పోతన బాల్యం TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు
ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు.
బొమ్మలో ఇద్దరు బాలురు గిల్లీ దండ ఆడుతున్నారు. ముగ్గురబ్బాయిలు గోళీలాట ఆడుతున్నారు. కొంతమంది అబ్బాయిలు రెండు జట్లుగా కబడ్డీ ఆడుతున్నారు. ఇద్దరమ్మాయిలు వామనగుంటలాడుతున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి జారుడు బండ ఆట ఆడుతున్నారు.
ప్రశ్న 2.
వాటిలో మీరు ఆడేవేవి ? ఆడనివేవి ?
జవాబు.
పై ఆటలలో అన్ని ఆటలు నేను ఆడుతాను.
ప్రశ్న3.
మీకు ఏ ఆట అంటే ఇష్టం ? ఆ ఆటను ఎట్లా ఆడుతారో చెప్పండి.
జవాబు.
నాకు కబడ్డీ అంటే ఇష్టం. ఒక జట్టులో నుండి ఒకరు ఆపకుండా కూతపెట్టుకుంటూ వెళ్ళి రెండవ జట్టులోని వారిని అంటుకొని వారికి దొరకకుండా రావాలి. దొరికితే ఇతడు ఔటు. దొరక్కపోతే అవతలివాడు ఔటు. అలా పాయింట్సు నిర్ణయిస్తారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 56)
ప్రశ్న 1.
“తమ్మునిమీద ఈగను వాలనీయడు” అంటే మీకేమర్థమయింది ?
జవాబు.
“తమ్ముని మీద ఈగవాలనీయడు” అంటే తమ్ముడికి ఏరకమైన ఆపదను కలుగనివ్వడు అని అర్థం. ఈగ వాలితే బరువునొప్పి ఏమీ ఉండదు. రెప్పపాటులో ఎగిరిపోతుంది. అంత చిన్న ఈగ వాలినా సహించడంటే తమ్మునికి చిన్న ఆపదను కూడా రానీయడు అని అర్థం.
ప్రశ్న 2.
అన్న తన తినుబండారాలు తమ్మునికి ఇచ్చాడు. ఇట్లా తమ్ముని కోసం అన్న ఇంకా ఏమేమి చేయవచ్చు?
జవాబు.
అన్న తన తినుబండారాలు తమ్మునికిచ్చాడు. అలాగే తను ఆడుకొనే వస్తువులు ఇవ్వొచ్చు. తన దగ్గర తమ్ముడి కిష్టమైనవి ఏవైనా ఉంటే ఇవ్వొచ్చు. తమ్ముడికి చదువులోగాని, ఆటపాటల్లో గాని సాయం చెయ్యొచ్చు.
ప్రశ్న 3.
‘తిప్పన పోతన’ లకు తగువులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు మీ అన్నదమ్ముళ్ళతోటి లేదా అక్కజెల్లెళ్ళతోటి ఎట్లా ఉంటారు ?
జవాబు.
తిప్పన, పోతన ఎప్పుడూ తగువులాడుకొనేవారు కాదు. నేను మా తమ్ముడు కూడా ఎప్పుడూ పోట్లాడుకోం, మా తమ్ముడి కేది కావాలంటే అది చేస్తాను. వాడు బడికి తయారుకావడానికి సాయం చేస్తాను. మంచి విషయాలు మంచి ఆటలు నేర్పుతాను.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 57)
ప్రశ్న 1.
పోతనను ‘ఉక్కు బాలుడు’ అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు.
ఉక్కు గట్టిదనానికి సూచన. పోతన ఒక్కక్షణం కూడా కుదురుగా ఉండకుండా ఎగురుతూ దూకుతూ పరుగెత్తుతుంటాడు. ఒక్కోసారి ఎత్తుమీంచి కిందపడ్డా వెంటనే బంతిలా పైకి లేచి పరుగెత్తి పోతాడు. ఎక్కడైనా దెబ్బతగలిందేమో కూడా చూసుకోడు. అందుకే పోతనను ఉక్కు లాంటి గట్టి బాలుడు అనవలసి వచ్చింది.
ప్రశ్న 2.
పాడటంలో పోతనను కోకిలతో పోల్చాడు కదా! ఇంకా వేటిని వేటితో పోల్చవచ్చు?
(ఉదా: నడకను, మాటను, కళ్ళను, మనస్సును, ముఖాన్ని, చేష్టలను)
జవాబు.
పాడటాన్ని కోయిలతో పోల్చినట్లే వయ్యారంగా నడుస్తుంటే హంసతో పోలుస్తారు. మాట్లాడటాన్ని చిలుకతో పోలుస్తారు. కళ్ళను కలువలతోను, ముఖాన్ని పద్మంతోను పోలుస్తారు. పరుగును జింక పిల్లతోను, పౌరుషాన్ని సింహంతోను పోలుస్తారు. బుద్ధికి బృహస్పతి అంటారు.
ప్రశ్న 3.
‘వీడు అసాధ్యుడు!” అని ఎవరినైనా, ఏయే సందర్భాల్లో అంటారు ?
జవాబు.
ఎవరూ చెయ్యలేని పనులు చేసినప్పుడు, తన వయసుకు, శక్తికి మించిన పనులు చేసినపుడు, అందరూ ఆశ్చర్యపడేలా ప్రవర్తించినపుడు, అసామాన్యమైన ప్రతిభ చూపించినపుడు ఇలాంటి సందర్భాలలో “వీడు అసాధ్యుడు” అంటారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 58)
ప్రశ్న 1.
“దూకుతున్నాడ”న్నారు కదా! ఇవి కాక ఇంకా పిల్లలు ఏయే చేష్టలు చేస్తారో చెప్పండి.
జవాబు.
పిల్లలు దూకుతారు. ఎగురుతారు. పరుగెత్తుతారు. పైకెక్కి దిగుతారు. పక్షులను, జంతువులను అనుకరిస్తారు. ఆటల్లో ఎవరికీ కనబడకుండా దాక్కుంటారు. వెంటబడి తరుముతూ పట్టుకుంటారు. ఎదుటి వారిని సరదాగా వెక్కిరిస్తారు. ఇలా పిల్లలు ఎన్నో చేష్టలు చేస్తారు.
ప్రశ్న 2.
‘పెరుగసాగె వేరొక ప్రక్క బిడ్డ యెడద’ అంటే మీకేమి అర్థమయ్యింది ?
జవాబు.
పోతన చదువులో దిట్ట. ఆటలలో మేటి, పాటలు పాడటంలో నేర్పుగలవాడు. పిల్లలెంతమంది కలబడినా ఒక్కడే వారిని ఎదిరించి నిలబడగలడు. ఇవన్నీ ఒకవైపు, సాధు సత్పురుషులను ఆదరిస్తాడు. హరికథలు, పురాణాలు వింటాడు. శివపూజలు చేస్తాడు. ఇవన్నీ మరొకవైపు. రెండూ వేరు వేరు కోణాలు. అయినా పోతన అన్నీ చేయగలడు అంటే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉంటున్నదని మీరు అనుకుంటున్నారు ? విశ్లేషించండి.
జవాబు.
పోతన కాలంలో వ్యక్తుల మధ్య బంధాలు, ప్రేమలు గట్టిగా ఉండేవి. అందుకే ఉమ్మడి కుటుంబాలు చక్కగా ఉండేవి. ఈ రోజుల్లో అవకాశాలు, వసతులు, సౌకర్యాలు పెరిగే కొద్దీ ప్రేమలు తగ్గుతున్నాయి. అనుబంధాలు దూరమౌతున్నాయి. అదీగాక బడి చదువుల భారంతో పిల్లలకు ఆటపాటలకు సమయం లేకుండా పోతోంది. ఎవరి పని వారు చేసుకొని అలిసిపోయి పడుకుంటారు. ఇంక సోదరులు కలిసి గడిపే సమయం ఉండడం లేదు. ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ తగ్గిపోతోంది.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. ‘ఈ చిన్నబాలుడు అసాధ్యుడు” అనే భావం వచ్చే పద్య పంక్తి ఏది ? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
జవాబు.
“చిరుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్” అనేది ఆ పద్య పంక్తి.
గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.
భావం : గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీకూడా గురితప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు ‘పటుక్కని’ పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరు గుండెలమీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.
2. కింది పద్యం చదవండి. భావంలోని ఖాళీలు పూరించండి.
కందుకము వోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ!
మందుఁడు మృత్పిండము వలె
గ్రిందంబడి యడఁగి యుండు గృపణత్వమునన్.
ఖాళీలు :
అ. కింద పడ్డా పైకి లేచేవాడు ………………………
జవాబు.
సుజనుడు
ఆ. అపజయం పాలైనా తిరిగి సాధిస్తాడు. ………………………
జవాబు.
విజయం
ఇ. మందుడు అంటె ………………………
జవాబు.
తెలివిలేని వాడు
ఈ. బంతితో పోల్చబడినవాడు ………………………
జవాబు.
సుజనుడు
ఉ. ‘మట్టిముద్ద’ అనే పదానికి పద్యంలో వాడబడిన పదం ………………………
జవాబు.
మృత్పిండము
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములిద్దరినీ మెచ్చుకునేవారట. మీ చుట్టుపక్కలవారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు ?
జవాబు.
నేను మా చుట్టుపక్కల వాళ్ళందరితోనూ స్నేహంగా ఉంటాను. వాళ్ళ పిల్లలతో కలిసి మెలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ ఉంటాను. నేనెవరింటికెళ్ళినా వారితో ఎంతో గౌరవంగా మాట్లాడుతాను. ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. నా స్నేహితులెవరైనా బడికి రాకపోతే వారికి ఆ రోజు బడిలో జరిగిన పాఠాల గురించి, ముఖ్యమైన సంగతుల గురించి చెబుతాను. వారికి రాసుకోడానికి నా నోట్సులు ఇస్తాను. ఇలా చేస్తాను గనుక చుట్టుపక్కల వారు నన్ను ప్రేమగా చూస్తారు. మెచ్చుకుంటారు.
ఆ. ‘కాళ్ళలో పాదరసం’ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు.
పాదరసం ద్రవం రూపంలో ఉండే లోహం. దానిని పట్టుకోవాలంటే చేతికి చిక్కదు. అటూ ఇటూ దొర్లిపోతుంది. గట్టిగా పట్టుకుంటే చిన్న చిన్న ముక్కలై దొర్లుతూనే ఉంటుంది. అలాగే పోతన ఆటలో ఎవరికీ దొరక్కుండా తేలికగా తప్పించుకొనేవాడు. తప్పించుకోవాలంటే కాళ్ళతోనే గదా పరుగెత్తాలి. అందుకే ‘కాళ్ళలో పాదరసం’ అని ఉంటారు.
ఇ. ‘తిప్పన – పోతన’ లను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారు ?
(లేదా)
తిప్పనకు, పోతన పై గల ప్రేమ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
రామలక్ష్మణులు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి ప్రేమ. తిప్పన, పోతన కూడా అన్నదమ్ములు. అన్నమీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకు ఎంతో ప్రేమ. అన్న తిప్పన తమ్ముడి మీద చూపించే అనురాగానికి ఊరంతా ఎంతో మెచ్చుకొనేవారు. అన్న అంటే పోతనకెంతో గౌరవం. తనకెవరైనా తినడానికిస్తే తిప్పన తమ్ముడికిచ్చేవాడు. తమ్ముడు కావాలంటే తనకెంత ఇష్టమైన వస్తువైనా ఇచ్చేసేవాడు. ఒక్క నిమిషం తమ్ముడు కనబడకపోతే ఊరంతా వెతికేవాడు. తమ్ముడి మీద ఈగవాలనివ్వడు. అందుకే వారిద్దరినీ రామలక్ష్మణులతో పోల్చారు.
ఈ. ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
‘పోతన బాల్యం’ అనే పాఠాన్ని రచించిన కవి డా॥ వానమామలై వరదాచార్యులు గారు. ఈ పాఠాన్ని చదివితే కవికి పోతనంటే ఎంత ఇష్టమో అర్థమౌతుంది. అంతేగాక పల్లెటూరి వాతావరణం, ఆటలు, పిల్లల కాలక్షేపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. పోతన జీవిత విశేషాలు చదువుతుంటే కవి బాల్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. కవి ఇందులో తేలికైన తేటతెలుగు పదాలు వాడాడు. అందులోనే చక్కని అలంకారాలు ప్రయోగించాడు. ఏ విషయాన్నైనా అలవోకగా రాయగల గొప్పకవి అని తెలుస్తోంది.
(గమనిక : పాఠం ఆధారంగా కవి గురించి రాయండి అన్నప్పుడు కవి రచనలు, బిరుదులు వగైరా రాయనక్కరలేదు.)
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఆటలలో చదువులలో కూడా పోతనకు పోతనే సాటి అనవచ్చు- వివరించండి.
జవాబు.
తిప్పన, పోతన అన్నదమ్ములు. రామలక్ష్మణుల వలె ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. పోతనకు అన్న అంటే గౌరవం అన్నకు తమ్ముడంటే ప్రాణం. తిప్పన ఏదైనా పద్యాన్ని చదివితే పోతన ఒకసారి వినగానే అప్పజెప్పేవాడు. అంత సూక్ష్మబుద్ధి కలవాడు. పోతన ఆటలాడుతూ, దూకుతూ, ఎగురుతూ ఎవ్వరికీ దొరక్కుండా పరిగెత్తుతూ, కిందపడితే పట్టించుకోకుండా లేచి మళ్ళీ పరిగెత్తుతూ ఆడుతుండేవాడు.
ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువులోనూ అన్నింటా పోతనదే పైచేయి. గోలీలాట, బొంగరాలాట, పరుగుపందెం అన్నిటా గెలుపు పోతనదే. ఊరివారంతా అతడి చురుకుదనానికి ఆశ్చర్యపోయేవారు. అమ్మతో పాటు గుడికెళితే ఏకాగ్రతతో దేవునికి నమస్కరించేవాడు. పరిసరాలుకూడా మర్చిపోయేవాడు. సాధు సజ్జనులను గౌరవించేవాడు. హరికథలను, పురాణాలను ఎంతో ఆసక్తితో వినేవాడు. శివారాధన చేయాలనే కోరిక మనసులో పెంచుకున్నాడు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. పోతన తన బాల్యంలో ఆడుకొనే ఆటలు తెలుసుకున్నారు కదా! అట్లాగే మీరు ఆడుకొనే ఆటలు ఏవి ? ఆటలు ఎందుకోసం ఆడాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఆటలు – ప్రాముఖ్యం
1. పూర్వరంగం : పోతన బాల్యంలో గోళీలు, బొంగరాలు, కోతి కొమ్మచ్చులు, వంగుడు దూకుళ్ళు, పరుగెత్తడాలు వంటి ఆటలు ఆడుకొనేవాడని పోతన ల పాఠంలో చెప్పబడింది.
2. ప్రస్తుతం : ఇప్పుడు ఆ ఆటలేవీ పిల్లలు ఆడటం లేదు. ఒక పరుగు పందాలు మాత్రం ఆడుతున్నారు. నేను మా స్నేహితులు పరుగు పందాలు, దాక్కునే ఆటలు ఆడతాం. జట్లుగా కబడ్డి ఆడతాం. ఇంట్లో ఉంటే చదరంగంగానీ, మెకానో సెట్స్లోని ఆడుకుంటాను.
3. ఆటలు ఎందుకు ఆడాలి : ఆటలు ఆడినందువల్ల శరీరం దృఢంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఒంటికి బాగా చెమటలు పట్టి శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. చురుకుదనం వచ్చి పనులు చకచకా చేసుకుంటారు. బుద్ధి కూడా చురుకుగా ఉంటుంది. ఇలా ఆటలు చక్కని వ్యాయామం. అంతేగాక అందరితో కలిసి ఆడటం వల్ల టీమ్ స్పిరిట్ అలవాటౌతుంది. సంఘీభావం, సర్దుకుపోవటం లాంటి మంచి అలవాట్లు వస్తాయి.
3. ఆటల ప్రాముఖ్యం : ఆటలు ఆడకపోతే పిల్లల్లో మందకొడితనం ఏర్పడుతుంది. టి.వి.లు చూస్తూ కూర్చుంటారు. కళ్ళు దెబ్బతింటాయి. ఒళ్ళు పెరిగిపోతుంది. అనవసరమైన రోగాలు చుట్టుకుంటాయి.
4. ముగింపు : కాబట్టి ఏ వయసు వారికైనా వ్యాయామం అవసరమే. అది పిల్లల విషయంలో ఆటలే మంచి వ్యాయామం.
2. పోతన ఆడుకునేటప్పుడు చూసినవాళ్ళు “ఈ బాలుడు అసాధ్యుడు” అని అనుకునేవారు కదా! మరి ఇప్పుడు ఆడుకొనే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు.
లలిత : చూశావా జానకీ! రాజు ఎంత బాగా పరిగెత్తుతున్నాడో !
జానకీ : ఔనౌను. తప్పకుండా ముందున్న ముగ్గుర్నీ దాటేస్తాడు.
లలిత : వాడి కాళ్ళలో మెరుపు వేగం ఉంది. నిజంగా వాడు అసాధ్యుడే సుమా!
జానకీ : ఔనౌను. అటుచూడు. ఆ పక్కనించి రవి దూసుకొచ్చేస్తున్నాడు.
లలిత : నిజమే. ఎవరు ముందొస్తారో!
జానకీ : రవి రాజుతో పాటు జానీ, జీవన్ కూడా వేగం అందుకున్నారు.
లలిత : చూసే వాళ్ళకు మనకే ఎంత ఉత్కంఠగా ఉందో ! ఇక పిల్లల సంగతి ఏం చెప్పాలి.
జానకీ : నిజమే లలితా! ఈ కాలం పిల్లలు అసాధ్యులమ్మా! మన రోజుల్లో ఇంత గంభీరంగా ఉండేదికాదు. ఇప్పుడు పిల్లల్లో పట్టుదల, స్పర్థ బాగా పెరిగిపోతున్నది.
లలిత : ఎవరికి వారే తామే మొదటిస్థానం గెలవాలని పట్టుదలగా ఆడుతున్నారు. రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఇది మెచ్చుకోవలసిన విషయం.
జానకీ :ఔనౌను. అటుచూడు చివరగా పరుగెత్తుతున్న రాకేష్ అందర్నీ దాటి ఫస్టు వచ్చాడు. ఇది ఊహించని మలుపు.
V. పదజాల వినియోగం.
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి.
ఉదా : భారతీయులు సోదరభావం కలిగి ఉంటారు.
జవాబు.
సౌభ్రాత్రము
అ. లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది.
జవాబు.
పొత్తము
ఆ. అర్జునుడు విలువిద్యయందు అధిపుడు.
జవాబు.
మేటి
ఇ. బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు.
జవాబు.
అనుజుడు/అవరజుడు/యవీయసుడు
ఈ. ప్రతిరోజు స్నానంచేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
జవాబు.
మెయి
2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
అ. భోజనం – క. నిద్ర
ఆ. నిదుర – ఖ. పుస్తకం
ఇ. పొత్త – గ. బోనం
జవాబు.
అ) భోజనం – గ. బోనం
ఆ) నిదుర – క. నిద్ర
ఇ) పొత్త – ఖ. పుస్తకం
3. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) అనుజుడు : ___________
జవాబు.
అనుజుడు = తమ్ముడు
అర్జునుడు ధర్మరాజుకు అనుజుడు.
ఆ) గొంకుజంకులు : ___________
జవాబు.
గొంకుజంకులు = భయసందేహాలు
కిషోర్ గొంకుజంకులు లేకుండా చక్కగా ఉపన్యాసమిచ్చాడు.
ఇ) మేటి : ___________
జవాబు.
మేటి = శ్రేష్ఠుడు
ఏకలవ్యుడు విలువిద్యలో మేటి
ఈ) ఆసక్తి : ___________
జవాబు.
ఆసక్తి = ఇష్టము
పిల్లలకు ఆటలమీద ఆసక్తి ఎక్కువ.
ఉ) వెత : ___________
జవాబు.
వెత = బాధ
తుఫాన్లో సర్వం కోల్పోయిన వారి వెతలు చూస్తే మనసు కరిగిపోతుంది.
ఊ) అసాధ్యుడు : ___________
జవాబు.
అసాధ్యుడు = ఎవరికీ లొంగనివాడు
ఈ కాలంలో పిల్లలు తెలివితేటలలో అసాధ్యులుగా ఉన్నారు.
4. కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.
అ) అరుణాస్పదమనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అందమైనది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మేడలున్నాయి.
జవాబు.
అదే అర్థం వచ్చే పదాలు : పురం, పట్టణం, నగరం.
ఆ) సకాలంలో వర్షాలు పడితే ధరణి పులకరిస్తుంది. రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. పచ్చని పంటల తోటి అవని శోభిస్తుంది.
జవాబు.
అదే అర్థం వచ్చే పదాలు : ధరణి, పుడమి, అవని
ఇ) కార్తీక్ ఇంటిమీద కపి కూర్చున్నది. ఆ వానరం చేతిలో కొబ్బరి చిప్ప ఉన్నది. అదిచూసి మరో కోతి ఉరికొచ్చింది.
జవాబు.
అదే అర్థం వచ్చే పదాలు : కపి, వానరం, కోతి.
ఈ) మా గ్రామంలోని గుడి చాలా పెద్దది. నేను ప్రతినిత్యం కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
జవాబు.
అదే అర్థం వచ్చే పదాలు : గుడి, కోవెల, దేవాలయం.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పట్టికలోని పదాలను చదివి, పుంలింగ, స్త్రీ లింగ, నపుంసకలింగ పదాలను, ఏకవచన బహువచనాలను, అవ్యయాలను గుర్తించండి.
బాలుడు | పుట్ట | బాలురు | ఆమె | పర్వతం |
ఆహా | సీత | అమ్మో | డబ్బ | ఆటలు |
అతడు | శభాష్ | మహిళలు | పత్రిక | సుధాకర్ |
రచయిత్రి | చెట్టు | చంద్రుడు | ఉంగరం | నటి |
అట్లని | రచనలు | బలరాం | బల్ల | ఆకాశం |
అ. పుంలింగ పదాలు : ___________
జవాబు.
బాలుడు, బాలురు, చంద్రుడు, బలరాం, సుధాకర్, అతడు.
ఆ. స్త్రీలింగ పదాలు : ___________
జవాబు.
రచయిత్రి, సీత, మహిళలు
ఇ. నపుంసకలింగ పదాలు : ___________
జవాబు.
పుట్ట, రచనలు, ఆటలు, ఆకాశం.
ఈ. ఏకవచనం : ___________
జవాబు.
బాలుడు, రచయిత్రి, సీత, చంద్రుడు, బలరాం, సుధాకర్, పర్వతం.
ఉ. బహువచనం : ___________
జవాబు.
రచనలు, బాలురు, మహిళలు, ఆటలు
ఊ. అవ్యయం : ___________
జవాబు.
ఆహా, అట్లని, శభాష్, అమ్మో
2. కింది వాటిని జతపరచండి.
అ. నామవాచకం | క. చదివింది |
ఆ. సర్వనామం | ఖ. కాని |
ఇ. విశేషణం | గ. ఆమె |
ఈ. క్రియ | ఘ. ఎర్రని |
ఉ. అవ్యయం | ఙ. హైదరాబాదు |
జవాబు.
అ. నామవాచకం | ఙ. హైదరాబాదు |
ఆ. సర్వనామం | గ. ఆమె |
ఇ. విశేషణం | ఘ. ఎర్రని |
ఈ. క్రియ | క. చదివింది |
ఉ. అవ్యయం | ఖ. కాని |
3. కింది ఖాళీలను పూరించండి.
అ. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ___________
జవాబు.
విశేషణం
ఆ. నామవాచకానికి బదులుగా వాడేది ___________
జవాబు.
సర్వనామం
ఇ. పనిని తెలిపే మాట ___________
జవాబు.
క్రియ
ఈ. లింగ వచన విభక్తులు లేనివి ___________
జవాబు.
అవ్యయాలు
ఉ. పేరును తెలిపే పదం ___________
జవాబు.
నామవాచకం
ప్రాజెక్టు పని
మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయండి. వారి గురించి మీకు ఏమనిపించిందో మీ అనుభూతుల్ని తెలుపుతూ నివేదిక రాయండి. ప్రదర్శించండి.
1. ప్రాజెక్టు శీర్షిక : మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయడం. ఆ అనుభూతుల్ని తెలుపుతూ నివేదికరాయడం.
2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది : x x x ఆ) సమాచార వనరు : మాగ్రామ పరిసరాలు
3. సేకరించిన విధానం : మాగ్రామం సిరిపురం. మాగ్రామంలో మంచిగా కలసిమెలసి ఉండే అన్నదమ్ములు రమేష్, గణేష్. వారి నుండి సమాచారం సేకరించడం జరిగింది.
4. నివేదిక : మా గ్రామం సిరిపురం. మా గ్రామంలో రమేష్, గణేష్ అనే ఇద్దరు రైతు సోదరులు ఉన్నారు. ఇద్దరూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు. గణేష్ భూమిలోని బోర్లో నీరు రాలేదు. రమేష్ భూమిలోని బోర్నుండి గణేష్కు నీరిస్తాడు. రమేష్ భూమిలో కొంత మెరక నేల. నీళ్ళు సరిగా పారవు. గణేష్ తన వద్ద ఉన్న నీటిగొట్టాలను రమేష్కు ఇస్తూ ఉంటాడు.
ఆ నీటిగొట్టాల సాయంతో మెరకభూమికి నీరు నడిచేలా రమేష్ చూస్తాడు. రమేష్, గణేష్ ఒకరికి ఒకరు సాయంగా, చేదోడువాదోడుగా ఉంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి రమేష్, గణేష్ ముందు ఉంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలో రమేష్, గణేష్లను చూసి నేర్చుకోవాలని ఊరిలోని వారంతా అంటుంటారు.
5. ముగింపు : అన్నదమ్ములు ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవాలి. అన్నదమ్ముల అనుబంధం, కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం వంటివి చూస్తే నాకు కూడా వారిలాగే ఉండాలని అనిపిస్తుంది.
TS 6th Class Telugu 6th Lesson Important Questions పోతన బాల్యం
ప్రశ్న 1.
ఆటలలో పోతన నేర్పు వివరించండి.
జవాబు.
పోతన ఆటల్లో ఆరితేరినవాడు. గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురి తప్పదు. స్నేహితులతో పోటీపడి బొంగరాన్ని విసురుతుంటే ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క బొంగరం ముక్కలయ్యేది. పందెం పెట్టుకొని పరిగెత్తితే లేడిపిల్లలాగా ఎవరికీ చిక్కడు. చెట్ల కొనకొమ్మల నెక్కుతాడు. పక్షివలె దూకుతాడు. ఒక్క క్షణం కూడా నేలమీద కాలు నిలవదు.
పాదరసంలా జారిపోతాడు.
ప్రశ్న 2.
పోతన భక్తి ఎలాంటిది ?
జవాబు.
పోతన అమ్మ గుడికి పోతుంటే ఆమె వెంటే వెళతాడు. వేరే ఏ ధ్యాసకూడా లేకుండా దేవుని మీదే మనసు లగ్నం చేసి మళ్ళీ మళ్ళీ దేవుడికి నమస్కారాలు చేస్తాడు. సాధువులను, సజ్జనులను సేవిస్తాడు. హరికథలను, పురాణాలను ఆసక్తిగా వింటాడు. శివుని పాదాలను నిరంతరం పూజించాలనే కోరిక ఎక్కువగా కలవాడు.
పర్యాయపదాలు
- గతి = తీరు, పద్ధతి, మార్గము
- శంభుడు = శివుడు, హరుడు, శంకరుడు
- కోతి = కపి, మర్కటం, వానరం
- భూమి = ధరణి, పుడమి, నేల
- పాదము = అడుగు, చరణము
- గుడి = దేవాలయం, కోవెల
- పురి = పట్టణం, ఊరు, నగరం
- అనుజుడు = అవరజుడు, తమ్ముడు, యవీయసుడు.
- వెత = వ్యథ, బాధ
- సోదరులు = సహెూదరులు, అన్నదమ్ములు
- భోజనము = ఆహారము, కూడు, తిండి
- పొత్తము = పుస్తకము, గ్రంథము
- సరోజము = వారిజము, జలజము
ప్రకృతి – వికృతి
- వ్యథ – వెత
- పుస్తకము – పొత్తము
- భోజనము – భోనము
- విద్య – విద్దియ , విద్దె
- గుణము – గొనము
- నిద్ర – నిదుర
- ప్రాణము – పానము
- భక్తి – బత్తి
- పక్షి – పక్కి
- కథ – కత
- ధాటి – దాడి
- మతి – మది
నానార్థాలు
- గుణము = స్వభావము, అల్లెత్రాడు
- ప్రాణం = ఉసురు, గాలి, బలిమి
- దర్శనం = చూపు, శాస్త్రం, అద్దం
- గడియ = ఇరవై నాలుగు నిమిషాల కాలము, తలుపుకు వేయు గొళ్ళెము
- సాధువు = సజ్జనుడు, ముని
I. ఈ క్రింది పద్యాలను చదివి భావాలు రాయండి.
1. తిప్పన చదివేడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరిపోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్
జవాబు.
భావం : తిప్పన ఏదైన పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంతగొప్ప తెలివిగలవాడు.
2. సాధు సజ్జన దర్శనోత్సాహ గతియు
హరికథాపురాణ శ్రవణాభిరతియు
శంభుపద సరోజార్చ నాసక్తమతియుఁ
బెరుగసాగె వేఱక ప్రక్క బిడ్డ యెడద.
జవాబు.
భావం : మరోవైపు పోతన మనసులో సాధుసజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదపద్మాలను పూజించాలనే ఆసక్తి పెరుగసాగింది.
3. ఈక్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా రాయండి.
1. ఆటల మేటి విద్దియల ……….. చరించునాతఁడున్.
జవాబు.
ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడెసాటి కొ
టన బాలురంద తొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకు జంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.
పదజాలం :
II. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
1. ప్రక్కలయ్యె
జవాబు.
ప్రక్కలయ్యే = పగిలిపోయింది
రాము పలక కింద పడి ప్రక్కలయింది.
2. పొత్తము
జవాబు.
పొత్తము = పుస్తకము
నేనింకా కొత్త పొత్తములు కొనలేదు.
3. తెలివి
జవాబు.
తెలివి = జ్ఞానము
రవి అద్భుతమైన తెలివి కలవాడు
4. తగువులాట
జవాబు.
తగువులాట = పోట్లాట
పిల్లలు తగువులాడుకున్నా మళ్ళీ కలిసిపోతారు.
III. సరైన సమాధానాన్ని గుర్తించండి.
1. మిక్కిలి, గొప్ప అనే అర్థాలనిచ్చే పదం ………………..
a) కడు
b) ఒప్పు
c) దూకులు
d) అండ్రు
జవాబు.
a) కడు
2. పోట్లాట, కయ్యం – అనే పదాలకు సమానార్థాన్నిచ్చేది
a) బిగువు
b) పట్టు
c) అనఘ
d) తగువు
జవాబు.
d) తగువు
3. ‘భూమి’ అనే అర్థాన్నిచ్చే మరో రెండు పదాలు
a) గడియ, గుడి
b) వడి, జడి
c) పుడమి, నేల
d) నింగి, నేల
జవాబు.
c) పుడమి, నేల
4. ‘అనుజుడు’ అనే మాటకు సమానార్థక పదాలు
a) తమ్ముడు, అన్న
b) తమ్ముడు, సోదరుడు
c) ప్రియమైనవాడు, నేస్తం
d) బంధువు, స్నేహితుడు
జవాబు.
d) బంధువు, స్నేహితుడు
5. సరి, సమానము అనే అర్థాలనిచ్చే పదం
a) సాటి
b) మేటి
c) పోటీ
d) ధాటి
జవాబు.
a) సాటి
IV. కింది పదాల నుండి సరైన ప్రకృతి – వికృతులను గుర్తించండి.
1. ‘విద్య’ అనే మాటకు వికృతి
a) ఒ
b) విజ్ఞ
c) విద్దె
d) విధ్య
జవాబు.
c) విద్దె
2. ‘బగితి’ అనే వికృతి పదానికి ప్రకృతి
a) భాతి
b) భక్తి
c) భగత్
d) భాగ్యం
జవాబు.
b) భక్తి
3. ‘భోజనం’ అనే పదానికి వికృతి
a) భుక్తి
b) నజభం
c) బోనం
d) జన్నం
జవాబు.
c) బోనం
4. ‘గొనము’ అనే పదానికి ప్రకృతి
a) గుణము
b) గణము
c) ఘనము
d) గానము
జవాబు.
a) గుణము
V. వ్యాకరణాంశాలు:
1. కోతి కొమ్మల మీద ఆడుకుంటున్నది. గీతగీచిన పదం
a) స్త్రీలింగం
b) పుల్లింగం
c) నపుంసకలింగం
d) క్రియ
జవాబు.
c) నపుంసకలింగం
2. పిల్లలు ఆడుకుంటున్నారు. గీతగీచిన పదం
a) విశేషణం
b) క్రియ
c) స్త్రీలింగం
d) నామవాచకం
జవాబు.
b) క్రియ
3. సాధువులు భజన చేస్తున్నారు. ఇందులో సాధువులు
a) ఏకవచనం
b) నపుంసకలింగం
c) క్రియ
d) బహువచనం
జవాబు.
d) బహువచనం
4. అమ్మ పాపకు జోలపాడుతున్నది. అమ్మ –
a) పుల్లింగం
b) బహువచనం
c) స్త్రీలింగం
d) క్రియ
జవాబు.
c) స్త్రీలింగం
5. సైనికులు దేశభక్తిని ప్రదర్శించారు. సైనికులు
a) నపుంసకలింగం
b) బహువచనం
c) క్రియ
d) విశేషణం
జవాబు.
b) బహువచనం
6. వాళ్ళు చాలా మంచివాళ్ళని తెలుసు. ఈ వాక్యంలో సర్వనామం
a) వాళ్ళు
b) చాలా
c) మంచి
d) తెలుసు
జవాబు.
a) వాళ్ళు
7. చెట్లు తీయని ఫలాలను ఇస్తాయి. ఈ వాక్యంలో క్రియ
a) ఇస్తాయి
b) చెట్లు
c) ఫలాలు
d) తీయని
జవాబు.
a) ఇస్తాయి
8. ఆమె గొప్ప నర్తకి అంటారు. ఇందులో గీతగీచిన పదం
a) సర్వనామం
b) విశేషణం
c) నామవాచకం
d) క్రియ
జవాబు.
b) విశేషణం
9. అది అందమైన పల్లెటూరు. ‘పల్లెటూరు’ ఏ భాషాభాగం ?
a) తెలుగు
b) నామవాచకం
c) సర్వనామం
d) విశేషణం
జవాబు.
b) నామవాచకం
10. కింది వానిలో నపుంసకలింగం కానిది
a) చెట్టు
b) పండు
c) కొడుకు
d) కోడి
జవాబు.
c) కొడుకు
పద్యాలు – ప్రతి పదార్ధాలు – తాత్పర్యాలు:
1వ పద్యం
కం. తిప్పన సౌభ్రాత్రమ్మున
న స్పురిఁ గల చిన్న పెద్ద లందరికిఁ గడున్
మెప్పనుజునకన్న యనన్
గొప్పగుఁ దమ్ముఁ డన నన్నకున్ బ్రాణంబౌ
ప్రతిపదార్థం :
తిప్పన = అన్నయైన తిప్పన యొక్క
సౌభ్రాత్రమ్మునన్ = సోదర భావంతో
ఆ + పురిన్ + కల = ఆ ఊరిలో ఉన్న
చిన్న పెద్దలు = చిన్నవారు పెద్దవారు
అందరికిస్ = అందరికి
కడున్ = మిక్కిలి
మెప్పు = ఇష్టము
అనుజునకు = తమ్ముడైన పోతనకు
అన్న + అనన్ = అన్న అంటే
గొప్ప గ + అగున్ = చాల గౌరవం
అన్నకున్ = అన్నయ్యకు
తమ్ముడు + అనన్ = తమ్ముడంటే
ప్రాణంబు + ఔ = ప్రాణంతో సమానం
తాత్పర్యం : తిప్పన, పోతనలు అన్నదమ్ములు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. తిప్పన తన తమ్ముడైన పోతనమీద చూపే సోదర భావంతో ఊరిలో అందరికి ఆదర్శంగా నిలిచాడు. అన్న అంటే పోతనకూ గౌరవం. తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు.
2వ పద్యం
సీ. తన కెవ్వ రేదేని తినుబండ మిడిలేని
యనుజుని కిడక తిప్పన తినండు
అనుజన్మ నెవ్వ రేమనిన తా నష్టమ్ము
వచ్చు మై నీఁగను వ్రాలనీఁడు.
గడియసేపింటఁ దమ్ముఁడు గానరాకున్న
వెదకుఁ గన్పడుదాఁక వెతను జెందుఁ
తన ప్రాణమున కెంతయును గూర్చు వస్తువే
నవరజుం డడిగినయంత నొసఁగు
తే. భోజన మొనర్చు తఱి నిద్రబోవు వేళ
లందును యవీయసుఁడు తన యండ నుండ
వలెను దగవులాటననేమొ తెలియ రనఘ
గుణులు సోదరుల్ రామలక్ష్మణులు మణులు.
ప్రతిపదార్థం:
తిప్పన = అన్నయైన తిప్పన
తనకు = తనకోసం
ఎవ్వరు = ఎవరైనా
ఏది + ఏని = ఏదైనా
తినబండము = తినే పదార్ధము
ఇడిరి + ఏని = ఇచినట్లైతే
అనుజునికి = తమ్మునికి
ఇడక = పెట్టకుండా
తినండు = తినడు.
అనుజన్మున్ = తమ్ముని
ఎవ్వరు + ఏమి + అనిన = = ఎవరైనా ఏమైనా అంటే
తాను = అన్న తిప్ప
అడ్డమువచ్చు = అడ్డుపడతాడు.
మైన్ = శరీరముపై
ఈగను = ఈగను కూడా
వాలనీడు = వాలనివ్వడు.
గడియ సేపు = ఒక్క గంట సేపు
తమ్ముడు = తమ్ముడైన పోతన
ఇంటన్ = ఇంటిలో
కానరాక+ ఉన్న = కనబడకపోతే
కన్పడుదాక = కనిపించేంత వరకు
వెదకున్ = వెతుకుతాడు.
వెతను + చెందు = బాధపడతాడు
తన ప్రాణమునకు = తనకు
ఎంతయును = మిక్కిలి
కూర్చు = కావలసిన
వస్తువు + ఏని = వస్తువైనప్పటికీ
అవరజుండు = తమ్ముడు.
అడిగిన + అంత = అడగగానే
ఒసంగు = ఇచ్చేస్తాడు.
భోజనము + ఒనర్చు తరి = అన్నం తినేటప్పుడు
నిద్రపోవు వేళలందును = నిద్ర పోయేటప్పుడు
యవీయసుడు = తమ్ముడు
తన + అండన్ = తనదగ్గరనే
ఉండవలెను = ఉండాలి.
తగువులాట పోట్లాట
అనన్ + ఏమొ = అంటే ఏమిటో
తెలియర = ఆ అన్నదమ్ములకు తెలియదు
సోదరుల్ = ఆ అన్నదమ్ములు
అనఘ గుణులు = మంచి గుణములు కలవారు
రామలక్ష్మణులు = రామలక్ష్మణుల వంటివారు
మణులు = రత్నాల్లాంటి వార
తాత్పర్యం:
తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండ తిప్పన తినడు. తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఈగను కూడ వాలనీయడు. కొంచెంసేపు తమ్ముడు. కనబడకపోతే వెతకడం మొదలు పెడ్తాడు. కనిపించేదాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చి వేస్తాడు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడ తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు. వారు మణులు, రామలక్ష్మణుల వంటివారు.
3వ పద్యం
కం. తిప్పన చదివెడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరి పోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్
ప్రతిపదార్థం :
తిప్పన = అన్నయైన తిప్పన
చదివెడు =చదువుతున్న
పద్యము = పద్యాన్ని
ఒకసారి వినిన = ఒకసారి వింటే
సరి = చాలు
పోతన= తమ్ముడైన పోతన
చప్పున = వెంటనే
తాను = తను
పొత్తము = పుస్తకము
విప్పక = తెరవకుండా
ఒప్పన్ + చెప్పును = అప్పజెప్పుతాడు
ఆ + దానిన్ = ఆ
తెలివిన్ = తెలివితేటలను
ఏమి చెప్పుట = ఏమని చెప్పాలి ?
తాత్పర్యం : తిప్పన ఏదైన పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు పోతన.
4వ పద్యం
ఆ.వె. దూఁకు లెగురు లందుఁ దొండు మెండుగఁబడి
సరకుఁగొనఁడు లేచి యుఱుకు నపుడె
యరం! భూమి ప్రక్కలయ్యే నండ్రా యుక్కు
బాలు పాటుగాంచి ప్రక్కవారు
ప్రతిపదార్థం :
దూకులు = దూకటం
ఎగురులు + అందు = ఎగరటం అనే ఆటలలో
తొండు మెండుగన్ పడి = కింద పడిపోతే
సరకు గొనడు = లెక్కచేయడు
అపుడు + ఎ = వెంటనే
లేచి = పైకిలేచి
ఉరుకున్ = = పరుగెత్తుతాడు
ప్రక్కవారు = చుట్టు పక్కల నున్నవారు
ఆ ఉక్కు బాలు = ఉక్కులాంటి ఆ పిల్లవాడు
పాటు + కాంచి = పడటం చూసి
అరరె = అరె
భూమి = నేల
ప్రక్కలు + అయ్యే = పగిలిపోయిందే
అండ్రు = అంటూ ఉంటారు
తాత్పర్యం : పోతన ఆటలాడుతూ, దుంకుతూ, ఎగురుతు ఉన్నప్పుడు కిందపడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరుగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి ‘అరెరే… ఈ ఉక్కులాంటి పిల్లగాడు పడితే భూమియే ముక్కలయిందే!’ అని అంటారు.
5వ పద్యం
ఉ. ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడె సాటి కొ
టను బాలు రంద డొకటైన నెదిర్చెడి దాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకుజంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్
ప్రతిపదార్థం :
ఆతడున్ = ఆ పోతన
ఆటల = ఆటలలో
మేటి = గొప్పవాడు
విద్దియల + అందున = చదువులలో
వానికి = అతనికి
వాడు + ఎ = అతడే
సాటి = సమానము
కొట్లాటను =
బాలురు + అందరు = పిల్లలందరూ
ఒకటైన = గుంపుగా వచ్చినా
ఎదిర్చెడి = ఎదిరించగల
ధాటి = ధైర్యం కలవాడు
తీయగా = ఇంపుగా
పాటలుపాడుట + అందు = పాటలు పాడటంలో
పికవాణికి = కోయిల పాటకు
వానికి = పోతనకు
పోటి = పోటి
ఎందు = ఏ విషయంలోనైనా
మోమోటము = మొహమాటము
కొం కుజంకుల = అనుమానమును, భయమును
బొత్తుగ = పూర్తిగా
వీడి = వదిలేసి
చరించున్ = తిరుగుతాడు
తాత్పర్యం: ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైనా ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు. తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటీ. మొగమాటం, భయం, వెనకడుగు వేయడమంటూ ఎరుగడు.
6వ పద్యం
చ. గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జేయిడి విస్మయమంద నందఱున్
ప్రతిపదార్థం :
గురిని +ఇ డి = గురి చూసి
కొట్టెను + ఏని = కొట్టినట్టైతే
ఒక గోలియు = ఒక్క గోలీకూడా
తప్పదు. = తగలకుండా ఉండదు
కచ్చగట్టి = పోటీపడి
బొంగరమును = బొంగరాన్ని
వేయన్ = విసిరితే
వ్రేటుకు = ప్రతి వేటుకు
ఒక కాయ = ఒక్కొక్కరి బొంగరం
పటుక్కును = ముక్కలై పోతుంది.
పందెము + ఊ ని = పందెం కాసి
లేడిపిల్లవలె = జింకపిల్లలాగా
ఉఱికిన = పరిగెత్తితే
ఒకని అయ్యకున్ = ఏ ఒక్కరికి కూడా
చిక్కడు = అందడు
అందరున్ = అందరూ
చిరుతడు = పిల్లవాడు.
అద్దిరా = ఆహా!
అసాధ్యుడు + అంచు = అసాధ్యుడు సుమా అంటూ
ఎదన్ = గుండెల పైన
చేయి + ఇడి = చేయి పెట్టుకొని
విస్మయము అందన్ = ఆశ్చర్యపడుచుండగా
తాత్పర్యం : గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురితప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు ‘పటుక్కని’ పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరు గుండెలమీద చేయి వేసుకొని ఆశ్చర్య
పడుతుంటారు.
7వ పద్యం
ఆ.వె. కోఁతివోలెఁ జెట్ల కొనఁ గొమ్మ లెగబ్రాకుఁ
బక్షివోలెఁ గ్రిందఁబడఁగ దూఁకుఁ
గాలు భూమిపైన గడియైన నాఁగదు
పాదరసము గలదొ పాదయుగళి!
ప్రతిపదార్థం :
కోతివోలె = కోతి లాగ
చెట్ల కొనకొమ్మలు = చెట్ల చిటారు కొమ్మలు
ఎగబ్రాకు = పైకి పాకుతాడు.
పక్షి వోలె = పక్షిలాగా
క్రిందన్ = కిందికి
పడగ = పడునట్లుగా
దూకు = దూకుతాడు.
కాలు = పోతన కాళ్ళు
భూమిపైన = నేలమీద
గడియ + ఐనన్ = కొంచెం సేపు కూడా
ఆగదు = ఉండదు
పాదయుగళి = పాదాలకు
పాదరసము కలదొ = పాదరసం అంటుకొని ఉన్నదే!
తాత్పర్యం: కోతివలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. పక్షివలె కిందికి దుంకుతాడు. భూమి మీద కాలు క్షణమైన నిలువదు. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో ? (పాదరసం నిలకడగా ఉండదు.)
8వ పద్యం
కం. గుడికిఁ జను జననిఁ గని వెం
బడిఁబడి చను జదువుకొనెడి బడి విడియైనన్
బడి పడి జేజే లిడు న
య్యెడ నెడమయుఁ గుడియు ననక నెంతయు భక్తిన్.
ప్రతిపదార్థం:
గుడికి = దేవాలయానికి
చను = వెళ్ళుచున్న
జననిన్ + కని = తల్లిని చూసి
చదువుకొనెడి = తను చదువుకొనే
బడి = పాఠశాల
విడి + ఐనన్ = విడిచిపెట్టి
వెంబడిపడి = వెంటపడి
చనున్ = వెళతాడు
ఆ + ఎడన్ = ఆ సమయంలో
ఎంతయు = మిక్కిలి
భక్తి న్ = భక్తితో
ఎడమయున్ = ఎడమవైపును
కుడియున్ = కుడివైపును
అనక = అనుకోకుండా
పడిపడి = మళ్ళీ మళ్ళీ
జేజేలు = నమస్కారాలు
ఇడున్ = పెడతాడు.
తాత్పర్యం: అమ్మ గుడికి పోతుంటె, పోతన బడికి పోకుండ అమ్మవెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. (తన పరిసరాలను పట్టించుకోకుండా దేవునిపైనే దృష్టి పెడుతాడని భావం)
9వ పద్యం
తే.గీ. సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు
హరికథాపురాణ శ్రవణాభిరతియు
శంభుపద సరోజార్చ నాసక్తమతియుఁ
బెరుగసాగె వేరొకప్రక్క బిడ్డ యెడద
ప్రతిపదార్థం :
సాధు = సన్న్యాసుల యొక్క
సజ్జన = మంచివారి యొక్క
దర్శన = దర్శనం చేసుకోవాలనే
ఉత్సాహగతియు = ఉత్సాహము కలిగి ఉండుట
హరికథా = హరికథలను
పురాణ = పురాణములను
శ్రవణ = వినాలనే
అభిరతియు = కోరికయు
శంభు = శివుని యొక్క
పదసరోజ = పాద పద్మములను
అర్చన = సేవించుటయందు
ఆసక్త = తగులుకున్న
మతియు = బుద్ధియు
బిడ్డ ఎడదన్ = పిల్లవాడైన పోతన మనసులో
వేఱొక ప్రక్క = మరొక కోణములో
పెరుగసాగన్ = వృద్ధి చెందసాగింది.
తాత్పర్యం: మరోవైపు పోతన మనసులో సాధు సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదపద్మాలను పూజించాలనే ఆసక్తీ పెరగ సాగింది.
ఆ పాఠం నేపథ్యం/ఉద్దేశం
తిప్పన, పోతన ఇద్దరూ అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది ? వారి బాల్యమెట్లా గడిచింది ? మొదలైన విషయాలు ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం “కావ్య” ప్రక్రియకు చెందినది. కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా|| వానమామలై వరదాచార్యులు రచించిన ‘పోతన చరిత్రము’ అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది.
కవి పరిచయం
ప్రశ్న.
పోతన బాల్యం పాఠం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డా॥ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తివైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయేకొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి) మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.
ప్రవేశిక
అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతోటి పోలుస్తారు. తిప్పన, పోతనలను కూడా రామలక్ష్మణులని అనేవాళ్ళు. వీళ్ళలో పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. బాల్యంలో ఆ అన్నదమ్ములిద్దరినీ రామలక్ష్మణులని ఎందుకనేవాళ్ళో పోతన ఏయే ఆటలు ఆడేవాడో, అతణ్ణి చూసినవాళ్ళు ఏమనుకునేవాళ్ళో వానమామలై వరదాచార్యులు రాసిన పద్యాలను చదివి తెలుసుకోండి.
నేనివి చేయగలనా?
- నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
- అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
- పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
- నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు