ‘E’ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కనుక ‘E’ బిందువు సార్థక డిమాండున్ను తెలియజేయును.
ప్రశ్న 6.
ప్రభుత్వ రాబడి మార్గాలేవి ?
జవాబు.
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.
పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీనోట్ల ముద్రణ మొదలైన మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిలో పన్నులు ప్రధానమైనవి.
1. పన్నులు : వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’ ఇవి రెండు రకాలు.
- ప్రత్యక్ష పన్నులు : వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేటు పన్ను.
- పరోక్ష పన్నులు : వస్తువు, సేవలపై విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ.
ప్రశ్న 7.
ప్రభుత్వ వ్యయంలోని వివిధ అంశాలను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.
1. దేశ రక్షణ :
అంతర్గత, బహిర్గత ఒడిదుడుకుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి జాతీయాదాయంలో కొంత భాగాన్ని దేశ రక్షణకై ఖర్చు చేయవలసి ఉంటుంది.
2. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ :
ప్రజా శ్రేయస్సు పెంపొందే విషయంలో ప్రభుత్వ రంగంలో కొన్ని వస్తూత్పత్తి సంస్థలను ప్రారంభించి నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం విస్తరించిన కొద్దీ వ్యయం పెరుగుతుంది.
3. ప్రజాస్వామ్య సంస్థలు :
పార్లమెంటు, అసెంబ్లీ మొదలైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తుంది.
4. పాలనా వ్యయం :
ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని నిర్వహించవలసిన సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.
5. వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి :
వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను సాంఘిక భద్రతల కల్పన దృష్ట్యా చెల్లించవలసి ఉంటుంది.
6. వడ్డీ చెల్లింపులు :
ప్రభుత్వ స్వదేశీ, విదేశీ ఋణాలపై వడ్డీలు చెల్లించాలి.
7. ప్రజోపయోగ కార్యక్రమాలు :
ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ఆధునిక ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. త్రాగు నీరు, రవాణా మొదలైన వాటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
8. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి :
ఆర్థికాభివృద్ధిని సాధించటానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం అభివృద్ధి పరచవలసి ఉంటుంది.
ప్రశ్న 8.
ప్రభుత్వ ఋణ విమోచన పద్ధతులను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణ విమోచన / విముక్తి అంటారు. ప్రభుత్వాలు రుణ విమోచన కోసం కింది పద్ధతులను అనుసరిస్తారు. అవి :
i) మిగులు బడ్జెట్ (Surplus Budget) :
ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయ వనరులు ఎక్కువగా వుండేటట్లు చేసుకొనగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం.
ii) రీఫండింగ్ (Refunding) :
ప్రభుత్వం కొత్తగా బాండులను, సెక్యూరిటీలను జారీచేయడం ద్వారా పరిపక్వమైన రుణాన్ని వాయిదా వేయవచ్చు.
iii) వార్షిక పద్ధతి (Annuities) :
ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వం తాను తీసుకొన్న రుణాన్ని సంవత్సరవారీగా అంటే సంవత్సరానికొకసారి చెల్లిస్తుంది. తీసుకొన్న రుణం మొత్తం చెల్లుబాటు అయ్యేంతవరకు ఇది కొనసాగుతుంది.
iv) రుణ విమోచన నిధి (Sinking Fund) :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి ‘అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవెన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.
v) రుణ పరివర్తనం (Conversion) :
పాత రుణాన్ని చెల్లించడానికి మరలా కొత్త రుణం చేయడం – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరగదు. అయితే ప్రస్తుతం పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు కంటే గతంలో పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఈ రుణం లాభదాయకం.
vi) అదనపు పన్నులు (Additional Taxation) :
కొన్ని సందర్భాల్లో రుణ విమోచన కోసం ప్రభుత్వాలు అదనపు పన్నులను విధించి రాబడితో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈ విధానంలో కొత్త పన్నులు విధించబడతాయి.
vii) మూలధనంపై పన్ను (Capital Levy) :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధన ఆస్తులపై లేదా ఎస్టేట్ల పై ఒకేసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైందిగా డాల్టన్ భావించాడు.
viii) మిగులు వర్తక శేషం (Surplus Balance of Trade) :
ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉండి మిగులు వర్తక శేషం ఏర్పడగలిగితే, వాటిలో కొంత వరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 9.
ఫెడరల్ విత్త లక్షణాలేవి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్త వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపిణీ వివరాలు ఉంటాయి.
ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :
- ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
- ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
- ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాలి.
- కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందపరచబడతాయి. వాటి అధికారాలు విధులనుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకొంటాయి.
ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి. అవి :
- ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులను కలిగి ఉండటం
- ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.
ప్రశ్న 10.
ఆర్థిక (విత్త) సంఘం దాని విధులపైన ఒక వ్యాఖ్య వ్రాయండి.
జవాబు.
మన దేశంలో 1951లో ఆర్థిక సంఘం లేదా విత్త సంఘం ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 280వ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి దీన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని ఇది చేపడుతుంది.
ఆర్థిక సంఘ సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, పదవీకాలం లాంటి నియమ నిబంధనలు ఆర్థిక సంఘపు 1951 చట్టంలో రూపొందించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకొకసారి ఈ సంఘ సభ్యులను నియమిస్తారు.
మొదటి ఆర్థిక సంఘం 1952లో తన నివేదికను సమర్పించింది. వివిధ రకాల పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపు విషయంలో రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సలహాలనిస్తుంది.
ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగిన స్థూల ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 14 ఆర్థిక సంఘాలు వాటి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి.
ఆర్థిక (విత్త) సంఘం విధులు :
ఆర్థిక సంఘం ప్రధాన విధులు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.
- పన్నుల ద్వారా సమీకరించిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం.
- వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
- 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.
ప్రశ్న 11.
బడ్జెట్ లోటులను వివరించండి.
జవాబు.
సాధారణంగా మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.
1. బడ్జెట్ రెవెన్యూ లోటు (ద్రవ్య) :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని బడ్జెట్ రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.
2. బడ్జెట్ లోటు (ద్రవ్య) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే ‘బడ్జెట్ లోటు’ (budget deficit) ఏర్పడుతుంది.
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు.
3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.
4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.
వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
సంప్రదాయక అర్థశాస్త్రం భావనను నీవేవిధంగా వివరిస్తావు ?
జవాబు.
18వ శతాబ్దం చివరి అర్థభాగం నుంచి 20వ శతాబ్దపు ఆరంభం వరకు అభివృద్ధి చేయబడిన ఆర్థిక సిద్ధాంతాలు సంప్రదాయ అర్థశాస్త్ర విశ్లేషణలో ప్రస్ఫుటిస్తాయి. సంప్రదాయవాదులు “స్వేచ్ఛా వ్యాపార” (laissez-faire) భావనను సమర్థించారు.
వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ వ్యాపార స్వేచ్ఛలాంటి వాటిని స్వేచ్ఛా వ్యాపార విధానం బలపరుస్తుంది.
ఉదా : సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మొదలగునవి. దీనిని అభివృద్ధిపరిచినది J.M. కీన్స్.
ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సమతౌల్యం అంటే ఏమిటి ?
జవాబు.
ద్రవ్య, శ్రామిక మార్కెట్ల సమతౌల్యానికి వస్తు మార్కెట్ సమతౌల్యం దారితీస్తుంది. వస్తు మార్కెట్లో ఉత్పత్తి కారకాలు సంపాదించినదంతా ఖర్చు చేయబడుతుందని ప్రమేయం చేయబడింది. అయితే సంపాదించిన మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు (S) చేయవచ్చు.
ఒకవేళ పొదుపు చేసినా దాన్ని వారు మూలధన వస్తువులపై ఖర్చు చేస్తారనేది సంప్రదాయవాదుల వాదన. మూలధన వస్తువులపై వ్యయమే పెట్టుబడి (I), వీరి ప్రకారం పొదుపును, పెట్టుబడికి సమానం (S = I) చేసే ముఖ్య కారకం సరళత్వ వడ్డీ రేటు (i). ఈ పరిస్థితిని పటం ద్వారా వివరించబడింది.
ప్రశ్న 3.
సే మార్కెట్ సూత్రం అంటే ఏమిటి ?
జవాబు.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం సప్లై తనకు తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తికి సమానంగా ప్రజలకు ఆదాయం వస్తుంది.
దీనికి సమానంగా ప్రజలకు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. దీని వలన వస్తువులకు సరిపడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎవరి ప్రమేయం లేకుండా సప్లయ్ మేరకు డిమాండ్ దానంతట అదే ఏర్పడుతుంది. దీనినే ‘సే’ మార్కెట్ సూత్రం అంటారు.
ప్రశ్న 4.
సంపూర్ణోద్యోగితను నీవేవిధంగా గ్రహిస్తావు ?
జవాబు.
ఇవ్వబడిన వేతనం దగ్గర పనిచేసే శక్తి, ఆసక్తి ఉన్న శ్రామికులందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అని అంటారు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సంపూర్ణ ఉద్యోగితా భావం ప్రాముఖ్యాన్ని వహించింది.
సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది. కీన్స్ అభిప్రాయం ప్రకారం సమిష్టి డిమాండ్ను పెంచుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితా సమతౌల్యం ఏర్పడును.
ప్రశ్న 5.
సమిష్టి డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి డిమాండ్ రాగల ఆదాయాన్ని ఊహించి తెలుపుతుంది. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులపై చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానం. ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువల్ల ఉత్పత్తిదారులు రాగలదని ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అని అంటారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఏర్పడే సమిష్టి డిమాండ్ ధరను చూపించే పట్టికను సమిష్టి డిమాండ్ ఫలం అంటారు.
ప్రశ్న 6.
ఉద్యోగితస్థాయి, సమిష్టి సప్లయ్ ధరకు ఏ విధమైన సంబంధం గలదు ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ఒక ఉద్యోగితా స్థాయి వద్ద ఉత్పత్తిదారులు అందరూ చేసిన అన్నీ వస్తువుల ఉత్పత్తిని సమిష్టి సప్లయ్ తెలుపుతుంది. ఉద్యోగితా స్థాయిపైన సమిష్టి సప్లయ్ స్థాయి ఆధారపడుతుంది. ఉద్యమదారులు భూమి, మూలధనం, శ్రమ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తారు.
మార్కెట్లో కొనసాగుతున్న ధరల ప్రకారం ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లింపబడతాయి. ఉత్పత్తి కారకాలపై చేసిన వ్యయమే (సాధారణ లాభంతో కలుపుకొని) ఉత్పత్తి వ్యయం.
ఉత్పత్తిదారులు అదే స్థాయిలో వస్తూత్పత్తి చేయాలంటే వస్తూత్పత్తికయ్యే వ్యయం కంటే వస్తువుల అమ్మకం ద్వారా వారు పొందే రాబడి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా ఉండరాదు. ఆర్థిక వ్యవస్థలోని ఉద్యమదారులు మొత్తం ఉత్పత్తికి ధరగా తప్పక పొందాల్సిన ఈ కనిష్ట మొత్తాన్ని సమిష్టి సరఫరా ధర అంటాం.
ప్రశ్న 7.
సార్థక డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి సప్లయికి సమానంగా ఉన్న సమిష్టి డిమాండే సార్థక డిమాండ్. అంటే సమతౌల్యంలోని సమిష్టి డిమాండు.
ప్రశ్న 8.
వేతన – కోత విధానాన్ని నీవెట్లు గ్రహించితివి ?
జవాబు.
సాంప్రదాయవాదుల ప్రకారం స్వల్పకాలంలో నిరుద్యోగిత ఉండవచ్చు. వీరి ప్రకారం, ప్రభుత్వ జోక్యం లేదా ఉద్యోగ సంఘాల చర్యల ఫలితంగా వేతనాలు పెరగడం వలన నిరుద్యోగిత ఏర్పడుతుంది. అంతేకాని డిమాండు తగినంత లేకపోవడం వలనకాదు.
A.C. పిగూ ప్రకారం, ఈ విధమైన నిరుద్యోగిత నివారించి సంపూర్ణ ఉద్యోగితను సాధించాలంటే తన కోత చేయాలని సూచించాడు. వేతన నిధి స్థిరంగా ఉండి వేతనరేటును తగ్గిస్తే, ఉద్యోగిత పెరుగుతుందని నా పేర్కొన్నాడు.
ప్రశ్న 9.
ప్రభుత్వంను నిర్వచించండి.
జవాబు.
ఇది ప్రభుత్వాలు అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆదాయం, వ్యయాల గురించి వివరిస్తుంది.
ప్రశ్న 10.
పన్ను రాబడి, పన్నేతర రాబడిని విభేదించండి.
జవాబు.
పన్ను రాబడి :
ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో పొందిన రాబడి పన్ను రాబడి. రాజ్యాంగంలో కేటాయించబడిన ప్రకారంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను వసూలు చేస్తాయి. స్థూలంగా పన్నులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి :
- ప్రత్యక్ష పన్నులు
- పరోక్ష పన్నులు.
పన్నేతర రాబడి :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు.
ప్రశ్న 11.
ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వ వ్యయ స్వభావం, ఆయా ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక ప్రభుత్వాలు రక్షణ, శాంతిభద్రతలపై మాత్రమే కాకుండా అవస్థాపన సౌకర్యాల కల్పన, ప్రజా సంక్షేమం మరియు ప్రజా సేవా కార్యకలాపాల పైన చేసే వ్యయాన్ని ప్రభుత్వ వ్యయం అంటారు.
ప్రభుత్వ కార్యకలాపాలు అధిక రెట్లు పెరగటం వలన, ప్రభుత్వ వ్యయం కూడా అధిక మొత్తంలో పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 12.
ప్రభుత్వ రుణం అంటే ఏమిటి ?
జవాబు.
వివిధ రకాల కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం రాబడిని మించి ఉంటే రుణాల ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు స్వదేశంతోబాటు విదేశాల నుంచి కూడా రుణాలను వివిధ మార్గాలలో సేకరిస్తాయి. దీనివల్ల ప్రభత్వ రుణం ఏర్పడుతుంది.
ప్రశ్న 13.
రుణ విమోచన పద్ధతులేవి?
జవాబు.
ప్రభుత్వ రుణభారం నుండి విముక్తి అవ్వడం.
ప్రశ్న 14.
మూలధన లెవి అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన ఆస్తులు మరియు ఎస్టేటులపై ఒకేసారి విధించే పన్నును మూలధన లేవి అంటారు.
ప్రశ్న 15.
ఫెడరల్ విత్తం అంటే ఏమిటి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్తవ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.
ఫెడరల్ విత్తం లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి.
- కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
- ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే రాజ్యాంగ పరిధిలో పరిష్కరించుకో”.
ప్రశ్న 16.
ఆర్థిక సంఘం విధులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక సంఘం ప్రధాన విధులు క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.
- పన్నుల ద్వారా సమీకరించిన నికర రాబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులలో వాటి సంబంధిత తోడ్పాటులను బట్టి పంపిణీ చేయడం.
- వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి, గ్రాంట్ల పరిమాణానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
- గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.
ప్రశ్న 17.
బడ్జెట్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) ప్రభుత్వానికి చెందిన అంచనావేసిన రాబడి, వ్యయాల పట్టిక.
ప్రశ్న 18.
బడ్జెట్ లోని అంశాలు ఏవి ?
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.
1. బడ్జెట్ రాబడులు : ఇందులో
- రెవెన్యూ రాబడులు పన్నులు, పన్నేతర రాబడులు
- మూలధన రాబడులు రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు, ఉంటాయి.
2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017-18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.
ప్రశ్న 19.
రెవెన్యూ అకౌంట్, మూలధన అకౌంట్ను విభేదించండి.
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.
1. బడ్జెట్ రాబడులు : ఇందులో
a) రెవిన్యూ రాబడులు – పన్నులు, పన్నేతర రాబడులు.
b) మూలధన రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు ఉంటాయి.
2. బడ్జెట్ వ్యయాలు : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది.
1. ప్రణాళికా వ్యయం
2. ప్రణాళికేతర వ్యయం.
ప్రణాళిక వ్యయంలో
- రెవెన్యూ ఖాతాలో ప్రణాళికా వ్యయం,
- మూలధన ఖాతాలో ప్రణాళికా వ్యయంగా
ప్రణాళికేతర వ్యయంలో
- రెవెన్యూ ఖాతాలో ప్రణాళికేతర వ్యయం
- మూలధన ఖాతాలో ప్రణాళికేతర వ్యయంగా విభజింపబడి వ్యయం చేయబడతాయి.
ప్రశ్న 20.
ప్రాథమిక లోటు అంటే ఏమిటి ?
జవాబు.
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.
వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మొతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
ప్రశ్న 21.
లోటు బడ్జెట్ వాంఛనీయమా ?
జవాబు.
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు (R < E).
ప్రశ్న 22.
కేంద్ర ప్రభుత్వానికున్న ప్రత్యేక అధికారాలెట్టివి ?
జవాబు.
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలుంటాయి.
- కస్టమ్స్ డ్యూటీ
- కార్పొరేషన్ పన్ను
- మూలధన సంపాదనలు
- ఆదాయ పన్నుపై సర్చార్జీ
- రైల్వే ఛార్జీలు మొదలైనవి.
ప్రశ్న 23.
కోశలోటు అంటే ఏమిటి ?
జవాబు.
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.
ప్రశ్న 24.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రాధాన్యత ఎట్టిది ?
జవాబు.
కొన్ని సందర్భాలలో ప్రభుత్వం “పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలులేనప్పుడు “ఓట్ ఆన్ అకౌంట్” బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్కు అనుమతి పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం వ్యయం చేయుటకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
ప్రశ్న 25.
14వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
ప్రథమ ఆర్థిక సంఘం నివేదికను 1952 సంవత్సరంలో సమర్పించింది. ఆర్థిక సంఘం రాష్ట్రపతికి ఆదాయపన్ను రాబడిలో కేంద్రానికి ఎంత శాతం ఉండాలి మరియు రాష్ట్రాల మధ్య ఆదాయపన్ను రాబడి పంపిణీకి ఏ సూత్రాలు అమలుపరచాలో సలహాలిస్తుంది.
ప్రథమ ఆర్థిక సంఘం సమయం నుంచే భారత ఆర్థిక వ్యవస్థలో గట్టి మార్పులు సంభవించిన ఫలితంగా స్థూల ఆర్థిక పరిస్థితిలో (scenario) మార్పులు ఏర్పడ్డాయి.
కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసులలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. అందుచేత పద్నాలుగవ ఆర్థిక సంఘం (2015-20) సూచనలను పరిశీలించడం ఆవశ్యకం. ఈ కమిటీ ప్రత్యేకంగా దేశంలో స్థిరమైన, సుస్థిరమైన కోశ పర్యావరణాన్ని కొనసాగించడానికి తగిన చర్యలను సూచించింది. 14వ ఆర్థిక సంఘం జనవరి 2, 2013 నాడు వై.వి. రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది నివేదికను 15 డిసెంబరు 2014న సమర్పించింది.
ప్రశ్న 26.
15వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
భారత ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘంను నవంబర్ 27, 2017న ఎన్.కె.సింగ్ అధ్యక్షతన నియమించింది. ఈ సంఘ సిఫారసులు 5 సంవత్సరాల (2020-25) కాలానికి వర్తిస్తాయి. నివేదికను అక్టోబర్ 30, 2019 నాటికి సమర్పించవలసిందిగా కమీషన్ను ఆజ్ఞాపించడమైనది.
వివిధ రాష్ట్రాల వ్యయ అవసరాల లెక్కింపునకు 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణించమని సంఘానికి సూచనను ఇచ్చారు. ఈ సంఘం, జి.ఎస్.టి. (GST) అనంతర కాలంలో సిఫారసులను ప్రతిపాదించే ప్రథమ కమీషన్ గా గుర్తించబడుతుంది.
ప్రశ్న 27.
GST గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు. వస్తువులు, సేవలపై పన్ను (Good and Services Tax – GST) :
ఇది ఒక పరోక్ష పన్ను, భారతదేశంలో అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఇది ప్రవేశపెట్టబడినది. పార్లమెంట్లో మార్చి 29, 2017 నాడు వస్తువులు మరియు సేవల పన్ను చట్టం ఏర్పాటుచేయబడినది. ఈ చట్టం జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చింది. GST ఒక సమగ్రమైన, బహుళదశల (Multistage), గమ్యస్థాన ఆధారిత పన్ను, ఏర్పడే ప్రతి విలవపై ఈ పన్ను విధించబడుతుంది.