These TS 10th Class Telugu Important Questions 3rd Lesson వీర తెలంగాణ will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 3rd Lesson Important Questions వీర తెలంగాణ
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు భార్యలు (6 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘తల్లీ ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్ డుల్లెన్ కొన్ని తరాల దాక’ తెలంగాణ ప్రతిభా విశేషాలేవి ?
జవాబు:
తెలంగాణ ప్రతిభావంతమైన సీమ. ఎందరో రాజులు ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా పాలించారు.
వారి కొన్ని ప్రతిభా విశేషాలు :
- ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగి నపుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవర పడ్డారు.
- రుద్రమదేవి ఓరుగల్లులో పరాక్రమించినపుడు, తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి.
- కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినపుడు శత్రురాజుల గుండెలు ఆగిపోయాయి.
- చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున రాజ్యం పాలించినపుడు, కళ్యాణ ఘంటానాదాలు మారు మ్రోగాయి.
- నాటి నుండి నేటి వరకూ తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బలకు లొంగలేదు.
ప్రశ్న 2.
“తెలంగాణ ప్రజల బ్రతుకు దుర్భరమైనా ఆంధ్రత్వమును పోనాడలేదు” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
నిజాం నవాబు కాలంలో తెలంగాణ ప్రజలు మత పిశాచి కోరలలో చిక్కుకొని విలవిలలాడారు.
బలవంతంగా తెలంగాణలోని హిందువులందరినీ, ముసల్మానులుగా మార్చాలని నవాబు ప్రయత్నించాడు. హిందువులను ఎన్నో బాధలు పెట్టాడు. తెలంగాణలో తెలుగు చదువుకొనే సదుపాయాలు లేకుండా చేశాడు. పాఠశాలల్లో, కళాశాలల్లో అంతా ఉర్దూ మీడియంలో విద్యా సదుపాయం కొనసాగింది.
అయినా తెలంగాణ ప్రజలూ, నాయకులూ తమ తెలుగుభాషను రక్షించుకొన్నారు. తమ తెలుగు సంస్కృతిని కాపాడుకున్నారు. మహమ్మదీయ మతంలోకి ప్రజలను బలవంతంగా మార్చడానికి నవాబు ప్రయత్నించినా, ప్రజల పీకలను కోసినా, ప్రజల బ్రతుకు దుర్భరమైనా, తెలంగాణ ప్రజలు తెలుగుదనాన్ని కోల్పోలేదన్నది సత్యము.
ప్రశ్న 3.
‘నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి’ అని కవి దాశరథి అనడంలోని ఉద్దేశమేమై ఉండవచ్చు? (March – 2017)
జవాబు:
తెలంగాణ శత్రువులు చాలా దుర్మార్గులు. కఠినాత్ములు. అవకాశం దొరికితే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుదీయరు. కాని, కాకతీయ చక్రవర్తుల పాలనలో శత్రువుల ఆగడాలు సాగలేదు. రుద్రమదేవి పరిపాలనలో తెలుగు జెండా గర్వంగా ఆకాశవీధిలో రెపరెపలాడింది.
కాపయ్య నాయకుడు బలం చూపితే శత్రు రాజుల గుండె దడదడలాడేది. అందుచేత ఏనాడూ తెలంగాణ ఓడిపోలేదని కవి భావన.
ప్రశ్న 4.
‘రాజు రివాజులు బూజు పట్టగన్ ‘ అంటే వివరించండి.
జవాబు:
రాజు దుర్మార్గుడు, కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూశాడు. కాని అతని ఆజ్ఞలు చెల్లలేదు, స్వాతంత్ర్య సముద్రం నాల్గువైపులా కాచుకొని ఉంది. స్వాతంత్ర్య సమరంతో భూమండలమంతా అల్లకల్లోలమైంది. తెలంగాణ ప్రాంతమంతా విప్లవ చైతన్యం చెలరేగింది. అందుచేత రాజాజ్ఞలు చెల్లలేదు.
ప్రశ్న 5.
తెలంగాణ కుర్రలను తెలంగాణ తల్లి ఎలా పెంచింది ?
జవాబు:
తెలంగాణా తల్లి తన కోటిమంది కుర్రవాళ్ళను వీరులుగా పెంచింది. భయమంటే తెలియకుండా పెంచింది. ధైర్యాన్ని నూరిపోసింది. పోరాట పటిమ నేర్పింది. తీవ్రమైన విప్లవ భావాలను వారిలో రేకెత్తించింది. తలలు తెగినా తలవంచని ధీరత్వం తెలంగాణ బిడ్డలది.
తెలంగాణ బిడ్డలకు వయస్సు రాగానే పదునైన కత్తులనిచ్చింది. నిజాం నవాబును ఎదురొడ్డి ప్రశ్నించమంది. యుద్ధం చేయమంది వజ్రాయుధంతో సమానమైన భుజబలాన్ని ప్రదర్శించమంది. తెలంగాణ భూమి తేజస్సుతో వెలిగేలా చేయమని ప్రోత్సహించింది.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్పులు (6 మార్కులు)
ఆ) కింది పశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
వీర తెలంగాణము’ పాఠం ఆధారంగా తెలంగాణ పౌరుష పరాక్రమాలను తెల్పండి. (March ’16)
(లేదా)
తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును, దాశరథి తెలంగాణాలో వివరించిన తీరును వెల్లడించండి.
జవాబు:
తెలంగాణ ఊదిన శంఖధ్వనులు భూమండలం అంతా బొబ్బలు పెట్టినట్లు ప్రతిధ్వనించాయి. తెలంగాణ నేల ఎంతో జిగికలది. తెలంగాణ తల్లి కోటిమంది పిల్లల్ని పెంచి, వారి చేతులకు కత్తులిచ్చి నైజాం నవాబుతో పోరాడమంది. తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది. నైజాం గర్వం అణఛేలా యుద్ధం సాగించింది. దిగంతాలలో ఇంద్రధనస్సులు కదలాయి.
తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం, సముద్రములా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లలలోని విప్లవ చైతన్యం భూమండలాన్ని సవరించింది. తెలంగాణ వీరులు యోధులు, వారు యుద్ధంలో రుద్రాదులు మెచ్చు కొనేటట్లు విజయం సాధించారు.
కాకతీయులు కంచు గంట మ్రోగినప్పుడు శత్రువులు కలవరపడ్డారు. రుద్రమదేవి పాలనా కాలంలో తెలుగుజెండాలు ఆకాశంలో రెపరెప లాడాయి. కాపయ నాయకుడి విజృంభణకు శత్రువుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్యరాజుల కాలంలో కల్యాణ ఘంటలు మ్రోగాయి. తెలంగాణ ఎప్పుడూ శత్రువుల దొంగదెబ్బకు లొంగలేదు. తెలంగాణ వీరుల పౌరుష పరాక్రమాలు అపూర్వమైనవి.
ప్రశ్న 2.
దాశరథి రచనా శైలిని వివరించండి. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్య రచనలు ప్రజల పక్షాన నిలిచి వారితో పోరాట స్ఫూర్తిని నింపేవిగా ఉంటాయి. దాశరథి రచనల పేర్లను పరిశీలిస్తే మనకు ఆయన అభ్యుదయ భావాలు అర్థమవుతాయి. కేవలం రచన చెయ్యటమే కాకుండా ఆచరణాత్మకంగా ప్రజలను చైతన్యం చేసిన ఉద్యమ కవి.
నా గీతాలు ఎంత దూరం ప్రయాణం చేస్తే అంతదూరం ఈ నేల మీద అరాచకాలకు నిప్పు పెట్టినట్టే అన్నాడు. దాశరథి రచనలతోనే కాదు ఆత్మస్థైర్యం కూడా మెండుగా కల మనిషి. తనను ఖైదు చేసిన నవాబులకు వ్యతిరేకంగా జైలు గోడలమీద పద్యాలు రాశాడు.
అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం, తిమిరంతో సమరం వంటి పేర్లతో ఆయన ప్రచురించిన కవితా సంపుటులు ఆయన రచనలలోని తిరుగుబాటు భావాలను మనకు చెబుతాయి. కవిత్వం, వ్యాసం, నాటిక, ఏది రాసిన తనదైన అభ్యుదయ భావాలను వాటిలో పొదిగేవారు. కేవలం కవిత్వమే కాకుండా సినీ గేయకవిగా కూడా పేరుగాంచి సినిమా పాటకు కూడా సాహితీ సొగసులను అద్దినవాడు దాశరథి.
తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోస్తూ ‘గాలిబ్ గజళ్ళ’ పేరిట అనువదించాడు. దాశరథి తెలంగాణ పాఠం నందలి ప్రతి పద్యములోని ప్రతిపాదం వీర తెలంగాణ పోరాటాలను వర్ణిస్తుంది. కాకతీయుల పోరాటాల నాటి నుండి నవాబుల, రజాకారుల అరాచకాలపై తెలంగాణ యోధుల పోరాటాలను వర్ణిస్తుంది.
ప్రశ్న 3.
దాశరథి చెప్పిన వీర తెలంగాణ గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వీర తెలంగాణ పాఠాన్ని దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. ఆయనకు మాతృభూమిపై గల అభిమానాన్ని కింద పేర్కొన్న విధంగా చాటారు.
ఓ తెలంగాణమా ! నీవు పూరించిన విప్లవ శంఖం ధ్వని భూమండలం అంతా ధ్వనించింది. ఈ భూమండలం అంతా ఒకేసారి బొబ్బలు పెట్టినట్లుగా ఉంది. ఆహా ! ఉదయించిన సూర్య కిరణాలతో ఆనందించిన పద్మాలతో ఆకాశ తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేలా చేశాయి.
అమ్మా ! తెలంగాణ ! తరతరాల నుండి నీ ప్రతిభా విశేషాలు కొందరు పాలకుల చేతిలో రాలిపోయాయి. ఇప్పుడు ఆటంకాలేమీ లేవు. క్రొత్త మెరుపు తీగల కాంతులు బ్రతుకు తోవలు చూపుతున్నాయి. నిర్మలమైన కాంతితో తొలిపొద్దు పొడిచింది.
అమ్మా ! తెలంగాణ తల్లీ ! తెలుగు పిల్లలను కోటిమందిని నీ ఒడిలో బలంగా పెంచావు. నిజాం నవాబుకు సవాల్ చేయమన్నావు కొంత వయస్సు రాగానే కత్తులిచ్చావు. యుద్ధం చేయమన్నావు ఈ తెలంగాణ నేలలో తేజస్సు చాలా ఎక్కువమ్మా !
ఇక్కడ గడ్డిపోచ కూడా కత్తిపట్టి యుద్ధం చేస్తుంది. రాజు యొక్క పొగరు అణచడానికే యుద్ధం. ఈ యుద్ధం చూసి లోకాలన్నీ భయ పడ్డాయి.
రాజుగారి ఆజ్ఞలకు కాలం చెల్లింది. స్వతంత్ర తెలంగాణ పొంగి పొర్లింది.
అమ్మా ! తెలంగాణ తల్లీ ! నీ పుత్రులలో వికసించిన విప్లవభావాలు ఊరికే పోలేదు. భూమండలం సవరించారు. మహాకాంతివంతుడైన సూర్యుడిని ఆహ్వానించారు. దేశమంతా కాంతి సముద్రంతో నింపారు. తెలంగాణ బిడ్డలు వీరులమ్మా ! నీ బిడ్డలు పరోపకారులమ్మా ! తెలుగు యోధులమ్మా !
అమ్మా ! మతపిశాచి విజృంభించింది, భయం కరమైన కోరలతో తెలంగాణపైకి దూకింది. మా గొంతులు కోసింది. దిక్కూమొక్కూ లేకపోయింది.
బ్రతుకు దుర్భరం అయిపోయింది. అయినా తెలుగుతనాన్ని విడిచిపెట్టలేదు. చిట్టచివరి రుద్ర గణాలు కూడా మెచ్చే విధంగా విజయం సాధించాము.
కాకతీయుల దివాణంలో కంచు గంట మోగితే శత్రురాజులు కంగారు పడేవారు. రుద్రమదేవి పరాక్రమిస్తే తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడేవి. కాపయ్య నాయకుడు బలం చూపిస్తే శత్రురాజుల గుండెలు ఆగి పోయేవి. పడమటి దిక్కున చాళుక్య రాజుల పరిపాలనలో జయజయ నాదాలు మ్రోగాయి.
ఆ రోజులలో కాని, ఈ రోజులలో కానీ శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. శ్రావణమాసంలో మేఘం లాగా, గంభీరంగా గర్జించింది. ఆ విధంగా నా వీర తెలంగాణ అభివృద్ధి మార్గంలో సాగుతోంది. ఎప్పటికీ సాగుతుంది.
ప్రశ్న 4.
‘తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ’ ఈ వాక్యాన్ని సమర్థిస్తూ 10 వాక్యాలు రాయండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతం చాలాకాలం సుల్తానుల పాలనలో ఉంది. తరువాత ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు, గోలకొండ కోటను ధ్వంసం చేసి, తాను ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
చివరి నైజాం నవాబు కాలంలో సుల్తాను రజాకార్లను పంపి, తెలంగాణ ప్రజలను దోచు కున్నాడు. ఆ నవాబు కాలంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. దానితో తెలంగాణ ప్రజలు నైజాం పాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున విముక్తి పోరాటం సాగించారు. తెలంగాణలోని గడ్డిపోచ కూడా కత్తిపట్టి, నిజాం పాలనను ఎదిరించింది. చివరకు మన ఉప ప్రధాని పటేలు పోలీసు యాక్షన్, నైజాం నవాబు, తోక ముడిచాడు. తెలంగాణ, భారత్ యూనియన్ 1948లో కలిసింది.
తరువాత హైదరాబాదులోని తెలుగు వారు, ఆంధ్రప్రాంతంలోని తెలుగువారితో కలసి “మహాంధ్ర” ఏర్పడాలని, “మహాంధ్ర” ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలించి, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
తరువాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడదీయాలని, మర్రి చెన్నారెడ్డిగారు 1969లో పెద్ద ఉద్యమాన్నే లేవదీశాడు. తరువాత కె.సి.ఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉద్యోగస్థులు, విద్యార్థులు, ప్రజలు ఉద్యమాలు చేశారు.
సకలజనుల సమ్మె సాగింది. చివరకు 2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పై చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ, పోరాటాల పురిటిగడ్డ అని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
‘వీర తెలంగాణ’ పాఠ్యభాగ రచయిత రచనాశైలిని సొంత వాక్యాల్లో అభినందిస్తూ రాయండి.
జవాబు:
ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి దాశరథి కృష్ణమా చార్యులు. ఆయన సాహితీ యోధుడు. అక్షరా యుధంతో పోరాడిన తెలంగాణ వీరుడు. ఈ పాఠాన్ని పరిశీలిద్దాం.
‘నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు’ అనే వాక్యం చూడగానే ప్రజా విప్లవం గుర్తుకు వస్తుంది. శత్రువులను ‘భూతప్రేతాల’తో పోల్చడం ఒక్క దాశరథికే చెల్లింది. శత్రువుపట్ల ఆయన తన క్రోథాన్ని ఆ మాటలలో ప్రదర్శించారు. ‘నవాబుతో సవాల్ చేయుమటంటి వీ’ అనే వాక్యంలో ‘సవాల్’ చేయడం వీరుల లక్షణం, ‘నీ యొడిలోన పద్యం చదువుతుంటే పౌరుషవంతుడైన తెలంగాణ వీరుడు ఎదురుగా కనిపిస్తాడు.
‘పెదవులొత్తిన’, ‘సయ్యాటలాడెన్,’ ‘బూజు పట్టగన్,’ ‘తెలుగు జెండాలు’ మొదలైన తేలిక పదాలను కొన్ని చోట్ల ప్రయోగిస్తాడు.
విప్లవ కవిత్వానికి తగినట్లుగా ‘శంఖ మహా రవమ్ము’, “నవోదయార్క రుక్ ప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీ తరంగముల్’, ‘సౌదామనీ వల్లీ ఫుల్ల విభావళుల్’, ‘స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యా భానువు’ వంటి పెద్ద పెద్ద సంస్కృత సమాసాలను కూడా అలవోకగా ప్రయోగించగల మహా పండితుడు దాశరథి.
‘వాజ్రేయ భుజాబలమ్ము,’ ‘వైప్లవ్య సంచలనమ్ము’ వంటి పదాలు పండితులను కూడా ఆలోచింపచేసే లాగ ప్రయోగించగల కల్పనా చతురుడు దాశరథి కృష్ణమాచార్య. అందుచేత ఆయన శైలి పండిత పామర జనరంజకంగా ఉంటుంది.
PAPER – II : PART – A
1. అపరిచిత పద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
“ధీరులకు (జేయు మేలది
సారంబగు నారికేళసలిలము భంగిన్
గౌరవమును మణి మీదట
భూరి సుఖావహమునగును భువిలో సుమతి !”
ప్రశ్నలు – సమాధానములు
1. ధీరులకు చేసే మేలు ఎలాంటిది ?
జవాబు:
ధీరులకు చేసే మేలు సారమైన నారికేళ సలిలము వంటిది.
2. నారికేళ సలిలము అనగా ఏమి ?
జవాబు:
‘నారికేళ సలిలము’ అనగా ‘కొబ్బరికాయలో నీరు’.
3. మర్యాద, సుఖాన్ని కలిగించేవి ఏవి ?
జవాబు:
మర్యాద, సుఖాన్ని కలిగించేవి ధీరులకు చేసే మేళ్ళు.
4. ఈ పద్యం ద్వారా మనం చేయగలిగిన మేలు ఏమిటి?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనం ధీరులకు అనగా పండితు లకు లేక ధైర్యవంతులకు మేలు చేయాలని తెలియాలి.
5. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.
ప్రశ్న 2.
కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు – సమాధానములు
1. అక్షరం ఎవరికి కావాలి ?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.
2. అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.
3. అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో’.
5. ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది ?
జవాబు:
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.
ప్రశ్న 3.
కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు – సమాధానములు
1. సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.
2. మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.
3. సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.
4. ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
5. ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.
ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధముఖర శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!
ప్రశ్నలు – సమాధానములు
1. ఎవరు చదివించారు ?
జవాబు:
గురువులు
2. ఈ పద్యం ఎవరు ఎవరితో చెపుతున్నారు ?
జవాబు:
కొడుకు తండ్రితో చెపుతున్నాడు.
3. శాస్త్రవేత్త ఎవరు ?
జవాబు:
కొడుకు
4. కొడుకు చదివిన రెండు శాస్త్రముల పేర్లు చెప్పండి.
జవాబు:
ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం.
5. ఎక్కువగా చదివితే ఏం తెలుస్తుంది ?
జవాబు:
చదువు యొక్క సారం.
ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు – సమాధానములు
1. ఉదధి రత్నములు చేత తృప్తి చెందని వారెవరు ?
జవాబు:
వేల్పులు ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.
2. నిపుణమతులు ఎటువంటివారు ?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.
3. వేల్పులు దేన్ని చూసి భయపడలేదు ?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల లక్షణం”.
5. ఉదధి అంటే ఏమిటి ?
జవాబు:
ఉదధి అంటే సముద్రం.
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)
ప్రశ్న 1.
తెలంగాణ వీరత్వం గురించి నీవు తెలుసుకొన్న విషయాలను, అనుభూతులను వివరిస్తూ నీ సోదరు నకు లేఖ వ్రాయండి.
జవాబు:
లేఖ
హైదరాబాద్,
X X X X X.
ప్రియమైన సోదరుడు రవికి,
మేము ఇటీవల ‘వీర తెలంగాణ’ పాఠం నేర్చుకొన్నాం. ఆ పాఠంలో తెలంగాణ వీరత్వం గురించి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఆ పాఠం చదువుతుంటే చాలా ఉత్తేజం కల్గింది.
తెలంగాణ సమర శంఖధ్వని భూమండల మంతా వ్యాపించిందట. తెలంగాణ తల్లి వీరమాత. ఆమె తన పిల్లలను యుద్ధవీరులుగా పెంచింది. తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి పట్టి ఎదిరిం చింది.
ఈ విధంగా తెలంగాణ వీరుల గురించి చదువుతుంటే, మా శరీరం పులకించింది. మన వారి త్యాగాల పట్ల గౌరవం పెరిగింది. వారి వీరత్వం గురించి తెలుసుకొంటుంటే గర్వంతో ఉప్పొంగి పోయా. వారు పడిన బాధలు వింటుంటే హృదయం ద్రవించిపోయింది.
నీవు కూడా తెలంగాణ వీరుల చరిత్రలు తెలిసే పుస్తకాలు చదివి వారి పోరాట విషయాలు తెలుసు కుంటావని ఆశిస్తున్నాను.
ఇట్లు,
నీ సోదరుడు,
XXX.
చిరునామా :
పి. ప్రకాష్,
ఇంటి నెం. 1-122,
రికాబ్ బజారు,
ఖమ్మం జిల్లా.
ప్రశ్న 2.
నేటి తెలంగాణను వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
అపురూప తెలంగాణ
కష్టాల కడలిని దాటిన వీరహనుమ మా తెలంగాణ
ఉప్పొంగిన ఆవేశంతో ఏర్పడిన బంగరు కొండ మా తెలంగాణ
పెరుగుతున్న పసిపాప మా పసిమి తెలంగాణ
పచ్చ పచ్చని పైరు సీమల కనక సీమ మా తెలంగాణ
కల్లలెరుగని తేట తెలుగు చిరునామా మా తెలంగాణ
దానం, ధర్మం, నీతి, న్యాయం కలబోత మా తెలంగాణ
విశ్వ విఖ్యాతమైన విజ్ఞాన మేరువు మా తెలంగాణ
మా తెలంగాణ కోటి రత్నాల వీణ
ప్రశ్న 3.
తెలంగాణ వీరుల సంస్మరణ సభకు ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
తెలంగాణ వీరుల సంస్మరణ సభకు ఆహ్వానం
మన స్వేచ్ఛ కోసం తమ స్వేచ్ఛను కోల్పోయిన ఎందరో తెలంగాణ వీరులకు అంజలి ఘటిద్దాం.
భావితరాల సౌభాగ్యం కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా పరిత్యజించిన మన తెలంగాణ వీరులను సంస్మరిద్దాం.
మృత్యువుకే చెమటలు పట్టించిన మన వీరాధివీరుల పోరాట పటిమను గుర్తు చేసుకొందాం.
రండి, తరలిరండి, సంస్మరణ సభకు. వచ్చే ఆదివారం ఉదయం 9 గం॥లకు హైదరాబాద్ లాల్బహదూర్ స్టేడియంలో.
అందరూ ఆహ్వానితులే.
ఇట్లు,
ఆహ్వాన సంఘం,
తెలంగాణ వీరుల సంస్మరణ కమిటీ.
ప్రశ్న 4.
దాశరథి కృష్ణమాచార్యులు గారి రచనాశైలిని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
దాశరథి
దాశరథి కృష్ణమాచార్యులు జగమెరిగిన రచయిత. ఉద్యమం ఆయన ఊపిరి. జైళ్ళు ఆయన కవితా కన్యక లోగిళ్ళు.
అనేక సాహితీ ప్రక్రియలకు ఆయన కలం ఆలవాలం. ప్రజా హృదయాలలో దాశరథి స్థానం సుస్థిరం.
‘రుద్రవీణ’ నుండి గ్రహింపబడిన ‘వీర తెలంగాణ’ పాఠం ఆధారంగా దాశరథి రచనాశైలిని పరిశీలిద్దాం.
‘ఓ ! తెలంగాణ ……… అనే పద్యంలో ఉపయోగించిన పదాలతో యుద్ధశంఖం పూరించారు.
“నీ యొడిలోన ………… ” అనే పద్యంలో తెలంగాణ మాతను వీరమాతగా వర్ణించారు. తన కుమారులను సవాల్ చేయమన్న తీరు అత్య ద్భుతంగా వర్ణించారు.
‘తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అనే మా ‘నానుడి’గా స్థిరబడిందంటే దాశరథిగారి గొప్పతనం తెలుస్తుంది. దాశరథి ఉపయోగించిన ‘పదబంధాలు’ చాలా ఉత్తేజవంత మైనవి.
దాశరథి యొక్క ఇతర రచనలు కూడా చదవాలి. ఆయన గురించి పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డకూ ఉంది.
ప్రశ్న 5.
తెలంగాణ అభివృద్ధిని కోరే ఇద్దరు వ్యక్తుల సంభాషణ రాయండి.
జవాబు:
శ్రీరామ్ : ఇన్నాళ్ళకు మనకు స్వేచ్ఛ కలిగింది. లక్ష్మణ్ : పూర్తి స్వేచ్ఛ కలిగిందా ?
శ్రీరామ్ : ఇంకా అనుమానం ఎందుకు ?
లక్ష్మణ్ : ఆకలి, అవిద్య, దరిద్రం మన తెలంగాణ నుండి పోయినపుడే మనకు పూర్తి స్వేచ్ఛ కలిగినట్లు.
శ్రీరామ్ : అయితే మనం ఏం చేయాలి.
లక్ష్మణ్ : మనమందరం కష్టపడి పనిచేయాలి రంగాలలోనూ అభివృద్ధిని సాధించాలి. అదే మన స్వేచ్ఛకు పరమావధి.
శ్రీరామ్ : నిజమే ! ప్రతి ఒక్కరం కష్టపడితేనే మన తెలంగాణ మాతకు సంతోషం. మన పెద్దలకు ఆనందం. అప్పుడే బంగారు తెలంగాణను సాధించగలం. పద ఇంక పాఠశాలకు వెళ్ళిపోదాం.
ప్రశ్న 6.
ఖమ్మంలో తెలంగాణ వీరుల సంస్మరణ సభ జరిగింది. దాని గురించి ఒక నివేదికను తయారు చేయండి.
జవాబు:
నివేదిక
తెలంగాణ రాష్ట్రంలోని మహానగరాలలో ఒకటైన ఖమ్మం పట్టణంలో తే.ది. 23-8-15న మధ్యాహ్నం 2 గం||లకు తెలంగాణ వీరుల సంస్మరణ సభ జరిగింది.
జ్యోతి ప్రజ్వలనంతో సభ ప్రారంభమైంది. వక్తలందరూ తెలంగాణ వీరుల పొరాటాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. వారు అనుభవించిన బాధలను వివరించారు. సభలో పాల్గొన్నవారంతా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాల వారిని సత్కరించి, సభ తన భక్తి ప్రపత్తులను చాటుకొంది.
పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. చక్కని పాటతో సభ ముగిసింది.
ప్రశ్న 7.
తెలంగాణ ‘అమరవీరుని’ ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజించిన ‘అమరవీరుని’కి భక్తి ప్రపత్తులతో సమర్పించు, అభినందన పత్రం. తెలంగాణ తల్లి బానిస సంకెళ్ళను త్రెంచిన వీరుడా !
నవ సూర్యోదయానికి రక్తతర్పణం చేసిన యోధుడా!
భావి తరాలకు ఆనందాన్ని ప్రసాదించిన వీరాధి వీరుడా !
ఎందరో వీరులకు మార్గదర్శివైన శూరాధి శూరుడా !
నీకిదే మా నివాళి, నీ ఆశయాలే మా ఊపిరి.
నీ త్యాగాలను అభినందించడం మా ధర్మం.
నీ భావాలను ఆచరించడం మా కర్తవ్యం.
ఓ వీరుడా ! వందనాలు ! శతకోటి వందనాలు !
ప్రశ్న 8.
‘తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వీరులను స్మరిస్తూ’ ఏకపాత్రాభినయానికి మాటలు రాయండి.
జవాబు:
ఓ అమరవీరులారా ! త్యాగధనులారా ! మాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మా చిరకాల కోరిక తీర్చారు. మీరు ఊదిన శంఖధ్వని ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించింది. మీ గొప్పతనం చిరకాలం నిలుస్తుంది. ఇప్పుడు తెలంగాణాకు మంచి రోజులు వచ్చాయి. అడ్డంకులు తొలిగాయి. స్వచ్ఛమైన కాంతి, సంధ్యా సూర్యుడు ఉదయించాడు.
మా చిరకాల వాంఛ తీరింది. మా ప్రాంతంలో జీవనరేఖలు వెలుగొందాయి. తెలంగాణా భూమికి తిరుగులేదు, ఎదురులేదు. స్వావలంబన దిశగా ముందుకు సాగే రోజులు వచ్చాయి. మేమంతా మీ త్యాగాలను మరువం. మా గుండెల్లో మిమ్ములను స్మరిస్తాం. ముందుకు వెళ్తాం.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
- గండికొట్టు: కొందరు స్వార్థపరులు చెరువు గండి కొట్టుదురు.
- మతపిశాచి: దేశంలో మతపిశాచిని అంత మొందించాలి.
2. పర్యాయపదాలు
హస్త = కయిసాటిచుక్క, అర్క, సవిత, సావిత్రము
సూర్యుడు = ఆదిత్యుడు, భాస్కరుడు, ప్రభాకరుడు
సముద్రము = అబ్ధి, అకూపారము, పారావారము, సంద్రం
ఆశ = ఇచ్ఛ, ఈప్స, కాంక్ష
కృపాణము = ఖడ్గము, కత్తి
జలధి = వార్ధి, సముద్రం
యుద్ధము = రణము, భండనము
అర్కుడు = సూర్యుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు
తరంగము = అల, ఊర్మి, లహరి, భంగము
హస్తము = చేయి, కరము, చెయ్యి, కేలు
వసుధ = ధర, ధరణి, భూమి, పుడమి
గంట = ఘంటా, ఘంటిక
జెండా = పతాకము, కేతనము, టెక్కెము, పతాక
శత్రువు = అరి, వైరి, విరోధి, పగవాడు
రవము = ధ్వని, శబ్దము, రొద, చప్పుడు
3. నానార్థాలు
రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు
కోటి = అంచు, వింటికొన, నూఱులక్షలు,
బలము = వాసన, రసము, రూపము, సేన
శంఖము = సంకు, నొసటిఎముక, ఒక పాము, ఒక ముద్ర
దిక్కు = దిశ, శరణము, మార్గము
తరంగము = అల, దుముకు, వస్త్రము, గ్రంథభాగము
హస్తము = చేయి, తొండము, గుంపు, సాయము
దివి = ఆకాశము, స్వర్గము, పాలపిట్ట
ధర = నేల, వెల, మెదడు, సంహారము
అంబిక = తల్లి, పార్వతి, మేనత్త, కాశిరాజు కూతురు
ఆశ = దిక్కు, కోరిక
4. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
దిశ – దెస
భుజము – బుజము
శంఖము – సంకం
రాజు – తేడు
కోర – ఖరు
5. వ్యుత్పత్త్యర్థాలు
సౌదామిని = దండవలె దీర్ఘాకారము కలది. సుధామను పర్వతములో కూడా ఒక దిక్కున నుండునది (మెరుపు)
దంష్ట్రిక = కోఱలు ఆయుధంగా కలది (పాము, అడవి పంది)
భానుడు = ప్రకాశించువాడు (సూర్యుడు)
వసుధ = బంగారము గర్భమందు గలది (భూమి)
ధర = సమస్తమును ధరించునది (భూమి)
PAPER – II : PART- B
1. సంధులు
1. ఉకార సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు.
ఉదా :
భూతలమెల్లన్ – భూతలము + ఎల్లన్
పెదవులొత్తిన – పెదవులు + వత్తిన
యుద్ధమాడి – యుద్ధము + ఆడి
జగమెల్ల – జగమ + ఎల్ల
2. అకార సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
ఒక్కొక్క – ఒక్క + ఒక్క
3. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము లు ఏకాదేశమగును.
ఉదా :
ప్రయోజనాత్మకం – ప్రయోజన + ఆత్మకం
నవోదయార్క – నవోదయ + అర్క
ఇపుడడ్డుల్ – ఇపుడు + అడ్డుల్
తరోజ్జ్వల – తరు + ఉజ్జ్వల
దిశాంచలము – దిశ + అంచలము
ఆంధ్రాంబికా – ఆంధ్ర + అంబికా
శ్రావణాభ్రము – శ్రావణ + అభ్రము
4. యడాగమ సంధి
సూత్రం : సంధి లేని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీయొడి – నీ + ఒడి
5. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గసడదవలు, బహుళంబుగానగు.
ఉదా :
సాచు నాల్కలు – నాల్కలు + చాచు
కుతుకల్ గోసెడి – కుతుకల్ + కోసెడి
ఏపు సూపి – ఏపు + చూపి
అడ్డుల్ వోయె – అడ్డుల్ + పోయె
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
మహారవము – మహాయైన (గొప్పదైన) రవము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నదీతరంగములు – నది యొక్క తరంగములు – షష్ఠీ తత్పురుష సమాసం
సౌదామనీవల్లి – సౌదామనీ యొక్క వల్లి – షష్ఠీ తత్పురుష సమాసం
గడ్డిపోచ – గడ్డి యొక్క పోచ – షష్ఠీ తత్పురుష సమాసం
జలధినాల్కలు – జలధి యొక్క నాల్కలు – షష్ఠీ తత్పురుష సమాసం
భూతప్రేతములు – భూతమును, ప్రేతమును – ద్వంద్వ సమాసం
కోటి తెలుంగు – కుర్రలుకోటి సంఖ్యగల తెలుంగు కుర్రలు – ద్విగు సమాసం
నాలుగువైపులు – నాలుగు సంఖ్య గల వైపులు – ద్విగు సమాసం
మతపైశాచి – మతము అనెడి పైశాచి – రూపకం
ఆంధ్రాంబిక – ఆంధ్రము అను పేరుగల అంబిక – సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం
నలుదిక్కులు – నాలుగైన దిక్కులు – ద్విగు సమాసం
స్వతంత్ర వారిధార – స్వతంత్రము అనే వారిధార – రూపక సమాసం
కాంతి వార్డులు – కాంతులు అనే వార్ధులు – రూపక సమాసం
కంచుఘంట – కంచుతోడి ఘంట – తృతీయాతత్పురుష సమాసం
బ్రతుకు త్రోవ – బ్రతుకు కొఱకు త్రోవ – చతుర్థీ తత్పురుష సమాసం
దేవనది – దేవతల యొక్క నది – షష్ఠీ తత్పురుష సమాసం
భుజాబలమ్ము – భుజము యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసం
దిశాంచలములు – దిక్కుల యొక్క అంచలములు – షష్ఠీ తత్పురుష సమాసం
శక్రధనువు – శక్రుని యొక్క ధనువు – షష్ఠీ తత్పురుష సమాసం
ధనుఃపరంపర – ధనువుల యొక్క పరంపర – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రతిభా విశేషములు – ప్రతిభ యొక్క విశేషములు – షష్ఠీ తత్పురుష సమాసం
ధరాతలము – ధర యొక్క తలము – షష్ఠీ తత్పురుష సమాసం
తెలుగుజెండాలు – తెలుగుల యొక్క జెండాలు – షష్ఠీ తత్పురుష సమాసం
సంధ్యాభానువు – సంధ్య అందలి భానువు – సప్తమీ తత్పురుష సమాసం
శ్రావణాభ్రము – శ్రావణ మందలి అభ్రము – సప్తమీ తత్పురుష సమాసం
కరకు రాజులు – కఱకు వారైన రాజులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కల్యాణ ఘంటలు – కల్యాణ ప్రదమైన ఘంటలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. ఆధునిక వచనాలు
ఈ క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
తగు రక్ష సేయని ధర్మమేల ?
జవాబు:
తగిన విధంగా రక్షణ కల్పించని ధర్మం ఎందుకు ?
ప్రశ్న 2.
బీదలకన్న వస్త్రములు పేర్ని నొసంగుము.
జవాబు:
పేదవారికి అన్ని వస్త్రాలను ప్రేమతో ఇవ్వు.
ప్రశ్న 3.
యాజనుని కొగిన్ గుణగ్రహణ శక్తి నశించును.
జవాబు:
క్రమంగా ఆజనునికి గుణ గణాలను గ్రహించేశక్తి నశిస్తుంది.
ప్రశ్న 4.
మర్యాద వర్థిల్లన్ కాంతుల జూడకున్ హితమా ?
జవాబు:
మర్యాద పెరిగేటట్లు స్త్రీలను చూడకపోతే మేలు కలుగుతుందా ?
ప్రశ్న 5.
స్వామి ! నీ భక్తి కలుగని జన్మమేల ?
జవాబు:
స్వామి ! నీ పై భక్తిలేని జన్మ ఎందుకు ?
4. గణ విభజన
క్రింది పదాలకు గణాలను గుర్తించండి.
- నాలుగు – U l l – భగణం
- చలముల్ – l l U – సగణం
- ఉజ్జ్వల – U l l – భగణం
- సయ్యాలు – U U l – తగణం
5. ప్రత్యక్ష – పరోక్ష కథనాలు
అభ్యాసం కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.
ప్రశ్న 1.
నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)
జవాబు:
“నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను. (ప్రత్యక్ష కథనం)
ప్రశ్న 2.
నీకివ్వాల్సింది ఏమీలేదు అని నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)
జవాబు:
“నాకివ్వాల్సింది ఏమీలేదు” అని నాతో అతడన్నాడు. (ప్రత్యక్ష కథనం)
ప్రశ్న 3.
సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (పరోక్ష కథనం)
జవాబు:
“సుందరకాండ చదువు” అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)
ప్రశ్న 4.
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని. (పరోక్ష కథనం)
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” అని. (ప్రత్యక్ష కథనం)
ప్రశ్న 5.
చెన్నయ్య పద్యాలు బాగా పాడాడని అందరను కుంటున్నారు. (పరోక్ష కథనం)
జవాబు:
అందరనుకుంటున్నారు “చెన్నయ్య పద్యాలు బాగా పాడాడు” అని. (ప్రత్యక్ష కథనం)
6. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
దయచేసి నన్ను కాపాడు.
జవాబు:
ప్రార్థన్యార్థక వాక్యం
ప్రశ్న 2.
మీరు రావద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
ప్రశ్న 3.
వారందరికి ఏమైంది ?
జవాబు:
ప్రశ్నార్ధక వాక్యం
ప్రశ్న 4.
నేను తప్పక వస్తాను.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం
ప్రశ్న 5.
ఆహా ! ఎంత బాగుందీ!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
ప్రశ్న 6.
వారు వెళ్ళవచ్చా ?
జవాబు:
సందేహార్థక వాక్యం
ప్రశ్న 7.
సీత కలెక్టరైందా ?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
ప్రశ్న 8.
మీరు తర్వాత తినవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం
ప్రశ్న 9.
అక్క చెప్పేది విను.
జవాబు:
ప్రార్థన్యార్థక వాక్యం
ప్రశ్న 10.
రసాభాస చేయకండి.
జవాబు:
నిషేధార్థక వాక్యం