Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కవితలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar కవితలు
ప్రశ్న 1.
బలిచక్రవర్తికి వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
దాతల్లో గొప్పదాత బలి.
సత్యం తప్పనివాడు. కీర్తి కోరేవాడు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు కూడా ధారపోస్తాడు.
కవిత
దాతల్లో గొప్పవాడా ……
మాటను తప్పనివాడా …..
సాయం అనే చేతులకు దారిని చూపేవాడా
ప్రాణం పోతున్న మాటని వీడని వాడా ….
అసురుల చక్రవర్తిగా మెప్పును పొందిన వాడా …..
చివరికి విష్ణు పాదభారాన్ని మోసిన దానస్వరూపుడా….
ప్రాణాన్ని విడిచి చరిత్రలో నిలిచిన దానశీలుడా ….
ప్రశ్న 2.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయలేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి. (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
పొందుతారు జనులందరి ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యావిహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాలు
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది – పునరావృతమయ్యే నిత్యాగ్ని గుండాలు
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.
పనిచేసేవారు:
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం
ప్రశ్న 3.
‘మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాలను’ వర్ణిస్తూ కవిత రాయండి. (June 2017)
జవాబు:
నగర జీవితం నగరవాసులకొక వరం !
సకల సదుపాయాల సమాహారం
వినోదాల విన్యాసాల కళాతోరణం
విశిష్ట వినూత్న భవన నిర్మాణ సమాహారం
విశాల రహదారుల కళాతోరణం
విద్యా వైజ్ఞాన కేంద్రాల నిలయస్థానం
సాహిత్య సమావేశాల మణిహారం
మాన్యనాయకగణా నివాస మందిరం
నివసించాలి ప్రజలందరిక్కడ
సిరిసంపదలతో తులతూగాలిక్కడ
పర్యావరణాన్ని రక్షించి కాపాడాలిక్కడ
అప్పుడే అవుతుంది సుఖమయం నగర జీవనం.
ప్రశ్న 4.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి. (June 2016)
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !
శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు
ప్రకృతిరమణీయతకు తిరుగులేదు.
చూచినంతనే చూడాలనిపించు
వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె
సకల వసతులకు మూలకేంద్రమాయె.
ప్రశ్న 5.
వెన్నెలను వర్ణిస్తూ చిన్నపదాలతో ఒక కవిత రాయండి.
జవాబు:
“వెన్నెలా ! కన్నెపిల్లల చిన్నారి ముద్దుల చెల్లెలా !
వెన్నెలా ! ప్రేమికుల మనసుల మల్లెచెండులా
వెన్నెలా ! చంద్రుని చిరునవ్వుల పన్నీరులా
వెన్నెలా ! పసిపాపల ముద్దుల బోసి నవ్వులా
వెన్నెలా ! కన్నతల్లులు కమనీయ రాగవెల్లిలా
వెన్నెలా ! మా చిన్నారి పొన్నారి చూపులా
వెన్నెలా ! కలువల చుట్టపు చూపులా
వెన్నెలా ఉన్నావు, చల్లావు చంద్రికలు
నయనారవిందాల నయగార మధురిమలు”
ప్రశ్న 6.
బలిచక్రవర్తికి, వామనుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఓ కవితను రాయండి. (June 2018)
జవాబు:
ఏమి ఇది ఏమి ఇది మహాతేజం
అపురూపం – హరి రూపం,
అపురూపం – శ్రీహరి రూపం
వడివడిగా వచ్చెను ఒక వడుగు
పాపాలను పరిమార్చె పిడుగు
తడబాటు ఎరుగదు అతని అడుగు
ధన్యుల తలపై ముడవని గొడుగు.
అహో ఏమి రూపం, అఖిల లోకాలకు దీపం. – సేకరణ
ప్రశ్న 7.
చదువుకునేవారైనా, పనిచేసేవారైనా, మరెవరైనా సరే తీవ్ర ఒత్తిడికి లోనైతే వారి వారి పనులను సరిగా చేయ లేక తీవ్ర ఇబ్బందుల పాలౌతారు. ఈ విషయం చెప్పడానికి “సుఖం – దుఃఖం – విజయం – లోకం – మోదం – ఘోరం” లాంటి అంత్యానుప్రాస పదాలు వాడి ఒక కవిత చెప్పండి. (March 2018)
జవాబు:
చదువుకునేవారు :
విద్యార్జనమిస్తుంది సుఖం
సోమరితనమిస్తుంది దుఃఖం
విద్యావంతులు సాధిస్తారు విజయం
అపుడందరూ తెల్పుతారు ఆమోదం
విద్యాధికులతో భరతకు ప్రమోదం
విద్యా విహీనుల కెపుడు భేదం
ధనలేమితో ఒత్తిళ్ళ సుడిగుండాల
దినభృతి లేక నిత్యమూ ప్రాణగండాలు
అంతం కాదిది-పునరావృతమయ్యే నిత్యాగ్నిగుండాలు.
అందుకే ప్రతి జీవికి కావాలి సహనాభరణం.
పనిచేసేవారు :
కష్టార్జితం కల్గిస్తుందెపుడు సుఖం
పరభాగ్యోప జీవితం సదా దుఃఖం
శ్రమను నమ్ముకొన్నవాడికి విజయం
శ్రమను దోచు కొన్నవాడికి అపజయం
గతిలేని బడుగుల బ్రతుకులు ఘోరం
ఆకటికై తపించు శ్రామికుల లోకం
శ్రమశక్తిని ధరించు కార్మికుల ప్రపంచం
వ్యవసాయాన్ని వహించు కర్షకులలోకం
సంతృప్తే వారికి ప్రమోదం
సహజీవనమే వారి కామోదం
ప్రశ్న 8.
మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాల్ని వర్ణిస్తూ ఒక కవితను వ్రాయండి. (June 2017)
జవాబు:
అందమైన నగరం – మన ‘భాగ్యనగరం’
అద్భుతమైన నగరం – అందాలకు నిలయం
భిన్న సంస్కృతులకాలయం – ఉన్నతమైన మేడలకావాసం
జంట నగరాలకనుసంధానం – విశాల ‘హుస్సేన్ సాగరం’
వింతవింతల మహాలయం – వినూత్న సాలార్జంగ్ మ్యూజియం
హైటెక్ సిటీల నిర్మాణం – హిందూ ముస్లిం సమైక్యతకు నిదర్శనం
చూడాలి నిలువెత్తు బుద్ధ విగ్రహం – చూసి తరించాలి బిర్లామందిరం
ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు – అన్నువైన ఉద్యానవనాలు
ఘనతకెక్కిన అసెంబ్లీ భవనం – వన్నె కెక్కిన రాజభవనాలు
ఇంకా ఎన్నెన్నో చారిత్రక విశేషాలు – త్యాగజీవులైన వారి అవశేషాలు
ఇది అందాల సుందరనగరం – భాగమతికై ఏర్పడిన భాగ్యనగరం
ప్రశ్న 9.
గోల్కొండ పట్టణంలోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో వ్రాయండి. (June 2016)
జవాబు:
గోల్కొండ నిర్మాణం – కోర్కెలకు నిలయం
గోల్కొండ వైభవం – నిజాం కీర్తికి నిదర్శనం
విశాల నగరవీధులు – వేర్వేరుగ మొహల్లాలు
సరదార్ల మేడలు – సరదాలకు నిలయాలు
నగీనాబాగ్ తోట – అందాలకు రాశులచట
రాజ హార్మ్యం సొగసుచూడ – షాహిమహలు తెరచి చూడు
దిల్ కుషా భవనం – సౌందర్య నిలయం
గోల్కొండ సొగసుపెంచే – ఉద్యానములచట మించె
`మిద్దెమీది తోటలు – శిల్పుల నేర్పుకు గీటురాళ్ళు
బాల్బోవా వృక్షం – నేత్రపర్వ దృశ్యం
అందాల గోల్కొండ – చేయును కనులవిందు.
ప్రశ్న 10.
‘అమ్మ’ను గూర్చి వివరిస్తూ అంత్యప్రాసలతో ఒక కవిత వ్రాయండి.
జవాబు:
జన్మనిచ్చిన కన్నతల్లి – వరముల నొసగె పాలవెల్లి
కరుణలు వెదజల్లు కల్పవల్లి – కనికరించి కాచు బంగారు తల్లి
తొలి నడకలు నేర్పిన నవమల్లి – చేయూతగ నిల్చిన సిరిమల్లి.
కమ్మనైన పిలుపుకు అమ్మ – తీయనైన పలుకుకు అమ్మ
తనివితీర లాలించేది అమ్మ – పరవశించి పాలించేది అమ్మ
పేగుబంధం తెలిపేది అమ్మ – ప్రేమబంధంతో ముడిచేది అమ్మ
అమ్మ పలుకు అమృతం – అమ్మ దీవెన సుకృతం
మమకారానికి మారుపేరు అమ్మ
మమతాశలను పంచేది అమ్మ.
కంటికి రెప్పయై కాచేది అమ్మ
కడుపును కాంచుచు ప్రోచేది అమ్మ
ప్రగతికి మూలం అమ్మ
జగతికి దైవం అమ్మ
ప్రశ్న 11.
పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత వ్రాయండి.
జవాబు:
పల్లెసీమల అందాలు
ప్రకృతి విడిన చందాలు
భరతమాతకివి మూలధనాలు
జానపదుల గీతాలు – జాగృతులొసగే ప్రభాతాలు
పల్లీయుల జీవితాలు పరిమళించే కంజాతాలు
భాసిలు ముగ్గుల వాకిల్ళు – పసిడిపంటల లోగిళ్ళు
పిల్ల కాలువల తియ్యని నీళ్ళు – తివాసీలు పరచిన పచ్చికబీళ్ళు
కోడెల గెంతుల సందళ్ళు – పామరుల యింట శోభిల్లు
కోకిలల కిలకిలారవాలు – గువ్వ పిట్టల కువకువలు
క్రేల కృతుల విన్యాసాలు – మనోహర సౌందర్య దృశ్యాలు
సొంపైన రొదరొదలతో – కమ్మటి సువాసనలతో
తియ్యటి తీపుల దినాలు – అవ్యాజ ప్రేమలిడే జనాలు
ప్రశ్న 12.
జీవనభాష్యం గజల్స్ ని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను వ్రాయండి.
జవాబు:
శాంతి సమీరం వీచితే
కోపాగ్నిభం నీరవుతుంది .
పదిమంది పెద్దలు నడిస్తే
లోకానికది దారవుతుంది
నేలను దున్ని విత్తితే
తప్పక ఆశల పైరవుతుంది.
కులమత గోడలు కూల్చితే
ఆ సమాజమే నీ ఊరవుతుంది
వాగులు వంకలు కలిస్తే
ఎడతెగని పారే ఏరవుతుంది.
సత్యం ధర్మం న్యాయం నీదయితే
జగతిలో చెరగని నీ పేరవుతుంది.
ఆపన్నుల ప్రేమను కాచితే
ఆనందం నీ సహవాసమవుతుంది.
ప్రశ్న 13.
‘భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష’ వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించి, ప్రశంసిస్తూ ఒక కవితను వ్రాయండి.
జవాబు:
మహాత్మా ! నీవు పురుషోత్తముడవు !
బానిసత్వంలో మగ్గిన భరతను సమీక్ష చేశావు
దక్షత కల్గిన నీ మనోధైర్యంతో ముందుకు నడిచావు
ఆంగ్లేయులు పెట్టిన పరీక్షలో నెగ్గావు
స్వాతంత్ర్య సమరంలో వివక్ష చూపక జగతిని ఒకే తాటిపై నడిపావు
సత్యాహింసల ధర్మాలే నీకురక్ష అయ్యాయి.
స్వాతంత్ర్య ఫలాల్ని మాకు భిక్షగా ఒసగినావు.
అందుకే నీవు జాతిపితవు. మా గాంధీ తాతవు.
ప్రశ్న 14.
నగరజీవనంలోని అనుకూల అంశంపై కవిత రాయండి.
జవాబు:
నవ్య నాగరికతకు నిలయం – నగర జీవనం
భవ్య భవితకు ఆదర్శం – నగర జీవితం
ఉపాధి అవకాశాలకు నిలయం
ఉన్నత స్థితికెపుడు ఆలవాలం
దీనభత్యం ఎంతైనా లభించు నచట
కూలివానికెపుడు పర్వమే అచట
దినదినాభివృద్ధి చెందురచట
కోర్కె లీడేరు సర్వము నచట
దొరకని వస్తువు లేవీ ఉండవచట
తెలియని విద్యలేవీ ఉండవచట
సదుపాయాలు ఎన్నెన్నో కలవచట
సకల నిధులు సమకూరునచట
నిజం నిజం నగర జీవనం
సౌఖ్యాలకు మూలం నగర జీవితం
ప్రశ్న 15.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది’ – ఈ అంశాన్ని గూర్చి ఒక కవిత వ్రాయండి.
జవాబు:
నవ తెలంగాణ సాధనకై నడుం బిగించి
శ్రీకారం చుట్టి;
నడిపించిరి ఉద్యమాల పోరు బాటలో
ఆవిష్కారం కావించి,
నరసింగములై దుర్మార్గుల్ని చీల్చి చెండాడి
ఘీంకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల సైతం
అహంకారాల్ని త్రుంచి,
నవకోవిదులు శక్తియుక్తులతో నైజాం రాజుల
అహంకారాన్ని త్రుంచి,
నమ్మిన సిద్ధాంతాలలో నయవంచకుల్ని
మట్టుబెట్టి సాకారం చేసి,
ననలెత్తిన మతోన్మాదుల చీత్కారాల్ని
నశింపచేసి,
నలువంకలు విప్లవాత్మకమైన కదలికలతో
పరిష్కారం చూపించి,
కోటి రతనాల వీణల సుస్వర గీతాలకు
ఓంకారం పలికారు
పూత్కారం గొన్న నవ తెలంగాణకు
తెలంగాణ భాషానుడికారాలతో
స్వాగత చందనాలర్పించారు.
మమకారాలతో సత్కారం కావించి
నవ్యాకారం చేశారు.
నవ తెలంగాణకు శ్రీకారం నడిపించిన ఉద్యమాలకు సాకారం
ప్రశ్న 16.
‘ఓ విద్యార్థి’ శీర్షికన జాగృతం చేస్తూ అంత్య ప్రాసలతో కవిత వ్రాయండి.
జవాబు:
ఓ విద్యార్థీ !
పొందాలి జ్ఞాన కిరణాలు
కావాలి సహనాభరణాలు
వెతకాలి నీవు కారణాలు
చేయకూడదు సదారణాలు
మహనీయుల సంస్మరణాలు
భావిపౌరులకవి తోరణాలు
కోరాలి వాగ్దేవి శరణాలు
స్మరించాలి సదా ఆ తల్లి చరణాలు
ప్రశ్న 17.
అడుగు, కడుగు, గొడుగు, బుడుగు పదాలను అంత్యప్రాసగా ఉపయోగించి వామనావతారంపై కవితను రాయండి.
జవాబు:
వామనుడైన బుడుగు
చేతబట్టెను గొడుగు
బలిని తొక్కిన అడుగు
రాక్షసత్వాన్ని కడుగు – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 18.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అంటూ మాట్లాడాల్సిన విధానాన్ని వచన కవితలో రాయండి.
జవాబు:
ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే మనం గడిపే
ప్రతిరోజూ ఇంకొంచెం అందంగా ఉంటుంది.
నీ పరిస్థితిని ఎప్పుడూ, ఎవ్వరూ ఆలోచించరు,
నీ పలకరింపును మాత్రమే గుర్తు పెట్టుకుంటారు.
అది మనిషి సహజ స్వభావం
కాకి – కోకిల రెండూ అరుస్తాయి.
కానీ కాకిది గోలంటారు, కోకిలది పాటంటారు.
ఆలోచించు ఎందుకో !
బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. – సేకరణ
ప్రశ్న 19.
చదువు చెప్పే గురువును చదువుకొనే రోజుల్లో ఒకలా, చదువు పూర్తయిన తర్వాత మరోలా భావిస్తాం. ఆ భావాలకు అక్షర రూపం ఇస్తూ ఒక వచనకవిత రాయండి.
జవాబు:
అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని
కోపగించుకున్నప్పుడు తెలియలేదు
నాపై బాధ్యతను పెంచుకుంటున్నారని
చేతిమీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతులకి పదును పెడుతున్నారని
ప్రశ్నలడిగినపుడు తెలియలేదు
నా ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని
మార్కులిస్తున్నప్పుడు తెలియలేదు
నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని
కానీ ……….
ఈ క్షణం తెలిసింది.
నాలో ఒక విశాల ప్రపంచాన్నే సృష్టించారని,
నన్ను ఒక మహాశక్తిగా మలిచారని …………
కాలం వెనక్కి వెళితే, మళ్ళీ
మీ చేతి దెబ్బలు తింటూ మీ అనురాగానికి
పాత్రులం కావాలనుందీ. – సేకరణ
ప్రశ్న 20.
ఓటమిని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి.
ముందున్న కాలికి గర్వం లేదు.
వెనుకున్న కాలికి అవమానం లేదు.
ఎందుకంటే
ఆ రెండింటికి తెలుసు,
వాటి స్థానం మారటానికి ఒక్క క్షణం చాలు అని. – సేకరణ
ప్రశ్న 21.
కలాన్ని ఆయుధంగా చేసుకొని సమాజం బాగుకోసం కవిత్వాన్ని రాసిన కవులను స్మరిస్తూ ఒక వచన కవిత రాయండి.
జవాబు:
బుద్ధి బలాన్ని సిరాగా మార్చి కలం పట్టిన
కవులకు మనమేమివ్వగలం ?
విలువలకు ఛందస్సులు తొడిగిన ఘనులే !
సాహిత్యపు మాగాణంలో పండిన మణులే !
ఆలోచనలే అక్షర రూపం దాల్చగా
పథం చూపే కథనాలను అందించిన
కవులకు మనమేమివ్వగలం ?
జయంతికో, వర్థంతికో ఓ వందనం తప్ప. – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 22.
ప్రకృతిలో మమేకం అయినపుడు కలిగే భావాలను వచన కవితగా రాయండి.
జవాబు:
గురువులు శిష్యులకు కల్పతరువులు
పెద్దల మాటలు అనుభవాల పాఠాలు
ఆనందానుభూతుల చిరుజల్లులు
ఆ సంజ వెలుగులు బంగరు నెలవులు
ఆ పిల్లల నవ్వులు అరవిరిసిన పువ్వులు
అరుణ కిరణాలు ఆనంద తరంగాలు
తరువులు పచ్చదనానికి గురువులు
చెట్లు చేమలు నేలతల్లి సంతకాలు
ప్రకృతి చేవ్రాలు పక్షుల కిలకిలరావాలు
ప్రకృతి కాంత ఆశలు వసంత విలాసాలు – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 23.
“పల్లెలు ప్రకృతికాంతకు పుట్టిళ్ళు” అంటూ పల్లెను గూర్చి కవిత రాయండి.
జవాబు:
విత్తనాలు ఊపిరి పోసుకుంటాయ్ పొలాల్లో
మొక్కలు పిలుస్తుంటాయ్ ప్రేమగా పల్లెల్లో
పద్మాలు కళ్ళు విప్పి చూస్తుంటాయ్ చెఱువు నీళ్ళల్లో
గంటలు మ్రోగుతుంటాయ్ వేదంలా గుళ్ళల్లో !
పల్లె హాయిగా ఉంటుంది ప్రశాంత నిలయంలా
పల్లె అన్నం పెడుతుంది అన్నపూర్ణ దరహాసంలా
పల్లె స్నేహంగా పిలుస్తుంది శాంతి నినాదంలా
పల్లెలో ఆత్మీయతలు పెనవేసుకుంటాయి పేగు బంధంలా !
మానవతా వాదం బ్రతుకుతోంది పల్లెల్లో
అందాలతో ప్రకృతి హాయిగా నవ్వుతోంది పల్లెల్లో
వాడిపోయే ప్రేమలు చిగురిస్తాయి పల్లెల్లో
పాడిపంటలు పదే పదే పలకరిస్తాయి పల్లెల్లో !
అయ్యలార ! అమ్మలార ! అన్నలార ! అక్కలార !
కలసిమెలసి మీరంతా కదలి రండి
మమతాను బంధాల్ని నిలుపుకొని
నేలతల్లికి భక్తితో ప్రణమిల్లుదామ్ ! – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 24.
బడికి తొలిసారిగా వెళ్ళే విద్యార్థి ఎలా ఫీలవుతాడో వచన కవితలో రాయండి.
జవాబు:
బడికి తొలిసారిగా బెరుకుగా, తడబడుతూ వెళ్ళా
అంతకు ముందు వరకు నేనేం చెప్పినా, చేసినా సంతోషించినవాళ్ళే.
కాని ‘అలా వద్దు, ఇలా వద్దు’ అని నియంత్రణ నా పై మొదలైంది నాడే.
ఒక్కసారిగా బడిలో భూలోక యముడిలా, దర్శనమిచ్చాడు గురువు
చేతిలో బెత్తం, పెద్ద గొంతు, ఆ అరుపులకే నోట మాట లేదు కళ్ళలో భయం తప్ప.
కొత్త కొత్త పరిచయాలు, ఏం మాట్లాడాలో ! ఎలా మాట్లాడాలో !
“మాటలు రావా ?” అన్న మాటలు చెవులను తాకుతున్నాయి ‘వచ్చు’ అని
చెప్పాలని వుంది. కానీ ఆ మాట ఎక్కడో నూతిలో ఉందేమో అని అనిపించింది.
తొందరగా బడి వదిలితే బావుణ్ణు అని అనిపించింది.
నాకోసం తొలిసారిగా భగవంతుణ్ణి తలచుకొన్నాను.
అమ్మ గారాబంగా చూస్తే మాటవినని నేను తొలిసారిగా
అమ్మను తొందరగా చూడాలనిపించింది. పలక మీద బలపం ఉంది కానీ మనసు అక్కడ లేదు.
మొత్తానికి ఇంటి గంట కొట్టారు.
పంజరం విడిచిన చిలుకలా, విల్లు వదిలిన బాణంలా
నేనూ ఒకటే పరుగు. ఎవరో పిలుస్తున్నారా. ‘జాగ్రత్తా, పడతావు’
అని. అమ్మో! ఆగితే, ఏమైనా ఉందా. ఏడుపు వస్తోంది.
ఇంటి ముందు అమ్మ నాకోసం నిలబడింది. ఆ రోజు అమ్మ నాకు వరమిచ్చే దేవతలా కనిపించింది.
అందుకే ఇంకా వేగంగా పరుగెత్తాను. – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 25.
‘వీరతెలంగాణ’ పాఠంలోని కొన్ని పదాలను ఉపయోగించి తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమకారుని పోరాటాన్ని కవిత రూపంలో రాయండి.
జవాబు:
ఓ తెలంగాణ వీరుడా !
బానిస బతుకులకు కాలం చెల్లిందంటూ,
బతుకు భారంగా కాలం ఈదలేక,
మనమేం చేయగలం అని కలవరపడక,
మెరుపు తీగలా,
విల్లు విడిచిన బాణంలా,
ఉరికావా, ఉరికంబమెక్కావా ?
ప్రాణాన్ని పణంగా పెట్టిన శూరుడా !
ఓ తెలంగాణ వీరుడా !
గడ్డిపోచలన్నీ మదపుటేనుగును కట్టినట్లు
రక్తం చిందించి నిజాం నవాబును పట్టావా,
తరతరాల బూజును తరిమికొట్టిన ధీరుడా !
నీ త్యాగం వృథా కాలేదు.
భావి తరాలకు స్వేచ్ఛా వాయువులిచ్చి,
అనంత వాయువుల్లో కలసిన ఆప్తుడా !
నీ త్యాగం
మరువం, మరువం, మరువం ……. – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 26.
అంటరానితనం నిరసిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
“అంటరాని వారెవరో కాదు మా వెంటరానివారే”
అన్న పెద్దల సుద్దులు పెడచెవిన పెట్టే బాబులారా !
ఖురాన్ గీతా బైబిల్ ఏది చెప్పినా
మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని మరిచారా !
నన్ను తాకకు అనేది ఓ మానసికమైన జబ్బు.
కులం పేరడిగి తక్కువ చేస్తే బాకుతో కుమ్మినట్టుంది. చెప్పడానికి తుంది.
పాషాణపు చుక్క పాలను విషం చేసినట్లు,
ఈ అస్పృశ్యత సమాజాన్ని కలుషితం చేస్తుంది.
మనిషి ప్రగతికి అడ్డుగోడ ఈ మూఢాచారం కాదా ?
బలహీన మనస్కుల మతం అంటరానితనం అన్న సంగతి మరువకు.
పైకి లేచి వచ్చిన వాడి పల్లకీ మోస్తారు,
కాలు జారిపడ్డ వాణ్ణి లేవదీయడెవ్వడూ అన్న మాటలు నిజం చెయ్యక
మానవత్వాన్ని మంటగొల్పక
సమ సమాజ స్థాపనకు సహకరించవా ?
నిద్రించే వాడిని లేపచ్చు. మేల్కొన్నవాడితో ఇబ్బందే లేదు.
నిద్ర నటించే వాడితోనే సమస్య. నీవు ఇటువంటి వాడివేనా ?
నిర్ణయించుకో ? గుండెను సముదాయించుకో ? – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 27.
తెలుగు వైభవాన్ని తెలుపుతూ ఒక కవిత రాయండి.
జవాబు:
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు
ఇది కమ్మనైన తెలుగు
యాబదారు రెక్కలున్న అద్భుతాల పులుగు
ఇది అద్వితీయ వెలుగు తెలుగు
సంస్కృతిలో భాగమైన – సంపద ఈ తెలుగు
నుదుటి బొట్టు తెలుగు – పంచకట్టు తెలుగు
వీధి మోము తొలి సిగ్గుల – ముగ్గులీ తెలుగు
పట్టు పరికిణీ బుగ్గన – మొగ్గలీ తెలుగు
పందిళ్ళకు అల్లుకున్న – పచ్చదనము తెలుగు
హరిదాసు, చిడతల – మేలుకొలుపు తెలుగు
గొబ్బెమ్మలపై నిలుపు – ముద్దబంతి తెలుగు
‘కొమ్ము’లుండి పొగరులేని – నెమ్మదైన తెలుగు
తెలుగు తెలుగు తెలుగు అమ్మలాంటి తెలుగు ఇది కమ్మనైన తెలుగు. – వలివేటి వేంకట శివరామకృష్ణమూర్తి గారు
ప్రశ్న 28.
కోపం వల్ల అనర్థాలు కవిత రూపంలో రాయండి.
జవాబు:
దరి చేరనీయరాదు కోపం.
మనసుకు హాయిని గొల్పేదే శాంతం.
ఉన్నదానితో తృప్తి చెందడం మోక్ష మార్గం.
తోటివారి పట్ల దయను చూపడం సన్మార్గం.
కట్టెను అగ్ని దహించినట్లు, కోపం కల్గిన వ్యక్తి దహించబడదా ?
ఎంతటి వారికైనా నిగ్రహమే ప్రథమ సూత్రం మరియు కర్తవ్యం. – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 29.
రైతుల కష్టాన్ని తెలుపుతూ అంత్యప్రాసగా ‘నీరు’తో కవి రాయండి.
జవాబు:
నేల తల్లి పులకరించేట్టు కురిసింది వాననీరు
తొలకరులు రైతులు పాలిట కావా పన్నీరు
మితిమీరిన వానలు మిగిల్చెను రైతులకు కన్నీరు
పండిన కొద్ది పంటకు ధరలేక విలపించె రైతు కన్నీరు మున్నీరు. – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 30.
మనిషిలోని మనస్తత్వం సరిగాలేదు. ఈ విషయంపై కవి రాయండి.
జవాబు:
కరుగుతున్న కొవ్వొత్తి వెలుగునిస్తోంది,
పెరిగే వ్యక్తి చీకటినేగా ఇస్తా !
తింటుంటే కాకర లోనూ తీపే
కానీ మనిషిలో నిండా చేదే !
విధిని ఎదిరించు వెలుగును చూస్తావు.
వెక్కిరించావో విశ్వంలో కలుస్తావు ! – కంచిభొట్ల ఫణిరామ్
ప్రశ్న 31.
నేటి తెలంగాణను వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
బంగారు తెలంగాణ
కష్టాల కడలిని దాటిన వీరహనుమ మా తెలంగాణ
ఉప్పొంగిన ఆవేశంతో ఏర్పడిన బంగరు కొండ మా తెలంగాణ
పెరుగుతున్న పసిపాప మా పసిమి తెలంగాణ
పచ్చ పచ్చని పైరు సీమల కనక సీమ మా తెలంగాణ
కల్లలెరుగని తేట తెలుగు చిరునామా మా తెలంగాణ
దానం, ధర్మం, నీతి, న్యాయం కలబోత మా తెలంగాణ
విశ్వ విఖ్యాతమైన విజ్ఞాన మేరువు మా తెలంగాణ
మా తెలంగాణ కోటి రత్నాల వీణ