Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం Textbook Questions and Answers.
TS Inter 1st Year Chemistry Study Material 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వాతావరణం, జీవావరణం పదాలను వర్ణించండి.
జవాబు:
వాతావరణం : భూగోళాన్ని చుట్టుకొని ఉండే వాయుస్థితిలోని రక్షక పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో అధికభాగం నైట్రోజన్ మరియు ఆక్సిజన్ స్వల్ప పరిమాణంలో కార్బన్ డై ఆక్సైడు, నీటిఆవిరి ఉంటాయి. దీనిలో నాలుగు ఖండాలు ఉన్నాయి. ఇవి భూఉపరితలం నుంచి 500 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి ట్రోపోవరణం, స్ట్రాటోవరణం, మిసోవరణం, థెర్మోవరణం.
జీవావరణం : జీవరాశులు అన్నీ అంటే మొక్కలు, జంతువులు, మానవులను ఉమ్మడిగా జీవావరణం అంటారు.
ప్రశ్న 2.
శిలావరణం, జలావరణం పదాలను వివరించండి.
జవాబు:
శిలావరణం : ఖనిజాలు, మట్టి (భూసారం)తో నిండి ఉన్న ఘనస్థితి భూమి బాహ్య పొరను శిలావరణం అంటాం. భూ ఉపరితలంలో శిలావరణం 5వ వంతు ఉంటుంది. భూమి లోపలి పొరలలో ఖనిజాలు ఉంటాయి. మరింత లోతుగా సహజ వాయువు మరియు చమురు నిక్షేపాలు ఉంటాయి. ఇవన్నీ మరియు కొండలు, పర్వతాలు కూడా శిలావరణంగానే పరిగణించబడతాయి.
జలావరణం : అన్ని రకాల సహజ నీటివనరులు, జలావరణంగా పరిగణించబడతాయి. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, జలాశయాలు, నీటి కాలువలు, రిజర్వాయర్లు, పోలార్ ప్రాంతంలోని మంచు శిఖరాలు, భూగర్భ జలాలు, అనే అన్ని రకాల నీటి వనరులు ఈ ఆవరణ పరిధిలోకే వస్తాయి.
ప్రశ్న 3.
భూకాలుష్యం నిర్వచించండి.
జవాబు:
భూమి అనేది అనేక సహజపదార్థాలు పోగుపడిన ఒక పొర. దీనిలో ఖనిజాలు మరియు మట్టి ఉంటాయి. ఈ పొర పరిశ్రమల వల్ల వచ్చే వృధా పదార్థాలతోను, నగరాలలో వచ్చే వ్యర్థ పదార్థాలతోను, వ్యవసాయదారులు ఉపయోగించే క్రిమినాశకాలు, చీడల నాశకాలు మరియు జీవసంబంధ కారకాలతో కలుషితం అవుతుంది. దీనినే భూమి కాలుష్యం
అంటారు.
క్రిమిసంహారక మందులు, ఆర్గానోఫాస్ఫేట్లు, పెస్టిసైడ్లు, హెర్బిసైడ్లు, ఫంగిసైడ్లు, రొడెంటిసైడ్లు మొదలగు రసాయనాలు కూడా మట్టిని కాలుష్యానికి గురిచేస్తాయి.
ప్రశ్న 4.
రసాయన ఆక్సిజన్ అవసరం (COD) అంటే ఏమిటి ?
జవాబు:
రసాయనిక ఆక్సిజన్ అవసరం (COD) : కలుషిత నీటిలో కరిగి ఉన్న కర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని రసాయనిక ఆక్సిజన్ అవసరం అంటాం. నీటిలో ఉండే కర్బన రసాయన పదార్థాల పరిమాణాన్ని తెలిపే ముఖ్య సూచిక ఇది. కర్బన రసాయన పదార్థాలను (50%) ఆమ్లీకృత (H2SO4 పొటాషియం డైక్రోమేటు ద్రావణం ద్వారా ఆక్సీకరణం చేసి COD ని నిర్ణయిస్తారు.
ప్రశ్న 5.
జీవరసాయన ఆక్సిజన్ అవసరం (BOD) అంటే ఏమిటి ?
జవాబు:
నీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవులు 20°C వద్ద 5 రోజుల కాలంలో ఉపయోగించుకొనే ఆక్సిజన్ పరిమాణాన్ని జీవరసాయన ఆక్సిజన్ అవసరం అంటారు. శుద్ధనీటి BOD విలువ సుమారు 5pm. 17 ppm కంటే ఎక్కువ BOD విలువ గరిష్ఠ కాలుష్యాన్ని తెలుపుతుంది.
ప్రశ్న 6.
ట్రోపోవరణం, స్ట్రాటోవరణం అంటే ఏమిటి ?
జవాబు:
ట్రోపోవరణం : మానవులు, వారితో సహజీవనం చేసే ఇతర జీవులు మనుగడ సాగించే వాతావరణంలోని మిక్కిలి కింది ప్రదేశాన్ని ట్రోపోవరణం అంటారు. సముద్రమట్టం నుంచి 10 కి.మీ. ఎత్తు వరకు ఇది వ్యాప్తిచెంది ఉంటుంది.
స్ట్రాటోవరణం : ట్రోపోవరణంకు పైభాగంలో స్ట్రాటోవరణం ఉంటుంది. సముద్రమట్టం నుంచి 10-50 కి.మీ. ఎత్తులో స్ట్రాటోవరణం ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను భూ ఉపరితలాన్ని చేరకుండా స్ట్రాటోవరణంలోని ఓజోన్ పొర అడ్డుకుంటుంది.
ప్రశ్న 7.
ట్రోపోవరణంలో ఉండే ప్రధాన కణస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
జవాబు:
కణస్థితి కాలుష్యాలు : ఇవి దుమ్ము, పలచని పొగమంచు, ధూమాలు, పొగ, స్మాగ్ మొదలైనవి.
ప్రశ్న 8.
కాలుష్య గాలిలో ఉండే నాలుగు వాయుస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
జవాబు:
- సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు SO2 మరియు SO,2
- నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు NO2
- కార్బన్ యొక్క ఆక్సైడ్లు CO మరియు CO2
- హైడ్రోకార్బన్లు.
ప్రశ్న 9.
గ్రీన్హౌస్ ఫలితం ……, …… వాయువుల ద్వారా కలుగుతుంది.
జవాబు:
గ్రీన్ హౌస్ ఫలితం కార్బన్ డై ఆక్సైడ్ మరియు మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి వాయువుల వల్ల కలుగుతుంది.
ప్రశ్న10.
ఆక్సైడ్లు ఆమ్ల వర్షానికి కారణంగా ఉన్నాయి ? దీని pH విలువ ఎంత ? (March 2013)
జవాబు:
SO2, NO2 లు ఆమ్ల వర్షాన్ని కలుగజేస్తాయి. SO2, NO2 లు ఆక్సీకరణం చెంది నీటితో చర్య జరిపిన తరువాత ఆమ్ల వర్షానికి ప్రధాన కారకాలుగా పనిచేస్తాయి.
2SO2(వా) + O2 (వా) + 2H2O(ద్ర) → 2H2SO4 (జల)
4NO2(వా) + O2 (వా) + 2H2O(ద్ర) → 4HNO3 (జల)
వర్షపు నీరు pH విలువ 5.6 కంటే దిగువకు పడిపోతే దానిని ఆమ్ల వర్షం అంటారు.
ప్రశ్న11.
ఆమ్ల వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.
జవాబు:
- నేలలోని pH విలువ తగ్గి, భూసారం క్షీణించిపోతుంది.
- కట్టడాల జీవితకాలం అనూహ్యంగా తగ్గిపోతుంది.
- చలువరాళ్ళతో కట్టిన తాజ్మహల్ గాజులా ఉండే నునుపు స్వభావం ఆమ్ల వర్ష ప్రభావానికి లోనవుతున్నది.
ప్రశ్న12.
పొగ, పలుచని పొగ అంటే ఏమిటి ?
జవాబు:
కర్బన ద్రవ్యాలు దహనం చెందినప్పుడు ఏర్పడిన ఘనస్థితి కణాలను లేదా ఘనద్రవస్థితి మిశ్రమ కణాలను పొగ అనవచ్చు. సిగరెట్ పొగ, శిలాజ జాతి ఇంధనాలు, చెత్తా చెదారం, ఎండిన ఆకులు, తైలాలు మండినప్పుడు ఏర్పడు పొగలు వీటికి ఉదాహరణలు.
పలుచని పొగ : పిచికారీ ద్రవాలలోని కణాల ద్వారాను, గాలిలోని బాష్పాలు ద్రవీకరణం చెందడం ద్వారాను మిస్ట్లు (పలచని పొగమంచులు) ఏర్పడతాయి. ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పరిచే పొగమంచు, కలుపు మొక్కల నాశకాలు, క్రిమినాశకాలు వాటి లక్ష్యాల గురితప్పి గాలిలో ప్రయాణించేటప్పుడు పలుచని పొగలను (మిస్ట్) ఏర్పరుస్తాయి.
ప్రశ్న13.
సంప్రదాయక స్మాగ్ అంటే ఏమిటి ? దాని రసాయన స్వభావం ఏమిటి ? (ఆక్సీకరణ / క్షయీకరణ)
జవాబు:
స్మోక్ (పొగ), ఫాగ్ (మంచు) పదాల నుంచి స్మాగ్ అనే పదం వచ్చింది. శీతల (ఆర్ద్ర) శీతోష్ణస్థితులలో చోటుచేసుకుంటుంది. ఇది పొగ, మంచు, సల్ఫర్ డై ఆక్సైడ్ మిశ్రమం. రసాయనికంగా ఇది క్షయీకరణ స్వభావం ఉన్న మిశ్రమం. కాబట్టి దీనిని క్షయీకరణ సామర్థ్య స్మాగ్ అంటాం.
ప్రశ్న14.
కాంతి రసాయన స్మాగ్ ని సాధారణ అనుఘటకాలను తెలపండి.
జవాబు:
ఇది వేడి, తడిలేని సౌర శీతోష్ణస్థితిలో ఏర్పడుతుంది. ఆటోమొబైల్లు (రవాణా వాహనాలు), కర్మాగారాల నుంచి వెలువడే అసంతృప్త హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సెడ్ పై సూర్యకాంతి చర్యలో కాంతి రసాయన స్మాగ్ ఏర్పడుతుంది. కాంతిరసాయన స్మాగ్ ఆక్సీకరణ కారకాలు అధిక గాఢతలలో ఉంటాయి. ఈ కారణంగా దీనిని ఆక్సీకరణ సామర్థ్యం గల స్మాగ్ అంటాం. దీనిలో ఫార్మాల్ డిహైడ్, ఎక్రోలిన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేటు వంటి పదార్థాలు ఉంటాయి.
ప్రశ్న15.
PAN అంటే ఏమిటి ? దీని ప్రభావం ఏమిటి ?
జవాబు:
PAN అనగా పేరాక్సీ ఎసిటైల్ నైట్రేట్. ఇది కాంతి రసాయన స్మాగ్లో ఉంటుంది. దీని ప్రభావం వల్ల కంటి ప్రకోపాలు కలుగుతాయి. లోహాలు, రాళ్ళు, నిర్మాణ వస్తువులు, రబ్బరు, రంగు పూయబడిన ఉపరితలాల క్షీణతను ఇది కలిగిస్తుంది.
ప్రశ్న16.
స్ట్రాటోవరణంలో ఓజోను ఎలా ఏర్పడుతుంది ?
జవాబు:
స్ట్రాటోవరణంలో డై ఆక్సిజన్ (O2) అణువులపై UV వికిరణాల చర్య ద్వారా ఏర్పడిన క్రియాజన్యమే ఓజోను. అణు ఆక్సిజన్ ను, UV వికిరణాలు, స్వేచ్ఛా స్థితిలో ఉండే ఆక్సిజన్ పరమాణువులు (0) గా వియోగిస్తాయి. ఈ ఆక్సిజన్ పరమాణువులు అణు ఆక్సిజన్తో సంకలనం చెంది ఓజోన్ ను ఏర్పరుస్తాయి.
ప్రశ్న17.
CF2 Cl2 ద్వారా ఓజోను తరుగుదల ప్రాప్తించే చర్యలో ఇమిడి ఉండే అంతర్గత రసాయన సమీకరణాలు తెలపండి.
జవాబు:
స్ట్రాటోవరణంలోకి చేరిన క్లోరో ఫ్లోరోకార్బన్ సమ్మేళనాలు UV వికిరణాలచే వియోగం చెందించబడి క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికను విడుదల చేస్తాయి.
ప్రశ్న18.
ఓజోను రంధ్రం అంటే ఏమిటి ? దీనిని తొలిసారిగా ఎక్కడ గమనించారు ?
జవాబు:
స్ట్రాటోవరణంలోని ఓజోన్ పొర తరుగుదలను ఓజోన్ రంధ్రం అంటారు. దీనిని అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువప్రాంతంలో మొదటిసారిగా కనుగొన్నారు.
ప్రశ్న19.
చల్లని శుద్ధ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం తెలపండి.
జవాబు:
చల్లని శుద్ధనీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం 4-6 మి.గ్రా/లీ.
ప్రశ్న20.
శుద్ధ నీరు, కలుషిత నీరు వీటి BOD విలువలను తెలపండి.
జవాబు:
శుద్ధనీటి BOD విలువ సుమారు 5 ppm. పురపాలక మురుగు నీటి BOD 100 – 4000 ppm విలువ కలిగి ఉంటుంది. 17 ppm కంటే ఎక్కువ BOD విలువ గరిష్ఠ కాలుష్యాన్ని తెలుపుతుంది.
ప్రశ్న21.
నీటిని కాలుష్యానికి గురిచేసే మూడు పారిశ్రామిక రసాయన పదార్థాలను తెలపండి.
జవాబు:
- పాలిక్లోరినేటెడ్ బైఫినైల్, డిటర్జెంట్లు మరియు ఎరువులు.
- పరిశ్రమల నుంచి లోహవ్యర్థాలు కూడా నీటిలో చేరవచ్చు.
అవి కాడ్మియం, మెర్క్యురీ, నికెల్ మొదలైన భారలోహ అయాన్లు.
ప్రశ్న22.
నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయరంగ రసాయన పదార్థాలను తెలపండి.
జవాబు:
- ఫాస్ఫేటును కలిగిన ఎరువులు
- కలుపు మొక్కల నాశనులు
- మలాథియాన్ వంటి పురుగుమందులు
- ఎలుకల నివారణకు వాడే ఫాస్ఫైడ్లు.
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న23.
భూవాతావరణంలోని భిన్న భాగాలను తెలపండి.
జవాబు:
వాతావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అవి :
1) ట్రోపో ఆవరణం (0-11 కి.మీ)
2) స్ట్రాటో ఆవరణం (11-50 కి.మీ.)
3) మిసో ఆవరణం (50-85 కి.మీ.)
4) థెర్మో ఆవరణం (85-500 కి.మీ.)
1) ట్రోపో ఆవరణం : ఇది భూ ఉపరితలానికి అతి దగ్గరగా ఉంటుంది. వాతావరణ ద్రవ్యరాశిలో సుమారు 70% ఇది కలిగి ఉంటుంది.
2) స్ట్రాటో ఆవరణం : ఈ ఆవరణం ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కాంతిని ఇది శోషించుకుంటుంది. తద్వారా భూమిపై అతినీలలోహిత కిరణాలు పడకుండా చేస్తుంది.
3) మిసో ఆవరణం : ఈ ఆవరణం అల్ప మొత్తంలో O3 ను కలిగి ఉంటుంది.
4) థెర్మో ఆవరణం : ఈ ఆవరణంలో అల్ప సాంద్రతలు, అల్పపీడనాలు ఉంటాయి. O2, NO మొదలయిన వాయువులు ఈ ఆవరణంలో ఉంటాయి.
ప్రశ్న 24.
సింక్, COD, BOD, TLV పదాలను వివరించండి. (March 2013)
జవాబు:
సింక్ : చాలా కాలం నిలిచి ఉండే కాలుష్యాన్ని తనలో నిలుపుకొని దానితో అన్యోన్య చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు. ఉదా : వాతావరణ కార్బన్ డై ఆక్సైడుకు సముద్రాలు సింక్లుగా ఉంటాయి.
COD (Chemical Oxygen Demand] : కలుషిత నీటిలో కరిగి ఉన్న కర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని రసాయనిక ఆక్సిజన్ అవసరం అంటారు.
BOD (Biochemical Oxygen Demand] : నీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవులు, ) 20°C వద్ద అయిదురోజుల కాలవ్యవధిలో ఉపయోగించుకొనే ఆక్సిజన్ పరిమాణాన్ని జీవరసాయన ఆక్సిజన్ అవసరం అంటారు. శుద్ధనీటి BOD విలువ సుమారు 5 ppm.
ఆరంభ అవధి విలువ : TLV (Threshold Limit Value)
ఆరోగ్యవంతుడైన పారిశ్రామిక కార్మికుడు తన ఎనిమిది గంటల పనికాలంలో వాతావరణంలోని విష స్వభావ కాలుష్యానికి గురైనప్పటికి, తాను ఎటువంటి హానికర ప్రభావానికి గురికాకుండా ఉండటానికి ఆమోదించబడిన విష కాలుష్య కనిష్ఠ పరిమాణాన్ని ఆరంభ అవధి విలువ అంటారు.
ప్రశ్న 25.
గాలిలో చోటు చేసుకొని ఉన్న వాయుస్థితి కాలుష్యాలను తెలిపి, అవి ఎలా ఏర్పడతాయో వివరించండి.
జవాబు:
1) సల్ఫర్ ఆక్సైడులు : SO2, SO3
2) నైట్రోజన్ ఆక్సెడులు : NO, NO2
3) హైడ్రోకార్బన్లు
4) కార్బన్ ఆక్సైడులు : CO, CO2
1) సల్ఫర్ ఆక్సైడులు : సల్ఫర్ అనుఘటకంగా గల శిలాజ జాతి ఇంధనాలు మండినప్పుడు సల్ఫర్ ఆక్సైడ్లు ఏర్పడతాయి. వీటిలో సర్వ సాధారణంగా ఉండే రసాయన పదార్థం సల్ఫర్ డై ఆక్సైడ్ వాయుస్థితిలో ఉంటుంది.
S + O2 → SO2 (వా)
సల్ఫర్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం చెంది సల్ఫర్ ట్రై ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతుంది.
2SO2 (వా) + O2 (వా) → 2SO3 (వా)
2) నైట్రోజన్ ఆక్సైడులు : ఎత్తైన ప్రదేశాలలో మెరుపులు సంభవించినప్పుడు గాలిలోని N2, O2 లు చర్యనొంది NO ఏర్పడుతుంది.
N2 + O2 → 2NO (వా)
2NO (వా) + O2 → 2NO2 (వా)
3) హైడ్రోకార్బన్లు : ఆటోమొబైల్లో వాడే ఇంధనాలు అసంపూర్ణంగా మండినప్పుడు ఇవి ఏర్పడతాయి.
4) కార్బన్ మొనాక్సైడ్ : కార్బన్ అసంపూర్ణ దహనచర్యకు గురైనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ (CO) ఏర్పడుతుంది. పూర్తిగా దహనం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ (CO2) ఏర్పడుతుంది.
C (ఘ) + \(\frac{1}{2}\)O2 (వా) → CO (వా)
C (ఘ) + O2 (వా) → CO2 (వా)
ప్రశ్న 26.
గ్రీన్ హౌస్ ఫలితం అంటే ఏమిటి ? ఇది ఎలా కలుగుతుంది ?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, నైట్రిక్ ఆక్సైడ్ మరియు నీటిఆవిరులు పరారుణకాంతిని శోషించుకొని మరల భూమిపైకి ఉద్గారం చేస్తాయి. ఈ క్రియ వల్ల భూమి ఉపరితలం వేడెక్కుతుంది. ఈ దృగ్విషయాన్ని భూమి వేడెక్కడం లేదా భౌగోళిక తాపనం అంటారు. ఈ తాపనానికి కారణమయ్యే వాయువులను హరితగృహ వాయువులు అంటారు.
హరితగృహ ప్రభావం యొక్క దుష్ప్రభావాలు :
- వాతావరణంలో 1°C ఉష్ణోగ్రత పెరిగితే, ధ్రువ ప్రాంతాలలోని మంచు శిఖరాలు కరిగి సముద్రపు నీటిమట్టం పెరుగుతుంది. దీనివల్ల అనేక తీరప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్నది.
- భూగోళం వేడెక్కడం వలన సముద్రాలు, నదులు, సరస్సులలోని నీటి బాష్పీభవనం రేటు కూడా పెరుగుతుంది. దీని కారణంగా అకాల వర్షాలు, తుపానులు వచ్చే అవకాశం ఉన్నది.
- ఉపరితల నీరు వేగంగా బాష్పీభవనం చెందటం వల్ల వ్యవసాయరంగం కూడా దుష్ప్రభావానికి గురి అవుతుంది. వ్యవసాయరంగానికి నీటికొరత అధికమవుతుంది.
చెట్లను, అడవులను పెంచటం, CFC తయారీని నిలుపుచేయటం మొదలగు చర్యల వల్ల భౌగోళిక తాపనాన్ని నివారించవచ్చు.
ప్రశ్న 27.
ఆమ్ల వర్షం ఏర్పడే విధానాన్ని తెలుపుతూ దానిలోని అంతర్గత రసాయన సమీకరణాలను వివరించండి.
జవాబు:
నైట్రోజన్ మరియు సల్ఫర్ యొక్క ఆక్సెడ్లు (రవాణా మరియు పారిశ్రామికరంగాల నుండి విడుదల చేయబడినవి) వాతావరణంలోకి చేరుతాయి. అంతేకాక ఇవి నీటిలో కరిగి HNO3 మరియు H2SO4 లను తయారుచేస్తాయి. ఈ ఆమ్లాలు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి.
2SO2 (వా) + O2 (వా) + 2H2O (ద్ర) → 2H2SO4 (జల)
4NO2 (వా) + O2 (వా) + 2H2O (ద్ర) → 4HNO3 (జల)
ప్రశ్న 28.
ఆమ్ల వర్షం ద్వారా కలిగే చెడు ప్రభావాలను వివరించండి.
జవాబు:
ఆమ్లవర్షం వల్ల కలిగే చెడు ప్రభావాలు :
- నేలలో pH విలువ తగ్గి, భూసారం క్షీణించిపోతుంది.
- కట్టడాల జీవితకాలం అనూహ్యంగా తగ్గిపోతుంది.
- చలువరాళ్ళతో కట్టిన తాజ్మహల్ యొక్క గాజులా ఉండే నునుపు స్వభావం ఆమ్లవర్ష ప్రభావానికి లోనవుతున్నది.
ప్రశ్న 29.
కాంతి రసాయన స్మాగ్ ఎలా ఏర్పడుతుంది ? ఇది కలుగజేసే చెడు ప్రభావాలు ఏమిటి ?
జవాబు:
కాంతి రసాయన స్మాగ్ ఏర్పడటం : శిలాజ జాతి ఇంధనాలు మండినప్పుడు భిన్న రకాల కాలుష్యాలు భూగోళ ట్రోపోవరణంలోకి ఉద్గారించబడతాయి. ఉద్గారించబడిన కాలుష్యాలలో హైడ్రోకార్బన్లు (మండనటువంటి ఇంధనాలు), నైట్రిక్ ఆక్సైడ్ (NO) లు రెండూ కాలుష్యాలుగా ఉన్నాయి. ఈ కాలుష్యాల గాఢతలు అధిక స్థాయిలకు చేరినప్పుడు అవి సౌరకాంతితో పరస్పర చర్యలో పాల్గొని, ఒక గొలుసు చర్యను జరుపుతాయి. ఈ గొలుసు చర్యలో NO నైట్రోజన్ ఆక్సైడ్గా (NO2) మారుతుంది. ఈ NO2 తిరిగి సౌరకాంతి నుంచి శక్తిని గ్రహించి నైట్రిక్ ఆక్సైడ్గాను, స్వేచ్ఛాస్థితిలో ఉండే ఆక్సిజన్గాను విడిపోతుంది.
ఆక్సిజన్ పరమాణువులు రసాయనికంగా చాలా చురుకైనవి. ఇవి గాలిలోని O2తో సంకలనం చెంది ఓజోన్ ను ఏర్పరుస్తాయి.
O (వా) + O2 (వా) ⇌ O3 (వా)
NO, ఓజోన్ తో చర్య జరిపి NO2 ను తిరిగి ఏర్పరుస్తుంది. NO2 బ్రౌన్ రంగు వాయువు. ఇది సరైన అధిక గాఢతల వద్ద “మసకత్వం” (chaze) ఏర్పడటానికి దారితీస్తుంది.
NO (వా) + O3 (వా) → NO2 (వా) + O2 (వా)
ఓజోన్ విషవాయువు. NO2, O3 లు రెండూ బలమైన ఆక్సీకరణులు. ఇవి కాలుష్య గాలిలో మండే చర్యకు గురి కాకుండా మిగిలి ఉన్న హైడ్రోకార్బన్లతో చర్యజరిపి, ఫార్మాల్డిహైడ్, ఎక్రోలీన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN) వంటి రసాయన పదార్థాలను ఏర్పరుస్తాయి. దీనినే కాంతి రసాయన స్మాగ్ అంటారు.
ప్రశ్న 30.
వాతావరణంలో ఓజోన్ పొర తరుగుదల ఎలా ఏర్పడుతుంది ? ఈ ఓజోన్ పొర తరుగుదల వల్ల ప్రాప్తించే హానికరమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
స్ట్రాటోవరణంలో ఉండే ఓజోను సూర్యుని నుంచి వెలువడే అపాయకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. దీనిని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోనికి విడుదల కావడం ఓజోన్ పొర తరుగుదలకు ముఖ్యకారణం.
స్ట్రాటోవరణంలోని UV వికిరణాలచే CFC లు వియోగం చెందించబడి, క్లోరిన్ స్వేచ్ఛాప్రాతిపదికను విడుదల చేస్తాయి.
క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదిక స్ట్రాటోవరణంలోని ఓజోన్తో చర్యజరిపి, క్లోరిన్ మోనాక్సైడ్ ప్రాతిపదికలను అణు ఆక్సిజన్ ను విడుదలచేస్తుంది.
క్లోరిన్ మోనాక్సైడ్ ప్రాతిపదిక, పరమాణు స్థితిలో ఉండే ఆక్సిజన్తో చర్యజరిపి అధిక సంఖ్యలో క్లోరిన్ ప్రాతిపదికలను ఏర్పరుస్తుంది.
క్లోరిన్ ప్రాతిపదికలు నిరంతరంగా ఏర్పడి ఓజోను అణువు వియోగచర్యను జరుపుతాయి. కాబట్టి క్లోరిన్ ప్రాతిపదికలను నిరంతరంగా ఉత్పత్తి చేసి, స్ట్రాటోవరణంలోకి చేర్చడానికి CFC లు రవాణా కారకాలుగా పనిచేస్తాయి. ఇవి ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. ఒక CFC అణువు, సుమారు ఒక లక్ష O3 అణువులను నాశనం చేస్తుంది.
ఓజోన్ పొర తరుగుదల ప్రభావాలు :
- UV కిరణాలు అధిక పరిమాణంలో ట్రోపోవరణంలోకి చేరతాయి.
- UV కిరణాల వల్ల చర్మం వడిలిపోతుంది.
- కంటిలో శుక్లాలు ఏర్పడతాయి.
- చర్మంపై బొబ్బలు వస్తాయి.
- చర్మక్యాన్సర్ వస్తుంది.
- చేపల ఉత్పత్తికి నష్టం కలుగుతుంది.
ప్రశ్న 31.
నీటి కాలుష్యానికి కారణమైన పారిశ్రామిక వ్యర్థాలను పేర్కొనండి. త్రాగేనీటి అంతర్జాతీయ ప్రమాణాలను పేర్కొనండి.
జవాబు:
- పారిశ్రామిక రసాయన పదార్థాలను పాలిక్లోరినేటెడ్ బై ఫినైల్ను ఉపయోగించే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల నీటికాలుష్యం జరుగుతుంది.
- ఎరువుల పరిశ్రమల నుండి వెలువడే ఫాస్ఫేటులు నీటిలోకి చేరితే ఆల్గేల అభివృద్ధి జరుగుతుంది. అవి నీటిలోని ఆక్సిజన్ గాఢతను తగ్గించేస్తాయి.
- చాలా నీటివనరులను పెట్రోలియం ఉత్పన్నాలు కాలుష్యానికి గురిచేస్తున్నాయి.
- పేపరు మరియు బట్టల మిల్లుల నుండి వెలువడే వ్యర్థాల వల్ల నీటికాలుష్యం జరుగుతుంది.
- ఆమ్లాలు, క్షారాలు, డిటర్జెంట్లు, ప్రేలుడు పదార్థాలు, అద్దకాలు, చీడ నాశినులు, ఎరువులు, సిలికోనులు, ప్లాస్టిక్ లు తయారుచేసే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు నీటికాలుష్యానికి కారణభూతాలవుతున్నాయి.
త్రాగునీటి అంతర్జాతీయ ప్రమాణాలు :
ఫ్లోరైడ్ : 1 ppm నైట్రేటు – 50 ppm
సల్ఫేటు : < 500 ppm లెడ్ – 50 ppb
ప్రశ్న 32.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి అవలంబించే హరిత రసాయనశాస్త్రంలోని ప్రణాళికలను సవివరంగా తెలపండి.
జవాబు:
రసాయనశాస్త్రం మరియు ఇతర శాస్త్ర విభాగాలను ఉపయోగించి వాటి అవగాహన, సూత్రాలతో సాధ్యమైనంతవరకు పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడడం గురించి చెప్పేదే హరిత రసాయనశాస్త్రం.
పరిశ్రమలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండా లేదా అతికొద్ది మాత్రంలో ఏర్పడే చర్యలను హరిత రసాయన చర్యలు అంటారు. ఈ దిశగా ఆలోచించి హరిత రసాయనశాస్త్రానికి కొన్ని సూత్రాలను ఏర్పరిచారు. అవి :
- వ్యర్థ అనుజనిత పదార్థాల పరిమాణాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలి.
- విషరహిత, ప్రమాదరహిత క్రియాజనకాలను ఎన్నుకోవాలి.
- అత్యధిక దిగుబడి వచ్చే విధంగా చర్యాపరిస్థితులను స్థిరీకరించాలి.
- కాలుష్యరహిత మరియు సురక్షితమైన ద్రావణిని ఉపయోగించాలి.
- వీలైనచోట సాధారణ వేడిచేసే పద్ధతులు బదులు మైక్రోతరంగాలతో గాని, అతిధ్వనులతో గాని వేడిచేయాలి. ఎందుకంటే ఆ పద్ధతిలో రసాయన చర్యలు హరిత చర్యలుగా జరపబడతాయి.
దైనందిన జీవితంలో హరిత రసాయనశాస్త్రం :
- వస్త్రాల నిర్జల శుద్ధిక్రియ (Dry Cleaning) : నిర్జల పద్ధతిలో వస్త్రాలను శుభ్రంచేసే ప్రక్రియలో టెట్రాక్లోరో ఈథేన్ ను (Cl2 C = CCl2) ఉపయోగించేవారు. ఈ పదార్ధం భూగర్భజలాలను మలినం చేస్తుంది. అంతేకాక క్యాన్సర్ కారకం. దీనికి బదులు ప్రస్తుతం ద్రవరూపంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్కు డిటర్జెంటును కలిపి ఏర్పడిన మిశ్రమం ద్వారా శుభ్రంచేసే ప్రక్రియను జరుపుతున్నారు.
- వస్త్రాలను వివర్ణం చేయడానికి, లాండ్రి ప్రక్రియలలో హైడ్రోజన్పరాక్సైడ్ను (H2O2) వాడుతున్నారు.
- కాగితాలను వివర్ణం చేయడం : కాగితాలను వివర్ణం చేయడానికి పూర్వం క్లోరిన్ వాయువును ఉపయోగించేవారు. ఈ రోజుల్లో హైడ్రోజన్ పెరాక్సైడును, హైడ్రోజన్ పెరాక్సైడ్ వివర్ణ సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకాన్ని దానితో కలిపి వాడుతున్నారు. ‘
- రసాయన పదార్థాల సంశ్లేషణం : 90% దక్షతతో జలమాధ్యమంలో అయానిక ఉత్ప్రేరకం సమక్షంలో ఈథేన్ ను ఏక అంచె ఆక్సీకరణం చర్యకు గురిచేసి ఇథనాల్ (ఎసిటాల్డిహైడ్, (CH3CHO) ను తయారుచేస్తున్నారు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 33.
పర్యావరణ కాలుష్యం అంటే ఏమిటి ? ఈ కాలుష్యం ఎన్ని రకాలు ?
జవాబు:
మొక్కలు, జంతువులు, మానవులపై హానికరమైన ప్రభావం ప్రదర్శిస్తూ పరిసరాలలో చోటుచేసుకొని ఉండే, అవాంఛనీయ మార్పులు ప్రదర్శించే ప్రభావాన్నే పర్యావరణ కాలుష్యం అంటారు.
పారిశ్రామికీకరణ కారణంగాను, జనాభా పెరుగుదల కారణంగాను ఎన్నో వ్యర్థ పదార్థాలు పర్యావరణంలోనికి ప్రవేశించుటవలన పర్యావరణం కాలుష్యం అవుతోంది.
పర్యావరణ కాలుష్యానికి కారణాలు :
- జనాభా పెరుగుదల, సహజ వనరుల తరుగుదల
- పారిశ్రామికీకరణ
- అడవులను నరికివేయుట
- పట్టణీకరణ
కాలుష్య రకాలు :
- వాయు కాలుష్యం
- జల కాలుష్యం
- భూమి కాలుష్యం
- ధ్వని కాలుష్యం
- రేడియోధార్మిక కాలుష్యం
వాయు కాలుష్యం :
సల్ఫర్ ఆక్సైడులు : సల్ఫర్ అనుఘటకంగా గల శిలాజ జాతి ఇంధనాలు మండినప్పుడు సల్ఫర్ ఆక్సైడ్లు ఏర్పడతాయి.
SO2 వాయుస్థితిలో ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు, కళ్ల వెంబడి నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటివి, సల్ఫర్ డైఆక్సైడ్ కళ్లకు కలిగించిన ప్రకోపనం ద్వారా వస్తుంది.
S (ఘ) + O2 (వా) → SO2 (వా) ;
2 SO2 (వా) + O2 (వా) → SO3 (వా)
SO2 (వా) + O3 (వా) → SO3 (వా) + O2 (వా)
SO2 (వా) + H2O2 (ద్ర) → H2SO4 (ద్ర)
నైట్రోజన్ ఆక్సైడ్లు : రవాణా వాహనాలలో శిలాజ జాతి ఇంధనాలు మండించినప్పుడు, నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది.
N2 (వా) + O2 (వా) → 2NO (వా)
NO తక్షణమే ఆక్సిజన్తో చర్య జరిపి NO2 ను ఏర్పరుస్తుంది.
స్ట్రాటో ఆవరణంలో నైట్రిక్ ఆక్సైడ్ ఓజోన్ తో చర్య జరిపినపుడు NO2 ఏర్పడుతుంది.
2NO (వా) + O3 (వా) → NO2 (వా) + O2 (వా)
2NO (వా) + O2 (వా) → 2NO2 (వా)
అధిక పరిమాణాలలో ఉండే NO2 మొక్కల ఆకులను పాడుచేసి, కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గిస్తుంది.
కార్బన్ మోనాక్సైడ్ : కార్బన్ అసంపూర్ణ దహనచర్యకు గురైనప్పుడు CO ఏర్పడుతుంది. ఆటోమొబైల్ల నుంచి వెలువడే బహిష్కృతాల ద్వారా ఇది గాలిలోకి చేరుకుంటుంది. ఇది రక్తంలోని హీమోగ్లోబిన్ తో బంధించబడి కార్బాక్సీ హీమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది. రక్తం యొక్క ఆక్సిజన్ రవాణా సామర్ధ్యం విపరీతంగా తగ్గిపోతుంది.
కార్బన్ డై ఆక్సైడ్ : అడవులను నరికివేయడం, శిలాజ జాతి ఇంధనాలను మండించడం మొదలైన చర్యల ద్వారా వాతావరణంలో CO2స్థాయి పెరిగి, వాతావరణ సమతుల్యత లోపిస్తుంది. గాలిలో పెరిగిన CO2 పరిమాణం కారణంగా భూగోళం వేడెక్కడం జరుగుతుంది.
నీటి కాలుష్యం : మానవ కార్యకలాపాల ద్వారా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భిన్నమార్గాల ద్వారా నీటి కాలుష్యం ఉపరితల నీటి వనరులను, భూగర్భ నీటివనరులను చేరుతుంది. COD, BOD విలువల ద్వారా నీటి కాలుష్య పరిమాణాన్ని నిర్ణయించవచ్చు.
ప్రశ్న 34.
కింది వాటిని వివరంగా తెలపండి.
(a) భూగోళం వేడెక్కడం
(b) ఓజోను తరుగుదల
(c) ఆమ్ల వర్షం
(d) యూట్రోఫికేషన్
జవాబు:
(a) భూగోళం వేడెక్కడం కార్బన్ డై ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, నైట్రిక్ ఆక్సైడ్ మరియు నీటిఆవిరులు పరారుణ కాంతిని శోషించుకొని మరల భూమిపైకి ఉద్గారం చేస్తాయి. ఈ క్రియ వల్ల భూమి ఉపరితలం వేడెక్కుతుంది. ఈ దృగ్విషయాన్ని భూమి వేడెక్కడం లేదా భౌగోళిక తాపనం అంటారు. ఈ తాపనానికి కారణమయ్యే వాయువులను హరిత గృహ వాయువులు అంటారు.
హరిత గృహ ప్రభావం యొక్క దుష్ప్రభావాలు :
- వాతావరణంలో 1°C ఉష్ణోగ్రత పెరిగితే, ధ్రువ ప్రాంతాలలోని మంచు శిఖరాలు కరిగి, సముద్రపు నీటి మట్టం పెరుగుతుంది. దీనివల్ల అనేక తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్నది.
- భూగోళం వేడెక్కడం వలన సముద్రాలు, నదులు, సరస్సులలోని నీటి బాష్పీభవనం రేటు కూడా పెరుగుతుంది. దీని కారణంగా అకాల వర్షాలు, తుపానులు వచ్చే అవకాశం ఉన్నది.
- ఉపరితల నీరు వేగంగా బాష్పీభవనం చెందటం వల్ల వ్యవసాయరంగం కూడా దుష్ప్రభావానికి గురవుతుంది. వ్యవసాయ రంగానికి నీటి కొరత అధికమౌతుంది.
చెట్లను, అడవులను పెంచటం, CFC తయారీని నిలుపుచేయటం మొ॥గు చర్యల వల్ల భౌగోళిక తాపనాన్ని నివారించవచ్చు.
(b) ఓజోను తరుగుదల : క్లోరోఫ్లోరో కార్బన్లు త్వరితంగా వాతావరణంలోని పైపొరను చేరుకొని, అక్కడి UV వికిరణాన్ని శోషించుకొని, విఘటనం చెంది క్లోరిన్ పరమాణువులను ఇస్తాయి.
స్వేచ్ఛా స్థితిలోని Cl* పరమాణువు ఓజోన్ ను విఘటనం చెందించి O2 ను ఇస్తుంది.
దీనివల్ల ఓజోన్ సాంద్రతలో క్షీణత కనిపిస్తుంది. ఈ క్షీణత కారణంగా ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాల ద్వారా అతినీలలోహిత కిరణాలు భూమిని చేరి, మానవులకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. కంటిలో శుక్లాలు, చర్మ క్యాన్సర్ వంటి అనారోగ్యాలను కలుగచేస్తాయి.
(c) ఆమ్ల వర్షం : నైట్రోజన్ మరియు సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు (రవాణా మరియు పారిశ్రామిక రంగాల నుండి విడుదల చేయబడినవి) వాతావరణంలోకి చేరుతాయి. అంతేకాక ఇవి నీటిలో కరిగి HNO3 మరియు H2SO4లను తయారు చేస్తాయి. ఈ ఆమ్లాలు నీటిలో కరిగి, ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి.
2SO2 (వా) + O2 (వా) + 2H2O (ద్ర) → 2H2SO4 (జల)
4NO2 (వా) + O2 (వా) + 2H2O (ద్ర) → 4HNO3 (జల)
ఆమ్ల వర్ష ప్రభావాలు :
- నేలలోని pH విలువ తగ్గి, భూసారం క్షీణించిపోతుంది.
- కట్టడాల జీవితకాలం అనూహ్యంగా తగ్గిపోతుంది.
- చలువ రాళ్ళతో కట్టిన తాజ్మహల్ గాజులా ఉండే నునుపు స్వభావం ఆమ్ల వర్ష ప్రభావానికి లోనవుతున్నది.
(d) యూట్రోఫికేషన్ : నీటి వనరులైన సరస్సులు, చెరువులలోకి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన కర్బన రసాయన పదార్థాలు చేరితే ఆ నీటికి పోషక గుణం పెరుగుతుంది. ఇది విపరీతంగా ఆల్గే పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇలా పోషక గుణం పెరిగిన సరస్సును “యూట్రోఫిక్ సరస్సు” అనీ, ఈ దృగ్విషయాన్ని “యూట్రోఫికేషన్” అని అంటారు.
ప్రశ్న 35.
హరిత రసాయనశాస్త్రం పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. వివరించండి.
జవాబు:
పర్యావరణానికి ఏ మాత్రం హాని కలుగకుండా రసాయన పదార్థాలను సంశ్లేషించుటనే హరిత రసాయనశాస్త్రం అంటారు.
పాల్.టి. అనస్టాస్ కృషి ఫలితంగా రసాయనశాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలు ఏర్పరచబడినాయి. ఈ నియమాలను పాటిస్తే కాలుష్యాన్ని నివారించవచ్చు.
- వ్యర్థ పదార్థాలను నివారించాలి లేదా కనిష్ఠ స్థాయికి తగ్గించాలి.
రసాయన సంశ్లేషణను వ్యర్థ అనుజనిత పదార్థం ఏర్పడని విధంగా సూత్రీకరించాలి. లేదా అట్టి పదార్థం కనిష్ఠ స్థాయిలో ఏర్పడే విధంగా సూత్రీకరించాలి. - క్రియాజనకాలను, కారకాలను గరిష్ఠ స్థాయిలో ఉత్పన్నాలుగా మార్చాలి.
ఉదా : డీల్స్ – ఆల్డర్ చర్య. - ఆరోగ్యానికి హానికర లేదా ప్రమాదకర ఉత్పన్నాలను నిరోధించాలి.
- తక్కువశక్తితో (వేడి . మొ॥) మరియు తక్కువ సమయంలో సంశ్లేషణ పూర్తి అయ్యే విధంగా రసాయన చర్యను ఎన్నుకోవాలి.
- సంశ్లేషణలో బాష్పశీల మరియు కర్బన ద్రావణులను వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఇట్టి ద్రావణులు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరై వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. బెంజీన్ వంటి కొన్ని ద్రావణులైతే క్యాన్సర్ కారకాలు. అందుకే నీటిలో జరిపే చర్యలు చాలా క్షేమకరం.
కొన్నిసార్లు అసలు ద్రావణమే లేకుండా ఘనస్థితిలో రసాయనచర్యలు జరపగలిగి ఉంటాయి. ఆ విధమైన సంశ్లేషణత హరిత సంశ్లేషణత అవుతుంది.
ఈ నియమాలను పాటిస్తే కాలుష్యం నివారించబడుతుంది.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 1.
నీటిలో ఫ్లోరైడ్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది ?
జవాబు:
త్రాగేనీటిలో ఫ్లోరైడ్ గాఢత 2 ppm మించకుండా ఉంటే అది హానికరం కాదు. అదే గాఢత 2 ppm దాటితే ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ ఫ్లోరైడ్ గాఢత అధికంగా కలిగిన నీటిని త్రాగితే అందులోని F– అయానులు మన శరీరంలోని ఎముకలు, దంతాలలోని కాల్షియంతో చర్య జరిపి కాల్షియం ఫ్లోరైడులను తయారుచేస్తాయి.
Ca + F2 → CaF2
ఈ చర్య వలన దంతాలు పసుపు వర్ణంలోకి మారతాయి. అంతేకాక శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి.
ప్రశ్న 2.
నీటిలో ఫ్లోరైడులను తొలగించే నల్గొండ పద్ధతిని వ్రాయండి.
జవాబు:
నల్గొండ పద్ధతి : ఈ పద్ధతిలో విరంజనచూర్ణం, సున్నం, పటిక ఇదే క్రమంలో నీటిలో కలిపి ఆ నీటిని కొంతకాలం నిలవ ఉంచుతారు. నీటిలోని ఫ్లోరైడ్ అయాన్లు కాల్షియం అమోనియం ఫ్లోరైడ్ అని సంక్లిష్టంగా అవక్షేపం చెందుతాయి. దీనిని వడపోస్తారు. ఏర్పడ్డ శుద్ధ నీటిని అవసరాలకు ఉపయోగిస్తారు.
ప్రశ్న 3.
పారిశ్రామిక వ్యర్థాలు గురించి వ్రాయండి.
జవాబు:
పారిశ్రామిక ఘనస్థితి వ్యర్థపదార్థాలను జీవవిచ్ఛిన్నశీలత గల పదార్థాలుగాను, జీవ విచ్ఛిన్నశీలతలేని వ్యర్థపదార్థాలుగాను వర్గీకరిస్తారు.
పత్తిమిల్లులు, ఆహారపదార్థాలను తయారుచేసే యూనిట్లు, కాగితపు మిల్లులు జీవవిచ్ఛిన్నశీలత గల వ్యర్థపదార్థాలను ఉత్పన్నం చేస్తాయి.
విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఫ్లై బూడిదను విడుదల చేసే యంత్రాగారాలు, బ్లాస్ట్ బల్బు నుంచి వెలువడే లోహమలం, జీవవిచ్ఛిన్నశీలత లేని వ్యర్థపదార్థం.
జీవవిచ్ఛిన్నశీలతలేని పారిశ్రామిక ఘనస్థితి వ్యర్థపదార్థాలను సరైన క్రమమైన పద్ధతుల ద్వారా పరిష్కరించకపోతే అవి పర్యావరణానికి ప్రమాదాన్ని కల్గిస్తాయి.
ప్రశ్న 4.
కొన్ని సేంద్రియ కాలుష్య కారకాలు తెలపండి.
జవాబు:
మలాథియాన్, DDT, క్లోరోఫినాక్స్ వర్ణసమ్మేళనాలు, ఫినైల్ మెర్క్యురీ ఎసిటేట్ మొ||నవి..
ప్రశ్న 5.
పర్యావరణాన్ని కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవచ్చు ?
జవాబు:
పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- వ్యర్థ పదార్థాల నిర్వహణ.
- క్రిమిసంహారక మందులు, తెగుళ్ళ మందులు తయారుచేసే పరిశ్రమలలో వెలువడే వ్యర్థ పదార్థాలను జీవ పతనం చెందించాలి.
- హరిత రసాయనశాస్త్రాన్ని విస్తరింపచేయటం.
- అడవులను పెంచాలి.
- సంప్రదాయ ఇంధనాలకు బదులుగా సంప్రదాయేతర ఇంధనాల ఉత్పత్తిని, వాడుకను ఎక్కువ చేయాలి. సౌరశక్తిని నిలువచేసే విధానాలపై దృష్టి సారించాలి.
- ప్లాస్టిక్లను జీవపతనం చెందించాలి.
- అధిక జనాభాను అరికట్టాలి.
- మామూలు రసాయన పద్ధతులకు బదులుగా జీవసాంకేతిక పద్ధతులను పరిశ్రమలలో ఉపయోగించాలి.
- ప్రజలకు పర్యావరణ కాలుష్యం వల్ల జరిగే నష్టాలను తెలియజేయడం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం తెలియజేయడం.