శ్రీలు పొంగిన జీవగడ్డ TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana
చదవండి – ఆలోచించండి – మాట్లాడండి

ప్రశ్నలు:
ప్రశ్న 1.
 పై వాక్యాలు దేని గురించి చెప్తున్నాయి?
 జవాబు.
 పై వాక్యాలు దేశం యొక్క గొప్పదనం గూర్చి చెప్తున్నాయి.
ప్రశ్న 2.
 దేశంపట్ల ఎటువంటి భావనతో ఉండాలి?
 జవాబు.
 మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ కాలుపెట్టినా, ఎంత ఉన్నతస్థానానికి వెళ్ళినా మన దేశం పట్ల గౌరవ భావంతో ఉండాలి.

ప్రశ్న 3.
 జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
 జవాబు.
 మన భారతమాత గొప్పతనాన్ని చాటడమే జాతి గౌరవాన్ని నిలపడం అని నా ఉద్దేశ్యం.
ప్రశ్న 4.
 ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు?
 జవాబు.
 శ్రీ రాయప్రోలు సుబ్బారావు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.108)
ప్రశ్న 1.
 కవి భారత భూమిని ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనడంలో ఆంతర్యమేమిటి?
 జవాబు.
 భారత భూమిలో సంపదలున్నాయి. వజ్రాల గనులు, బంగారం గనులు, ఇవికాక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఎన్నటికీ తరగని ప్రకృతి సంపద ఉన్నది. చదువులకు, సాములకు, ఋషులకు, వీరులకు నిలయమైనది భారతభూమి. ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులు దేశగౌరవాన్ని కీర్తి శిఖరాలపై నిలిపారు. అందుకే కవి భారతదేశాన్ని శ్రీలుపొంగిన జీవగడ్డ అన్నాడు. శ్రీలు అంటే సంపదలు.
ప్రశ్న 2.
 భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది.
 జవాబు.
 భారతదేశంలో వ్యాసుడు, వాల్మీకి మొదలుగా గల మహాకవులు, మహర్షులు జన్మించారు. సంస్కృతికి, సంప్రదాయానికి నిలయంగా ఉన్నది ఈ దేశం. వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది పవిత్ర గ్రంథాలు ఇక్కడే పుట్టాయి. అందుకే ఈ దేశం పుణ్యభూమిగా కీర్తించబడింది.
ప్రశ్న 3.
 చెవులకు విందుచేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
 జవాబు.
 మనకు ఇష్టమైనది సమృద్ధిగా దొరకడమే విందు. ఇంపైన భోజనం విందు భోజనం. చూడటానికి అందంగా ఉంటే కనుల విందు అనీ, అలాగే వినడానికి ఇష్టంగా ఉండే మాటలుగాని పాటలుగాని లభించినపుడు చెవులకు విందు అనీ అంటాము. చెవులకు విందుచేయడం అంటే మధురంగా పాడటం, ప్రియంగా మాట్లాడటం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.109)
ప్రశ్న 1.
 ఎటువంటి పనులు చేసినవారు ధీరపురుషులుగా కీర్తించబడతారు?
 జవాబు.
 దేశము యొక్క గర్వమును నిలబెట్టేట్లు ప్రకాశింపజేసిన వారిని, దేశము యొక్క గొప్ప చరిత్రను ప్రపంచమంతా తెలిసేలా చేసిన వారిని, దేశమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారిని ‘ధీరపురుషులు’ అని కీర్తిస్తారు. ధీరులు అంటే వీరులు.
ప్రశ్న 2.
 భారత వైభవాన్ని ఎందుకు పాడుకోవాలి?
 జవాబు.
 మనం భారతదేశంలో పుట్టాం. భారతీయులం. ఈ భారతదేశం గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఆ గొప్పదనాన్ని సంపాదించి పెట్టిన మహనీయులను గుర్తుచేసుకుంటూ భక్తితో భారతదేశ వైభవాన్ని పాడుకోవాలి.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఈ గేయం దేన్ని గురించి చెపుతున్నది? ఇందులో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి ?
 జవాబు.
 1. ఈ గేయం భారతదేశం గొప్పతనం గూర్చి చెపుతోంది.
 2. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, వీరులైన రాజులను గూర్చి, ఇక్కడి నదుల గొప్పదనం గురించి గానం
 చేయాలని చెపుతోంది.
దేశభక్తికి సంబంధించిన విషయాలు :
- భారతదేశం సిరులు పొంగిన జీవగడ్డ, పాడిపంటలు గల భాగ్యదేశం.
- దేశ గౌరవం ప్రకాశించేటట్లు, దేశ చరిత్ర విస్తరించేటట్లు, దేశాన్ని కాపాడిన వీర పురుషుల గురించి తెలుసుకోవాలి. అదే దేశభక్తి.

2. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి.
 జవాబు.
 కవి రాయప్రోలు సుబ్బారావు మనదేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేవిధంగా, ప్రతివారూ పాడుకొనేందుకు వీలుగా ఈ కింది విషయాలను చెప్పారు.మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. అలాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.
వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది.
ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారంగల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది.
సూత్రాలను చెప్పిన కాలంనాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి.
కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి.
 నవరసాలతో నిండిన, తేటతెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.
పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగుపదాలతో అందరూ కలసి పాడుకోవాలి.
ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు.
 భరతఖండము, జీవగడ్డ, భాగ్యసీమ, విమల తలము, భావిభారతము.
2. ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
అ. మనదేశం వేదాలకు పుట్టినిల్లు
 జవాబు.
 వేదశాఖలు వెలిసెనిచ్చట.
ఆ. కాకతీయుల యుద్ధ నైపుణ్యం
 జవాబు.
 కాకతీయుల కదన పాండితి.
ఇ. లేత మాటలు చెవులకింపుగ
 జవాబు.
 చివురు పలుకులు చెవులవిందుగ.
ఈ. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
 జవాబు.
 ఉపనిషన్మధువొలికె నిచ్చట.
ఉ. నవరసాలు నాట్యమాడాయి.
 జవాబు.
 నవరసమ్ములు నాట్యమాడగ
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి.
 జవాబు.
 చరిత్రలో భారత దేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. కాకతీయరాజులు గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు, విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయలు తమ పరాక్రమంతో శత్రువులను మట్టుపెట్టి సుస్థిర రాజ్యాన్ని స్థాపించారు. వీరశివాజీ మన దేశాన్ని శత్రువుల బారినుండి కాపాడిన మహావీరుడు.
ఆ) “బానిసతనం” అంటే ఏమిటి ?
 జవాబు.
 “బానిసతనం” అనగా ‘దాస్యము’ అని అర్థం. స్వేచ్ఛగా బతకలేకపోవడం, ఇతరుల అధికారానికి లోబడి ఉండడం బానిసతనం. ఆంగ్లేయులు మనదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి నెమ్మదిగా మనమీద పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలకు పైగా మనలను పాలించారు. ఆ సమయంలో ఆంగ్లేయులు మనలను చిత్రహింసలకు గురిచేశారు. ఆంగ్లేయుల అహంకారానికి ‘మనం 200 సంవత్సరాలు పైగా బానిసతనం’ చేయవలసి వచ్చింది. చివరకు మనదేశ ప్రజలు ఉద్యమాలు నడిపి వారిని తరిమికొట్టారు.

ఇ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
 జవాబు.
- “భరతఖండంబు” సిరులు పొంగిన, జీవమున్న భూమి.
- పాడి పంటలతో వర్ధిల్లుతుంది.
- విస్తారమైన అడవులు సమృద్ధిగా ఉన్నాయి.
- అనేక నదీజలాలు మన దేశాన్ని సమృద్ధం చేస్తున్నాయి.
 అటువంటి భారతదేశాన్ని భాగ్యసీమ అనడంలో సందేహం లేదు.
ఈ) రాయప్రోలు సుబ్బారావుగారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
 జవాబు.
 భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.
2. కింది ప్రశ్నలకు పదేసి పంక్తులలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
 జవాబు.
 మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలుగల భాగ్యదేశం. వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్ర భూమి ఇది. అయితే ఆ కాలం నాటి గొప్పతనం, చరిత్ర పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. అవన్నీ మరుగున పడిపోయాయి.
మనందరం భారతీయులం. కాబట్టి మనం మనదేశ గొప్పదనాన్ని గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పవిత్రమైన నదులు, పవిత్రమైన అరణ్యాలున్నాయి. “భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం” మనది. మనదేశం మతసామరస్యానికి (ఆలవాలం) నిలయం. ఇవన్నీ మనదేశానికి ఉన్న ప్రత్యేకతలు. మనందరం మనదేశము యొక్క గొప్పదనాన్ని గూర్చి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. అప్పుడే మనం ఏ దేశం వెళ్ళినా, మన దేశం యొక్క గొప్పదనాన్ని గూర్చి విదేశీయులకు చక్కగా వివరించగలుగుతాం.
ప్రశ్న 2.
 శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి.
 జవాబు.
 భారతదేశం సిరిసంపదలకు నిలయం. ఇక్కడ వేదాలు, వేదాంగాలు వెలిసినాయి. ఆదికావ్యమైన రామాయణం వాల్మీకి రాశాడు. వ్యాసుడు మొదలైన గొప్ప ఋషులకు ఇది నివాసం. అందమైన అడవులు, మహావృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఉపనిషత్తులు రాయబడ్డాయి. తత్త్వవేత్తలకు నిలయమైన పుణ్యభూమి భారతదేశం. సూత్రయుగములనాటి సంస్కారము, క్షేత్రయుగములనాటి శౌర్యము ఈ నడుమ వచ్చిన బానిసత్వంతో చెరిగిపోయేవికావు. ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి చిరకాలం పాడుకుందాం.
చెవులకు ఇంపైన పదాలు కూర్చి నవరసభరితంగా కావ్యాలు రాసిన మంచి మనసుగల కవులను గౌరవిద్దాం. దేశమంతా తిరిగి దేశచరిత్రను ప్రపంచవ్యాప్తంచేసి ధీరులను గురించి తెలుసుకుందాం. ధర్మపరులైన పాండవుల పరాక్రమాన్ని తెలిపే మహాభారత కథను, లోకాన్ని వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని గానం చేద్దాం. తుంగభద్రతీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి జగద్విఖ్యాతుడైన తెలుగురాజు శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుందాం.
IV. సృజనాత్మకత/ప్రశంస
అ. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
 జవాబు.
 నేను భరతమాతను. సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగుతున్నాను. రామాయణ, భారత భాగవతాలను రచించిన వాల్మీకి, వ్యాసులకు తల్లినైనాను. ఔషధాలతో నిండిన అరణ్యాలెన్నో నాలో ఉన్నాయి. బలపరాక్రమాలు కలిగిన రాజులకు జన్మనిచ్చి పోషించాను. వీరాధివీరులైన నాయకులై నా బిడ్డలవలన నా కీర్తి ప్రపంచ వ్యాప్తమైంది. నా బిడ్డలైన కౌరవ పాండవులు ధైర్యసాహసాలతో కురుక్షేత్ర యుద్ధం చేశారు. వారందరిని భక్తి శ్రద్ధలతో పాడుకోండి. పవిత్రమైన నదులెన్నో నాపై ప్రవహిస్తున్నాయి. వాటిలో మధురజలాలను తాగడానికి, పంట పొలాలకు ఉపయోగించుకోండి. అందరూ కలిసి నా గొప్పతనాన్ని గానం చేయండి. జన్మధన్యం చేసుకోండి అని భరతమాత తన ఆత్మకథను తెలిపింది.

ఆ. మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
 జవాబు.
 మా ఊరు మారుమూలపల్లె
 మేమంతా జానపద గాయకులం
 మా ఊరిలో బడి ఉంది
 మా ఊరిలో గుడి ఉంది.
 మా ఊరు మారుమూలపల్లె. పంట పొలాలున్నాయ్
 మా ఊరి చుట్టుపట్ల మామిడితోటలున్నయ్
మా ఊరికి మైలుదూరాన.
 మా ఊరు మారుమూలపల్లె
 వ్యవసాయం మా జీవనం
 పదిమందికి సాయమే మాకు మనోబలం
 ఐఏయస్ లయిండ్రు మా ఊరిపోరగాండ్రు
 ఐపియస్ లయిండ్రు మా ఊరి చెల్లెండ్రు
 మా ఊరు మారుమూలపల్లె
 మేమంతా జానపదగాయకులం.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి.
అ. ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తూంటారు.
 జవాబు.
 విపినాలు = అడవుల
 సొంతవాక్యం : అనేక రకాలైన పక్షులు, జంతువులు అడవులలో ఉంటాయి.
ఆ. మనందరం భూ తలం మీద నివసిస్తున్నాము.
 జవాబు.
 తలం = ప్రదేశం, చోటు
 సొంతవాక్యం : భారతదేశంలో పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఇ. ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
 జవాబు.
 మేళవింపు = కలియు, జతగూర్చు.
 సొంతవాక్యం : నవరసాల జతకూర్చు మన తెలుగు నాటకాలు.
ఈ. తేనెటీగలు మధువును ఇస్తాయి.
 జవాబు.
 మధువు = తేనె
 సొంతవాక్యం : తేనెను పాలల్లో వేసి పిల్లలు ప్రతిరోజూ తాగటం వల్ల బలం వస్తుంది.
ఉ. నేటి బాలలే భావి భారతపౌరులు.
 జవాబు.
 భావి = భవిష్యత్తు
 సొంతవాక్యం : విద్యార్థులు భవిష్యత్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి.
ఊ. సైనికులకు చేవ ఉండాలి.
 జవాబు.
 చేవ = సారము, ధైర్యము.
 సొంతవాక్యం : యుద్ధమునందు సైనికులకు ధైర్యము ఉండాలి.
2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి.
అ. అధిక సంపదలు కలిగినవారికంటే గుణవంతులే గొప్ప.
 జవాబు.
 శ్రీలు, భాగ్యములు.
ఆ. మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటీషువారి కింద బానిసతనంలో మగ్గిపోయింది.
 జవాబు.
 బానిసతనం, దాస్యం
ఇ. మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి.
 జవాబు.
 మంచివారు, గొప్పవారు, మహనీయులు
ఈ. వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది.
 జవాబు.
 వేడి, కాక
ఉ. వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు.
 జవాబు.
 వ్యాసుడు, బాదరాయణుడు.
3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.
అ. విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
 జవాబు.
 విపినాలు, అరణ్యాలు
ఆ. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
 జవాబు.
 ధరణి, గడ్డ వీరులు, పౌరుషవంతులు జన్మించిన, పుట్టిన
ఇ. గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
 జవాబు.
 కలకాలం, ఎల్లప్పుడు
ఈ. విశాలమైన మన దేశంలో విస్తారమైన అడవులున్నాయి.
 జవాబు.
 విశాలమైన, విస్తారమైన.

VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలను చదువండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ఉదా : ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ! – ఆశ్చర్యార్థక వాక్యం
అ) పనిని త్వరగా పూర్తిచేయాలి.
 జవాబు.
 నిశ్చయార్థక వాక్యం
ఆ) చుట్టాలు ఎప్పుడు వస్తారు.
 జవాబు.
 ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఈ పుస్తకం వెల ఎంత.
 జవాబు.
 ప్రశ్నార్థక వాక్యం
ఈ) పాఠం అందరూ చదువుకొని రండి.
 జవాబు.
 విధ్యర్థక వాక్యం
ఉ) మీరు నానుండి తెలుసుకోండి.
 జవాబు.
 విధ్యర్థక వాక్యం
కింది వాక్యాలను చూద్దాం.
- అతడు వస్తాడో? రాడో?
- రేపు వర్షం పడవచ్చు.
- ఈ రోజు ఎండ కాస్తుందో? లేదో?
ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది.
 పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.
- లోపలికి రావచ్చు.
- కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
- మీరు వెళ్ళవచ్చు.
ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు’.
 ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.
- ఇతరులను ఎగతాళి చేయవద్దు.
- నీటిని వృథా చేయవద్దు.
- ఎక్కువసేపు నిద్రపోవద్దు.
ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి “నిషేధార్థక వాక్యాలు”.
ఒక పనిని చేయవద్దనే (నిషేధించే) అర్థాన్ని సూచించే వాక్యం ‘నిషేధార్థక వాక్యం”.
2. కింది వాక్యాలను చదువండి. అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
అ) అట్లా అనుకోకండి.
 జవాబు.
 నిషేదార్థక వాక్యం
ఆ) నేను చెప్పింది విన్నారో ! లేదో !
 జవాబు.
 సందేహార్థక వాక్యం
ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో ! లేదో !
 జవాబు.
 సందేహార్థక వాక్యం
ఈ) మీరెప్పుడైనా రావచ్చు.
 జవాబు.
 అనుమత్యర్థక వాక్యం
ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు.
 జవాబు.
 నిషేదార్థక వాక్యం
ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు.
 జవాబు.
 అనుమత్యర్థక వాక్యం

ఋ) అబ్బ ! ఎంత వర్షం కురిసింది.
 జవాబు.
 ఆశ్చార్యార్థక వాక్యం
ౠ) మనసు పెట్టి వినండి.
 జవాబు.
 విద్యర్థక వాక్యం
ప్రాజెక్టు పని
భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
 జవాబు.
 1. భారతమాతకు జేజేలు
 బంగరు భూమికి జేజేలు
 అసేతుహిమాచల సస్యశ్యామల
 జీవధాత్రికి జేజేలు
త్రివేణిసంగమ పవిత్రభూమి
 నాల్గువేదములు పుట్టినభూమి
 గీతామృతమును పంచిన భూమి
 పంచశీల బోధించిన భూమి
2. జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి
 జయజయజయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి॥
 జయజయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
 జయ వసంత కుసుమలతా చలితలలిత చూర్ణకుంతల
 జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా||
 జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
 జయ గాయక వైతాళిక గళ విశాల పథవిహరణ
 జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా॥ (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి)
3. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
 ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
 పొగడరా నీ తల్లి భూమి భారతిని
 నిలపరా నీజాతి నిండు గౌరవము
 ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
 జనియించి నాడవీ స్వర్గఖండమున
 ఏమంచి పూవులన్ ప్రేమించినావో
 నిను మోసె నీ తల్లి కనకగర్భమున
 లేదురా ఇటువంటి భూదేవి ఎందు
 లేరురా మనవంటి పౌరులింకెందు
 పాడరా నీ తెల్గు బాలగీతమును
 పాడరా నీ వీర భావభారతము (రాయప్రోలు సుబ్బారావు)
విశేషాంశాలు
 నవరసాలు : శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. వీటిని నవరసాలు అంటారు.
TS 7th Class Telugu 11th Lesson Important Questions శ్రీలు పొంగిన జీవగడ్డ
ప్రశ్న 1.
 భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకన్నారు ?
 జవాబు.
 వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న భూమి ఇది. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు.
ప్రశ్న 2.
 దేశగౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.
 జవాబు.
 రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన కాకతీయ వీరుల పరాక్రమం ప్రపంచ ప్రఖ్యాతం. పాండవులు ధర్మాన్ని పాటించి కురుక్షేత్రయుద్ధంలో కౌరవుల అధర్మాన్ని నాశనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన బలపరాక్రమాలతో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కళలను, కళాకారులను పోషించాడు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ సాటిలేనిది.
ప్రశ్న 3.
 యుద్ధాలు ఎందుకు చేస్తారు ? యుద్ధాలవల్ల లాభమా ? నష్టమా ? ఎందువల్ల ?
 జవాబు.
 1) ఏదైనా ఒక దేశము యొక్క అధికార యంత్రాంగం కాని, సైన్యంగాని బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఆక్రమించుకొనటానికి బలంగాఉన్న దేశాలు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుంటాయి.
2) యుద్ధాలవల్ల రెండు పక్షాలలోనూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. యుద్ధసామాగ్రికి ఎంతో ధనం నష్టపోతాము. యుద్ధాలవల్ల నష్టాలను పూడ్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది.
3) కొన్ని అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెగబడి యుద్ధాలు చేసి ఆ దేశ నాయకులను, సామాన్యపౌరులను చిత్రహింసలకు గురిచేసి చంపేస్తాయి.
4) కొన్ని దేశాల ప్రజలు యుద్ధాలకు భయపడి బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తారు. పై విషయాలను గమనిస్తుంటే యుద్ధాలవల్ల నష్టాలేగాని లాభం ఏ మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.

ప్రశ్న 4.
 మీకు తెలిసిన కొందరు ప్రాచీన, ఆధునిక తెలుగుకవులను గురించి తెలపండి.
 జవాబు.
 తెలుగులో ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతానికి శ్రీకారం చుట్టాడు. తరువాత వచ్చిన తిక్కన, ఎర్రన భారతాన్ని పూర్తిచేశారు. పోతన, శ్రీనాథుడు గొప్ప కవులు పండితులు. శ్రీకృష్ణదేవరాయలు కవిరాజు. అష్టదిగ్గజ కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. వీరంతా ప్రాచీనకవులు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, చిన్నయసూరి, తిరుపతి వేంకటకవులు, వేటూరిప్రభాకర శాస్త్రిగారు, దాశరథి, బి. రామరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ఆధునిక కవులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది.
ప్రశ్న 5.
 గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
 జవాబు.
 “రాయప్రోలు సుబ్బారావు” గారు రచించిన ఈ గేయం చాలా బాగుంది. దీనిని చదువుతుంటేనే శరీరం గగుర్పాటుకు గురౌతున్నది. కవి హృదయంలో నుండి ఈ గేయం పొంగిపొర్లింది. కవికి గల దేశభక్తి బాగా తెలుస్తున్నది. భారతదేశ ఔన్నత్యాన్ని బాగా అవగాహన చేసుకొని భక్తితో ఈ దేశభక్తి గేయాన్ని కవి రచించారు. రచయిత ఈ గేయాన్ని రచించి
‘మాతృదేశం’ పట్ల తనకు గల గౌరవాన్ని చాటుకొన్నారు.
 మన దేశంలో వేదాలు పుట్టాయని, భారత రామాయణాది గ్రంథాలు జన్మించాయని, వ్యాస, వాల్మీకాది కవులు జన్మించిన పుణ్యభూమి అని కవి దేశ గౌరవాన్ని చాటి చెప్పారు. తెలుగు కవులు తేట తెలుగు పదాలతో చెవులకు ఆనందం కలిగించే విధంగా కవిత్వం రాశారని, వాటిద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచమంతా వ్యాపించాయని కవి తమ అభిప్రాయాలను చక్కగా వివరించారు.
పర్యాయ పదాలు
- శ్రీలు – సంపదలు, భాగ్యములు
- పాలు – క్షీరము, దుగ్ధము
- వేదము – ఆమ్నాయము, ఋషి
- కావ్యము – కృతి, గ్రంథము
- విపినం – అరణ్యం, అడవి
- వృక్షం – చెట్టు, భూరుహము
- మధువు – తేనె, పవిత్రము
- దీప్తి – కాంతి, వెలుగు
- రణం – యుద్ధం, సమరం, కదనం
- కత్తి – అసి, ఖడ్గం
- కదనం – యుద్ధం, రణం
- భంగం – అల తరంగ
- నింగి – ఆకాశం, గగనం
వ్యతిరేక పదాలు
- ఆది × అంత
- నింగి × నేల
- గౌరవం × అగౌరవం
- పుణ్య × పాపం
ప్రకృతులు – వికృతులు
ప్రకృతి – వికృతి
- శ్రీ – సిరి
- భక్తి – బత్తి, బగితి
- కావ్యం – కబ్బం
- హృదయం – ఎద, ఎడ, ఎడద
- కవిత – కయిత, కైత
- గౌరవం – గారవం
- కథ – కత, కద
సంధులు
- జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వసంధి
- భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వసంధి
 అత్వసంధి : సూత్రం – అత్తునకు సంధి బహుళము.
- విమలతలమిదె – విమలతలము + ఇదే – ఉత్వసంధి
- కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి
- రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
- దేశమరసిన – దేశము + అరసిన – ఉత్వసంధి
 ఉత్వసంధి : సూత్రం – ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
క్రింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
వేద శాఖలు వెలసె నిచ్చట
 ఆది కావ్యం బలరె నిచ్చట
 బాదరాయణ పరమ ఋషులకు
 పాదు సుమ్మిది చెల్లెలా !
ప్రశ్నలు:
1. ‘వేదశాఖలు’ అనగా నేమి ?
 జవాబు.
 వేదశాఖలు అనగా వేదాలు, వేదాంగాలు
2. ‘ఆదికావ్యం’ అనగా ఏది ?
 జవాబు.
 ఆదికావ్యం అనగా శ్రీమద్రామాయణము.
3. ‘బాదరాయణుడు’ అంటే ఎవరు ?
 జవాబు.
 బాదరాయణుడనగా వేదవ్యాసుడు.

4. “పరమ” అనగా ఏమిటి ?
 జవాబు.
 పరమ అనగా ‘శ్రేష్ఠమైన’ అని అర్థం.
5. ఈ గేయాన్ని ఎవరు రచించారు ?
 జవాబు.
 ఈ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు రచించాడు.
క్రింది గేయ భాగాలను చదివి ప్రశ్నలు తయారుచేయండి.
1. “లోకమంతకు కాక పెట్టిన
 కాకతీయుల కదన పాండితి
 చీకిపోవని చేవపదముల
 చేర్చి పాడర తమ్ముడా!”
 జవాబు.
 1. ఈ గేయం దేన్ని గురించి చెబుతోంది?
 2. చీకిపోవడం అంటే ఏమిటి?
 3. కాకతీయులెటువంటివారు?
 4. ఈ గేయం దేన్ని గురించి పాడమంటోంది?
 5. ఎలా పాడమంటోంది?
2. పాండవేయుల పదునుకత్తులు
 మండి మెరసిన మహిత రణకథ
 కండగల చిక్కని తెలుంగుల
 కలసి పాడవే చెల్లెలా !
 జవాబు.
 1. పాండవేయులు అంటే ఎవరు?
 2. కత్తులు ఎటువంటివి?
 3. రణకథ అంటే ఏమిటి?
 4. కత్తులు ఎవరివి?
 5. రణకథను ఎలా పాడాలి?
ఈ గేయభాగంలోని పదాల క్రమాన్ని సరిచేసి రాయండి. భావం రాయండి.
1. వృక్ష విపిన బంధుర వాటిక
 నిచ్చట వొలికె ఉపనిషన్మధు
 విస్తరించిన తత్త్వము విపుల
 తలమిదె విమల తమ్ముడా !”
 జవాబు.
 విపిన బంధుర వృక్షవాటిక
 ఉపనిషన్మధు వొలికె నిచ్చట
 విపుల తత్త్వము విస్తరించిన
 విమల తలమిదె తమ్ముడా
భావం : ఓ తమ్ముడా! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది- అని పద్యభావం.
2. నాట్యమాడగ రసమ్ములునవ
 పలుకులు విందుగ చివురు చెవుల…
 కాంత కవితలల్లిన హృదయుల
 చెల్లెలా గారవింపవె !
 జవాబు.
 నవరసమ్ములు నాట్యమాడగ
 చివురు పలుకులు చెవుల విందుగ
 కవితలల్లిన కాంతహృదయుల
 గారవింపవె చెల్లెలా!
భావం : ఓ చెల్లెలా! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పద్యభావం.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలకృష్ణగోఖలే ముఖ్యులు. ఈయన గాంధీజీకి రాజకీయ గురువు, ధైర్యశాలి. వందేమాతర గీతం ద్వారా ప్రజలను చైతన్యపరచిన బంకించంద్ర చటర్జీ ధీశాలి. బ్రిటిషువారిని గడగడలాడించిన లాలాలజపతిరాయ్ “పంజాబ్ కేసరి”గా ప్రసిద్ధి చెందారు. బ్రిటిషు వారి దుర్మార్గాలను ఎదిరించిన తాంతియాతోపే గొప్పవీరుడు. 1859లో ఏప్రియల్ 18న ఈయనను బ్రిటిషువారు ఉరితీశారు. బ్రిటిషు పాలకుల నెదిరించి ప్రజలను చైతన్యపరచిన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఏమాత్రం జంకని వీరనాయకుడు. ‘సైమన్ గోబ్యాక్ అని నినదించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యశాలిగాక మరెవ్వరు.
ప్రశ్నలు:
1. గోపాల కృష్ణ గోఖలే ఎవరు ?
 జవాబు.
 గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు.
2.. వందేమాతరం గీతం ఎవరు రాశారు ?
 జవాబు.
 వందేమాతరం గీతం బంకించంద్ర ఛటర్జీ రాశారు.

3. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు ?
 జవాబు.
 లాలాలజపతిరాయ్ ని ‘పంజాబ్ కేసరి’ అని పిలుస్తారు.
4. ప్రకాశం పంతులు ఏమని నినాదం చేశారు ?
 జవాబు.
 ప్రకాశం పంతులు ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదం చేశారు.
5. 1859 ఏప్రియల్ 18న బ్రిటిష్‌వారు ఎవరిని ఉరితీశారు ?
 జవాబు.
 1859 ఏప్రిల్ 18న తాంతియాతోపేను బ్రిటీష్‌వారు ఉరితీశారు.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
‘భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాలమైన దేశం. ఎంతో మంది రాజులు దీనిని పాలించారు. కళలను పోషించి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదేశం. ఉన్నతులైన వైద్యులను, శాస్త్రవేత్తలను తయారుచేసి ప్రపంచంలో తన గొప్పతనాన్ని చాటుకున్నది.
ప్రశ్నలు:
1. భారతదేశం ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించింది?
 జవాబు.
 భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది.
2. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిందెవరు ?
 జవాబు.
 మనదేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు
3. మన దేశానికి గొప్పదనం ఎవరివల్ల వచ్చింది ?
 జవాబు.
 ఉన్నతమైన వైద్యులు, శాస్త్రవేత్తల వలన
4. మనదేశం ప్రత్యేకత ఏమిటి ?
 జవాబు.
 భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం
5. పై పేరాలోనుంచి ఒక వ్యతిరేక పదముల జంటను రాయండి.
 జవాబు.
 భిన్నత్వం × ఏకత్వం
కింది పదాలు విడదీసి, సంధిపేర్లు రాయండి.
1. భాగ్యసీమయి
 జవాబు.
 భాగ్యసీమయి – భాగ్యసీమ + అయి – అత్వ సంధి
2. కవితలల్లిన
 జవాబు.
 కవితలల్లిన – కవితలు + అల్లిన – ఉత్వసంధి
3. రాగమెత్తి
 జవాబు.
 రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
సంధిగల పదం గుర్తించి, విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
1.. రాలు కరగగ రాగమెత్తి
 జవాబు.
 రాగమెత్తి – రాగము + ఎత్తి – ఉత్వసంధి
2. శ్రీలు పొంగిన జీవగడ్డయి
 జవాబు.
 జీవగడ్డయి – జీవగడ్డ + అయి – అత్వ సంధి
3. దేశాన్ని గురించి కవి ఇట్లనెను
 జవాబు.
 ఇట్లనెను ఇట్లు + అనెను – ఉత్వసంధి
26. కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.
1. నవరసాల ………… నిండి, తేట తెలుగు మాటల ………… చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవుల ………… గౌరవించాలి.
 జవాబు.
 నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.
కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. జీవగడ్డ
 జవాబు.
 భారతదేశము సిరులు పొంగిన జీవగడ్డ.
2. భాగ్యసీమ :
 జవాబు.
 భారతదేశము పాడిపంటలకు భాగ్యసీమ.

3. శౌర్యచండిమ :
 జవాబు.
 కాకతీయ రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
4. చెవుల విందు :
 జవాబు.
 బాలమురళి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
5. చీకిపోవని :
 జవాబు.
 ఆంధ్రుల తేజస్సు చీకిపోవని చేవగలది.
కింది పదాలకు వ్యతిరేకపదాలు రాసి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.
1. ధీరుడు
 జవాబు.
 ధీరుడు × భీరుడు
 నా మిత్రుడు భీరుడు కాదు
2. ఆది
 జవాబు.
 ఆది × అనాది
 మన దేశంలో వరకట్న దురాచారం అనాదిగా వస్తోంది.
3. పదను
 జవాబు.
 పదను × మొండి
 మొండి మనుషులు ఏమి చెప్పినా అర్ధం చేసుకోరు.
గేయం – అర్థాలు – భావాలు
1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
 పాలు పారిన భాగ్యసీమయి
 వరలినది యీ భరతఖండము
 భక్తి పాడర తమ్ముడా !
అర్ధాలు
 తమ్ముడా = ఓ తమ్ముడా !
 శ్రీలు = సంపదలు
 పొంగిన = పొంగినటువంటి
 జీవగడ్డ + అయి = ప్రాణముగల భూమి అయి
 పాలు పారిన = = పాలు ప్రవహించిన
 భాగ్యసీమ+అయి = సంపదలుగల దేశం అయి
 ఈ భరతఖండము = ఈ భారతదేశము
 వరలినది = వర్దిల్లినది
 భక్తిపాడర = భక్తితో పాడుము
భావం: మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. ఓ తమ్ముడా! అలాంటి భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలని భావము.
2. వేదశాఖలు వెలిసె నిచ్చట
 ఆదికావ్యం బలరె నిచ్చట
 బాదరాయణ పరమ ఋషులకు
 పాదు సుమ్మిది చెల్లెలా !
అర్ధాలు
 చెల్లెలా = ఓ చెల్లెలా !
 వేదశాఖలు = వేదాలు వేదాంగాలు
 ఇచ్చటన్ = ఇక్కడ (ఈ భారతదేశంలో)
 వెలసెన్ = వెలిశాయి
 ఇచ్చట = ఇక్కడ, ఈ భారతదేశంలో
 ఆదికావ్యంబు = మొదటి కావ్యం (వాల్మీకి రచించిన రామాయణం)
 అలరెన్ = ప్రకాశించింది
 ఇది = ఈ భారతదేశము
 బాదరాయణ = వేదవ్యాసుడు మొదలుగా గల
 పరమ ఋషులకు = శ్రేష్ఠులైన ఋషులకు (మునులకు)
 పాదుసుమ్ము = కుదురుసుమా !
భావం: ఓ చెల్లెలా ! వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం అని పై పద్యభావం.

3. విపిన బంధుర వృక్షవాటిక
 ఉపనిషన్మధు వొలికె నిచ్చట
 విపుల తత్త్వము విస్తరించిన
 విమలతల మీదె తమ్ముడా!
అర్ధాలు
 తమ్ముడా = ఓ తమ్ముడా !
 ఇచ్చట = ఇక్కడ (ఈ భారతదేశంలో)
 విపిన = అడవియందలి
 బంధుర = దట్టమైన
 వృక్షవాటిక = చెట్ల తోపు
 ఉపనిషత్+మధువు = వేదాంతము అనెడి తేనెను
 ఒలికెన్ = చిందించింది.
 ఇదె = ఈ భారతదేశమే
 విపుల = విపులమైన, విరివియైన
 తత్త్వము = సత్యమును
 విస్తరించిన = ప్రసరింపజేసిన
 విమలతలము = పవిత్రమైన భూమి
భావం: ఓ తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది పద్యభావం.
4. సూత్రయుగముల శుద్ధవాసన
 క్షాత్రయుగముల శౌర్యచండిమ
 చిత్రదాస్యముచే చరిత్రల
 చెఱిగిపోయెను చెల్లెలా !
అర్ధాలు
 చెల్లెలా = ఓ చెల్లెలా !
 సూత్రయుగముల = సూత్రాలను చెప్పిన కాలం నాటి
 శుద్ధవాసన = స్వచ్ఛమైన సంస్కారం
 శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
 క్షాత్రయుగముల క్షత్రియుల కాలం నాటి =
 చిత్ర దాస్యముచే = వింత బానిసతనం వల్ల
 చరిత్రల = కథల నుండి
 చెరిగిపోయెను = అంతరించిపోయాయి
భావం: ఓ చెల్లెలా ! సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పదనం, ప్రచండ పరాక్రమం ఉన్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ విదేశీయుల క్రింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి అని పై పద్యభావం.
5. మేలికిన్నెర మేళవించీ
 రాలు కరగగ రాగమెత్తీ
 పాలతీయని భావిభారత
 పదము పాడర తమ్ముడా!
అర్ధాలు
 తమ్ముడా = ఓ తమ్ముడా !
 మేలికిన్నెర = శ్రేష్ఠమైన వీణను
 మేళవించ = కలిపి, జతగూర్చి
 రాలు కరగగ = రాళ్ళను కూడా కరిగించగల
 రాగమెత్తి = రాగమును గ్రహించి
 పాలతీయని = పాలవంటి తియ్యనైన
 భావిభారత = భావి భారతదేశ భాగ్యాన్ని గురించి
 పదము = పాటలను
 పాడర = పాడాలి
భావం: ఓ తమ్ముడా! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో, బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాటలు పాడుకోవాలని భావం.
6. నవరసమ్ములు నాట్యమాడగ
 చివురు పలుకులు చెవుల విందుగ
 కవితలల్లిన కాంతహృదయుల
 గారవింపవె చెల్లెలా !
అర్ధాలు
 చెల్లెలా = ఓ చెల్లెలా !
 నవరసమ్ములు = తొమ్మిది రసములు
 నాట్యము + ఆడగ = నాట్యము చేయునట్లుగా
 చివురుపలుకులు = చిగురు వంటి మెత్తనైన మాటలు
 చెవుల విందుగ = చెవులకు ఇంపు కలుగ జేయు నట్లుగా, వినసొంపుగా
 కవితలు+అల్లిన = కవిత్వాన్ని కూర్చిన
 కాంతహృదయులన్ = మనోహరమైన మనస్సులు గలవారైన కవులను
 గారవింపవె = గౌరవింపుము
భావం: ఓ చెల్లెలా ! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని పై పద్యభావం.

7. దేశగర్వము దీప్తిచెందగ
 దేశచరితము తేజరిల్లగ
 దేశమరసిన ధీరపురుషుల
 తెలిసి పాడర తమ్ముడా !
అర్ధాలు
 తమ్ముడా = ఓ తమ్ముడా !
 దేశగర్వము = దేశము యొక్క గౌరవము, గొప్పదనం
 దీప్తి చెందగ = ప్రకాశించేటట్లు
 దేశ చరితము = దేశము యొక్క చరిత్ర
 తేజరిల్లగ = ప్రకాశించేటట్లుగా
 దేశము + అరసిన = భారత దేశాన్ని కాపాడిన
 ధీరపురుషుల = వీరపురుషులను గురించి
 తెలిసి = తెలుసుకొని
 పాడ = పాడుము
భావం: ఓ తమ్ముడా ! దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని పాడాలని భావం.
8. పాండవేయుల పదును కత్తులు
 మంది మెఱసిన మహిత రణకథ
 కండగల చిక్కని తెలుంగుల
 కలసి పాడవె చెల్లెలా !
అర్ధాలు
 చెల్లెలా = ఓ చెల్లెలా !
 పాండవేయుల = పాండవుల యొక్క
 పదును కత్తులు = పదునైన కత్తులు
 మండి = మండుతూ
 మెఱసిన = ప్రకాశించిన
 మహిత = గొప్ప దైన
 రణకథ = కురుక్షేత్రయుద్ధ కథను గుఱించి
 కండగల = దృఢమైన, స్థిరమైన
 చిక్కని = చక్కని తెలుగు పదాలతో
 తెలుంగుల = తెలుగువారితో
 కలసి = కలిసి
 పాడవె = పాట పాడుము
భావం: ఓ చెల్లెలా ! పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి దృఢమైన తెలుగు వారితో కలసి పాడుకోవాలని పై పద్యానికి భావం.
9. లోకమంతకు కాకపెట్టిన
 కాకతీయుల కదన పాండితి
 చీకిపోవని చేవపదములు
 చేర్చి పాడర తమ్ముడా!
అర్ధాలు
 తమ్ముడా! = ఓ తమ్ముడా !
 లోకమంతకు = ప్రపంచమంతటికీ
 కాక పెట్టిన = వేడెక్కించిన
 కాకతీయుల = కాకతీయరాజుల యొక్క
 కదన పాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
 చీకిపోవని = బలహీనముకాని
 చేవపదముల = శక్తివంతమైన మాటలను
 చేర్చి = కూర్చి
 పాడర = పాడుమా !
భావం: ఓ తమ్ముడా! ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో పాడుకోవాలని పై పద్యభావం.
10. తుంగభద్రాభంగములతో
 పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
 భంగపడని తెలుంగునాథుల
 పాట పాడవె చెల్లెలా !
అర్ధాలు
 చెల్లెలా = ఓ చెల్లెలా !
 తుంగభద్రా = తుంగభద్రానది యందలి
 భంగములతో = అలలతో
 పొంగి = ఉప్పొంగి
 నింగిని = ఆకాశాన్ని
 పొడిచి = పిడికిలితో కొట్టి
 తుళ్ళి = గర్వించి
 భంగపడని = ఓటమిని పొందని
 తెలుగునాథుల = ధైర్యం గల తెలుగు రాజుల గురించి (శ్రీకృష్ణ దేవరాయలు)
 పాట పాడవె = పాట పాడుమా !
భావం: ఓ చెల్లెలా ! తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కు చెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని పై పద్యభావం.

పాఠం ఉద్దేశం
భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశగౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇతి మాత్రా ఛందస్సులో, అంత్యప్రాసలతో, రాగయుక్తంగా, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించాడు.
కవి పరిచయం
భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరుజిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.
ప్రవేశిక
భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాఙ్మయం ఉపనిషత్తులు సమాజానికి దివ్యమార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్యరీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మనదేశపు ఘనత ఎంత విశిష్టమైనవో ఈ పాఠం
 ద్వారా తెలుసుకుందాం!
నేనివి చేయగలనా?

